Buddha
-
బుద్ధుడిలా ట్రంప్ విగ్రహాలు
డొనాల్డ్ ట్రంప్. ఎప్పుడూ కాసింత చిరాకు ప్రతిబింబించే ముఖం. అలాంటి ముఖానికి హాంగ్ జిన్ షి అనే చైనా గ్రామీణ కళాకారుడు బుద్ధుడి ప్రశాంతతను ఆపాదించాడు. శాంతచిత్తంతో ఉన్న ట్రంప్ విగ్రహాలను తయారు చేశాడు. బుద్ధుని మాదిరిగా కళ్లు మూసుకుని దైవ చింతనలో కూర్చుని ఉన్న విగ్రహాలను పింగాణీతో రూపొందించాడు. సైజును బట్టి వీటిని 140 నుంచి 2,700 డాలర్ల దాకా విక్రయిస్తున్నాడు. 2021లో ఇ–కామర్స్ ప్లాట్‌ఫాం టావోబావోలో వైరలైన ఈ ట్రంప్ విగ్రహాలు ఆయన రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో మరోసారి ఆకర్షిస్తున్నాయి. సరదాగా మొదలెట్టి... 47 ఏళ్ల హాంగ్ ఇప్పటిదాకా కొన్ని వందల సిరామిక్ వస్తువులను తయారు చేశాడు. ‘‘రాజకీయ నాయకులు సాధారణంగా బోరింగ్‌గా ఉంటారు. కానీ ట్రంప్ అందుకు భిన్నమైన నేత. అందుకే తొలుత సరదాగా ఆయన విగ్రహాలను రూపొందించా. ట్రంప్ వ్యక్తిత్వం, విగ్రహం ఆకారం పరస్పరం విరుద్ధంగా ఉంటాయి. దాంతో వాటిని కొనేందుకు బాగా ఇష్టపడుతున్నారు’’అని చెప్పుకొచ్చాడు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’నినాదంతో ట్రంప్ గెలిస్తే, హాంగ్ మాత్రం ప్రతి విగ్రహం ప్యాక్‌పైనా ‘మీ కంపెనీని మళ్లీ గొప్పగా చేయండి’అని రాస్తున్నాడు. దీన్ని అనుసరిస్తూ అమెరికాలో పలు ఆన్లైన్ షాపింగ్ ఫ్లాట్‌ఫాంలలో కొన్ని వెర్షన్లు వచ్చాయి. ట్రంప్ పాలనలో ప్రధాన పాత్ర పోషించనున్న కుబేరుడు ఎలాన్ మస్క్ విగ్రహాన్ని కూడా హాంగ్ డిజైన్ చేస్తున్నాడు. అందులో మస్‌్కను ఐరన్ మ్యాన్‌గా చూపిస్తున్నాడు. ట్రంప్‌కు చైనాలో ఇప్పటికీ చాలామంది అభిమానులున్నారని చెప్పాడు చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హాలీడే టూర్ : బుద్ధుని చెంత ప్రశాంతంగా బిగ్‌బాస్ ఫేమ్ వితికా షేరు (ఫోటోలు)
-
దానంలో ఘటికుడు
పూర్వం కశ్యపు బుద్ధుని కాలంలో వేగళింగ అనే నగరం ఉండేది. అ నగర శివారులో ఘటికారుడు అనే కుమ్మరి ఉండేవాడు. అతనికి జ్యోతిపాలుడు అనే మిత్రుడు ఉండేవాడు. అప్పుడు ఆ ్రపాంతాన్ని కికీలుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఘటికారుడు కశ్యప బుద్ధుని ఉపాసకుడు. కశ్యపుని ధర్మ ప్రబోధాలు విని ధార్మికంగా జీవిస్తూ ఉండేవాడు. కుండలు చేయడానికి కావలసిన మట్టిని పలుగు పారలతో తవ్వి తీసేవాడు కాదు. క్రిమికీటకాలు తన పలుగు కింద పడి చనిపోతాయని. ఎలుకలు తవ్విపోసిన మట్టిని మాత్రమే తీసుకుని పోయి కుండలు చేసేవాడు. ఆ కుండల్ని కూడా ఎక్కువ ధరకు అమ్మేవాడు కాదు. వాటిని ఆరుబయట ఉంచేవాడు. కావలసిన వాళ్లు కుండల్ని తీసుకుని అక్కడ ఉంచిన గంపల్లో తాము చెల్లించాల్సిన ధరకు సరిపడే ధనాన్ని గానీ, నూకల్ని గానీ, ధాన్యాన్ని గానీ ఉంచి వెళ్ళేవారు. అలా... నిజాయితీగా, ధర్మబద్ధంగా తాను జీవిస్తూ అందరూ జీవించాలని కోరుకునేవాడు. అతని తల్లిదండ్రులు ఇద్దరూ అంధులు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వారి ఆలనా ΄ాలనా చూసేవాడు. వారు కూడా ధార్మికులే. ఇతరులు లేని సమయంలో ఎవరైనా భిక్షువులు గానీ, యోగులుగానీ భిక్షకు వస్తే...‘‘అయ్యా! మేము ఇద్దరం గుడ్డివాళ్ళం. లేవలేని ముసలివాళ్ళం. అదిగో ఇంట్లో ఉట్టిమీద ఆహారం ఉంది. మీకు కావలసినంత మీరే తీసుకోండి. మేము ఇచ్చే భిక్షగా భావించండి’’ అనేవారు. ఒకరోజున కికీలుడు తన రాజభవనం ముందు నిలబడ్డాడు. అటుగా కశ్యపబుద్ధుడు తన శిష్యగణంతో వెళ్తున్నాడు. కికీలక మహారాజు వారి ముందుకు వచ్చి నమస్కరించి– ‘‘భగవానులు మమ్ము అనుగ్రహించాలి. భిక్షుసంఘంతో వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి’’ అని వేడుకున్నాడు. ‘‘లేదు మహారాజా! నేను వేరొకరికి మాట ఇచ్చాను’’ అన్నాడు. ‘‘ఎవరికి భగవాన్? నేను ఈ దేశానికి రాజుని. ప్రభువుగా వెళ్ళి వారిని అర్థిస్తాను. ఈరోజు ఆ అవకాశం నాకు ఇవ్వమంటాను. మరోమారు వారిని తీసుకోమంటాను’’ అన్నాడు. ‘‘లేదు మహారాజా! ఈ రోజు నేను వారి ఇంటనే భిక్ష స్వీకరించాలి’’ అని ముందుకు నడిచాడు. భిక్షుగణం ఊరి చివరకు వెళ్ళింది. అప్పటికే పట్టిన మబ్బుల్నుండి సన్నని చినుకులు రాలుతున్నాయి. భిక్షు సంఘం వెళ్ళేసరికి... ఘటికారుని పూరి΄ాక మీద పరచిన ఎండు గడ్డిని తీసివేసి కట్టలు కట్టారు. ఆ కట్టల్ని ఎవరో మోసుకుపోతున్నారు. గడ్డి తీయడంతో పాక మీద ఖాళీలు కనిపిస్తున్నాయి. కశ్యప బుద్ధుణ్ణి వారు గౌరవంగా ఇంటి వసారాలోకి ఆహ్వానించారు. ఆ చూరు కిందే కూర్చుని పచ్చడి మెతుకుల భిక్ష స్వీకరించారు. వర్షం పెరిగింది. తడుస్తూనే ధర్మోపదేశం చేశాడు కశ్యపుడు. ఘటికారుడు కశ్యపునికి పాదాభివందనం చేశాడు. భిక్షాగణం తిరిగి బయలుదేరింది. దారిలో చెట్టుకింద కికీలమహారాజు కనిపించాడు. ‘‘చూశావా! మహారాజా! ఘటికారుడు ఎంతటి దానపరుడో! ఎవరో గడ్డి అడిగారు. తన దగ్గర లేదు. అయినా తన ఇంటి మీద పరచిన గడ్డిని తీసి దానం చేశాడు. అతను మహాదాత. అతని భిక్ష స్వీకరించడం మాకు ఎంతో సంతోషం’’ అంటూ ముందుకు కదిలాడు. తాను సమర్పించే గొప్ప భోజనాన్ని కాదని, పూరిగుడిసెలో పచ్చడి మెతుకుల కోసం కశ్యపు బుద్ధుడు ఎందుకు వెళ్ళాడో రాజుకి అర్థమైంది. తనకంటే ఘటికారుడే గొప్పవాడని గ్రహించాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
నవ్వుతున్న బుద్ధుడు..
‘రమణీ, ఈరోజైనా వెళ్లిన పనయిందా ?’ రాంబాబు ఇంటిలోకి వస్తూనే భార్యను అడిగాడు. లక్షలు పెట్టి కొన్న షేర్లు వేలకు పడిపోయినప్పుడు ఇన్వెస్టర్ కళ్ళల్లో కనపడే దిగులు రమణి ముఖంలో తారాటలాడింది. ‘ఆ..ఆ.. అర్థమయిందిలే! ఇవ్వాళ కూడా నీ అన్వేషణ ఫలించలేదన్నమాట.’ ‘అవునండీ.. ఒక చోట ఉన్నవి మరోచోట లేవు, పిచ్చెక్కిపోతోంది. ఇలా చూస్తుండగానే వాడికి మూడో ఏడు తగులుతుంది.’‘నా మాట వినవే.. ముందు మన ఇంటి దగ్గరలో చేరుద్దాం, కాస్త పెద్దయిన తరువాత నువ్వు చెప్పినట్టు చేద్దాం’ అంటూనే సడన్‌గా ఆపేశాడు. చెవులు రిక్కించాడు.. ఖర్, ఖర్.. ఖర్మని గులక రాళ్లు నోట్లో వేసుకొని నములుతున్న చప్పుడు.. అది రాంబాబు చెవులకు బాగా పరిచితమైన చప్పుడే.. భార్యా(ర)మణి పళ్లు కొరుకుతోంది. ‘నీకో దండం పెడతా! అలా నమలకే! పళ్ళు అరిగిపోతాయి. నీకు నచ్చినట్లే చేద్దాంలే. రేపయినా నీ వేట పూర్తి చెయ్యి.’రాంబాబు ఎమ్సీఏ చదివి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రోగ్రామర్‌గా పనిచేస్తున్నాడు. ఉదయమే 7 గంటలకు క్యాబ్ వస్తుంది. దాంట్లో వెళ్ళి రాత్రి పదిగంటలకు వస్తాడు. మంచి జీతం. మేనమామ కూతురు, రమణిని పెళ్లి చేసుకున్నాడు. రమణి ఇంటర్ చదివింది. ఎమ్సెట్ రాస్తే ఆరంకెల ర్యాంకు వచ్చింది. లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకొని మళ్లీ రాసింది. ఈసారీ ఆరంకెలే. అందులోనూ ఇంకాస్త గరిష్ఠ సంఖ్య. ‘ముచ్చటగా మూడోసారి రాయనా’ అనబోయి, వాళ్ళ అమ్మ చేతిలో అట్లకాడ చూసి నోరు మూసింది. మూసే ముందు, ప్రపంచంలో ఇంజినీరింగ్ తప్ప నేను చదవగలిగే కోర్సేదీ లేదని తేల్చి మరీ.. మూసింది. ఇక ఎన్ని చెప్పినా లాభం లేదని పెళ్లి చేశారు.ఆ పెళ్లి జరగడానికి రమణి వాళ్ళ అమ్మమ్మ తనదైన శైలిలో చెప్పిన సెంటిమెంటు డైలాగులు కూడా ఇతోధికంగా సాయపడ్డంతో చేసేదేం లేక పళ్ళు నూరుకుంటూ.. రమణి పెళ్లి పీటలు ఎక్కాల్సి వచ్చింది. అయినా రాంబాబంటే రమణికీ ఇష్టమే. రాంబాబుకు మరదలన్నా, ఆమె అమాయకత్వమన్నా చాలా ఇష్టం. ఆమెకు ఇంటిపని, వంటపనిలో మంచి నైపుణ్యం ఉంది. రాంబాబుకు ఉద్యోగం చేసే అమ్మాయి కాకుండా ఇల్లు దిద్దుకొనే అమ్మాయినే చేసుకోవాలని వ్యక్తిగత అభిప్రాయం. ఇద్దరూ ఉదయం నుండి రాత్రి దాకా జాబులు చేస్తే వచ్చే డబ్బులు చూసి మురవడం తప్ప, సంసారంలో సారం ఉండదంటాడు. స్వతహాగా రమణి మంచిదే. మంచి కాలేజీలో ఇంజినీరింగ్ చేయాలనేది మనసులో తీరని కోరికలాగా ఉండిపోయింది. అంతే! ఎలాగైనా టాప్ కాలేజీలో ఇంజినీరింగ్ చేయాలనే తన లక్ష్యం నెరవేరకుండా పెళ్లి పేరుతో అడ్డుకున్నందుకు అమ్మమ్మను కసితీరా శపించింది. ఆ శాపం తగిలి రమణి పెళ్లయి ఏడాది తిరక్కుండానే, మనవడికి తన పేరు పెట్టాలని ఒట్టు పెట్టించుకొని మరీ బాల్చీ తన్నేసింది.రమణి.. రాంబాబును కూడా శపించేదే, కానీ ‘మనకు పుట్టబోయే బిడ్డను అక్కడా ఇక్కడా ఏం ఖర్మ.. ఐఐటీలోనే చదివించి నీ కోరిక తీర్చుకుందువుగాని’ అన్న సలహా పుణ్యమాని వదిలేసింది. ఆ సలహా వల్ల భవిష్యత్‌లో వచ్చే ఉత్పాతాన్ని మాత్రం పసిగట్టలేకపోయాడు రాంబాబు.కాస్త ఆలస్యంగానైనా, రమణి వాళ్ల అమ్మమ్మ కోరుకున్నట్లు మగపిల్లాడే పుట్టాడు. పాపం వాడికేం ఎరుక.. తనకోసం అప్పటికే ఒక టార్గెట్ ఫిక్స్ అయిందని! అప్పటికీ అనుమానంతో పుట్టగానే ఏడ్చాడు గానీ, అందరూ ఎత్తుకొని ఉంగా.. ఉంగా అని సముదాయించే సరికి ‘వీళ్ల మొహం, అన్ని కుట్రలు చేసే తెలివితేటలు వీళ్లకెక్కడివని’ అప్పటికూరుకున్నాడు. కానీ తల్లి సంగతి పసిగట్టలేకపోయాడు.అందరూ వాడ్ని ‘చిటుకూ’ అని పిలవసాగారు. వాడు కూడా తన పేరు అదే అనుకున్నాడు. ‘అమ్మమ్మా, అమ్మమ్మా’ అని తప్ప.. ఆమె పేరు ఎవరికీ గుర్తులేకపోవడం ఓ కారణమై ఉంటుంది. తన పేరు మునిమనవడికి పెట్టలేదనే సంగతి పైనున్న అమ్మమ్మకు ఇంకా తెలియదు.చిటుకూ మొదటి సంవత్సరం పూర్తి కాక ముందే వాడికి తగిన స్కూలుకోసం వేట మొదలుపెట్టింది రమణి. ఒకానొక శుభ ముహూర్తాన చిటుకూని పక్కింటివాళ్లకిచ్చి, వెంటనే వస్తానని చెప్పి వాళ్ల కాలనీ దగ్గరలో ఉన్న ఓ మోస్తరు స్కూలుకు వెళ్లింది పొద్దున్నే. స్కూలు గేటు దగ్గర వచ్చి పోయే పిల్లలను పరిశీలిస్తూ నిలబడింది. కాసేపటికి నిట్టూరుస్తూ ఇంటికి వచ్చింది. రాంబాబుకు రిపోర్ట్ కూడా యిచ్చింది. ‘ఎక్కువ మంది పిల్లలకు సోడాబుడ్డి కళ్లద్దాలు లేవు. కాబట్టి చిటుకూ ఆ స్కూలులో చేరబోయేది లేదు’ అని! రాంబాబు బిత్తరపోయాడు. ‘అదేమిటే సోడాబుడ్డి కళ్లద్దాలకు చదువుకు ఏం సంబంధం?’ రాంబాబు గొణుగుడు విని ‘పాపం అమాయకుడు’ అనుకొని నవ్విన రమణి నవ్వుకి ఈసారి బిత్తర మీద బిత్తరపోయాడు.మరో ముహూర్తంలో మరో స్కూలుకు ఉదయాన్నే వెళ్లింది. తృప్తి్తపడి సాయంత్రమూ వెళ్లింది. రాంబాబుకు సాయంకాలానికి మరో రిపోర్ట్ సమర్పించింది..‘స్కూలు నుండి సాయంకాలం ఇంటికి వెళ్లే పిల్లలు పెద్దగా బరువు లేని బ్యాగులతో ధిలాసాగా ఉన్నారనీ, పిల్లలకు కనీస గూని అయినా కనపడని కారణంగా ఈ స్కూలు కూడా చిటుకూకి పనికిరాదు’ అంటూ! రాంబాబు నవనాడులూ ముక్కలు ముక్కలై, వక్కలై సహస్రాలైన భ్రమ కలిగింది. ‘అసలు నీకు కావలసిన స్కూలులో నువ్వు కావాలనుకుంటున్న లక్షణాలేవో చెప్పమ’ని పాత సినిమాల్లో సూర్యకాంతాన్ని రమణారెడ్డి అడిగినట్టు, నాలుగో మెట్టు మీద నిలబడి మొదటి మెట్టు అందుకున్న పోజులో అడిగాడు రాంబాబు. వరమిస్తున్న దేవతమాదిరిగా ఒక్కో వేలు ముడుస్తూ.. ‘మందపాటి అద్దాలున్న కళ్ల జోళ్లు, నిలబడితే వాలిపోయే నడుములు, పిల్లాడి బరువుకి కనీసం అయిదు రెట్ల బరువుతో బ్యాగు, మొహం చేతులు తప్ప ఏవీ కనిపించని స్కూలు డ్రెస్సు, బోండాకు కాళ్లుచేతులూ అమర్చినట్లు శరీరాలు, సూర్యుడిని చూడటానికి వీలుపడని టైమింగ్స్, అగరువత్తుల పొగ కమ్ముకున్న మాదిరి ముఖాలున్న టీచర్లు..’ అలా చెబుతూ రెండు చేతుల వేళ్లన్నీ ముడిచింది. కూల్‌గా నోట్లో వేలు వేసుకొని నిద్ర పోతున్న చిటుకూని చూసి రాంబాబుకు ఎనలేని జాలి కలిగింది. ఇలా స్కూళ్ల వేటా, చిటుకూ గాడి వయసూ క్రమంగా ఒక దశకు చేరుకున్నాయి. పనిలో పని, పక్కింటి వాళ్లు కూడా ‘అమ్మయ్య’ అనుకొని రిలాక్స్ అయ్యారు.. చిటుకూని కాపలా కాసే శ్రమ తగ్గినందుకు.తనది పల్లెటూరు చదువు గాబట్టి ఇంజినీరింగ్ సీటు రాలేదని రమణి గాఢమైన అభిప్రాయం. ‘తను అలాంటి పొరపాటు చేయదు గాక చేయదు’ అని మనసులోనే శపథం చేసి, ఆ సిటీలో ఉన్న అన్ని స్కూళ్లు జల్లెడ వేసి, వేసి చివరికి ఒక స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నారు.ఒకరోజు, దగ్గరలో ఉన్న గుడిలో సరస్వతీపూజ చేసి చిటుకూని అటు నుండి అటే స్కూల్‌కి తీసుకుపోయారు. ఆరోజే మూడో ఏడు తగిలిన ఆ బాలరాజు ఇదంతా సరదాగా చూస్తున్నాడు. చివరాఖరికి స్కూల్ దగ్గరికి వచ్చేసరికి వీళ్లేదో చేస్తున్నారనే అనుమానం వచ్చి, ఆరున్నొక్క రాగం మొదలుపెట్టేశాడు. వాడిని సముదాయించే సరికి తాతలు దిగొచ్చారు. అటో ఇటో నర్సరీ క్లాసులో కూర్చోబెట్టారు. రమణి కూడా తోడుగా కూర్చోవాల్సి వచ్చింది. రాంబాబు ఆఫీసు గదిలో కూర్చున్నాడు. కిటికీలో నుండి చిటుకూ క్లాస్ రూమ్ కనబడుతోంది. లంచ్ బెల్ తర్వాత, ఇవ్వాల్టికి చిటుకూని తీసుకెళ్లి, మళ్లీ రేపు తీసుకువస్తామని ప్రిన్సిపల్‌ని అడిగాడు. ‘అయ్యో! అలా ఎలా కుదురుతుంది? ఇవ్వాళ్టి సిలబస్ మిస్ అయిపోతే ఎలా?’ ఆమె గాభరా పడిపోయింది. ‘సిలబసా? నర్సరీకా?’ అయోమయంగా చిటుకూ క్లాసు వైపు చూశాడు రాంబాబు.టీచర్ బోర్డు మీద థామ్సన్ అటామిక్ మోడల్ పటం గీస్తోంది. అదే తరగతిలో చిటుకూకి తోడుగా కూర్చున్న రమణి బోర్డు వైపు తన్మయంగా చూస్తోంది. కళ్ళు నులుముకొని బోర్డు వైపు మళ్లీ చూశాడు రాంబాబు. ‘థామ్సన్ అటామిక్.. కాదులే.. పుచ్చకాయ బొమ్మ గీస్తోందేమోలే! నేను మరీ అతిగా ఆలోచిస్తున్నా’ అనుకున్నాడు.ఇక్కడే ఉంటే తనకేదో అయిపోద్దనిపించి ప్రిన్సిపల్ కాళ్లూ గడ్డం పట్టుకొని ఆరోజుకి చిటుకూతోనే బయటపడ్డారు. ‘ఈరోజంటే మొదటి రోజు కాబట్టి ఫరవాలేదు, రేపట్నుంచి స్కూల్ డ్రెస్‌లోనే రావాలి. లేకపోతే ఫైన్ కట్టాల్సి ఉంటుంది’ ఆఫీసు తలుపు దాటుతూంటే వినపడింది. ఎదురుగా వస్తున్న కుర్రాణ్ణి చూస్తే ప్రెషర్ కుక్కర్ విజిల్ లాగా వాడి తలకాయ, కాయమేమో కుక్కర్లో ఉడుకుతున్నట్టు అనిపిస్తే.. రమణి మాత్రం వాడి వైపు అబ్బురంగా చూస్తోంది.వెనక్కి తిరిగి చూస్తే .. ప్రిన్సిపల్ కఠినమైన చూపుతో.. మొహంపై మట్టి గోడ మీద వేసిన డిస్టెంపర్ లాంటి నవ్వుతో లకలక అంటున్న చంద్రముఖిలా కనపడ్డాడు రాంబాబుకు. ఇంటికి రాగానే రమణి కాళ్లమీద పడ్డంత పనిచేశాడు రాంబాబు. ఆ స్కూలు వద్దంటే వద్దని. అంతకంటే కఠినంగా, తన ట్రేడ్ మార్కు చప్పుడు చేస్తూ చెప్పింది రమణి ‘తన నిర్ణయం మారదని. ఇప్పుడు రమణి మొహం కంటే, అక్కడ ప్రిన్సిపల్ మొహమే ప్రశాంతంగా ఉందనిపించింది.చూస్తుండగానే రోజులు, నెలలు గడుస్తున్నాయి. తన లైఫ్‌లో జరిగిన పొరపాట్లు చిటుకూ లైఫ్‌లో జరగవద్దని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది రమణి. వాడు బాత్రూమ్లోకి వెళ్లినప్పుడు కూడా, వాడికి వినపడేలా ఆడియో లెస్స¯Œ ్స మొదలుకొని– వాడు టీవీ చూడాలనుకున్నపుడు వీడియో లెస్స¯Œ ్స వరకు ఎక్కడా చిన్న పొరపాటు జరగనివ్వలేదు.మాటిమాటికీ గోళ్లు చూసుకుంటూ కోరుక్కుంటున్నాడని, ఆ గోళ్లపై కూడా పర్మనెంట్ మార్కర్‌తో వివిధ ఫార్ములాలు రాసేది. కారప్పూసలో త్రికోణమితిని, చపాతీలపై కెమిస్ట్రీని, వాడే వస్తువులపై ఫిజిక్స్నీ.. అలా చిటుకూ తినే పదార్థం.. వాడే వస్తువూ.. దేన్నీ వదలిపెట్టలేదు రమణి. ఈ విషయంలో అదీ, ఇదీ అనే సందేహం వలదు దేన్నైనా ఉపయోగించుకోవచ్చనే సూత్రాన్ని.. రమణి క్రియేటివిటీతోనే నమ్మగలం. లంచ్ బాక్స్‌లో మొదటి గిన్నెలో కూడా వివిధ నిర్వచనాలు, సింబల్స్ లాంటివి రాసిన స్లిప్స్ ఉంచేది. ఈ చదువేదో రమణి తన కాలేజ్‌లో చదివుంటే రమణికి పక్కాగా ర్యాంక్ వచ్చేదని రాంబాబు లోపల లోపల అనుకున్నాడు. ఇంట్లో సిట్టింగ్ రూమ్ అంతా చిటుకూ పుస్తకాలతో నిండిపోయింది. కంప్యూటర్, ట్యాబ్లూ వచ్చి చేరాయి. గోడల మీద డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేష¯Œ ్స ఫార్ములాలు, పీరియాడిక్ టేబుల్స్ తిష్ట వేశాయి. క్రమంగా ఆ గదిలో ఉన్న సామగ్రి హాలులోకి ఆ తరువాత బెడ్ రూములోకి ఒక్కొక్క అడుగే వేస్తున్నాయి.కళ్లు మూసి తెరిచేసరికి మరో నాలుగేళ్లూ కరిగిపోయాయి. ప్రతి సంవత్సరం ఐఐటీ ర్యాంకర్ల ఫొటోలు కూడా భద్రంగా గోడ మీద ఎక్కిస్తోంది రమణి. చిటుకూ ముక్కు మీదికి కళ్ల జోడెక్కింది. ఆరోజు రమణి ఎంత సంబరపడిందో! గోడ మీద ఉన్న ర్యాంకర్ల ఫొటోల్లో కూడా అన్నీ కళ్ల జోళ్లే మరి! శారీరక వ్యాయామం లేక గుండ్రంగా అయ్యాడు.వివిధ రకాల పేపర్, డిజిటల్ మెటీరీయల్ రాంబాబుకు ఇంట్లో కాలు మెదపడానికి కూడా వీలుపడకుండా చుట్టుముడుతున్నాయి. రాంబాబూ, చిటుకూ మాట్లాడుకొని ఎంతకాలమయ్యిందో! కానీ బయట మాత్రం రాంబాబు ఐఐటీ ముంబై, ఐఐటీ చెన్నై, ఓపీ టాండన్ కెమిస్ట్రీ, హెచ్‌సీ వర్మ ఫిజిక్స్ అంటూ ప్రైమరీ స్కూలు పిల్లలు భయపడే మాటలు మాట్లాడుతున్నాడు.చిటుకూ కూడా కొత్త కొత్త అలవాట్లు నేర్చుకున్నాడు. మాటిమాటికీ కళ్ల జోడు పైకి నెట్టుకోవడం, కుడిచేతి చూపుడు వేలుతో ముక్కు నులుపుకోవడం, నిద్ర మధ్యలో ఇంగ్లిష్‌లో ఏ, బి, సి, డి, ఈ సెక్షన్లు అంటూ జెడ్ వరకూ కలవరించడం వగైరా. రమణి ఈ అలవాట్ల గురించి తన పేరెంట్స్‌తో ‘మీ మనవడు ఇప్పుడే టార్గెట్ ఓరియెంటెడ్‌గా ఆలోచించడమేం ఖర్మ.. నిద్ర కూడా అలాగే పోతున్నాడు’ అని చెబుతూ మురిసిపోతోంది.వాళ్లేమో ‘వీడు మామూలు పిల్లల్లా అల్లరి చేయడు, మాట్లాడడు, ఏదో లోపం ఉందేమో’ అని అనుమానపడ్తున్నారు. ‘పోనీ వీడికి తోడుగా ఉంటారు మరొకరిని కనండి అంటే ఒక్కడే చాలని ఆపేశారు అంటూ లోలోపలే సణక్కోసాగారు. ఆ మాటలు పైకి అంటే అంతే సంగతులు. తను ఇంజినీర్ కాకపోవడానికి మీరే కారణమని తేల్చి నేను ఆ పొరపాటు చేయనని ర్యాంకర్ల ఫొటోలున్న గోడ మీద గట్టిగా గుద్ది మరీ చెబుతుంది రమణి.చూస్తుండగానే కాలయంత్రపు చక్రాలు గిర్రున తిరిగాయి. ఏళ్లు గడిచాయి. ఇంటర్ రిజల్ట్ వచ్చింది. ఫరవాలేదు ఓ మాదిరి మార్కులతో పాసయ్యాడు. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ అంటూ ఏవో కారణాలు వాళ్లకు వాళ్లే చెప్పుకున్నారు. జెఈఈలు గట్రా ‘మీకూ, నాకూ సంబంధం లేదని’ బుద్ధిగా సైలెంట్ అయిపోయాయి. ఇక ఎమ్సెట్.. హిస్టరీ రిపీట్ అయింది. రమణి పేరు నిలబెట్టాడు చిటుకూ. మళ్ళీ లాంగ్ టర్మ్. హిస్టరీ మళ్ళీ రిపీట్. వాక్యం మార్చాల్సిన అవసరం రానివ్వలేదు.రమణి ఆలోచించింది. ఇన్నాళ్లూ ప్రతి క్లాసులోనూ బాగానే మార్కులు వస్తున్నాయి. మరి ఇప్పుడేమైంది? ఉన్నట్టుండి గుర్తొచ్చింది. ఒకసారి క్లాసులో ఫస్ట్ ర్యాంక్‌లు పది మందికి వచ్చాయి. ‘అదేంటి? ఎంతమంది ఉన్నా ఒకరికే కదా ఫస్ట్ ర్యాంక్ వచ్చేద’ని అడిగితే మార్కులు సమానం, వయసు సమానం, ఎర్రర్స్ సమానం అంటూ అర్థం కానివేవో చెప్పారు. ‘పోనీలే, నా కొడుకుకైతే ర్యాంక్ వచ్చింది కదా’ని ఆనాడు తృప్తిపడింది. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఏదో జరిగిందని లోపల గంట కొడుతోంది. స్కూళ్లలో, కాలేజీలలో జరిగిన నమ్మక ద్రోహం అర్థమైంది. పలురకాలుగా ఆలోచించింది. చిన్నగా రాంబాబు దగ్గరకొచ్చి ‘పోనీలెండి.. చిటుకూకి త్వరగా పెళ్లి చేద్దాం. అప్పుడు వాడికి పుట్టే కొడుకో, కూతురో మన కోరిక నెరవేర్చకపోరు?’ అంది అప్పటికి ఆ కోరికతో రాంబాబే సతమతమైపోతున్నట్టు.అప్పుడు.. రమణికి ఏదో శబ్దం వినపడింది. చెవులు వెడల్పు అయ్యాయి. ఖర్..ఖర్..ఖర్మని గులక రాళ్లు నోట్లో వేసుకొని నములుతున్న చప్పుడు. అది రమణి చెవులు ఎప్పుడూ వినని చప్పుడు. తన ప్రమేయం లేకుండానే రాంబాబు పళ్లు కొరుకుతున్నాడు. ఎదురుగా అటక మీద కనపడుతున్న వస్తువు వైపు అతని చూపులు సాగడాన్ని రమణి పసిగట్టింది. ఆ వస్తువు ఎప్పుడో తమ పెళ్లప్పుడు సంప్రదాయం కోసం వచ్చి ఇంట్లో తిష్ట వేసింది. అప్పటివరకూ ఎప్పుడూ అవసరపడనిది.. రోకలి బండ. గోడ మీద పీరియాడిక్ టేబుల్లో సిల్వర్ మెటాలిక్ కలర్లో యురేనియం మెరిసిపోతోంది.అప్పుడెప్పుడో రాంబాబు పుట్టడానికి కొన్ని నెలల ముందు ‘నవ్వుతున్న బుద్ధుడు’ అనే కోడ్ నేమ్‌తో పోఖ్రాన్ మొదటి అణుపరీక్ష జరిగింది. దాని తాలూకు పేలుడు ఇప్పుడు ఆ ఇంట్లో జరిగే సూచనలు కనిపిస్తున్నాయ్. ఇవేమీ పట్టనట్టు చిటుకూ బయట ప్రహరీ గోడ దగ్గరకు వెళ్ళాడు. ఇలాగే జరుగుతుందని వాడికి ఎప్పుడో తెలుసు. కాకపోతే చెప్పడానికి అవకాశమెక్కడిది?ప్రహరీ గోడపై గడ్డం ఆనించి నిలబడ్డాడు. పై పెదవిపై సన్నని పెన్సిల్ గీతలా మీసాల జాడ.. వాడి చూపు.. ముక్కుపైకి నెట్టుకుంటూన్న కళ్లద్దాల గుండా గోడ మీదుగా .. ఎదురుగా కనిపిస్తున్న గ్రౌండ్ వైపు ఉరికింది. అక్కడ పరుగులు పెడుతూ ఆడుతున్న పిల్లలపై నిలిచింది. ఆశ్చర్యంగా, ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టు మేను మరచిపోయాడు.ఇంటికి కొద్ది దూరంలోనే ఇలాంటి గ్రౌండ్ వుందని ఇప్పటివరకూ వాడు గమనించనేలేదు. సరిగ్గా అప్పుడే మైదానం నుండి పిల్లల లేత పాదాల తాకిడికి లేచిన ఓ ధూళి మేఘం... చూస్తుండగానే గాలిలో కలిసిపోయింది.. వాడి బాల్యంలా! – బాడిశ హన్మంతరావు -
బౌద్ధవాణి: ఆమెకు గుండె ఆగినంత పని అయింది..
