కంటిచూపుతో కన్నారు | Saipatham Antarvedam 11 | Sakshi
Sakshi News home page

కంటిచూపుతో కన్నారు

Published Sun, Jul 29 2018 12:30 AM | Last Updated on Sun, Jul 29 2018 12:30 AM

Saipatham Antarvedam 11 - Sakshi

ఏదైనా ఓ వింతని, నమ్మలేని నిజాన్ని విజ్ఞానశాస్త్రజ్ఞులు చెప్తే చాలు.. కచ్చితంగా నమ్మడానికి సిద్ధంగా మనల్ని మనం తయారు చేసేసుకున్నాం. మళ్లీ అదే అంశం నిజం కాదని మరికొంత కాలమయ్యాక పరిశోధనలు చేశామని మళ్లీ వాళ్లే చెప్తే దాన్ని కూడా నిజమేనని అంగీకరిస్తాం తప్ప ఏ వాదాన్నీ చెయ్యం. ఫలానా ఔషధం ఎంతో గొప్పదని చెప్పిన అదే విజ్ఞానశాస్త్రం కొంతకాలమయ్యాక ఈ ఔషధం వల్ల అనేక దుష్ఫలితాలున్నాయని నిరూపించబడిందనగానే వెంటనే మానేస్తాం.ఈ విషయాన్నెందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఆ శాస్త్రం చెప్తే నమ్మే జనం, అనుమానాన్ని వ్యక్తీకరించని లోకం, సాయి కళ్లలోనికి చూస్తే సంతానం కలిగిందని చెప్పిన నిజాన్ని ఎందుకు నమ్మరు? ఎలా నమ్మాలో వివరించుకుందాం! ఏదో గాలి మాటలు కాకుండా సప్రమాణంగా ఆధారాలతో సహా చెప్పుకుందాం!

సంతానాన్ని కనే తీరులు
మనం మానవజాతికి చెందినవాళ్లం కాబట్టి సంతానాన్ని కనడం అనగానే స్త్రీ పురుషసమాగమం మాత్రమే అనేసుకుంటాం. అది తప్ప మరో మార్గమే లేదని దృఢంగా వాదిస్తాం కూడా.సంతానాన్ని కనే విధానాలని వైశేషిక దర్శనమనే గ్రంథం చెప్పింది –‘స్వేదజ, అండజ, జరాయుజ, ఉద్భిజ్జ, సాంకల్పిక, సాంసిద్ధిక, భేదాత్‌’ అని.స్వేదజ సంతానం మొదటిది. స్వేదమంటే శరీరం నుంచి బయటికి వచ్చే చెమట అని అర్థం. ఆ చెమట నుండి పుట్టే సంతానమన్నమాట. క్రిముల్లో కొన్ని విడిచిన స్వేదమూ లేదా మనుష్యులు మొదలైనవారి శరీరాల నుండి విడువబడిన స్వేదమూ నుండి పుట్టే సంతానం అని దీనర్థం. తలలో పట్టే చెమట కారణంగా ఈ పేలు మొదలైనవి పుడతాయి. వాటిలో మగపేను, ఆడపేను అనే జాతి భేదం, లింగ భేదం ఉండదు. అలాగే పశువులు విడిచిన స్వేదం నుండి సన్ననైన ఓ తీరు క్రిములు పుడతాయి. వాటిని గ్రామప్రాంతాల్లో నుసుములు అని పిలుస్తారు. అవి మనల్ని కుట్టవు గానీ ఊరికే వాలుతూ ఒక తీరు అసహ్యాన్ని, చిరాకునీ మనకి కలుగజేస్తుంటాయి. అపరిశుభ్రంగా ఉన్న, లేదా కుళ్లిన పదార్థాల మీద వాలుతూ కన్పిస్తాయి. వీటికి కూడా లింగభేదం ఉండదు. సంగమం కారణంగా పుట్టవు. ఇవన్నీ ఏకలింగజీవులు. మరి దీన్ని వింతగా అనుకోవద్దు. అలాగే కడుపులో నులిపురుగులెలా పుడుతున్నాయి? గమనించుకోవాలి.

