విదిశా నగర సమీపంలోని ఒక వ్యాపార కేంద్రం సువర్ణపురి. ఆ పట్టణం లో ప్రజోతుడు పేరున్న ధనిక వ్యాపారి. ప్రజోతునికి మణిమాలుడు అనే కుమారుడు. అతనూ పెరిగి పెద్దవాడయ్యాడు. తండ్రి వ్యాపారంలో తోడుగా ఉండేవాడు. మణిమాలుడు తమ వ్యాపారాన్ని మరింతగా పెంచాడు. ప్రజోతుడు వృద్ధుడయ్యాడు. కుమారునికి వ్యాపార పద్ధతులు, సుదూర రాజ్యాల ప్రజల తీరు తెన్నులు చెప్పుతూ... కాలం గడపసాగాడు. అప్పుడప్పుడూ జైన సాధువుల్ని, బౌద్ధ భిక్షువుల్ని పిలిచి దానాలు ఇచ్చేవాడు. నగరం లో కొన్ని ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవాడు.
కొన్నాళ్ళకు మణిమాలుడు కూడా పెద్ద వ్యాపారి అయ్యాడు. ధనం పెరిగిన కొద్దీ అతనికి ధనదాహం కూడా పెరిగింది. అక్రమ వ్యాపారాలు సాగించాడు. దానితో ధనం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. దానధర్మాలు మానాడు. ధనంతోపాటు మానసిక అశాంతీ పెరిగింది. నిద్ర సుఖానికి దూరం అయ్యాడు. భయానికీ, ఉలికిపాటుకూ చేరువయ్యాడు. తండ్రి తన కుమారునిలో పెరిగిపోతున్న అశాంతిని గమనించాడు. ఒకరోజున పిలిచి– ‘‘నాయనా! నీవు నైతికతకి దూరమవుతున్నావు.
మనోవేదనకి దగ్గరవుతున్నావు. నీవు ఇక నాతోపాటు బుద్ధ సందేశాలు వినడానికి రా.. ప్రస్తుతం భగవాన్ బుద్ధుడు ఇక్కడకు సమీపంలోనే ఉంటున్నారు’’ అని అనునయంగా చెప్పాడు. అలా... తనతో రెండు మూడుమార్లు మణిమాలుణ్ణి బుద్ధుని దగ్గరకు తీసుకుని వెళ్ళాడు ప్రజోతుడు. ఆ తర్వాత తానే స్వయంగా బుద్ధుని దగ్గరకు వెళ్ళసాగాడు మణిమాలుడు. ఒకరోజు మణిమాలుడు బుద్ధునితో ‘‘భగవాన్! నేను నా తండ్రిలా దానాలు చేయలేదు. సాధువుల్ని గౌరవించలేదు. వారిని సత్కరించలేదు. వ్యాపారాన్నీ ధర్మబద్ధంగా చేయనూ లేదు. ఇప్పుడే నా తప్పు తెలుసుకున్నాను. కానీ... నాకు ఒక బెంగ ఉంది. మరణానంతరం నా తండ్రికి గానీ, నాకు గానీ స్వర్గం లభిస్తుందా?’’ అని అడిగాడు.
అతని ఆంతర్యం గ్రహించాడు బుద్ధుడు. ‘‘మణిమాలా! రేపు వచ్చేటప్పుడు ఒక మట్టికుండ, కొంత వెన్నపూస, కొన్ని గులకరాళ్ళు తీసుకుని రా’’ అన్నాడు. మరునాడు అవి తీసుకువచ్చాడు మణిమాలుడు. కుండలో గులకరాళ్ళు పోయించి, వాటిమీద వెన్నముద్ద పెట్టించి,‘‘మణిమాలా! దగ్గరలో ఉన్న తటాకం దగ్గరకు తీసుకుపోయి ఈ కుండను నీటిమీద ఉంచి, కర్రతో పగలగొట్టు.
వెన్న మునిగితే నీ తండ్రికి స్వర్గ్రపాప్తి, రాళ్ళు తేలితే నీకు స్వర్గ్రపాప్తి..’’ అని చెప్పి పంపాడు. మణిమాలుడు గబగబా వెళ్ళి నీటిపై కుండను ఉంచి కర్రతో పగలగొట్టాడు. వెన్న తేలింది. రాళ్ళు మునిగాయి. దానితో ఆందోళనపడుతూ బుద్ధుని దగ్గరకు పరుగున వచ్చి పడ్డాడు. విషయం చెప్పి...‘‘మా ఇద్దరికీ స్వర్గం దక్కే మార్గం ఏమిటి భగవాన్’’ అని అడిగాడు.
‘‘నాయనా నీటిలో రాళ్ళు మునగడం వాటి ప్రకృతిధర్మం. నీటిపై తేలడం వెన్న సహజ ధర్మం. అవి వాటి సహజ ధర్మాల్ని తప్పి ఎప్పుడూ ప్రవర్తించవు. అలాగే... మంచి పనులు చేస్తే మనిషికి మనశ్శాంతి. సుఖ నిద్ర, సుఖ జీవనం. అదే స్వర్గం. చెడ్డపనులు చేస్తే మనస్సుకు అశాంతి. దుఃఖం. నిద్రకు దూరం. మనోవ్యధ. అదే నరకం. మంచిగా మానవునిగా, మానవతతో జీవించు. దుఃఖాన్ని ఇచ్చే అకుశల కర్మలు ఆచరించకు. అదే స్వర్గం. ...’’ అని చెప్పాడు.
మణిమాలుని మనస్సు తేటపడింది. మట్టికుండ మహోపదేశాన్ని అందించింది. ధర్మబద్ధంగా జీవించడం నేర్చుకున్నాడు. దానాలు చేస్తూ, ధర్మకార్యాలు నెరవేరుస్తూ జీవితం ఆనందంగా కొనసాగించారు. – డా. బొర్రా గోవర్ధన్
Comments
Please login to add a commentAdd a comment