ఆ ఇంట్లో ఇల్లాలు వంటచేస్తూ అందులో నిమగ్నమై పోయింది. ఆ రోజు భిక్షు సంఘాన్ని భిక్ష కోసం ఆహ్వానించారు ఆ గృహస్తులు. ఆమెకు ఒక నెలల బిడ్డ. ఆ బిడ్డడిని ఇంటిముందు దుప్పటి మీద పడుకోబెట్టారు. ఇద్దరు పిల్లలు ఆడిస్తున్నారు. ఆ పసివాడు వెల్లకిలా పడుకుని, కాళ్ళూ చేతులూ ఆడిస్తూ బోసినవ్వులు చిందిస్తున్నాడు.ఆమె వంటగదిలోంచి అప్పుడప్పుడూ ఆ పిల్లలకేసి చూస్తూనే ఉంది. కొంత సమయం గడిచింది. ఇంటి యజమాని కావడితో మంచినీరు తెచ్చి ఇంట్లో విశాలమైన మధ్య గదిలో ఉంచాడు. ఆరుబయట ఆడుకుంటున్న పిల్లల్లో ఒకడు పెద్దగా అరిచాడు.‘‘అమ్మా! భిక్షువులు వస్తున్నారు’’ అంటూ ఆ వీధి చాలా ΄÷డవైంది. ఆ వీధిలోకి అప్పుడే వచ్చారు భిక్షుగణం. భిక్షగా సమర్పించే ఆహార పదార్థాలన్నీ పూర్తయ్యాయి. వాటిని గిన్నెల్లోకి సర్దుతోంది. ఇంతలో బయట ఏదో శబ్దం వినపడింది. కోడె దూడ ఒకటి చెంగుచెంగున ఎగురుతూ, తోక ఎత్తి అటుకేసి వచ్చింది. పసి పిల్లవాణ్ణి అక్కడే ఉంచి, మిగిలిన ఇద్దరు పిల్లలూ ఇంట్లోకి పరుగు తీశారు. ఇల్లాలికి విషయం అర్థమై, వేగంగా బైటికి పరుగు తీసింది.కానీ... అప్పటికే ఆ గిత్తదూడ వచ్చేసింది. ఆరుబయట పడుకున్న పిల్లవాడి మీదగా దూకి వెళ్ళిపోయింది. ఆమెకు గుండె ఆగినంత పని అయింది. ఆమె వెళ్ళేసరికి... చిరునవ్వులు చిందిస్తూ బోసి నోటితో ఊ కొడుతున్నాడు ఆ బిడ్డ. కొంతసేపటికి భిక్షువులు వచ్చారు. వారు భిక్ష పూర్తి చేశాక ధర్మోపదేశం చేశారు. అప్పుడు వారికి ప్రమాదం తప్పిన పిల్లవాని గురించి తెలిసింది.‘‘చేశారా! ఆ బాలుడు స్థిరచిత్తుడు. స్థిత ప్రజ్ఞుడు. చావు ముందుకొస్తున్నా చిరునవ్వు చెదరనివాడు’’ అన్నాడు ఆ భిక్షువు. ‘‘అవును. కుశల సంపన్నుడు అజేయుడు’’ అన్నాడు మరో భిక్షువు. పాపకర్మలు చేయనివాడు, మోసపు మాటలు ఎరుగని వాడు, పాప సంకల్పాలు తెలియని వాడు. అందుకే స్థిరచిత్తుడు’’ అన్నాడు మొదటి భిక్షువు. వారు అలా వాద సంవాదాలు చేసుకుంటూ ఆరామానికి చేరారు. అక్కడా ఇదే సంఘటన చెప్పి, అదే చర్చ కొనసాగించారు. అలా చర్చించే వారంతా కొత్తగా వచ్చిన వారే. వారి మధ్య మాటలు జరుగుతూ ఉండగా బుద్ధుడు అక్కడికి వచ్చాడు. భిక్షువులందరూ నిశ్శబ్దం పాటించారు. ‘‘భిక్షువులారా! ఇపుడు మీరు వాదులాడుకుంటున్న విషయం ఏమిటి?’ అని అడిగాడు. విషయమంతా తెలుసుకున్నాడు.‘‘భిక్షువులారా! శరీరంతో పాప కర్మలు చేయని వారు, పాపపు మాటలు మాట్లాడనివారు, పాప సంకల్పాలు చేయని వారు, పాప జీవనం కొనసాగించనివారు ఈ నాలుగు ధర్మాల్ని పాటించేవారు కుశల సంపన్నులే. అజేయులే! అత్యున్నత స్థితిని పొందినవారే! అయితే పసివారు ఇవేవీ చేయరు కాబట్టి వారు అజేయులు కారు. ఎందుకంటే.... వారు వెల్లకిలా పడుకుని మాత్రమే ఉండగలరు. వారు తమ శరీరంతో ఏ కర్మలూ చేయలేరు. వారికి నోరుంటుంది.నవ్వు, ఏడుపులు ఉంటాయి తప్ప, తప్పు ఒప్పులు మాట్లాడలేరు. అంటే... మాటల ద్వారా కర్మలాచరించలేరు. అలాగే... అది చేయాలి, ఇది చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అనే ఆలోచనలు వారికి ఉండవు. కాబట్టి సంకల్పాలూ ఉండవు. ఇక, తాను అది తినాలి ఇది తినాలిఅని ఎలా ఉండదో... ఆ తిండిని ఏదో ఒక మార్గంలో, మంచిగానో చెడుగానో సంపాదించి తినాలి అనే కోరికా ఉండదు. తల్లిపాలు తాగడం తప్ప... మరే విధమైన జీవన కర్మలు చేయరు. పసిపిల్లవాణ్ణి కర్మలతో కొలవకూడదు.పెరిగి పెద్దయ్యాక కలిగే అనేక వికారాల నుండి, దోషాల నుండి, స్వార్థాల నుండి బైటపడిన వారినే కుశల సంపన్నులుగా, అజేయునిగా భావించాలి. అలాంటి నిస్వార్థ జీవనాన్ని కీర్తించాలి. అ నాలుగు ధర్మాల్ని ధరించిన వారికి అపజయం కలగదు. ప్రమాదం వచ్చి మీద పడుతున్నా చిరునవ్వు చెరగదు.’’ అన్నాడు. పాపకర్మలు చేసే అవకాశం ఉన్నా చేయని వారు పాపపు జీవన విధానం ఎదుటే ఉన్నా దాన్ని స్వీకరించని వారు... ఇలాంటి వారు మాత్రమే అజేయులు. ఎందుకంటే వారు తమని తాము జయించుకుంటారు కాబట్టి అనే విషయం వారికి అర్థమైంది. ఆ కొత్త భిక్షువులు బుద్ధునికి ప్రణమిల్లారు. – డా. బొర్రా గోవర్ధన్ -
ధర్మ జ్ఞానోదయం
సూర్యోదయం అయ్యింది. సూర్యుని చేత కిరణాలు దట్టమైన చెట్ల చిటారు కొమ్మలపై పడుతున్నాయి. లేలేత ఎరుపు రంగులో ఉన్న కొమ్మల చివుర్లు మరింత ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. చల్లని గాలి చెట్ల మధ్య దూరి కొమ్మల్ని తాకుతూ పయనిస్తుంది. అప్పుడే నదిలో స్నానం చేసి వచ్చి పాలవృక్షం క్రింద కూర్చున్నాడు బుద్ధుడు. ఆ ఉషోదయ తేజస్సు అంతా అతని ప్రశాంత వదనంలోంచి ఉదయిస్తోంది! పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. కనురెప్పలు మెల్లగా వాలాయి! ఆలోచనల ΄÷రలు తెరచుకున్నాయి!తాను జ్ఞానోదయం ΄పొంది ఇది నలభై తొమ్మిదో రోజు. అంటే సిద్దార్థుడు బుద్ధిని పొంది, బుద్ధుడైన రోజు. అప్పటికి రెండు నెలల క్రితం నిరంజనా నదీ తీరంలో తన ఐదుగురు మిత్రులతో కలిసి కఠోర తపస్సు చేశాడు. చిక్కిశల్యమై నీరసించి పడిపోయాడు. జ్ఞానసాధనకు అది సరైన మార్గం కాదని నిర్ణయించుకున్నాడు. నిరాహార వ్రతం మానాడు. మిత్రులు తనని దూషించి వెళ్ళిపొంయారు. అయినా నిరాశపడలేదు. గయకు చేరాడు. అక్కడ నదీతీరంలోని రావిచెట్టు కింద ధ్యానదీక్ష కొనసాగించాడు. అంతకాలంగా వెదుకుతున్న దుఃఖానికి కారణం తెలిసింది కాబట్టి దానికి నివారణ మార్గం కూడా తెలిసింది. ఆ నిదారణా మార్గమే అష్టాంగ మార్గం! అష్టాంగమార్గ ఆవిష్కరణే బుద్ధునికి జ్ఞానోదయం. ఏ విషయంలోనూ అతి ఉండకూడదు అనేది అవగతం అయ్యింది. తిండి మాని శరీరాన్ని ఎండగట్టుకోవడం ఎంత త΄్పో, అతిగా తిని శరీరాన్ని సోమరిగా చేయడం అంతే తప్పు. నిద్రాహారాలు మాని పగలూ రేయి అవిశ్రాంతంగా పని చేయడం ఎంత త΄్పో, పనీ ΄ాటా మాని తిని తిరగడం అంతే తప్పు. ఇలా... రెండు అంచులకు చేరకుండా మధ్యస్థంగా ఉండడం వల్ల కర్తవ్య ΄ాలన చిరకాలం సాగించగలం. దీన్నే మధ్యమమార్గం అంటాం. ఈ మార్గమే బుద్ధుని బోధనలకు పునాది. ఈ మార్గాన్ని ఎంచుకునే అష్టాంగ మార్గాన్ని రూపొందించాడు. అదే బుద్ధునికి జ్ఞానోదయం. బుద్ధుని ఆలోచనల్లో ప్రశాంత వెలుగులు నింపిన ఆరోజు వైశాఖ పున్నమి. బుద్ధత్వం సిద్ధించిన రోజు. బుద్ధుడు సంబోధిని పొందిన రోజు. నేడు ప్రపంచానికి పండుగరోజు. దుఃఖ నివారణా మార్గాన్ని సాధించిన బుద్ధుడు వెంటనే అక్కడినుంచి లేచి వెళ్ళి΄ోలేదు. తాను ΄పొందిన జ్ఞానాన్ని ప్రకటించుకోలేదు. ఆ మార్గాన్ని దాని ఆచరణలో కలిగే అవరోధాల్ని, అసలు ఆ మార్గం ప్రజలకు అర్థమవుతోందా? లేదా? అనే విషయాల్ని పలు పలు విధాలుగా తర్కించుకున్నాడు. తర్కించి తర్కించి.. చివరికి తనది సరైన మార్గమే అని నిర్ణయించుకున్నాడు.మెదటివారం అంతా తనకు ఏ చెట్టుకింద జ్ఞానోదయం కలిగిందో.. ఆ చెట్టుకిందే కూర్చున్నాడు. మానవుల పుట్టుక, మరణాల మధ్య ఉన్న దశల్ని పన్నెండు భాగాలుగా విభజించుకుని ఒక్కో దశ గురించి దీర్ఘంగా ఆలోచించాడు. అవిద్య, సంస్కారాల పరంపరలో ముసలితనం, మరణం కలుగు తాయని, ఆ మరణం వల్లే శోకం, రోదనం, దుఃఖం, బాధలు కలుగుతాయని తెలుసుకున్నాడు. ఈ దుఃఖ బాధలకు కారణం అలవిమాలిన కోరిక (తృష్ణ), కాబట్టి కోరికల్ని నశింపచేసుకుంటే మనస్సు దుఃఖ రహితమవుతుందని గ్రహించాడు. దానితో తన ఆలోచనలకి మరింత బలం చేకూరింది. అలా మొదటి వారం గడిచింది. రెండోవారం కూడా ఆ బోధి వృక్షం కిందే ఉండి ధ్యానానందాన్ని పొందాడు. మూడోవారం ఆ చెట్టుకు కొద్ది దూరంగా వెళ్ళి నేరేడు చెట్టు కింద కూర్చొని, బోధివృక్షాన్ని పరిశీలిస్తూ తన మార్గాన్ని మరింత విస్తృత పరుచుకుంటూ గడి΄ాడు. అక్కడి నుండి లేచి, అక్కడికి దగ్గరలో ఒక కొలనుగట్టున ఉన్న ఒక మందిరంలో చేరాడు. అక్కడే ‘అభిధర్మాన్ని’ పరిష్కరించాడు. ధ్యానసాధనా సో΄ానాల్ని, మనస్సుని కేంద్రీకరించే విధానాన్ని రూపొందించుకున్నాడు. మనస్సు నిర్మలం అయింది. బుద్ధుని ముఖంలోంచి తేజస్సు ప్రకాశించింది. తల చుట్టూ ఆరు రంగుల కాంతి .... వెల్గులు ప్రసరించింది. అది ఒక జ్ఞాన కాంతిపుంజం.మరలా ఆ తేజోమూర్తి అక్కడి నుండి లేచాడు. అజ΄ాల అనే మర్రి చెట్టు కిందికి చేరాడు. అప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలో – చెడ్డ పనులు ఎవరు చేయరో, మోహరాగాల నుండి ఎవరు ముక్తులవుతారో, స్వచ్ఛమైన జీవితాన్ని గడుపుతూ, సర్వోన్నత జ్ఞానిగా ఎవరు ఉంటారో వారే బ్రాహ్మణులు. బ్రాహ్మణత్వం అలా సిద్ధిస్తుంది గాని, పుట్టుకను బట్టి కాదు. అని బుద్ధుడు చె΄్తాడు. ‘సత్యాన్ని తెలుసుకుని, ఏకాంతంగా గడపడం సుఖం. మంచి పనులు చేయడం అంతకంటే సుఖం. జీవుల పట్ల కరుణ, మైత్రి కలిగి జీవించడం అన్నింటికంటే పరమసుఖం. అని బోధిస్తాడు. జనులు కోర్కెలతో, క్లేశాలు అనే వాసాలతో ఇల్లు నిర్మించుకుంటారు. వాటిని తృష్ణ అనే తాళ్ళతో గట్టిగా బంధించుకుంటారు. ఆ తాళ్ళను తెంచి, వాసాలు దించి, ఆ కోర్కెల కొంపను కూల్చుకుంటేనే దుఃఖం నుండి విముక్తి అనే విషయాన్ని ఆవిష్కరించగలుగుతారు. కోర్కెల వాసాలతో దుఃఖం అనే ఇంటిని నిర్మించుకుని ప్రజలు అందులో జీవిస్తున్నారు. ఆ ఇంటికి బలం కోర్కెలనే వాసాలు. జ్ఞానం అనే గొడ్డలితో ఆ కోర్కెల్ని కూల్చితే దుఃఖం దూరమై΄ోతుంది. ఇదే బుద్ధునికి కలిగిన జ్ఞానోదయం. దుఃఖం లేని జగతికి సూర్యోదయం. ధర్మ అరుణోదయం.– డా. బొర్రా గోవర్ధన్(23, గురువారం బుద్ధ పూర్ణిమ) -
బౌద్ధవాణి.. మట్టికుండ నేర్పిన పాఠం
విదిశా నగర సమీపంలోని ఒక వ్యాపార కేంద్రం సువర్ణపురి. ఆ పట్టణం లో ప్రజోతుడు పేరున్న ధనిక వ్యాపారి. ప్రజోతునికి మణిమాలుడు అనే కుమారుడు. అతనూ పెరిగి పెద్దవాడయ్యాడు. తండ్రి వ్యాపారంలో తోడుగా ఉండేవాడు. మణిమాలుడు తమ వ్యాపారాన్ని మరింతగా పెంచాడు. ప్రజోతుడు వృద్ధుడయ్యాడు. కుమారునికి వ్యాపార పద్ధతులు, సుదూర రాజ్యాల ప్రజల తీరు తెన్నులు చెప్పుతూ... కాలం గడపసాగాడు. అప్పుడప్పుడూ జైన సాధువుల్ని, బౌద్ధ భిక్షువుల్ని పిలిచి దానాలు ఇచ్చేవాడు. నగరం లో కొన్ని ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవాడు.కొన్నాళ్ళకు మణిమాలుడు కూడా పెద్ద వ్యాపారి అయ్యాడు. ధనం పెరిగిన కొద్దీ అతనికి ధనదాహం కూడా పెరిగింది. అక్రమ వ్యాపారాలు సాగించాడు. దానితో ధనం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. దానధర్మాలు మానాడు. ధనంతోపాటు మానసిక అశాంతీ పెరిగింది. నిద్ర సుఖానికి దూరం అయ్యాడు. భయానికీ, ఉలికిపాటుకూ చేరువయ్యాడు. తండ్రి తన కుమారునిలో పెరిగిపోతున్న అశాంతిని గమనించాడు. ఒకరోజున పిలిచి– ‘‘నాయనా! నీవు నైతికతకి దూరమవుతున్నావు. మనోవేదనకి దగ్గరవుతున్నావు. నీవు ఇక నాతోపాటు బుద్ధ సందేశాలు వినడానికి రా.. ప్రస్తుతం భగవాన్ బుద్ధుడు ఇక్కడకు సమీపంలోనే ఉంటున్నారు’’ అని అనునయంగా చెప్పాడు. అలా... తనతో రెండు మూడుమార్లు మణిమాలుణ్ణి బుద్ధుని దగ్గరకు తీసుకుని వెళ్ళాడు ప్రజోతుడు. ఆ తర్వాత తానే స్వయంగా బుద్ధుని దగ్గరకు వెళ్ళసాగాడు మణిమాలుడు. ఒకరోజు మణిమాలుడు బుద్ధునితో ‘‘భగవాన్! నేను నా తండ్రిలా దానాలు చేయలేదు. సాధువుల్ని గౌరవించలేదు. వారిని సత్కరించలేదు. వ్యాపారాన్నీ ధర్మబద్ధంగా చేయనూ లేదు. ఇప్పుడే నా తప్పు తెలుసుకున్నాను. కానీ... నాకు ఒక బెంగ ఉంది. మరణానంతరం నా తండ్రికి గానీ, నాకు గానీ స్వర్గం లభిస్తుందా?’’ అని అడిగాడు.అతని ఆంతర్యం గ్రహించాడు బుద్ధుడు. ‘‘మణిమాలా! రేపు వచ్చేటప్పుడు ఒక మట్టికుండ, కొంత వెన్నపూస, కొన్ని గులకరాళ్ళు తీసుకుని రా’’ అన్నాడు. మరునాడు అవి తీసుకువచ్చాడు మణిమాలుడు. కుండలో గులకరాళ్ళు పోయించి, వాటిమీద వెన్నముద్ద పెట్టించి,‘‘మణిమాలా! దగ్గరలో ఉన్న తటాకం దగ్గరకు తీసుకుపోయి ఈ కుండను నీటిమీద ఉంచి, కర్రతో పగలగొట్టు. వెన్న మునిగితే నీ తండ్రికి స్వర్గ్రపాప్తి, రాళ్ళు తేలితే నీకు స్వర్గ్రపాప్తి..’’ అని చెప్పి పంపాడు. మణిమాలుడు గబగబా వెళ్ళి నీటిపై కుండను ఉంచి కర్రతో పగలగొట్టాడు. వెన్న తేలింది. రాళ్ళు మునిగాయి. దానితో ఆందోళనపడుతూ బుద్ధుని దగ్గరకు పరుగున వచ్చి పడ్డాడు. విషయం చెప్పి...‘‘మా ఇద్దరికీ స్వర్గం దక్కే మార్గం ఏమిటి భగవాన్’’ అని అడిగాడు. ‘‘నాయనా నీటిలో రాళ్ళు మునగడం వాటి ప్రకృతిధర్మం. నీటిపై తేలడం వెన్న సహజ ధర్మం. అవి వాటి సహజ ధర్మాల్ని తప్పి ఎప్పుడూ ప్రవర్తించవు. అలాగే... మంచి పనులు చేస్తే మనిషికి మనశ్శాంతి. సుఖ నిద్ర, సుఖ జీవనం. అదే స్వర్గం. చెడ్డపనులు చేస్తే మనస్సుకు అశాంతి. దుఃఖం. నిద్రకు దూరం. మనోవ్యధ. అదే నరకం. మంచిగా మానవునిగా, మానవతతో జీవించు. దుఃఖాన్ని ఇచ్చే అకుశల కర్మలు ఆచరించకు. అదే స్వర్గం. ...’’ అని చెప్పాడు.మణిమాలుని మనస్సు తేటపడింది. మట్టికుండ మహోపదేశాన్ని అందించింది. ధర్మబద్ధంగా జీవించడం నేర్చుకున్నాడు. దానాలు చేస్తూ, ధర్మకార్యాలు నెరవేరుస్తూ జీవితం ఆనందంగా కొనసాగించారు. – డా. బొర్రా గోవర్ధన్ -
బౌద్ధవాణి...సమజీవనం
వసంత రుతువు వచ్చేసింది. వనమంతా పూలతో పరిమళిస్తోంది. హిమాలయ ప్రాంంతంలో కోలియులకు చెందిన కక్కరవస్తు నగరం అది. ఆ నగర సమీప వనంలో విశాలమైన రావిచెట్టు కింద కూర్చొని ఉన్నాడు బుద్ధుడు తన భిక్షు సంఘంతో. కోలియ యువకుడు దీర్ఘజాణుడు కూడా వచ్చి బుద్దుని దగ్గరే కూర్చుని తన సందేహాలు తీర్చుకుంటున్నాడు. ‘భగవాన్! లోకంలో హితకారి, సుఖకారి అయిన నాలుగు ధర్మాల గురించి చెప్పండి?’ అని అడిగాడు. ఆ ప్రశ్నతో అక్కడ ఉన్న భిక్షువులందరూ సర్దుకు కూర్చున్నారు. అంతలో కొద్దిదూరంలో రైతులు లయబద్ధంగా అరిచే అరుపులు వినిపించాయి. కావళ్ళకు ధాన్యం మోపులు కట్టుకుని, భుజాన మోస్తూ, వేగంగా నడుస్తూ ఉన్నా రైతులు ‘ఓహోం.. ఓహోం..’’ అంటూ అరుస్తూ, ఆ వూపులో వేగంగా పోతున్నారు. వారి మధ్యలో ఉన్న రైతు కావడిని కాస్త ముందుకు సర్దుకున్నాడు. దానితో వెనుక బలం పెరిగింది. గట్టు దాటే సమయంలో వెనక్కు పడిపోయాడు. మరలా లేచి కావడిబద్దను భుజానికి ఎత్తి, ముందూ, వెనుకల బరువులు సర్దుకుని వారితో నడక సాగించాడు. కానీ, వెనుకపడ్డాడు. రైతులు వెళ్ళిపోయారు. ‘‘దీర్ఘజాణా; ఈ లోకంలో హితాన్ని, సుఖాన్ని కూర్చే ఉత్థాన సంపద, ఆరక్ష సంపద, కళ్యాణ మిత్రత, సమజీవనం– అనే నాలుగు సంపదలు ఉన్నాయి’’ అన్నాడు. ‘‘భగవాన్! వాటి గురించి చెప్పండి’’ అడిగాడు దీర్ఘజాణుడు నమ్రతగా. ‘‘దీర్ఘజాణూ! వృత్తి ద్వారా సంపాదించేది ఉత్థాన సంపద. పశుపాలనం, వ్యవసాయం, వాణిజ్యం, శిల్పకళ, ఉద్యోగం... సోమరితనాన్ని వీడి ఈ వృత్తులు నిర్వహించడంలో నేర్పరి అవుతారు. ఇలా సాధించుకున్నదే ఈ సంపద’’ ‘‘అలాగే! ఒకరు తమ కండబలాన్ని ఉపయోగించి, నిరంతరం శ్రమించి, కష్టపడి చమటోడ్చి, సంపద కూర్చుకుంటాడు. తాను శ్రమించి పొందిన ఈ సంపదని రాజులు, దొంగలు కాజేయకుండా, అగ్నికి ఆహుతి కాకుండా, వరదపాలు కాకుండా రక్షించుకుంటాడు. దీన్నే ఆ రక్ష సంపద అంటారు. ‘‘మరి, దీర్ఘజాణూ! మిత్రులు కూడా మనకు సంపదే! శీలవంతులు, సదాచారులు, శ్రద్ధావంతులు, ప్రజ్ఞానులు, త్యాగబుద్ధి కలిగిన మిత్రులు ఉంటే... మనం కూడా వారిలా శీలసంపద పొందుతాం. శ్రద్ధాసంపద సాధిస్తాం. సదాచారులై జీవిస్తాం. ఇలా శీల, జ్ఞాన సంపదలు మనకు మంచి మిత్రుల వల్ల వస్తాయి. అందుకే కల్యాణ(మంచి) మిత్రులు కూడా మనకు ఒక సంపదే. ఇక, సమజీవనం అంటే అన్నింటికంటే మనకు హితకారి. కొందరు ఆడంబరాల కోసం తమ ఆదాయానికి మించి వ్యయం చేస్తారు. ఇంకొందరు ఎక్కువ ధనం ఉన్నప్పటికీ పిసినారితనం చూపుతారు. వీరిద్దరూ మోసే కావడి ఏదో ఒకవైపు బరువు పెరిగో, తరిగో సమతుల్యత కోల్పోతుంది. దానివల్ల మోసేవాడి భుజం పట్టు తప్పుతుంది. కావడి పడిపోతూ... మోసేవారినీ పడేస్తుంది.’’ ‘‘దీర్ఘజాణూ..! అలా కాకుండా ఆదాయ వ్యయాలను సరితూచుకుంటూ జీవించే వారే ‘సమజీవనం’ సాగించేవారు. విలాసాలూ, విందులూ, ఇతరులతో పోల్చుకుని అతిగా వ్యయం చేయడం మాని, అవసరాల మేరకు జీవిస్తే... కొద్దిగా ఆదాయం కూడా సమకూరుతుంది. వారి జీవితం నిశ్చింతగా సాగుతుంది; దీర్ఘజాణూ! సకల గృహస్తులకు ఈ సమజీవనం చాలా అవసరం! ఎందుకంటే... ఇదే హితం! ఇదే సుఖం!’’ అన్నాడు బుద్ధుడు. దూరం నుండి రైతులు కావళ్ళు మోస్తూ లయబద్ధంగా అరుస్తున్న అరుపులు వినిపిస్తున్నాయి! ధీర్ఘజాణు వంగి బుద్ధుని పాదాలకు నమస్కరించాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
ఆ సుఖం...నిజమైన సుఖం కాదు!
అది ‘కురువుల’ పట్టణం. దాని సమీపంలో యమునా నది. చల్లని నీడనిచ్చే మామిడి చెట్ల వనం. అందులో అగ్ని భరద్వాజుని ఆశ్రమం. ఆ సమయంలో బుద్ధుడు ఆ ఆశ్రమంలో ఉంటున్నాడు. అగ్ని భరద్వాజుడు బుద్ధునికి తగిన ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఒకరోజు బుద్ధుడు ఆ పట్టణంలోకి వెళ్ళి భిక్ష స్వీకరించి వచ్చి, ఈ వనంలో ఒక పెద్ద మామిడి చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. సమయం మధ్యాహ్నం దాటింది. అగ్ని భరద్వాజుని దగ్గరకు మాగందియుడు అనే తాపసి వచ్చాడు. పరస్పర కుశల ప్రశ్నల తర్వాత వారిద్దరూ కలిసి మామిడి తోటలో బుద్ధుడున్న చోటుకు వెళ్లారు. అప్పటికీ మాగందియుని విషయం బుద్ధునికి తెలుసు. వారు వచ్చాక కొంత సంభాషణ కామసుఖాల మీద జరిగింది... ‘‘మాగందియా! కామసుఖాలకంటే సుఖాన్నిచ్చే గొప్పసుఖం వేరే ఉంది.’’ అన్నాడు బుద్ధుడు. వారిద్దరూ శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు. ‘‘నేను యువరాజుగా ఉన్నప్పుడు నాకోసం మూడు ప్రత్యేక భవంతులు నిర్మించారు. వేసవిలో, వర్షాకాలంలో, హేమంత కాలాల్లో నివసించడానికి అనువైన భవనాలు అవి. ఆయా కాలాల్లో హాయిని చేకూర్చే భవనాలు. దివ్య సుఖాన్నిచ్చే భవనాలు నేను ఆ నాలుగు నెలూ ఆ భవనాలు దిగి వచ్చేవాడినే కాదు. చివరికి ఈ కామ సుఖాల బేలతనాన్ని తెలుసుకున్నాను. నాలో కామతృష్ణ తొలగిపోయింది. పిపాస నశించింది. రాగం వదిలిపోయింది. అప్పుడు కూడా ఆనందించాను. కామం, తృష్ణ, పిపాసలు ఇవ్వలేని ఆనందాన్ని కూడా పొందాను. ఆనందం, దుఃఖం భవనాల్లో లేవు. మన మనస్సులోనే ఉంటాయి.’’ అని వారివైపు చూశాడు బుద్ధుడు. శ్రద్ధగా వింటూ కనిపించారు. ‘‘మాగందియా! రాగం ద్వేషం, పిపాస ఉన్న మనస్సునే ప్రక్షాళన చేయాలి. కుష్ఠు వ్యాధి శరీరం, వేడి గ్రహించి హాయి పొందినట్లు రాగద్వేషాలతో ఉన్న మనస్సు కూడా వాటిని పొందినప్పుడు హాయి పొందుతుంది. రాజ భవనాల్లో నేను పొందిన హాయి అలాంటిదే! కుష్ఠువ్యాధి తగ్గిన శరీరం వేడికి హాయి పొందదు. దానికి వేడితో పనిలేదు. అలాగే రాగరహిత హృదయానికి భవనాలు సుఖాలు అవసరం లేదు. ఆరోగ్యమైన శరీరానికి మంటల వేడి అవసరం లేనట్లే... ఆరోగ్యమైన మనస్సుకి కోర్కెలు అవసరం లేదు. మాగందియా! ఈ కామభోగలాలసలు గతంలోనూ, భవిష్యత్‌లోనూ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. దుఃఖాన్ని కలిగిస్తూనే ఉంటాయి. ఇంద్రియాల్ని లోబరుచుకుంటూనే ఉంటాయి. వీటికి లోబడి పొందే సుఖం, కుష్ఠువారు వేడివల్ల పొందే సుఖం లాంటిది. ఆ సుఖం సుఖం కాదు. దుఃఖమే!’’ అన్నాడు. ‘‘భగవాన్! చల్లని మీ మాటల ద్వారా ఏది నిజమైన సుఖమో, ఏది సత్యమైన దుఃఖరహిత మార్గమో... తెలుసుకోగలిగాను. నన్ను కూడా ఇకనుంచి మీ అనుయాయిగా స్వీకరించండి’’ అంటూ ప్రణమిల్లాడు మాగందియుడు. – డా. బొర్రా గోవర్ధన్ ఇవి చదవండి: ఏది గొప్పది... స్వర్గమా! కాశీనా!!! -
'సమ్యక్ దర్శనం' వల్లే సత్యాన్ని తెలుసుకోగలం!
మగధ రాజ్య రాజధాని రాజగృహ సమీపంలోని పక్షి పర్వతం. ఆ పర్వతం చివర విశాలమైన చదును భాగం. ఒకపక్క పెద్ద పెద్ద కొండరాళ్ళు. ఆ రాళ్ళ సందులో చిన్న గుహ. అది చల్లగా విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. చదును భాగం చుట్టూ పనస చెట్లు దట్టంగా ఉన్నాయి. ఒకరోజు బుద్ధుడు సాయంత్రం వేళ ఆ గుహ ముందున్న రాతిమీద కూర్చొని ఉన్నాడు. ఆ సమయానికి వచ్చాడు దీర్ఘనఖుడు అనే సన్యాసి. అతను అగ్ని ఆరాధకుడు. దీర్ఘనఖుడు వచ్చి, వంగి బుద్ధునికి నమస్కరించాడు. ఒక పక్కన నిలబడ్డాడు. ఆ రోజుల్లో కొందరు తాపసులు ‘‘మీరు చెప్పేది ఏదీ నాకు సమ్మతం కాదు. దేన్నీ నేను ఒప్పుకోను’’ అనేవారు. ఏ విషయాన్ని చెప్పినా, దాన్ని ఏదో ఒక విధంగా విమర్శించేవారు. తప్పులు వెదికేవారు. అంగీకరించేవారు కాదు. ఇంకొందరున్నారు. వారు ప్రతిదాన్నీ అంగీకరించేవారు. ఆయా విషయాలపై వాదవివాదాలు చేసేవారు కాదు. ‘అలాగే... ‘అవునవును’ అంటూ తలలూపేవారు. ఇక మూడోరకం ఉన్నారు. వారు ‘‘మాకు కొంత సమ్మతం కాదు’’ అనేవారు. దీర్ఘనఖుడు ఇందులో మొదటి రకం వాడు. ‘‘ఏదీ నాకు సమ్మతం కాదు’’ అనేవాడు. ఆరోజు ఇదే విషయం గురించి చర్చించుకుంటూ.... ‘‘దీర్ఘనఖా! ఏదీ నాకు సమ్మతం కాదు’ అనేదైనా నీకు సమ్మతమేనా?’’ అని అడిగాడు. ‘‘గౌతమా! అది మాత్రం నాకు సమ్మతమే’’ అన్నాడు. బుద్ధుడు అతని వైపు తదేకంగా చూశాడు. బుద్ధుని ప్రశాంత దృక్కులు తనని ఏదో ప్రశ్నిస్తున్నట్లు గమనించాడు. అప్పుడు బుద్ధుడు– ‘‘ఏదీ సమ్మతం కాదు... అనేవారి దృష్టి రాగరహితంగా ఉంటుంది. దేనితో కలవకుండా ఉంటుంది. ΄÷గడ్తలకు, ప్రతి దాన్నీ పొందాలనే భావనకూ దూరంగా ఉంటుంది. దేనినీ పట్టుకుని వేళ్ళాడదు!’’ అన్నాడు. ‘‘గౌతమా! మంచిది. మీరు నా దృష్టి కోణాన్ని మెచ్చుకుంటున్నారన్నమాట’’ అన్నాడు. ‘‘దీర్ఘనఖా! ఇంకా విను. ‘అంతా సమ్మతమే అనేవారు దీనికి భిన్నంగా ఉంటారు. వారి దృష్టి రాగంతో ఉంటుంది. ప్రతి దానితో కలసి΄ోతుంది. ΄÷గడ్తలను కోరుకుంటుంది. ప్రతి దాన్నీ పొందాలి అనుకుంటుంది. ఇక మూడోరకంవారి దృష్టి ఈ రెండు రకాలనూ కలగలుపుకుని ఉంటుంది. విశేషం ఏమిటంటే.. ఈ మూడు రకాల వారిలో ప్రతి ఒక్కరూ తమ దృష్ఠే సరైనదనుకుంటారు. ఇతరుల్ని విమర్శిస్తారు. వ్యతిరేకిస్తారు. తమ అనుభవంలో... తాము అనుకునేదానికి భిన్నమైన ఫలితం చూసినా, గ్రహించినా గానీ,,, వీరు మారరు. మూర్ఖంగా తాను అనుకున్నదే సత్యం అనుకుంటారు. సర్వం అదే అని నిర్ణయించుకుంటారు. మిగిలినదంతా మిధ్యే అని భావిస్తారు. దీని వల్ల ప్రజ్ఞని (ఎరుకను) కోల్పోతారు. సత్యాన్ని ఆవిష్కరించలేరు’’ అని చెప్పాడు. బుద్ధుడు అలా మూడురకాల దృష్టి గలవారి గురించి చెప్పాక, తన తప్పు ఏమిటో దీర్ఘనఖునికి అర్థమైంది. ద్వేషం, క్రోధాలు ఎలా సత్యాన్ని తెలుసుకోడానికి అవరోధాలలో... రాగం మోహం కోరికలు కూడా అలాంటి అవరోధాలే అని గ్రహించాడు. ఇవి తొలగించుకుని సమ్యక్ దర్శనం వల్లనే సత్యాన్ని సత్యంగా.. ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోగలం అని అర్థం చేసుకున్నాడు. మనస్సుని మాలిన్య రహితం చేసుకోవడం వల్ల సమ్యక్ దృష్టి కలుగుతుందని గ్రహించి... వినమ్రంగా బుద్ధుని పాదాలంటి నమస్కరించాడు. – డా. బొర్రా గోవర్ధన్ ఇవి చదవండి: గంగే మాం పాహి! -
బుద్ధుడి అవశేషాల ప్రదర్శన థాయ్‌లాండ్‌లో..
ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన బుద్ధ భగవానుని పవిత్ర అస్థికలను, చితాభస్మాన్ని బౌద్ధమత అనుచరుల సందర్శనార్థం థాయ్‌లాండ్‌లో ప్రదర్శించనున్నారు. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 18 వరకూ మధ్య థాయ్‌లాండ్‌లో బుద్ధుడి అవశేషాల ప్రదర్శన జరగనుంది. థాయ్‌లాండ్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వం బుద్ధుని అస్థికలను, చితాభస్మాన్ని థాయ్‌లాండ్‌కు పంపాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 22న కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ నేతృత్వంలో వైమానిక దళానికి చెందిన ప్రత్యేక హెర్క్యులస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో పటిష్టమైన భద్రత నడుమ వీటిని పంపనున్నారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. శిష్యుల అస్థికలు కూడా.. బుద్ధ భగవానుని అస్థికలతోపాటు అతని శిష్యులైన అర్హంత్ సరిపుత్ర, అర్హంత్ మహామొగల్యన్లో అస్థికలను కూడా థాయ్‌లాండ్ పంపనున్నారు. ప్రస్తుతం ఈ మహనీయుల చితాభస్మం మధ్యప్రదేశ్‌లోని సాంచి స్థూపంలో భద్రపరిచారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో ఈ విషయమై చర్చించిన తర్వాత వీరి అస్థికలను థాయ్‌లాండ్‌కు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పంపిస్తోంది. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం దేశంలో బుద్ధ భగవానునికి సంబంధించిన 22 పవిత్ర అస్థికలు ఉన్నాయి. వీటిలో 20 అస్థికలు ప్రస్తుతం నేషనల్ మ్యూజియంలో ఉండగా, రెండు కోల్‌కతా మ్యూజియంలో ఉన్నాయి. వీటిలో నాలుగు అస్థికలను ఇప్పుడు థాయ్‌లాండ్‌కు పంపుతున్నారు. రెండోసారి థాయ్‌లాండ్‌కు.. బౌద్ధమత అనుచరులు ఈ పవిత్ర అస్థికలను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. బుద్ధునికి సంబంధించిన ఈ పవిత్ర ఎముకలను ఇప్పటికే శ్రీలంక, కంబోడియా, సింగపూర్, దక్షిణ కొరియాలకు అక్కడి ప్రజల సందర్శనార్థం పంపారు. ఇప్పుడ రెండోసారి థాయ్‌లాండ్‌కు వీటిని పంపుతున్నారు. గతంలో అంటే 1995లో తొలిసారి బుద్ధుని అస్థికలను థాయ్‌లాండ్‌కు పంపారు. -
"పెనిస్ విలేజ్"! ఆ గ్రామంలోని ఏ గోడపై చూసినా..!
అత్యంత విచిత్రమైన గ్రామం. ఇక్కడ ఏ గోడ చూసినా విస్తుపోతాం. ప్రతి ఇంటి గోడపైనే ఆ చిత్రమే ఉండటం విశేషం. గోడలపై చిత్రించే ఆ చిత్రాలు ఎంతలా అవి భాగమంటే ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలపై కూడా అదే చిత్రం. కొత్తగా వచ్చినా పర్యాటకులు ఈ గ్రామం తీరుని చూసి ఖంగుతింటారు. ఆ ఆకృతి పట్ల ఉన్న నమ్మకం వింటే నవ్వు వచ్చేలా ఉంటుంది. ఆ చిత్రాలు చూడటానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ.. అక్కడ ప్రజలు దీన్ని ఓ ఆచారంగానే గాక అవే తమకు మంచి చేశాయని ప్రగాడంగా నమ్మడం మరింత విచిత్రంగా ఉంటుంది. ఇంతకీ అక్కడ గోడలపై ఎలాంటి చిత్రాలు ఉంటాయంటే.. భూటాన్‌లోని థింపు నుంచి మూడు గంటలు ప్రయాణిస్తే ఈ పునాఖా లోయలోని సోప్సోఖా అనే గ్రామానికి వెళ్లగలుగుతాం. అక్కడ కనిపించే ప్రతి గోడపై నిటారుగా 'మానవ పురుషాంగం" ఆకృతి దర్శనమిస్తుంది. వినేందుకు ఇబ్బందిగా ఉన్న ఇది నిజం. ఆ గ్రామంలో ప్రతి ఇంటి మీదే కాదు! దేవాలయాలు, ప్రభుత్వ సంస్థల గోడలపై కూడా ఆ ఆకృతి ఉంటుంది. ఇది వారి ఆచారం, నమ్మకాలకు సంబంధించింది. ఈ ఆకృతిలో ఉండే హస్తకళ దుకాణాలు కూడా ఎక్కువే. ఎలాంటి నిషేధం లేకుండా యథేచ్ఛగా ఈ ఆకారంలోని బొమ్మలు, శిల్పాలు అక్కడ అముమ్మతుండటం విశేషం. ఆఖరికి టీ షర్టు, పోస్టర్లపై కూడా ఈ ఆకృతి తప్పనిసరిగా ఉంటుంది. ఈ సంప్రదాయనికి మూలం 15వ శతాబ్దపు బౌద్ధ సన్యాసి ద్రుక్పా కున్లేకి చెందినదని చెబుతారు అక్కడి ప్రజలు. అతను బౌధ్ధమతాన్ని వ్యాప్తి చేసే సాంప్రదాయేతరు పద్ధతులకు అత్యంత ప్రసిద్ధి. లోతైన ఆధ్యాత్మక సందేశాలను తెలియజేయడానికి ఇలా ఫాలస్(పురుషాంగం ఆకృతిలో)లో ఉండే వాటిని వినియోగించడంతో ఇలా అక్కడ వాళ్లంతా తమ ఇంటి గోడలపై ఆ చ్రితాన్ని తప్పనిసరిగా వేయించుకుంటారు. అంతేగాదు ఆయనకు చెందిన మఠం ఆగ్రామంలోనే ఉంది. దీంతో ప్రజలు ఆ గ్రామాన్ని ప్రముఖ తీర్థక్షేత్రంగా భావించి తండోపతండాలు వచ్చి ఆ మఠాన్ని దర్శించుకుంటారు . ముఖ్యంగా మహిళలు, సంతానలేమితో బాధపడే జంటలు ఈ గ్రామంలోని మఠాన్ని సందర్శించడానికి వస్తారు. దీన్ని సంతానోత్పత్తి క్షేత్రంగా చెబుతారు. అక్కడకు వచ్చిన భక్తులను ఫాలస్ ఆకృతిలో ఉన్న చెక్కతోనే ఆశ్వీరదించడం మరింత విచిత్రం. ఈ ఆశ్రమాన్ని సందర్శించిన తర్వాత ఆ జంటలకు తప్పనిసరిగా సంతానం కలుగుతుందని అక్కడ ప్రజల ప్రగాఢ నమ్మకం. అంతేగాదు అలా సంతానం కలిగిన జంటల గాథలు కూడా అక్కడ దేవాలయంలో ఉంటాయి. ఆఖరికి పుట్టిన పిల్లల పేర్లు కూడా ఆ మఠం లేదా ఆ సన్యాసి పేరు మీదగా పేర్లు పెడుతారు. ఈ చిహ్నం వారిని దుష్టశక్తులకు దూరం చేసి, సంతానోత్పత్తిని కలిగించే అదృష్ట గుర్తుగా విశ్వసిస్తారు అక్కడి ప్రజలు. అక్కడ భూటాన్‌లోని ప్రతి ఇంట్లో ఈ గ్రామం నుంచి కొనగోలు చేసిన ఫాలస్(పురుషాంగం ఆకృతి)లు తప్పనిసరిగా ఉంటాయి. ఈ నమ్మకం కాస్త నవ్వు తెప్పించినప్పటికీ.. అక్కడ అడుగు పెట్టాలంటే కఠిన నిబంధనలు అనుసరించాల్సిందే. అంతేగాదు భూటాన్ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం కూడా. అందుకు ఇది కూడా ఓ కారణం అయ్యి ఉండొచ్చు. (చదవండి: బొటానికల్ వండర్! మానవ పెదవులు పోలిన మొక్క! ఎక్కడుందంటే..?) -
పని ఒకటే... పాపాలు ఐదు..
ఒక సమయంలో బుద్ధుడు రాజగృహానికి వచ్చి, జీవకుని మామిడితోటలో ఉంటున్నాడు. అది వేసవికాలం కావడంతో ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ ఆ తోటలో చల్లగానే ఉంటుంది. చెట్లన్నీ మామిడిపండ్లతో నిండుగా ఉన్నాయి. బుద్ధుడు అక్కడ ఉన్నాడని తెలిసి ఎందరెందరో అక్కడికి వచ్చి చేరేవారు. బుద్ధుని ప్రసంగాలు వింటూ ఉండేవారు. భిక్షువులు ఉదయం పొద్దు బాగా పైకెక్కాక నగరంలో భిక్షకు వెళ్ళేవారు. మధ్యాహ్నం వేళకు ముందే తిరిగి వచ్చేవారు. మామిడి చెట్లకింద చేరి తమ తమ అనుభవాలను చర్చించుకుంటూ ఉండేవారు. ఆ రోజు... ఇద్దరు భిక్షువులు తీసుకున్న భిక్ష మీద చర్చ జరిగింది. వారు భిక్షకు వెళ్ళినప్పుడు ఆ ఇంటి వారు ఆరోజు మాంసాహారం మాత్రమే వండుకున్నారు. అదే వారికి భిక్షగా వేశారు. ఆ ఇద్దరూ భిక్షను స్వీకరించారు. కానీ, వారిలో ఒకరు మాత్రమే దాన్ని తిన్నారు. రెండోవారు దాన్ని తెచ్చి కూరను జంతువులకు వేసి, ఉత్త చప్పిడి అన్నాన్నే భుజించాడు. మాంసాహార విషయంలో బుద్ధుడు అనేక నియమాలు పెట్టాడు. భిక్షువులు కూర్చొని భిక్ష విషయాలు మాట్లాడుకోవడం జీవకుడు విన్నాడు. బుద్ధుడు చెప్పిన పంచశీలలో మొదటిదే జీవహింస విషయం. ఆ విషయం జీవకునికి బాగానే తెలుసు. జీవకుడు మెల్లగా బుద్దుని దగ్గరకు వెళ్ళాడు. బుద్ధుడు ఆరామం ముందున్న పెద్ద మామిడి చెట్టు కింది అరుగు మీద కూర్చొని ఉన్నాడు. జీవకుడు వెళ్ళి నమస్కరించాడు. ‘‘జీవకా! అలా కూర్చో’’ అన్నాడు బుద్ధుడు. జీవకుడు కూర్చొన్నాడు. తాను విన్న భిక్షువుల సంభాషణలు చెప్పాడు. ‘‘జీవకా! జీవహింసకు పాల్పడే వారికి అపుణ్యం (పాపం) ఐదుచోట్ల కలుగుతుంది. ‘‘చంపడం కోసం.. అదిగో ఆ ప్రాణిని తీసుకొని రండి’’ అని ఆదేశించినప్పుడు మొదటి పాపం తగులుతుంది. ఆ ప్రాణిని చంపడానికి దాని మెడకు తాడు వేసి వధించే చోటుకు లాక్కొని తీసుకుపోతున్నప్పుడు ఆ జంతువు భయపడుతుంది. దుఃఖపడుతుంది. అప్పుడు ఆ యజమానికి రెండోసారి పాపం కలుగుతుంది. ‘‘వెళ్ళి దాన్ని చంపు. వధించు’’ అన్నప్పుడు ఆ యజమానికి మూడోసారి పాపం చుట్టుకుంటుంది. ఎందుకంటే.. ప్రాణభీతితో ఆ జంతువు అల్లాడిపోతుంది. భయంతో గింజుకుంటుంది. దుఃఖంతో విలవిల్లాడుతుంది. ఇక ఆ జంతువుని వధిస్తున్నప్నుడు అది మరింత రోదిస్తుంది. అప్పుడు నాలుగోసారి పాపం వచ్చిపడుతుంది. అలాంటి మాంసాన్ని ఇతరులకు పెట్టినప్పుడు, భిక్షగా వేసినప్పుడు ఐదోసారి ఎంతో అపుణ్యం అంటుకుంటుంది. జీవకా! తెలిసి, తన కోసమే వండిన ఈ ఆహారాన్ని తిన్న వారికి ఇంతకుమించిన అపుణ్యం కలుగుతుంది.’’ అన్నాడు. ఒక్క జీవహింసలోనే కాదు.. ఏ చెడ్డ పనికైనా ఇలాంటి పాపాలు కలుగుతాయని తెలుసుకుని బుద్ధునికి వినమ్రంగా ప్రణమిల్లాడు జీవకుడు. – డా. బొర్రా గోవర్ధన్ -
అన్నింటికి మనస్సే ప్రధానం! ప్రేమతోనే గెలవాలి!
బుద్ధుని కాలంలో నిగంఠనాథ పుత్రుడు అనే సాధుగురువు ఉండేవాడు. అతనికి చాలామంది శిష్యులు ఉండేవారు. వారిలో దీర్ఘ తపస్వి అనే సాధువు ఒకడు. మనస్సు, వాక్కు, శరీరం అనే మూడింటిలో శరీరమే ప్రధానం అనేది నిగంఠుని సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని దీర్ఘ తపస్వి చాలా బలీయంగా ప్రచారం చేసేవాడు. దానితో నిగంఠుని శిష్యుల్లో శ్రేష్టుడయ్యాడు. ఈ దీర్ఘ తపస్వికి ఉపాలి అనే గృహస్తు మంచి అనుయాయి. ఉపాలి మంచి జ్ఞాని, ధనవంతుడు నిఘంటుని సాధు సంఘాన్ని అతనే పోషించేవాడు. అదే సమయంలో... బుద్ధుడు తన బౌద్ధ సంఘంతో నలందకు వచ్చాడు. శరీరం, మనస్సు, వాక్కుల్లో బుద్ధుడు మనస్సుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. మనిషి చేసే కర్మలన్నింటికీ మనో కర్మే మూలం. మనసే అన్ని కర్మల్ని నడిపిస్తుంది అనేది బుద్ధుని సిద్ధాంతం. ఈ విషయం తెలిసి దీర్ఘ తాపసి కోపంతో... ‘‘నేను ఇప్పుడే వెళ్ళి, ఆ గౌతముణ్ణి వాదంలో ఓడించి వస్తాను’’ అని మండిపడ్డాడు. అప్పుడు ఉపాలి ‘‘గురువర్యా! ఈ మాత్రం దానికి తమరెందుకు! నేను చాలు. బలమైన ఏనుగు నీటి తటాకంలో దిగి, ఆ నీటిని చెల్లా చెదురు చేసినట్లు గౌతముణ్ణి నా వాదంతో చెల్లా చెదురు చేసి వస్తాను’’ అని బయలుదేరాడు. బుద్ధుని దగ్గరకు వెళ్ళాడు. వాదానికి దిగాడు. అతి కొద్ది సేపటికే వాదం ముగిసింది. ఉపాలి చివరికి అన్నింటికీ మనస్సే ముఖ్యం. మనసే మూలం అని అంగీకరించాడు. ఒక వ్యక్తి తనని కర్రతో కొట్టితే... తాను ఇంతకాలం ఆ నేరం ‘‘కొట్టిన కర్రది’’ అనుకున్నానని గ్రహించాడు. ఆ తప్పు కొట్టిన చేతిది కూడా కాదు. ఆ వ్యక్తి హింసా ప్రవృత్తే కారణం అని తెలుసుకున్నాడు. ఆ ప్రవృత్తి కేంద్రం మనస్సే అనే సత్యాన్ని నిర్ధారించుకున్నాడు. తాను ఇంతకాలం.. ఆ కర్రను పట్టుకుని వేలాడుతూ ఉన్నానని’’ గ్రహించాక, వెంటనే, బుద్ధునికి ప్రణమిల్లాడు. సముద్రం లోతులు చూడాలని, సముద్రంలో దిగిన ఒక ఉప్పు బొమ్మ, తాను కరిగిపోయి, ఆ సముద్రంలో లీనమైపోయినట్లు ఉపాలి మాత్రమే కాదు... ఎందరో బుద్ధుని మానవీయ సిద్ధాంతంలో కరిగిపోయారు. ఆ ధర్మ సాగరంలో బిందువులయ్యారు. ద్వేషం కంటే ప్రేమ గొప్పది. సంకుచితత్వం కంటే విశాల దృక్పథం గొప్పదని చెప్పిన తథాగత బుద్ధుడు సర్వదా శ్లాఘనీయుడే! – డా. బొర్రా గోవర్ధన్ (చదవండి: కోరికలు కలలోని పూదోటలు! వాటి కోసం పరుగులు తీస్తే చివరికి..) -
అందగాడు, ఆయుష్మంతుడు కన్నా గుణవంతుడే అన్ని విధాల..
వారణాసి పట్టణంలో సుప్రబుద్ధి అనే వ్యాపారి ఉన్నాడు. దేశవిదేశాల్లో వ్యాపారం చేసి ఎంతో ధనం సంపాదించాడు. అతనికి సుజాత అనే పెళ్ళీడుకొచ్చిన కుమార్తె ఉంది. సుగుణాల రాశి. అందాల బొమ్మ. అందానికి అందం. సంపదకి సంపద పుష్కలంగా ఉండటంతో ఎందరో ఆమెను పెళ్ళాడలనుకున్నారు. తమ తమ ఆస్తి వివరాలు, చిత్రపటాలూ పంపారు. సుప్రబుద్ధి భార్యకు వారిలో ధననందుడు నచ్చాడు. ఎందుకంటే ఆ పెళ్ళి కుమారులందరిలో అతనే అందగాడు. రంగూ, రూపం చాలా బాగుంది. ‘‘ధననందుని తల్లిదండ్రులకి కబురు పంపండి’’ అంది ఆమె. సుప్రబుద్ధుని తండ్రికి మాత్రం విక్రముడు నచ్చాడు. అతను అవంతీనగర శ్రేష్ఠికుమారుడు. ధనం, వంశగౌరవం కలవాడు కాబట్టి ‘‘విక్రముని కుటుంబంతోనే వియ్యమందుదాం’’ అన్నాడు పెద్దాయన. ధనం కంటే వంశం కంటే ఆరోగ్యమే మహా భాగ్యం అనుకున్నాడు సుప్రబుద్ధి. కాబట్టి అతనికి ఉజ్జయినీ యువకుడు ఉదయనుడు నచ్చాడు. తన కుమార్తెను చేపట్టేవాడు ఆరోగ్యంతో దీర్ఘాయువుగా ఉండాలి. పెళ్లంటే నూరేళ్ళ పంట. కాబట్టి ఉదయనుడే తనకు అల్లుడైతే చాలు అనుకున్నాడు. అలా ఆ ముగ్గురి అభిప్రాయాలూ వేరు వేరుగా ఉన్నాయి. కాబట్టి తన కుమార్తె అభిప్రాయం అడగాలనుకున్నాడు. వెంటనే పిలిచి తమ తమ అభిప్రాయాలు చెప్పి–‘‘అమ్మా! సుజాతా! మా ముగ్గురి అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి. వీరిలో ఎవరు అయితే నీకిష్టం?’’ అని అడిగాడు. సుజాత చిరునవ్వు నవ్వింది. మౌనం వహించింది. ‘‘సందేహించక చెప్పు తల్లీ!’’ అన్నాడు. ‘‘నాన్నా! నాకు ఈ మూడు రకాల వారూ వద్దు. గుణవంతుడు, శీలవంతుడు అయితే చాలు’’ అని లేచి అక్కడి నుంచి మేడ మీదికి పరుగు తీసింది సిగ్గుపడుతూ. ఆ వచ్చిన వారిలో అలాంటి యువకుడు మగధకు చెందిన శీలభద్రుడున్నాడు. ఈ విషయంపై ఇంట్లో తర్జన భర్జనలు జరిగాయి. ఎటూ తేల్చుకోలేకపోయాడు సుప్రబుద్ధి. మధ్యాహ్నం దాటాక సారనాథ్‌లోని జింకల వనానికి చేరాడు. అక్కడ వెదురు చెట్ల కింద కూర్చొన్న బుద్ధుని దగ్గరకు వెళ్ళాడు. నమస్కరించి, విషయం చెప్పాడు. అప్పుడు బుద్ధుడు– ‘‘సుప్రబుద్ధీ! ఒకడు చాలా అందగాడు. మంచి శరీర వర్ణం గలవాడు. కన్నూ, ముక్కు తీరు బావుంటుంది. కానీ వాడు ఒక దొంగ అనుకో. అందగాడని దొంగను ఇష్టపడతావా?’’ ‘‘లేదు భగవాన్!’’ ‘‘అలాగే.. ఒకడు సోమరి. అజ్ఞాని. కానీ, ఆరోగ్యవంతుడు. అతణ్ణి ఇష్టపడతావా?’’‘‘ఇష్టపడను భగవాన్!’’ ‘‘ధనవంతుడు, గొప్ప వంశం కలవాడు. కానీ.. వాడు జూదరి. తాగుబోతు. తిరుగుబోతు. అతను నీకు ఇష్టమేనా?’’ ‘‘కాదు భగవాన్! ఇష్టం కాదు’’‘‘చూశావా! అందగాడైనా, ఆయుష్షు గలవాడైనా, ధనవంతుడైనా ఇష్టం కాదు అనే అంటున్నావు. అవునా! సుప్రబుద్ధీ! వీటన్నిటి కంటే గుణమే ప్రధానం. నీ కుమార్తె కోరినట్లు గుణవంతుడు, శీలవంతుడు నీకు అల్లుడైతే, నీవూ, నీ కుమార్తె, నీ కుటుంబం, నీ బంధువర్గం అందరికీ గౌరవం.’’ అన్నాడు. ‘‘భగవాన్! నా కుమార్తె ఇష్టం ప్రకారమే ఆమె పెళ్ళి చేస్తాను పెద్ద మనస్సుతో అంగీకరిస్తాను’’ అంటూ సుప్రబుద్ధి సంతోషంతో లేచి వెళ్ళాడు. అలాగే చేశాడు. – డా. బొర్రా గోవర్ధన్ (చదవండి: క్షమయే దైవము) -
దుష్టునికి దక్కే గౌరవ సత్కారాలూ అలాంటివే! కాబట్టి..
