difference
-
రూపే కార్డ్- వీసా కార్డ్ తేడా ఏమిటి? ఏది ఉత్తమం?
ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటి. మనదేశంలో ఆన్లైన్ లావాదేవీలతో పాటు డిజిటల్ లావాదేవీలు జరుగుతుంటాయి. నగదు రహిత లావాదేవీల్లో కార్డు చెల్లింపుల ట్రెండ్ ఇటీవలి కాలంలో మరింతగా పెరిగింది. నగదు రహిత విధానంలో కార్డుల సాయంతో పలు రకాల లావాదేవీలు చేయవచ్చు.కార్డుతో లావాదేవీలు జరిపే చాలామందికి రూపే కార్డ్- వీసా కార్డ్ మధ్య తేడాలు ఏమిటో సరిగా తెలియకపోవచ్చు. దీంతో కొత్త కార్డును ఎంపిక చేసుకునే విషయంలో అయోమయానికి గురవుతుంటారు. అందుకే ఈ రెండు కార్డుల మధ్యగల వ్యత్యాసాన్ని గుర్తిస్తూ, ఏ కార్డు ఉత్తమనేది ఇప్పుడు తెలుసుకుందాం.రూపే కార్డ్ భారతదేశంలో విస్తృతంగా ఆమోదం పొందిన కార్డు. దీనిని ఉపయోగించి అంతర్జాతీయ వెబ్సైట్లలో చెల్లింపులు చేయలేం. అయితే వీసా కార్డ్ అనేది దేశీయంగా, అంతర్జాతీయంగా విస్తృతంగా ఆమోదం పొందింది. ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలోనూ వీసా కార్డ్ సాయంతో చెల్లింపులు చేయవచ్చు.వీసా కార్డ్ నెట్‌వర్క్‌లతో పోలిస్తే రూపే కార్డ్‌తో చేసే చెల్లింపులకు తక్కువ లావాదేవీ ఛార్జీలు కలిగివుంటాయి. ఈ కార్డ్ ద్వారా జరిగే ప్రతి లావాదేవీ భారతదేశంలోనే ప్రాసెస్ అవుతుంది. ఇక వీసా కార్డ్ అనేది అంతర్జాతీయ చెల్లింపు నెట్వర్క్ అయినందున, లావాదేవీ ప్రక్రియ దేశం వెలుపల జరుగుతుంది. అందుకే రూపేతో పోలిస్తే దీనికి అధికంగా ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.రూపే కార్డ్ లావాదేవీలు వీసాతో పాటు ఇతర చెల్లింపు నెట్‌వర్క్‌ల కంటే వేగంగా జరగుతాయి. వీసా కార్డ్‌లో లావాదేవీల వేగం రూపేతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. రూపే కార్డ్ ప్రాథమిక లక్ష్యం ముఖ్యంగా దేశంలోని గ్రామీణులకు ఉపయుక్తం కావడం. భారతదేశంలో వీసా కార్డులు టైర్ వన్, టైర్ టూ నగరాల్లో ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి.రూపే కార్డ్ - వీసా కార్డ్‌లలో ఏ కార్డ్ ఉత్తమం అనే విషయానికొస్తే అది వినియోగదారుని అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఎవరైనా దేశంలోనే లావాదేవీలు జరుపుతున్నట్లయితే వారికి రూపే కార్డ్ ఉత్తమ ఎంపిక. అంతర్జాతీయంగా లావాదేవీలు చేస్తూ లేదా తరచూ విదేశాలకు వెళుతున్నవారికి వీసా కార్డ్ ఉత్తమం. ఈ కార్డును ప్రపంచంలోని ఏ దేశంలోనైనా వినియోగించేందుకు అవకాశం ఉంటుంది. -
ఆకలికి అలవాటుకి తేడా ఉంది ...ఇదో మైండ్‌గేమ్!
‘నా దేహం నా ఇష్టం. నాకు ఇష్టమైనవి తింటాను’... అనుకోవడంలో ఇతరులకు ఎటువంటి అభ్యంతరమూ ఉండాల్సిన అవసరం లేదు. కానీ సమాజంలో గౌరవంగా జీవించాలంటే మనం తినే ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలి. వినడానికి విచిత్రంగా ఉన్నా సరే ఇది నిజం. ప్రతి ఒక్కరూ ‘పోషకాహారం తీసుకోవాలి, దేహానికి అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. దానికి తగినట్లు వ్యాయామం చేయాలి’... దైనందిన జీవితం ఇలా క్రమబద్ధంగా ఉన్న వ్యక్తి ఆలోచనలు ఆరోగ్యకరంగా ఉంటాయి. ప్రవర్తన కూడా గౌరవపూర్వకంగా ఉంటుంది. స్థూలంగా చెప్పినా సూక్ష్మంగా చెప్పినా, విషయం ఏమిటంటే... ఆరోగ్యకరమైన దేహం ఆరోగ్యకరంగా ఆలోచిస్తుంది. మానసిక ఆరోగ్యంలో అపసవ్యతలు తలెత్తాయంటే అవి కేవలం మానసికం మాత్రమే కాదు, అసలైన సమస్య దేహంలోనే ఉంటుంది. దేహానికి అందుతున్న ఆహారంలోనే ఉంటుంది... అన్నారు హెల్త్ సైకాలజిస్ట్ సుస్మితా గుప్తా ‘‘సమాజంలో మంచి వ్యక్తిగా చలామణి కావాలంటే మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. మానసిక ఆరోగ్యం మీద మన అలవాట్లు తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. మనకు తెలియకుండా చేసే పోరపాటు ఏమిటంటే ‘ఆకలి– అలవాటు’ మధ్య తేడా గుర్తించకపో వడం. ఆకలి లేకపో యినా అలవాటుగా తినడం, ఒత్తిడిలో ఉన్నప్పుడు దాన్నుంచి తప్పించుకోవడానికి ఆహారాన్ని ఆశ్రయించడం అనే దురలవాటు ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇటీవల ఎక్కువైంది. దైనందిన జీవితంలో ఒత్తిడి ఎక్కువైంది, జిహ్వను సంతృప్తిపరుచుకోవడానికి జంక్‌ఫుడ్ మీదకు మనసు మళ్లడం అనేది కూడా మన జీవనశైలిలో భాగమైపో యింది. నిజానికి మన మెదడు మనతో గేమ్ ఆడుతుంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని తెలిసినప్పటికీ మనసు జంక్‌ఫుడ్ మీదకు మళ్లిస్తుంది. ఇదెలాగంటే... రేపటి నుంచి వ్యాయామం మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకుని అలారం పెట్టుకుంటాం. అలారం మోగినప్పుడు ఆపేసి మళ్లీ నిద్రపో తాం. మన జీవనశైలికి అనుగుణంగా మన మెదడులో మ్యాపింగ్ జరిగిపోయి.......ఉంటుంది. దాని నుంచి బయటపడడానికి మెదడు ఇష్టపడదు. ఆ కంఫర్ట్ జోన్ నుంచి మనల్ని కూడా బయటకు రానివ్వదు. అలాంటప్పుడు మనం మెదడు మాటను పెడచెవిన పెట్టడమే పరిష్కారం. మనల్ని మనం దురలవాట్ల నుంచి బయటేసుకోవాలంటే ఆ ప్రయత్నంలో మనల్ని వెనక్కి లాగే మెదడు చెప్పే మాటను వినకూడదు. ఆహారం– మానసిక అనారోగ్యం! మనం అలవాటుగా నిత్యం జంక్‌ఫుడ్‌తో పోట్టను నింపేస్తుంటే దేహం శక్తిహీనమవుతూ ఉంటుంది. అలసటతోపాటు ప్రతిదానికీ చిరాకు, ఆందోళన, ఆవేశపడడం వంటి లక్షణాలు తోడవుతాయి. మెదడు నుంచి నాడీ వ్యవస్థ ద్వారా దేహభాగాలకు అందాల్సిన సంకేతాల్లో అపసవ్యతలు తలెత్తుతాయి. ఒక విషయానికి సక్రమంగా ప్రతిస్పందించాల్సిన సందర్భంలో విపరీతంగా స్పందించడం వంటి మార్పులు కనిపిస్తాయి. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. మానసిక సమస్యలు తీవ్రరూపం దాల్చినప్పుడు మాత్రమే మానసిక వైద్యుని సంప్రదిస్తుంటాం. ప్రతి ఒక్కరిలో సమస్య అంతటి స్థాయి తీవ్రతకు దారితీయదు. కానీ మధ్యస్థ దశ ఎక్కువమందిలో కనిపిస్తుంటుంది. ఈ సమస్యకు వైద్యం... మనం మంచి ఆహారం తీసుకోవడమే. బ్రెయిన్ మనతో ఆడుకుంటుంది, మనం బ్రెయిన్‌ని మన అధీనంలో ఉంచుకోగలగాలి. అదే దేహానికి–మెదడుకు సమగ్రమైన ఆరోగ్యం. మనం ఏమి తింటున్నామో దానిని బట్టే మనం ఏమిటో చెప్పవచ్చు. ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకువెళ్లగలిగితే సమాజం ఎదుర్కొంటున్న అనేక మానసిక రుగ్మతలను నివారించవచ్చు. ఆరోగ్యకరమైన బంధాలతో అందమైన సమాజాన్ని నిర్మించడానికి నా వంతుగా చేస్తున్న ప్రయత్నమే ఇది’’ అన్నారు హెల్త్ సైకాలజిస్ట్ సుస్మితాగుప్తా – వాకా మంజులారెడ్డి, ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధి వార్థక్యం పోంచి ఉంటుంది బాడీ–మైండ్‌ని కలిపి ఒక యూనిట్‌గా పరిగణించాలి. ఒకటి ప్రమాదంలో పడితే రెండవది కూడా ప్రమాదంలో పడుతుంది. దేహం సమతుల ఆరోగ్యంతో ఉన్నప్పుడే మెదడు కూడా సంపూర్ణారోగ్యంతో ఉంటుంది. దేహానికి సంతులిత ఆహారం అందనప్పుడు తలెత్తే సమస్యలు మానసిక అపసవ్యతలు మాత్రమే కాదు వార్ధక్యం కూడా. త్వరగా వయసు మీద పడుతున్న వారిలో దేహానికి పో షకాహారం తగిన మోతాదులో అందకపో వడంతోపాటు చిన్న చిన్న మానసిక రుగ్మతలతో సతమతమైన నేపథ్యం కనిపించి తీరుతుంది. ఇది అంతర్జాతీయంగా నిర్వహించిన అధ్యయనం. జంక్‌ఫుడ్ కారణంగా ఎదురయ్యే సమస్య స్థూలకాయం మాత్రమే కాదు మానసిక అనారోగ్యాలు కూడా. దేహం లోపల ఇన్ఫ్లమేటరీ కండిషన్‌కు దారి తీస్తుంది. అది దేహం వార్థక్యం బారిన పడడానికి తొలి దశ. – సుస్మితా గుప్తా,హెల్త్ సైకాలజిస్ట్, ద క్యూర్ స్పేస్ -
బ్రాండెడ్, జనరిక్ మందుల మధ్య తేడా తెలుసుకోండి ఇలా..
