అహల్య... రాయిగా మారిందా? | Ahalya Spiritual Story In Telugu | Sakshi
Sakshi News home page

అహల్య... రాయిగా మారిందా?

Published Tue, Mar 16 2021 6:47 AM | Last Updated on Tue, Mar 16 2021 3:35 PM

Ahalya Spiritual Story In Telugu - Sakshi

మనలో చాలామందికి అహల్య అనే పేరు వినగానే గౌతమ ముని శాపంతో ఆమె రాయిగా మారి, రాముడి పాదం సోకగానే తిరిగి నాతిగా మారిందనే విషయమే స్ఫురణకు వస్తుంది. అయితే, అహల్య వృత్తాంతం భిన్నమైంది. అహల్య రాయిగా మారటం పూర్తి అవాల్మీకాంశం. 

ఆమె బ్రహ్మ మానస పుత్రిక. అహల్య అంటే అత్యంత సౌందర్యవతి, ఎలాంటి వంకరలేని స్త్రీ అని అర్థం. అహల్య ఉదంతం మనకు రామాయణంలో బాలకాండలో కనిపిస్తుంది. తాటకను సంహరించిన తర్వాత రామలక్ష్మణులను తీసుకుని విశ్వామిత్రుడు మిథిలా నగరాధీశుడు జనక మహారాజును సందర్శించడానికి వెళ్లే సందర్భంలో, మిథిలకు సమీపంలో ఉన్న వనంలో ఒక పురాతన ఆశ్రమాన్ని చూస్తాడు రాముడు. ఆ ఆశ్రమం ఎందుకో రాముని ఆకట్టుకోవడంతో ఈ ఆశ్రమం ఎవరిది, ఇక్కడ ఎవరుంటారు అని విశ్వామిత్రుని ఆసక్తిగా అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు అహల్య ఉదంతాన్ని చెపుతాడు. గౌతముడు ఇంద్రుని  తీవ్రంగా శపించిన  తర్వాత అహల్యను కూడా శపిస్తాడు.

‘వేలాది సంవత్సరాలు నీవు అన్నపానాదులు లేకుండా వాయుభక్షణతో తపిస్తూ ఈ ఆశ్రమం నందే పడి ఉంటావు. భస్మశాయినివై ఎవరికీ కనపడకుండా నీలో నీవు కుమిలిపోతూ ఉంటావు. దశరథనందనుడైన శ్రీరాముడు ఇక్కడకు వచ్చినపుడు ఆయన పవిత్రమైన పాదధూళి సోకినంతనే నీవు పవిత్రురాలివవుతావు.. ఆయనకు అతిథి మర్యాదలు చేసిన తర్వాత తిరిగి నీవు నన్ను చేరుకుంటావు’’ అని శపించి హిమాలయాలకు వెళ్లి పోయాడు’’ అని చెప్పి  మూల రామాయణంలో ఈ గాథను విశ్వామిత్రుడు శ్రీరాములవారికి తెలుపుతూ, అహల్యను తరింప చేయమని కోరుతాడు.

అప్పుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో కలసి గౌతమముని ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు. గుర్తుపట్టలేని రీతిలో ఉన్న అహల్య కనిపిస్తుంది. ఇక్కడ వాల్మీకి ఆమె వాయుభక్షణాది కఠోరదీక్షితో, తపఃప్రభావం వలన ఆమె కాంతిమయంగా కనపడుతున్నట్లు వర్ణన ఉధృతిని పెంచుతాడు. చివరకు పొగ ఆవరించి ఎవరికీ కనిపించని రీతిలో ఉందంటాడు. 
శ్రీరాముని దర్శనమైనంతనే ఆమెకు శాప విముక్తి కలిగిందంటాడు. ఆ తర్వాతే అందరికీ ఆమె కనపడుతుంది అని కూడా చెప్తాడు. అప్పుడు రామలక్ష్మణులు ఆమె పాదాలకు నమస్కరిస్తారు. ఆమె తన భర్త చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ తిరిగి వీరి పాదాలకు నమస్కరిస్తుంది. అతిథి మర్యాదలు అయిన తర్వాత రామాగమాన్ని గ్రహించి గౌతముడు అక్కడికి చేరుకుని అహల్యాసమేతుడై శ్రీ రాముని సేవిస్తాడు.

ఈ గాథలో అహల్య రాయిగా మారినట్లు కనపడదు. విశ్లేషించి ఆలోచిస్తే గౌతముడు అహల్య తొందరపాటు తనాన్ని నిరసించి, ఆమెను శాసించి త్యజిస్తాడు.
అహల్య పశ్చాత్తాపంతో సమాజంలో కలవక అదే ఆశ్రమంలో ఒంటరై నివసించడం వల్ల, నిరాశానిస్పృహలతో ఉండటంవల్ల ఆమె వస్త్రాలు జీర్ణమైపోయి, దుమ్ము చేరి గుర్తించేందుకు వీలు కాకుండా ఉంటుంది. వాల్మీకి వర్ణనావిశేషణాలతో రసోధృతిని పెంచగా, అనువాదకులు అనంతరకాలంలో రాముని మహిమను మరింతగా చాటి చెప్పే ప్రయత్నం చేశారు. వాల్మీకి తదనంతర కవులు నాటకీయతను, స్థానికతను జోడించి, అహల్య రాయిగా మారిందని శ్రీరాముని పాదపద్మం సోకగానే ఆమె శాపవిమోచనం పొందిందని మార్పులు చేర్పులు చేసి రచించారు. అదే తర్వాత దృశ్యకావ్యాల్లో కూడా కనపడడం వల్ల ప్రజల మనసుల్లో స్థిరమై పోయింది. 