దేవదత్తుడు ఒక యువరాజు. చిన్ననాటినుంచి బుద్ధుని పట్ల దేవదత్తుడు శత్రుభావంతో ఉండేవాడు. చిన్నప్పుడు బాణాలతో దేవదత్తుడు హంసను కొడితే, దాన్ని బుద్ధుడు సంరక్షించి, ప్రాణం కాపాడాడు. ఆ హంస నాదంటే నాదని దేవదత్తుడు సిద్ధార్థునితో వాగ్వివాదానికి దిగాడు. ‘ప్రాణం తీసిన వానిది కాదు. ప్రాణం పోసిన వానిదే హంస’ అని, ఆ హంసను తీసుకుని, గాయాలు మానేలా చేసి, తిరిగి ఆకాశంలోనికి వదిలి పెట్టాడు సిద్ధార్థుడు. అప్పటినుంచి బుద్ధుడి పట్ల ద్వేషం, అసూయ పెంచుకుంటాడు దేవదత్తుడు. వారు పెరిగి పెద్దవారయ్యాక, బుద్ధుడు బౌద్ధసంఘాన్ని స్థాపించి విశేష గౌరవ సత్కారాలు పొందడం చూసి తానూ బౌద్ధసంఘంలో చేరాడు దేవదత్తుడు. కొన్నాళ్లకి బౌద్ధసంఘంలో తనకే అగ్రస్థానం లభించాలని, తానో నాయకుణ్ణి కావాలని పట్టుబట్టాడు దేవదత్తుడు. సంఘం అంగీకరించక పోవడంతో మగధ యువరాజు అజాత శతృవు పంచన చేరి ‘నీవు నీ తండ్రిని చంపి రాజువుకా. నేను బుద్ధుణ్ణి చంపి బౌద్ధసంఘం నాయకుణ్ణవుతాను’ అని నూరిపోస్తాడు. అజాత శతృవు దేవదత్తుని మాటలు నమ్మి, అతణ్ణి ఆదరిస్తాడు. ఈ విషయం శిష్యులు బుద్ధునితో చెబుతారు. అప్పుడు బుద్ధుడు – ‘భిక్షువులారా! దుష్టునికి దక్కే గౌరవ సత్కారాలు అరటిచెట్టు పువ్వులాంటివి. వెదురుచెట్టు పుష్పం లాంటివి. ఎండ్రకాయ గర్భం లాంటివి. ఒక్కపువ్వుతోనే అరటిచెట్టు అంతరిస్తుంది. వెదురు చెట్టు ఒక్క పూతతోనే తన నాశనాన్ని తాను తెచ్చుకుంటుంది. పీతకి గర్భమే దాని చావుని ప్రసాదిస్తుంది’ అని చెప్పాడు. ‘‘నిజమే, మామిడిచెట్టు పుష్పించి, ఫలాలనిస్తుంది కానీ అంతరించదు. మరలా చిగురించి, మరలా ఫలాలను ఇస్తూనే ఉంటుంది. అది ఎప్పుడూ గౌరవ సత్కారాలు పొందుతూనే ఉంటుంది. కానీ అరటిచెట్టు పుష్పించి, గెలవేసి అంతరిస్తుంది. ఒక్కకాపుతోనే దాన్ని నరికేస్తారు. దుశ్శలుడు పొందే గౌరవ సత్కారాలు ఇలాటివే కదా!’’ అనుకున్నారు అతిథులు. బుద్ధుడు చెప్పినట్టే, ఆ తర్వాత అజాత శతృవుకి దూరమై, ఒంటరిగా మిగిలి దైన్యంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు దేవదత్తుడు. – బొర్రా గోవర్ధన్ -
స్థిరచిత్తం అంటే అదే!
అది గంగానదీ తీరం. లోతు తక్కువ ప్రదేశం. నది మధ్యలో అక్కడక్కడ ఇసుక దిబ్బలున్నాయి. నదీ తీరంలో గట్టు వెంట గొర్రెల మంద మేస్తోంది. ఆ మందను చూసింది ఒక తోడేలు. మందలో చివరిలో మందకు కొద్దిదూరంలో ఒంటరిగా మేస్తోంది ఒక పొట్టేలు. తోడేలు చూపు దాని మీద పడింది. ‘ఈ బలిసిన పొట్టేలు అయితే రెండు రోజులకు సరిపోతుంది’ అనుకుంది. మాటు కాచి, పొంచి పొంచి దాని దగ్గరకు వచ్చింది. ఎండుటాకుల ధ్వనిని బట్టి ఏదో తనవైపు వస్తున్నట్లు గుర్తించింది పొట్టేలు. తల పైకెత్తి చూసింది. తన మీదికి దూకి వస్తున్న తోడేలు కనిపించేసరికి నది మధ్యలో ఉన్న ఇసుక తిన్నెల మీదికి పరుగుతీసింది. అలా రెండు మూడు తిన్నెలు దాటి తీరాన్నుండి దూరంగా పోయాయి రెండూ. అంతలో వరదనీరు ఉరకలేస్తూ ఉరవడిగా వచ్చిపడుతోంది. పొట్టేలు ప్రాణ భయంతో ఇసుక దిబ్బ మీదినుండి నది నీటిలోకి దూకేసి ఈదుకుంటూ వెళ్లిపోయింది. తోడేలు మాత్రం దిబ్బమీదే నిలబడిపోయి, పొట్టేలు వైపే చూస్తూ ఉండిపోయింది. ఇంతలో వరద నీరు హెచ్చింది. మధ్యలో ఉన్న ఇసుక దిబ్బలు మునిగిపోసాగాయి. తోడేలు పొట్టేలు మీదినుంచి చూపు తిప్పుకునేసరికే అది నిలబడ్డ దిబ్బ చాలా మునిగిపోయింది. కొద్దిసేపటికి ఆ దిబ్బమీది కొద్ది ఎత్తైన ప్రదేశం మాత్రమే మిగిలింది. తోడేలు ఆ ఎత్తు ప్రదేశానికి చేరింది. ఆ వరద అలా రెండురోజులు ఉంది. వేటాడటం అటుంచి, కనీసం ఒడ్డుకు చేరే మార్గం కనిపించలేదు. అది తనలో తనే ‘ఈ ప్రమాదాన్నుండి బయట పడతానో లేదో, ఇప్పటిదాకా ఎంతో హింస చేశాను. ఎన్నో జీవుల్ని చంపాను. ఆ కర్మ ఫలం నాకు మంచిని చేకూర్చదు. కాబట్టి బతికినన్ని రోజులు ఇక అహింసను, మైత్రిని, మంచితనాన్ని పాటించాలి’ అనుకుంది. ఆ దిబ్బమీదికి చేరి, కూర్చొని ధ్యానం చేయసాగింది. కొంత సమయం గడిచింది. ఎక్కడో సన్నగా మేక అరుపు దాని చెవులబడింది. తపస్సు భగ్నం అయ్యింది. మెల్లగా కళ్లు తెరిచింది. అటూ ఇటూ చూసింది. వరద కొద్దిగా తగ్గింది. తాను ఉన్న ఇసుక దిబ్బ ఇంకొద్దిగా బైట పడింది. దాని మీదకు చేరి అరుస్తూ ఉన్న మేకపిల్ల కనిపించింది. తోడేలు మెల్లగా లేచి మేక పిల్లకేసి వంగి వంగి నడవసాగింది. దాదాపు దగ్గరగా పోయి ఒక్క ఉదుటున దూకింది. కానీ.. గురి తప్పి నీటిలో పడడంతో శబ్దం వచ్చింది. ఆ శబ్దాన్ని విని అటు చూసిన మేకపిల్లప్రాణభయంతో నది నీటిలోకి ఎగిరి దూకి ఈదుకుంటూ వెళ్లిపోయింది. తోడేలుకు మరలా నిరాశ.‘లేదు. మరలా నేను నా మనస్సును కుదుట పరచుకోవాలి. హింసను విడనాడాలి. అహింసతో జీవించాలి. తపస్సు చేసి, చేసినపాప ఫలాన్ని రూపు మాపుకోవాలి’ అనుకుంది. బుద్ధుడు ఈ కథ చెప్పి– ‘‘మనం మనకు అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు శాంతంతో, అహింసతో, జీవ కారుణ్యాన్నీ, ధర్మాన్నీ ఆచరించడం కాదు. కోపం రావడానికి కారణాలు ఉన్నప్పుడూ, హింస చేసే అవకాశం వచ్చినప్పుడూ తప్పు చేసే పరిస్థితులు కలిగినప్పుడు అవి చేయకుండా ఉండటమే గొప్పతనం. అలా ఉంచగలిగిందే ధ్యానం. అలా మన చిత్తాన్ని ప్రక్షాళన చేసుకోవాలి. నా మార్గం మనస్సును అలా దృఢంగా మలుస్తుంది’’అని చెప్పాడు. స్థిర చిత్తం అంటే అదే మరి! – డా. బొర్రా గోవర్ధన్ -
వ్యక్తి కంటే సంఘమే శ్రేష్ఠం
బుద్ధుడు దోషాలు చేసేవారిని సంస్కరించడానికి శతవిధాలా ప్రయత్నం చేసేవాడు. అప్పటికీ, ఎప్పటికీ ఇక వీరు మారరు అనుకుంటే వారిని సంఘానికి దూరం పెట్టేవాడు. సంఘానికి ఇచ్చే గౌరవం వ్యక్తికి ఇచ్చేవాడు కాదు. భిక్షువులందరూ కుటుంబాల్ని, ఆస్తిపాస్తుల్ని వదిలి వచ్చినవారే! కానీ తాము మాత్రమే త్యాగం చేశామని గప్పాలు కొట్టుకునేవారు, విహారానికి దానాలు చేసే ఉపాసకులు (గృహస్తులు) దగ్గర ఇతరుల మీద లేనిపోని అపవాదులు వేసేవారు. అలాంటివారిలో చంపావిహారంలోని కణ్ణథేరుడు ఒకడు. విహారానికి ఎవరైనా దానాలు సమర్పిస్తే... అవి నావల్లే వారు సమర్పించారు..’’ అని ప్రగల్భాలు పలికేవాడు. భోజనాల్ని పంచే పదవిలో ఉంచితే, కొన్నాళ్లు ఉండి ‘‘ఈ పదవి నేను తప్ప మరొకరు నిర్వహించలేరు. నా సామర్థ్యం ఈ సంఘానికి తెలియాలి’’ అనుకొని దానినుండి ఏవో సాకులు చెప్పి వైదొలగేవాడు. మరొక భిక్షువు ఆ పదవిని చేపట్టి ఎంతో సమర్థవంతంగా నిర్వహించడంతో తట్టుకోలేకపోయేవాడు. ఈర్ష్య చెందేవాడు. ఆ ఈర్ష్యని సంఘం మీద రుద్దేవాడు. పదవినుండి తానే దైదొలగి, వచ్చినా ఉపాసకులతో–‘‘నన్ను బలవంతాన తొలగించారు’’ అని అబద్ధాలు చెప్పేవాడు. అలా ఆ కణ్ణ భిక్షువు తోటి భిక్షువుల మీదే కాకుండా, సంఘం మొత్తం మీద విమర్శలు చేస్తుండేవాడు. వారు నిర్వాకుల్లో కొందరినే కీర్తిస్తూ వారి ప్రాపకం కోసం ఆరాటపడేవాడు. వారిలో ‘‘నేను ఈ విహార నిర్మాణం నుండి ఉన్నాను. దీని నిర్వహణకు నేను తగునా?’’ అని నర్మగర్భితంగా అడిగేవాడు. వారు ఎవరూ పట్టించుకోకపోతే ‘‘ఈ విహార స్థాపకుణ్ణి నేనే.. నేనే మొదటి నుండి ఉన్నాను. నన్ను గౌరవించరా?’’ అంటూ వచ్చిన ప్రతివారి దగ్గర ఏకరువు పెట్టేవాడు. ఇలా.. సంఘం ఐక్యతకి చేటుగా తయారయ్యాడు. తోటి భిక్షువులు, అనేక సార్లు బుద్ధుడు కూడా చెప్పి చూశాడు. కొంతకాలం బాగానే ఉంటాడు. మరలా కువిమర్శలు మొదలు పెట్టేవాడు. ఆ విరామంలో భిక్షువులు అతని విచిత్ర మనస్తత్వాన్ని తట్టుకోలేకపొయారు. అప్పుడు బుద్ధుడు చంపావద్ద గల గగ్గిరా పద్మాల పుష్కరణ్ తీరంలో ఉన్నాడు. అదే సమయంలో చంపా విహార భిక్షువులు సమావేశమై కణ్ణ భిక్షువుని పిలిచి అతని తప్పులు చెప్పి, వివరణ అడిగారు. వారు అడిగిన విషయాన్ని పక్కన పెట్టి వేరే విషయం మీద చర్చ పెట్టుమన్నాడు. ఇలా అడిగిన దానికి కాకుండా పొంతన లేనిది వాగుడు వాగడంతో వారి మీద కోపాన్ని, ద్వేషాన్నీ, తిరస్కారాన్నీ చూపడంతో వారంతా పద్మాల పుష్కరిణికి దగ్గరకు వెళ్ళి, బుద్ధునికి వివరించాడు– అప్పుడు బుద్ధుడు కణ్ణభిక్షువు ఇది తెలియజేసిన దోషాలు కాదు. కావాలనే చేస్తున్నాడు. అతని మనస్తత్వం మార్చలేనిది. ఇది అతని సహజాత స్వభావంగా భావించి... ‘‘భిక్షువులారా! ఒకరైతు బార్లీ పంట వేస్తాడు. ఆ మొక్కల మధ్య తెగులు సోకిన ఒక బార్లీ మొక్క ఉంటుంది. దానితో తెగులు మొదట్లో బయటకు వ్యక్తం కాదు. ఆరోగ్యకరమైన బార్లీ మొక్కల్లానే పెరుగుతుంది. దాని కాండం, వేర్లు, అకులు ఎంతో ఆరోగ్యంగానే కనిపిస్తాయి. పైకి ఎలాంటి తేడా వ్యక్తం కాదు. కానీ అది కంకి తొడిగినప్పుడు దాని తలను చూస్తే అది తెగులు సోకిన మొక్క అని రైతుకు తెలుస్తుంది. ఇక అప్పుడు ఆ రైతు దీని కాండం బాగుంది, అకులు బాగున్నాయి, వేరు బలంగా ఉంది అని ఆలోచించడు. దానివల్ల ఆ తెగులు ఇతర మొక్కలకు వ్యాపిస్తుంది అని భయపడి వెంటనే దాన్ని పీకేస్తాడు. చేనులోంచి తొలగిస్తాడు.’’ అలాగే మరో రైతు తాను పండించిన వరి ధాన్యాన్ని నూర్చి, తూర్పారబోస్తాడు. అప్పుడు తుక్కు ధూళి దూరంగా పోయి పడతాయి. కానీ, తాలుగింజలు, తప్పలు మంచి విత్తనాల రాశి పక్కనే పడతాయి. అప్పుడు ఆ రైతు ఇవి చూడ్డానికి మంచి గింజల్లానే ఉన్నాయని వాటిని రాశిలోకి నెట్టడు. పొలికట్ట (చీపురు) తీసుకుని వాటిని రాశికి దూరంగా ఊడ్చేస్తాడు. రాశి నుండి తొలగిస్తాడు’’. కాబట్టి... ఈ కణ్ణ భిక్షువు ఇక సంఘంలో పనికిరాడు. మారడు. ఇలాంటి వారు చాలా చాలా అరుదు. ఇతని వల్ల సంఘం మొత్తం నిందల పాలవుతుంది. కాబట్టి ఇతన్ని మీ సంఘం నుంచి బహిష్కరించండి’ అని చెప్పాడు. ఎలాంటి దోషాలు లేని ఒక వ్యక్తి కంటే కొద్దో గొప్పో దోషాలతో ఉన్నప్పటికీ సంఘమే గొప్పది అని చెప్పిన బుద్ధుడు గొప్ప ప్రజాస్వామ్యవాది. ఐక్యతకు మించిన బలం మరొకటి లేదని చెప్పిన సమైక్యతావాది. -
దశావతారాల్లో అమితాభ బుద్ధుడు
సాక్షి, హైదరాబాద్: దశావతారాల్లో అమితాభ బుద్ధుడి విగ్రహాన్ని వెయ్యేళ్ల కిందే ఓ దేవాలయంలో చెక్కిన తీరు అబ్బురపరుస్తోంది. బౌద్ధం జాడలు అరుదుగా కనిపించే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో, సరిగ్గా బుద్ధుడి 2,566 జయంతి సమయంలో కొంత లోతైన పరిశోధనా వివరాలు వెలుగుచూశాయి. జోగుళాంబ గద్వాల జిల్లా అలం పురంలోని పాపనాశేశ్వర, సూర్యనారాయణ ఆలయాల్లో బుద్ధుడి జాడలపై తాజాగా చరిత్ర పరిశోధకులు, ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పరిశోధించారు. ఈ దేవాలయాల్లో బుద్ధుడి జాడలపై గతంలో ప్రముఖ చరిత్ర పరిశోధకులు బీఎస్ఎల్ హనుమంతరావు పరిశీలించి వెలుగులోకి తెచ్చారు. ఆదివారం శివనాగిరెడ్డి వాటిని పరిశీలించి లోతుగా విశ్లేషించారు. పద్మాస నంలో, ధ్యానముద్రలో మహాపురుష లక్షణాలతో ఉన్న మూడడుగుల ఎత్తు, అంతే వెడల్పు, నాలుగు అంగుళాల మందంతో అర్ధ శిల్పరీతిలో చెక్కిన ఈ బుద్ధుడి శిల్పాలు చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. సూర్యనారాయణ ఆలయ రంగ మండపం కప్పు మీద విష్ణు దశావతారాల్లో భాగంగా చెక్కిన బుద్ధుడు, బోధివృక్షం కింద పద్మాసనంలో ధ్యానముద్రలో ఉండగా, పైన వింజామరతో విద్యాధరుడు ఉన్నట్టు కనిపిస్తోంది. అలంపురం ఊరి వెలుపల పునర్నిర్మించిన పాపనాశేశ్వరాలయ మహామండపం కప్పు మీద ఇదే నేపథ్యంలో ఉన్న బుద్ధుడి కుడి పక్కన బోధివృక్షం, ఎడమ పక్కన ఒక స్త్రీ శిల్పాలున్నాయి. వజ్రాయాన బౌద్ధంలో ఇలాంటి ప్రతిమా లక్షణం కలిగిన బుద్ధుడి రూపాన్ని అమితాభ బుద్ధుడిగా పేర్కొంటారు. ఈ విగ్రహాలపై పరిశోధన అవసరమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. -
అమితా ‘బుద్ధుడి’పై పరిశోధన
సాక్షి, హైదరాబాద్: పులికాట్ సరస్సులోని ఓ దీవిలో ఉన్న అమితాభ బుద్ధుడి రహస్యాన్ని ఛేదించేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులు పరిశోధన ప్రారంభిస్తున్నారు. ఏపీలోని నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం కుంతూరు పల్లె శివారులో నాలుగడుగుల బుద్ధుడి విగ్రహం చాలాకాలంగా ప్రశ్నార్థకంగా ఎదురుచూస్తోంది. తధాగతుడి రూపాల్లో అమితాభుడి అవతారం ఒకటి. ఆగ్నేయాసియా దేశాల్లో అమితాభ బుద్ధుడి ఆరాధన ఎక్కువ. పులికాట్ దీవిలో అమితాభ బుద్ధుడి విగ్రహం పరిశోధకులను ఆకట్టుకుంటోంది. మన దేశంలో ఈ తరహా శిల్పాలు అరుదు. ఈ ప్రాంతం ఇసుక దిబ్బలతో ఆర డుగుల ఎత్తుతో ఉంటుంది. దీంతో ఆ ప్రాంతంలో బౌద్ధ స్థూపం ఉండి ఉంటుందని భావిస్తున్నారు. గతంలో ఇక్కడ శాతవాహనుల కాలానికి చెందిన పెద్దపెద్ద ఇటుకలు వెలుగుచూశాయి. ‘1991 ప్రాంతంలో నేను శ్రీవెంకటేశ్వర వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో పరిశోధించి బుద్ధుడి విగ్రహాన్ని గుర్తించా. ఆ సమయంలో కొన్ని ఇటుకలూ వెలుగుచూశాయి. అవి క్రీ.శ. 1–2 శతాబ్దాల కాలానికి చెందినవిగా అనిపించాయి’అని హెచ్‌సీయూ ప్రొఫెసర్ డాక్టర్ కేపీరావు ‘సాక్షి’తో చెప్పారు. ‘ఏడాది క్రితం మళ్లీ కుంటూరుకు వెళ్లాం. బుద్ధుడి విగ్రహం అలాగే ఉంది. అక్కడి దిబ్బ ప్రాంతంలో ఈనెల 24 నుంచి దాదాపు నెలన్నరపాటు తవ్వకాలు జరపాలని నిర్ణయించాం’అని తెలిపారు. ఇటుక గోడ నిర్మాణ జాడలు ‘బుద్ధుడి విగ్రహమున్న ప్రాంతంలో గతంలో భారీ ఇటుకలతో గోడ ఉండేదని, కొందరు త వ్వి ఇటుకలు తీసుకెళ్లారని స్థానికులు చెప్పా రు. అమితాభ బుద్ధుడి శిల్పం ఇక్కడ ఎందుకుందో తవ్వకాల్లో తెలుస్తుంది. ఆగ్నేయాసియాతో ఈ ప్రాంతానికి సంబంధముందా కూడా తెలుస్తుంది’ అని కేపీరావు చెప్పారు. -
మనస్సు వడ్లగింజ లాంటిది..
మనస్సు వడ్లగింజ లాంటిది అన్నాడు బుద్ధుడు. బియ్యపుగింజల నాణ్యతల్ని చూడ్డానికి వడ్లగింజల్ని అరచేతులతో నలుపుతారు. అప్పుడు కొన్ని గింజలు చేతికి గుచ్చుకుంటాయి. కొన్ని గుచ్చుకోవు. కారణం వడ్లగింజకు ఒక చివర చిన్నసూదిలాంటి ముక్కు ఉంటుంది. అది గురిలో ఉంటే చర్మాన్ని ఛేదిస్తుంది. లేకుంటే తానే నలిగిపోతుంది. అలాగే గురిలో ఉన్న మనస్సు అవిద్యను, అజ్ఞానాన్ని ఛేదిస్తుంది. విజ్ఞానాన్ని అందిస్తుంది. మరి గురిలో లేని గింజ అవిద్యలో పడి నలిగిపోతుంది. అలాగే మనస్సు నీటి మడుగు లాంటిది అని కూడా అన్నాడు బుద్ధుడు. మడుగులో నీరు బురద బురదగా ఉంటే ఆ మడుగులో ఏమి ఉన్నాయో తెలియదు. ఎలాంటి మొక్కలున్నాయి, అడుగున ఏమైనా ముళ్ళూ రాళ్ళూ ఉన్నాయా, ఎలాంటి జలచరాలు ఉన్నాయి. ప్రాణాలు తీసే పాములు పట్టి మింగే మొసళ్ళు... ఏమి ఉన్నాయి, అసలు దాని లోతు ఎంత.. ఇవేవీ మనం తెలుసుకోలేం. అలాగే మన మనస్సు అకుశల (చెడ్డ) భావాలతో, ద్వేషం, మోసం, రాగం, మోహం, కామం, పగ, ప్రతీకారం, ఈర్ష్య, అసూయల్లాంటి దుర్గుణాలతో నిండి ఉంటే, ఆ మనసు కూడా మురికిగా ఉన్న మడుగులాంటిదే. దానివల్ల నష్టాలు, కష్టాలు, దుఃఖాలు, ఆవేదనలు, భయాలూ, అశాంతి అలముకుంటాయి. అవి ఆ మురికిలో పడి కనిపించకుండా కష్టాలు తెచ్చిపెడతాయి. మనల్ని అథోగతి పాలు చేస్తాయి. మరి, ఆ మడుగులోని నీరు తేటగా స్వచ్ఛంగా ఉంటే, అందులో ఏమేమి ఉన్నాయో అన్నీ కనిపిస్తాయి. మడుగు అడుగున ఉన్న ముళ్ళూ, రాళ్ళూ, మొక్కలూ తెలుస్తాయి. పాములూ, మొసళ్ళూ కనిపిస్తాయి. ఆ మడుగులోతు ఎంతో తెలుస్తుంది. కాబట్టి అలాంటి మడుగువల్ల ఎలాంటి ఆపదలు రావు. అలాగే మనస్సు కూడా నిర్మలంగా ఉంటే కామ, రాగ, మోహ, ఈర్ష్య పగలకు దూరంగా ఉంటాం. అప్పుడు మనస్సులో శాంతి ఉదయిస్తుంది. కుశల కర్మలు విప్పారుకుంటాయి. దుఃఖం లోతులు తెలుస్తాయి. అలాగే... మనస్సు చెట్టు కలపలాంటిది అని కూడా బుద్ధుడు చెప్పాడు. మంచి మనస్సు చందనవృక్షపు కలపలాంటిది. దానికి పరిమళం ఉంటుంది. ఆ కలప మెత్తగా ఉంటుంది. కావలసిన రూపంలోకి తేలిగ్గా మలచుకోవచ్చు. పెద్ద వస్తువులుగా చిన్న చిన్న వస్తువులుగానూ, తయారు చేసుకోవచ్చు. చక్కని శిల్పాలుగానూ, మలచుకోవచ్చు. ఇలాంటి మనస్సుగల మనిషి తనను తాను చక్కగా తేలిగ్గా సంస్కరించుకోగలడు. ఇలా మనస్సుని వడ్లగింజతో... మడుగుతో చెట్టు కలపతో పోల్చి గొప్ప సందేశంగా అందించాడు బుద్ధుడు. అందుకే ఆయన మహా మనో వైజ్ఞానికుడు. – బొర్రా గోవర్ధన్ -
పాక్‌లో బయటపడిన బుద్ధుడి విగ్రహం.. కానీ
ఇస్లామాబాద్ : బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడికి సంబంధించి పురాతనమైన విగ్రహం ఒకటి శనివారం పాకిస్తాన్లో బయటపడింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని మర్ధాన్ జిల్లాలో ఓ ఇంటి పునాదుల కోసం తవ్వకాలు జరుపుతుండగా కూలీలకు ప్రాచీన గౌతమ బుద్ధుడి విగ్రహం కనిపించింది. దీంతో స్థానికులు ముల్లా(మతపెద్ద)ని సంప్రదించారు. అయితే ఇస్లామిక్ బోధనలకు అనుగుణంగా లేదని సదరు విగ్రహాన్ని ధ్వంసం చేయాలని ముల్లా నిర్ణయించారు. అనంతరం విగ్రహాన్ని తొక్కుతూ, సుత్తితో ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. విగ్రహం బయటపడిన ప్రాంతం ఒకప్పటి గాంధార నాగరికతకు సంబంధించినదిగా చరిత్రకారులు చెబుతున్నారు. గౌతమబుద్దుడి విగ్రహాన్ని మతపరమైనదిగా చూడకుండా, కనీసం పురాతన విగ్రహంగా భావించి గౌరవిస్తే బాగుండని సామాజికమాధ్యమాల్లో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. పాకిస్తాన్లో మతపరమైన విషయాల్లో అసహనం శృతిమించుతుందనడానికి ఇదో ఉదాహరణ అని కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటన పాకిస్తాన్ టూరిజం శాఖ దృష్టికి వచ్చిందని అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. ఘటన జరిగిన ప్రాంతాన్ని తాము గుర్తించామని, నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని ఖైబర్- పఖ్తుంఖ్వా ఆర్కియాలజీ అండ్ మ్యూజియం డైరెక్టర్ అబ్దుల్ సమద్ చెప్పారు. ధార్మిక వికాసంతో కూడిన వ్యక్తిత్వమే నిజమైన వ్యక్తిత్వమని ఆచరించి, నిరూపించిన వాడు బుద్ధుడు. ప్రపంచంలోమొట్టమొదటగా మానవతా వాదాన్ని ప్రవేశపెట్టింది బౌద్ధమే! ప్రకృతిసిద్ధమైన సూత్రాలు మనిషిని నియంత్రింప చేస్తాయనీ, వాటిని అర్థం చేసుకుని, అవగతం చేసుకుని సాలోచనగా నడుచు కోవటం వలన సమాజ శ్రేయస్సు కలుగుతుందనీ బౌద్ధం చెబుతుంది. Disgusting intolerance in Pakistan. A life size statue of Lord #Buddha was discovered at a construction site in Takhtbhai, Mardan, KPK but before the Archaeologists could restore it, local Maulvi ordered to destroy it to pieces. Repeat of Bamiyan. God! 🤦♂️ pic.twitter.com/BMdVDGWjWN — Aditya Raj Kaul (@AdityaRajKaul) July 18, 2020 -
పాపమా? పుణ్యమా?!
శ్రావస్తి బౌద్ధ సంఘంలో విమలుడు మంచి భిక్షువు. బుద్ధుని ప్రబోధాల్ని చక్కగా ఆచరిస్తాడని పేరు. పంచశీల పాటించడంలో మేటి. ఒకరోజున ఒక అడవిమార్గంలో వెళ్తున్నాడు విమలుడు. అతని చెవికి ఒక జింక రోదన వినిపించింది. వెంటనే విమలుడు ఆ ఆర్తి, అరుపు వినిపించే వైపుకు నడక సాగించాడు. కొంతదూరం వెళ్లేసరికి అక్కడ ఒక జింక, దాని పిల్లలు కనిపించాయి.అవి తల్లి చుట్టూ తిరుగుతున్నాయి. అది గింజుకుంటూ మోర పైకెత్తి అరుస్తోంది. విమలుడు దగ్గరకి వెళ్లాడు. తల్లి జింక భయంతో మరింత బిగ్గరగా అరిచింది. పిల్ల జింకలు రెండూ దూరంగా పారిపోయాయి. ఎవరో వేటగాడు ఉచ్చులు పన్నాడు. ఆ ఉచ్చులో తల్లి జింక కాలు తగిలించుకుంది. అది ఎప్పటినుండి బలవంతాన లాక్కుంటోందో గానీ, ఆ ఉచ్చు మరింత బిగుసుకుపోయింది. కాలి చర్మం కూడా చీరుకుపోయి ఉంది. విమలుడు వెంటనే ఆ ఉచ్చు తొలగించాడు. తల్లి జింక విమలుడి వంక మెరిసే కళ్లతో చూస్తూ తన పిల్లల దగ్గరకు గెంతుతూ అరుస్తూ వెళ్లిపోయింది. ఈసారి దాని అరుపులో ఆనందం వినిపిస్తోంది. విమలుడు వాటివైపు చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయాడు. అంతలో.. అతని వెనుకనుండి... ‘‘ఓరీ! బోడిగుండూ! దుర్మార్గుడా! ఎంత పని చేశావు?’’అనే అరుపు వినిపించి వెనక్కి తిరిగాడు. వేటగాడు కోపంతో తన దగ్గరకు వేగంగా వస్తున్నాడు. ‘‘నేను ఆహారం కోసం ఉచ్చులు పన్నాను. నాకు దొరికిన ఆహారాన్ని నాకు కాకుండా చేశావు. నీవు చేసిన ఈ పనివల్ల ఈ రోజు నా కుటుంబం పస్తుండాలి. మా నోటికాడ కూడు తీసిన పాపం నీదే...’’ అని తిట్టుకుంటూ ఉచ్చులు తీసుకుని భిక్షువు వంక చుర చుర చూస్తూ చరచరా వెళ్లిపోయాడు. విమలుడు దారిలోకి వచ్చి ఆలోచిస్తూ నడక ప్రారంభించాడు. ‘‘నేను పాపం చేశానా?పుణ్యం చేశానా?’’ అనే సందేహంలో పడ్డాడు. ఆరామానికి వచ్చి, బుద్ధుని దగ్గరకు వెళ్లి, నమస్కరించి, విషయం చెప్పాడు. ‘‘విమలా! నీవు చేసింది పాపం కాదు. జీవ కారుణ్యానికి మించిన ధర్మం లేదు. నీవు శీల భ్రష్టుడివి కావు. నిందితుడివి కావు’’ అని మెచ్చుకున్నాడు.ఒక మంచిపని చేయడం వల్ల కొందరు నిందించినా బాధపడకూడదని విమలునికి అర్థమైంది. – డా. బొర్రా గోవర్ధన్ -
బౌద్ధ వర్ధనుడు
వైశాఖ పున్నమి రోజున పుట్టిన సిద్ధార్థుడు తన పదహారో ఏట యశోధరను వివాహమాడాడు. ఆయనకు 29వ ఏట సంతానం కలిగింది. రాహులుడు పుట్టాడు. ఆ బిడ్డ పుట్టిన కొన్నాళ్లకే ధర్మమార్గాన్ని, దుఃఖ నివారణ మార్గాన్నీ వెతుక్కుంటూ, తల్లిదండ్రులని, భార్యాబిడ్డల్నీ, మిత్రుల్నీ, అన్నదమ్ముల్నీ, ఆస్తిపాస్తుల్నీ రాజ్యాధికారాన్నీ వదిలి వనాలకు వెళ్లిపోయాడు. ఆరేళ్లు అనేక చోట్ల తిరిగి, అనేకమందితో చర్చించి చివరికి వైశాఖ పున్నమి నాడే బోధగయలోని రావి చెట్టుకింద జ్ఞానోదయం పొందాడు. దుఃఖ నివారణ మార్గాన్ని ఆవిష్కరించాడు. ఆ తర్వాత సారనాథ్‌లో తొలిసారిగా ఐదుమంది అనుయాయులతో బౌద్ధ సంఘాన్ని స్థాపించాడు. కొద్ది నెలల్లోనే ఆ సంఘం మహా సంఘంగా విస్తరించింది. ఎందరో వేలాదిమంది ఆ సంఘంలో చేరారు. ఎవరో తాత్వికులు కాదు. గృహస్థులు కూడా. రాచకుటుంబాలకు చెందినవారు, వ్యాపారులు, పనీపాటలు చేసే కూలినాలీ జనం, అంటరాని కులాలవారు– అందరూ సంఘంలో చేరారు. నదులు సముద్రంలో కలిసి తమ ఉనికిని కోల్పోయినట్లు సంఘంలో చేరిన వారంతా తమ తమ కులం, గోత్రం, నామం, ప్రాంతీయతలు అన్నింటినీ కోల్పోయారు. బౌద్ధ సంఘంలో అందరూ సమానులే! అందరూ భిక్షాటన మీదే బతకాలి. అందరూ కాషాయ చీవరాలే ధరించాలి. నేలమీదే నిద్రించాలి.ఈ నిరాడంబర జీవితానికి, సంఘంలో చేరి బంధువులుగా గడపడానికీ బుద్ధుడు చెప్పిన ధర్మవ్యక్తికి తమ వంతు కర్తవ్యాన్ని జోడించడానికి అందరిలాగే .. బుద్ధుని కుటుంబ సభ్యులు, శాక్యరాజ్యం వంశీకులు దాదాపుగా అందరూ ముందుకొచ్చారు. వారిలో మొదటివాడు ఆయన తండ్రి శుద్ధోదనుడే!శాక్యరాజవంశంలో ప్రముఖులు ఐదుగురు. వారు శుద్ధోదనుడు, అతని నలుగురు సోదరులు శుక్లోదనుడు, శాక్యోదరుడు, ధోతోదనుడు, అమితోదనుడు. వారికి ఒక చెల్లి, అమితాదని. ఐదుగురు అన్నదమ్ములకూ ఎనిమిది మంది సంతానం. సిద్ధార్థుడు, నందుడు, ఆనందుడు, మహానాముడు, అనిరుద్ధుడు, భద్దియడు, భాడవుడు, కింబిలుడు.అమితాదనికి ముగ్గురు సంతానం. తిష్యుడు, దేవదత్తుడు, యశోధర.వీరిలో తొలుత బుద్ధోపదేశం విని బౌద్ధాభిమానిగా మారిన తొలి వ్యక్తి శుద్ధోదనుడే!సిద్ధార్థుడు జ్ఞానం పొంది బుద్ధుడయ్యాక శుద్ధోదనుడు తమ నగరం కపిలవస్తుకు రమ్మని బుద్ధుని బాల్యమిత్రుడు కాలు ఉదాయితో కబురు పెడతాడు.బుద్ధుడు కపిలవస్తు నగరం వదిలిన తర్వాత ఏడేళ్లకు తిరిగి అక్కడికి వెళ్తాడు.అనారోగ్యంతో మంచి పట్టిన తండ్రికి ధర్మోపదేశం చేస్తాడు. ఆ ఉపదేశంతో ఆయనలో అంతకుముందు ఉన్న దుఃఖం తీరిపోతుంది. తననూ బౌద్ధునిగా అనుమతించమని వేడుకుని నమస్కరిస్తాడు తండ్రి. అలా శుద్ధోదనుడు శాక్యవంశ తొలి బౌద్ధ ఉపాసకుడయ్యాడు. ఆ తర్వాత యశోధర తన ఏడేళ్ల బిడ్డను బుద్ధుని దగ్గరకు పంపుతుంది. ‘వారే నీ తండ్రిగారు. నీకు రావలసిన ఆస్తి, అధికారానికి సంబంధించిన హక్కుల్ని అడిగి తెచ్చుకో’ అని రాహులుణ్ణి బుద్ధుని దగ్గరకు పంపుతుంది యశోధర.‘‘నాయనా! నాకున్న ఆస్తి ఇదే’ అని ఏడేళ్ల కొడుకు చేతిలో భిక్షాపాత్ర పెడతాడు బుద్ధుడు. ‘‘నాకుంది ధర్మాధికారమే. అది నీవూ గ్రహించు’’ అని బౌద్ధసంఘంలో చేర్పించుతాడు. అలా తొలి బౌద్ధ సంఘం బాలభిక్షువు రాహులుడయ్యాడు!ఆ తర్వాత బుద్ధుని మిత్రుడు కాలు ఉదాయి, అతని సోదరులు, మేనత్త బిడ్డలు దాదాపుగా కాస్త వెనకాముందుగా అందరూ బౌద్ధసంఘంలో చేరి భిక్షువులుగానే జీవితాంతం జీవించారు.తన భర్త శుద్ధోదనుడు మరణించాక సిద్ధార్థుని పెంచిన తల్లి, పిన్నమ్మ గౌతమి కూడా కపిలవస్తు నుండి రాజగృహకు కాలినడకన వెళ్లింది. తనతోపాటు కోడలు యశోధరను, మిగిలిన కోడళ్లనూ, మరికొంతమంది శాక్య స్త్రీలనూ వెంటబెట్టుకుని వెళ్లింది.‘తమకూ భిక్షుసంఘంలో అర్హత కల్పించమని అడిగింది.బుద్ధుడు అందుకు అనుమతించి తొలిగా తన తల్లినే భిక్షుణిగా మార్చాడు. భిక్షుణీ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అలా బౌద్ధభిక్షువుగా మారిన తొలి మహిళా మూర్తి గౌతమే!శాక్యవనం ఆస్థాన క్షురకుడు ఉపాలీ, రథచోదకుడు చెన్నుడూ– ఎందరెందరో బౌద్ధ సంఘంలో చేరారు. ఉపాలికి ఎంత గౌరవ సంస్కారం దక్కిందంటే బుద్ధుని పరినిర్యాణం తర్వాత మూడు నెలలకి ఏర్పాటైన మొదటి బౌద్ధ సంగీతికి అధ్యక్షుడు ఆయనే!తానా కాకుండా తన కుటుంబాన్ని, తన శాక్యవంశాన్ని మొత్తం రాచరిక వ్యవస్థ నుండి బైటకు రప్పించి ధర్మమార్గంలో నడిపించిన ఆదర్శ దార్శనికుడు గౌతమ బుద్ధుడే!బుద్ధుని జీవితంలో గొప్ప విశేషమేమిటంటే ఆయన లుంబినీవనంలో పుట్టిందీ, బుద్ధగయలో బుద్ధత్వం పొందిందీ, చివరకు కుసీనగరంలో నిర్వాణం చెందిందీ వైశాఖ పున్నమి రోజునే! అందుకే ఈ వైశాఖ పున్నమి ఒక బుద్ధ జయంతి... ఒక బుద్ద వర్ధంతి! అంతేకాదు.. యశోధర జయంతి కూడా ఈనాడే! – డా. బొర్రా గోవర్ధన్ బుద్ధుణ్ణి సంసార చక్ర విధ్వంసకుడు అంటారు. సుఖదుఃఖాల గానుగ మరలాంటి సంసార చక్రాన్నుండి మానవాళిని బైట పడేసి, రక్షించిన ధార్మికునిగా బుద్ధుని కీర్తిస్తారు. కుటుంబం, వ్యక్తిగత ఆస్తి, రాజ్యం, పదవి, అధికారం, శాసనం, యుద్ధం... ఇవన్నీ ఒకే ఒరలో దాగిన రకరకాల కత్తులు. వీటివల్ల హింస, ఉన్మాదం కలిగి చివరికి దుఃఖ సాగరంలో మునిగిపోతుంది మానవ జీవితం. ఈ దుఃఖ మహాసాగరాన్నుండి బైటకు వచ్చి, యోగం, ధ్యానం, సమాధి, ఇలాంటి స్థితుల్ని సాధించి ముక్తి, కైవల్యం లేదా నిర్వాణ మార్గాన సాగితే శాశ్వతంగా దుఃఖం నుండి మనిషి విముక్తుడవుతాడని భారతదేశంలో పుట్టిన అనేక తాత్త్విక సిద్ధాంతాలు చెప్పాయి. వాటిలో బౌద్ధం కూడా ఒకటి. దుఃఖ నివారణ మార్గంలో నిర్వాణాన్ని అది చెప్పింది. సంసారాన్ని త్యజించి భిక్షువులుగా, సంసారంలోనే ఉంటూ, ఉపాసకులుగానూ ఈ నిర్వాణ స్థితుల్ని పొందవచ్చునని బుద్ధుడు చెప్పాడు. దుఃఖ నివారణ మార్గాన్ని అనుసరించే వారందరికీ ఒక సంఘాన్ని స్థాపించాడు. అదే బౌద్ధ సంఘం. ఆ సంఘంలో చేరి ధర్మాచరణ ద్వారా, ధర్మాన్ని ప్రచారం చేసే వారే భిక్షువులు. వీరికి కుటుంబం ఉండదు. ఆస్తిపాస్తులుండవు. వ్యక్తిగత వస్తువులు ఉండవు. అన్నీ సంఘానివే. అన్నీ ఉమ్మడివే! నియమ నిబంధనల రూపకల్పనలో కూడా ఉమ్మడి నిర్ణయమే తుది నిర్ణయం. -
ఫణిగిరి బుద్ధప్రతిమను పరిశీలించిన శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రమైన ఫణిగిరిలో వెలుగుచూసిన అరుదైన బుద్ధ విగ్రహాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు. రాష్ట్ర పురావస్తు శాఖ మ్యూజియంలో భద్రపరిచిన భారీ గార ప్రతిమను (డంగు సున్నంతో రూపొందించిన) సోమవారం మ్యూజియానికి వెళ్లి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో చరిత్ర ఉందని, ఆదిమానవుని అవశేషాలు రాష్ట్రంలో చాలా చోట్ల వెలుగు చూశాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో పురావస్తు శాఖ రాష్ట్రంలోని చారిత్రక ప్రదేశాల్లో తవ్వకాలు జరిపి చరిత్ర అవశేషాలను వెలికితీయటం అభినందనీయమన్నారు. దేశంలో ఇప్పటివరకు రెండు అడుగుల పరిమాణంలో ఉండే సున్నం ప్రతిమలు లభించాయని, ఆరు అడుగుల పొడవుతో డంగు సున్నంతో రూపొందించిన ప్రతిమ వెలుగుచూడడం క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దానికి చెందినట్లుగా భావిస్తున్నామని శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. -