రెండవ సంతానం అండజాలు. అండమంటే గుడ్డు. గుడ్డు నుండి పుట్టేదని దీనర్థం. నిజానికి తల్లి తీసుకునే ఆహారసారం ఆమె గర్భంలో ఉన్న శిశువుకి జీవద్రవ్యంగా ఉపయోగపడుతూ క్రమంగా పెరుగుతూ ఆ మీదట బయటికి రావలసిన కాలానికి శిశువుగా ప్రాణం పోసుకుని జన్మించడం మనం చూస్తూండే అంశం. చిత్రమేమంటే గుడ్డు అనేది మొత్తం కప్పబడి ఉండి, తల్లి ద్వారా ఏ విధమైన ద్రవ్యం దానికి చెందే, చెందించే వీలే ఉండదు గుడ్డుకి. అయినా ఆ గుడ్డు కొంతకాలానికి సంతానంగా మారుతూ కన్పిస్తోంది, తల్లి ఏ మాత్రపు ఆహారాన్ని అందించకుండానే. దీన్ని కూడా చిత్రమని అనుకోవద్దూ?మూడవ సంతానం జరాయుజాలు. జరాయువనే మాటకి ‘మావి’ అని అర్థం. దీన్నే ‘మాయి’ అని పిలుస్తుంటారు వ్యవహారంలో. కొన్ని చోట్ల ‘మాయ’ అని అంటుంటారు. ఏది ఏమైనా మావి ద్వారా జన్మించేవి మనుష్య–పశుజాతులు. అందుకే జంతువులతో బాగా పరిచయం, అనుభవం ఉన్న వాళ్లు పశువులు తమ సంతానాన్ని ఈనుతున్న దృశ్యం కంటపడగానే ఆ తల్లి కాబోతున్న పశువుకి ధాన్యపు పొట్టుని ఆహారంగా పెడతారు. ఆ దాన్యపు పొట్టు (చిట్టు అంటారు కొన్ని ప్రాంతాల్లో) లోపల ఉన్న మావిని రంపంలా కోసేసి దూడని తొందరగా బయటికొచ్చేలా చేస్తుంది. పశుజాతి, కొన్ని మృగజాతులు, కొన్ని జంతుజాతులు కూడా ఇలా పుట్టేవే! 

నాల్గవ సంతానం ఉద్భిజ్జాలు. ‘ఉత్‌’ అంటే పైకి అని అర్థం. ‘భిత్‌’ అంటే చీల్చుకోవడం, చీల్చడమని అర్థం. ‘జ’ అంటే పుట్టడమని అర్థం. ఒక పదార్థాన్ని చీల్చుకుని పైకి రావడమని దీని భావం. దీనికి ఉదాహరణ మొక్క. విత్తనాన్ని భూమిలో పాతి మట్టిని కప్పి కొద్దిగా నీటిని పోస్తే చాలు.. ఆ విత్తనం ఉబ్బి మెల్లగా అంకురరూపాన్ని (మొలక)విత్తి మెల్లగా ఆ భూమిని చీల్చుకుని (ఉత్‌ + భిత్‌) పుడుతోంది. (జ) మొక్కగా అవుతోంది. ఆకుల్ని వేస్తోంది. సన్నకాండంతో మొదలై ఎదుగుదలలో చెట్టుగా మారుతోంది. మరి ఈ మొక్క స్త్రీ పురుష సంగమం వల్ల కలగలేదుగా!ఐదవ సంతానం సాంకల్పికం. చెప్పలేనంత తపశ్శక్తిని ఆర్జించి దేవతలైన వారికి కలిగే సంకల్పం కారణంగా కలిగే సంతానం. బ్రహ్మ తనంత తానుగా సంకల్పించాడు. చక్కని రూపసౌందర్యం కలవాళ్లూ, మహా వైరాగ్యం కలిగి ఈ ప్రపంచాన్నే ఓ కలగా భావించే వాళ్లూ, ఏ ప్రలోభానికీ లొంగనివాళ్లూ, నిత్యం శ్రీమన్నారాయణ దర్శనమే తమ అనుదిన జీవిత ధ్యేయంగా కలవాళ్లూ అయిన పుత్రులుంటే బాగుండునని. అంతే! ఆ లక్షణాలతో నలుగురు ఒకే రూపం, ఒకే లక్షణాలు, గుణాలతో జన్మించారు. వాళ్లే సనక – సనందన – సనత్సుజాత– సనత్కుమారులు అనే పేర్లు కలవాళ్లు. వీళ్లకే సనకచతుష్టయమని పేరు. ధృతరాష్ట్రుడు తనకి మనశ్శాంతి లేని వేళ ఈ సనత్సుజాతుణ్ణే ఆహ్వానించి ధర్మబోధ చేయవలసిందని ప్రార్థించాడు. ఆయన చేసిన బోధనని విన్నాడు. మరి ఈ సనకచతుష్టయానికీ తల్లీ తండ్రీ సంగమం.. మొదలైనవి లేవుగా! అందుకే వీళ్లని బ్రహ్మమాసన పుత్రులు (బ్రహ్మగారి మనసులోని ఆలోచనకి అనుగుణంగా కల్గినవారు).