సాక్షి, కర్నూలు: రోగమొచ్చిందంటే వ్యాధి కంటే దాని చికిత్సకయ్యే ఖర్చును తలచుకుని ఆందోళన, దిగులు చెందే పరిస్థితి. ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నా, తక్కువ ధరలో లభ్యమయ్యే మందులు ఉన్నా వాటిపై అవగాహన ఉండేది కొద్దిమందికి మాత్రమే. బ్రాండెడ్‌తో పోలిస్తే జనరిక్ మందులు చాలా తక్కువ ధరకు లభిస్తున్నా యి. నాణ్యత కూడా చాలా బాగుంటుంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మూడు మెడికల్ షాపులు ఉన్నాయి. 2014 నుంచి ఈ మూడు దుకాణాలను జనరిక్ మందుల విక్రయశాలలుగా మార్చారు. ప్రస్తుతం జీవనధార మందుల దుకాణాలుగా ఇవి చెలామణి అవుతున్నాయి. చదవండి: వినూత్నం: ఆ గుప్పెళ్లు.. దయగల గుండెల చప్పుళ్లు వీటితో పాటు ప్రైవేటుగా కేంద్ర ప్రభుత్వ సహాయంతో పలువురు వ్యక్తులు జనరిక్ మందుల దుకాణాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇవి 10కి పైగా ఉన్నాయి. అయితే వైద్యుల ప్రోత్సాహం లేని కారణంగా వీటికి ఆదరణ తక్కువగా ఉంటోంది. జనరిక్ మందులు నాణ్యత ఉండవని చెబుతూ అధికంగా బ్రాండెడ్ మందులనే వైద్యులు సూచిస్తున్నారు. ఎవరైనా రోగం తగ్గించుకునేందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని వైద్యులు బ్రాండెడ్ మందులనే రోగులకు రాస్తున్నారు. బ్రాండెడ్ మందులు రోగులకు రాస్తే ఆయా ఫార్మాకంపెనీలు వైద్యులకు భారీగా కమీషన్లు ముట్టజెబుతున్నాయన్నది బహిరంగ రహస్యం. ఈ కారణంగానే వారు తక్కువ ధరకు లభించే జనరిక్ మందులను ప్రోత్సహించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. భారతీయ వైద్య విధాన మండలి సైతం జనరిక్ మందులే రాయాలని పలుమార్లు హెచ్చరించినా వైద్యుల్లో మార్పు రావడం లేదు. చివరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ప్రభుత్వ వైద్యులు సైతం జనరిక్ మందులు కాకుండా బ్రాండెడ్ మందులే రోగులకు రాస్తున్నారు. జనరిక్ మందులు రాస్తే రోగులకు 70 నుంచి 80 శాతం ఖర్చు తగ్గుతుందని తెలిసినా వారు ఆ పనిచేయకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎలాంటి మార్పూ ఉండదు బ్రాండెడ్, జనరిక్ మందుల్లో ఉండేది ఒకే రకమైన ఔషధమే. బ్రాండెడ్ మందులకు ఉత్పత్తి ఖర్చుతో పాటు డీలర్, హోల్‌సేల్, రిటైల్ల లాభాలు, వైద్యుల కమీషన్లు అందులోనే ఉంటాయి కాబట్టి వాటి ధర అధికం. ఉదాహరణకు డోలో 650 అనేది బ్రాండెడ్ మందు. కేవలం పారాసిటమాల్ అనేది దాని జనరిక్ పేరు. వైద్యులు పారాసిటమాల్ అని రాయాలి. కానీ అలా చేయడం లేదు. నోవామాక్స్ అనేది బ్రాండెడ్ కాగా అందులోని అమాక్సిలిన్ జనరిక్ మందు పేరు. అయితే కొన్ని ఫార్మాకంపెనీలు ఏది బ్రాండెడ్ మందో, ఏది జనరిక్ మందో తెలియనంతా మందులు తయారు చేస్తూ వైద్యులనే అయోమయానికి గురిచేస్తున్నాయి. ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తోంది జనరిక్ మందులు నాణ్యతలో బ్రాండెడ్ మందులతో ఏ మాత్రం తీసిపోవు. పైగా ఇవి బ్రాండెడ్ మందుల కంటే చాలా తక్కువ ధరకు లభిస్తాయి. జనరిక్ మందుల దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం సబ్సిడీలు కూడా ఇస్తోంది. –ఎ.రమాదేవి, అసిస్టెంట్ డైరెక్టర్, ఔషధ నియంత్రణ శాఖ, కర్నూలు -
హిందూయిజం, హిందూత్వ వేర్వేరు
వార్ధా/న్యూఢిల్లీ: హిందూయిజం, హిందూత్వ పదాల మధ్య చాలా వ్యత్యాసం ఉందని, అవి రెండూ వేర్వేరు అని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చెప్పారు. ఒక ముస్లింని, సిక్కుని కొట్టమని హిందూమతం ఎక్కడా చెప్పలేదని, కానీ హిందూత్వ ఆ పని చెయ్యమంటోందని విమర్శించారు. హిందూమతాన్ని అనుసరిస్తూ ఉంటే హిందూత్వ అన్న కొత్త పదం ఎందుకు పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు. మహారాష్ట్రలో వార్ధాలోని సేవాగ్రమ్ ఆశ్రమంలో నాలుగు రోజుల పాటు జరగనున్న ఏఐసీసీ శిక్షణా తరగతుల్లో శుక్రవారం ఆన్లైన్ ద్వారా రాహుల్ గాంధీ మాట్లాడారు. ‘హిందూయిజానికి, హిందూత్వకి ఉన్న తేడాలేంటి? ఆ రెండూ ఒకటేనా? ఒక్కటే అయితే రెండింటికి ఒక్కటే పేరు ఉండాలి కదా! అందుకే అవి రెండూ వేర్వేరు. ఒక ముస్లింని, సిక్కుని కొట్టమని హిందూమతం ఎప్పుడూ చెప్పలేదు. నేను ఉపనిషత్తులు చదివాను. హిందూ మత గ్రంథాలు చదివాను. అందులో ఎక్కడా అలా లేదు. కానీ వారిని కొట్టమని హిందూత్వ చెబుతోంది’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, మన జాతి సిద్ధాంతం ఒకటేనని, అదొక విలువైన రత్నమన్నారు. అందులో ఎంతో శక్తి నిక్షిప్తమై ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఎల్ల ప్పుడూ సజీవంగా, మహత్తర చైతన్యంతో ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ బీజేపీ దానిని కనిపించకుండా చేస్తూ మీడియాని అడ్డం పెట్టుకొని హిందూత్వని విస్తరిస్తోందని ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం ఉన్నవి కాంగ్రెస్ సిద్ధాంతం, ఆరెస్సెస్ సిద్ధాంతాలేనని, బీజేపీ పనిగట్టుకొని విద్వేషాలు నూరిపోస్తోందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హిందూ మతంపై ఎందుకంత ద్వేషం: బీజేపీ హిందూత్వకు సంబంధించి రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురు దాడికి దిగింది. హిందూమతంపై కాంగ్రెస్ నేతలు ద్వేషాన్ని నూరి పోస్తున్నారని విమర్శించింది. రాహుల్ ఆదేశాల మేరకే సల్మాన్ ఖుర్షీద్, శశిథరూర్, చిదంబరం వంటి నేతలు హిందూ మతాన్ని లక్ష్యంగా తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. -
కరోనా ఫస్ట్ వేవ్– సెకండ్ వేవ్‌కు మధ్య తేడాలేమిటి?