నింబవృక్షం పాదుకా ప్రతిష్ఠావిశేషాలు
వట వృక్షానికి గొప్పదనం కృష్ణుడు దాన్ని ఆశ్రయించినందు వల్ల. బోధి వృక్షానికి గొప్పదనం బుద్ధుడు తపస్సుని దాన్ని ఆశ్రయించి చేసినందువల్ల. మద్ది (పాల) చెట్లకి గొప్పదనం రామచంద్రుడు ఆ జాతికి చెందిన 7 చెట్లని వధించి తన శక్తిని నిరూపించుకుని సుగ్రీవునితో సఖ్యాన్నిపొంది రావణవధకి అవకాశాన్ని ఏర్పరచుకున్నందువల్ల. శింశుపావృక్షానికి గొప్పదనం సీతమ్మ ఆ వృక్షాన్ని ఆశ్రయించి దాదాపు సంవత్సర కాలం ఉన్నందు వల్ల. నైమిశారణ్యానికున్న గొప్పదనం ఇలాంటి అనేక వృక్షాలతో కూడిన ఆ అరణ్యాన్ని ఆశ్రయించుకుని సూతమహర్షి ఉంటూ శౌనకుడూ మొదలైన మహర్షులకి అనేక పురాణేతిహాసాలని బోధించి నందువల్ల. పూవులు చిన్నవి అవుతూనూ, ఆకర్షణ ఏ మాత్రమూ లేకపోతూనూ, వాసన ఏ మాత్రమూ లేకుండానూ, కాండమంతా జిగురు కలిగిన కారణంగా ఏ ఒక్కరికీ ఆశ్రయాన్ని ఈయలేకపోతూనూ, తన ముళ్లు నేల మీద పడుతూ ఉండే కారణంగా ఎవరినీ తన దగ్గరికి రానీయకుండా చేసుకుంటూనూ, ఎలాగో వచ్చినా తన మీద నిరంతరం సంచరిస్తూ ఉండే నల్ల చీమల కారణంగా ఎవరికీ ఆశ్రయాన్నీయలేకపోతూనూ కనిపించే తుమ్మచెట్టుక్కూడా ఉన్న గొప్పదనం – ఎవరికీ ఇష్టం ఉండని భూత ప్రేత పిశాచ సంతతిని తన మీద ఉంచుకుంటూన్నందువల్ల. ఇలా ప్రతి వృక్షానికీ ఓ గొప్పదనం ఉంటూ ఉంటే అలా ఆ వృక్షాన్ని కేవలం ఆశ్రయించి ఉండటమే కాక, దాన్ని తీపిదనం కలదాన్నిగానూ, కోరికల్ని తీర్చే శక్తీ ఉన్నదిగానూ మార్చివేయడం ఎంత ఆశ్చర్యకరం! ఆనందదాయకం!! సాయి ఆ చెట్టుకింద దక్షిణ భాగంలో కూచుండే వాడు. ఆ కారణంగా దక్షిణపు వైపు ఆకులన్నీ తీపిదనంతో ఉంటూ ఉండేవి. ప్రతి వస్తువుకీ సహజలక్షణమంటూ ఒకటుంటుంది. సముద్రానికి కెరటాలతో ఉండటం, నిప్పుకి మండేతనం ఉండటం, వర్షానికి తడిసేలా చేసే గుణం, చలికి వణుకు పుట్టించేతనం ఉండటం ఎలాగో అలా, వేపకి చేదుతనమనేది సహ+జం(తనతో పుట్టిన గుణం) దాన్ని సాయి తాను కూర్చున్న కారణంగా మార్చేసాడనే విషయం లోకానికర్థం కావాలనుకుంటూ ఉపాసనీ మహారాజ్ శ్లోకాన్ని ఇంతర్థం వచ్చేలా రాశాడు. కేవలం ఆ చెట్టుని మార్చేసాడనేది దాని భావం కాదు. లోకంలో ఎందరో వేపచెట్లలా ఏ విధమైన ప్రయోజనమూ లేనివాళ్లుగా జీవిస్తూ ఉంటే, ఆ అందరినీ తనని ఆశ్రయిస్తే చాలు ప్రయోజనం కలిగిన వాళ్లుగా చేశాడనేది మరో లో అర్థం. అంతేకాదు. ఎందరో ఎందరో నిరుత్సాహంతో అణగారిన ఆశలతో ప్రాణాన్ని తీసుకోవాలనే ఆలోచనతో వచ్చి సాయిని ఆశ్రయించుకున్నారు కూడా కదా! అలా మార్చేసిన లక్షణం కలవాడు సాయి –అనే అర్థం లోకానికి తెలియాలనే ఉపాసనీ మహారాజ్ శ్లోకాన్ని ఇలా రాశాడు. లోగడ మనం చదువుకున్న ఘట్టాల్లో అనేక విధాలుగా రక్షింపబడ్డవాళ్లూ, ఆత్మహత్యలని విరమించుకున్నవాళ్లూ, తమ ప్రవర్తనలోని దోషాలని గమనించుకున్నవాళ్లూ.. ఇలా ఎందరెందరు రాలేదు! అదుగో ఆ ఉదాహరణలన్నీ కళ్లకి కట్టినట్టుగా వివరించగల శ్లోకం ఇది! కాబట్టి పాదుకల్ని చూస్తూ చేతిలో స్పృశిస్తూ ఆ పాదుకల మీద అరచేతులతో బలంగా రుద్దేస్తూ కనిపిస్తారు ఎందరో భక్తులు. ఇంక కొద్ది భక్తులైతే ముద్దులు పెట్టడం వంటి కొన్ని చేష్టల్ని కూడా చేస్తూ కనిపిస్తారు. అది సరికాదు. పాదుకల్ని స్పృశిస్తూ ఆ పాదుకలు తమ శిరసు మీద సాయినాథుడు ఉంచినట్లు భావిస్తూ పైన అనుకున్న శ్లోకాన్నే ధ్యానించుకుంటూ ఆ సాయినాథుని కారణంగా ఆ వేపచెట్టు ఎంత గొప్పది కాగలిగిందో ఆ చరిత్రని తెలుసుకుంటూ ఆ గొప్పదనమే తనకీ కలిగేలా చేయవలసిందని హృదయపూర్వకంగా ప్రార్థించాలి. అది మాత్రమే పాదుకాదర్శన కాలంలో చేయవలసిన పని. ఇంతటి గొప్పదనం తమలో దాగి ఉన్న ఆ పాదుకల ప్రతిష్ఠ ఎలా అయిందో, పాదుకలకి మాత్రమే ఆ గొప్పదనం ఎందుకుంటుందో ఇక తెలుసుకుందాం!ఎన్నెన్నో దైవక్షేత్రాలున్నాయి లోకంలో. అయితే అయోధ్య, మధుర, మాయాపురి, కాశీ, కంచి, అవంతి, ద్వారక అనే ఏడింటికే మోక్షాన్నిచ్చే క్షేత్రాలున్న పురాలుగా గుర్తింపు వచ్చింది. ధర్మస్వరూపుడనే పేరు (రామో విగ్రహవాన్ ధర్మః) ఆ రామచంద్రునికి మాత్రమే సొంతమయింది. ఎందరెందరో అవతారమూర్తులున్నారు భక్తి సామ్రాజ్యంలో. అయితే భగవానుడనే మాట (కృష్ణ స్తు భగవాన్ స్వచుమ్) కేవలం కృష్ణునికే వచ్చింది. అదే తీరుగా పర్వతాలెన్ని ఉన్నా హిమాలయానికీ, నదులెన్ని ఉన్నా గంగకీ.. ఇలా కొన్నింటికి మాత్రమే గుర్తింపు, ప్రాధాన్యత రావడానికి కారణమేమిటని ఆలోచిస్తే ఆశ్చర్యకరమైన విశేషాలు గోచరిస్తాయి.లౌకికం – అలౌకికంఏ విధంగానూ లోలోతు పరీక్షలని చేయకుండా కేవలం భౌతిక దృష్టితో చూడటమనేది ఏదైతే ఉందో దాన్ని లౌకికదర్శనం అంటారు. ఓ చెట్టుని చూస్తే అది ఎంత ఎత్తుంది? ఎంత లావైన కాండాన్ని కలిగి ఉంది? ఎన్నాళ్ల వయసుదానికి?... ఈ తీరు వివరాల సేకరణ లౌకికం. అదే మరి ఆ చెట్టు కింద ఏ యోగి కూర్చుంటూ ఉండేవాడు? పెద్ద గాలివాన వచ్చి అన్ని చెట్లు పడిపోయినా కూడా.. ఆ చెట్టే ఎందుకు పడిపోకుండా నిలవగలిగింది? చెట్టు మొదట్లో ఉన్న పాముపుట్టని ఎందరు దర్శించి పూజిస్తూ ఉండేవాళ్లు! ఆ తీరు అర్చనలు ఎన్నేళ్ల నుండి సాగుతూ వస్తున్నాయంటూ ఆలోచించడం, తెలుసుకోవడం ఏదైతే ఉందో అది అలౌకిక దర్శనం. భారత దేశానికి అప్రాచ్యుడు (పశ్చిమ దేశాల వాడు) వచ్చాక మనందరికీ వాడు నేర్పింది కేవలం లౌకిక దర్శనాన్ని మాత్రమే. దాంతో అలౌకిక దర్శన దృష్టితో ఎవరు మాట్లాడినా దాన్నంతటనీ – ‘చాదస్తం, మూఢవిశ్వాసం, పిచ్చితనం’ – వంటి మాటలతో మనం కొట్టిపడేసే తీరు అలవాటైపోయింది మనకి. అయితే ఒక్కసారి తలని మరో వైపుకి తిప్పి దృష్టిని మరో తీరుకి మళ్లించి చూస్తే చాలు – అలౌకికదర్శనం మనకి అబ్బి తీరుతుంది. ఇదంతా ఎందుకంటే ఆ తీరు అలౌకిక దృష్టితో చూడలేని పక్షంలో ద్వారకామాయి అనేది ఒక మసీదులాగా, సాయి కేవలం ఒక మహమ్మదీయునిగా, షిర్డీ అనేది ఒక ప్రసిద్ధ ఆలయమున్న ప్రదేశంలాగా, ఆయన్ని సేవించినవారంతా కేవలం భక్తులనే జాతికి చెందిన మనుషులుగా మాత్రమే కనిపిస్తారు. అలా కాక అలౌకిక దృష్టితో పరిశీలించినప్పుడు మాత్రమే ఈ పాదుకలూ – వాటి గొప్పదనమూ మనకి అర్థమవుతుంది. కానీ పక్షంలోనూ అప్రాచ్యదృష్టితోనూ చూస్తే పాదుకలు కేవలం ‘చెప్పులు’గానే కనిపిస్తాయి. కాబట్టి ఆ తీరు అలౌకిక దర్శనానికి కదులుదాం! అక్కల్కోట నుండి షిర్డీకా? అమృతాన్నైనా సరే చిల్లు ఉన్న పాత్రలో పోస్తే.. ఎలా చుక్క చుక్క చొప్పున తరిగిపోతూ కొంతసేపటికి మొత్తం శూన్యమైపోతుందో.. అలాగే తపశ్శక్తిని సాత్త్వికంగా గానీ, రాజసంగా గానీ సంపాదించినా మళ్లీ అసూయ, పగ, ద్వేషం అనే వీటిని ప్రదర్శిస్తే తపశ్శక్తి కాస్తా ఒకనాటికి క్షీణించిపోతుంది. మళ్లీ ఆ శక్తి రావాలంటే... పోయిందాన్ని పూరించాలంటే మళ్లీ తపస్సుని చేసి ఆ లోటుని పూరించాల్సిందే.ఇదంతా ఎందుకంటే, సాయిది ఏనాడూ పగ, ద్వేషం, అసూయ అనేవి ఏ కోశానా లేకుండా సాధించిన తపస్సుతో కూడిన శక్తి మాత్రమే అని చెప్పడం కోసమే.అక్కల్కోటలో మహారాజ్ గారు ఉన్నంతవరకూ ఆ తపశ్శక్తి అనేదాన్ని శూన్యం కాకుండానూ, లేదా తగ్గిపోతూ ఉండకుండానూ ఆయన తపస్సు చేసి నింపుతూ ఉండేవారు. వారి పిమ్మట ఆ శక్తిని నింపగల శక్తి, సమర్థత కలవారు దాదాపుగా లేకపోయారు. ఆ విషయాన్ని గమనించిన అక్కల్కోట(కర్) మహారాజ్ కృష్ణజీ అనే ఆయనకి న్రిత్యం అక్కల్కోటకి అతి భక్తి శ్రద్ధలతో నిర్వా్యజంగా (ఈ పని అయితే ఇక్కడికొస్తాననే తీరు బుద్ధితో కాకుండా) వచ్చి దర్శించే వ్యక్తి కలలో కనపడి – నువ్వు షిర్డీకి వెళ్లు! నేను అక్కడున్నాను’ అని చెప్పాడు. అంటే ఇక్కడ ఉన్నంత పవిత్రతా తపశ్శక్తి స్థితీ ప్రస్తుతం షిర్డీలో కనిపిస్తున్నాయని పరోక్షంగా చెప్పడమనే దానర్థం. దాంతో కృష్ణజీ షిర్డీకే వచ్చాడు. ఇంతకాలమూ తాను దర్శిస్తూ ఉన్న అక్కల్కోట శక్తి ఇక్కడ షిర్డీలో ఉన్నదీ లే నిదీ గమనిస్తూ.. ప్రతినిత్యం అంతటి శక్తి అనుభవాన్ని పొందుతూ.. ఆనందంగా జీవిస్తూ.. ఒకటి కాదు రెండు కాదు 6 నెలల పాటు షిర్డీలోనే ఉండిపోయాడు. అందుకే అక్కల్కోట నుండి తన రాకపోకలు షిర్డీకే సాగించదలిచాడు ఈ భక్తుడు.మొదట్లో అక్కల్కోట మహారాజ్లోనే స్థిరంగా ఉన్న ఆ తపశ్శక్తీ ఆకర్షణా క్రమంగా వారి పిమ్మట వారి చిత్రపటంలోకీ ఆ పిమ్మట అక్కడున్న మహారాజ్గారి పాదుకలలోకీ ప్రవేశించాయి. ఆ మీదట అక్కడి పాదుకలలోనికి ఆ శక్తిని ఆ స్థాయిలో పూరించగలవారు లేకపోయిన కారణంగా, ఆ స్థాయి శక్తి ఉన్న క్షేత్రంగా అక్కల్కోట మహారాజ్ గారే షిర్డీని నిర్ణయించిన కారణంగా మొత్తం తపశ్శక్తి అంతా షిర్డీకి చేరిపోయిందన్నమాట. ఇది అలౌకిక దృష్టితో ఆలోచించడమంటే. పాదుకలు ఈ స్థితిలో కృష్ణజీ ఆలోచించాడు ఈ షిర్డీ ఇంతటి పవిత్రత కలిగినది కాబట్టీ, ఆ విషయాన్ని అక్కల్కోట మహారాజ్ గారే నిర్ణయించి చెప్పారు కాబట్టీ, ఆ శక్తిని చిరకాలం స్థాపించి ఉంచడం కోసం– పాదుకలని అక్కడ అక్కల్కోటలో స్థాపించిన తీరుగా ప్రతిష్ఠించాలని. ఇదే విషయాన్ని తనతో పాటు సమానస్థాయి కల భక్తి విశ్వాసాలున్న మిత్రులతో సంప్రదించాడు. వాళ్లూ అంగీకరించారు మొదటి మాటతోనే– మొదటి మాటలోనే. ‘ఏకైకస్యాపి నిర్ణయాభ్యుపగమో దోషాయ భవతి’ అని సంస్కృతంలో ఓ మాట. ‘ఎంతగా తానాలోంచినా, ఎంతగా దాన్ని పరిశీలించి తప్పుకాదని అనుకున్నా కూడా, ఏ విషయాన్నీ ఒక్కనిగా ఉంటూ ఓ నిర్ణయాన్ని చేస్తే తప్పక అందులో దోషం ఉండి తీరుతుందని దాని భావం. ఆ కారణంగా కృష్ణజీతో పాటు మిగిలిన అందరూ కలిసి మంత్రోపాసన నిరంతరం చేస్తూ ఉండేవారూ – లౌకిక దృష్టి ఏ మాత్రమూ లేనివారూ అయిన ఉపాసనీ మహారాజ్ (పేరులోనే ఉంది ఆయన మంత్రోపాసనలో ఎంత ప్రసిద్ధిని పొందినవాడో) గారికి ఈ పాదుకా ప్రతిష్ఠ ప్రతి పాదనని తెలియజేస్తూ తమ బుద్ధికి తోచిన విధంగా పాదుకల నమూనాని వారి ముందుంచారు. అంతే! ఆ ఉపాసనీ మహారాజ్ గారు ఆ పాదుకల్లో ఉండబోయే తపశ్శక్తినీ, పాదుకలనీ, రాబోయే ఖ్యాతినీ మానసికంగా తమ బుద్ధితో గ్రహించి– వీటిని ప్రతిష్ఠించడం ఎంతో గొప్పవిషయం, అంతే కాక తగిన విధంగా గౌరవించడమే అని భావించి వెంటనే ఆ పాదుకల్లో శంఖం, చక్రం, గద, పద్మం అనే నాల్గింటినీ కూడా చేర్చారు. శంఖమనేది ధ్వనిని పుట్టించేది కాబట్టి ధ్వనిని పుట్టించగల శక్తి ఆకాశానిది కాబట్టీ (శబ్ధగుణక మాకాశమ్) ఆకాశశక్తి ఈ పాదుకలలో ఉంచదలిచారన్నమాట. దాంతో ఆకాశంలో ఉండే సర్వగ్రహాలూ ఈ శంఖం గుర్తులో ఉన్నాయని పరోక్షంగా తెలియజేయడమన్నమాట. ఆ కారణంగానే పాదుకలని భక్తి విశ్వాసాలతో నమస్కరిస్తే చాలు గ్రహబాధలు తొలుగుతాయి, తొలుగుతున్నాయి.ఇక చక్రమనేది కాల చక్రానికి (నడుస్తున్న కాలగతి జీవితం) సంకేతం. అందుకే ఈ చక్రం వాటిలో ఉన్న పాదుకలకి నమస్కరిస్తే చాలు జీవితగమనంలో వచ్చే ఒడిదుడుకులు సర్దుకుంటాయి – సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి – లభిస్తున్నాయి.ఇక గద అనేది శత్రుసంహారానికి సంకేతం. ఈ చిహ్నం వాటిలో ఉన్న పాదుకలకి నమస్కరిస్తే మనని శారీరకంగా మానసికంగా బాధపెడుతూ ఉండే ఆ శత్రువులు దూరంగా వెళ్లిపోతారు.నిరంతరం మానసికక్షోభ తొలిగిపోతుంది. తొలిగిపోతుంది కూడా.ఆ మీదట పద్మమనేది ప్రశాంతతకీ బుద్ధి వికాసానికీ సంకేతం. గ్రహబాధలు శంఖం ద్వారా, శత్రుబాధలు గద ద్వారా తొలిగిపోయాక ఇక వ్యక్తికి ఉండేదీ కలిగేదీ మనశ్శాంతే కదా! ఆ మనశ్శాంతికి సంకేతం పద్మం. అలాగే ఇన్ని అనుభవాలు కలిగాక వ్యక్తి ఏవిధంగా జీవించాలో చెప్పగల బుద్ధి వికాసమనేది కూడా పద్మం ద్వారానే కలుగుతుందని చెప్పడం దీని లోభావం(అంతరార్థం).ఇంతటి అర్థవంతమైనవి పాదుకలనే దృష్టితో ఆలోచనతో ఉపాసనీ మహారాజ్ వారు పాదుకలకి ఈ చిహ్నాలని జతచేశారు. ఇంతటి తపశ్శక్తీ ఇన్ని తీరుల ఇబ్బందుల నివారణలూ కలిగేలా పాదుకలని ఏర్పాటు చేసినా కూడా ఆ ఉపాసనీ మహారాజ్ గారికి సంతృప్తి కలగలేదు. ఏదో ఓ లోటు అనిపించనే అనిపించింది. దాంతో సాయికి ఏ అమోఘమైన తపశ్శక్తి అనేది లభించడానికి వేపచెట్టు సాక్షిగా ఉందో, ఆ వేపచెట్టు ఏ ద్వారకామాయికి దక్షిణ ప్రదేశంలో ఉందో, అంతేకాక సాయి నిరంతరం (12 ఏండ్ల పాటు) తపస్సులో గడిపిన గురుస్థానం సమీపంలో ఉందో ఆ విశేషం లోకానికి భక్తజనానికి) తెలియాలనీ తెలియజేయాలనీ భావించిన ఉపాసనీ మహారాజ్ ఆ వేపచెట్టు శక్తినీ, దానికి సాయి కలిగించిన అసాధ్యశక్తినీ (తియ్యదనం కోరికలు తీర్చేతనం..) బహిరంగపరుస్తూ ఓ శ్లోకాన్ని చెక్కించి ఆ ఫలకాన్ని కూడా ఆ పాదుకలవద్దే ఉంచాలని నిర్ణయించారు. నిజానికి ఆ పాదుకలూ వాటిలో ఈ చిహ్నాలు, ఆ శ్లోకమూ గనుక ఉండని పక్షంలో ఇన్ని విశేషాలు లోకానికి తెలిసుండేవా? మహాత్ములది ఎప్పుడూ లోకాన్ని అనుగ్రహించాలనే దృష్టి– దాంతో పాటు ఆ అనుగ్రహం లోకాన్ని అనుగ్రహించాలనే దృష్టి – దాంతో పాటు ఆ అనుగ్రహం ఎలా లభిస్తుందో ఆ ఉపాయాన్ని అందరికీ వివరించి చెప్పాలనే దృష్టీను. ఆ కారణంగా పాదుకలని ఇంతటి లోభావం కల దృష్టితో మనం దర్శించాలన్నమాట. చాలా మంది భక్తులు పాదుకల మీద అరచేతుల్ని పెట్టి అరగదీస్తూ, తలని వాటికి మోదుకుంటూ, ఇంకకొందరైతే చుంబిస్తూ... ఏమేమో చేసేస్తుంటారు. పాదుకా దర్శనం అనుగ్రహాన్ని పొందడమనేది పై తీరు భావనతో కళ్లతో దర్శిస్తే చాలు లభిస్తుంది నిజానికి.వ్యాధితో బాధపడుతున్న రోగికి పైకి కనిపించే రోగం మాత్రమే కాక ఇంకా ఏమైనా కూడా లోపల దాగున్నాయేమోనని గ్రహించి ఆ అన్ని రోగాలూ తొలగిపోయేలానూ, వచ్చి ప్రధానంగా కనిపిస్తున్న ప్రధాన రోగానికి సంబంధించిన మూలకణాల నిర్మూలనానికి ఎలా వైద్యుడు ఆయా ఔషధాలని కలిపి ఓ ఔషధాన్ని సిద్ధం చేస్తాడో అలా ఉపాసనీ మహారాజ్ గారు ఈ పాదుకలని అంతటి శ్రద్ధతోనూ చేసి ఉంచడమే కాక, ఏ ఔషధాన్ని ఎంత చలి లేదా వేడి ప్రదేశంలో ఉంచాలో ఆయనకాయనే మనకి చెప్పినట్టుగా ఈ పాదుకలు ఆ వేప చెట్టు కిందనే ఉండాలని ఓ నిర్ణయాన్ని కూడా చేశారు. దాంతో భక్తులందరికీ పాదుకాప్రతిష్ఠ అనేది ఓ ఆనందదాయకమైన ఉత్సవంగా అనిపించింది. -
పాదుకల శ్లోకం పుట్టుపూర్వోత్తరాలు
భారతంలో ధర్మరాజుని గురించి వ్యాసుడు వర్ణిస్తూ ధర్మమనే చెట్టులాంటివాడు ధర్మరాజు అనీ నకుల సహదేవులు పుష్పఫలాలు వంటి వారనీ– మాను భీమసేనుడనీ– అర్జునుడు చెట్టు నిలబడటానికి కారణమైన శక్తి అనీ మూలం శ్రీ కృష్ణుడనీ చెప్పాడు. ఇదే తీరుగా దుర్యోధనుడ్ని గురించి చెప్తూ రోషమయ మహావృక్షం దుర్యోధనుడని తెలియజేశాడు వివరించి.బోధి అనే పేరున్న వృక్షం కింద కూర్చుని తపశ్శక్తిని పొందిన కారణంగానే తాను తపశ్శక్తిమంతుడ్ని కాగలిగానని బుద్ధుడు కూడా ప్రకటించాడు.ఇలా చెట్లకీ తపస్సులకీ తాపసులకీ అనుబంధం గోచరిస్తుంది. అందుకే సాయి బహుశ ఈ వృక్షాన్ని ఎంచుకుని ఉండి ఉంటాడు. ఆ చెట్టు నీడని తాను ఉపయోగించుకుంటున్నాడు కాబట్టి, రుణవిముక్తి కోసంమరికొన్ని వృక్షాలని పెంచవలసిన బాధ్యత తనకుందని గ్రహించి ‘వెండీతోట’ని స్వయంగా పెంచి పెద్ద చేయాలనుకునే ఆలోచనకి వచ్చి దాన్ని అమలు చేసుంటాడు. ఎండిన చెట్ల కొమ్మలనీ కాండాలనీ సమిధలుగా చేస్తూ ఇంతటి పవిత్ర నిస్వార్థ భావంతో మనకి ఎంతో ఆశ్రయాన్నిచ్చిన చెట్లకి సద్గతులు కలగాలనే భావంతో (జీవులే వృక్షాలనేది సాయి భావన) వాటి సమిధలని అగ్నిహోత్రంలో (ధుని)వేస్తూ ఆయా దేవతల్ని తృప్తి పరచవలసిందే నన్నాడు సాయి పరోక్షంగా. ఆ పవిత్రతని కాపాడేందుకే.... అంతటి పవిత్రమైనదీ నిస్వార్థంగా తనని ఆశ్రయించిన అందరికీ సేవచేసినదీ అయిన వృక్షానికి ఉన్న పవిత్రతని మరింత చేసేందుకూ, జనులందరికీ ఉపకారబుద్ధితో పాటూ చెట్టుకున్న గొప్పదనాన్ని తెలియజేసేందుకూ నిర్ణయించుకున్న సాయి ఆ చెట్టు మొదట్లోనే సాయి పాదుకలని ఉంచాలని భావించాడు మనసులో. ఆ పాదుకలు తనవి మాత్రమే కావాలని ఏనాడూ సాయి భావించలేదు.ఎక్కడైనా భగవంతుడు అనగానే వెంటనే పాదాలని కదా ముందుగా పూజిస్తాం. అంతటి శక్తిమంతుడైన భగవంతుని పాదాలని ఎవరి మటుకు వాళ్లు తల మీద పెట్టుకోలేరు కదా! ఆ కారణంగా అందరికీ భగవంతుని చరణాల సేవా సౌభాగ్యం కలగాలనీ, కలిగించాలనీ భావించిన సాయి భగవత్పాదుకలని ఆ పవిత్ర వేపచెట్టు మొదట్లో ఉండేలా చేయాలని సంకల్పించాడు.దేవాలయాల్లో కూడా శఠగోపం అని ఒకటుంటుంది. కిరీటం ఆకారంలో, దాన్ని మన శిరసు మీద పెడతారు. హిరణ్య గర్భాది సురాసురాణాం కిరీటమాణిక్య విరాజమండితం (ఉదాహరణకి శివాలయమైతే)శివస్య తత్పాదసరోజ యుగ్మం త్వదీయ మూర్ధాన మలంకరోతు’ అని చదువుతూ ఆ శఠగోపాన్ని భక్తుల శిరసు మీద ఉంచుతారు. ఆ శఠగోపం మీద ఏ దేవాలయపు శఠగోపమైతే ఆ దేవుని పాదుకలు (ధరించిన పాదరక్షలు) కనిపిస్తూ ఉంటాయి. ఆ శఠగోపం మన తలమీద పెట్టగానే ఆ దైవపాదుకలకి మన తలతో నమస్కారాలని చేసిన పుణ్యం మనకొస్తుందని దానర్థమన్నమాట. పాదుకలని ప్రతిష్ఠించిన తీరూ– అక్కడ చదవాల్సిన శ్లోకాన్నీ అర్థాన్నీ గురించి తెలుసుకుందాం! ఎవరైనా ‘సాయి’ అనగానే వెంటనే గుర్తొచ్చే శ్లోకం ‘సదా నింబవృక్షస్య... సాయినాథమ్’ అనే శ్లోకమే. ఒక బిడ్డ పుట్టిందనగానే అందరికీ చెప్పలేని ఆనందం కలుగుతుందనేది యథార్థమే గానీ, ఆ బిడ్డ పుట్టుకకి వెనుక తల్లి గర్భంలో కలిగిన అలజడిని దాదాపుగా ఎవరూ పట్టించుకోరు. అందుకే కాళిదాస మహాకవి అన్నాడు–మామిడి పండుని తినేవాడెవడూ దానిపువ్వు పుట్టడం గురించి ఆలోచించడని. మామిడి చెట్టుకి ఆనందం ఎప్పుడు కలుగుతుందట? మొదటిసారిగా తాను పువ్వుని వేసినప్పుడట. దాన్నే ‘పుష్పవతి’ కావడమంది శాస్త్రం.అలాగే ఈ పైననుకున్న శ్లోకం ఎలా పుట్టిందో దాని అర్థం వివరంగా ఏమిటో తెలుసుకుందాం! శ్లోకానికి నాంది ఇదీ! షోలాపూర్ జిల్లాలో అక్కల్కోట అనే ఓ గ్రామం ఉంది. అక్కడ ఓ మహాతపశ్శక్తి సంపన్నులు ఉండేవారు. ఆయన్ని అందరూ ‘మహారాజ్’ అని పిలుస్తూ ఉండేవారు. దాంతో ఆయన ‘అక్కల్‌కోటకర్ మహారాజ్’గా వ్యవహారంలోకి వచ్చేశారు. వీరికి మహాభక్తుడు కృష్ణజీ(భాయి కృష్ణజీ అవీ బాగేకర్). ఆయనెప్పుడూ ఈ మహారాజ్ గారి చిత్రపటాన్ని ఎదురుగా పెట్టుకుని నిరంతరం పూజిస్తూ ఉండేవారు. ఓసారి మాత్రం కృష్ణజీకి అక్కల్కోట గ్రామానికి స్వయంగా వెళ్లాలనీ, అక్కడ ఉన్న మహారాజ్ గారి పాదుకల్ని దర్శించి స్వయంగా పూజించుకోవాలనీ ఓ ఆలోచన వచ్చింది. ఇక బయల్దేరి రేపు వెళ్దామనుకుంటూ ఉండగా ఆయనకి ఓ కలొచ్చింది. ‘కృష్ణజీ! ప్రస్తుతం నా నివాసస్థలం అక్కల్కోట కాదు షిర్డీ. అక్కడికి పోయి నా మీద ఉన్న నీ భక్తినంతా అక్కడ ఉంచి నీ పూజని అక్కడ చేసుకో!’ అని స్వయంగా అక్కల్‌కోటకర్ మహారాజుగారే చెప్పినట్లుగా తోచింది కలలో. వెంటనే కృష్ణజీ తన నిర్ణయాన్ని మార్చుకుని అక్కల్కోటకి బదులుగా షిర్డీకి వెళ్లాడు. ఎందుకో అక్కడకి వెళ్లాక సాయిని దర్శించాక, అక్కడ వాతావరణం మరింత హృద్యంగా అనిపించాక వెంటనే వెళ్లిపోదామనిపించలేదు. దాంతో ‘రేపు వెడదాం – మాపు పోదాం’ అనుకుంటూ ఆయన ఆర్నెల్లపాటు అక్కడే సాయిని సేవించుకుంటూ ఉండిపోయారు.దాంతో ఆయనకి సాయితో మరింత అనుబంధం పెరిగిపోయింది. ఇలా షిర్డీలో వీరున్న కాలంలో బొంబాయి నుంచి డాక్టరూ(రామారావు కోరారే) ఆయనతో పాటు ఆయన కాంపౌండర్ కూడా వచ్చారు. దీంతో డాక్టరూ, కాంపౌండర్ వీరే కాక సగుణ్ –దీక్షిత్ అనే వారు కూడా బాగా సన్నిహితులయ్యారు ఈ ఆరునెలల కాలంలో. ప్రతినిత్యం ఇలా సాయి గురించిన భక్తి శ్రద్ధలతో ప్రతిరోజూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మాటల మధ్యలో– సాయి ప్రతినిత్యం ఏ వేపచెట్టు కింద కూర్చుని నిరంతర విరాగమూర్తిగా తపస్సు చేసుకుంటూ ఎండ, వాన, చలి అనే వాటిని లెక్క చేయకుండా ఉండి మొత్తానికి సిద్ధిని సాధించి సిద్ధుడయ్యాడో ఆ విశేషం అందరికీ ముందునాటికి అర్థమయ్యేలా తెలియజేయాలి’ అనే ఆలోచన ఒక్కరికి కాదు ఏకగ్రీవంగా వచ్చింది. ఆలోచన రావడమేమిటి? దాన్ని అమలు చేయాలనే నిర్ణయబుద్ధి కలిగిన డాక్టరుగారు షిర్డీలోనే పాదుకల నమూనాని రాయించారు. ‘మన బుద్ధికి తోచినట్లూ– అంతేకాక అక్కల్‌కోటకర్ మహారాజుగారి పాదుకలని చూసి వాటి పద్ధతిలో నమూనాని రాసినట్లూ ఉన్నాయి ఈ పాదుకలు. ఏ అతి ముఖ్యమైన శాశ్వతమైన పనిని చేయదలచినా అది లోపభూయిష్టంగాని, దుర్విమర్శకి లోనయ్యే తీరుగా గానిఉండకూడదు సరికదా– ఒకసారంటూ వాటికి ప్రతిష్ఠ జరిగిన పక్షంలో వాటిని మార్చడం కూడా సరికాదు. భక్తులందరికీ కూడా అదో తీరు భావన ఈ పాదుకల విషయంలో కలగచ్చు కూడా.అందుకని పాదుకలూ– నమూనా... మొదలైన విషయాల్లో గట్టి అనుభవం, అంతేకాక తపశ్శక్తీ పుష్కలంగా ఉన్న ఉపాసనీ మహారాజ్ గారు ఉండే ఖండోబా అనే పేరున్న ఆలయానికెళ్లారు. ఆయన ఆ పాదుకల నమూనాని చూస్తూనే ఎంతో సంతోషపడి – ఎన్నాళ్లకి ఈ మంచిపని జరుగుతోందనే ఆనందాన్ని వ్యక్తీకరించారు. ఆ పాదుకల నమూనాలో కొన్ని మార్పుల్ని చేస్తూ– పద్మం, శంఖం,చక్రం అనే వాటిని కూడా చేర్పించారు. ఈ వేపచెట్టుకున్న గొప్పదనాన్ని కూడా లోకానికంతటికీ తెలియజేయదలిచి ఓ శ్లోకాన్ని రాసి– దాన్ని ఓ ఫలకం మీద చెక్కించి ప్రతిష్ఠించడం బాగుంటుంది అని సూచించారు కూడా. పెద్దరికం పెద్దలెప్పుడూ కూడా ‘ఇలా చేయవలసిందే – చేసి తీరాలి’ అని ఆజ్ఞాపించరు. ఒకవేళ అవతలి వ్యక్తులు తమభావాన్ని అర్థం చేసుకోలేక తాము సూచించిన విధంగా చేయని పక్షంలో మనసు నొచ్చుకోవలసి వస్తుందనుకుంటూ కేవలం సూచన ప్రతిపాదన వంటి వాటినే చేస్తారు. దీన్నే ‘పెద్దరికం నిలుపుకోవడం’ అంటారు.పెద్దలు అలా చేసిన సూచనని తప్పక పాటించదలిచి ఆ సూచననే సలహానే ప్రతిపాదననే ఓ ఆజ్ఞగా భావించి చేయడమనేదాన్ని ‘భక్తి – శ్రద్ధ’ అంటారు. ఇలా తాము చెప్పిందాన్ని చెప్పినట్లుగా అవతలివారు పాటిస్తున్నారని అనిపిస్తే పెద్దలు – మరింత జాగ్రత్తగా ఆలోచించి, ఒకటికి రెండుమార్లు తర్కించుకుని మాత్రమే సూచన, సలహా, ప్రతిపాదనని చేస్తారు తప్ప యథాలాపంగా ఏమేమో చెప్పెయ్యరు. ఇలాంటి చరిత్రలని వింటూ ఉంటే ఎదుటివారికి ఎలా సలహా సూచన ప్రతిపాదన అనే వాటిని మనం చేయాలో అర్థమవుతుంది. ‘నా ఈ సలహాని, సూచనని పాటించని పక్షంలో... భోజనం చేయననీ, ఇంటికి రానేరాననీ, ముఖం చూడననీ’ ఈ తీరుగా పలకడం ఎంతటి పిల్లతనానికీ, పిల్లచేష్టలకీ ఉదాహరణమో... అర్థం చేసుకోగలుగుతారు ఆ తీరు లక్షణమున్నవాళ్లు. పైగా ఈ సూచన చేసిన ఆయన ‘ఉపాసని–మహారాజ్’ ఉపాసనని చేసి చేసి, ఉపాసన కారణంగా ‘ఉపాసని’ గానూ అందరి పట్లా ప్రేమా వాత్సల్యాలని చూపే కారణంగా మహారాజ్గానూ పేరు పొంది ‘ఉపాసనీ మహారాజ్’ అయ్యారు. అలాంటి వాళ్లకి రాబోయే విషయం సుస్పష్టంగా తెలుస్తుంది. అయినా చెప్పకపోవడం అనేది వారి గొప్పదనం – పెద్దరికం కూడా. అందుకే దేవతలు అలాంటి వారికి మాత్రమే భవిష్యత్ దర్శన శక్తినిస్తారు. దాన్ని సద్వినియోగ పరుచుకుంటే నిచ్చెన మెట్ల మీదుగా సాగిపోయేటట్లు ఎదిగిపోతారు. అలాంటి ప్రవర్తన లేని పక్షంలో వైకుంఠపాళి (పరమపదసోపాన పటం) ఆటలో పామునోట్లో పడి ఒక్కసారిగా కిందికి పడిపోయినట్లు అథఃపతనానికి వచ్చేస్తారు. సరే! శ్లోకం– అర్థం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్త్రావిణం తిక్తమప్యప్రియం తమ్ తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథమ్ ఈ శ్లోకాన్ని కొన్ని సాయి దేవాలయాల్లో తప్పుగా వేయించడం జరిగిన కారణంగానూ, అది అధికసంఖ్యలో భక్తుల నోళ్లలోకి వెళ్లిపోతోందనే ఉద్దేశంతోనూ స్పష్టంగానూ వివరంగానూ దీని అర్థాన్ని తెలుసుకోవలసి ఉంది. ముఖ్యంగా ‘మూలధివాసాత్’కి బదులుగా ‘మూలాదివాసాత్’ అనీ, ‘కల్పవృక్షాధికమే’ అన్నదానికి బదులుగా ‘కల్పవృక్షాదిక’ అనీ దోషాలు దొర్లి కనిపిస్తున్నాయి. ఆ దోషాల్లేకుండా ఉండేందుకూ ఏది దోషమో ఏ తీరుగా చదివితే దోషం లేకుండా చదువుకుంటున్న తృప్తి ఉంటుందో– ఆ తీరులో అర్థమయ్యేలా వివరించుకుందాం శ్లోకాన్ని. శ్లోకానికి ముందుగా తెలుసుకోవలసినది పదాల విరుపుని. దీన్నే పద విభాగం అంటారు. సదా– నింబవృక్షస్య– మూలాధివాసాత్ సుధాస్రావిణమ్– తిక్తమ్– అపి– అప్రియమ్– తమ్ తరుమ్– కల్పవృక్షాధికం– సాధయంతమ్ నమామి– ఈశ్వరమ్– సద్గురుమ్– సాయినాథమ్ అనేది పదవిభాగం. పదవిభాగం లాగానే ప్రతి పదానికీ అర్థాన్ని కూడా తెలుసుకుంటే పొరపాటున కూడా ఈ శ్లోకమే కాదు ఏ శ్లోకాన్ని కూడా తప్పుగా ఉచ్చరించనే ఉచ్చరించలేం. అలా తప్పుగా ఉచ్చరించినందువల్ల కలిగే దుష్పరిణామం కూడా మనకి తెలిసే అవకాశముంటుంది. ప్రతిపద అర్థం సదా– పగలు, సాయంతరం, రాత్రి, ఎండాకాలం, వానాకాలం, వర్షాకాలం, చలికాలమనే భేదాన్ని లెక్కించకుండా ఎప్పుడూ కూడా నింబ వృక్షస్య– ఆ తోవపక్కనే ఉన్న వేపచెట్టు యొక్క మూల+అధివాసాత్– మొదట్లోనే స్థిరంగా కూచుని ఉండే కారణంగా తిక్తమ్ – పుట్టుకతో తనకి కలిగిన చేదు తనంతోనే ఉన్నదీ అ–ప్రియమ్–ఎవరికీ కూడా ఏ మాత్రపు ఇష్టమూ కానిదీ అయిన తమ్ తరుమ్ – సామాన్యమైన జాతికి చెందిన ఆ వేప చెట్టుని (మంచిగంథం వంటిది కానిదైన)సుధా స్రావిణమ్ – నిరంతరం తేనెని ప్రవహించే తీరు కలిగిన దానిగానూ నిరాశా నిస్పృహలతో జీవితాన్ని చాలిద్దామనుకునేవారికి అమృతాన్ని ప్రవహించే తీరు లక్షణం కలిగినదవుతూ జీవించాలనే ఆలోచనని కలిగించే దానిగానూకల్పవృక్ష+అధికమ్ – అంతేకాక, ఏ కోరికని అడిగితే ఆ కోరికని అడిగినవాని అర్హతని బట్టి తీర్చే లక్షణమున్న దేవలోకవృక్షమైన కల్పవృక్షం కంటే గొప్పదనం కలదానివిగానూసాధయంతమ్ – ఏ రోజు కారోజు దాని గొప్పదనం జనులకి అర్థమయ్యేలా తీర్చిదిద్దుతున్నవాడూసత్+గురుమ్ – సజ్జనులకి మార్గదర్శనాన్ని చేస్తూ ఉండే ఓ గురువైనవాడూ, ఏ విధమైన లోటూ లోపమూ లేకుండా పరిపూర్ణమైన గురు లక్షణాలు కలిగిన వాడూసాయి నాథమ్ – దీనులకి రక్షకుడవుతూ ‘సాయి’ అనే పేరుగలిగి అందరికీ దిక్కైన వాడూఈశ్వరమ్ – సర్వశక్తులూ సర్వసిద్ధులూ తనలో కలిగి అందరి కష్టాలనీ నష్టాలనీ తొలగించగల సమర్థుడూ అయిన వానికి నమామి – ఎల్లవేళలా సర్వకాలాల్లో నమస్కరిస్తూనే ఉంటాను.భావం – ఈ శ్లోకంలో సాయి గొప్పదనం మొత్తం చిత్రీకరింపబడి కనిపిస్తుంది తరిచి చూస్తే.అదో సామాన్యమైన వేరు చెట్టు. ఆ చెట్టుకి ఆకులు కూడా సన్నగా చిన్నగానే ఉండే కారణంగా ఎక్కువనీడ నియ్యలేదు. పోనీ! దాని పుష్పాలు గాని, ఫలాలు గాని ఆహారంగా పనిచేస్తాయా? అంటే అందుకూ దానికి సమర్థత లేదు. పోనీ! ఏ నిద్రగన్నేరో మర్రీ మొదలైన వృక్షాల్లాగా పక్షులకి గూళ్లనీ, ఎలుకలూ మొదలైన వాటికి కన్నాలనీ,కోతులూ మొదలైన వాటికి ఆధారంగా కొమ్మల్నీ... ఈయగలదా? అంటే అలా ఈయగలిగిన శక్తీలేనిది– ఏ జీవజంతువులకీ ఆశ్రయాన్ని ఇచ్చి ఉన్నదీ కాదు. అలాంటి వేపచెట్టు అది. పైగా తన దగ్గరికి ఎవరినీ రానిచ్చుకోలేని రెండు అవగుణాలు – ఒకటి చేదుతనం, రెండవది ఎవరికీ ఈ చెట్టు అనగానే పట్టనితనం అనేవి కలిగి ఉండే జాతికి చెందిన వృక్షం.అలాంటి వృక్షాన్నే ఆశ్రయించాడు సాయి అనేది విశేషం. మల్లె, సంపెంగ, చందనం మొదలైన తీగల్నీ, చెట్లనీ ఎందరో ఇష్టపడతారు. అది కాదు విశేషం. ఏ గొప్పదనమూ లేనిదాన్ని స్వీకరించడం అలా ఆశ్రయించిన వ్యక్తి గొప్పదనాన్ని తెలియజేస్తుంది. ఏ వారమో 2 వారాలో ఆ చెట్టు మొదట్లో కూచుని అసౌకర్యంగా ఉందనే విషయాన్ని అనుభవపూర్వకంగా గ్రహించి మరో చెట్టు మొదట్లోకి చేరడం గొప్పదనం కాదు. అదే చెట్టు మొదట్లో ఉండటం. అంతే కాక తన నివాసం కారణంగా ఆ చెట్టుకి ఓ గొప్పదనాన్నీ మహిమనీ కలిగించడం ఓ విశేషం. – సశేషం ఏ గొప్పదనమూ లేనిదాన్ని స్వీకరించడం అలా ఆశ్రయించిన వ్యక్తి గొప్పదనాన్ని తెలియజేస్తుంది. ఏ వారమో 2 వారాలో ఆ చెట్టు మొదట్లో కూచుని అసౌకర్యంగా ఉందనే విషయాన్ని అనుభవపూర్వకంగా గ్రహించి మరో చెట్టు మొదట్లోకి చేరడం గొప్పదనం కాదు. అదే చెట్టు మొదట్లో ఉండటం. అంతే కాక తన నివాసం కారణంగా ఆ చెట్టుకి ఓ గొప్పదనాన్నీ మహిమనీ కలిగించడం ఓ విశేషం. -
ఆత్మహత్య ఆలోచనలా? షిర్డీకి వచ్చేయ్!