వాల్మీకి రామాయణంలో అహల్య వృత్తాంతం గురించి ప్రస్తావన ఉంది. భర్త గౌతమ మహర్షి శాపంతో రాయిగా మారిన అహల్య, శ్రీరాముడి పాదస్పర్శతో తిరిగి స్త్రీ రూపం ధరించిందనే కథనాలు ఉన్నాయి. అద్భుత సౌందర్యవతి అయిన అహల్యను  ఎందరో తమ సతిగా చేసుకోవాలనుకుంటారు. అయితే, త్రిలోకాలను ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో వారే అహల్యను వివాహం చేసుకోడానికి అర్హులని బ్రహ్మ ప్రకటించాడు. దీంతో, తన శక్తులన్నీ ఉపయోగించి ముల్లోకాలను తిరిగి వచ్చిన ఇంద్రుడు, అహల్యను ఇచ్చి వివాహం జరిపించమని కోరుతాడు. అదే సమయంలో నారదుడు వచ్చి ఇంద్రుడికంటే ముందుగా గౌతముడు ముల్లోకాలను చుట్టి వచ్చాడని చెబుతాడు.

అదెలాగని ఆశ్చర్యపోతున్న ఇంద్రుడితో– గౌతముడు తన దైనందిన పూజలో భాగంగా గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తాడని, అలా ఒక రోజు ప్రదక్షిణలు చేస్తుండగా లేగ దూడకు ఆవు జన్మనిచ్చిందనీ, శాస్త్రాల ప్రకారం ఆ సమయంలో గో ప్రదక్షిణ చేయడం ముల్లోకాలను చుట్టడంతో సమానమనీ అందుకే అతనికి ఆ ఫలితం దక్కిందనీ తెలిపాడు. కాబట్టి అహల్యను గౌతముడికే ఇచ్చి వివాహం జరిపించమని అన్నాడు. దీంతో అహల్యను గౌతమ మహర్షికి ఇచ్చి బ్రహ్మ వివాహం చేశాడు. అహల్యను భార్యగా పొందలేకపోయిన ఇంద్రుడు, గౌతముడి రూపంలో వచ్చి తన వాంఛను తీర్చుకున్నాడని అంటారు. కానీ ఇది కూడా నిజం కాదని కొందరంటారు.

అపార తపశ్శక్తి, మేధాశక్తితో ఇంద్రపదవికి కావల్సిన సర్వవిజ్ఞానం గౌతముడు పొందాక, ఆయన్ని పరీక్షించడానికి ఇంద్రుడు ఓ పథకం వేశాడు. అతడు కామక్రోధ మదమాత్సర్యాలను జయించాడా? లేదా? అని తెలుసుకోడానికి గౌతమ మహర్షి రూపంలో అహల్య చెంతకు వస్తాడు. అలా వచ్చింది ఇంద్రుడేనని తన పాతివ్రత్య బలంతో అహల్య గ్రహించింది. అయితే ఇంద్రుడంతటి వాడు తనను కావాలనుకోవడాన్ని గుర్తించి అహల్య క్షణకాలం పాటు విచలితురాలయింది. 

ఆమె మనసును చంచలం చెయ్యగలిగినందుకు దేవేంద్రుడు తనలో తాను నవ్వుకున్నాడు. అప్పుడు సత్యం బోధపడిన ముని పత్ని ఇంద్రుణ్ణి వెంటనే అక్కడినుంచి వెళ్లిపోమని వేడుకుంటుంది. కానీ, ఈ లోగా అక్కడకు వచ్చిన గౌతముడు పొరబడి, ఆవేశంతో ఇద్దరినీ శపించాడు. అలా ఆయనకు ఇంద్రపదవిని దేవేంద్రుడు దూరం చేశాడు. అలాగే, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఎవరికీ కనబడకుండా కేవలం గాలి మాత్రమే ఆహారంగా తీసుకుంటూ వెయ్యేళ్లు జీవించాలని గౌతముడు ఆమెను శపించాడు. కానీ రాయివి కమ్మని అనలేదు. జనబాహుళ్యంలో బలంగా చొచ్చుకుపోయి ఉన్నకథలలో చాలా వరకు ప్రక్షిప్తాలే. 

అహల్యాగౌతముల కుమారుడైన శతానందుడు జనకుడి ఆస్థాన పురోహితుడు. వీరి కుమార్తె అంజన, హనుమంతుడి తల్లి. అంటే అహల్య గౌతముడి అమ్మమ్మ అన్నమాట. అహల్య పంచకన్యల్లో స్థానం సంపాదించుకోగలిగిందంటేనే ఆమె పవిత్రతను మనం అర్థం చేసుకోవచ్చు. 

– డి.వి.ఆర్‌. భాస్కర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement