Scripture
-
కంటిచూపుతో కన్నారు
ఏదైనా ఓ వింతని, నమ్మలేని నిజాన్ని విజ్ఞానశాస్త్రజ్ఞులు చెప్తే చాలు.. కచ్చితంగా నమ్మడానికి సిద్ధంగా మనల్ని మనం తయారు చేసేసుకున్నాం. మళ్లీ అదే అంశం నిజం కాదని మరికొంత కాలమయ్యాక పరిశోధనలు చేశామని మళ్లీ వాళ్లే చెప్తే దాన్ని కూడా నిజమేనని అంగీకరిస్తాం తప్ప ఏ వాదాన్నీ చెయ్యం. ఫలానా ఔషధం ఎంతో గొప్పదని చెప్పిన అదే విజ్ఞానశాస్త్రం కొంతకాలమయ్యాక ఈ ఔషధం వల్ల అనేక దుష్ఫలితాలున్నాయని నిరూపించబడిందనగానే వెంటనే మానేస్తాం.ఈ విషయాన్నెందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఆ శాస్త్రం చెప్తే నమ్మే జనం, అనుమానాన్ని వ్యక్తీకరించని లోకం, సాయి కళ్లలోనికి చూస్తే సంతానం కలిగిందని చెప్పిన నిజాన్ని ఎందుకు నమ్మరు? ఎలా నమ్మాలో వివరించుకుందాం! ఏదో గాలి మాటలు కాకుండా సప్రమాణంగా ఆధారాలతో సహా చెప్పుకుందాం! సంతానాన్ని కనే తీరులు మనం మానవజాతికి చెందినవాళ్లం కాబట్టి సంతానాన్ని కనడం అనగానే స్త్రీ పురుషసమాగమం మాత్రమే అనేసుకుంటాం. అది తప్ప మరో మార్గమే లేదని దృఢంగా వాదిస్తాం కూడా.సంతానాన్ని కనే విధానాలని వైశేషిక దర్శనమనే గ్రంథం చెప్పింది –‘స్వేదజ, అండజ, జరాయుజ, ఉద్భిజ్జ, సాంకల్పిక, సాంసిద్ధిక, భేదాత్’ అని.స్వేదజ సంతానం మొదటిది. స్వేదమంటే శరీరం నుంచి బయటికి వచ్చే చెమట అని అర్థం. ఆ చెమట నుండి పుట్టే సంతానమన్నమాట. క్రిముల్లో కొన్ని విడిచిన స్వేదమూ లేదా మనుష్యులు మొదలైనవారి శరీరాల నుండి విడువబడిన స్వేదమూ నుండి పుట్టే సంతానం అని దీనర్థం. తలలో పట్టే చెమట కారణంగా ఈ పేలు మొదలైనవి పుడతాయి. వాటిలో మగపేను, ఆడపేను అనే జాతి భేదం, లింగ భేదం ఉండదు. అలాగే పశువులు విడిచిన స్వేదం నుండి సన్ననైన ఓ తీరు క్రిములు పుడతాయి. వాటిని గ్రామప్రాంతాల్లో నుసుములు అని పిలుస్తారు. అవి మనల్ని కుట్టవు గానీ ఊరికే వాలుతూ ఒక తీరు అసహ్యాన్ని, చిరాకునీ మనకి కలుగజేస్తుంటాయి. అపరిశుభ్రంగా ఉన్న, లేదా కుళ్లిన పదార్థాల మీద వాలుతూ కన్పిస్తాయి. వీటికి కూడా లింగభేదం ఉండదు. సంగమం కారణంగా పుట్టవు. ఇవన్నీ ఏకలింగజీవులు. మరి దీన్ని వింతగా అనుకోవద్దు. అలాగే కడుపులో నులిపురుగులెలా పుడుతున్నాయి? గమనించుకోవాలి. రెండవ సంతానం అండజాలు. అండమంటే గుడ్డు. గుడ్డు నుండి పుట్టేదని దీనర్థం. నిజానికి తల్లి తీసుకునే ఆహారసారం ఆమె గర్భంలో ఉన్న శిశువుకి జీవద్రవ్యంగా ఉపయోగపడుతూ క్రమంగా పెరుగుతూ ఆ మీదట బయటికి రావలసిన కాలానికి శిశువుగా ప్రాణం పోసుకుని జన్మించడం మనం చూస్తూండే అంశం. చిత్రమేమంటే గుడ్డు అనేది మొత్తం కప్పబడి ఉండి, తల్లి ద్వారా ఏ విధమైన ద్రవ్యం దానికి చెందే, చెందించే వీలే ఉండదు గుడ్డుకి. అయినా ఆ గుడ్డు కొంతకాలానికి సంతానంగా మారుతూ కన్పిస్తోంది, తల్లి ఏ మాత్రపు ఆహారాన్ని అందించకుండానే. దీన్ని కూడా చిత్రమని అనుకోవద్దూ?మూడవ సంతానం జరాయుజాలు. జరాయువనే మాటకి ‘మావి’ అని అర్థం. దీన్నే ‘మాయి’ అని పిలుస్తుంటారు వ్యవహారంలో. కొన్ని చోట్ల ‘మాయ’ అని అంటుంటారు. ఏది ఏమైనా మావి ద్వారా జన్మించేవి మనుష్య–పశుజాతులు. అందుకే జంతువులతో బాగా పరిచయం, అనుభవం ఉన్న వాళ్లు పశువులు తమ సంతానాన్ని ఈనుతున్న దృశ్యం కంటపడగానే ఆ తల్లి కాబోతున్న పశువుకి ధాన్యపు పొట్టుని ఆహారంగా పెడతారు. ఆ దాన్యపు పొట్టు (చిట్టు అంటారు కొన్ని ప్రాంతాల్లో) లోపల ఉన్న మావిని రంపంలా కోసేసి దూడని తొందరగా బయటికొచ్చేలా చేస్తుంది. పశుజాతి, కొన్ని మృగజాతులు, కొన్ని జంతుజాతులు కూడా ఇలా పుట్టేవే! నాల్గవ సంతానం ఉద్భిజ్జాలు. ‘ఉత్’ అంటే పైకి అని అర్థం. ‘భిత్’ అంటే చీల్చుకోవడం, చీల్చడమని అర్థం. ‘జ’ అంటే పుట్టడమని అర్థం. ఒక పదార్థాన్ని చీల్చుకుని పైకి రావడమని దీని భావం. దీనికి ఉదాహరణ మొక్క. విత్తనాన్ని భూమిలో పాతి మట్టిని కప్పి కొద్దిగా నీటిని పోస్తే చాలు.. ఆ విత్తనం ఉబ్బి మెల్లగా అంకురరూపాన్ని (మొలక)విత్తి మెల్లగా ఆ భూమిని చీల్చుకుని (ఉత్ + భిత్) పుడుతోంది. (జ) మొక్కగా అవుతోంది. ఆకుల్ని వేస్తోంది. సన్నకాండంతో మొదలై ఎదుగుదలలో చెట్టుగా మారుతోంది. మరి ఈ మొక్క స్త్రీ పురుష సంగమం వల్ల కలగలేదుగా!ఐదవ సంతానం సాంకల్పికం. చెప్పలేనంత తపశ్శక్తిని ఆర్జించి దేవతలైన వారికి కలిగే సంకల్పం కారణంగా కలిగే సంతానం. బ్రహ్మ తనంత తానుగా సంకల్పించాడు. చక్కని రూపసౌందర్యం కలవాళ్లూ, మహా వైరాగ్యం కలిగి ఈ ప్రపంచాన్నే ఓ కలగా భావించే వాళ్లూ, ఏ ప్రలోభానికీ లొంగనివాళ్లూ, నిత్యం శ్రీమన్నారాయణ దర్శనమే తమ అనుదిన జీవిత ధ్యేయంగా కలవాళ్లూ అయిన పుత్రులుంటే బాగుండునని. అంతే! ఆ లక్షణాలతో నలుగురు ఒకే రూపం, ఒకే లక్షణాలు, గుణాలతో జన్మించారు. వాళ్లే సనక – సనందన – సనత్సుజాత– సనత్కుమారులు అనే పేర్లు కలవాళ్లు. వీళ్లకే సనకచతుష్టయమని పేరు. ధృతరాష్ట్రుడు తనకి మనశ్శాంతి లేని వేళ ఈ సనత్సుజాతుణ్ణే ఆహ్వానించి ధర్మబోధ చేయవలసిందని ప్రార్థించాడు. ఆయన చేసిన బోధనని విన్నాడు. మరి ఈ సనకచతుష్టయానికీ తల్లీ తండ్రీ సంగమం.. మొదలైనవి లేవుగా! అందుకే వీళ్లని బ్రహ్మమాసన పుత్రులు (బ్రహ్మగారి మనసులోని ఆలోచనకి అనుగుణంగా కల్గినవారు). ఆరవ తీరు సంతానం సాంసిద్ధికం. సద్యోగర్భం ద్వారా పుట్టీ పుడుతూనే బాల్యం దాటి కౌమారదశకి వచ్చేయడం. పరాశరమహర్షి పడవలో గంగని దాటి అక్కడ ఉన్న ద్వీపాన్ని చీకటినిండేలా చేసి సత్యవతి ద్వారా వ్యాసుణ్ణి కన్నాడు. చిత్రమేమంటే ఈ వ్యాసుడు సద్యోగర్భం (అప్పటికప్పుడు వచ్చిన గర్భం) ద్వారా పుట్టడమే కాక, పుడుతూనే కౌమారదశలో కన్పిస్తూ దండకమండలాలతో తల్లికీ తండ్రికీ నమస్కరించాడు. ‘కృష్ణ ద్వైపాయనుడు’ అని ఆయన పేరు. కృష్ణ అంటే చీకటిగా చేయబడిన, ద్వైపాయన ద్వీపమే తనకి జన్మస్థలంగా కలవాడని అర్థం. స్త్రీ పురుష సంగమం లేదిక్కడ. పోనీ! చీకటిగా ద్వీపాన్ని చేసిన కారణంగా సంగమమే ఉందనుకుందాం కాసేపు. అదే నిజమైతే దాన్నే నమ్మేటట్లయితే.. ఆయన తన పుట్టుకతోనే 13 సంవత్సరాల వయసు కలవానిగానూ దండకమండలాలతోనూ జన్మించాడనే విషయాన్ని కూడా నమ్మితీరాలి కదా! కళ్ల ద్వారా సంతానం పైన అనుకున్న ఇన్ని తీరులుగా సంతానాన్ని పొందడం, అందులో కొన్నింటిలో స్త్రీ పురుష సంగమం లేకుండా ఉండటాన్ని మనం గమనించాం. ఇంతవరకూ అయ్యాక ఇప్పుడిక కళ్ల ద్వారా సంతానాన్ని ఎలా కన్నారో, ఎవరు కన్నారో ఆ విషయాన్ని చూద్దాం!భారతకథని చూడాలి. కాశీరాజుకి ముగ్గురు పుత్రికలు. వాళ్లలో పెద్దామె అయిన అంబ ప్రేమ విఫలమైంది. ఇక మిగిలిన అంబిక, అంబాలిక అనే ఇద్దరినీ విచిత్రవీర్యునికిచ్చి భీష్ముడు వివాహం జరిపించాడు. సంతానం కలగలేదు. విచిత్రవీర్యుడు మరణించాడు. రాజవంశం సంతానం లేని కారణంగా ఆగిపోయే పరిస్థితికొచ్చింది. అప్పుడు వ్యాసుణ్ణి తల్లి అయిన సత్యవతి ప్రార్థించింది – ఈ అంబిక, అంబాలికల ద్వారా సంతానాన్ని కనవలసిందని. ఈ మాట వింటూంటేనే ఇదేమిటి? అనే ఆలోచన మనకొస్తుంది. దానిక్కారణం మనందరికీ సంతానమనే మాట వినగానే సంగమం ద్వారానే సాధ్యమవుతుందనే ఒక్క విషయం మాత్రమే మన బుద్ధికి తడుతూండటమే.