కరోనా మహమ్మారి మళ్లీ మరోసారి మనందరినీ విపరీతంగా భయపెడుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ దాకా కొనసాగిన ఫస్ట్ వేవ్‌లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఫిబ్రవరిలో మొదలైన రెండో వేవ్‌లో మరికొంత మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ఇప్పటికే కనిపిస్తున్న సూచనలతో మరింత స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఫస్ట్ వేవ్‌కీ, సెకండ్ వేవ్‌కీ తేడాలు ఏమిటి? అప్పుడు తీసుకున్న జాగ్రత్తలకి ఇప్పుడు తీసుకుంటున్న జాగ్రత్తలకి ఏ విధమైన మార్పులు ఉంటాయి? అప్పుడున్న వ్యాధికి ఇప్పుడున్న వ్యాధి కి మధ్యన లక్షణాలు ఏ విధంగా మారుతున్నాయి? చికిత్స విషయంలో వచ్చిన మెరుగుదలలు ఏమిటి? వ్యాక్సిన్ విషయంలో మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? ఈ అంశాలన్నింటినీ వివరించే ప్రత్యేక కథనమిది. ఫస్ట్ వేవ్‌లో కరోనా పట్ల విపరీతమైన భయం ఉండేది. దానికి తోడు ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో ప్రజలు పూర్తిగా అప్రమత్తతతో ఉన్నారు. ఈ రెండు అంశాలు ఉన్నప్పటికీ... అప్పటివరకు కరోనా ఇన్ఫెక్షన్కి ఎవరికీ రెసిస్టెన్స్ లేకపోవడం తో లాక్డౌన్ తర్వాత, అప్పటి పాండమిక్ విపరీతంగా సాగింది. అయితే మరణాల సంఖ్య మొదట్లో 3 శాతం ఉండగా పోనుపోను మరణాల సంఖ్య తగ్గుతూ 1.5 శాతానికి వచ్చింది. అయితే ఇప్పటి తాజాపరిస్థితిలో ఫస్ట్‌వేవ్‌లో ఉన్న భయం రెండవ వేవ్ నాటికి ప్రజల్లో లేదు. అనేక మందికి కరోనా వచ్చి తగ్గిపోవడంతో అదే విధంగా తమకు కూడా తగ్గిపోయే అవకాశం ఉందనీ, ఒకసారి తగ్గిపోయినట్లయితే ఇక అది రెండోసారి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని ప్రజల భావన. దీంతో కోవిడ్ పట్ల మనం తీసుకోవలసిన జాగ్రత్తలు కొంత మేరకు ప్రజలు గాలికొదిలేసినట్లుగా కనబడుతోంది. దాంతో సెకండ్ వేవ్‌లో చాలా ఎక్కువ మందికి చాలా తక్కువ సమయంలో వ్యాధి వస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. మొదటిసారి 10 వేల కేసులు నుండి 80 వేల కేసులు దాకా రావటానికి 84 రోజులు పట్టినట్లయితే ఈసారి అది 42 రోజుల్లోనే రావటం చూస్తున్నాం. ఇంతేకాకుండా రెండో వేవ్‌లో యుక్తవయస్కులూ, పిల్లలు కూడా కొంచెం ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడటం కనిపిస్తోంది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లలో వ్యాధి లక్షణాలలో తేడాలేమిటి? ఫస్ట్ వేవ్, అలాగే సెకండ్ వేవ్‌లలో కూడా ఈ వ్యాధి సుమారుగా ఒకే రకంగా ఉంది. ప్రధానంగా జ్వరం, ఒళ్లు నొప్పులు లేదా తలనొప్పి, నిస్సత్తువ, నీరసం, బలహీనత, వాసన కోల్పోవడం, పొడి దగ్గుతోనే ఈ జ్వరం వస్తుంది. అయితే సెకండ్ వేవ్ కేసుల్లో కొంతవరకు విరేచనాలు ఎక్కువగా కావడం, ఊపిరితిత్తులకు వ్యాధి ఎక్కువగా పాకటం, మరికొన్ని వేరే విధమైన లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. లక్షణాల పరంగా చూసినట్లయితే మొదటివేవ్ కంటే కూడా రెండో వేవ్‌లో కొందరికి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తున్నా... తీరా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయిస్తే... ఆ టెస్ట్‌లో వారికి నెగెటివ్ రావడం ఒక ఆసక్తికరమైన పరిణామం. అయితే మొదటి వేవ్‌తో పోలిస్తే రెండో వేవ్‌లో రోగుల మరణాల సంఖ్య తగ్గుతుందన్న ఆశ వైద్యుల్లో ఉంది. కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే వ్యాధి ఎక్కువ మందికి గనక సోకినట్లయితే... గతం కేసులతో పోల్చినప్పుడు మరణాల సంఖ్య ఎంతోకొంత తగ్గినప్పటికీ... ఇప్పుడు రోగుల సంఖ్య అపరిమితంగా పెరిగినందున దానికి అనుగుణంగానే మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ విషయంలో అలసత్వం ఖచ్చితంగా పనికిరాదు. రెండో వేవ్‌లో వ్యాధి వ్యాప్తి ఎందుకు ఎక్కువ? దీనికి రెండు ప్రధానమైన కారణాలున్నాయి. మొదటిది... డార్విన్ సిద్ధాంతం ప్రకారం వైరస్ రూపాంతరం చెందినప్పుడు ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందగలిగిన వేరియంట్స్ బలపడే అవకాశం ఉంటుంది. ఇది అన్ని వైరస్ వ్యాధుల్లోనూ కనబడుతుంటుంది. కాబట్టి కరోనా కూడా పోను పోను ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్స్ గా మారే అవకాశం ఉంటుంది. బ్రిటిష్ వేరియంట్ దీనికి ఒక ఉదాహరణ మాత్రమే. ఇది మాత్రమే కాకుండా ఇండియాలో కనబడుతున్న డబల్ మ్యుటేషన్ వైరస్ కూడా ఇదే విధంగా ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇక రెండవ కారణం మానవ ప్రవర్తనకి సంబంధించింది. పాండమిక్ మొదట్లో ఉన్న భయం ఈ రెండో వేవ్ నాటికి లేదు. కాబట్టి ఎక్కువమంది కోవిడ్ కి సరైన మార్గదర్శక నియమాలు పాటించడంలేదు. మాస్క్ ధరించడం లేదు సరికదా ఫిజికల్ డిస్టెన్స్ కూడా పాటించడం లేదు. కొంతమేరకు పాండమిక్ ఫాటిగ్ అనేది ఇందుకు కారణం. పాండమిక్ ఫాటిగ్ అంటే మనం తీసుకునే జాగ్రత్తలు పోను పోను తీసుకోలేని పరిస్థితి వస్తుంది. జాగ్రత్తల గురించి ఎవరు చెప్పినా వినటానికి కూడా చిరాకు వస్తుంది. ఇంకెంతకాలం ఈ జాగ్రత్తలు తీసుకుంటాం అన్న భావన అందరిలోనూ వచ్చేస్తుంది. లాక్ డౌన్ విధించడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండవు. ఒకసారి వ్యాధి వచ్చి తగ్గిపోయిన వాళ్లు, వారితో పాటు అప్పటికే టీకా తీసుకొని ఉన్నవాళ్లు పెద్దగా జాగ్రత్తలు తీసుకోరు. వాళ్లను చూసి మిగతావాళ్లు కూడా జాగ్రత్తలు తీసుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ కారణాల వల్ల రెండవ తరంగంలో వ్యాధి మరింత ఉధృతంగా వ్యాప్తి చెందే అవకాశం కనబడుతోంది. ఈ కారణాలు మాత్రమే కాకుండా మనకి తెలియని కారణాలు అనేకమైనవి ఉండవచ్చు అనేవి నిపుణుల అభిప్రాయం. ఈ సెకండ్ వేవ్... వాక్సిన్ ఏవిధంగా ప్రభావితం చేస్తోంది? వ్యాక్సిన్ తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత అంటే మొదటి డోస్ వేసుకున్న తర్వాత సుమారు గా 45 నుంచి 50 రోజుల తర్వాత ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారికి కోవిడ్ నుండి రక్షణ కలిగే అవకాశం ఉంటుంది. అంటే వ్యాక్సిన్ ఇవాళ వేసుకున్నప్పటికీ... సుమారు రెండు నెలల తర్వాత మాత్రమే పూర్తి రక్షణ లభించే అవకాశం ఉంది. అయితే ఈ సెకండ్ వేవ మొదలయ్యే సమయానికి భారతదేశంలో కేవలం 1 నుంచి 2 శాతం మందికి మాత్రమే టీకా సంపూర్ణంగా ఇచ్చారు. అంటే పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్నవారు కేవలం 1 నుంచి 2 శాతమే కాబట్టి... వారిని మినహాయించి మిగతావారందరి విషయంలో వారు మొదటిదో, రెండోదో డోస్ తీసుకున్నా... దాని ప్రభావం పూర్తిగా అమల్లోకి ఇంకా వచ్చి ఉండనందున దాని పనితీరు ప్రభావపూర్వకంగా ఉండే అవకాశం తక్కువ. అయితే దాంతో మరో ప్రయోజనం మాత్రం ఉంది. సెకండ్ వేవ్ ఎక్కువకాలం ఉండకుండా వ్యాక్సిన్ మనల్ని కాపాడే అవకాశం ఉంటుంది. అంతేకాదు... మూడవ వేవ్ రాకుండా కూడా వ్యాక్సిన్ మనల్ని రక్షించే అవకాశం ఉంది. వ్యాక్సిన్‌తో మరో గమనించదగ్గ మార్పు కూడా... రెండవ వేవ్‌లో వ్యాక్సిన్ ఇంకొక రకమైన మార్పు కూడా తీసుకొస్తోంది. ‘పెల్జ్ మెన్ ఎఫెక్ట్’ అంటే ఒక వ్యాధికి సంబంధించిన రక్షణ మనకి వస్తుంది అని తెలియగానే మనం తీసుకునే నివారణ చర్యలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇది కోవిడ్ వ్యాక్సిన్ సందర్భంగా మనం చూస్తున్నాం. అనేకమంది కోవిడ్ వ్యాక్సిన్‌కి వెళ్లగానే కోవిడ్ నిబంధనలను గాలికి వదిలేస్తున్న సంగతి మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. కోవిడ్ వాక్సినేషన్ సెంటర్‌కి వెళ్లి అక్కడ అ జబ్బు తెచ్చుకుంటున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. దీని ఉద్దేశం వ్యాక్సింగ్ చేయించుకో వద్దని కాదు. వ్యాక్సిన్ మాత్రమే మనల్ని కాపాడుతుంది. అయితే వ్యాక్సిన్ కోసం వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా కోవిడ్ నివారణ చర్యలు పాటించాల్సిందే. వాక్సిన్ అయిపోయిన తర్వాత రెండు నెలల పాటు కూడా మనం తీసుకోవలసిన జాగ్రత్తలు పూర్తిస్థాయిలో తీసుకోవాల్సిందే. దాదాపు ఏడాది నుంచి అస్సలు బయటకు రాని వాళ్ళు కూడా వ్యాక్సిన్ కోసం బయటకు వచ్చి ఆ సమయంలో మాస్క్ సరిగ్గా ధరించక జబ్బు తెచ్చుకుంటున్న దృష్టాంతాలు మనం చూస్తున్నాం. ఇక చికిత్స విషయానికి వస్తే... సెకండ్ వేవ్‌లో కొన్ని ప్రత్యేకమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. మొదటి వేవ్‌లో మాదిరిగానే ఆక్సిజన్, స్టెరాయిడ్స్, రెమ్‌డెసివిర్, హెపారిన్‌లు... కోవిడ్ చికిత్సలో ప్రధాన భూమిక ని నిర్వహిస్తాయి. అయితే కొత్తగా వస్తున్న బారిసిటనిబ్, మోల్నుపిరావిర్, కోవిడ్ సింథటిక్ యాంటీబాడీస్, ఇంటర్ఫెరాన్లు కోవిడ్ చికిత్సను మరింత ఆధునీకరించే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పోయిన సంవత్సరం ఫస్ట్ వేవ్ సమయంలో తీసుకున్న జాగ్రత్తల కంటే మనం ఇప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పోయిన సంవత్సరం మాస్క్ పెట్టుకుంటే మనకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం తక్కువ ఉండేది. ఇప్పుడు మాస్క్ ఖచ్చితంగా సరిగ్గా పెట్టుకుంటే తప్ప మనకి ఇన్ఫెక్షన్ వచ్చే రిస్కు తగ్గడం లేదు. అంటే మాస్కు పెట్టుకోవడం మాత్రమే కాకుండా ఆ మాస్క్ ముక్కు పైకి ఉండేటట్లు చూసుకోవడం, ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చే వరకూ మాస్క్ కంపల్సరీగా ధరించటం, కుటుంబ సభ్యులు కాని వారితో మూసి ఉన్న గదుల్లో ఉన్నప్పుడు అసలు మాస్కు తీయకుండా ఉండటం చాలా అవసరం. లాక్డౌన్ ఇక తప్పదా? గత ఏడాది లాక్ డౌన్ పెట్టినప్పుడు కోవిడ్ ని ఎదుర్కోవడానికి మనదేశం సన్నధ్ధం కాలేదు. అప్పుడు లాక్డౌన్ సహాయంతో మనం వ్యాధిని కొన్ని రోజులు వాయిదా వేసుకుని, ఈలోపల మన ఆక్సిజన్ ఫెసిలిటీ, మన వెంటిలేటర్స్, మరియూ మన ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచుకున్నాం. అయితే ఒకసారి మన ఆసుపత్రులూ, సౌకర్యాలూ సమకూర్చుకున్న తర్వాత లాక్డౌన్ వల్ల స్వల్పకాలిక ప్రయోజనాలు తప్ప దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండవు. ప్రజలు తాము తీసుకోవాల్సిన కోవిడ్ ప్రమాణాలు, నియమనిబంధనలు తూ.చ. తప్పకుండా పాటిస్తే లాక్ డౌన్ మళ్లీ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. లేనిపక్షంలో లాక్ డౌన్ లేదా కఠిన నిబంధనలు తప్పనిసరి అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మన జాగ్రత్త మన చేతుల్లోనే ఉందని గ్రహించి... ఆ మేరకు జాగ్రత్తలూ, కోవిడ్ నియమనిబంధనలూ, ఇతర సూచనలూ తప్పక పాటించాలి. ♦ డా. ఎంఎస్ఎస్ ముఖర్జీ, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ -
కట్టుతప్పిన ఆదాయ–వ్యయాల వ్యత్యాసం!
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయ–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు అదుపులోనికి రాని పరిస్థితి నెలకొంది. వరుసగా రెండవ నెల ఆగస్టులోనూ బడ్జెట్ లక్ష్యాన్ని దాటిపోయి 109.3 శాతంగా నమోదయ్యింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) బుధవారం వెల్లడించిన గణాంకాలకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► 2020–21లో ద్రవ్యలోటు రూ.7.96 లక్షల కోట్లు ఉండాలని ఫిబ్రవరిలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. ఇది 2020–21 భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలతో పోల్చితే 3.5 శాతం. ► అయితే ఏప్రిల్ నుంచి ఆగస్టు నాటికే ద్రవ్యోలోటు 109.3 శాతానికి అంటే రూ.8,70,347 కోట్లకు ఎగసింది. ► సీజీఏ తాజా గణాంకాల ప్రకారం, ఏప్రిల్–ఆగస్టు మధ్య ప్రభుత్వ మొత్తం ఆదాయాలు రూ.3,77,306 కోట్లుగా నమోదయ్యాయి. బడ్జెట్ అంచనాల్లో ఇది 16.8 శాతం మాత్రమే. ఆర్థిక సంవత్సరం మొత్తంగా రూ.22.45 లక్షల కోట్ల ఆదాయాలు బడ్జెట్ లక్ష్యం. ► ఇక వ్యయాలు రూ.12,47,653 కోట్లుగా ఉంది. 2020–21 బడ్జెట్ అంచనాల్లో ఇది 41 శాతం. ► 2019–20లో ద్రవ్యలోటు జీడీపీలో 4.6 శాతం. ఏడేళ్ల గరిష్ట స్థాయి ఇది. అయితే కరోనా పరిణామాలు, పేలవ ఆదాయాలు వంటి సవాళ్ల నేపథ్యంలో ద్రవ్యలోటు శాతం జీడీపీలో 2020–21లో భారీగా పెరిగిపోయే అవకాశం ఉందని అంచనా ఉంది. అక్టోబర్–మార్చి మధ్య రూ.4.34 లక్షల కోట్ల రుణ ప్రణాళిక 2020–21 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో (అక్టోబర్–మార్చి) మధ్య రూ.4.43 లక్షల కోట్ల రుణ సమీకరణలు జరపనున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ బుధవారం వెల్లడించింది. కరోనా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడం, దీనితో ప్రభుత్వ ఆదాయాల అంచనాలకు గండి పడ్డం వంటి అంశాలు దీనికి నేపథ్యం. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్ చేసిన ప్రకటన ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.12 లక్షల కోట్ల రుణ సమీకరణ లక్ష్యానికి కేంద్రం కట్టుబడి ఉంది. సెప్టెంబర్ వరకూ రూ.7.66 లక్షల కోట్ల రుణ సమీకరణలు జరిపింది. మిగిలిన రూ.4.34 లక్షల కోట్లను ద్వితీయార్థంలో సమీకరిస్తుంది. తన ద్రవ్యలోటును పూడ్చుకోడానికి కేంద్రం డేటెడ్ సెక్యూరిటీలు (నిర్దిష్ట కాల వ్యవధితో కూడిన బాండ్లు) ట్రెజరీ బాండ్లపై ఆధారపడుతుంది. నిజానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.80 లక్షల కోట్ల నికర మార్కెట్ రుణ సమీకరణలు జరపాలని 2020–21 బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిర్దేశించారు. అయితే కరోనా ప్రభావంతో ఈ మొత్తాన్ని రూ.12 లక్షల కోట్లకు పెంచాలని కేంద్రం మేలో నిర్ణయించింది. 2019–20లో కేంద్ర రుణ సమీకరణల మొత్తం రూ.7.1 లక్షల కోట్లు. -
కంటిచూపుతో కన్నారు
ఏదైనా ఓ వింతని, నమ్మలేని నిజాన్ని విజ్ఞానశాస్త్రజ్ఞులు చెప్తే చాలు.. కచ్చితంగా నమ్మడానికి సిద్ధంగా మనల్ని మనం తయారు చేసేసుకున్నాం. మళ్లీ అదే అంశం నిజం కాదని మరికొంత కాలమయ్యాక పరిశోధనలు చేశామని మళ్లీ వాళ్లే చెప్తే దాన్ని కూడా నిజమేనని అంగీకరిస్తాం తప్ప ఏ వాదాన్నీ చెయ్యం. ఫలానా ఔషధం ఎంతో గొప్పదని చెప్పిన అదే విజ్ఞానశాస్త్రం కొంతకాలమయ్యాక ఈ ఔషధం వల్ల అనేక దుష్ఫలితాలున్నాయని నిరూపించబడిందనగానే వెంటనే మానేస్తాం.ఈ విషయాన్నెందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఆ శాస్త్రం చెప్తే నమ్మే జనం, అనుమానాన్ని వ్యక్తీకరించని లోకం, సాయి కళ్లలోనికి చూస్తే సంతానం కలిగిందని చెప్పిన నిజాన్ని ఎందుకు నమ్మరు? ఎలా నమ్మాలో వివరించుకుందాం! ఏదో గాలి మాటలు కాకుండా సప్రమాణంగా ఆధారాలతో సహా చెప్పుకుందాం! సంతానాన్ని కనే తీరులు మనం మానవజాతికి చెందినవాళ్లం కాబట్టి సంతానాన్ని కనడం అనగానే స్త్రీ పురుషసమాగమం మాత్రమే అనేసుకుంటాం. అది తప్ప మరో మార్గమే లేదని దృఢంగా వాదిస్తాం కూడా.సంతానాన్ని కనే విధానాలని వైశేషిక దర్శనమనే గ్రంథం చెప్పింది –‘స్వేదజ, అండజ, జరాయుజ, ఉద్భిజ్జ, సాంకల్పిక, సాంసిద్ధిక, భేదాత్’ అని.స్వేదజ సంతానం మొదటిది. స్వేదమంటే శరీరం నుంచి బయటికి వచ్చే చెమట అని అర్థం. ఆ చెమట నుండి పుట్టే సంతానమన్నమాట. క్రిముల్లో కొన్ని విడిచిన స్వేదమూ లేదా మనుష్యులు మొదలైనవారి శరీరాల నుండి విడువబడిన స్వేదమూ నుండి పుట్టే సంతానం అని దీనర్థం. తలలో పట్టే చెమట కారణంగా ఈ పేలు మొదలైనవి పుడతాయి. వాటిలో మగపేను, ఆడపేను అనే జాతి భేదం, లింగ భేదం ఉండదు. అలాగే పశువులు విడిచిన స్వేదం నుండి సన్ననైన ఓ తీరు క్రిములు పుడతాయి. వాటిని గ్రామప్రాంతాల్లో నుసుములు అని పిలుస్తారు. అవి మనల్ని కుట్టవు గానీ ఊరికే వాలుతూ ఒక తీరు అసహ్యాన్ని, చిరాకునీ మనకి కలుగజేస్తుంటాయి. అపరిశుభ్రంగా ఉన్న, లేదా కుళ్లిన పదార్థాల మీద వాలుతూ కన్పిస్తాయి. వీటికి కూడా లింగభేదం ఉండదు. సంగమం కారణంగా పుట్టవు. ఇవన్నీ ఏకలింగజీవులు. మరి దీన్ని వింతగా అనుకోవద్దు. అలాగే కడుపులో నులిపురుగులెలా పుడుతున్నాయి? గమనించుకోవాలి. రెండవ సంతానం అండజాలు. అండమంటే గుడ్డు. గుడ్డు నుండి పుట్టేదని దీనర్థం. నిజానికి తల్లి తీసుకునే ఆహారసారం ఆమె గర్భంలో ఉన్న శిశువుకి జీవద్రవ్యంగా ఉపయోగపడుతూ క్రమంగా పెరుగుతూ ఆ మీదట బయటికి రావలసిన కాలానికి శిశువుగా ప్రాణం పోసుకుని జన్మించడం మనం చూస్తూండే అంశం. చిత్రమేమంటే గుడ్డు అనేది మొత్తం కప్పబడి ఉండి, తల్లి ద్వారా ఏ విధమైన ద్రవ్యం దానికి చెందే, చెందించే వీలే ఉండదు గుడ్డుకి. అయినా ఆ గుడ్డు కొంతకాలానికి సంతానంగా మారుతూ కన్పిస్తోంది, తల్లి ఏ మాత్రపు ఆహారాన్ని అందించకుండానే. దీన్ని కూడా చిత్రమని అనుకోవద్దూ?మూడవ సంతానం జరాయుజాలు. జరాయువనే మాటకి ‘మావి’ అని అర్థం. దీన్నే ‘మాయి’ అని పిలుస్తుంటారు వ్యవహారంలో. కొన్ని చోట్ల ‘మాయ’ అని అంటుంటారు. ఏది ఏమైనా మావి ద్వారా జన్మించేవి మనుష్య–పశుజాతులు. అందుకే జంతువులతో బాగా పరిచయం, అనుభవం ఉన్న వాళ్లు పశువులు తమ సంతానాన్ని ఈనుతున్న దృశ్యం కంటపడగానే ఆ తల్లి కాబోతున్న పశువుకి ధాన్యపు పొట్టుని ఆహారంగా పెడతారు. ఆ దాన్యపు పొట్టు (చిట్టు అంటారు కొన్ని ప్రాంతాల్లో) లోపల ఉన్న మావిని రంపంలా కోసేసి దూడని తొందరగా బయటికొచ్చేలా చేస్తుంది. పశుజాతి, కొన్ని మృగజాతులు, కొన్ని జంతుజాతులు కూడా ఇలా పుట్టేవే! నాల్గవ సంతానం ఉద్భిజ్జాలు. ‘ఉత్’ అంటే పైకి అని అర్థం. ‘భిత్’ అంటే చీల్చుకోవడం, చీల్చడమని అర్థం. ‘జ’ అంటే పుట్టడమని అర్థం. ఒక పదార్థాన్ని చీల్చుకుని పైకి రావడమని దీని భావం. దీనికి ఉదాహరణ మొక్క. విత్తనాన్ని భూమిలో పాతి మట్టిని కప్పి కొద్దిగా నీటిని పోస్తే చాలు.. ఆ విత్తనం ఉబ్బి మెల్లగా అంకురరూపాన్ని (మొలక)విత్తి మెల్లగా ఆ భూమిని చీల్చుకుని (ఉత్ + భిత్) పుడుతోంది. (జ) మొక్కగా అవుతోంది. ఆకుల్ని వేస్తోంది. సన్నకాండంతో మొదలై ఎదుగుదలలో చెట్టుగా మారుతోంది. మరి ఈ మొక్క స్త్రీ పురుష సంగమం వల్ల కలగలేదుగా!ఐదవ సంతానం సాంకల్పికం. చెప్పలేనంత తపశ్శక్తిని ఆర్జించి దేవతలైన వారికి కలిగే సంకల్పం కారణంగా కలిగే సంతానం. బ్రహ్మ తనంత తానుగా సంకల్పించాడు. చక్కని రూపసౌందర్యం కలవాళ్లూ, మహా వైరాగ్యం కలిగి ఈ ప్రపంచాన్నే ఓ కలగా భావించే వాళ్లూ, ఏ ప్రలోభానికీ లొంగనివాళ్లూ, నిత్యం శ్రీమన్నారాయణ దర్శనమే తమ అనుదిన జీవిత ధ్యేయంగా కలవాళ్లూ అయిన పుత్రులుంటే బాగుండునని. అంతే! ఆ లక్షణాలతో నలుగురు ఒకే రూపం, ఒకే లక్షణాలు, గుణాలతో జన్మించారు. వాళ్లే సనక – సనందన – సనత్సుజాత– సనత్కుమారులు అనే పేర్లు కలవాళ్లు. వీళ్లకే సనకచతుష్టయమని పేరు. ధృతరాష్ట్రుడు తనకి మనశ్శాంతి లేని వేళ ఈ సనత్సుజాతుణ్ణే ఆహ్వానించి ధర్మబోధ చేయవలసిందని ప్రార్థించాడు. ఆయన చేసిన బోధనని విన్నాడు. మరి ఈ సనకచతుష్టయానికీ తల్లీ తండ్రీ సంగమం.. మొదలైనవి లేవుగా! అందుకే వీళ్లని బ్రహ్మమాసన పుత్రులు (బ్రహ్మగారి మనసులోని ఆలోచనకి అనుగుణంగా కల్గినవారు). ఆరవ తీరు సంతానం సాంసిద్ధికం. సద్యోగర్భం ద్వారా పుట్టీ పుడుతూనే బాల్యం దాటి కౌమారదశకి వచ్చేయడం. పరాశరమహర్షి పడవలో గంగని దాటి అక్కడ ఉన్న ద్వీపాన్ని చీకటినిండేలా చేసి సత్యవతి ద్వారా వ్యాసుణ్ణి కన్నాడు. చిత్రమేమంటే ఈ వ్యాసుడు సద్యోగర్భం (అప్పటికప్పుడు వచ్చిన గర్భం) ద్వారా పుట్టడమే కాక, పుడుతూనే కౌమారదశలో కన్పిస్తూ దండకమండలాలతో తల్లికీ తండ్రికీ నమస్కరించాడు. ‘కృష్ణ ద్వైపాయనుడు’ అని ఆయన పేరు. కృష్ణ అంటే చీకటిగా చేయబడిన, ద్వైపాయన ద్వీపమే తనకి జన్మస్థలంగా కలవాడని అర్థం. స్త్రీ పురుష సంగమం లేదిక్కడ. పోనీ! చీకటిగా ద్వీపాన్ని చేసిన కారణంగా సంగమమే ఉందనుకుందాం కాసేపు. అదే నిజమైతే దాన్నే నమ్మేటట్లయితే.. ఆయన తన పుట్టుకతోనే 13 సంవత్సరాల వయసు కలవానిగానూ దండకమండలాలతోనూ జన్మించాడనే విషయాన్ని కూడా నమ్మితీరాలి కదా! కళ్ల ద్వారా సంతానం పైన అనుకున్న ఇన్ని తీరులుగా సంతానాన్ని పొందడం, అందులో కొన్నింటిలో స్త్రీ పురుష సంగమం లేకుండా ఉండటాన్ని మనం గమనించాం. ఇంతవరకూ అయ్యాక ఇప్పుడిక కళ్ల ద్వారా సంతానాన్ని ఎలా కన్నారో, ఎవరు కన్నారో ఆ విషయాన్ని చూద్దాం!