ఏ సంఘటనని సాయి జీవితంలో దర్శించినా అది మూఢవిశ్వాసమనీ, హేతువాదానికి నిలవనే నిలవదనీ అనుకోనే అక్కర్లేదు. లో–పరిశీలించి చూస్తే తప్పక అందులో యదార్థత దాంతో పాటు సాయిని విశ్వసించి తీరాలనే దృఢబుద్ధీ కలుగుతాయి పాఠకులకీ, శ్రోతలకీ కూడా. ఈ నేపథ్యంలో సాయికున్న సమాన –వ్యాన వాయువుల మీద ఉన్న అధికారాన్ని గమనించుకుని పై శీర్షికకి సంబంధించిన– జరిగిన కథని వివరించుకుని ఆనందిద్దాం! ‘కాయస్థ’ అనే ఒక కులానికి చెందిన స్త్రీ ఉండేది. గర్భవతి కథ ఆమెకి ప్రతి కాన్పూ తీవ్రమైన ప్రాణాంతక స్థితిని గుర్తుచేస్తూ ఉండేది. దాంతో భయపడిన ఆ దంపతులు శ్రీరాం మారుతి అనే బాబాకి సన్నిహితుడైన ప్రముఖుణ్ణి కలిస్తే ఆయన ఈ దంపతుల్ని సాయి వద్దే ప్రసవం రోజుల్లో ఉండవలసిందని సూచించాడు. వాళ్లు అలాగే సాయి పూజని చేస్తూ షిర్డీలోనే ఉండిపోయారు. ఇక ప్రసవం కాబోతుందనగా ఆమె గర్భంలోని శిశువు అడ్డం తిరిగి యథా పూర్వంలా తల్లి ప్రాణాన్ని బలిగొనే స్థితిని కల్గించేసింది. సాయిధ్యానాన్నే చేస్తూ ఆ గర్భవతి ఉండగా, ఇతర భక్తులందరూ కూడా ఈమె కోసం ధ్యానాన్ని కొనసాగిస్తుండగా.. ఆమె ‘ప్రసవించింది’ అయితే పుట్టిన బిడ్డ మరణించింది. ఏ ఒక్కరూ కూడా ‘సాయి ఏం చేయగలిగాడు?’ అని నిందించలేదు, పరోక్షంగా– కుతర్కాన్నీ చేయలేదు. పైగా సాయి రక్షించడం బట్టే పెద్ద ప్రాణం(తల్లిప్రాణాలు) రక్షింపబడిందనే అన్నారు. సాయికి సమానవాయువు మీద (బొడ్డు భాగంలో ఉంటూ గర్భవతుల ఆహారసారాన్ని బొడ్డుతాడు ద్వారా సంతానానికి పంపుతూండే వాయువూ ఆధిపత్యం ఉంది కాబట్టే ఇలా సుఖ ప్రసవమయిందనే అనుకున్నారు. ఆ శిశువు శరీరంలో వ్యానవాయువు (శరీరంలో ఎక్కడెక్కడ ఏయే వాయుశాతం తగ్గిందో ఆ వాయువుని అక్కడికక్కడే అప్పటికప్పుడే నింపగల శక్తి ఉన్న వాయువు) సర్వ అవయవాల్లోకీ ప్రవహిస్తూ చరించలేదని తెలిసిన సాయి ఆ శిశువు మృతిపట్ల ఏవిధమైన బాధని పడనేలేదు. దానికి కారణం సాయికి వ్యానవాయువు మీద ఆధిపత్య శక్తీ, అలాగే అదే శిశువుకి ఉండాల్సినంత ప్రాణవాయు శక్తి లేక మరణిస్తుందనే భవిష్యత్కాలాన్ని తెలుసుకోగల శక్తీ ఉండటమే! ఆత్మహత్యా ఆలోచన గోపాల్(నారాయణ్ అంబడేకర్) అనే ఓ భక్తుడు పూనా(పూణే)లో ఉంటుండేవాడు. ప్రభుత్వోద్యోగం చేసి పదవీ విశ్రాంతిని పొందాడు(రిటైర్మెంట్). దాంతో అతనికి ఏమి తోచనట్లయింది. ఏం చేయాలో పాలుపోయేది కాదు. మరో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి నాలుగురాళ్లు సంపాదించుకుందామనుకున్నా తాను చేసింది ఎక్సైజ్ ఉద్యోగం అయ్యేసరికి (మద్యాన్ని అమ్మించడం–అక్రమ మద్యాన్ని పట్టుకుని శిక్ష విధించడం) ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఇదిలా ఉంటే అతను క్రమంగా దురదృష్టం పాలు కాసాగాడు. ఎందరి ద్వారానో.. ఏ తీరు ఉద్యోగమైనా సరే చేయగలనని అందరికీ సమాచారాన్ని పంపాడు గానీ ఏ ఒక్కరూ కూడా ఇతనికి సరిపడిన ఉద్యోగం తమ వద్ద లేనేలేదంటూ తిరస్కరించారు. దిక్కుతోచని దశలో ఆర్థికంగా కూరుకుపోతున్న స్థితిలో కూడా ప్రతి సంవత్సరం షిరిడీకి వెళ్లడాన్ని మానేవాడు కాదు. అయినా ఏ తీరుగానూ అతని పరిస్థితి పైకి వెళ్లిన సందర్భమే లేకపోయింది. సాయికి తన కష్టాన్ని విన్పించుకునేవాడు వెళ్లిన ప్రతిసారీ. సాయి అతని కథని విని మౌనంగా ఉండేవాడే తప్ప ఏమీ మాట్లాడే వాడే కాదు. దాంతో తనలో తానే తన దురదృష్టాన్ని నిందించుకుంటూ విపరీతంగా ఆలోచిస్తూ ఎంతసేపో మౌనంగా ఉంటూ కాలాన్ని గడుపుతుండేవాడు. తన ఆలోచనలు ఇలా సాగాయి. ఎండవేడిమికి తట్టుకోలేక చల్లని నీడనిస్తున్న చెట్టునీడన చేరితే ఆ చెట్టుమీద మండే ఓ పసిరికపాము తలనపడితే ఎలా భయంతో వణికిపోతామో, ఏ చెట్టు నీడనీ ఆశ్రయించడానికి భయపడిపోతామో అలా అయింది అతని స్థితి. సాయిని ఆశ్రయించినా మార్పు రాలేదని బాధపడ్డాడు.అర్ధరాత్రివేళ ఇంట్లోకి దొంగ వచ్చి కత్తి చూపి భయపెడుతూంటే అకస్మాత్తుగా తలుపులో నుండి పారిపోయి మరో ఇంటివాళ్లని లేపబోతుంటే అక్కడే దొంగలు తనని పట్టుకుని కట్టేసినట్టయింది అతని దుర్దశ. సాయిని చేరినా మార్పు రానేలేదని మనోవ్య«థ పడ్డాడు. దైవం తప్ప రక్షించే వాడెవరున్నారు? అనే దృఢ విశ్వాసంతో దేవాలయంలోకి కంగారుగా ప్రవేశిస్తే ఆ గుడిలోని గంటే తలకి బలంగా కొట్టుకుని మూర్ఛపోయేంత స్థితిని కల్పించినట్టయింది అతని పరిస్థితి. సాయిని సేవించినా పరివర్తన(పరిస్థితిలో మార్పు) లేనేలేదని తీవ్రమైన అశాంతికి లోనయ్యాడు.ఎదురుగా వస్తున్న పులిని గమనించి పులి నోట్లో పడకుండా తప్పించుకున్న గోవు ‘బతికాను జీవుడా!’ అని మనశ్శాంతితో ఉండబోతే ఎదురుగా నిలుచున్న కటికవాడు బలంగా తన కొమ్ముల్ని పట్టి ముకుతాడుని చేత్తో పట్టుకుని వధ్యశాలకి తీసుకుపోతున్నట్లనిపించింది తనకి. సాయిసేవని చేసినా ఆరాధించినా కూడా తనకి ఏమాత్రమూ తోవ దొరకలేదని ఎంతో అలజడికీ అశాంతికీ గురి అయ్యాడు. ఇన్నీ ఆలోచనలని చేసి చేసి–కుటుంబానికి తానేమీ చేయలేని స్థితికొచ్చేసానని గమనించి, అండగా నిలిచే వాళ్లెవరూ లేరనే నిర్ధారణకొచ్చి– ఆ సమస్యకి పరిష్కారం కేవలం ఆత్మహత్య మాత్రమేననే స్థిరాభిప్రాయానికి వచ్చేసాడు. గోపాల్ నారాయణ్ కుటుంబం మొత్తాన్ని షిర్డీకి మార్చేసాడు. అయితే తనలో అభిప్రాయాన్ని ఏ ఒక్కరికీ కూడా చెప్పనేలేదు.ఏ రోజూ ఆత్మహత్యకి ఏది తేలికైన మార్గం? ఎలా బాధని అనుభవించకుండా క్షణంలో ప్రాణాన్ని తీసేసుకోవాలి? అంతే కాదు ఒకసారంటూ ఆత్మహత్యకి ప్రయత్నించి కార్యరంగంలోకి దూకాక ఆ ప్రయత్నం విఫలమై మళ్లీ జీవించవలసి వస్తే– ఇటు ప్రతిష్టాపోతుంది, మరోసారి ఆ ప్రయత్నం చేయవీలుకాదు. కనీసం ఆత్మహత్యని చేసుకోవడంలో కూడా ఓడిపోయాడనే మాట మిగిలిపోతుంది తనకి– అని ఈ తీరుగా మార్గాలను అన్వేషిస్తూ ఉండిపోయాడు. అంతే! అతనికో మంచి ఆలోచన తాననుకున్న పనిని ఏ ఒక్కరూ గుర్తించవీల్లేని ఆలోచన– తాను పడుతున్న కడగండ్లనీ– కష్టాలనీ– భవలోక బంధాలనీ క్షణంలో తీర్చేసుకోగల ఆలోచన– తన కొచ్చింది. అదే! బావిలోకి దూకి ఆత్మహత్యని చేసేసుకోవడమనే ఆలోచన! ముసురుకున్న ఊహలు ఆత్మహత్య అనుకోగానే ఎన్నో ఆలోచనలు రాసాగాయి గోపాల్‌కి. మనని నమ్ముకుని వచ్చిన పంచప్రాణాలనీ అలా ఉంచేసి అకస్మాత్తుగా ప్రాణాలని బలవంతాన తీసుకోవడం ఏమంత సబబు? చుట్టాలందర్నీ పిలిచి–ఇప్పుడే వస్తానని చెప్పి అకస్మాత్తుగా యజమాని ఎటో వెళ్లిపోతే వచ్చిన చుట్టాలంతా ఏమనుకుంటారు? అసలు ఆ కాడికి చుట్టాలని పిలవడం దేనికి? ఈ పంచప్రాణాలూ మనల్ని నమ్ముకుని వచ్చిన చుట్టాలవంటివే కదా! అనేది ఒక ఊహ! వీటిని కాదని వెళ్లిపోవడం ధర్మమా? నిజమే! కష్టం వచ్చింది! ఇంతకంటే కష్టపడ్డవాళ్లెందరు లేరు? ఓ ద్రౌపది నిండు సభలో హస్తినాపుర ప్రజలు రాజులు సామంతులు...ఇలా ఎందరో చూస్తుండగా, తనని రక్షించవలసిన బాధ్యతా ధర్మమూ ఉన్న భీష్మ ద్రోణ కృప బాహ్లిక సోమదత్త భూరిశ్రవసులు మొదలైన వృద్ధులందరూ ఉండగా వస్త్రాపహరణమంత దుఃఖం అందునా ఏక వస్త్రకాలంలో (స్త్రీ అశుచిగా నెలకోసారి ఉండే 3 రోజుల్లో మొదటిరోజు సమయంలో) జరిగినా ఆమె దానిని తట్టుకుని తననెవరు అలా స్థాయిని దిగజార్చి పరువూ ప్రతిష్ఠ పోయేలా చేసారో, తనకే కాక తన భర్తలందరికీ అపకీర్తి కలగజేసారో, ఎవరు ఆ సమయంలో తమకేం పట్టనట్టుగా ఉంటూ మౌనసాక్షులుగా ఉండిపోయారో ఆ అందర్నీ కురుక్షేత్రమనే పేరున్న యుద్ధంలో సమూలంగా వధించలేదూ? అది కాదు చేయవలసిన కర్తవ్యం!? అనే మరో ఊహ కలిగింది గోపాల్‌కి. అయినా మళ్లీ తనకి పూర్వజన్మ సుకృతం కారణంగా ఉద్యోగం ఎప్పుడొస్తుందనీ –తన భార్య పుత్రుల్ని జాగ్రత్తగా చూసుకోగలననీ బాగా ఆలోచించాడు తనకి తాను. ఏ అంతూ పొంతూ దొరికే వీలే కనిపించలేదు. ఇంతగా ఆలోచించాక– ఇక లాభం లేదు, చర్చించుకుంటూ కూచుంటే కర్తవ్యం దెబ్బతింటుంది! తాననుకున్న కార్యాన్ని నెరవేర్చుకున్న వాడూ తాను కాలేడని ఆలోచించి ఎవరూ చూడని సమయంలో టక్కున ఆ పాడుబడ్డ బావిలోనికి దూకెయ్యాలనే నిశ్చయానికొచ్చేసాడు గోపాల్. మంచి విద్వాంసుడులా గ్రంథకర్తా వేదాంత ప్రశ్నలని అందరికీ అర్థమయ్యేంత దిగువస్థాయికి వచ్చి మరీ సమాధానాన్ని వివరించ గల శక్తిమంతుడు అయిన గోపాల్ ఆ బావిలోనికి దూకడమనే అకృత్యానికి పాల్పడరాదని నిశ్చయించుకున్నాడు మరుక్షణంలో.ఇలా తర్జనభర్జనలతో ఊçహాపోహలతో తలకిందులౌతున్న గోపాల్ –ఇక ఆలస్యం చేయకూడదంటూ నిశ్చయించుకుని పాడుబడ్డ బావిలో దూకడానికే నిశ్చయించుకున్నాడు కూడా. ఇలా ఊగిసలాటలో ఉన్న గోపాల్ అకస్మాత్తుగానూ శీఘ్రంగానూ తాననుకున్న పనిని చేయదలిచి కొత్త ఆలోచనలని రానీయకుండా దృఢమైన నిర్ణయాన్ని చనిపోవడానికే తీసుకుని దానికి కావలసిన ఏర్పాట్లు ఏమిటా? అనే ఆలోచనలో పడ్డాడు. ఇది చదివావా? గోపాల్ ఇంటికి కొంత సమీపంలో వ్యాపారుల అంగడులున్నాయి! ఆ ఇంటికి కొన్ని అడుగుల దూరంలోనే సగుణ్(మేరు నాయక్) ఇల్లు ఉంది. ఆయన భోజనశాలకి అధిపతి. అప్పగించిన పనిని శ్రద్ధతో చేస్తూ పరమధర్మబద్ధంగా ఉండే వ్యక్తి సగుణ్.అంతలో గోపాల్ ఇంటికి సగుణ్ వచ్చాడు. తనకు తానుగా ఆశ్చర్యమయింది గోపాల్‌కి. ‘గోపాల్! మాంచి పుస్తకాన్నిస్తాను చదువుతావా?’ అనడిగాడు సగుణ్. ‘ఓ! తప్పక’ అంటూ ఆనందంగా ఆ పుస్తకాన్ని తీసుకున్నాడు గోపాల్.వెంటనే పుస్తకంలో అలా పుటలని తిప్పుతూ ఒక పుట దగ్గర ఆగిపోయాడు. అక్కడ పుటల్లో ఇలా ఉంది! అక్కల్ కోట్ మహారాజును తీవ్రంగా సేవిస్తూ ఉండే ఒక భక్తుడుండేవాడు! అతడికి ఆ అక్కల్ కోట్ మహారాజే సర్వస్వం. అలా ఉంటున్న కాలంలో తీవ్రమైన రోగం వచ్చింది ఆయనకి. ఎవరెవరో ఎందరెందరో వైద్యాన్ని ప్రారంభించారు. ఆ వ్యాధికి తగ్గుముఖం పడుతుందనే నమ్మకం తమకి లేదనే విషయాన్ని వైద్యులే చెప్పారు. అంతే! ఆ భక్తునికి ఓ ఆలోచన వచ్చింది! తాను జీవించి ఉన్నందుకు ఒకరి కష్టాన్ని తాను ఎంతగా తీర్చగలనా అని ఆలోచించాడు. ఏమాత్రమూ సహాయపడలేదనే నిర్ధారణకి వచ్చేసాడు ఆ భక్తుడు. దాంతో తానెవరికీ సహాయపడలేదు– తన కొచ్చిన వ్యాధిని తగ్గించుకోగల శక్తిమంతుడు కాదు. ఇలాంటప్పుడు జీవించి ఏం ప్రయోజనం? అనే ఆలోచనకొచ్చి చావు మాత్రమే శరణ్యమనుకున్నాడా భక్తుడు అని అనిపించింది ఆ సందర్భంలో.సరిగ్గా తనకి ప్రతిబింబాన్ని చూస్తున్నట్లుగా అన్పించింది. అంతే! ఆ భక్తుడు తీవ్ర నిరాశతో బావిలో దూకెయ్యకనే దూకేసాడని ఉంది! వెంటనే అక్కల్ కోట్ మహారాజే అక్కడి కొచ్చి ప్రాణాపాయం నుండి రక్షించాడు. రక్షించాక అన్నాడు–! ‘భక్తుడా! ఆత్మహత్య చేసుకోవాలనే ఈ దురదృష్టకర ఆలోచన రావడంలో నీ తప్పు లేదు సుమా! ప్రారబ్ధ రీత్యా మనం అనుభవించవలసిన బాధలు ఏమున్నాయో వాటిని సాక్షాత్తు ఆ దైవమైనా సరే ఈ భూమిలో గాని జన్మించి ఉంటే అనుభవించక తప్పదు. ఆ కర్మల ఫలితాన్ని తప్పక అనుభవించాల్సిందే. ఆ పాపాల ఫలితాన్ని అనుభవించకుండా దాచుకోవడమో, జాగ్రత్త పడడమో చేయదలిస్తే... మరింత పాపఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది. ఇంకా పాపాల సంఖ్య తీవ్రత పెరిగినట్లయితే మరో జన్మని కూడా ఎత్తవలసి ఉంటుంది. ఇప్పుడే కష్టాన్ని దాటలేక నూతిలోపడి ఆత్మహత్య చేసుకుంటే కచ్చితంగా రాబోయే పాపఫలితాన్ని అనుభవించక తప్పదు. అందుచేత కష్టాలని భరించక తప్పదు. ఆత్మహత్య అనేది పిరికి పందలు– దద్దమ్మలు చేసే పని. దాన్ని ఓ సంచలనాత్మక వార్తగా పదిమందికీ ప్రచారం చేస్తే గనుక ఆ ఆత్మహత్యల కథా చరిత్ర అలా సాగుతూనే ఉంటుంది! కాబట్టి ఆత్మహత్య అనేది ఏమాత్రమూ సరికాదనే నిశ్చయజ్ఞానం కలిగింది. అక్కల్ కోట్ మహారాజ్ గారి ద్వారా వెంటనే గోపాల్ సాయి మసీదు కెళ్లి పాదాలమీద పడి వెక్కి వెక్కి చిన్నపిల్లవానిలా ఏడ్చాడు.సాయిలో ఉన్న గొప్పదనమేమంటే తన వద్ద కొచ్చిన ఎవరైనా ప్రారంభించి తమ విశేషాలని చెప్తూంటే– తల్లి మాటలని పిల్లవాడు శ్రద్ధగా ఆలకించినట్లు వినేవాడు తప్ప, మధ్య మధ్యలో ప్రశ్నించడం చేసేవాడు కాదు. అందుకే గోపాల్ బాధనంతా సాయి చూసి చూసి స్పష్టంగా అతని ఆత్మహత్య ఆలోచనను పూర్తిగా వెనక్కి వెళ్లిపోయిందని తెలిసి అప్పుడు మాట్లాడడం ప్రారంభించి ‘గోపాల్! వచ్చిన ఆలోచనని వచ్చినట్లుగానే అమలు చేసెయ్యకూడదు. ఆలోచించగలగాలి తరువాత ఏమౌతుందో అని! అన్నాడు.గోపాల్ మరో మారు తీవ్రంగా తన కన్నీటితో తన మనోబాధని వ్యక్తీకరించి ఆత్మహత్య మహాపాతకమని తేల్చి ఆత్మహత్యా ఆలోచననే గాని ఎవరికి వచ్చినా షిర్డీకి గాని వస్తే పూర్తిగా ఆలోచన తొలగి పోతుందని తన అనుభవంతో చెప్పాడు. ఇది ఎంత దివ్య ఔషధమో కదా. ‘సాయికి శ్రీ విష్ణు సహస్రనామం చాలా ఇష్టమా? ఎందుకు? – సశేషం డా. మైలవరపు శ్రీనివాసరావు -
అనుకరణ... అనుసరణ
బౌద్ధసంఘంలో కొందరు భిక్షువులు తమ గురువులను, ముఖ్యంగా బుద్ధుణ్ణి అనుకరిస్తూ జీవించేవారు. ప్రసంగాలు చేస్తూ ఉండేవారు. అలాంటి వారిలో దేవదత్తుడు ఒకడు. బుద్ధునిలా కూర్చుని, బుద్ధునిలా నడుస్తూ, బుద్ధునిలా పడుకుని, ‘నేనూ బుద్ధునిలాగే నడుచుకుంటున్నాను. బుద్ధునితో సమానమైన వాణ్ణే’ అని అంటూ ఉండేవాడు. దేవదత్తునిలాగా మరికొంతమంది భిక్షువులు తయారయ్యారు. ఒకరోజున ఒక అనుకరణ భిక్షువు బుద్ధుని కొరకు వచ్చినప్పుడు బుద్ధుడు ఈ కథ చెప్పాడు. ఒక అడవిలో ఒక మహావృక్షం కింద ఒక ఏనుగు జీవిస్తూ ఉండేది. ఆ సమీపంలో ఒక సరోవరం ఉంది. దాని నిండా ఎర్రకలువలూ, ఎర్ర తామరలూ ఉన్నాయి. ప్రతిరోజూ సరోవరం నిండా వాటి పూలే. ఆ ఏనుగు రోజూ సరోవరంలో దిగి తామరతూడులు, దుంపలు లాగేసేది. పూలూ, తూడులు తినేది. దుంపలకు అంటిన బురదని నీటిలో జాడించి, శుభ్రం చేసుకుని తినేది. దాని బొరియల్లో ఒక గుంటనక్క జీవిస్తూ ఉండేది. అది ముద్దుగా, బొద్దుగా ఉన్న ఏనుగుని చూసి ‘నేనూ ఇలా బలంగా తయారవ్వాలి’ అనుకుంది. ‘ఏనుగు తామర తూడులు, దుంపలు తినడం చూసి నేనూ ఇక వీటినే తినాలి. ఏనుగులా బలాన్ని తెచ్చుకోవాలి’ అనుకుని సరస్సులో దిగి తామరతూడుల్ని పీకి దుంపల్ని బురదతో సహా తినడం మొదలు పెట్టింది. కొన్ని రోజులు అలా తినేసరికి, దాని పేగుల్లో మట్టి పేరుకుని పోయి, జబ్బు చేసి, చివరికి ప్రాణాలు పోగొట్టుకుంది. బుద్ధుడు చెప్పిన ఈ కథ విన్న భిక్షువుకి ‘మనిషికి ఆచరణ స్వాభావికం కావాలి కానీ, ఎవరినో అనుకరించి, మనది కాని స్వభావాన్ని మనం తెచ్చిపెట్టుకోకూడదు. తెచ్చిపెట్టుకున్నది నటనే అవుతుంది కానీ నిజం కాదు’ అని అర్థమై తన నడవడిక మార్చుకుని, ఆచరణను సరిదిద్దుకున్నాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
నమస్కరించండి
గౌతమ బుద్ధుడు ఓరోజున బోధివృక్షానికి నమస్కరిస్తూ ఉండటం చూశాడు ఒక శిష్యుడు. అతని దృష్టిలో బుద్ధుడు భగవంతుడితో సమానం. అలాంటి బుద్ధభగవానుడు ఒక చెట్టుకు ఇంతటి గౌరవాన్ని ఇవ్వడం చూసి అతనికి ఆశ్చర్యం వేసింది. దాంతో ఉండబట్టలేక బుద్ధుణ్ణి సమీపించి, ఆయనకు నమస్కరించి, ‘‘భగవాన్, మీరే భగవత్ స్వరూపులు కదా, మీరు ఒక మామూలు చెట్టుకు ఎందుకని నమస్కరిస్తున్నారో తెలుసుకోవచ్చా?’’ అని అడిగాడు. అందుకు బుద్ధుడు చిరునవ్వుతో, ‘‘మనిషిలో అహంకారం చిగురించకుండా చేసే శక్తి ప్రకృతిలో ఉంది. అందుకే ప్రకృతిలో భాగమైన చెట్టుకు నమస్కరిస్తున్నాను. భవిష్యత్తులో మీరు ఎప్పుడూ అహంకారాన్ని తెచ్చుకోవద్దు. వినయంగా, నమ్రతగా మెలగండి. అందరితోనూ ప్రేమాభిమానాలతోనూ, గౌరవంగానూ నడుచుకోండి. అప్పుడు మిమ్మల్ని అహంకారం ఆవరించదు. మిమ్మల్ని చూసి, అందరూ కూడా అదే బాటలో నడుస్తారు’’ అని బోధించాడు. బుద్ధభగవానుడి నుంచి తనకు ఎంతో విలువైన కానుకలాంటి విషయాన్ని బోధించినందుకు శిష్యుడు ఎంతగానో సంతోషించాడు. శిష్యులకు ఏమైనా మంచి విషయాలను బోధించాలనుకునేవారు ముందుగా తాము ఆచరించాలి. అప్పుడు శిష్యులు తాము కూడా అనుసరిస్తారు. -
మనది కానిది
తెల్లవారగనే ఆ అధికారి, దొంగల్ని వెతుక్కుంటూ ఇటుకేసి వచ్చాడు. అతను వచ్చే సమయానికి ఈ బాటసారి మూటలోని నాణేల్ని లెక్కబెట్టుకుంటూ కనిపించాడు. ఒకరోజు బుద్ధుడు తన శిష్యులతో కలసి ఒక పొలం గట్టు మీదుగా వెళ్తున్నాడు. దారిలో ఒక చెట్టు పక్కన ఒక భిక్షువుకి ఒక డబ్బు మూట కనిపించింది. ఆ భిక్షువు –‘‘భగవాన్! ఇదిగో ధనం మూట’’ అని చూపించాడు. ‘‘నాయనా! అది ఒక కాలసర్పం లాంటిది. దాని జోలికి వెళ్లొద్దు. ఇటు వచ్చేయ్’’అని వెళ్లిపోయాడు. మిగిలిన భిక్షువులు ఆ మూటకి కాస్త దూరం జరుగుతూ ఆయన వెంట వెళ్లిపోయారు. కొద్దిదూరంలో ఉన్న ఒక బాటసారి ఈ తతంగం అంతా చూస్తున్నాడు. ‘‘ఈ భిక్షువులకు అక్కడ పామేదో కనిపించినట్లుంది. ఉట్టి పిరికివాళ్లలా ఉన్నారు. అంతమంది ఉండి కూడా దానిని ఏమీ చేయలేక తప్పుకుని పారిపోతున్నట్లున్నారు’’అనుకుంటూ అక్కడికి వచ్చాడు. తీరా వచ్చి చూస్తే అక్కడ డబ్బు మూట ఉంది. దాన్ని చేతుల్లోకి తీసుకుని– ‘ఆ భిక్షువులు పిరికివాళ్లే కాదు వెర్రిబాగులవాళ్లలాగున్నారు.లేకపోతే డబ్బు మూటను చూసి పాముని చూసినట్టు పరుగు పెడుతున్నారు’ అనుకుంటూ మూట విప్పి డబ్బు లెక్కపెట్టుకుంటున్నాడు. నిజానికి అసలు జరిగిందేమిటంటే.. ఆ ముందు రోజు రాత్రి రాజు కొలువులో పని చేసే ఒక అధికారి ఇంట్లో దొంగలు పడి, ఎన్నో కుండల కొద్దీ ధనాన్ని దోచుకుపోతూ... దారిలో ఉన్న ఈ చెట్టుకింద కూర్చుని మూటల్ని లెక్కపెట్టుకున్నారు. అప్పుడు ఆ చీకట్లో ఒక మూట జారి పక్కన పడిపోయింది. అది గమనించకుండా వారు వెళ్లిపోయారు. తెల్లవారగనే ఆ అధికారి, దొంగల్ని వెతుక్కుంటూ ఇటుకేసి వచ్చాడు. అతను వచ్చే సమయానికి ఈ బాటసారి మూటలోని నాణేల్ని లెక్కబెట్టుకుంటూ కనిపించాడు. ఇతడే దొంగతనం చేసి ఉంటాడని భావించి, ఆ బాటసారిని తన్ని, రాజుగారి దగ్గరకు లాక్కుపోయాడు. ఇదీ కథ. పరుల సొమ్ము పాము వంటిది– అనే నానుడి ఇలా పుట్టింది. అందుకే బుద్ధుడు ‘ఇతరులు ఇవ్వకుండా నీకు దొరికింది కూడా నీది కాదు. అదీ ఒక రకంగా దొంగతనమే’ అని తన శిష్యులకు చెప్పాడు. అంటే ‘నీ శ్రమ కానిది నీది కాదు. మరొకరు దానంగా ఇవ్వనిదేదీ నీది కాదు’ అని దాని అర్థం. – బుద్ధుని ‘పంచశీల’ నుంచి -
గెలుపు హింస
ఒకసారి బుద్ధునితో ఒక వ్యక్తి వాదానికి దిగాడు. వాదం చివరి దశకు వచ్చింది. అవతలి వ్యక్తి ఓటమి అంచుల దాకా వచ్చాడు. అలాంటి సమయంలో.. ‘‘నేనీ వాదన నుంచి విరమించుకుంటున్నాను’’అని ప్రకటించి వెళ్లిపోయాడు బుద్ధుడు. బుద్ధుని పక్కనే ఉన్న భిక్షువులే కాదు, ప్రత్యర్థి కూడా ఆశ్చర్యపోయాడు. గెలుస్తానని తెలిసి కూడా బుద్ధుడు అలా ఎందుకు విరమించుకున్నాడో వారెవరికీ అర్థం కాలేదు. అప్పుడు ఆ వ్యక్తి బుద్ధుని దగ్గరకు వెళ్లి ‘‘గౌతమా! నేను ఓడిపోతానని తెలిసి కూడా నీవెందుకు మధ్యలోనే లేచి వచ్చావు?’’అని అడిగాడు. మిగిలిన భిక్షువులు కూడా అలాగే అడిగారు.. ‘‘భగవాన్ గెలుపును ఎందుకు తోసిపుచ్చారు?’’అని. అప్పుడు బుద్ధుడు ఇలా చెప్పాడు. ‘‘నేను ఇలా విరమించుకోవడానికి మూడు కారణాలున్నాయి. ఒకటి: ఇప్పటికి ప్రత్యర్థికి నన్ను ఓడించే జ్ఞానశక్తి లేకపోవచ్చు. రెండు: నేను ఇప్పుడు వాదించిన విషయం కూడా రేపు కార్యాచరణలో మరిన్ని మార్పులు తీసుకోవచ్చు. దేన్నీ ‘ఇదే అంతిమ లక్ష్యం’ అని తేల్చలేం. ఇప్పుడు నేను గెలుపును అందుకున్నానంటే అది అంతిమ సత్యమై ఉండాలి. అంతిమ సత్యం కాని దాన్ని పట్టుకుని ఎలా గెలుపును సొంతం చేసుకోగలం? ఇక మూడు: ఒక అంతిమ సత్యం కాని దానితో నేను గెలిచాను అంటే.. అవతలి వ్యక్తిని నేను సత్యం కాని దానితో ఓడించినట్టే. అలా ఓడిన వ్యక్తి మనసు గాయమవుతుంది. ఓటమి వల్ల సిగ్గు చెందుతాడు. దుఃఖపడతాడు. ఒక వ్యక్తిని గెలుపు పేరుతో ఇలా ఓడించడం కూడా హింసే అవుతుంది’’ అని చెప్పాడు. బుద్ధుని విశాల దృక్పథానికి భిక్షువులతోపాటు ప్రత్యర్థి కూడా ప్రణమిల్లాడు. – బొర్రా గోవర్ధన్ -
బుద్ధుడి శక్తి.. ఓడిన తాలిబన్లు..
మింగోరా : ఇస్లాం కంటే ముందు మా మతం బౌద్ధం. స్వాట్ వ్యాలీలో ఉంటున్న ముస్లిం క్యూరేటర్ అన్న మాట ఇది. రెండు నుంచి నాలుగు శతాబ్దాల మధ్య కాలంలో పాకిస్తాన్‌లోని స్వాట్ వ్యాలీలో ఓ వెలుగు వెలిగిన బౌద్ధ మతం అక్కడ తిరిగి మళ్లీ ఊపిరిపోసుకుంటోంది. వాయువ్య పాకిస్తాన్‌లోని జహానాబాద్ పట్టణానికి చేరువలో గల స్వాట్ వ్యాలీలోని ఓ పర్వతంపై 7వ శతాబ్దంలో ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధుడి రూపం చెక్కబడి ఉంది. ఇస్లాం మత వ్యాప్తికి కట్టుబడి ఉండే పాకిస్తాన్ తాలిబన్ల కన్ను స్వాట్ వ్యాలీపై పడింది. బౌద్ధ మతం గురించి అవగాహన లేని చాలా మంది పాకిస్తానీలు అప్పట్లో వ్యాలీపై తాలిబన్ల దాడిని స్వాగతించారు. ఏ మతాన్ని వ్యతిరేకించని, ఆక్షేపించని బౌద్ధం ఇస్లాం వ్యాప్తిని అడ్డుకుంటుందనే భావనతో 2007లో డైనమైట్‌తో బుద్దుని ప్రతిమను పేల్చి వేసేందుకు యత్నించారు. విగ్రహం చుట్టూ బాంబులను అమర్చగా, కొన్నిమాత్రమే పేలడంతో బుద్దుని ముఖచిత్రంపై కొంతభాగం దెబ్బతింది. 2001లోనూ ఇదే తరహా దాడి జరిగింది. ఈ దాడిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులు ఖండించారు. తాలిబన్లు తమ సంస్కృతిపై, చరిత్రపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2009లో పాకిస్తాన్ ఆర్మీ తాలిబన్లను అణచివేసే ప్రక్రియలో స్వాట్ వ్యాలీలో వేలాది మంది ప్రాణాలు విడిచారు. దాదాపు 15 లక్షల మంది ఈ ఘటనలో నిర్వాసితులు అయ్యారు. పాకిస్తాన్లో ముస్లిం జనాభా అత్యధికమనే సంగతి తెలిసిందే. హిందూవులు, క్రైస్తవులు అక్కడ మైనార్టీలు. మతం పేరుతో వారిపై జరిగే దాడుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి దాడులతోనే 10వ శతాబ్దంలో స్వాట్ వ్యాలీలో బౌద్ద మతం తన ఉనికిని కోల్పోయింది. 1955 నుంచి ఇటలీ ప్రభుత్వం స్వాట్ వ్యాలీలో బౌద్ధ మత కట్టడాలను, సంస్కృతిని పునరుద్ధరించేందుకు 30 లక్షల డాలర్లను వెచ్చిచింది. తాలిబన్ల దాడి కాలంలో ఇటలీ నుంచి ఇక్కడికి వచ్చిన వారిపై విచక్షణా రహితంగా దాడులు జరిగాయి. 2009 పాకిస్తాన్ ఆర్మీ కలుగజేసుకున్న తర్వాత మళ్లీ ఇటలీ ఆర్కిటెక్ట్స్ ఇక్కడి వచ్చారు. 2012లో దెబ్బతిన్న బుద్దుడి ముఖాన్ని పునరుద్ధరించేందుకు ప్లాన్‌ను సిద్ధం చేశారు. ఇందుకోసం 3డీ ఇమేజ్ను ప్రత్యేకంగా రూపొందించి 2016లో అందమైన రూపుతో మళ్లీ గౌతముడి ముఖాన్ని సరి చేశారు. చైనా, థాయ్‌లాండ్ వంటి దేశాల నుంచి ఇక్కడికి భారీగా పర్యాటకులు వస్తారని భావిస్తున్నారు. అయితే, ఈ ప్రాంత ప్రాముఖ్యత గురించి స్థానిక యువతలో ఇంకా అవగాహన కలిగించాల్సివుందని ఆర్కియాలజిస్టుల చెబుతున్నారు. చరిత్రను తెలుసుకోకపోవడం వల్ల చాలా నష్టాలు ఉంటాయని వారు అభిప్రాయపడ్డారు. తాలిబన్ల నీలినీడల నుంచి బయటపడిన వ్యాలీలో ప్రస్తుతం ప్రశాంతత నెలకొంది. బౌద్ధ మతానికి ఆద్యుడైన గౌతమ బుద్ధుడు తన అతీత శక్తితో హింసను పెచ్చరిల్లేలా చేస్తున్న తాలిబన్లను ఓడించారని వ్యాలీలోని వారు చెప్పుకుంటున్నారు. -
అనుసరించడమంటే అది..!
బుద్ధుడు అనారోగ్యం పాలయ్యాక ‘ఇక నేను ఎక్కువకాలం జీవించలేను’ అని ప్రకటించాడు. దాంతో ధర్మంలో పరిపూర్ణత సాధించలేకపోయినవారు ఆవేదన చెందారు. ‘అంత గొప్ప మానవీయ ధర్మాన్ని ప్రబోధించిన బుద్ధుడు ఇక మనకు ఆట్టే కాలం కనిపించడా?’ అని కలవరపడ్డారు. ఇక తాము చేయాల్సిన విధులన్నీ దాదాపుగా మాని ఆయన వెంటే పడి తిరుగుతూ ఉండేవారు. ఆయనకు సేవ చేయడానికి పోటీపడేవారు. ఆ మహనీయుని సేవలో గడపడం గొప్ప కార్యంగా భావించేవారు. వారిలో అత్తదత్తుడు అనే వాడు మాత్రం బుద్ధుని చూడ్డానిరీ, సేవకూ ఎప్పుడూ రాలేదు. బుద్ధుని విషయం తెలిసినప్పటినుంచి బుద్ధుని దగ్గరకు రావడమే మానుకున్నాడు. నిరంతరం ధ్యాన సాధనలో లీనమై పోయి ఉండేవాడు. ఒకరోజున భిక్షువులందరూ అతని మీద నింద మోపి బుద్ధుని ముందుకు తీసుకొచ్చి– ‘భగవాన్! చూశారా! మేమందరం మీ చెంతే ఉంటున్నాం. ఈ అత్తదత్తుడు మాత్రం ఈ ఛాయలకే రావడం లేదు’’ అని చెప్పారు. ‘‘భిక్షూ! వీరి ఆరోపణ నిజమేనా? నీవు ఏం చేస్తున్నావు?’’ అని అడిగాడు బుద్ధుడు చిరునవ్వుతో.‘‘నిజమే భగవాన్! నేను ధ్యానంలో పరిపూర్ణత సాధించలేదు. అర్హంతుడను కాలేదు. మీరు జీవించి ఉండగానేనేను అర్హంతుడను కావాలని నిశ్చయించుకున్నాను. అందుకే నిరంతరం ఆ మార్గంలోనే ఉంటున్నాను’’ అని చెప్పాడు. అప్పుడు బుద్ధుడు– ‘‘భిక్షువులారా! అత్తదత్తుడు చెప్పిందే సత్యం. మీరు ధర్మాన్ని అనుసరించడమ అంటే నన్ను అనుసరించడం కాదు. నా మార్గాన్ని అనుసరించడం. అర్హంతులు కావడం ఇకనైనా మీరు అర్హంత సాధనకు మళ్లండి’’ అని ప్రబోధించాడు. మిగిలిను భిక్షువులు అత్తదత్తుణ్ణి అనుసరించారు. వ్యక్తి మీద గౌరవం చూపడం కంటే ఆ వ్యక్తి నిర్దేశించిన మార్గంలో పయనించడమే అసలౌన ఆదర్శం అని తెలియజెప్పే ఈ కథ ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినది, అనుసరించవలసిందీనూ. అర్హంతుడు –అర్హుడు, అర్హంత– అర్హత – డా. బొర్రా గోవర్ధన్ -
మాట్లాడకపోవడమే మౌనం కాదు!
మౌనేన కలహం నాస్తి అంటారు. నిజమే! అసలు మాట్లాడక పోతే తగాదాలు ఏమి వస్తాయి? అభిప్రాయ భేదాలు ఏముంటాయి? కాబట్టి మౌనం పాటించాలంటారు కొందరు. కానీ, భావాల్ని వాక్కు రూపంలో చెప్పగలది మానవులు ఒక్కరే. మనుషులకున్న ఈ ఒక్క అవకాశాన్నీ ఉపయోగించుకోకపోతే ఎలా? మౌనం అంటే అసలు మాట్లాడకుండా ఉండడం కాదు. చెడు మాట్లాడకపోవడమే అంటాడు బుద్ధుడు. అర్థం పర్థం లేకుండా మాట్లాడడం, పరుషంగా మాట్లాడటం, వక్రంగా మాట్లాడడం, పెడర్థాలతో మాట్లాడ్డం, లొడలొడ వాగడం, అసత్యాల్ని పలకడం ఇవన్నీ లేకుండా పలికే ఏ వచనమైనా మధుర వచనమే. మనిషి మధురంగా సంభాషించాలి. తన మాటల ద్వారా, ప్రబోధాల ద్వారా మంచిని పెంచాలి అనే బుద్ధ ప్రబోధంలో ఎందరో భిక్షువులు ధ్యానం చేస్తూ, ధ్యానానంతరం ధర్మాన్ని ప్రబోధాల రూపంలో ప్రచారం చేస్తూ ఉండేవారు. తమకు భిక్ష వేసిన గృహస్థులకు ఇంటిల్లిపాదినీ కూర్చోబెట్టి వారికి ధర్మప్రబోధం చేసేవారు. ఆశీర్వచనాలు పలికేవారు. ఇది చూసిన కొందరు మౌన సన్యాసులు– ‘‘చూశారా! బౌద్ధ భిక్షువులు మౌనం పాటించరు. భిక్ష స్వీకరించి మౌనంగా తిరిగి రారు. ఇది వారి వాచాలత్వమే! వారెలా మౌనులవుతారు? ఎలా సాధుజనులు కాగలరు?’’ అని విమర్శించేవారు. ఈ విషయాన్ని కొందరు భిక్షువులు బుద్ధునికి చెప్పగా– ‘‘భిక్షువులారా! మౌనం అంటే నోరు మూసుకుని కూర్చోవడం కాదు. ఎవరైతే మౌనాన్ని పాటిస్తారో వారు నిజానికి దుర్బలురు. తమ జ్ఞానాన్ని, తమ సాధనని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడని స్వార్థపరులు. మౌనాన్ని పాటించేవాడే వాడే ముని కాదు. త్రికరణ శుద్ధిగా ఎవరు చెడుపనులు చేయరో వారే మౌని’’ అని చెప్పాడు. మాటలకంటె మనస్సు, ఆలోచనలు, ఆచ రణలే ముఖ్యం అని వారికి అర్థమైంది. – డా. బొర్రా గోవర్ధన్ -
టిబెట్‌లో బయటపడిన 1200 ఏళ్లనాటి బుద్ధుడి చిత్రాలు
బీజింగ్: రాతియుగంలో రాళ్లపై రకరకాల చిత్రాలు గీసేవారు. ఆదిమానవులకు సంబంధించిన ఎన్నో విషయాలను ఈ రాతి చిత్రాలే మనకు వెల్లడించాయి. అయితే తాజాగా టిబెట్‌లో బుద్ధుడికి సంబంధించిన పలు రాత్రి చిత్రాలు బయటపడ్డాయట. ఇవి సుమారు 12 వందల సంవత్సరాల కిందటివని శాస్త్రవేత్తలు గుర్తించారు. తూర్పు టిబేట్‌లోని ఒక లోయలో మైనింగ్ పనులు జరుగుతుండగా ఈ చిత్రం బయటపడింది. కార్బన్ డేటింగ్ పద్ధతిలో విశ్లేషించగా.. టిబేట్‌కు చెందిన టుబో పాలన కాలానికి చెందినదిగా నిర్ధారించారు. టుబో సామ్రాజ్యం అప్పట్లో చాలా శక్తిమంతమైనదని, టిబెట్ సంస్కృతిని, బౌద్ధమతాన్ని టుబో బాగా ప్రోత్సహించారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ రాతిచిత్రం దాదాపు పది మీటర్ల పొడవు ఉందని, బహుశా ఇది తొమ్మిదో శతాబ్ధానికి చెందినదై ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. రాతిచిత్రం దొరికిన ప్రాంతంలో ప్రస్తుతానికి మైనింగ్ పనులను నిలిపివేస్తున్నామని, బయటపడిన రాతి చిత్రాలను భద్రపరిచామని టిబెట్ అధికారులు తెలిపారు. కాగా టిబెట్‌లో ఇప్పటిదాకా 5వేలకు పైగా బుద్ధుడి శిల్పాలు, చిత్రాలు బయటపడ్డాయి. ఇవన్నీ వివిధ కాలాలకు చెందినవి కాగా.. ఏడో శతాబ్ధానికి చెందిన శిల్పమే అంత్యంత పురాతనమైదని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
బాహ్యం సౌందర్యం అంతరం దుర్గంధం
ఒకరోజు బుద్ధుడు కోసలరాజు ప్రసేనజిత్తు ఆస్థానంలో కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో ఎందరో భిక్షువులు, పండితులు, రాచకుటుంబీకులు, పౌరులు బుద్ధుని ధర్మ ప్రసంగం వినడానికి వచ్చారు. అప్పుడు ఒక జాలరి బంగారు రంగుతో తళతళ మెరుస్తూ కాంతులీనుతున్న ఒక చేపను తీసుకు వచ్చాడు. ‘‘మహారాజా! ఇది అరుదుగా దొరికే బంగారు తీగ చేప. దీని గురించి వినడమే కాని, ఎప్పుడూ చూడలేదు. ఇన్నాళ్లకి మాకు చిక్కింది. దీన్ని మీకు కానుకగా సమర్పించడానికి తెచ్చారు’’ అన్నాడు జాలరి. రాజు చేపను చూసి ఆశ్చర్యపోయాడు. సభికులు చూడాలనే తలపుతో ఒక బంగారు పళ్లెంలో పెట్టించి సభముందుంచాడు. సభికులు దాని అందాన్ని, దాని రంగుని, మెరుపుని, ఆకారాన్ని గురించి గొప్పగా చెప్పుకోసాగారు. ఇంతలో చేప పెద్దగా నోరు తెరిచింది. అంతే..! దాని నోట్లోంచి గుప్పున దుర్వాసన వచ్చింది. సభికులందరూ ‘ఛీ ఛీ’ అంటూ ముక్కులు మూసుకున్నారు. అప్పుడు బుద్ధుడు– ‘‘పాండిత్యం, జ్ఞానం, ప్రతిభాపాటవాలు, నైపుణ్యం మనకి బాహ్య అందాన్ని కలిగిస్తాయి. అవన్నీ ఈ చేపకు ఉన్న శరీరం రంగులాంటివే. ఇక మన మంచి నడవడిక, కుశల ధర్మాన్ని ఆచరించడం, మన శీల సంపద మనలో దుర్గంధాన్ని దూరం చేస్తాయి. పాండిత్యం ఉన్నా శీలగుణం లేని వారి అంతరంగం, హృదయం ఈ చేపలాగే దుర్వాసన కొడుతుంది’’ అంటూ తన ప్రబోధాన్ని ప్రారంభించాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
ధ్యానసాధన... జ్ఞాన శోధన
తన మార్గం తప్పి, తన నైపుణ్యాన్ని, తెలివితేటల్ని మరో దారిలోకి మళ్లించిన ఒక భిక్షువుకి బుద్ధుడు సరైన ప్రబోధం చేసి, సరైన దారిలోకి తెచ్చిన ఘటన ఇది. ధనియుడు మంచి నేర్పరి. మట్టితో అందమైన కుండలు మలచగల నిపుణులు. అతను బుద్ధుని ప్రబోధం విని, భిక్షువుగా మారాడు. ధర్మసాధన కోసం ధ్యానాన్ని అభ్యసించడం కోసం ఒక మారుమూల ప్రాంతానికి వెళ్లాడు. ధ్యానసాధన సాగిస్తున్నాడు. ఒకరోజున అతను తన కుటీరంలో లేని సమయంలో, సమీప గ్రామంలోని ప్రజలు ఒక శవాన్ని ఆ ప్రాంతానికి తెచ్చారు. వర్షం పడటం వల్ల వారికి ఎండుకట్టెలు కనిపించక ధనియుని పర్ణశాలను పీకి, శవాన్ని తగులబెట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత ధనియుడు వచ్చి, ‘గడ్డిపాక’ ఉంది కాబట్టి ఇలా చేశారు. అదే రాతి కట్టడం ఉంటే చేయలేరు కదా!’ అనుకొని, మట్టితో ఇటుకరాళ్లు మలిచి, వాటితో గంట ఆకారంలో గట్టి నివాసాన్ని నిర్మించుకున్నాడు. దీనికోసం ఏడు నెలలు వెచ్చించాడు. ఈ విషయం తెలిసి, బుద్ధుడు అక్కడికి వచ్చి– ‘‘ధనియా! నీ కుటీర నిర్మాణం చాలా బాగుంది. గట్టిది. అందమైనది. విలువైనది. కానీ నీవు దీనికోసం అంతకంటే విలువైన సమయాన్ని వెచ్చించి, ధ్యానసాధన పోగొట్టుకున్నావు. ధ్యానం, జ్ఞానం ఈ కుటీరం కంటే అందమైనవి. గట్టివి. ఉపయోగకరమైనవి. నీలో నైపుణ్యాన్ని ఇలా వృథా చేసుకున్నావు. మనం జ్ఞానసాధనలోనే సమయాన్ని వినియోగించుకోవాలి. ప్రజల దుఃఖాన్ని నిరోధించే పనిలోనే నిరంతరం ఉండాలి. మనం తల దాచుకోవడానికి ఇలాంటి అధునాతన నిర్మాణాలు అవసరం లేదు. సమయానికి మించిన సంపద లేదు. జ్ఞానానికి మించిన గొప్ప నివాసం లేదు. నీ నైపుణ్యాన్ని జ్ఞానశోధనకోసం, జ్ఞాన సాధన కోసం ఉపయోగించు’’ అని చెప్పాడు. తాను భిక్షువుగా రాణించాలంటే జ్ఞానసాధనే ముఖ్యం అని తెలుసుకున్న ధనియుడు, ఆనాటినుండి ధ్యానసాధనలో, జ్ఞానసముపార్జనలో మేటిగా నిలిచాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
ఎరుకతో ఉండటమంటే అదే!
ఇంద్రియాలను అదుపు చేయడానికి ధ్యానప్రక్రియ ఒక సాధనం మాత్రమే. అంతేకానీ, ధ్యానం చేస్తే చాలు ఇంద్రియాలు అదుపులోకొస్తాయి, జితేంద్రియులమై పోతాము అనే ఆలోచన కేవలం అపోహ మాత్రమేనని చెబుతూ, ధ్యానానంతరం జితేంద్రియుడినై పోయాను అనుకునే కొందరు భిక్షువులకు బుద్ధుడు ఇలా బోధించాడు. ‘‘భిక్షువులారా! ఒక వ్యక్తి ఒక కుక్కని, ఒక పక్షిని, ఒక నక్కని, ఒక మొసలిని, ఒక పాముని, ఒక కోతిని పెంచాలనుకున్నాడు. వాటిని తెచ్చి బంధించాడు. తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. వాటికి ఎలాటి లోటూ లేకుండా అన్ని వసతులూ ఏర్పాటు చేశాడు. అవన్నీ అతనికి మాలిమి అయ్యాయి. ‘ఇక ఇవి నన్ను వదిలిపోవు’ అనుకొని ఒకరోజున అన్నింటినీ వదిలిపెట్టాడు. అంతే... కుక్క తన పూర్వ గ్రామానికి పరుగు తీసింది. పక్షి టపటప రెక్కలాడిస్తూ ఆకాశంలోకి లేచిపోయింది. నక్క శ్మశానానికి దౌడు తీసింది. మొసలి చరచరా పాక్కుంటూ దగ్గరలోని సరస్సులోకి వెళ్లిపోయింది. పాము వేగంగా పోయి ఒక పుట్టలో దూరింది. ఇక కోతి, అతన్ని వెక్కిరిస్తూ, ఒక చెట్టుమీదికి ఎగిరి దూకింది. అలా అవన్నీ తమ సహజ నివాసాలకే వెళ్లిపోయాయి. ఆ ఆరు జంతువులు ఎలా బంధనాలు విడిపోగానే తమ సహజరీతిని ప్రదర్శించాయో, మన ఇంద్రియాలూ అంతే! ఏమాత్రం ఆదమరచి ఉన్నా అదుపు తప్పుతాయి. వాటిని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉండాలి. దీనినే ‘ఎరుక’ అంటారు. మనల్ని మనం నిరంతరం పర్యవేక్షించుకోవడమే ఎరుకతో ఉండటం. ఎరుక లేకపోతే ఆరు జంతువుల్లా ఆరు ఇంద్రియాలు తమ తమ పాత పద్ధతులకేసి పరుగు తీస్తాయి. ఈ విషయం గ్రహించిన భిక్షువులు తమలో ఎరుకను పెంపొందించుకున్నారు. – డా. బొర్రా గోవర్ధన్ -
పట్టలేనంత ప్రేమ
పొరలు పొరలుగా శిఖరాలుగా, పాయలు పాయలుగా సెలయేళ్లుగా ప్రపంచమంతా ప్రేమమయమే. ఎవరు ఏ అంచెలో, ఏ శ్రేణిలో, ఏ పొరలో, ఏ పాయలో ఉన్నారన్న దాన్ని బట్టే ప్రేమకు నిర్వచనం ఉంటుంది. అన్నిటికన్నా అధమమైన ప్రేమ ఆధిక్య ప్రేమ. ఆధిక్యంతో ఎప్పుడైతే ప్రేమ కలుషితమైపోతుందో అది ఇక ప్రేమ కానే కాదు. వట్టి స్వార్థం. ఆధిక్య భావన ప్రేమను విరిచేస్తుంది. అన్నిటికన్నా అత్యున్నతమైన ప్రేమ ఆధ్యాత్మిక స్థితికి చేరుకున్న ప్రేమ. బుద్ధభగవానుని ప్రేమ, జీసెస్ ప్రేమ, శ్రీకృష్ణుని ప్రేమ ఈ స్థితిలోనిదే. పైన వేరే ఇంకేం లేవు. బుద్ధుడు ఈ ప్రపంచాన్నంతటినీ ప్రేమించాడు. సృష్టి యావత్తుకూ పంచి ఇచ్చినా ఇంకా పట్టలేనంత ప్రేమ ఆయనలో ఉంది. అందుకే తన ప్రేమను చెట్లకు, పక్షులకు, మూగ ప్రాణులకు పంచాడు. ‘నిన్ను నువ్వు విశ్వసించకుండా, దేవుడిని విశ్వసించలేవు’ అని స్వామీ వివేకానంద అంటారు. విశ్వాసం నుంచి మొదలయ్యే ప్రేమ ఆధ్యాత్మికంగా బలాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మికంగా బలమైనవారు ద్వేషంలోనూ ప్రేమనే చూస్తారు. ప్రేమనే పొందుతారు. ప్రేమనే తిరిగి ఇస్తారు. -
చివరి సందేశం
బుద్ధుడు తన ధర్మప్రచారంలో భాగంగా ఒకసారి వైశాలికి వచ్చాడు. అప్పటికి ఆయనకు ఎనభై ఏళ్లు. అక్కడ ఉన్నప్పుడు ఆయన అనారోగ్యం పాలయ్యారు. తేరుకున్నాక బయలుదేరి బంద అనే గ్రామం చేరారు. అక్కడి నుంచి భోగనగరం చేరారు. ఆరోగ్యం మరలా దెబ్బతింది. అవసాన దశ అని ఆయనకు తెలిసింది. ఇంతవరకూ తానున్న లిచ్ఛవుల రాజ్యం నుంచి మల్లుల రాజ్యానికి వెళ్లాలని, తన నిర్యాణం అక్కడే జరగాలని వెంటనే పావామల్లుల రాజధాని పావానగరానికి వెళ్లాడు. అక్కడ చుందుని ఆహ్వానంపై బుద్ధుడు తన భిక్షువులతో కలిసి అతని ఇంటికి వెళ్లాడు. చుందుడు వడ్డించిన పదార్థంతో రెండు ముద్దలు తిన్నాక అది సరిగా లేదని గ్రహించి మిగిలిన భిక్షువుల్ని ‘తినవద్దు’ అని వారించాడు. ఆ తర్వాత బుద్ధునికి తీవ్ర రక్తవిరేచనాలు పట్టుకున్నాయి. తర్వాత కుసీనగరానికి వెళ్దామనడంతో గుడ్డడోలీని కట్టి బుద్ధుడిని మోసుకుంటూ కుసీనగరం కేసి బయలుదేరారు భిక్షువులు. అక్కడినుంచి హిరణ్యవతి నదీతీరానికి చేరి, అక్కడున్న మల్లుల సాలవనంలో ఆగారు. అక్కడ రెండు సాలవృక్షాల మధ్య పడక ఏర్పాటు చేయించుకుని విశ్రమించాడు బుద్ధుడు. ఆయనకు సపర్యలు చేస్తూ ఆనందుడు, నందుడు ఆయన పక్కనే ఉన్నారు. ‘‘నేనిక జీవించలేను. నా మరణవార్తను మల్లులకు తెలియజేయండి’’ అని చెప్పాడు. ఆ మాటలు విన్న ఆనందుడు దుఃఖించాడు. అప్పుడు బుద్ధుడు ఆనందునితో– ‘‘ఆనందా! కొన్ని ధాతువుల కలయికే జననం. అవి విడిపోవడమే మరణం. సంఘటితమైన పదార్థాలన్నీ నశించేవే. దుఃఖం ఎందుకు?’’ అని వారించాడు. బుద్ధుని విషయం తెలిసి సుబుద్ధుడు అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. తాను బుద్ధుడిని ఒకసారి చూడాలని అడిగాడు. ఆనందుడు ‘ఇప్పుడు సాధ్యం కాదు’ అని చెప్పాడు. ఆ మాటలు విన్న బుద్ధుడు ‘‘ఆనందా! సుబుద్ధుడిని నా దగ్గరకు పంపు’’ అని చెప్పాడు. తన వద్దకు వచ్చి నమస్కరించి నిలుచున్న సుబుద్ధునితో ఎన్నో ధర్మవిషయాలను ప్రబోధించాడు. అవి విన్న సుబుద్ధుడు వెంటనే భిక్షు దీక్ష యాచించాడు. బుద్ధుడు అంగీకరించాడు. ఇలా బుద్ధుని చివరి సందేశం విన్న వ్యక్తిగా, బుద్ధుడు దీక్షను ఇప్పించిన ఆఖరి భిక్షువుగా సుబుద్ధుడు బౌద్ధ సంఘంలో ప్రసిద్ధుడయ్యాడు. ఆ రాత్రి బుద్ధుడు విపశ్యనా ధ్యానంలోకి వెళ్లాడు. ఆ ధ్యానంలోని ఒక్కోదశను దాటుకుంటూ ఇంద్రియ జ్ఞానరాహిత్య స్థితికి చేరాడు. అలా శూన్యతాయతన స్థితికి చేరి– ఆ స్థితిలోనే నిర్వాణం పొందాడు.బుద్ధుని మరణ వార్త తెలిసి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. లిచ్చవులు, బులియులు, కొలియులు, పావామల్లులు, కుసీనగర మల్లులు, శాక్యులు, కోసల, మగధ రాజ్యాల వారు ‘‘మా రాజ్యంలోనే అంత్యక్రియలు జరగాలి’’ అంటూ పోటీ పడ్డారు. తగాదాకు దిగారు. చివరికి ద్రోణుడు అనే పండితుడు వారందరి మధ్య సయోధ్య కుదిర్చాడు. చనిపోయిన కుసీనగరంలోనే దహనం చేసి, అస్థికలు ఎనిమిది సమాన భాగాలుగా పంచుకోవాలనే ఒప్పందం కుదిరింది. ఈ గొడవ తేలేవరకూ బుద్ధుని పార్థివ దేహాన్ని నూలుబట్టల్లో చుట్టి, నూనెపాత్రలో భద్రపరిచారు. బుద్ధుడు నిర్వాణం పొందేనాటికే సారిపుత్రుడు, మహా మౌద్గల్యాయనుడు, రాహులుడూ మరణించారు. బౌద్ధసంఘంలో తదుపరి స్థానంలో ఉన్న మహాకాశ్యపుడు పావానగరంలో ఉన్నాడు. బుద్ధుని మరణ వార్తను తెలుసుకున్న మహా కాశ్యపుడు వెంటనే బయలుదేరి కుసీనగరం చేరాడు. బుద్ధుని చితికి మహాకాశ్యపుడు నిప్పంటించాడు. చివరికి అవశేషాల్ని ఎనిమిది రాజ్యాలు పంచుకున్నాయి. వారికి కొలపాత్ర (మానిక)తో పంచి ఇచ్చిన ద్రోణుడు ఆ మానికను తీసుకున్నాడు. పిప్పిలి రాజ్యం వారు మిగిలిన భస్మాన్ని తీసుకున్నారు. ఆ అవశేషాలపై ఆలా పదిస్మారక స్థూపాలు నిర్మించాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
మంచిమాట... మంచి ప్రవర్తన... మంచి సమాజం
ఉదయం నిద్రలేవగానే హాయిగొలిపే దృశ్యాలను చూడాలి, మనసును ఆహ్లాదపరిచే సంగీతం వినాలి, మంచి మాటలు వింటూ సంస్కారవంతమైన పరిసరాలలో గడపాలి. అప్పుడే మనిషి మానసికంగా ఉల్లాసంగా రోజును గడుపుతాడు. ఆ ప్రభావంతో శారీరంగా ఆరోగ్యంగా ఉంటాడు. అలా కాకుండా ఉదయం నిద్రలేవగానే ఒళ్లు గగుర్పొడిచే భయానక సంఘటనలను చూస్తే ఆ రోజంతా మనసు భావోద్వేగాలకు లోనవుతుంటుంది. ఆ ప్రభావం రక్తప్రసరణ మీద చూపుతుంది. రోజూ ఇవే చేస్తుంటే దేహం, మనసు రెండూ అనారోగ్యం పాలవుతాయి. కొన్నేళ్లపాటు కొనసాగితే దేహం దీర్ఘకాలిక అనారోగ్యాలకు నిలయమవుతుంది. క్షణికావేశం, చిన్న విషయాలకే ఆవేశ పడడం, స్థితప్రజ్ఞత లోపించడం, చిన్న వివాదానికి చంపుకోవడం వంటివి ఎక్కువవుతాయి. ఈ లక్షణాలు ఆ మనిషిలో స్వతహాగా లేకపోయినా కూడా పైన చెప్పిన జీవన స్థితిలో అవన్నీ వచ్చి చేరుతాయి. మనుషుల్లో ప్రకోపాలు, ఉద్రేకాలకు నిత్యం మనం ప్రసారమాధ్యమాలలో చూస్తున్న కథనాలు కూడా కారణమే. సంచలనాల కోసం ఒక సంఘటనను భయానకంగా కథనం అల్లడం వల్ల వాటిని తయారు చేసే వారి ఆరోగ్యం, చూసే వారి ఆరోగ్యం, మానసిక ప్రవర్తనలు ప్రభావితమవుతుంటాయి. ఓం శాంతి బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం రాజస్థాన్ రాష్ట్రం, సిరోహి జిల్లా అబూ రోడ్‌లోని శాంతివనంలో నిర్వహించిన జాతీయ స్థాయి మీడియా సమావేశంలో ఇదే విషయాలను చర్చించారు. సమాజం మీద సానుకూల ప్రభావాన్ని చూపించే వార్తాకథనాలను విస్తృతంగా ప్రచురిస్తూ, భయోత్పాలకు లోను చేసే వార్తలను క్లుప్తంగా ప్రచురించడం ఒక మధ్యేమార్గం. ఈ మార్గం... విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి ఒక సోపానం అవుతుంది. అందుకేనేమో బుద్ధుడు కూడా సమ్యక్ వాక్కు అని మంచి మాటకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాడు. -
అనుకరణ అనర్థ దాయకం
పూర్వం వారణాసిలో ఒక కాకి ఉండేది. దాని పేరు సవిట్ఠకుడు. ఆ రోజుల్లో వారణాసిలో కరువు వచ్చింది. ఆహారం దొరక్క సవిట్ఠకుడు తన భార్యను వెంట తీసుకుని ఆహారం కోసం వెదుకుతూ హిమాలయాలకు చేరాడు. అక్కడ ఒక పెద్ద సరస్సు కనిపించింది. ఆ సరస్సు సమీపంలో వీరకుడు అనే ఒక నీటి కాకి కనిపించింది. వీరకుడు రెక్కలాడిస్తూ, నీటిమీద తిరుగుతూ, ఉన్నట్టుండి నీటిలో మునిగి చేపను పట్టి తెచ్చి కడుపారా తినేవాడు. వీరకుణ్ణి చూసిన సవిట్ఠకుడు దగ్గరకు వెళ్లాడు. తమ ఇబ్బందిని వివరించాడు. ‘‘మంచిది. ఇక్కడే ఉండండి. ఆహారం నేను తెచ్చి పెడతాను’’అని వీరకుడు అభయం ఇచ్చాడు. రోజూ చేపల్ని పట్టి తెచ్చి, తాను తిని మిగిలినవి వారికి ఇచ్చేవాడు. అలా కొన్నాళ్లు జరిగింది. ఒకరోజున సవిట్ఠకునికి ఒక ఆలోచన వచ్చింది. ‘నేనూ నల్లగా ఉన్నాను. ఈ వీరకుడూ నల్లనే. మా ఇద్దరి కాళ్లూ, కళ్లూ, రెక్కలూ అన్నీ ఒకేవిధంగా ఉన్నాయి. మరి నేనెందుకు చేపల్ని పట్టలేను? ఈ వీరకుని దయాభిక్ష మీద బతకాల్సిన పనేముంది?’ అనుకున్నాడు. వీరకునితో అదే విషయం చెప్పాడు. ‘‘మిత్రమా! ఆ పని చేయకు. నేను నీటి కాకిని. నీవు కాకివి. నీకిది తగదు. నన్ను అనుకరించకు. ఆపద తెచ్చుకోకు. ఒకరి మీద ఆధారపడడం నచ్చకపోతే ఈ సరోవర తీరాన్ని వదిలి అడవిలోకి వెళ్లు. అక్కడ నువ్వు హాయిగా వేటాడి జీవించగలవు’’ అని హితవు చెప్పాడు వీరకుడు. కాని సవిట్ఠకుడు మిత్రుని మాటలు వినలేదు. వీరకుణ్ణి అనుకరిస్తూ నీటిపై వేగంగా ఎగిరి నీటిలో మునిగాడు. తిరిగి పైకి వచ్చేటప్పుడు నాచులో చిక్కుకున్నాడు. ఊపిరాడక మరణించాడు. లేనిపోని గొప్పలకు పోయి ఇతరులను అనుకరించడం వల్ల కలిగే అనర్థాలను గురించి వివరిస్తూ, బుద్ధుడు దేవదత్తుని గురించి చెప్పిన జాతక కథ ఇది. – డా. బొర్రా గోవర్ధన్ -
సంఘజీవిలా బతకాలి
మనుషులు రకరకాలు. కొందరు అందరితో కలివిడిగా ఉంటారు. కొందరు తమకు నచ్చిన కొందరితోనే స్నేహం చేస్తారు. ఇంకొందరు ఏ ఒక్కరితో కలవకుండా, ఎవ్వరినీ కలుపుకోకుండా తమకు తాముగా ఒంటరిగానే బతుకుతుంటారు. బౌద్ధసంఘంలో కూడా కొందరు భిక్షువులు ఇలాగే ఉండేవారు. సంఘంలో ఇతర భిక్షువులకు ఎలాంటి సహాయ సహకారాలూ అందించేవారు కాదు. అలాంటి వారు శ్రావస్తిలో ఆరుగురున్నారు. వారిని షడ్వర్గీయ భిక్షువులంటారు. అక్కడే మహానాగుడు అనే భిక్షువు ఉండేవాడు. అతను ఏ భిక్షువుకి ఏ అవసరం వచ్చినా కల్పించుకుని మరీ సహాయం చేసేవాడు. అందరితో స్నేహంతో మెలిగేవాడు. అందరి విషయాలు నీకెందుకు, నీవేమైనా సంసారివా? మన పని మనమే చూసుకోవాలి. అని ఎప్పడూ మహానాగుణ్ణి నిందించేవారు షడ్వర్గీయులు. పైగా వారంతా వెళ్లి ఈ విషయం బుద్ధునితో చెప్పారు. మహానాగుణ్ణి మందలించమన్నారు. అప్పుడు బుద్ధుడు– ‘‘భిక్షువులారా! మనిషికంటే సంఘం గొప్పది. సంఘంలో అందరూ ఒకరికోసం మరొకరు కృషి చేయాలి. సహాయ సహకారాలు అందించుకోవాలి. ప్రతివ్యక్తీ అందరికీ మిత్రుడు కావాలి. సమాజంలో అందరితో కలసి మెలసి మైత్రి సలిపే వ్యక్తి సముద్రజలాల్లో బతికే చేపలాంటివాడు. ఆ జలాలు ఎప్పుడూ ఎండవు. అలాకాక ఏ కొందరితోనో స్నేహంగా బతికేవాడు చెరువు లో చేపలాంటివాడు. ఆ జలాలు కొంతకాలమే ఉంటాయి. ఇక, ఏకాంతంగా, ఒంటరిగా బతికేవాడు ఒడ్డున పడ్డ చేపలాంటివాడు’’ అని చెప్పాడు.భిక్షువుకి ఉండాల్సిన సామాజిక బాధ్యత ఏమిటో మిగిలిన వారికి అర్థమైంది. మహానాగుణ్ణి అనుసరించి, అందరికీ తలలో నాలుకలా మెలిగారు. -
రూపకాయంగా కాదు...ధర్మకాయంగా చూడాలి!
బౌద్ధకేంద్రమైన శ్రావస్తిలో పుట్టి పెరిగిన సుభద్రకు పెళ్లయింది. అత్తవారిల్లయిన రమణక నగరానికి ఆమె తొలిసారి వచ్చింది. అది బుద్ధభగవానుల గురించి ఏమాత్రం తెలియని ఊరని కొద్దిరోజుల్లోనే ఆమె గ్రహించింది. శ్రావస్తిలో తరచు బుద్ధుని దర్శిస్తూ ఆయన బోధనలు వినడానికి అలవాటు పడిన సుభద్రకు అక్కడ ఉండటం కష్టమనిపించింది. ఒకరోజు ఆమె మిద్దెమీదికెళ్లి, శ్రావస్తి దిక్కుగా చూస్తూ, ‘‘భగవాన్! ఇక్కడ మీ గొంతు వినపడటం లేదు. మీరు కనపడటం లేదు. మీకు, మీ భిక్షుక సంఘానికి ఏ లోటూ రాకుండా నేను చూసుకుంటాను. నా గోడు విని సత్వరం మీరు రమణక నగరం రావాలి. ప్రాణం పోయినా సరే, మీకు ఆతిథ్యం ఇచ్చికానీ నేను భుజించను’’అని ప్రార్థించింది. విచిత్రంగా బుద్ధుడు భిక్షుక సంఘంతో ఆ నగరంలోకి ప్రవేశించి, నేరుగా ఆమె ఇంటికే భిక్షకు వచ్చాడు. మహదానందంతో వారికి ఆతిథ్యమిచ్చి, తన మనసులోని బాధను ఆయనకు చెప్పుకుంది సుభద్ర. అప్పుడు బుద్ధుడు ‘‘అమ్మా! సుభద్రా! నన్ను రూపకాయంగా చూడటం కాదు, ధర్మకాయంగా చూడు. రూపకాయం కొన్నాళ్లకు శిథిలమై అంతరించిపోతుంది. ధర్మకాయం శాశ్వతంగా ఉంటుంది.. ఈ సత్యాన్ని సదా గుర్తుంచుకో! నిజానికి మనం ఎక్కడున్నా సర్దుకుపోవడం నేర్చుకోవాలిన. భూమాతనే చూడు! ఒకచోట సమతలంగా; వేరొక చోట ఎత్తుపల్లాలుగా, ఇంకొక చోట కంటకమయంగా ఉంటుంది. భూమి ఎలా ఉన్నా, జత చెప్పులుంటే చక్కగా నడిచి పోవచ్చు. అలాగే జీవితంలో ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా అధిగమించడానికి కుశల చిత్తం ముఖ్యం! చింతను దూరం చేసేది కుశల చిత్తమే! నీవు ఎల్లప్పుడూ కుశల చిత్తంతో ఉంటే శ్రావస్తి అయినా రమణక నగరమైనా ఒకేలా కనిపిస్తాయి’’అన్నాడు సుభద్రను వాత్సల్యదృష్టితో చూస్తూ! బుద్ధభగవానుల అమృతవాక్కులతో సుభద్ర మనసులోని బాధ తొలగిపోయింది. – చోడిశెట్టి శ్రీనివాసరావు -
జ్ఞాన సేద్యం
కోసల రాజ్య రాజధాని శ్రావస్తి సమీపంలోని ఒక చిన్న గ్రామంలో నివసించే సుమంగళుడు నిరుపేద. పొట్ట గడవడం కూడా కష్టంగా ఉండేది. పంట చేలలోని పరిగలు ఏరుకుని జీవిస్తుండేవాడు. ఒకరోజున శ్రావస్తికి వెళ్ళాడు. అక్కడ రాజుగారు ప్రసేనుడు భిక్షువులకు ఆహార పదార్థాల్ని దానం చేయడం చూశాడు. తానూ భిక్షువుగా మారితే తిండికి ఇబ్బంది ఉండదు అనుకున్నాడు. ఒకరోజు బుద్ధుని ప్రబోధం విని, భిక్షువుగా మారాడు. భిక్షుసంఘంలో పాటించే నియమాలు, చదువు, శిక్షణలు ఎంతో కఠినం అనిపించాయి. పట్టుమని పదిరోజులు కూడా సాధన చేయలేకపోయాడు. భిక్షువుగా జీవిస్తే ధర్మం తెలుస్తుంది. జ్ఞానం, గౌరవం కలుగుతాయి. నిజమే! కానీ సాధన చేయడమే అతి కష్టంగా తోచింది. ఈ జీవితం కంటే పాత జీవితమే సులువు అనిపించి, ఆరామాన్ని వదిలి గ్రామం దారి పట్టాడు. మండు వేసవి, వడగాలులు, చెట్టు నీడన కూడా నిలవలేని ఎండతీవ్రత. అయినా, మండుటెండలో వరి కుప్పలు నూర్చుతున్న రైతుల్ని చూశాడు. వంటినిండా దుమ్ము, నూగు, చెమటతో తడిసి ముదై్దన శరీరాలు... వారి పరిశ్రమ చూసి ఆలోచనలో పడ్డాడు. కష్టపడకపోతే ఫలితం దక్కదు. జ్ఞానార్జన కూడా వ్యవసాయమే అనుకుని వెనుదిరిగి ఆరామానికి వెళ్లాడు. కష్టాన్ని ఇష్టంగా మార్చుకున్నాడు. అతి తక్కువ కాలంలో మంచి భిక్షువుగా, జ్ఞానిగా పేరుపొందాడు. – డా. బొర్రా గోవర్దన్ -
బౌద్ధదేశంగా మారనున్న భారత్
-బుద్ధవిహార్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గొల్లపల్లి -ఘనంగా బుద్ధ జయంతి వేడుకలు అమలాపురం రూరల్ : బౌధ్ద ధర్మాన్ని ఆచరిస్తున్న దేశాల్లో ఒకటైన భారత్ త్వరలోనే బౌద్ధదేశంగా మారనుందని బుద్ధవిహార్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అన్నారు. వైశాఖ పౌర్ణమి, బుద్ధ జయంతి సందర్భంగా బుధవారం ఇక్కటి త్రిరత్న బుద్ధవిహార్‌లో బుద్ధుని విగ్రహానికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. బుద్ధుడి జననం, ఆయనకు జ్ఞానోదయం వైశాఖ పౌర్ణమి రోజునే జరిగాయపి చెప్పారు. శాంతి, ప్రేమ, దయ బౌద్ధధర్మం ద్వారానే వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. ప్ర«««ధాన కార్యదర్శి డీబీ లోక్ అధ్యక్షతన జరిగిన సభలో సామాజికవేత్త ఎం.ఎ.కె.భీమారావు, బౌద్ధ ఉపాసకులు పినిపే రాధాకృష్ణ, పెయ్యల శ్రీనివాసరావు, దోనిపాటి ఆంజనేయులు, కాశీపరశు రాంబోది, దోనిపాటి నాగేశ్వరరావు, రేవు ఈశ్వరరావు, ఉండ్రు ఆశీర్వాదం, జిల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆదుర్రు బౌద్ధస్థూపం వద్ద.. మామిడికుదురు (పి.గన్నవరం) : పురాతన ఆది బౌద్ధస్థూపం వద్ద బుధవారం బుద్ధ జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బుద్ధవిహార్ ట్రస్టు ప్రాంగణంలో పంచశీల పతాకావిష్కరణ, త్రిశరణ, పంచశీల, బుద్ధ వందన, ధమ్మ వందన, సంఘ వందన తదితర కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థూపం చుట్టూ ప్రదక్షణలు చేసి బుద్ధ వందనం చేశారు. ధమ్మ ప్రవచనాలు, ధమ్మపాలన గాథ తదితర అంశాలను భక్తులకు వివరించారు. ఉపాసక రొక్కాల రాజన్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో బర్మాకు చెందిన బౌద్ధ భిక్కులు పనసక్క, విసుత, థాయ్‌లాండ్‌కు చెందిన సంగియాన్, బూన్‌సాంగ్, సయన్బ్రహనిన్ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బుద్ధుడు దేశంలో స్వర్ణ యుగానికి నాంది పలికాడని భిక్కులు పేర్కొన్నారు. భారతీయ వారసత్వ సంస్కృతులన్నింటిలో అత్యంత ప్రాచీనమైనది బౌద్ధ జీవన విధానమన్నారు. అనంతరం స్థానిక బుద్ధవిహార్‌లో ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించారు. బుద్ధవిహార్ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల్లో అధ్యక్ష కార్యదర్శులు చింతా శ్రీరామ్మూర్తి, ఎస్ఎస్ఆర్ భూపతి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, మట్టా వెంకట్రావు, చింతపల్లి స్వరూపారాణి, పిల్లి రాంబాబు, సరెళ్ల వెంకటరత్నం, తాడి సురేష్, జి.వెంకటేశ్వరరావు, పెనుమాల సుధీర్, ట్రస్టు ప్రతినిధులు పులపర్తి కృష్ణ, గాలిదేవర సత్యనారాయణ, బళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
బుద్ధుని సత్యాన్వేషణ
సందేశం ‘‘తర్జనీ దర్శయత్యన్యం సద్యస్త్వామంగుళీత్రయమ్’’ నీచూపుడు వేలుతో ఇతరులను చూపిస్తావు కాని, అదే సమయంలో మూడు వేళ్ళు నిన్ను చూపిస్తాయి... గ్రహించు!’’ అందుకే సత్యాన్నే పలకాలి. దాన్ని ప్రియంగా చెప్పాలి. నేను చెప్పేది సత్యాన్నే కదా అని ఎన్నడూ కఠినంగా, పౌరుషంగా చెప్పరాదు. బుద్ధ భగవానుని చరిత్ర మనకు తెలిసిందే. ఆయన జీవితం మానవ జాతికి చాలా ఆదర్శమైనది. బుద్ధుడు మహారాజవంశంలో పుట్టినా, అనేక భోగభాగ్యాలున్నా కూడా వాటిని త్యాగం చేసి సర్వసంగపరిత్యాగి అయ్యాడు. సత్యాన్వేషణకై తపస్సు చేసి జ్ఞాని అయ్యాడు. అలాంటి బుద్ధ భగవానుని ఒక వ్యక్తి ప్రతిరోజూ దూషించేవాడు. ముఖం ఎదుటే దుర్భాషలాడేవాడు. కాని అందుకు బుద్ధునిలో ఎలాంటి స్పందన ఉండేది కాదు. మౌనంగానే వుండిపోయేవాడు. కొంత కాలం గడిచిన తర్వాత బుద్ధ భగవానుడు నోరు మెదిపాడు.‘‘అయ్యా! ఏదైనా మనం ఇతరులకిచ్చినప్పుడు మనం ఇచ్చింది వారు తీసుకోకపోతే అది తిరిగి ఇచ్చిన వారికే చెందుతుంది కదా! అలాగే మీ దూషణలను కూడా నేను స్వీకరించలేదు’’ అని చాలా ప్రశాంతంగా బదులు పలికాడు. ఆ వ్యక్తిలో చలనం కలిగింది. ఆలోచించే కొద్దీ భయం కలిగింది. ‘అనవసరంగా ఒక దయామూర్తిని నిందించానే’ అని పశ్చాత్తాపంతో ఏడుస్తూ బుద్ధుని పాదాలపై పడి క్షమాపణ కోరాడు. బుద్ధుడు అంతే ప్రశాంత వదనంతో ‘‘నేనెప్పుడో క్షమించి వేశాను. మీ తిట్ల వల్ల నాలో ఎలాంటి భావమూ లేదు. మీరు బాధపడవలదు’’ అని ఓదార్చి పంపించాడు. ఇలాంటి సంఘటనలు లోకంలో అనేకం జరుగుతుంటాయి.వాటన్నింటినీ పట్టించుకుంటే గమ్యం చేరలేము. సాధకులైన వారు ఏకాగ్రత వీడకుండా వుండాలి. ఇతర విషయాలేవీ పట్టించుకోరాదు.సాధకుడికి సాధన కాలంలో అనేక అంతరాయాలేర్పడతాయి. వాటిని లెక్క చేయకుండా గమ్యం వైపు దృష్టి సారించి కృషి చేయడమే ముఖ్యం. దేనిని సాధించాలన్నా నిర్దిష్ట మార్గంలో పట్టుదల కలిగి ఉండాలి. ఉత్తమ సాధకులెవ్వరూ తమ గమ్యం చేరే వరకూ వదిలిపెట్టరు. వాళ్ళు ప్రజ్ఞానిధులు కనుక ప్రారబ్ధార్ధాన్ని వదిలిపెట్టరు. విఘ్నాలు ఎన్ని వచ్చినా వారి ప్రయత్నానికి ఆటంకం కలిగించలేవు. సత్యదర్శనం కలిగే వరకు నిరంతర సాధన జరగడమే సరైన నిర్ణయం.బుద్ధ భగవానుని సత్యాన్వేషణలో చెదరని పట్టుదల ఉంది. అందుకు తగిన నిరంతర సాధన వుంది కనుకనే జీవిత సత్యాన్ని కనుగొన్నాడు. ఆయన మాట, ఆయన బాట ఎన్ని యుగాలకైనా ఆదర్శవంతమైంది... ఆచరణీయమైంది. -
బౌద్ధం @ బాదన్‌కుర్తి
బుద్ధుని శిష్యుల ఆవాసం ఇదే.. ∙బుద్ధుడిని కలసిన 16 మంది యువకులు ఇక్కడివారే ఆయన ఆదేశంతో ఇక్కడ్నుంచే బౌద్ధ ప్రచారానికి శ్రీకారం నిర్మల్ జిల్లా బాదన్‌కుర్తిలో వెలుగుచూసిన తొలి తరం బౌద్ధ నిర్మాణాలు సాక్షి, హైదరాబాద్: బుద్ధుడు సజీవంగా ఉండగానే బౌద్ధ ప్రచారానికి నడుం బిగించిన బృందం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిందే అన్న విషయం ఎందరికి తెలుసు? ఇప్పటి వరకు చరిత్రపుటల్లోనే నిక్షిప్తమైన ఆ అంశానికి సంబంధించి తిరుగులేని ఆధారాలు వెలుగులోకి వచ్చా యి. నేరుగా బుద్ధుడిని కలిసి ఆయన ఆదేశంతో బౌద్ధ ప్రచారాన్ని ప్రారంభించిన తొలి బృందం ప్రస్తుత నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బాదన్‌కుర్తి ప్రాంతానికి చెందినదే! ఈ విషయం బౌద్ధ గ్రంథం సుత్తనిపాతంలోని పారాయణ వగ్గలో ఉంది. కానీ సాక్ష్యాలు లేకపోవడంతో ఇదంతా వట్టి ప్రచారమే అన్న వాదన కొనసాగింది. కానీ అది నిజమని చాటే ఆధారాల జాడ ఇప్పుడు దొరికింది. సుదీర్ఘ ప్రయత్నం తర్వాత బుధవారం దాని జాడ వెలుగుచూసింది. వెరసి రెండున్నర వేల ఏళ్ల నాటి అత్యం త కీలక చారిత్రక సాక్ష్యం ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం తెలంగాణకు దక్కింది. తెలంగాణ వేదికగా బౌద్ధ చరిత్రకు ఇది కీలక పరిణామంగా భావిస్తున్నారు. బాదన్‌కుర్తి బౌద్ధ సంస్కృతి వ్యాప్తికి ప్రధాన కేంద్రంగా భాసిల్లిన తీరును గతంలోనే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ మేరకు జూలైలో ప్రత్యేక కథనం కూడా ప్రచురించింది. ఆ ప్రస్తావన ఇక్కడిదే..: బౌద్ధ సాహిత్యంలో గోదావరి నదీ ప్రస్తావన.. బాదన్‌కుర్తి గ్రామానికి సంబంధించిందే అయి ఉంటుందని చరిత్రకారులు చాలాకాలం క్రితమే పేర్కొన్నారు. ‘మహాజనపథ రాజ్యం అస్మక పాలన కాలం.. గోదావరి నది రెండుగా చీలిన ప్రాంతంలోని ఆవాసానికి చెందిన బావరి ఆధ్వర్యంలో 15 మంది యువకులు బుద్ధుని కలసి ఆయన బోధనలకు ప్రభావితులయ్యారు. వారు ఆయన బోధనలను విశ్వవ్యాప్తం చేసేందుకు బయలుదేరారు’ అని సుత్తనిపాతం పారాయణవగ్గలో బుద్ధునికాలంలోనే లిఖించి ఉంది. అస్మక పాలన పరిధి తెలంగాణలోనే ఉంది. ఇక్కడ గోదావరి రెండుగా చీలిన ప్రాంతం ఇక్కడే కనిపిస్తుంది. అదే బాదన్‌కుర్తి గ్రామం ఉన్న చోటు. అది నదీ ద్వీపంగా భావిస్తారు. గోదావరి రెండుగా చీలగా మధ్యలో ఏర్పడ్డ భూభాగంలో ఉన్న ఒకేఒక్క జనావాసం ఈ గ్రామం. బావరి పేరుతోనే ఈ ప్రాంతానికి బాదన్కుర్తిగా పేరు వచ్చిందని పేర్కొన్నారు. కానీ ఆ గ్రామంలో ఇప్పటి వరకు ఎక్కడా బౌద్ధ సంస్కృతిని చాటే ఒక్క నిర్మాణం జాడ వెలుగు చూడలేదు. దీంతో ఆ వాదనలో సత్యం లేదనే వాదన మొదలైంది. కానీ ఇప్పుడు బౌద్ధ స్థూపానికి చెందినదిగా భావిస్తున్న నిర్మాణాల జాడను గుర్తించారు. ఇవి బౌద్ధానికి చెందిన తొలి నిర్మాణాలుగా భావిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచే బౌద్ధమత ప్రచారం మొదలై ఇతర దేశాలకూ విస్తరించిందని అంచనా వేస్తున్నారు. బావరి బృందంతోపాటు అప్పట్లో బయలుదేరిన మరికొన్ని బృందాలే ప్రపంచానికి బౌద్ధాన్ని పరిచయం చేశాయి. వెలుగుచూసిన పురాతన ఇటుకల వరుస తెలంగాణలో బౌద్ధానికి చెందిన జాడలు చాలా వెలుగుచూశాయి. వాటి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన బుద్ధవనం ప్రాజెక్టు అధికారులే తాజాగా బావన్కుర్తిలో నిర్మాణాల జాడ కనిపెట్టారు. స్థానిక దత్తాత్రేయ దేవాలయం వెనకవైపు గోదావరి తీరం చేరువలో పురాతన ఇటుకల వరుస బయటపడింది. రెండడుగుల పొడవున్న ఆ ఇటుకలను వెలికితీసి పరిశీలింగా అవి బౌద్ధ స్థూప నిర్మాణాల్లో వాడేవని రూఢి అయింది. దీంతో అక్కడే బౌద్ధ స్తూపంతోపాటు ఇతర నిర్మాణాలు ఉండిఉంటాయని భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపి విలువైన ఆ నిర్మాణాలను వెలుగులోకి తేవాలని కేంద్రానికి లేఖ రాయాలని బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య నిర్ణయించారు. బౌద్ధ చరిత్రలో ఇది కీలక పరిణామం బావన్కుర్తి ప్రస్తావన బౌద్ధ సాహిత్యంలో ఉన్నా.. దాన్ని రూఢి చేసే ఆధా రాలు లేకపోవటం ఇంతకాలం వెలితి. ఇప్పుడు వాటి జాడ దొరకటం బౌద్ధ చరిత్రలో కీలక పరిణామం. బుద్ధుడిని స్వయంగా కలిసి ఆయన బోధన లను విశ్వవ్యాప్తం చేసేందుకు బయలుదేరిన బృందం తెలంగాణకు చెం దినది కావటం విశేషం. త్వరలో చేపట్టబోయే బుద్ధిస్ట్ సర్క్యూట్ ప్రాజెక్టుకు ఇది కీలకం కానుంది. ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపి భూగర్భంలో నిక్షిప్తమైన బుద్ధుడి కాలంనాటి అపురూప కట్టడాలను ప్రపంచం ముందు నిలపాల్సి ఉంది. – మల్లేపల్లి లక్ష్మయ్య, బుద్ధవనం ప్రత్యేకాధికారి -
పేరులో ఏముంది?