ఆరవ తీరు సంతానం సాంసిద్ధికం. సద్యోగర్భం ద్వారా పుట్టీ పుడుతూనే బాల్యం దాటి కౌమారదశకి వచ్చేయడం. పరాశరమహర్షి పడవలో గంగని దాటి అక్కడ ఉన్న ద్వీపాన్ని చీకటినిండేలా చేసి సత్యవతి ద్వారా వ్యాసుణ్ణి కన్నాడు. చిత్రమేమంటే ఈ వ్యాసుడు సద్యోగర్భం (అప్పటికప్పుడు వచ్చిన గర్భం) ద్వారా పుట్టడమే కాక, పుడుతూనే కౌమారదశలో కన్పిస్తూ దండకమండలాలతో తల్లికీ తండ్రికీ నమస్కరించాడు. ‘కృష్ణ ద్వైపాయనుడు’ అని ఆయన పేరు. కృష్ణ అంటే చీకటిగా చేయబడిన, ద్వైపాయన ద్వీపమే తనకి జన్మస్థలంగా కలవాడని అర్థం. స్త్రీ పురుష సంగమం లేదిక్కడ. పోనీ! చీకటిగా ద్వీపాన్ని చేసిన కారణంగా సంగమమే ఉందనుకుందాం కాసేపు. అదే నిజమైతే దాన్నే నమ్మేటట్లయితే.. ఆయన తన పుట్టుకతోనే 13 సంవత్సరాల వయసు కలవానిగానూ దండకమండలాలతోనూ జన్మించాడనే విషయాన్ని కూడా నమ్మితీరాలి కదా!