భారతకథని చూడాలి. కాశీరాజుకి ముగ్గురు పుత్రికలు. వాళ్లలో పెద్దామె అయిన అంబ ప్రేమ విఫలమైంది. ఇక మిగిలిన అంబిక, అంబాలిక అనే ఇద్దరినీ విచిత్రవీర్యునికిచ్చి భీష్ముడు వివాహం జరిపించాడు. సంతానం కలగలేదు. విచిత్రవీర్యుడు మరణించాడు. రాజవంశం సంతానం లేని కారణంగా ఆగిపోయే పరిస్థితికొచ్చింది. అప్పుడు వ్యాసుణ్ణి తల్లి అయిన సత్యవతి ప్రార్థించింది – ఈ అంబిక, అంబాలికల ద్వారా సంతానాన్ని కనవలసిందని. ఈ మాట వింటూంటేనే ఇదేమిటి? అనే ఆలోచన మనకొస్తుంది. దానిక్కారణం మనందరికీ సంతానమనే మాట వినగానే సంగమం ద్వారానే సాధ్యమవుతుందనే ఒక్క విషయం మాత్రమే మన బుద్ధికి తడుతూండటమే.తన తల్లి ప్రార్థించగానే వ్యాసుడు సరేనని అంబిక వద్దకొచ్చాడు. ఆయన గడ్డాలు, మీసాలు ఎరుపు తెలుపు కలిసిన జడల సమూహం మునిరూపం చూడగానే అంబికకి ఓ తీరు భయం వేసి ఒక్క క్షణం పాటు ఆయన్ని చూసి కళ్లు మూసుకుంది. వెంటనే గదిలో నుండి ఇవతలికి వచ్చిన వ్యాసుడు తన తల్లితో.. ఈమెకి అంధుడు పుడతాడని చెప్పాడు. అతనే ధృతరాష్ట్రుడు.మరి సంగమమే సంతానకారణమయ్యుంటే వ్యాసుని తల్లి గది వద్దే ఉండదు కదా! క్షణంలో గది నుండి బయటికి రావడం సాధ్యం కాదు గదా! పైగా వ్యాసుడు ఆ కలగబోయే సంతానం అంధుడవుతాడని ఎలా చెప్పగలుగుతాడు, సామాన్యుడే అయ్యుంటే? కళ్లలో ఏముంది శక్తి? సర్వ సాధారణంగా పురుషుని శుక్లం అధోముఖంగా వెళ్లి స్త్రీకి సంతానం కలిగించేందుకు తోడ్పడుతుంది. అదే మరి యోగులు, సిద్ధులు అయినవారి విషయంలో ఆ శుక్లం క్రమంగా ఊర్థ్వముఖంగా ప్రయాణిస్తుంది.ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి.. అని మంత్రం వెళ్తుంది. ఆ శుక్లం అలా ప్రయాణించి ప్రయాణించి మెల్లగా కనురెప్పల వద్ద నిలవ ఉంటుంది. ఏ స్త్రీ సంతానాన్ని అర్థిస్తూ ఆ సిద్ధుణ్ణో స్వామినో యోగినో చూస్తుందో వెంటనే ఆ కళ్లలో ఉన్న సంతానోత్పాదక శక్తి స్త్రీ కళ్ల ద్వారా ప్రయాణించి అధోముఖంగా ఆమెకి గర్భం కలిగేలా చేస్తుంది. ఇదే జరిగింది వ్యాసుని విషయంలో.అంబిక అలా వ్యాసుణ్ణి చూసి వెంటనే కళ్లు మూసుకుంది. గర్భం కలిగింది కానీ అంధత్వం వచ్చింది. సంతానానికి ధృతరాష్టుడు పుట్టాడు.తరువాతిదైన అంబాలిక గదిలోనికి వెళ్లాడు వ్యాసుడు. ఆమె వ్యాసుణ్ణి అంబికలాగానే భయంతో చూసింది గానీ, నిన్నటి రోజున తన అక్కకి జరిగిన తీరు అంధసంతానం రారాదని భావించి కళ్లని తెరిచే ఉంచింది. అయితే ఆ వ్యాసుని రూపం, తపః ప్రకాశం ఆమెకి దుర్నిరీక్ష్యం (చూడ శక్యం కానిది) కావడంతో బలవంతాన కనులు మూసుకోవలసిరావడం అనే ఈ రెండాలోచనల మధ్య కళ్లని తెరవడం, మూయడం చేస్తుంటే ఆ ప్రవర్తన కారణంగా ‘పొండుర్గా’ కలిగిన పాండురాజు జన్మించాడు.ఇక ఈ ఇద్దరూ ఆలోచించుకున్న మీదట, సత్యవతి ఊహప్రకారమూ గదిలో దాసిని ఉంచితే, ఆమె వ్యాసుణ్ణి పరమసిద్ధునిగా గ్రహించి ఆ తీరు గౌరవంతో భయంతో భక్తితో శ్రద్ధతో కనుల్ని తెరుచుకునే ఉండి ఆయన కళ్లలోనికి చూసింది సంతాన ఆపేక్షతో. అంతే! విదురుడు ఆ దర్శనఫలంగా పుట్టాడు. అంటే ఏమన్నమాట? యోగులు, సిద్ధులు, దివ్యపురుషులు అయిన వారి ముఖంలోనికి మనం ముఖాన్ని ఉంచి భయభక్తి శ్రద్ధలతోగానీ చూసినట్లయితే ఆ చూపు ప్రకారం దాని కనుగుణంగానూ సంతానం కలుగుతుందనేది యథార్థమని తెలిసిపోయింది కదా!శ్రీమద్రామాయణంలో తృణబిందుడనే రాజర్షి ఉన్నాడు. ఆయన ఆశ్రమంలోనికి స్త్రీలెవరూ ప్రవేశించరాదనే ఓ నియమాన్ని పెట్టాడు. లోకంలో ఏదైనా ఓ నియమమంటూ ఉంటే దాన్ని ఎలాగైనా విరోధించాలనే వాళ్లు కొందరో ఏ ఒక్కరో ఉండకుండా ఉండరు. దాంతో ఒకరొకరు చొప్పున రాజర్షికి తెలియకుండా ఆశ్రమంలోనికి పూలు కోసుకుందామనీ, ఆశ్రమంలో తిరుగాడే లేళ్లని చూద్దామనీ, ఉద్యానవనవిహారాన్ని చూద్దామనీ ఇలా రావడం ప్రారంభించారు. దాంతో ఆయన ఓ నియమాన్ని కఠినం చేస్తూ.. యా మే దృష్టిపథ మాగచ్ఛేత్ సా గర్భాన్ని ధరిస్తుంది జాగ్రత్త! అనే కట్టడిని చేశాడు. దాంతో ఎవరూ రానేలేదు. ఆ తర్వాత ఆయన కళ్లలో పడితే చాలు గర్భం వస్తుందని అనడానిక్కారణం కళ్లలో గర్భధారణ సమర్థత కల శక్తి, పైన అనుకున్న తీరుగా ఉండటమే.‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అనే ఓ మాటని వింటుంటాం. శరీరంలో ఉండే జ్ఞానేంద్రియ (శరీరం, కళ్లు, చెవి, నాలుక, ముక్కు) అలాగే ఉండే కర్మేంద్రియ (మాట, చేయి, కాలు, విసర్జకావయవాలు రెండు) విభాగాల్లో కళ్లు అతి ప్రధానమైనవని దానర్థం. ఒకే కన్ను శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంతమనే తొమ్మిది రసాలని చూపించగల శక్తి ఉన్న ఇంద్రియం.ఈ కారణంగానూ 12 సంవత్సరాల పాటు బహిరంగంగా కాకుండా నేలమాళిగలో ఉంటూ తీవ్రతప స్సుని ఏ బాధ్యతలు బరువులు లేని చిన్న వయసులో (4) సాయి చేసిన కారణంగానూ సాయికి కన్నుల్లో ఉన్న శక్తి –అందరినీ వశులుగా చేసేదే. ఆ వశం చేసే శక్తుల్లో గర్భాన్ని కలిగించే తనం ఒకటన్నమాట. కాబట్టి సాయికనుల ద్వారా గర్భం, సంతానం కలిగిందంటే కచ్చితంగా నమ్మితీరవలసిన అంశమే! ఇక సాయి ఓ కపటగురువుకి శిష్యుడైన విధానాన్ని చూద్దాం! ∙డా. మైలవరపు శ్రీనివాసరావు -
ఆ రెండు లక్షలు ఏమయ్యాయి..?
ఇల్లందకుంట(హుజూరాబాద్): ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో 2017–18కుగాను జరిగిన జాతర వేలం పాటకు సంబంధించి రూ.రెండులక్షలు తేడాలొచ్చాయి. ఆ సమయంలో టెండర్ పాడిన అనుగం శివకుమార్ రూ.14, 85,232కు టెండర్ దక్కించుకున్నాడు. వాయిదాల పద్ధతిలో రూ.12లక్షలు చెల్లించాడు. మిగిలిన మొత్తంలో రూ.రెండు లక్షలను గత సంవత్సరం మే 7, 18న అప్పటి ఈవో సులోచనకు ఇచ్చానని, ఆ సమయంలో ల్లకాగితంపై రాసి ఇచ్చారని శివకుమార్ అంటున్నాడు. బయటపడిందిలా.. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఆలయంలో టెండర్లు పిలిచారు. ఇందులో శివకుమార్ కూడా పాల్గొన్నాడు. పాత డబ్బులు చెల్లించలేదని, అవి చెల్లించాకే టెండర్లో పాల్గొనాలని అధికారులు తేల్చిచెప్పారు. దీంతో శివకుమార్ అవాక్కయ్యాడు. తాను ఎప్పుడో డబ్బులు ముట్టజెప్పానంటూ అప్పటి ఈవో సులోచన రాసి ఇచ్చిన కాగితాన్ని చూపించాడు. అయినా వారు ససేమిరా అనడంతో ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై సులోచనను వివరణ కోరగా.. తాను డబ్బులు తీసుకుని రశీదు ఇచ్చానని పేర్కొన్నారు. -
ఈ కవలలకు ఏడాది తేడా!
సాధారణంగా కవల పిల్లలంటే పావుగంటో, అరగంటో మహా అయితే గంటో మాత్రమే వ్యత్యాసం ఉంటుంది. కానీ, వీరిద్దరిలో ఒకరు 2017లో పుడితే, మరొకరు 2018లో పుట్టారు. అయినా, వీరిద్దరూ కవలలే అయ్యారు మరి. అదెలాగంటారా? ఒకరు 2017 డిసెంబర్ 31 రాత్రి 11 గంటల యాభై ఎనిమిది నిమిషాలకు పుడితే, మరొకరు 2018 జనవరి 1 న 12 గంటల పదహారు నిమిషాలకు పుట్టారు. దాంతో వారిద్దరికీ ఇచ్చిన బర్త్ సర్టిఫికెట్లలో సంవత్సరం తేడా వచ్చేసింది. అయినా కానీ వారిద్దరూ కవలలే... అందులో కాదనడానికి ఏం లేదు. తల్లిదండ్రులు వీరిని చూసి మురిసిపోతున్నారు. శాండియాగోకు చెందిన మేరియాకి మొదటి బాబు జో ఆక్విన్ జూనియర్ పుట్టిన కొద్దిసేపటికి చెల్లెలు ఐతనా జీసస్ పుట్టింది. ఈ కొద్దిసేపటిలోనే క్యాలెండర్ మారిపోవడంతో అమ్మ మురిసిపోతూ, ఫేస్బుక్లో వారిద్దరి ఫొటోలు షేర్ చేసింది. అది కాస్తా వైరల్ అయింది. -
విద్యావిధానంలో అమెరికాకు, ఇండియాకు తేడా ఉంది
ఎంజీయు (నల్లగొండరూరల్) : విద్యా విధానంలో అమెరికా–ఇండియాకు తేడా ఉందని అమెరికాలోని న్యూయార్క్ స్టేట్ ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రిజిస్ట్రార్ వంగపర్తి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రాక్టికల్ నాలెజ్డ్ కోసం ప్రతి ఒక్కరూ ఇంటర్నషిప్ చేయాల్సి ఉంటుందని అన్నారు. మన దేశంలో ప్రాజెక్టు నిర్వహిస్తామని, థియరీ ఎక్కువగా బోధిస్తామని, ఇవి అధ్యయనం చేసిన విద్యార్థులు అమెరికాలో కొంత ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. మంచిభాషాపటిమ, సబ్జెక్టు నాలెడ్జితో పాటు ఇతర అంశాలలో కూడా విద్యార్థులు ప్రతిభ చాటాలని అన్నారు. అమెరికాకు వచ్చి విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులు ఇక్కడి ఏజెంట్లు చెప్పినట్లు కాకుండా మంచి కళాశాలను ఎంచుకోవడానికి అన్ని వివరాలను తెలుసుకోవాలని సూచించారు. వీసాలు పొందడం, చదువుకుంటూ సంపాదించే అవకాశాలను తెలుసుకోవాలని అన్నారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు సందేహాలను ఆయన నివృత్తి చేశారు. అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు కర్ణాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, తెలుగు విద్యార్థులకు పలు సూచనలు ఇస్తుందని తెలిపారు. వీసీ ఆల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ యూనివర్సిటీ అమలు చేస్తున్న విద్యాబోధన, నైపుణ్యంపై తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఉమేష్‌కుమార్, రవి, వసంత, సరిత, సబాన హెరాల్డ్, పరమేష్, భీంరెడ్డి పాల్గొన్నారు. -
సినీ ఫక్కీలో దారిదోపిడీ
ఆయిల్ ట్యాంకర్‌ను అడ్డగించిన దుండగులు డ్రైవర్‌ను బెదిరించి రూ.3 లక్షల అపహరణ తాళ్లరేవు : సినీ ఫక్కీలో ఆయిల్ ట్యాంకర్‌ను కారుతో అడ్డుకున్న దుండగులు, డ్రైవర్‌ను బెదిరించి నగదు దోచుకున్న సంఘటన సంచలనం కలిగించింది. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నుంచి వస్తున్న పెట్రోల్ ట్యాంకర్‌ను దుండగులు దారికాచి, డ్రైవర్‌ను బెదిరించి రూ.3 లక్షలు దోచుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. యానాం నుంచి విశాఖపట్నం వెళుతున్న పెట్రోల్ ట్యాంకర్, తాళ్లరేవు మండలం మట్లపాలెం బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి దుండగులు కారుతో అడ్డగించారు. కారులోంచి ముగ్గురు వ్యక్తులు కిందకు దిగారు. వారిలో ఒకరు ట్యాంకర్ క్యాబిన్లోకి వెళ్లి డ్రైవర్ సాకా సత్యనారాయణను బెదిరించాడు. ట్యాంకర్‌ను ఆపకుండా పోతావా అంటూ అతడిపై దాడిచేశారు. నగదు ఇవ్వకపోతే చంపేస్తానని హెచ్చరించడంతో, పెట్రోలు కొనుగోలు కోసం తీసుకెళుతున్న రూ.3 లక్షల నగదును సత్యనారాయణ వారికిచ్చేశాడు. ఈ మేరకు సత్యనారాయణ స్థానిక కోరంగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో కొల్లు నరసింహబాబుతో పాటు మరో ఇద్దరిపై ఏఎస్సై ఆర్వీఎన్ మూర్తి కేసు నమోదు చేశారు. కాకినాడ రూరల్ సీఐ పవన్‌కిషోర్ పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనపై పలు అనుమానాలు..! మట్లపాలెం వద్ద జరిగిన దారి దోపిడీ కేసులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుతో యానాంకు చెందిన పలువురు ప్రముఖులకు ప్రమేయమున్నట్టు తెలిసింది. ఈ కేసు నుంచి మిగిలిన ఇద్దరిని కాపాడేందుకు కొందరు ప్రజాప్రతినిధుల ద్వారా యత్నిస్తున్నట్టు సమాచారం. -
మహిళలు... వేతనంలోనూ వెనకనే...
న్యూఢిల్లీ: స్త్రీ, పురుష వ్యత్యాసం వేతన విషయంలోనూ కొనసాగుతోంది. దేశంలోని మహిళల సంపాదన మగవారి కన్నా 18.8% తక్కువగా ఉంటోంది. దీనికి అధిక వేతన ఉద్యోగాల్లో మహిళలు కనిపించకపోవడమే కారణమని కెర్న్ ఫెర్రీ హే గ్రూప్ పేర్కొంది. అంతర్జాతీయంగా మహిళల సంపాదన పురుషుల కన్నా 17.6% తక్కువగా ఉంది. ‘స్త్రీ, పురుషులు ఇద్దరూ ఒకే కంపెనీలు, ఒకే రకమైన ఉద్యోగం చేస్తున్నప్పుడు సాధారణంగా ఇరువురికీ సమాన స్థాయిలో వేతనం ఉండాలి. కానీ మగవారి వేతనం 1.6% ఎక్కువగా ఉంటోంది. ఇది భారత్‌లో 3.5%గా ఉంది’ అని హే గ్రూప్ తెలిపింది. -
‘గ్రేటర్’లో సీన్ రివర్స్!
♦ 22 నెలల్లో హైదరాబాద్‌లో ఎంత తేడా ♦ 43.85 శాతం ఓట్లు కొల్లగొట్టిన టీఆర్ఎస్ ♦ 23.45 శాతంతో టీడీపీ-బీజేపీ కూటమి కుదేలు ♦ కేవలం 10.40 శాతంతో పరాభవం పాలైన కాంగ్రెస్ ♦ 15.85 శాతంతో చెక్కు చెదరని మజ్లిస్ బలం సాక్షి, హైదరాబాద్: కేవలం 22 నెలల్లో హైదరాబాద్‌లో సీన్ రివర్సయిపోయింది. అధికార టీఆర్ఎస్ జోరుకు ప్రతిపక్షాలన్నీ కుదేలయ్యాయి. 2014 సాధారణ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీడీపీ-బీజేపీ కూటమి 42 శాతానికి పైగా ఓట్లు సాధించగా, తాజాగా జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం ఇటు టీడీపీ-బీజేపీ, అటు కాంగ్రెస్ కంచుకోటల్ని టీఆర్ఎస్ బద్దలు కొట్టింది. ఏకంగా 43.85 శాతం ఓట్లు సాధించి ప్రత్యర్థులకు అందనంత వేగంగా దూసుకుపోయింది.గ్రేటర్లో ఏకంగా 17 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ఆరింట మజ్లిస్ పతంగం రెపరెపలాడింది. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌లోని అన్ని స్థానాల్లో పోటీ చేసిన టీఆర్ఎస్ 7,92,792 ఓట్లు తెచ్చుకుంది. తాజా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వాటిన దాదాపు రెట్టింపు చేసుకుంది! దశాబ్దాలుగా బీజేపీ, మజ్లిస్‌లకు మంచి పట్టున్న ప్రాంతాల్లోనూ అనూహ్యంగా ఓట్లు రాబట్టగలిగింది. బీజేపీ ఎమ్మెఏ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబర్‌పేట నియోజకవర్గంలో టీడీపీ-బీజేపీ కూటమికి కేవలం 28,587 ఓట్లొచ్చాయి! అదే టీఆర్ఎస్ అభ్యర్థులు 61,423 ఓట్లు కొల్లగొట్టారు. ముషీరాబాద్ అసెంబ్లీ స్థానం పరిధిలోనూ టీడీపీ-బీజేపీ కూటమికి 30,776, టీఆర్ఎస్కు 74,330 ఓట్లొచ్చాయి. మజ్లిస్ కోటల్లోనూ కారు జోరు టీఆర్ఎస్ సర్కార్ సంక్షేమ నినాదం మజ్లిస్ ఓటర్లను సైతం ప్రభావితం చేసింది. మజ్లిస్ ప్రాతినిధ్యం వహిస్తున్న మలక్‌పేట అసెంబ్లీ స్థానం పరిధిలోఆ పార్టీకి 35,615 ఓట్లొస్తే, టీఆర్ఎస్కు 44,025 వచ్చాయి! 2014 సాధారణ ఎన్నికల్లో ఇక్కడ మజ్లిస్ 58,976 ఓట్లు రాబట్టగా టీఆర్ఎస్ కేవలం 11,378 ఓట్లతో సరిపెట్టుకుంది. అలాగే మజ్లిస్ సిటింగ్ అసెంబ్లీ స్థానమైన కార్వాన్లోనూ ఆ పార్టీని టీఆర్ఎస్ గట్టిగానే నిలువరించింది. అక్కడ 2014లో మజ్లిస్‌కు 86,391, టీఆర్ఎస్కు కేవలం 10,760 ఓట్లొచ్చాయి. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ ఓట్లు 54,307కు తగ్గితే, టీఆర్ఎస్ ఏకంగా 52,402 ఓట్లను సంపాదించగలిగింది. నాంపల్లి, చంద్రాయణగుట్ట, యాకుత్‌పురా,బహుదూర్‌పురా అసెంబ్లీ స్థానాల పరిధిలోని డివిజన్లలో కూడా టీఆర్ఎస్కు భారీగా ఓట్లు పడ్డాయి. -
తూకాల్లో మోసాలు : వ్యాపారి అరెస్టు
దండేపల్లి: ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలో పత్తి రైతులను మోసగిస్తున్న ఓ వ్యాపారిని గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. పత్తి బ్రోకర్ మల్లేశ్ మంగళవారం నంబాల గ్రామంలో రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తూకం వేసిన ప్రతిసారి నాలుగు కిలోల మేర తక్కువగా చూపిస్తూ మోసం చేస్తున్నాడు. ఆ విషయాన్ని గమనించిన రైతులు మల్లేశ్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. -
మహిళలకు వేతనాలు తక్కువే!