శ్రావస్తిలో పాపకుడు అని భిక్షువు ఉండేవాడు. ప్రతివారూ తనను ‘పాపకుడా’ అని పిలవడం ఇష్టం ఉండేది కాదు. ఎంతో బాధపడేవాడు. చివరకు తన పేరు మార్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకొని బుద్ధుని దగ్గరకు వచ్చి, విషయం చెప్పాడు. ‘భిక్షూ! పేరులో ఏముంటుంది? మన బుద్ధిలో ఉండాలి. అందమైన పేరు ఉన్నవాళ్లందరికీ మంచి బుద్ధులు ఉండవు. అలాగే పేరు అందంగా లేని వాళ్లందరికీ చెడ్డబుద్ధులు రావు. పేరు అనేది ఒక గుర్తు మాత్రమే. ఒక వ్యక్తిని గుర్తించడం కోసమే ఈ పేరు. అతని మంచి చెడ్డల్ని కొలవడానికి కాదు’’ అని చెప్పాడు. బుద్ధుడు ఎన్నిసార్లు చెప్పినా అతను పదే పదే ‘‘నా పేరు మార్చండి’’ అనే అడిగేవాడు. దానితో బుద్ధుడు అలోచించి – ‘‘భిక్షూ! గ్రామాల్లోకి వెళ్లు. నీకు ఏ పేరు మంచిదో, దేనివల్ల గుణం తెలుస్తుందో ఆ పేరును ఎంచుకురా!’’ అని చెప్పి పంపాడు. పాపకుడు సంతోషంగా బయలుదేరాడు. ముందుగా ఒక గ్రామానికి చేరే ముందు ఒక శవయాత్ర ఎదురైంది. ‘‘ఆ చనిపోయింది ఎవరు?’’ అని అడిగాడు పాపకుడు. ‘‘అతను జీవకుడు’’ అన్నారు. ‘‘జీవకుడు చనిపోవడం ఏంటి?’’ అడిగాడు. ‘‘ఓరి పిచ్చివాడా! జీవకుడైనా, అజీవకుడైనా చనిపోవాల్సిందే! జీవకుడనేది వట్టి పేరు మాత్రమే’’ అన్నారు. ఆ భిక్షువు మరొక గ్రామం వెళ్లాడు. అక్కడ ఒక పశువు కొట్టం మూల తిండిలేక అల్లాడుతూ, పాచి అన్నం తింటున్న ఒక బిచ్చగత్తె కనిపించింది. ‘‘అమ్మా నీవు ఎవరివి?’’ అని అడిగాడు. ‘‘అయ్యా! నా పేరు ధనపాలి. బిచ్చగత్తెను’’ అంది. మరో గ్రామం పోయాడు. ఒకడు భార్యను పచ్చిబూతులు తిడుతూ, కర్రతో కొడుతూ కనిపించాడు – ‘‘అయ్యా! ఆ కొట్టే వ్యక్తి ఎవరు?’’ అని అడిగాడు. ‘‘ఆయన పేరు శాంతిధరుడు. అతను కొడుతున్న ఆమె అతని భార్య భద్ర’’ అని చెప్పారు పక్కవారు. ఇవన్నీ చూశాక, పేరులో ఏమీలేదు అని నిర్ణయించుకొని, తిరిగి వచ్చాడు పాపకుడు. ఇంకెప్పుడూ తన పేరు మార్చుకోవాలనుకోలేదు. బుద్ధుణ్ణి అడగలేదు. – బొ్రర్రా గోవర్ధన్ -
బుద్ధుని జాతక కథల చిత్ర ప్రదర్శన
విజయపురి సౌత్: స్థానిక లాంచీస్టేషన్లో శుక్రవారం జిల్లా సోషల్ వెల్ఫేర్ జాయింట్ కలెక్టర్, టూరిజం ఇన్చార్జి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అమరావతి బుద్ధ విగ్రహం రూపకర్త రేగుళ్ల మల్లికార్జునరావు బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించి ఆయన గీసిన చిత్రాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల సంవత్సరాల కిందట ఏ ఆంధ్రప్రదేశలో బౌద్ధం పరిఢవిల్లిందని చెప్పారు. అప్పట్లోనే అమరావతిలోని బౌద్ధ స్థూపంపై ఆంధ్రులు బుద్దుని జీవిత కథలు, జాతక కథలు, ఆనాటి మానవ జీవనానికి సంబంధించిన శిల్పాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆంధ్రా శిల్పుల గొప్పతనం గురించి వారు చెక్కిన శిల్పాలను చిత్రాలుగా గీసి ఇప్పటికే సింగపూర్, చైనా, భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో 75 ప్రదర్శనలు ఇచ్చినట్లు తెలిపారు. లాంచీస్టేషన్లో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను పలువురు పర్యాటకులు ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో లాంచీ యూనిట్ మేనేజర్ వి.సూర్యచందర్‌రావు, సిబ్బంది ఉన్నారు. -
మునిగిపోకుండా ఉండాలంటే..!
బౌద్ధవాణి ‘సమ్యక్ సంకల్పం, సమ్యక్ జ్ఞానం ఉండి, మన మనస్సు దృఢంగా ఉంటే మనం దుఃఖ సాగరంలో మునిగిపోం’ అని తెలియజెప్పే సంఘటన ఇది. బుద్ధుడు శ్రావస్తిలోని జేతవనంలో ఉన్నాడు. ప్రతిరోజూ సాయంత్రం తొలి జాములో ధర్మోపదేశం చేసేవాడు. శ్రావస్తి సమీపంలో అచిరవతి నది పాయ ఒకటి ఉండేది. దానికి ఆవలి వైపు గ్రామంలో సుజాతుడనే బుద్ధుని అభిమాని ఒకడుండేవాడు. అతను గృహస్థుడే అయినా ‘బుద్ధ ధమ్మా’న్ని చక్కగా పాటిస్తుండేవాడు. ‘పంచశీల’ను ఆచరించేవాడు. ఒకసారి అతను బుద్ధుని ప్రవచనం వినడానికి బయలుదేరాడు. నదీ తీరానికి వచ్చేసరికి పడవల వాళ్లెవరూ లేరు. అయినా వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. ధైర్యంతో నీటిలో దిగాడు. ‘పంచశీల’ పఠించాడు. ధమ్మాన్ని స్మరించాడు. అడుగు ముందు కేశాడు. విచిత్రం అతను నీటిలో దిగిపోలేదు. నీటి పైన నడుస్తూ వెళ్లిపోతున్నాడు. అలా కొంతదూరం వెళ్లాడు. అక్కడే నదిలో అలలు అల్లకల్లోలంగా ఉన్నాయి. అతని దృష్టి అలల మీదికి మళ్లింది. అంతే... మనస్సులో భయం పొడసూపింది. అంతే... సుజాతుడు మెల్లగా నీటిలోకి దిగబడిపోతున్నాడు. అతను వెంటనే చంచలమైన తన చిత్తాన్ని దిటవు పరచుకున్నాడు. తిరిగి నీటి మీద తేలి, నడచి ఆవలి ఒడ్డుకు వెళ్లిపోయాడు. బుద్ధుని దగ్గరకు వెళ్లి నమస్కరించాడు. ‘‘సుజాతా! ఎలా వచ్చావు?’’ అని అడిగాడు బుద్ధుడు. సుజాతుడు జరిగింది చెప్పాడు.‘‘దృఢ చిత్తం లేనివానికి మనస్సు వ్యాకులత చెందుతుంది. బలహీనపడుతుంది. లక్ష్యాన్ని చేరనీయకుండా, నిస్తేజంగా ముంచేస్తుంది. సద్ధర్మమే నిన్ను దుఃఖమనే ఏట్లో మునిగిపోకుండా కాపాడుతుంది’’ అని బుద్ధుడు చెప్పాడు.ఈ కథలో ఒక చక్కటి నీతి ఉంది. భయాన్ని జయించడం, చిత్త బలాన్ని చేకూర్చుకోవడం, సడలని సంకల్పం వల్ల ఎంతటి అవాంతరాన్నైనా దాటవచ్చు అనే బుద్ధ సందేశం. - బొర్రా గోవర్ధన్ -
జింకలు చెప్పే నీతి
నలభై ఐదేళ్ల తన ధర్మప్రచారంలో బుద్ధుడు ఏనాడూ సమయపాలన తప్పలేదు. అయితే, కొందరు భిక్షువులు ధర్మోపదేశాలు వినడానికి రోజూ వచ్చేవారు కాదు. ఒక రోజున అలాంటి ఒక యువ భిక్షుకుడితో, బుద్ధుడు ఈ కథ చెప్పాడు... ‘‘ఓ! భిక్షూ! పూర్వం అరణ్యంలో ఒక జింక ఉండేది. అది ఎన్నో విద్యలు నేర్చింది. అడవిలో ఇతర మృగాల నుండి, వేటగాళ్ల నుండి ఆపద వచ్చినప్పుడు సమయస్ఫూర్తితో ఎలా తప్పించుకోవాలో నేర్చింది. ఆ విద్యల్ని తన జాతివారికంతా నేర్పేది. దాని దగ్గర చతురుడు, చలనుడు అనే రెండు జింకలు చేరాయి. చతురుడు క్రమం తప్పకుండా గురువు చెప్పిన సమయానికి వచ్చేవాడు. చెప్పింది శ్రద్ధగా నేర్చేవాడు. కానీ, చలనుడు సమయానికి వచ్చేవాడు కాదు. దాని వల్ల విద్యలన్నీ నేర్వలేకపోయాడు. ఒక రోజున వేటగాళ్లు పన్నిన వలల్లో ఇద్దరూ చిక్కుకున్నారు. చతురుడు గురువు నేర్పినట్లు గాలిని బంధించి చనిపోయినవాడిలా పడివున్నాడు. కానీ, చలనుడు అలా చేయలేకపోయాడు. వేటగాళ్లు వచ్చి చలనుణ్ణి పట్టి బంధించారు. చతురుణ్ణి చూసి ‘చనిపోయిన జింక’ అనుకొని వలను ఎత్తారు. చలనుడు తప్పించుకొన్నాడు. భిక్షూ! చూశావా! సమయపాలన చేసే విద్యార్థికి పరిపూర్ణ జ్ఞానం లభిస్తుంది. లేనివానికి అరకొర జ్ఞానమే దక్కుతుంది. ఇలాంటి అలసత్వం వల్ల పరిపూర్ణ జ్ఞానివి కాలేవు. నిర్వాణం పొందలేవు’’ అని చెప్పాడు. ఆనాటి నుండి ఆ యువభిక్షువు క్రమం తప్పకుండా శిక్షణ పొందాడు. - బొర్రా గోవర్ధన్ -
అదే పరమధర్మం!
శ్రావస్తి సమీపంలోని అడవిలో హారీతికి అనే నరమాసం భక్షిణి ఉండేది. ఆమె అడవి పొలిమేరల్లో ఉన్న గ్రామాల మీద పడి, దొరికిన చిన్నపిల్లల్ని అపహరించేది. గ్రామాల్లోని తల్లుల ఎంతగానో తల్లడిల్లి, ఈ సమస్యను తీర్చగల నేర్పరి బుద్ధుడేనని విని, ఆయన దగ్గరకు వెళ్లి తమ దుఃఖాన్ని వెళ్లగక్కారు. బుద్ధుడు వారు చెప్పినదంతా మౌనంగా విన్నాడు. వెంటనే లేచి హారీతికి నివసించే కొండగుహ దగ్గరకు వెళ్లాడు. అప్పుడు అక్కడ హారీతికి లేదు. ఆమె యాభైమంది సంతానం మాత్రం అక్కడుంది. వారిలోంచి ఒక చిన్న పిల్లాణ్ణి తీసుకుని తన ఆరామానికి వచ్చేశాడు బుద్ధుడు. కొంతసేపటికి హారీతికి వచ్చి చూస్తే తన బిడ్డల్లో ‘ప్రియంకరుడు’ అనే వాడు కన్పించలేదు. విషయం తెలుసుకుని శ్రావస్తి కేసి ఏడుస్తూ, గుండెలు బాదుకుని రోదిస్తూ పరుగులు తీస్తూ బయలుదేరింది. దారి పొడవునా ‘ఓ! నా ప్రియకుమారా! ప్రియంకరుడా! ఎక్కడున్నావు తండ్రీ! ఎలా ఉన్నావు తండ్రీ!!’’అంటూ పెద్దగా ఆర్తనాదాలు చేస్తూ పోయి, చివరికి బుద్ధుని ఆరామం చేరి, ‘‘ఓ మునీ! నా బిడ్డ ఏమి? వాణ్ణి ఏం చేశావు? చంపుకు తిన్నావా? నీ పాదాలు పట్టుకుంటా... నా బిడ్డను నాకు ఇవ్వు..’’ అంటూ కన్నీరు మున్నీరైంది. అప్పుడు బుద్ధుడు ‘‘తల్లీ! హారీతికీ! కలవరపడకు. ఏడ్వకు. నీ బిడ్డ నా దగ్గరే క్షేమంగా ఉన్నాడు’’అన్నాడు దయాదృక్కులతో. ఆ మాటలు విన్న హారీతికి ముఖంలో ఆనందం, చిరునవ్వులు వెలిగిపోయాయి. ‘‘చూశావా హారీతికీ!! నీకు ఎందరో బిడ్డలున్నారు. వారిలో ఒక్కడు పోగానే ఇంతగా రోదించావు. అలాగే గ్రామాల మీదపడి నీవు అపహరించే తల్లులు కూడా నీకంటే ఎంతో ఎక్కువగా దుఃఖపడతారు. ఎందుకంటే వారికి ఇద్దరో ముగ్గురో పిల్లలు గదా!’’అన్నాడు. ఆమె మౌనంగా తలూపింది. ‘‘తల్లీ! దుఃఖం ఎవరికైనా ఒకటే. ఇతరులు ఏమి చేస్తే మనం దుఃఖపడతామో ఆ పని మనం ఇతరులకు చేయకూడదు. అంతకు మించిన ధర్మం మరొకటి లేదు. ఇకనుండి ఇది తెలుసుకుని జీవించు’’అని ప్రబోధించాడు. ఆనాటి నుంచి హారీతికి బిడ్డల్ని అపహరించడం మానుకుంది. - డా. బొర్రా గోవర్ధన్ -
చెడును ఎలా వదిలించుకోవాలి?
ఒకరోజున బుద్ధుడు రాజగృహ నగర సమీపంలో, ఒక గ్రామంలో ధర్మప్రబోధం చేస్తున్నాడు. మనసును నిర్మలంగా ఉంచుకోవడం ఎలాగో చెప్తున్నాడు. ఆ ప్రబోధం విన్న సుధాముడనే యువకుడు ‘‘భంతే! నేను ఇప్పటిదాకా కొన్ని చెడ్డపనులు చేశాను. చెడు ఆలోచనలతో గడిపాను. ఇకనుండి మంచి ఆలోచనలతో జీవిస్తే సరిపోతుందా?’’ అని అడిగాడు. ‘‘సుధామా! అది మాత్రమే సరిపోదు. నీవు ఒక పడవ మీద ప్రయాణం చేస్తున్నావనుకో. కొంత దూరం పోయాక ఆ పడవ అడుగున పగులు ఏర్పడి పడవలోకి నీరు వచ్చేస్తోంది. అలా పడవ నీటితో నిండితే మునిగిపోతుంది. అప్పుడు నీవేం చేస్తావు?’’ అని అడిగాడు. ‘‘భగవాన్! పడవలోని వచ్చిన నీటిని తోడేస్తాను. ఇంక పడవలోకి నీరు రాకుండా ఆ పగులును పూడ్చేస్తాను’’అన్నాడు. ‘‘మన మనస్సును కూడా ఇలాగే జాగ్రత్త పరచుకోవాలి. కొత్తగా చెడ్డ ఆలోచనలు రాకుండా పగులును పూడ్చాలి. వచ్చిన చెడ్డ ఆలోచనలు మనలో లేకుండా పడవలోకొచ్చిన నీటిని తోడిపారేసినట్టే తోడిపారేయాలి. ఈ రెండు పనులూ చేస్తేనే మనం చెడ్డతనం నుండి దూరం కాగలం’’ అని చెప్పాడు బుద్ధుడు. బుద్ధుని ప్రబోధాన్ని విన్న సుధాముడు క్రమేపీ తన మనస్సులోని చెడ్డ భావాల్ని తొలగించుకుని మంచి భిక్షువుగా రాణించాడు. - బొర్రా గోవర్ధన్ -
చైనాలో బయటపడ్డ బుద్ధుడి అవశేషాలు
బీజింగ్: చైనాలోని నాంజింగ్ నగరంలోని ఓ బౌద్ధాలయంలో గౌతమ బుద్ధుడి అవశేషాలు దొరికాయని చైనా పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వెయ్యి ఏళ్ల క్రితం నాటిదిగా భావిస్తున్న ఓ బాక్సులో గౌతమ బుద్ధుడి కపాలంలోని ఓ పార్శపు ఎముక దొరికందనేది వారి వాదన. ఎర్రచందనం, బంగారం, వెండితో తయారు చేసిన నాలుగు అడుగుల పొడవు, ఒకటిన్నర అడుగుల బాక్సులో ఇతర బౌద్ధ సన్యాసుల అవశేషాలతోపాటు బుద్ధుడి కపాల భాగం దొరికిందని వారు తెలిపినట్లు ఓ చైనా సాంస్కృతిక పత్రికలో ఇటీవల పేర్కొన్నారు. బాక్సు దొరికన రాతి ఫలకం మీద ఆలయాన్ని నిర్మించిన వారి పేరుతోపాటు అవశేషాలున్న వారి పేర్లను కూడా చెక్కారని, దాని ద్వారా అందులో బుద్ధిడి అవశేషాలు ఉన్నట్లు స్పష్టమవుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు. 2010లో జరిపిన తవ్వకాల్లోనే ఈ అవశేషాలు బయటపడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ ప్రజల దృష్టికి రావడంలో ఇంత ఆలస్యం ఎందుకు జరిగిందో ఎవరూ చెప్పడం లేదు. హిరన్నవతి నదీ తీరం వద్ద బుద్ధుడి అంత్యక్రియలు జరిగాయని, అప్పుడు సేకరించిన ఆయన ఎముకల్లో 19 ఎముకలు చైనాకు చేరాయని ఆ శిలాఫలకంపై ఉన్న రాతల ద్వారా తెలుస్తోంది. 11వ శతాబ్దానికి చెందిన జెంగ్జాంగ్ అనే రాజు అప్పటికే శిథిలమైన ఆలయం చోట ఈ బుద్ధుడి అవశేషాలున్న బాక్సును, శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి బౌద్ధాలయాన్ని నిర్మించినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2010లో అక్కడ జరిపిన తవ్వకాల్లో బంగారు, వెండితో తయారు చేసిన ఓ స్థూపం కూడా దొరికిందని, ఆ స్థూపం ముందు కూర్చొని బౌద్ధ సన్యాసులు ధ్యానం చేసే వారని వారంటున్నారు. -
బౌద్ధంపై చక్కటి కథాసంకలనం
సత్గ్రంథం బుద్ధుడు చెప్పినట్లుగా మహాయానంలో ప్రచారంలో ఉన్న కథలకే జాతక కథలని పేరు. ఈ కథలు 430 అని కొందరూ, 547 అని మరికొందరూ చెబుతారు. హిందూమతం బుద్ధిః కర్మానుసారిణి అంటే, కర్మ బుద్ధ్యానుసారిణి అంటుంది బౌద్ధం. బౌద్థంపై అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడి,్డ బొర్రా గోవర్ధన్ వంటివారు ఎన్నో మంచి రచనలు చేశారు. తాజాగా కవి, పరిశోధకుడు, తాళపత్ర గ్రంథ సేకర్త డా. కావూరి శ్రీనివాస్ ‘జాతక కథలు’ పేరిట పుస్తకాన్ని ప్రచురించారు. 41 కథలు ఉన్న ఈ పుస్తకంలో కథలతోపాటు, సంబంధిత నిజచిత్రాలూ ఉండటం విశేషం. చిన్న కథలైనా, చక్కటి నీతిని చెబుతాయి. వీటిని వాడుకభాషలో రాసి ఉంటే బాగుండేది. జాతక కథలు; సేకరణ, రచన: డా. కావూరి శ్రీనివాస్; పుటలు: 92; వెల రూ. 100 ప్రతులకు: తెలంగాణ రాష్ర్ట పర్యాటకాభివృద్ధి సంస్థ, టూరిజం హౌస్, 3-5-891, హిమాయత్ నగర్, హైదరాబాద్- 500 029; ఫోన్: 9849776157 - డి.వి.ఆర్. -
బుద్ధం శరణం శాలిహుండం
ఈ నెల 21న బుద్ధ పూర్ణిమ శాలిహుండం చరిత్రకు సజీవ సాక్ష్యాలు బౌద్ధ ఆరామాలు పశ్చిమ దేశాలకు బౌద్ధం వ్యాప్తికి ఇదే మార్గం ర్యాటకులకు ఆకర్షణగా కాలచక్రం, బౌద్ధమ్యూజియం శాలిహుండం పేరు చెప్పగానే బౌద్ధం మదిలో మెదులుతుంది. బుద్ధుడు ఉత్తర భారతదేశంలో తన బోధనలు ప్రవచించినా దక్షిణ భారతదేశంలోనే అవి సంపూర్ణ వికాసం చెందినవనడానికి సజీవ సాక్ష్యం శాలిహుండం. అంతేకాదు ఇక్కడికి సమీపంలోని కళింగపట్నం రేవు ద్వారానే బౌద్ధ ప్రచారకులు పశ్చిమ దేశాలకు వెళ్లారనడానికి కూడా సాక్ష్యాలు కళ్లకు కడుతున్నాయి. కళింగ రాజ్యంలోని శాలిహుండం బౌద్ధమత వికాసంలో కీలకపాత్ర పోషించింది. క్రీస్తుపూర్వం 3వ శతాబ్ది నుంచి క్రీస్తు శకం 7వ శతాబ్ది వరకూ ఓ వెలుగు వెలిగిన ఈ శాలిహుండం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నగరానికి సమీపంలోని ఓ కొండపై ఉంది. అనేక చారిత్రక ఆధారాలకు నిలయమైన శాలిహుండంను తొలుత శాలివాటిక (బియ్యం తదితర ఆహార పదార్థాలు దాచే స్థలం) అని, తర్వాత శాలిపేటిక (మరణించిన బౌద్ధుల ఎముకలు, అవశేషాలు ఉంచే స్థలం) అని పిలిచేవారు. కాలక్రమేణ శాలిహుండంగా స్థిరపడింది. అదే సమయంలో శ్రీకాకుళం జిల్లాలోని సింహపురి (సింగుపురం) రాజధానిగా కళింగ రాజ్యాన్నేలిన శ్వేత చక్రవర్తి ఈ శాలిహుండం కొండకు పక్కనే ఉన్న మరో కొండపై కొలువైన కాళీయమర్ధన వేణుగోపాలస్వామి ఆలయానికి వచ్చి పూజలు చేసేవారనే కథలు ప్రచారంలో ఉన్నాయి. తర్వాత కాలంలో శాలిహుండం కొండల నుంచి జనజీవన స్రవంతి దూరంగా జరిగింది. కాలగర్భంలో కలిసిన శాలిహుండం బౌద్ధ ఆరామాలను, వేణుగోపాలస్వామి ఆలయాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన చారిత్రక పరిశోధకుడు గిడుగు వెంకట రమణమూర్తి 1919 సంవత్సరంలో వెలుగులోకి తెచ్చారు. ప్రకృతి శోభితం పక్కనే వంశధార నదీ పరవళ్లు, కనుచూపు దూరంలో బంగాళాఖాతం సముద్రం, మరోవైపు పచ్చని పంటపొలాలు, కొబ్బరిచెట్ల మధ్య శాలిహుండం ప్రకృతి శోభితంగా కనిపిస్తుంది. ఇక కొండపై బౌద్ధారామాలు, స్తూపాలు, కాలచక్రం, సొరంగమార్గం ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. కొండపైకి వెళ్లేందుకు అప్పట్లోనే ఇరువైపుల కాల్చిన ఇటుకలతో నిర్మించిన గోడలతో రాతిమార్గం ఉంటుంది. కొండ దిగువన కేంద్ర పురావస్తుశాఖ నిర్మించిన మ్యూజియం ఉంది. పశ్చిమ దేశాలకు మార్గం క్రీ.పూ 3వ శతాబ్దంలో అశోక చక్రవర్తి ప్రత్యేక శ్రద్ధతో బౌద్ధ ధర్మం ప్రచారం చేయించారు. అలా దక్షిణ భారతదేశంలో బౌద్ధం అడుగు పెట్టింది. అప్పట్లో బౌద్ధం విరాజిల్లిన దక్షిణ ప్రాంతాల్లో శాలిహుండం ముఖ్యమైనది. ఎందుకంటే ఇక్కడికి సమీపంలోని కళింగపట్నం ఓడరేవు నుంచి బౌద్ధులు సింగపూర్, జపాన్, చైనా దేశాలకు సముద్రమార్గంలో వెళ్లి అక్కడ బౌద్ధాన్ని ప్రచారం చేశారు. అలాగే బౌద్ధమత ప్రబోధకుల్లో ముఖ్యమైన తార, మరీచి రాతివిగ్రహాలు కూడా శాలిహుండం నుంచే పశ్చిమ దేశాలకు తరలి వెళ్లాయనడానికీ ఇక్కడ శాసనాలే సాక్ష్యం. మహాయాన పాఠశాల బౌద్ధులు మహాయానం, హీనయానం శాఖలుగా విడిపోయిన తర్వాత శాలిహుండం మహాయాన పాఠశాలకు వేదికైంది. ఇక్కడ బౌద్ధంతో పాటు సంస్కృతం కూడా బోధించేవారట. తర్వాత క్రీ.శ.7, 8 శతాబ్దాల నాటికి తాంత్రిక ప్రక్రియలతో కూడిన వజ్రయానం కూడా ఇక్కడే వర్థిల్లింది. దీన్ని చాటి చెప్పే మహిషాసుర మర్దిని, ధ్యాన బుద్ధ, అక్షోజ్యబుద్ధ, నందితల విగ్రహాలు శాలిహుండంలో లభించాయి. ప్రస్తుతం వాటిని ఇక్కడి మ్యూజియంలో చూడవచ్చు. రోమన్ నాగరికతకు చెందిన రౌలెటెడ్వేర్ శకలాలు కూడా శాలిహుండంపై తవ్వకాల్లో లభించాయి. అద్భుత కట్టడాలు... కప్ప హుండీ: శాలిహుండం బౌద్ధారామాలకు దిగువన పశ్చిమ భాగంలో రాళ్ల మధ్యన కప్పహుండీ ఉంది. ఈ హుండీలో ఎల్లప్పుడూ నీరు ఉండేదట. దీనిలో భక్తులు నాణేలు వేస్తే శాలిహుండానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకూర్మనాథ ఆలయంలోని గర్భగుడికి చేరుకునేవట. సొరంగమార్గం: కొండ అగ్రభాగంలో చతురస్రాకార కట్టడం. దీని దిగువ నుంచి కళింగపట్నం వద్దనున్న చిన్న బౌద్ధారామం వరకూ సొరంగ మార్గం ఉంది. దీన్ని శ్వేత చక్రవర్తి రాకపోకలకు వినియోగించేవారని ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి. బౌద్ధారామాలు కనుగొనే సమయంలో ఈ సొరంగ మార్గాన్ని మూసివేశారు. కాలచక్రం: ధర్మచక్రంలో మాదిరిగా ఎనిమిది ఆకుల మధ్య పుష్పం ఆకారంలో ఎతై ్తన కట్టడం శాలిహుండం కొండపై కనిపిస్తుంది. సూర్యగమనం ఆధారంగా ఈ కట్టడంపై పడే నీడను చూసి సమయం లెక్కించేవారు. అందుకే దీన్ని కాలచక్రం అని పిలుస్తున్నారు. దీనిని నవగ్రహ ధ్యానానికి ఉపయోగించేవారట. ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. - అల్లు సూరిబాబు, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం -
పరిపూర్ణ మానవుడు బుద్ధుడు
అజ్ఞానమనే చీకటిని పారద్రోలిన వెలుగుల సూర్యుడు బుద్ధుడు. అశాంతి అనే నిశీధిలో ప్రశాంతతని నెలకొల్పిన వెన్నెల చంద్రుడు బుద్ధుడు. మానవాళిని మహాదుఃఖసాగరం నుండి కాపాడటానికి ‘ధమ్మం’అనే నావను నిర్మించిన ప్రాజ్ఞుడు. ఆ నావకు చుక్కాని ఆయన ప్రవచించిన పంచశీల. నావను దారిలో నడిపించే నావికుడు ఆయన బోధించిన అష్టాంగమార్గం. నావను నడిపే తెరచాప ఆయన ప్రబోధించిన చతురార్య సత్యాలు. మానవ హృదయాల్లోంచి ద్వేషం, పగ, ప్రతీకారం, మోసం, ఈర్ష్య, అసూయలు అనే చెడ్డ ఆలోచనల్ని తుడిచేసి, వాటి స్థానంలో దయ, జాలి, కరుణ, ప్రేమ, అనురాగం, మైత్రి లాంటి మానవీయ భావనల్ని పెంపొందించిన మహనీయుడు బుద్ధుడు. ఆయన కేవలం మానవజాతి మేలును మాత్రమే కోరుకోలేదు. సమస్త జీవకోటి మేలును కాంక్షించాడు. పశుపక్ష్యాదులు, క్రిమికీటకాలు, జలచర భూచరాలు.. అన్నింటి పట్ల దయను ప్రదర్శించాడు. బుద్ధత్వం అనేది ఒక జీవకారుణ్యమూర్తికి ఉండవలసిన లక్షణం. ఏ వ్యక్తి అయినా దానం, శీలం, నిష్కామం, ప్రజ్ఞ, ధీరత్వం, ఓర్పు, సత్యం, పట్టుదల, మైత్రి, ఉపేక్ష అనే పది విశేష గుణాల్ని సాధిస్తే బుద్ధత్వం పొందగలడు. పరిపూర్ణుడవుతాడు. ఈ పరిపూర్ణత్వమే అనంత కరుణని ప్రసాదిస్తుంది. మనిషిని మానవీయునిగా, సమస్త జీవజాతిని ప్రేమించే జీవకారుణ్యమూర్తిగా మలుస్తుంది. ఈ దశ సుగుణాలూ రాసిపోసిన మహోన్నతా మానవతామూర్తే తథాగతుడు గౌతమబుద్ధుడు. - డా. బొర్రా గోవర్ధన్ -
బాబు గారి భక్తులు కాల్ యముళ్లు
-
బంగారంతో తయారు చేసిన బొమ్మలంటూ..
సిడ్నీ: బంగారంతో తయారు చేసిన బొమ్మలంటూ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఆస్ట్రేలియా పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అనంతరం అతడి వద్ద నుంచి ఎనిమిది నకిలీ బంగారపు లాఫింగ్ బుద్ధ విగ్రహాలు, దాదాపు 100 నకిలీ బంగారపు కడ్డీలు, ఐదు మొబైల్ ఫోన్లు, వివిధ దేశాలకు చెందిన కరెన్సీతోపాటు నకిలీ పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు ఆస్ట్రేలియా పోలీసులు వెల్లడించారు. బంగారపు లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని స్థానికంగా నివసిస్తున్న ఓ మహిళ అధికంగా సొమ్ము వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే ఆ బొమ్మ రాగితో తయారు చేసి... బంగారం పూత పూసిన నకిలీదని గుర్తించిన సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో ఇన్నర్ సిటీ అపార్ట్మెంట్లో సదరు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
జ్ఞానం వికసించిన రోజు...