కళ్ల ద్వారా సంతానం
పైన అనుకున్న ఇన్ని తీరులుగా సంతానాన్ని పొందడం, అందులో కొన్నింటిలో స్త్రీ పురుష సంగమం లేకుండా ఉండటాన్ని మనం గమనించాం. ఇంతవరకూ అయ్యాక ఇప్పుడిక కళ్ల ద్వారా సంతానాన్ని ఎలా కన్నారో, ఎవరు కన్నారో ఆ విషయాన్ని చూద్దాం!భారతకథని చూడాలి. కాశీరాజుకి ముగ్గురు పుత్రికలు. వాళ్లలో పెద్దామె అయిన అంబ ప్రేమ విఫలమైంది. ఇక మిగిలిన అంబిక, అంబాలిక అనే ఇద్దరినీ విచిత్రవీర్యునికిచ్చి భీష్ముడు వివాహం జరిపించాడు. సంతానం కలగలేదు. విచిత్రవీర్యుడు మరణించాడు. రాజవంశం సంతానం లేని కారణంగా ఆగిపోయే పరిస్థితికొచ్చింది. అప్పుడు వ్యాసుణ్ణి తల్లి అయిన సత్యవతి ప్రార్థించింది – ఈ అంబిక, అంబాలికల ద్వారా సంతానాన్ని కనవలసిందని. ఈ మాట వింటూంటేనే ఇదేమిటి? అనే ఆలోచన మనకొస్తుంది. దానిక్కారణం మనందరికీ సంతానమనే మాట వినగానే సంగమం ద్వారానే సాధ్యమవుతుందనే ఒక్క విషయం మాత్రమే మన బుద్ధికి తడుతూండటమే.తన తల్లి ప్రార్థించగానే వ్యాసుడు సరేనని అంబిక వద్దకొచ్చాడు. ఆయన గడ్డాలు, మీసాలు ఎరుపు తెలుపు కలిసిన జడల సమూహం మునిరూపం చూడగానే అంబికకి ఓ తీరు భయం వేసి ఒక్క క్షణం పాటు ఆయన్ని చూసి కళ్లు మూసుకుంది. వెంటనే గదిలో నుండి ఇవతలికి వచ్చిన వ్యాసుడు తన తల్లితో.. ఈమెకి అంధుడు పుడతాడని చెప్పాడు. అతనే ధృతరాష్ట్రుడు.మరి సంగమమే సంతానకారణమయ్యుంటే వ్యాసుని తల్లి గది వద్దే ఉండదు కదా! క్షణంలో గది నుండి బయటికి రావడం సాధ్యం కాదు గదా! పైగా వ్యాసుడు ఆ కలగబోయే సంతానం అంధుడవుతాడని ఎలా చెప్పగలుగుతాడు, సామాన్యుడే అయ్యుంటే?

కళ్లలో ఏముంది శక్తి?
సర్వ సాధారణంగా పురుషుని శుక్లం అధోముఖంగా వెళ్లి స్త్రీకి సంతానం కలిగించేందుకు తోడ్పడుతుంది. అదే మరి యోగులు, సిద్ధులు అయినవారి విషయంలో ఆ శుక్లం క్రమంగా ఊర్థ్వముఖంగా ప్రయాణిస్తుంది.ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి.. అని మంత్రం వెళ్తుంది. ఆ శుక్లం అలా ప్రయాణించి ప్రయాణించి మెల్లగా కనురెప్పల వద్ద నిలవ ఉంటుంది. ఏ స్త్రీ సంతానాన్ని అర్థిస్తూ ఆ సిద్ధుణ్ణో స్వామినో యోగినో చూస్తుందో వెంటనే ఆ కళ్లలో ఉన్న సంతానోత్పాదక శక్తి స్త్రీ కళ్ల ద్వారా ప్రయాణించి అధోముఖంగా ఆమెకి గర్భం కలిగేలా చేస్తుంది. ఇదే జరిగింది వ్యాసుని విషయంలో.అంబిక అలా వ్యాసుణ్ణి చూసి వెంటనే కళ్లు మూసుకుంది. గర్భం కలిగింది కానీ అంధత్వం వచ్చింది. సంతానానికి ధృతరాష్టుడు పుట్టాడు.తరువాతిదైన అంబాలిక గదిలోనికి వెళ్లాడు వ్యాసుడు. ఆమె వ్యాసుణ్ణి అంబికలాగానే భయంతో చూసింది గానీ, నిన్నటి రోజున తన అక్కకి జరిగిన తీరు అంధసంతానం రారాదని భావించి కళ్లని తెరిచే ఉంచింది. అయితే ఆ వ్యాసుని రూపం, తపః ప్రకాశం ఆమెకి దుర్నిరీక్ష్యం (చూడ శక్యం కానిది) కావడంతో బలవంతాన కనులు మూసుకోవలసిరావడం అనే ఈ రెండాలోచనల మధ్య కళ్లని తెరవడం, మూయడం చేస్తుంటే ఆ ప్రవర్తన కారణంగా ‘పొండుర్‌గా’ కలిగిన పాండురాజు జన్మించాడు.ఇక ఈ ఇద్దరూ ఆలోచించుకున్న మీదట, సత్యవతి ఊహప్రకారమూ గదిలో దాసిని ఉంచితే, ఆమె వ్యాసుణ్ణి పరమసిద్ధునిగా గ్రహించి ఆ తీరు గౌరవంతో భయంతో భక్తితో శ్రద్ధతో కనుల్ని తెరుచుకునే ఉండి ఆయన కళ్లలోనికి చూసింది సంతాన ఆపేక్షతో. అంతే! విదురుడు ఆ దర్శనఫలంగా పుట్టాడు.

