
బౌద్ధ వాణి
బుద్ధుడిని చూడడం కోసం ఓరోజు అనేక మంది వచ్చారు. ఆ సమయంలో బుద్ధుడు ఓ చెట్టు కింద ఉన్న అరుగుమీద కూర్చుని ఉన్నారు. బుద్ధుడు చేతిలో ఓ పట్టు రుమాలు ఉండటం చూసి అక్కడున్న వారందరికీ ఆశ్చర్యం వేసింది. విలాసాలకూ ఖరీదైన వస్త్రాలకూ ఆమడదూరంలో ఉండే బుద్ధుడి దగ్గర పట్టు రుమాలు ఉండటమేమిటని అందరూ చెవులు కొరుక్కున్నారు. అక్కడ మౌనం ఆవరించిన తర్వాత బుద్ధుడు తన చేతిలో ఉన్న రుమాలుని చూపిస్తూ ఏమిటది అని ఆడిగారు. అందరూ ఒక్క మాటగా అది పట్టు రుమాలు అని చెప్పారు.
అనంతరం బుద్ధుడు ఆ రుమాలులో అయిదు ముళ్ళు వేసి చూపిస్తూ ఇప్పుడిదేమిటీ అని అడిగారు. అందరూ ఒక్క మాటగా అది పట్టు రుమాలని చెప్పారు. అప్పుడు బుద్ధుడు ‘అదే మీకూ నాకూ తేడా. ఆ తేడా వల్లే మీరక్కడా నేనిక్కడా ఉన్నాను‘ అంటూ తన మాటలు కొనసాగింంచారు. ‘అయిదు ముళ్ళు ఏంటంటే హింసకు పాల్పడకపోవడం, చైతన్యం కలిగి ఉండటం, అత్యాశకు దూరంగా ఉండటం, ఏం జరిగినా అబద్ధం చెప్పకపోవడం, నిజాయితీతో కూడిన సత్పవ్రర్తన కలిగి ఉండటం‘ అని చెప్పారు.
ఈ అయిదూ అనుసరించగలిగితే ఎవరితోనూ ఏ గొడవలూ రావని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ అయిదు పురోగతికీ, మానసిక ప్రశాంతతకూ ఎంతో అవసరం. అందుకోసమే బుద్ధుడు అయిదు ముడులు వేసారు. కానీ ఆ ముళ్ళ విషయం ఆలోచించని వాళ్ళందరూ ఆ రుమాలు పట్టుదనే చెప్పారు తప్ప వాళ్ళెవరికీ బుద్ధుడెందుకు ముళ్ళు వేసారన్నది ఆలోచించలేదు.
Comments
Please login to add a commentAdd a comment