* భారతీయ ఐటీ కంపెనీలపై రీసెర్చ్ సంస్థ నివేదిక * పురుషులతో పోలిస్తే వ్యత్యాసం పెరుగుతోందని వెల్లడి న్యూఢిల్లీ: భారతీయ ఐటీ పరిశ్రమ ఉద్యోగుల్లో మహిళలు, పురుషుల మధ్య వ్యత్యాసం భారీగా పెరుగుతోందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. వేతనాల పెంపు విషయంలో మహిళలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకోవాలంటూ వ్యాఖ్యానించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఉదంతం నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఆరంభంలో ఒకే స్థాయి వేతనాలతోనే మహిళ, పురుష ఉద్యోగులు తమ కెరీర్‌ను మొదలు పెడుతున్నప్పటికీ.. కొంతకాలానికి వేతనాల్లో వ్యత్యాసం ఎగబాకుతోందని కెటలిస్ట్ ఇండియా డబ్లూఆర్సీ అనే సంస్థ తన అధ్యయన నివేదికలో పేర్కొంది. మహిళలకు వేతనాలు తక్కువగా ఉంటున్నాయని తెలిపింది. కాగా, నాదెళ్లలాంటి దిగ్గజ వ్యక్తి ఇలా వ్యాఖ్యానించడం దురదృష్టకరమని.. అయితే, తన తప్పును వెంటనే అంగీకరించి ఆయన క్షమాపణ చెప్పడం గొప్పవిషయమని కెటలిస్ట్ ఇండియా డబ్ల్యూఆర్సీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ షాచి ఇర్డే పేర్కొన్నారు. సుమారు 58 దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు, ప్రొఫెషనల్ సంస్థల నుంచి సేకరించిన సమాచారంతో ఈ నివేదికను రూపొందించింది. అన్నిరంగాల్లోనూ...: వ్యాపారం, ఆర్థిక రంగం, సామాజిక రంగం ఇలా మగాళ్లకు అవకాశాలున్న ప్రతిచోటా మహిళలకూ అవకాశాలు ఇవ్వాల్సిందేనని ఇర్డే అన్నారు. ఒక్క టెక్నాలజీ రంగంలోనే కాకుండా.. ఇతర పారిశ్రామిక రంగాల్లోనూ ఉద్యోగుల వేతనాల్లో స్త్రీ-పురుష వ్యత్యాసం స్పష్టంగా కనబడుతోందని కెటలిస్ట్ గ్లోబల్ రీసెర్చ్ పేర్కొంది. ‘భారత్ విషయానికొస్తే... టెక్నాలజీ రంగంలో మేం చేసిన అధ్యయనం ప్రకారం మహిళలు-పురుషులు ఇద్దరూ ఒకే విధమైన బాధ్యతలు, వేతనాలతో ఉద్యోగాల్లో చేరుతున్నారు. అయితే, కొంతకాలం గడిచేసరికి వేతనాల్లో తేడా భారీగా ఉంటోంది. దాదాపు 12 ఏళ్ల కెరీర్‌ను చూస్తే.. పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగులకు సుమారు రూ.3.8 లక్షల మేర వేతన వ్యత్యాసం ఉంటోంది. ఈ తేడాను తొలగించేందుకు నాయకత్వపరమైన, పటిష్ట చర్యలు అవసరం’ అని ఇర్డే వ్యాఖ్యానించారు. -
కమలంలో ’టీ’ ఫైట్
వెంకయ్యనాయుడిపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల తిరుగుబాటు? పార్టీ జాతీయ నాయకుడిపై విమర్శలతో నేతల్లో కలవరం వెంకయ్యను సమర్థిస్తూ మాట్లాడుతున్న సీమాంధ్ర నేతలు ఎమ్మెల్యేల విమర్శలపై వివరణ కోరతామన్న కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే గడువు దగ్గరపడుతున్న దశలో కమలదళంలో విభేదాలు పొడసూపాయి. తెలంగాణ విషయంలో పార్టీ స్వరం మారుతోందన్న ప్రచారం నష్టదాయకంగా భావించిన ఆ ప్రాంత బీజేపీ నేతలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. పార్టీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడుపై పార్టీ శాసనసభా పక్షం నేతలు ప్రత్యక్షంగానే విమర్శనాస్త్రాలు సంధించటం బీజేపీలో తీవ్ర కలకలం రేపింది. పార్టీ నేతల మధ్య ఇంతకాలం అంతర్గతంగా కొనసాగుతున్న ప్రాంతాల వారీ విభేదాలు ఇప్పుడు బయటపడుతున్నాయని బీజేపీ నేతలు చెప్తున్నారు. వెంకయ్యనాయుడు రాష్ట్రంలో పర్యటిస్తున్న సమయంలో పార్టీ తెలంగాణ నేతలైన శాసనసభా పక్షం నాయకుడు యెండల లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డిలు ఢిల్లీలో ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పడం చర్చనీయాంశంగా మారింది. సీమాంధ్ర సమస్యల ప్రస్తావన పేరుతో వెంకయ్య పార్టీ జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చి మొత్తం అంశాన్ని పక్కదారి పట్టించే అవకాశముందని తెలంగాణ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీమాంధ్ర సమస్యలను సందర్భానుసారంగా లేవనెత్తకుండా ఆ ప్రస్తావన పేరుతో పార్టీ పరంగా తెరమీదకు తెచ్చిన చర్చ తెలంగాణలో పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చుతోందని చెప్తున్నారు. దానికితోడు విభజన బిల్లును పార్లమెంట్లో పెట్టిన తర్వాత అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని వెంకయ్య తాజాగా చేసిన వ్యాఖ్యలు.. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గళం విప్పేలా చేశాయని అంటున్నారు. పార్టీ జాతీయస్థాయి నేతపై ఎమ్మెల్యేలు సంధించిన విమర్శలు చివరకు ఎక్కడికి దారితీస్తాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది. పరిష్కరించాలనటమే పాపమా? చిన్న రాష్ట్రాలకు అనుకూలమన్న పార్టీ వైఖరికి భిన్నంగా వెంకయ్య మాటలు ఉంటున్నాయని తెలంగాణ నేతలు అభ్యంతరం చెప్తోంటే.. సీమాంధ్ర నేతలు అందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. తమదొక జాతీయ పార్టీ అని ఎమ్మెల్యేలు మరిచినట్టున్నారని సీమాంధ్ర ఉద్యమ కమిటీ.. టీ-ఎమ్మెల్యేలపై మండిపడింది. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం కాదంటూ.. ‘సీమాంధ్ర సమస్యలు పరిష్కరించాలనటమే పాపమా?’ అని ప్రశ్నించింది. ‘తెలంగాణ ఇవ్వడంతోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయా? 25 పార్లమెంటు సీట్లున్న సీమాంధ్ర అవసరం లేదా?’ అని ఉద్యమ కమిటీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ‘యెండల లేదా యెన్నం అసెంబ్లీలో మా పార్టీ నాయకులు. వాళ్లు ఏం మాట్లాడినా రాష్ట్రం మొత్తానికి వర్తిస్తుంది. వెంకయ్య ఏ స్థాయి నాయకుడో వీరికిప్పుడు గుర్తుకురావడం బాధాకరం. విచారకరం. వెంకయ్య సీమాంధ్రకే చెందినా పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్‌గా ఉన్నారు. అటువంటి వ్యక్తికి లేనిపోనివి అంటగట్టడం తగదు’ అని ఆయన ‘సాక్షి ప్రతినిధి’తో చెప్పారు. ఆ విమర్శలు వ్యూహాత్మకమేనా..? ఇదిలావుంటే.. వెంకయ్యపై విమర్శలు తమ వ్యూహంలో భాగమేనంటున్నారు తెలంగాణవాదులు. సీమాంధ్ర నేతలకు ఇస్తున్న ప్రాధాన్యత తమకు ఇవ్వడం లేదని గుర్రుగా ఉన్న తెలంగాణవాదులు ఇప్పుడీ వ్యాఖ్యలతో వెంకయ్య తన వైఖరిని పరిశీలించుకునేందుకు పనికి వస్తాయనుకుంటున్నారు. సుష్మాస్వరాజ్, అరుణ్‌జెట్లీ లాంటి వాళ్లు తెలంగాణకు పూర్తి సానుకూలతతో ఉన్నా వెంకయ్యే తెరవెనుక నాటకం ఆడిస్తూ తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యానాలు చేయిస్తున్నారని.. దీంతో తాము తెలంగాణలో తలెత్తుకోలేకపోతున్నామని వీరు మధనపడుతున్నారు. సరిగ్గా ఈ దశలో ఎమ్మెల్యేల ‘తిరుగుబాటు’ వీరికి ఉపశమనం కలిగించింది. ఆ మధ్య జరిగిన ఆర్ఎస్ఎస్ సమావేశంలోనూ యెండల లక్ష్మీనారాయణే వెంకయ్యపై విరుచుకుపడ్డారు. ఈసారి యెన్నం మరో అడుగు ముందుకేసి ‘నోటికాడి బుక్క లాక్కోవద్దు.. పాలకుండలో విషం చుక్క వేయొద్దు..’ అనటం వెంకయ్యపై ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కమిటీ నేతలు ఢిల్లీ బయలుదేరబోయే ముందు కొన్ని వదంతుల్ని ప్రచారంలో పెట్టారు. కేంద్ర నాయకత్వం బేషరతుగా తెలంగాణకు మద్దతివ్వకపోతే పార్టీ పదవులకు రాజీనామా చేస్తామని ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వేయించారు. దీనికి పరాకాష్టే ఈ వ్యాఖ్యలని భావిస్తున్నారు. వివరణ కోరతా: కిషన్‌రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాసరెడ్డి, యెండల లక్ష్మీనారాయణ ఢిల్లీలో ఏం మాట్లాడారో తెలుసుకుంటానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆదివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. వారి నుంచి వివరణ కోరతానన్నారు. తమ పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని, పార్టీ యావత్తు రాష్ట్ర విభజనకు కట్టుబడి ఉందన్నారు. వ్యతిరేక వార్తలకు ఇస్తున్న ప్రాధాన్యత మిగతావాటికీ ఇవ్వాలని మీడియాకు సలహా ఇచ్చారు. తమ పార్టీ క్రమశిక్షణతో కూడుకున్నదన్నారు. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా వ్యాఖ్యానించలేనని పేర్కొన్నారు.