అంటే ఏమన్నమాట? యోగులు, సిద్ధులు, దివ్యపురుషులు అయిన వారి ముఖంలోనికి మనం ముఖాన్ని ఉంచి భయభక్తి శ్రద్ధలతోగానీ చూసినట్లయితే ఆ చూపు ప్రకారం దాని కనుగుణంగానూ సంతానం కలుగుతుందనేది యథార్థమని తెలిసిపోయింది కదా!శ్రీమద్రామాయణంలో తృణబిందుడనే రాజర్షి ఉన్నాడు. ఆయన ఆశ్రమంలోనికి స్త్రీలెవరూ ప్రవేశించరాదనే ఓ నియమాన్ని పెట్టాడు. లోకంలో ఏదైనా ఓ నియమమంటూ ఉంటే దాన్ని ఎలాగైనా విరోధించాలనే వాళ్లు కొందరో ఏ ఒక్కరో ఉండకుండా ఉండరు. దాంతో ఒకరొకరు చొప్పున రాజర్షికి తెలియకుండా ఆశ్రమంలోనికి పూలు కోసుకుందామనీ, ఆశ్రమంలో తిరుగాడే లేళ్లని చూద్దామనీ, ఉద్యానవనవిహారాన్ని చూద్దామనీ ఇలా రావడం ప్రారంభించారు. దాంతో ఆయన ఓ నియమాన్ని కఠినం చేస్తూ.. యా మే దృష్టిపథ మాగచ్ఛేత్‌ సా గర్భాన్ని ధరిస్తుంది జాగ్రత్త! అనే కట్టడిని చేశాడు. దాంతో ఎవరూ రానేలేదు. ఆ తర్వాత ఆయన కళ్లలో పడితే చాలు గర్భం వస్తుందని అనడానిక్కారణం కళ్లలో గర్భధారణ సమర్థత కల శక్తి, పైన అనుకున్న తీరుగా ఉండటమే.‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అనే ఓ మాటని వింటుంటాం. శరీరంలో ఉండే జ్ఞానేంద్రియ (శరీరం, కళ్లు, చెవి, నాలుక, ముక్కు) అలాగే ఉండే కర్మేంద్రియ (మాట, చేయి, కాలు, విసర్జకావయవాలు రెండు) విభాగాల్లో కళ్లు అతి ప్రధానమైనవని దానర్థం. ఒకే కన్ను శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంతమనే తొమ్మిది రసాలని చూపించగల శక్తి ఉన్న ఇంద్రియం.ఈ కారణంగానూ 12 సంవత్సరాల పాటు బహిరంగంగా కాకుండా నేలమాళిగలో ఉంటూ తీవ్రతప స్సుని ఏ బాధ్యతలు బరువులు లేని చిన్న వయసులో (4) సాయి చేసిన కారణంగానూ సాయికి కన్నుల్లో ఉన్న శక్తి –అందరినీ వశులుగా చేసేదే. ఆ వశం చేసే శక్తుల్లో గర్భాన్ని కలిగించే తనం ఒకటన్నమాట. కాబట్టి సాయికనుల ద్వారా గర్భం, సంతానం కలిగిందంటే కచ్చితంగా నమ్మితీరవలసిన అంశమే! ఇక సాయి ఓ కపటగురువుకి శిష్యుడైన విధానాన్ని చూద్దాం! 
∙డా. మైలవరపు శ్రీనివాసరావు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement