మనస్సు వడ్లగింజ లాంటిది అన్నాడు బుద్ధుడు. బియ్యపుగింజల నాణ్యతల్ని చూడ్డానికి వడ్లగింజల్ని అరచేతులతో నలుపుతారు. అప్పుడు కొన్ని గింజలు చేతికి గుచ్చుకుంటాయి. కొన్ని గుచ్చుకోవు. కారణం వడ్లగింజకు ఒక చివర చిన్నసూదిలాంటి ముక్కు ఉంటుంది. అది గురిలో ఉంటే చర్మాన్ని ఛేదిస్తుంది. లేకుంటే తానే నలిగిపోతుంది. అలాగే గురిలో ఉన్న మనస్సు అవిద్యను, అజ్ఞానాన్ని ఛేదిస్తుంది. విజ్ఞానాన్ని అందిస్తుంది. మరి గురిలో లేని గింజ అవిద్యలో పడి నలిగిపోతుంది. అలాగే మనస్సు నీటి మడుగు లాంటిది అని కూడా అన్నాడు బుద్ధుడు.
మడుగులో నీరు బురద బురదగా ఉంటే ఆ మడుగులో ఏమి ఉన్నాయో తెలియదు. ఎలాంటి మొక్కలున్నాయి, అడుగున ఏమైనా ముళ్ళూ రాళ్ళూ ఉన్నాయా, ఎలాంటి జలచరాలు ఉన్నాయి. ప్రాణాలు తీసే పాములు పట్టి మింగే మొసళ్ళు... ఏమి ఉన్నాయి, అసలు దాని లోతు ఎంత.. ఇవేవీ మనం తెలుసుకోలేం. అలాగే మన మనస్సు అకుశల (చెడ్డ) భావాలతో, ద్వేషం, మోసం, రాగం, మోహం, కామం, పగ, ప్రతీకారం, ఈర్ష్య, అసూయల్లాంటి దుర్గుణాలతో నిండి ఉంటే, ఆ మనసు కూడా మురికిగా ఉన్న మడుగులాంటిదే. దానివల్ల నష్టాలు, కష్టాలు, దుఃఖాలు, ఆవేదనలు, భయాలూ, అశాంతి అలముకుంటాయి. అవి ఆ మురికిలో పడి కనిపించకుండా కష్టాలు తెచ్చిపెడతాయి. మనల్ని అథోగతి పాలు చేస్తాయి.
మరి, ఆ మడుగులోని నీరు తేటగా స్వచ్ఛంగా ఉంటే, అందులో ఏమేమి ఉన్నాయో అన్నీ కనిపిస్తాయి. మడుగు అడుగున ఉన్న ముళ్ళూ, రాళ్ళూ, మొక్కలూ తెలుస్తాయి. పాములూ, మొసళ్ళూ కనిపిస్తాయి. ఆ మడుగులోతు ఎంతో తెలుస్తుంది. కాబట్టి అలాంటి మడుగువల్ల ఎలాంటి ఆపదలు రావు. అలాగే మనస్సు కూడా నిర్మలంగా ఉంటే కామ, రాగ, మోహ, ఈర్ష్య పగలకు దూరంగా ఉంటాం. అప్పుడు మనస్సులో శాంతి ఉదయిస్తుంది. కుశల కర్మలు విప్పారుకుంటాయి. దుఃఖం లోతులు తెలుస్తాయి.
అలాగే... మనస్సు చెట్టు కలపలాంటిది అని కూడా బుద్ధుడు చెప్పాడు. మంచి మనస్సు చందనవృక్షపు కలపలాంటిది. దానికి పరిమళం ఉంటుంది. ఆ కలప మెత్తగా ఉంటుంది. కావలసిన రూపంలోకి తేలిగ్గా మలచుకోవచ్చు. పెద్ద వస్తువులుగా చిన్న చిన్న వస్తువులుగానూ, తయారు చేసుకోవచ్చు. చక్కని శిల్పాలుగానూ, మలచుకోవచ్చు. ఇలాంటి మనస్సుగల మనిషి తనను తాను చక్కగా తేలిగ్గా సంస్కరించుకోగలడు. ఇలా మనస్సుని వడ్లగింజతో... మడుగుతో చెట్టు కలపతో పోల్చి గొప్ప సందేశంగా అందించాడు బుద్ధుడు. అందుకే ఆయన మహా మనో వైజ్ఞానికుడు.
– బొర్రా గోవర్ధన్
Comments
Please login to add a commentAdd a comment