మే 4, సోమవారం బుద్ధపూర్ణిమ కొందరు ఆయన్ని గొప్ప తత్త్వవేత్తగా కొనియాడతారు. ఇంకొందరు సమాజాన్ని చక్కదిద్దిన సంస్కర్తగా శ్లాఘిస్తారు. ఆయనే పశువుల్లా, పాశవికంగా బతికే మానవులకు శాంతి, అహింస, కరుణ, దయ, జాలి, ప్రేమ, మైత్రి లాంటి ధర్మాల్ని ప్రబోధించిన బుద్ధుడు. క్రీస్తుకు 600 సంవత్సరాల పూర్వమే మనిషి నడవడికకు మెరుగైన దారి చూపిన మార్గదర్శి ఆయన. అంతటి మహనీయుడు మన దేశం నేలమీద పుట్టడం మనందరికీ గర్వకార ణం. ప్రపంచానికి శాంతి, అహింసల్ని ప్రబోధించిన దేశంగా భారతదేశం పొందిన కీర్తికి ఈ తథాగతుడే కారణం. బుద్ధుని బోధనలు ఎన్నెన్నో ఉన్నాయి. అన్నీ ఆణిముత్యాలే. అజరామరాలే. వీటన్నింటిలో వెలకట్టలేనివి పంచశీల. బుద్ధుడు జ్ఞానానికి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చాడో, అంతకు మించి శీలానికి ఇచ్చాడు. శీలం అనేది అందరికీ ఉండాల్సిన నైతిక గుణంగా భావించాడు. ప్రబోధించాడు. శీలం మన జీవన విధానమని చాటాడు. బుద్ధుడు చెప్పిన శీలం అంటే నైతిక జీవనమే. మనవల్ల ఇతరులెవరూ ఇబ్బంది పడని విధానమే శీలం. ఈ నైతిక జీవనం మనిషిని మానసిక రుగ్మతలకు దూరం చేస్తుంది. మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. ఉత్సాహాన్ని నింపుతుంది. నిజం చెప్పాలంటే పరిపూర్ణమానవుడిగా జీవించే అవకాశాన్ని కల్పిస్తోంది. 1. పంచశీలలో ‘జీవహింస చేయను’ అనేది మొదటిది. స్వర్గసుఖం కోసం యజ్ఞాల్లో వేలాది జీవుల్ని బలివ్వడాన్ని బుద్ధుడు ఒప్పుకోలేదు. రాజులు సాగించే అమానుషమైన జంతువేటల్ని వ్యతిరేకించాడు. భూమి మీద పుట్టిన ప్రతి జీవికీ జీవించే హక్కు ఉంది అని బోధించాడు. 2. రెండోది దొంగతనం గురించి, ‘పరుల సొమ్ము దొంగిలించను’ అని సాధారణంగా చెప్పుకుంటాం కానీ బుద్ధుడు దొంగిలించడమే కాదు, నీది కాని వస్తువుని, నీవు కష్టపడి సంపాదించని వస్తువుని, మరొకరు నీకు దానంగా ఇవ్వని వస్తువుని దారిలో దొరికినా తీసుకోకూడదు- అలా తీసుకున్నా అది పరుల సొమ్మును హరించడమే అన్నాడు. 3. మూడోది ‘అబద్ధాలు చెప్పను’ అనేది. దీనినే బుద్ధుడు ‘ముసావాద’ అన్నాడు. అంటే మోసపు మాటలు చెప్పను అని. ఎదుటి వారికి నష్టాన్ని కలిగించడం కోసమో లేదా తాను లాభం పొందడం కోసమో చెప్పే మోసపు మాటలు పలకరాదన్నాడు. 4. నాలుగోది కామానికి సంబంధించినది. సాధారణంగా స్త్రీ, పురుషుల శారీరక వాంఛల్ని కామం అంటాం. అయితే భార్యాభర్తల పవిత్ర సంబంధాన్ని బుద్ధుడు తప్పు పట్టలేదు. ‘కామదురాచారం’ మాత్రం కూడదని చెప్పాడు. కుటుంబ వ్యవస్థని గౌరవించాడు. 5. ఇక ఐదవది, మత్తుపానీయాలు, మత్తుని, ఉద్రేకాల్ని కలిగించే పదార్థాన్ని సేవించకూడదని చెప్పాడు. వీటివల్ల మనిషి తన విజ్ఞత కోల్పోయి, ఉచ్చనీచాలు ఎరుగని పశువులా ప్రవర్తిస్తాడని, ఎదుటివారికి ఇబ్బందికరంగా తయారవుతాడని ప్రబోధించాడు. ఈ ఐదు విషయాలు ప్రతి ఒక్కరూ పాటిస్తే- నేరం, శిక్షలతో పనేముంటుంది? మనిషికి తప్పు చేసిన భావన ఎప్పుడూ కలుగదు. కాబట్టి సంతోషంగా, నిస్సిగ్గుగా, నిర్భీతిగా, ప్రశాంతంగా, ప్రేమపూర్వకంగా బతకగలుగుతారు. అవాంతరాలకి, అవాంఛనీయ విధానాలకీ, అక్రమాలకీ తావులేని అందమైన ప్రపంచం రూపొందుతుంది. మనిషి జీవితానికి ఒక విలువ వస్తుంది. ఉత్సాహంగా బతికే మనిషి జీవితం కుంటుపడదు. వేగంగా, ధైర్యంగా ముందుకు సాగుతుంది. ఒక జీవిని చంపడమే కాదు, దాన్ని బంధించినా, అంటే జంతువులు, పక్షుల్ని కట్టేసి పెంచుకున్నా హింసే అన్నాడు. బానిసత్వాన్నీ హింసగానే పరిగణించాడు. చేతలతోనే కాదు, మాటల ద్వారా దూషించినా, కఠినంగా మాట్లాడినా, వ్యంగ్యంగా మాట్లాడినా, రెండర్థాల పదాలతో బాధపెట్టినా- ఇవన్నీ ‘జీవహింస’గానే చెప్పాడు. ఐతే ఏదైనా కావాలని, తెలిసి చేస్తేనే అది నేరం అవుతుందని, తెలియక జరిగిన హింస తప్పు మాత్రమే అవుతుందని చెప్పాడు. బుద్ధుడు బోధించిన ఈ పంచశీల మనిషి జీవితానికి ఒక చక్కటి నియంత్రణ. ఎందుకంటే- ప్రతివ్యక్తి పంచశీల ధరించి, స్వతంత్ర నియంత్రణ కలిగి ఉంటే... ఒక వ్యక్తి మరో వ్యక్తిని మోసగించడు. ఒకడు మరొకని దోపిడీ చేయడు. దగా చేయడు. చంపుకు తినడు. ఎదుటి వారి జీవితంలో అనవసరంగా తల దూర్చడు. దురాశాపరుడు కాడు- తోటి వ్యక్తుల్తో, సమాజంతో తగవు పడడు. ద్వేషాన్ని పెంచబోడు. పాపాన్ని మూటగట్టుకోడు. నలుగురితో మంచిగా ఉంటాడు. నలుగురి మేలు కోరుకుంటాడు- కాబట్టి అతనికి అడుగడుగునా అడ్డంకులుండవు. వెనక్కి లాగేవారు కానీ, ఎత్తి పడేసేవారు గానీ ఉండరు. ప్రతి వ్యక్తి మరో వ్యక్తిలో మానవీయతనే చూస్తాడు. మానవీయునిగానే జీవిస్తాడు. పంచశీలను తెలుసుకున్నవాడు తను తాను తెలుసుకుంటాడు. పంచశీలను పాటించేవాడు తనను తాను గెలుచుకుంటాడు. జీవితాన్ని గెలుస్తాడు, జీవనాన్ని గెలుస్తాడు. నిజమైన విజేతగా నిలుస్తాడు. అందుకే... బుద్ధం శరణం గచ్ఛామి. - బొర్రా గోవర్ధన్ బౌద్ధం- పున్నమి: బౌద్ధానికి ముందు మన సంప్రదాయంలో పున్నమికి ప్రాముఖ్యత లేదు. బుద్ధుని తర్వాత చాంద్రమానం ప్రాముఖ్యత హెచ్చింది. పౌర్ణమికి ప్రాధాన్యత పెరిగింది. బౌద్ధానికీ, పౌర్ణమికీ అవినాభావ సంబంధం ఉంది. బుద్ధుడు జన్మించిన ది, ఇల్లు విడిచినదీ, జ్ఞానోదయం పొందినదీ, పరినిర్వాణం పొందినదీ వైశాఖ పూర్ణిమరోజే. బుద్ధుడు తొలిగా పరివ్రాజకుడైనదీ, ధర్మప్రచారం ప్రారంభించినదీ, తొలి బౌద్ధసంఘం ప్రారంభించినదీ ఆషాఢ పూర్ణిమ నాడు. బుద్ధుడు తన తల్లికి భిక్షుణిగా దీక్ష ఇచ్చినది ఆశ్వయుజ పౌర్ణమి నాడు; అశోకుని కుమార్తె సంఘమిత్ర, కుమారుడు మహేంద్రుడు శ్రీ లంకలో బౌద్ధధర్మం ప్రారంభించినది ( విదేశంలో తొలి బౌద్ధ ధర్మస్థాపన) జ్యేష్ట పౌర్ణమినాడు కాగా, ఫాల్గుణ పౌర్ణమి బుద్ధుడు తన ఏడేళ్ల కుమారుడు రాహులునికి భిక్షు దీక్ష ఇచ్చిన రోజు. -
బౌద్ధం తొలి సామాజిక విప్లవం
కొత్త కోణం బుద్ధుడు జన్మించేనాటికి పురోహిత వర్గం విచ్చలవిడిగా సాగిస్తున్న యజ్ఞయాగాది కర్మకాండలు సమాజాభివృద్ధికి అడ్డంకిగా మారాయి. నాడు వ్యవసాయానికి ప్రధాన ఆధారమైన పశు సంపదతోపాటు, ధాన్యాలు, నూనెలు, అటవీ సంపదలు అగ్నికి ఆహుతై పోయేవి. దీంతో వ్యవసాయానికి అత్యావశ్యకమైన పశుసంపదకు తీవ్ర కొరత ఏర్పడింది. వ్యవసాయం, వృత్తులు సంక్షోభంలో పడే దుస్థితి నెలకొంది. సమాజానికి, బ్రాహ్మణ పురోహిత వర్గానికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని బుద్ధుడు తన ఆచరణాత్మక పోరాటంతో పరిష్కరించాడు. ‘‘బుద్ధుడు అట్టడుగువర్గాల విముక్తి ప్రధాత. రాజకీయ మార్గదర్శి’’ గౌతమ బుద్ధునిపైనా, ఆయన సామాజిక కార్యాచరణపైనా విస్తృత పరిశోధన చేసిన సి.ఎఫ్. కొప్పన్ అన్నమాటలివి. ఆయనలాగే బుద్ధుని గమ్యం-గమ నంపై దేశదేశాల సామాజిక పరిశోధకులు, శాస్త్రవేత్తలు వందలాదిగా పరిశో ధనా గ్రంథాలను వెలువరించారు. మన దేశంలో దామోదర్ ధర్మానంద్ కోశాంబి, దేవీప్రసాద్ చటోపాధ్యాయ, రాహుల్ సాంకృత్యాయన్, బి.ఆర్. అంబేడ్కర్, రొమిల్లా థాపర్ లాంటి వాళ్లు ముఖ్యులు. వీరెవరూ బుద్ధుడిని కేవలం మత ప్రవక్తగా చూడలేదు. ఆనాటి పరిస్థితుల్లో బుద్ధుడు ఒక సంపూర్ణ సామాజిక విప్లవాన్ని నడిపినట్టు, దాని ఫలితాలు భారతదేశ గమనాన్ని మార్చి నట్టు పేర్కొన్నారు. సమాజంలో ఏర్పడిన సంక్షోభాన్ని నిర్వచించి, దానిని పరిష్కరించే కార్యాచరణను రూపొందించడం, దానిని కొనసాగించి సఫలీకృ తం కావడం విప్లవకారుల లక్షణం. ఆ విప్లవాత్మక కర్తవ్యాన్ని గౌతమ బుద్ధు డు అత్యంత శక్తివంతంగా నిర్వర్తించగలిగాడు. అభివృద్ధికి ఆటంకంగా మారిన కర్మకాండలు క్రీ.పూ. 566లో సిద్ధార్థుడుగా జన్మించిన గౌతమ బుద్ధుడు క్రీ.పూ. 485 వరకు జీవించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ఆయన జన్మించేనాటికి సామా జిక, ఆర్థిక, రాజకీయరంగాల్లో అభివృద్ధిని నిరోధించే శక్తులు సమాజంపై బలమైన ఆధిపత్యాన్ని నెరపుతున్నాయి. ముఖ్యంగా బ్రాహ్మణులలో పురో హిత వర్గం సమాజాభివృద్ధికి అడ్డంకిగా నిలిచింది. వ్యవసాయ వృత్తులు, వ్యాపార రంగాలు వృద్ధిలోకి వస్తున్న రోజులవి. వ్యవసాయం, వృత్తుల ద్వారా ఉత్పత్తి అయ్యే వస్తువులలో నాణ్యత, ఉత్పాదకత పెరుగుదల కార ణంగా నగరాల, పట్టణాల నిర్మాణం ప్రారంభమైంది. ఆనాడు రైతులుగా ఉన్న వైశ్యులు పంటలలో మెరుగుదలను, మిగులును సాధించారు. ఆర్థిక వృద్ధి కారణంగా వ్యాపారం, ఇతర కార్యకలాపాలు కూడా విస్తరించాయి. ఒకటి లేదా రెండు, మూడు గ్రామాలకు పరిమితమయ్యే పరిస్థితి నుంచి సమాజం బయటపడుతున్నది. ఆనాడు జనపదాలుగా పిలుచుకునే సమా జాలు క్రమంగా చిన్న, పెద్ద రాజ్యాల్లో భాగం కావడం కూడా ప్రారంభ మైంది. రాజులు, రాజ్యాల విస్తరణకు అవకాశాలు పెరిగాయి. కానీ బ్రాహ్మణ పురోహిత వర్గం ఆచరణ ఈ పురోగతికి అడ్డంకిగా మారింది. యాగాల పేరిట వారు విచ్చల విడిగా సాగిస్తున్న కర్మకాండల్లో వ్యవసాయానికి ప్రధాన ఆధారమైన పశు సంపదతోపాటు, ధాన్యాలు, నూనెలు, అటవీ సంపదలు అగ్నికి ఆహుతైపోయేవి. క్రతువులు, యాగాలు చేయకపోతే నరక ప్రాప్తి తప్ప దని పురోహిత వర్గం భయపెట్టేది. ఆవులు, గుర్రాలు సహా పశుసంపదను ఎంత ఎక్కువగా యాగాల్లో బలిస్తే అంత పుణ్యమనే ప్రచారంతో వ్యాపారులు, వ్యవసాయదారులు, వృత్తిపనివాళ్లు ఆ రోజుల్లో తమ సర్వస్వాన్ని యజ్ఞయాగాలకు కానుకలుగా ఇచ్చి పురోహితులను మెప్పించాలని చూసేవారు. దీంతో వ్యవసాయంలో కీలక భూమికను పోషించే పశుసంపదకు తీవ్ర కొరత ఏర్పడింది. మరోవంక రాజులు సైతం యాగాల కోసం ధనధాన్యాలను, వస్తువులను భారీగా వినియోగిస్తుండటం వల్ల ప్రజలపై పన్నుల భారం విపరీతంగా పెరిగింది. ఆ భారానికి కుంగిపోయి వ్యవసాయం, వృత్తులు సంక్షోభంలో పడే దుస్థితి నెల కొంది. పైగా యాగాల సందర్భంగా మద్యం ఏరులై పారేది. పురోహిత వర్గం సేవించే అత్యంత ఖరీదైన సోమరసం కోసం నిర్వాహకులకు ఖర్చు పెరి గింది. అంతేగాక ఆ మత్తులో పురోహితవర్గం చెప్పరాని జుగుప్సాకరమైన పద్ధతుల్లో విచ్చలవిడి కామకేళిని జరిపేది. ప్రతిఘటన నుంచి పుట్టిన పంచశీల ‘‘బ్రాహ్మణ పురోహితవర్గపు ఈ అరాచకాలకు ఆది నుంచే అంటే ఋగ్వేద కాలంనుంచే ప్రతిఘటన ఉంది’’ అని రొమిల్లా థాపర్ అన్నారు. చార్వాకులు, లోకాయతులు, అజీవకులు, జైనులు తదితర తాత్విక శాఖలు ఈ తిరుగు బాట్లకు నాయకత్వం వహించాయి. ఇందులో అజీవక సిద్ధాంతాన్ని ప్రతిపా దించి గోశాల, లోకాయుత, చార్వాక సిద్ధాంతకర్త అజిత, అంజనా సిద్ధాంత కర్త సంజయిన్, జైన గురువు మహావీరుడు ముఖ్యులు. ఈ తాత్విక స్రవంతు లన్నీ పురోహిత వర్గం అరాచకాన్ని అడుగడుగునా తిరస్కరించాడు, ప్రతిఘ టించారు. అందుకే వీరిని రాక్షసులని ముద్రవేసి, హతమార్చిన ఘటనలు పురాణాలనిండా కనబడతాయి. భిన్న స్రవంతులుగా సాగుతున్న ఈ పురో హిత వర్గ వ్యతిరేక తాత్విక చింతనలను, ఆచరణలను సమగ్రంగా అర్థం చేసు కున్న గౌతమ బుద్ధుడు శక్తివంతమైన ఆచరణకు కార్యక్రమాన్ని రూపొందిం చారు. పంచశీల పేరుతో రూపొందించిన ఆ కార్యక్రమం ఆనాటి బ్రాహ్మణ పురోహిత వర్గం దురాగతాలకు చరమగీతం పాడింది. పంచాస్త్రాలుగా పంచశీల పంచశీలను పలువురు పరిశోధకులు, పండితులు కేవలం వ్యక్తిగత నైతిక విలు వలుగా తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారు. కానీ అవి ఐదూ నాటి పురోహితవర్గ దురాచారాలపైకి సంధించిన అస్త్రాలే. మొదటిది, జీవరాశులను నాశనం చేయరాదు, అలాంటి చర్యలకు దూరంగా ఉంటాను. దీని అర్థం ఏ జీవరాశినీ చంపరాదనేదే. కానీ దాని ప్రధాన గురి పశుసంపదను కాపాడుకోవడమే. అంటే యాగాలను వ్యతిరేకించడమే. పైగా బుద్ధుడు అత్యంత నిర్మొహమా టంగా యజ్ఞ, యాగాలను నిరసించాడు. అవి ఆగిపోవడానికి ఆయన చాలా శ్రమించాడు. రెండో అంశం, ఎవరి నుంచీ ఏ వస్తువునూ బలవంతంగా తీసు కోరాదు. ఇది కూడా చాలా ముఖ్యమైనది. నాటి బ్రాహ్మణ పురోహితవర్గం స్వర్గం, నరకం, పునర్జన్మ, పాపకర్మల పేరిట బెదిరించి బలవంతంగా కానుక లను తీసుకోవడాన్ని ఇది నిరోధించింది. పైగా బుద్ధుడు ప్రత్యామ్నాయ ఆచరణను రూపొందించారు. బౌద్ధాన్ని ఆచరించే భిక్షువులు ఎవరైనాగానీ ప్రజలు ఏది ఇస్తే అదే తినాలని, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఖరీదైన వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు తీసుకోరాదని నిబంధన విధించారు. పురోహితవర్గం పట్ల విసిగిపోయిన ప్రజలకు సహజంగానే ప్రజల్లో బౌద్ధం పట్ల గౌరవాదరాలు పెరిగాయి. మూడవది, లైంగిక అసభ్య కార్యకలాపాలకు పాల్పడకూడదని బుద్ధుడు ప్రబోధించారు. పురోహిత వర్గం ఆనాడు స్త్రీలపై జుగుప్సాకర కామకేళిని రుద్దిందనడానికి అనేక ఆధారాలున్నాయి. పురోహి తుల ఈ దురాచారాలకు ఈ మూడవ సూత్రం చెంపపెట్టు అయింది. గృహ స్తులు, చిన్న చిన్న వృత్తి పనివారలు తమ మహిళలకు రక్షణ లభించినందుకు సంతోషించారు. నాలుగవది, తప్పుడు ప్రవచనాలను ప్రచారం చేయవద్దు. అప్పట్లో పురోహితవర్గం దేవుడి పేరుతో, మహిమల పేరుతో ప్రజల అజ్ఞా నాన్ని సొమ్ము చేసుకొని తమ ఆధిపత్యాన్ని, ప్రాబల్యాన్ని సుస్థిరం చేసుకో వాలని చూసింది. బుద్ధుడు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాడు. ప్రజలు శక్తివం తులని, వాళ్ల భవిష్యత్తుని వాళ్లే నిర్మించుకుంటారని, అందుకు దేవుడి లాంటి అతీత శక్తులు కారకులు కాదని చాలా కరాఖండిగా చెప్పాడు. ఇక ఐదో అంశం, మద్యం లాంటి మత్తుపదార్థాలకు దూరంగా ఉండడం. సోమ రస పానం పేరిట పురోహితులు తప్ప తాగి ఎప్పుడూ మత్తులో జోగుతూ సాధారణ ప్రజలనూ అదే దారి పట్టించారు. బుద్ధుని ప్రచారం ప్రజల మత్తును వదిలించింది. ఒక్కమాటలో చెప్పాలంటే, సమాజానికి, బ్రాహ్మణ పురోహిత వర్గానికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని గౌతమ బుద్ధుడు తన ఆచరణా త్మక పోరాటంతో పరిష్కరించాడు. దీంతో బ్రాహ్మణ వర్గంలోని పలువురు యోచనా పరులు బౌద్ధాన్ని అనుసరించారు. సంక్షేమ రాజ్యానికి బాటలు కుల అసమానతలను కూడా బుద్ధుడు వ్యతిరేకించాడు. బౌద్ధ సంఘాలలో చండాలుల నుంచి బ్రాహ్మణుల వరకు ఒకే రకమైన స్థానం ఉంటుందని ప్రక టించడం గౌతమ బుద్ధుని విప్లవశక్తికి నిదర్శనం. బౌద్ధం విస్తృతంగా వ్యాపిం చడంతో అడ్డంకులన్నీ తొలగి సమాజం పురోగమించింది. ఆ తర్వాత అధికా రంలోకి వచ్చిన సామ్రాట్ అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించి, రాజ్యం ప్రజల సంక్షేమానికి పనిచేయాలనే చైతన్యానికి పునాదులు వేశాడు. ఆనాడు సాధారణ ప్రజలు, వ్యాపారులు, బాటసారుల సౌకర్యార్థం ఆయన వేసిన రహదార్లు, చెట్లు నాటడం, బావులు తవ్వించడం ఈ రోజు మనకు చాలా చిన్న విషయాలుగా కనిపిస్తాయి. కానీ ఆ రోజు అవి విప్లవాత్మక పరిణా మాలే. కాబట్టే అశోకుడి ప్రజారంజక పాలన నేటి ప్రభుత్వాలకు కూడా ఆద ర్శంగా నిలుస్తోంది. ఆ విలువల ప్రాధాన్యతను మనం గుర్తించాలి. మార్పు భౌతిక సూత్రం. విప్లవకర పరిస్థితులు పరిణామాత్మక, గుణాత్మక మార్పు లకు దారితీస్తాయి. ప్రజలకు, వారి ప్రయోజనాలకు సంబంధంలేని ఏ ఆచా రాలైనా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. ఆ మార్పుకి ఒక్కో కాలంలో, ఒక్కో పద్ధతిలో తిరుగుబాటు అనివార్యం. తరతమ స్థాయిల్లో జరిగే తిరుగుబాట్లు ఒక ఉన్నతమైన, చైతన్యవంతమైన నూతన సమాజాన్ని ఆవిష్కరిస్తాయి. ఆ నేపథ్యం నుంచే బౌద్ధాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే భారత సామాజిక చరిత్రలో బౌద్ధం తొలి విప్లవం. (మే 4 బుద్ధ జయంతి సందర్భంగా) (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్ నం : 97055 66213 - మల్లెపల్లి లక్ష్మయ్య -
ధర్మభేరి
కోసలరాజుకు ఏనుగుల మీద స్వారీ అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయన గజశాలలో మంచి మంచి ఏనుగుల్ని పెంచేవారు. వాటిలో ఒక అందమైన ఏనుగుంది. అది ఎంతో ఉల్లాసంగా, బలంగా ఉండేది. యుద్ధరంగంలో విజృంభించేది. ఒరోజు అది ఒక కొలనులో దిగి, అనుకోకుండా బురదలో దిగబడి పోయింది. ఎంత ప్రయత్నించినా ఒడ్డుకు రాలేకపోయింది. ఆ కొలను ఆవలి గట్టు మీద బుద్ధుడు తన శిష్యులతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. భటులు బుద్ధుని దగ్గరకు వెళ్లి, గజరాజం ఒడ్డుకు చేరే మార్గం బోధించమన్నారు. బుద్ధుడు వారితో ‘వెంటనే పోయి యుద్ధభేరీలు తెచ్చి మోగించండి’’ అన్నాడు. భటులు వెళ్లి- భేరీలు తెచ్చి మోగించారు. ఆ భేరీనాదం విన్న వెంటనే ఏనుగులో ఉత్సాహం పెల్లుబుకింది. ఒక్కసారిగా ముందుకు కదిలింది. బురదలోనుండి ఒక్క ఉదుటున ఒడ్డుకు ఎక్కి ఘీంకరించింది. రాజభటులు సంతోషపడ్డారు. వినమ్రంగా బుద్ధునికి నమస్కరించి వెళ్లిపోయారు. అప్పుడు బుద్ధుడు తన శిష్యులతో ‘‘చూశారా! భేరీ నాదంతో ఆ గజరాజం క్లేశాలనుంచి బైటపడింది. అలాగే మనం కూడా అనేక క్లేశాల బురదలో దిగబడిపోతాం. వీటినుండి బైటపడాలంటే మనం ధర్మం అనే భేరీనాదం వినాలి. అప్పుడు మాత్రమే ఈ ఊబినుండి బైటపడగలం.’’ అని హెచ్చరించాడు. శ్రద్ధగా విని భిక్షువులు బుద్ధునికి నమస్కరించారు. - బొర్రా గోవర్ధన్ -
జ్ఞానోదయం
బౌద్ధనీతి ఒకనాడు కపిలవస్తు రాజ్యంలోని గణరాజ్యరాజుల మధ్య విభేదాలు పొడసూపాయి. రాజ్య ఐక్యతకు ముప్పు వాటిల్లింది. ఆ సమయంలో వారంతా బుద్ధుని దగ్గరకు వచ్చి, సలహా అడిగారు. అప్పుడు ఆయన వారితో ‘‘మహారాజులారా! పూర్వం ఓ అరణ్యంలో తిత్తిరి పిట్టల గుంపు ఉండేది. చాలా ఐకమత్యంతో జీవించేవి. వాటిని పట్టి, మాంసం అమ్ముకోవాలని ఆశపడ్డాడు ఒక వేటగాడు. ఆ ప్రాంతంలో నూకలు జల్లాడు. అవి ఆ నూకల మీద వాలి వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయాయి. అప్పుడు ఆ పక్షుల్లో పెద్దగా ఉన్న పక్షి వాటికి ధైర్యం చెప్పింది. ‘ఐకమత్యంగా ఉండి అందరం ఒకేసారి పైకి లేచి వలను లేపుకు పోదాం’ అని చెప్పింది. పక్షులన్నీ వలను లేపుకుని వెళ్లి ఒక ముళ్లచెట్టు మీద వదిలి, ఆ సందుల్లోంచి నెమ్మదిగా జారుకుని వెళ్లిపోయాయి. ఇలా కొన్నిసార్లు జరిగింది. ఆ తర్వాత వాటిలో వాటికి అభిప్రాయభేదాలు తలెత్తి, అహంకారం పొడసూపింది. ‘వలను నేను ఎత్తాను అంటే నేనే ఎత్తాను’ అని గర్వపడ్డాయి. మరోసారి వలలో చిక్కినప్పుడు ఒకదానితో ఒకటి వాదులాడుకున్నాయి. ఆ వాదులాటలు చివరికి తగాదాలుగా మారాయి. ఈ గొడవలు, గందరగోళాల వల్ల అవి ఈ సారి వలలో చిక్కుకుపోయాయి. వేటగాడు వచ్చి వాటిని పట్టి, అమ్మేసుకున్నాడు. చూశారా! అహంకారం, అనైక్యతల వల్ల పక్షులన్నీ నాశనం అయ్యాయి’’ అని చెప్పాడు. ఆ రాజులకు జ్ఞానోదయం అయింది. బుద్ధునికి లేచి నమస్కరించారు. - బొర్రా గోవర్ధన్ -
ఆడపిల్ల పుడితే...
కోసలరాజు ప్రసేనజిత్తు తన ఆస్థానానికి బుద్ధుణ్ణి ఆహ్వానించాడు. బుద్ధుడు వచ్చి ఆసనం మీద కూర్చొని ధర్మ ప్రబోధం చేస్తూ ఉండగా ఒక పరిచారిక పరుగు పరుగున వచ్చి ‘‘మహారాజా! మహారాణిగారు ప్రసవించారు’’ అని చెప్పింది. ఆ వార్త విని ప్రసేనుని ముఖంలో చిరునవ్వు విప్పారింది. ‘‘అవును మహారాజా! రాణి మల్లికాదేవి గారు పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చారు’’ అని చెప్పి పరిచారిక వెళ్లిపోయింది. ఆ మాటతో ప్రసేనుని ముఖం వాడిపోయింది. ఆడపిల్ల పుట్టిందనే వార్త విని నిర్వేదానికి గురై అలా కూర్చుండి పోయాడు. అది గమనించిన బుద్ధుడు చిరునవ్వుతో - ‘‘ప్రసేనా! మగబిడ్డ కలగలేదని విచారిస్తున్నావా? ఒక్కోసారి కుమారుని కంటే కుమార్తే మేలు కావచ్చు. విద్యాబుద్ధులు నేర్పితే ఆమె మగపిల్లాడినే మించిపోగలదు. వీర నారి కాగలదు. ఆదర్శమాతగానూ రాణించవచ్చు. నీ రాజ్యాన్ని దక్షతగా పాలించనూ గలదు. ఆడపిల్ల ఎందులోనూ తీసిపోదు. అంతేకాదు, మానవజాతికి మూలం, దాని అభివృద్ధి స్థానం మహిళే అని మరిచిపోవద్దు’’ అని హితోపదేశం చేశాడు. బుద్ధుని ఉపదేశం విన్న ప్రసేనుని వదనంలో తిరిగి ఆనందం తొంగిచూసింది. - బొర్రా గోవర్ధన్ -
శ్రేష్ఠమైన దానం
సిద్ధార్ధ రాకుమారుడు రాజ్యం వదిలి, దాదాపు ఆరేళ్లు ధ్యానం చేసి, జ్ఞానోదయం పొంది, బుద్ధుడయ్యాడు. బుద్ధుడైన సంవత్సరానికి తిరిగి తన కపిలవస్తు రాజ్యానికి వచ్చాడు. అప్పటికే బౌద్ధ సంఘాన్ని స్థాపించాడు. కొడుకు ఒక భిక్షువుగా వచ్చాడని ఆయన తల్లిదండ్రులు కొంత బాధపడ్డా, కుమారునికి మంచి వస్త్రాన్ని బహూకరించాలని అనుకున్నారు. బుద్ధుని తల్లి గౌతమి తాను స్వయంగా అందమైన వస్త్రాన్ని నేసి కుమారుని దగ్గరకు తీసుకు వెళ్లింది. ‘‘నాయనా.. ఇది నా కానుక. తీసుకో’’ అంది. అందుకు బుద్ధుడు, ‘‘అమ్మా.. నీ వాత్సల్యానికి సంతోషం. ఈ వస్త్రాన్ని మా బౌద్ధ సంఘానికి బహూకరించు’’ అన్నాడు. ‘‘లేదు నాయనా. ఇది నీ కోసమే అల్లాను. నీవు నీ సంఘానికి నాయకుడవు. గొప్పవాడవు. పైగా నా బిడ్డవు’’ అంది గౌతమి. ‘‘నిజమే. కానీ అమ్మా.. ఒక గొప్ప వ్యక్తికంటే సంఘమే మరింత గొప్పది. ఉన్నతుడైన ఒక వ్యక్తి కంటే చెడ్డవారితో ఉన్నప్పటికీ ఆ సంఘమే గొప్పది. సంఘమే ఉన్నతమైనది. వ్యక్తి సేవ కంటే సంఘ సేవ ఉన్నతమైనది. వ్యక్తి కంటే సంఘానికి చేసే దానమే శ్రేష్ఠమైన దానం’’ అన్నాడు. బుద్ధుని మాటలు విని గౌతమి ఆ నూతన వస్త్రాన్ని సంఘానికి దానం చేసింది. - బొర్రా గోవర్ధన్ -
కోర్కెల ఉచ్చు
బౌద్ధవాణి అన్ని దుఃఖాలకీ కోరికలే కారణం అనేది బుద్ధుడు చెప్పిన సత్యం. ఈ కోరికలకు మనసే మూలం అంటాడు బుద్ధుడు. మనస్సును అదుపులో ఉంచి, దురాశాపూరితమైన కోర్కెల్ని మనస్సులోకి రానీయకుండా ఉంటే దుఃఖం కలగదని చెప్తాడు. ఒక దురాశ బయలుదేరితే, అది మరో దురాశను రేపి బందీగా చేస్తుందని అంటాడు.ఈ విషయం మీద ఒకసారి మాట్లాడుతూ, ‘‘భిక్షువులారా! హిమాలయ ప్రాంతాల్లో మనుషులుగానీ, కోతులుగానీ సంచరించలేని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. మనుషులు తిరగలేని ప్రదేశాల్లో కోతులు మాత్రమే తిరుగాడే ప్రదేశాలూ ఉన్నాయి. ఇలాంటి ప్రదేశాల్లో వేటగాళ్లు జిగురు పూసిన ఉచ్చుల్ని ఉపయోగిస్తారు. తెలివి గలిగిన కోతులు కొత్తగా కనిపించే ఆ ఉచ్చుల జోలికి వెళ్లవు. కానీ ‘అదేందో చూద్దాం’ అనే తుంటరి కోతులు వాటిని పట్టుకుని చిక్కుకుపోతాయి. ఇలాగే ఒక కోతి వెళ్లి తన ఎడమ చేత్తో ఆ ఉచ్చును పట్టుకుని లాగింది. దాని చేయి ఆ ఉచ్చుకు అతుక్కుపోయింది. వెంటనే అతుక్కుపోయిన ఉచ్చును విడిపించుకోడానికి కుడిచేతిని ఉపయోగించింది. అదీ అతుక్కుపోయింది. చేతుల బలం చాలడం లేదనుకుని రెండు కాళ్లనూ ఉపయోగించి తన్నిపట్టి లాగింది. దాంతో రెండు కాళ్లూ అతుక్కుపోయాయి. ఇక లాభం లేదనుకుని ఉచ్చును కొరికేయాలని పళ్లతో ఉచ్చుతాడును గట్టిగా కొరికింది. చివరికి దాని మూతి కూడా అతుక్కుపోయింది. కోర్కెల వెంట పడడం కూడా ఇలానే ఉంటుంది’’ అని చెప్పాడు బుద్ధ భగవానుడు. దాంతో కోర్కెల వలలో చిక్కుకోవడం ఎంత ప్రమాదమో వారందరికీ తెలిసివచ్చింది. - బొర్రా గోవర్ధన్ -
చెక్కు చెదరని బుద్ధవాక్యం
గ్రంథపు చెక్క బుద్ధప్రతిమలానే సాంచీస్థూపం కూడా ఏదో అనాది, శాశ్వత సందేశాన్ని వింటున్నట్లుగా, ఆ సందేశాన్ని ధ్యానిస్తున్నట్లుగా అక్కడొక అపూర్వమైన నిశ్శబ్దం, ప్రశాంతి నెలకొని ఉన్నాయి. దాదాపు మూడు వందల అడుగుల ఎత్తున కొండ మీద నిర్మించిన ఈ స్థూపం భారతదేశంలోని బౌద్ధస్థూపాలన్నిటిలో కూడా అత్యంత సురక్షితంగా నిలబడ్డ నిర్మాణం. కాలం తాకిడికి చెక్కు చెదరని బుద్ధవాక్యంలాగా ఈ నిర్మాణం కూడా మనకు కనిపిస్తుంది. ఆశ్చర్యమేమిటంటే బుద్ధుడి జీవితంలోని ఏ ప్రముఖ సంఘటనతోటీ సాంచికీ సంబంధం లేదు. బుద్ధుడు తన జీవిత కాలంలో ఇక్కడ అడుగు పెట్టలేదు. ఏడవ శతాబ్దంలో భారతదేశాన్ని పర్యటించిన చీనా యాత్రికుడు జువాన్ జంగ్ భారతదేశంలో తాను చూసిన ప్రతి ఒక్క బౌద్ధస్థలం గురించి ఎంతో వివరంగా నమోదు చేసినప్పటికీ సాంచి గురించి కనీసం ఒక్కవాక్యం కూడా ప్రస్తావించలేదు. బుద్ధపాద స్పర్శకు నోచుకోనప్పటికీ, బౌద్ధభిక్షువుల ప్రార్థనలతో, బౌద్ధసంఘ నివాసంతో పునీతమైన నేలగా సాంచీ చరిత్రలో నిలబడింది. బహుశా అశోకుడు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో విదిశ నుండి ఉజ్జయిని వెళ్లేటప్పుడో, ఉజ్జయిని నుండి విదిశ వెళ్లేటప్పుడో ఈ అడవిలో ఈ కొండను చూసి ఉంటాడు. ప్రజల్ని ప్రబోధించగల వాక్యాలు ఎక్కడ ఏ కొండ మీద రాస్తే నలుగురు చదువుతారో అశోకుడికి తెలిసినట్టుగా ఈ దేశంలో మరెవరికీ తెలియదు. బహుశా అశోకుడి చూపులోనే ఆ ‘దృష్టి’ ఉంది. అందుకే మొదటిసారి అతడీ కొండని చూసినప్పుడు అతడికి ఈ కొండ మీద ఒక బౌద్ధస్థూపం కూడా కనబడి ఉండాలి. అంతరంగంలో దర్శించిన ఆ స్థూపాన్ని తక్కిన దేశమంతా చూసేటట్టు కూడా అతడు ఈ స్థూపనిర్మాణం చేపట్టాడు. - వాడ్రేవు చినవీరభద్రుడు ‘నేను తిరిగిన దారులు’ పుస్తకం నుంచి. -
‘విరూప’మవుతోన్న వ్యవస్థాపకులు!
షేక్ మహ్మద్ జాన్ ‘స్టోన్ సర్జన్’! నాగార్జునకొండ మ్యూజియంలో బుద్ధుడు, అమరావతిలోని నంది - గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం - హంపిలో యోగ లక్ష్మీనరసింహుడు - అంకోర్‌వాట్‌లో అప్సరసలు... జాన్ చేతిలో పునరాకృతులు పొందినవే! ‘తెలుగు వారి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటికాదగ్గ అంశం ఒక్కటీ లేదా? ఉంది! అంటున్నారు, షేక్ మహ్మద్ జాన్! ఎవరాయన? ‘స్టోన్ సర్జన్’! నాగా ర్జునకొండ మ్యూజియంలో బుద్ధుడు, అమరావతిలో నిల్చున్న నంది - గుడి మల్లం పరశురామేశ్వర ఆలయం - హం పిలో యోగ లక్ష్మీనరసింహుడు- అంకోర్ వాట్లో అప్సరసలు... జాన్ చేతిలో పునరాకృతులు పొంది నవే! 77 ఏడేళ్ల జీవితంలో ఐదు దశాబ్దాలకు పైగా భారత పురావస్తుశాఖకు సేవలు అందించిన జాన్ వరల్డ్ హెరిటేజ్ సెంటర్‌గా యునెస్కొ గుర్తించిన ‘హంపి - పునర్నిర్మాణం’ లో పాల్గొన్నారు. ఎస్.ఎం.జాన్‌తో ఇంటర్వ్యూ సారాంశం: పుట్టుకతో రాగల ఆరోగ్యసమస్యలను మూలకణాలు పరిష్కరిస్తాయి. ఒక సమాజానికి రాగల సాంస్కృతిక సమస్యలకు మూలపురుషుల జీవితాలు పరిష్కారాన్ని చూపుతాయి. కాబట్టే ‘ఫౌండింగ్ ఫాదర్స్’ ఆయా సమా జాల పాఠ్యాంశాల్లో జీవించి ఉంటారు! ఈ నేపథ్యంలో సమస్త దక్షిణ భారత దేశాన్నీ ప్రభావితం చేసిన విజయ నగర సామ్రాజ్య (క్రీ.శ. 1336-1556) వ్యవస్థాపకుల గురించి తెలుసుకోవడం అభిలషణీయమే కదా! దురదృష్టవ శాత్తూ ఈ విషయమై మనకు స్పష్టత లేదు! కాకతీయ ఆర్గ్యుమెంట్! హరిహరరాయలు-బుక్కరాయలు (రాయ సోదరులు) కాక తీయ సామ్రాజ్యపు కోశాధికారులు. ఢిల్లీ సుల్తానులు ఓరుగ ల్లును ఆక్రమించడంతో దక్షిణానికి ప్రయాణించి, కంప్లి (బళ్లారి జిల్లా) రాజైన రామనాధుని ఆశ్రయం పొందారు. కంప్లి సైతం ఢిల్లీకి తలవంచిన నేపథ్యంలో బందీలుగా ఢిల్లీ వెళ్తారు. మతం మార్చు కుని, తమ ‘సత్ప్రవర్తన’ తో సుల్తానుల ఔదా ర్యంతో గవర్నర్ల హోదా తో కంప్లి వస్తారు. ఢిల్లీలో అస్థిరత ఏర్పడిన నేపథ్యం లో, విద్యారణ్యుల వారి ఆశీశ్సులతో హంపి (ఆనె గొంది)లో హిందూ రా జ్యాన్ని (క్రీ.శ.1336) స్థాపిస్తారు. ఈ వాదనను ప్రొ. వేంకటరంగయ్య, నీలకంఠశాస్త్రి, లూయీస్ రైస్,ఏ.వి.స్మిత్, రాబర్ట్ సీవెల్ తదితరులు చారి త్రక ఆధారాలతో నిర్ధారిం చారు. విద్యారణ్య కాల జ్ఞానం, విద్యారణ్య వృ త్తాంతం, విశ్వనాధరత్నా కరం తదితర గ్రంథాలు కూడా ‘కాకతీయ ఆర్గ్యుమెంట్’గా ప్రాచుర్యంలో ఉన్న పై అంశాలనే సమర్థిస్తున్నాయి! కన్నడ కథనాలు! ‘రాయ సోదరులు’ హంపీ స్థానికులని, ఇక్కడే పుట్టారని, హంపి విరూపాక్ష స్వామి వీరి కులదైవమని, రాజముద్రికలో కూడా విరూపాక్షుడే ఉన్నాడని, వీరు ఈ ప్రాంతపు సంగమ -యాదవ రాజుల బంధువులని, హోయసల రాజులతో వైవాహిక సంబంధాలున్నాయని కన్నడ పండితులు వాదిస్తు న్నారు. పాఠ్యాంశాలు, పర్యాటక సాహిత్యం హరిహర బుక్కరాయలు కన్నడిగులనే తెలియజేస్తున్నాయి! ‘రాయ సోదరుల’ గురించి పై మాటలకు పరిమితమవుతూ వారి ‘ఆచూకీ’ని అన్వేషించడంలో తగిన ‘చొరవ’ చూపడం లేదు! విరూపాక్ష ప్రాకారంపై ‘రాయ-సుల్తానులు’! హంపి క్షేత్రం దాదాపు 5 లక్షల చదరపు హెక్టార్లలో వ్యాపించి ఉంది. 1,600 కట్టడాల్లో లక్షలాది శిల్పాలున్నాయి. వీరిలో హరి-హరబుక్కరాయలు ఉన్నారా? ఉంటే గుర్తించడం ఎలా? హంపి విరూపాక్షస్వామి ఆలయ ఉత్తర ప్రాకారం (తుంగభద్రానది వైపు) పై ఇరువురు రాకుమారుల శిల్పా లు ప్రత్యేకంగా ఉన్నాయి. ఇరువురూ భక్తుల వేషధారణలో, ఇరువైపులా అంగరక్షకులతో దేవతలకు అంజలి ఘటిస్తూ నిల్చుని ఉంటారు. తలపాగా, గడ్డమూ, చిరుకత్తి వంటి ఆహార్యంతో ‘సుల్తానులా?’ అన్పిస్తారు ! వీరిలో హిందూ - ముస్లిం చిహ్నాలు కన్పిస్తాయి! ఎందువల్ల? ఢిల్లీ నుంచి గవర్నర్లుగా ప్రస్తుత హంపి ప్రాంతానికి వచ్చిన కొత్తలో ‘రాయ సోదరులు’ ఈ వేషధారణలో ఉండి ఉండాలి! విరూపాక్ష దేవస్థానాన్ని అభివృద్ధిపరచే సమయంలో శిల్పులు ‘మిశ్రమ’ వేషధారణలోని రాయసోదరులకు ఆకృతి ఇచ్చి ఉంటారు! శిథిలమైన బుక్కరాయలు! ఫిలిమ్స్ డివిజన్ కొన్ని దశాబ్దాల క్రితం రూపొందించిన ‘ద ఫర్గెటన్ ఎంపైర్’లో రెండు విగ్రహాలు ఉన్నాయి.ఆ రెండు విగ్రహాల్లో ప్రస్తుతం ఒక్కటే ఉంది! శిథిలమైంది ఎవరు? సాంప్రదాయాల ప్రకారం మిగిలి ఉన్నది పెద్దవాడైన హరిహరరాయలుగా భావించవచ్చు! ఆయనను కాపాడు కోవాల్సిన బాధ్యత కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలపై, తెలుగు వారందరిపై ఉంది! - పున్నా కృష్ణమూర్తి -
తెప్పను నెత్తిన పెట్టుకుని పోతామా?
బౌద్ధవాణి కొందరు తమకి ఉపయోగపడిన వస్తువు మీద అతి మమకారం పెంచుకుని, అది తమకే చెందాలనీ, దానిపై తమకు ఎంత ప్రేమ ఉందో నలుగురికీ తెలియజెప్పాలని తెగ ఆరాటపడిపోతుంటారు. అలాగే బుద్ధుని కాలంలో కూడా తాము నమ్మే సిద్ధాంతమే గొప్పదని, సర్వకాల సర్వావస్థలకూ అదే పనికొస్తుందని మూఢంగా నమ్మేవారు ఉండేవారు. తామే గొప్ప వారమనీ, తమ ధర్మమే గొప్పదని అహంకారంతో గడిపేవారు. అలాంటి వాళ్లు బౌద్ధ సంఘాలలో కూడా ఉండేవారు. ఈ విషయాన్ని గ్రహించిన బుద్ధుడు ఒకనాడు వారిని పిలిపించి, ‘‘భిక్షులారా! ఒక నదికి వరద వచ్చింది. మనం అవతలి ఒడ్డుకు చేరాలి. కాబట్టి కర్రలు, గడ్డీ ఉపయోగించి ఒక తెప్పను తయారు చేస్తాం. దాని సాయంతో అవతలి ఒడ్డుకు చేరుతాం. చేరాక, ఈ తెప్ప నాకు సాయపడింది అని చెప్పి దాన్ని నెత్తిన పెట్టుకుని పోతామా? అలా పోవడం కంటే దాన్ని అక్కడే ఉంచి లంగరు వేస్తే, మరొకరు దాని సాయంతో నదిని దాటుతారు. అలా ఎందరికో ఉపయోగపడుతుంది. అందరికీ ఉపయోగపడేదాని పట్ల అతి మమకారంతో దాన్ని మోసుకుపోతే... ఇతరులకూ ఉపయోగపడదూ, మనకూ భారమైపోతుంది. ఏ వస్తువైనా, ఏ ధర్మమైనా అంతే. చివరికి నేను చెప్పే ధర్మం అయినా ఇంతే. దుఃఖం అనే వరదను దాటడానికే నా ధర్మం. నా ధర్మం తెప్పలాంటిది. మనం కూడా అంతే. మనం సాయం చెయ్యాలి. సహాయం పొందిన వారికి భారం కాకూడదు’’ అని చెప్పాడు. ఈ బోధతో వారిలోని అహంకారం నశించిపోయింది. - బొర్రా గోవర్ధన్ -
సంపూర్ణ వినియోగం
బౌద్ధ వాణి బుద్ధుడు జేతవనంలో ఉన్నప్పుడు ధర్మరక్షితుడు అనే భిక్షువు వచ్చి ఒక కొత్త చీవరం (భిక్షువులు ధరించే వస్త్రం) కావాలని అడిగాడు. ‘‘ధర్మరక్షితా! ఇంతకు ముందు నీకిచ్చిన వస్త్రం ఏమైంది?’’ అని అడిగాడు బుద్ధుడు. ‘‘భగవాన్! చినిగిపోయింది’’ ‘‘ఆ చినిగిన చీవరాన్ని ఏం చేశావు?’’ ‘‘భగవాన్! చినుగులు కుట్టుకుని ధరించాను. ఇక కుట్టుకోడానికి కూడా వీలు లేనంతగా జీర్ణమైపోయింది’’. ‘‘ఆ జీర్ణ వస్త్రాన్ని ఏం చేశావు?’’ ‘‘భంతే! దాన్ని మడతలుగా చేసి ధ్యానం చేయడానికి కూర్చొనే దిండుగా వాడాను’’. ‘‘ఆ దిండును ఇంకా ఉపయోగిస్తున్నావా?’’ ‘‘లేదు భగవాన్, అదీ చివికి పోయి ముక్కలైపోయింది. ఆ ముక్కలతో గదిని శుభ్రం చేశాను. మట్టి అరుగు అలికాను’’. ‘‘మంచిది. ఆ చివికిన ముక్కలు ఇంకా మిగిలే ఉన్నాయా?’’ ‘‘లేదు భగవాన్! అవి ఇంకా చివికి చివికి దారప్పోగులైపోయాయి. ఆ దారప్పోగులను సరిచేసి, పేని, దీపాలు వెలిగించే ఒత్తులుగా మార్చి ఉపయోగించాను’’. ‘‘ధర్మరక్షితా! మంచిది. ప్రతి వస్తువూ ఏదో ఒక దశలో ఏదో ఒక పనికి ఉపయోగపడుతుంది. ఆ వస్తువుని అలా సంపూర్ణంగా వినియోగించుకుంటే వస్తు ఉపయోగం పెరిగి, వస్తు వ్యామోహం తగ్గిపోతుంది. నీవు కొత్త చీవరానికి అర్హుడివే’’ అని కొత్త చీవరం ఇప్పించాడు బుద్ధుడు. - బొర్రా గోవర్థన్ -
బుద్ధుని తపోభూమిలో...
గ్రంథం చెక్క బోధిగయలో చాలా ఆలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని విదేశీయులు నిర్మించినవి. ప్రధాన మందిరంలో బుద్ధుడు ధ్యానం చేస్తున్నట్లుగా కనిపించే విగ్రహం ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ విగ్రహాన్ని బంగారు, వెండి, మాణిక్యాలు, వైఢూర్యాలతో చెక్కిండ్రు. ఇక్కడ బుద్ధుని అవశేషాలు భద్రపరచిండ్రట. నిశ్చల సమాధిలో ఆసీనుడైన బుద్ధుని విగ్రహం ‘కోరికలే దుఃఖాలన్నిటికి మూలకారణం’ అని చెబుతున్నట్లుగా ఉంటుంది. మందిరం వెనుక భాగంలో బోధి వృక్షముంది. ఈ వృక్షం క్రిందనే బుద్ధునికి జ్ఞానోదయం కలిగిందట. ఆ వృక్ష శాఖలనే అశోకచక్రవర్తి కుమార్తె సంఘమిత్ర శ్రీలంకలోని అనురాధపురంలో నాటిందట. బుద్ధుని తపోభూమి అయిన బోధివృక్ష మూల స్థానాన్ని వజ్రాసనం అంటరు. మహాబోధి మందిరానికి ఉత్తరదిశగా ‘అనిమేషలోచన’ అనే స్తూపముంది. పేరుకు స్తూపమే కాని ఇది ఒక మందిరం. 55 అడుగుల ఎత్తున ఇటుకలతో కట్టిన ఈ మందిరం లోపల బుద్ధుని విగ్రహముంది. బుద్ధగయలో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేది ధ్యానముద్రలో ఉన్న భారీ బుద్ధ విగ్రహం. దీని ఎత్తు 80 అడుగులు. దేశంలోని బుద్ధ విగ్రహాలన్నిట్లోకి ఇది ఎత్తైది. బోధి వృక్షం ఆ కాలం నాటిదే అంటరు గాని యథార్థం కాదనిపిస్తుంది. ఒకవేళ దాని అంటేమో! చైనా, టిబెట్ భక్తులు బోధి వృక్షచ్ఛాయలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. బుద్ధుని ముందు ధ్యానంలో కూర్చున్న విదేశీ యువతిని చూస్తుంటే విగ్రహమేమోననిపించింది. అశోకుడు కట్టించిన రాతి గోడపై పాళీ భాషలో అతని పేరు చెక్కబడివుంది. జాతరలో చిల్లర కొట్లు వెలిసినట్లు బజారు నిండా పూసల దండలు, రుద్రాక్ష మాలలు, చిన్న చిన్న పటాలు అమ్మే దుకాణాలున్నయి. - దేవులపల్లి కృష్ణమూర్తి ‘మా యాత్ర’ నుంచి. -
శిక్ష ఇద్దరికీ...
బుద్ధుడు అంతా శూన్యం అని అంటే ఆదిశంకరులు అంతా సంపూర్ణం అని చెప్పుకొచ్చారు. అలాగే చైనా జ్ఞాని లావోత్సు తత్వాలు కూడా సామాన్యమైనవి కావు. లావోత్సు కీర్తిప్రతిష్టల గురించి తెలిసి చైనా చక్రవర్తి ఓరోజు తన సభకు పిలిపించి ఆయనను ప్రధానమంత్రిని చేయాలనుకున్న విషయాన్ని చెప్తాడు. లావోత్సు సున్నితంగా తిరస్కరిస్తాడు. ‘‘అయ్యా, పరిపాలనకు సంబంధించి నాకున్న అభిప్రాయాలు వేరు. మీరు ఇప్పటికే రాసి ఉన్న చట్టాల ప్రకారం నడచుకుంటారు. కానీ నేను నా మనస్సాక్షికి తగినట్లే ప్రవర్తిస్తాను’’ అని లావోత్సు అంటాడు. కానీ చక్రవర్తి ఆయనపై ఒత్తిడి తీసుకొస్తాడు. ధర్మబద్ధమైన పాలన కొనసాగడానికి మీలాంటి వారు మా మంత్రి మండలిలో ఉండాలి’’ అని అంటాడు. కాదనలేక ప్రధానమంత్రి పదవి చేపడతాడు లావోత్సు. తొలిరోజే ఒక నేరం విచారణకు వస్తుంది. ఒక దొంగ ఓ ప్రముఖుడి ఇంట దొంగతనం చేసి పట్టుబడతాడు. అతనిని తీసుకొచ్చి రాజు ముందు హాజరుపరుస్తారు. అతను ఎక్కడైతే దొంగతనం చేశాడో ఆ ఇంటి యజమానిని కూడా సభకు రప్పిస్తారు. ఇంటి యజమాని తన ఇంట చోరీ చేసింది అతనే అని చెప్తాడు. దొంగ కూడా అవునని ఒప్పుకుంటాడు. ఇద్దరి మాటలు విన్న లావోత్సు దొంగకు ఆరు నెలలు, ఇంటి యజమానికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్తాడు. ఆయన చెప్పిన తీర్పు విని చక్రవర్తి, సభలోని ఇతర మంత్రులు విస్తుపోతారు. ఇంటి యజమాని ‘‘నాకెందుకు శిక్ష వే శారు. నేను చేసిన త ప్పేంటో తెలియడం లేదు’’ అని లబోదిబోమంటాడు. అప్పుడు లావోత్సు ‘‘దొంగతనానికి ప్రేరేపించింది నువ్వే. అది నీ తప్పు. అతను పేదరికం కారణంగా దొంగతనం చేశాడు. నువ్వు ఇతరుల శ్రమను దోచుకుని సంపాదించిన డబ్బును దాచుకున్నావు. నిజానికి నీకు మరింత ఎక్కువ కాలం జైలు శిక్ష విధించాల్సింది’’ అంటాడు లావోత్సు. ఆ తర్వాత ఇంటి యజమాని చక్రవర్తిని కలిసి ‘‘రాజా, ఈ మనిషి విచిత్రంగా ఉన్నాడు. ఇటువంటి వ్యక్తులను మీ ఆస్థానంలో మంత్రులుగా నియమించడం సరికాదు. ఈరోజు నాకు పట్టిన గతే రేపు మీకు కూడా ఎదురు కావచ్చు. పేదల రక్తాన్ని దోచుకుని మీరు డబ్బునంతా ఖజానాలో దాచుకున్నారని మిమ్మల్ని కూడా ఖైదు చేయించే అవకాశం లేక పోలేదు. నాకు తోచిందేదో మీకు చెప్పాను. ఆపై మీ ఇష్టం’’ అని చెప్తాడు. ఈ మాటలకు చక్రవర్తి ఆలోచనలో పడతాడు. ఎందుకైనా మంచిదని లావోత్సుని పదవి నుంచి తప్పిస్తాడు. నేరం జరిగే కారణాలను తెలుసుకుని ఆ పరిస్థితులను మార్చకుండా కేవలం తప్పుచేసిన వారికి మాత్రమే శిక్ష విధిస్తే దాని వల్ల ఫలితం ఉండదని, నేరస్తుల సంఖ్యను తగ్గించలేమని లావోత్సు నిశ్చితాభిప్రాయం. లావోత్సు ఆభిప్రాయం చైనాలో అనేక మందిని ఆలోచనలో పడేసింది. తర్వాతి కాలంలో ఆయన అభిప్రాయాలు ‘తావ్ త జింగ్’ అనే పేరుతో పుస్తకంగా వెలువడ్డాయి. ఈ పుస్తకాన్ని ఇరవైకి పైగా భాషలలోకి అనువదించారు కూడా. ‘తావ్ త జింగ్’ అంటే జ్ఞానం, మంచి జీవితం అని అర్థం. శాస్త్రాభివృద్ధి అంతగా లేని రోజుల్లో చెప్పిన లావోత్సు అభిప్రాయాలు అప్పటికే కాదు ఇప్పటికీ ఎప్పటికీ ఆచర ణీయమే.