తన తల్లి ప్రార్థించగానే వ్యాసుడు సరేనని అంబిక వద్దకొచ్చాడు. ఆయన గడ్డాలు, మీసాలు ఎరుపు తెలుపు కలిసిన జడల సమూహం మునిరూపం చూడగానే అంబికకి ఓ తీరు భయం వేసి ఒక్క క్షణం పాటు ఆయన్ని చూసి కళ్లు మూసుకుంది. వెంటనే గదిలో నుండి ఇవతలికి వచ్చిన వ్యాసుడు తన తల్లితో.. ఈమెకి అంధుడు పుడతాడని చెప్పాడు. అతనే ధృతరాష్ట్రుడు.మరి సంగమమే సంతానకారణమయ్యుంటే వ్యాసుని తల్లి గది వద్దే ఉండదు కదా! క్షణంలో గది నుండి బయటికి రావడం సాధ్యం కాదు గదా! పైగా వ్యాసుడు ఆ కలగబోయే సంతానం అంధుడవుతాడని ఎలా చెప్పగలుగుతాడు, సామాన్యుడే అయ్యుంటే? కళ్లలో ఏముంది శక్తి? సర్వ సాధారణంగా పురుషుని శుక్లం అధోముఖంగా వెళ్లి స్త్రీకి సంతానం కలిగించేందుకు తోడ్పడుతుంది. అదే మరి యోగులు, సిద్ధులు అయినవారి విషయంలో ఆ శుక్లం క్రమంగా ఊర్థ్వముఖంగా ప్రయాణిస్తుంది.ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి.. అని మంత్రం వెళ్తుంది. ఆ శుక్లం అలా ప్రయాణించి ప్రయాణించి మెల్లగా కనురెప్పల వద్ద నిలవ ఉంటుంది. ఏ స్త్రీ సంతానాన్ని అర్థిస్తూ ఆ సిద్ధుణ్ణో స్వామినో యోగినో చూస్తుందో వెంటనే ఆ కళ్లలో ఉన్న సంతానోత్పాదక శక్తి స్త్రీ కళ్ల ద్వారా ప్రయాణించి అధోముఖంగా ఆమెకి గర్భం కలిగేలా చేస్తుంది. ఇదే జరిగింది వ్యాసుని విషయంలో.అంబిక అలా వ్యాసుణ్ణి చూసి వెంటనే కళ్లు మూసుకుంది. గర్భం కలిగింది కానీ అంధత్వం వచ్చింది. సంతానానికి ధృతరాష్టుడు పుట్టాడు.తరువాతిదైన అంబాలిక గదిలోనికి వెళ్లాడు వ్యాసుడు. ఆమె వ్యాసుణ్ణి అంబికలాగానే భయంతో చూసింది గానీ, నిన్నటి రోజున తన అక్కకి జరిగిన తీరు అంధసంతానం రారాదని భావించి కళ్లని తెరిచే ఉంచింది. అయితే ఆ వ్యాసుని రూపం, తపః ప్రకాశం ఆమెకి దుర్నిరీక్ష్యం (చూడ శక్యం కానిది) కావడంతో బలవంతాన కనులు మూసుకోవలసిరావడం అనే ఈ రెండాలోచనల మధ్య కళ్లని తెరవడం, మూయడం చేస్తుంటే ఆ ప్రవర్తన కారణంగా ‘పొండుర్గా’ కలిగిన పాండురాజు జన్మించాడు.ఇక ఈ ఇద్దరూ ఆలోచించుకున్న మీదట, సత్యవతి ఊహప్రకారమూ గదిలో దాసిని ఉంచితే, ఆమె వ్యాసుణ్ణి పరమసిద్ధునిగా గ్రహించి ఆ తీరు గౌరవంతో భయంతో భక్తితో శ్రద్ధతో కనుల్ని తెరుచుకునే ఉండి ఆయన కళ్లలోనికి చూసింది సంతాన ఆపేక్షతో. అంతే! విదురుడు ఆ దర్శనఫలంగా పుట్టాడు. అంటే ఏమన్నమాట? యోగులు, సిద్ధులు, దివ్యపురుషులు అయిన వారి ముఖంలోనికి మనం ముఖాన్ని ఉంచి భయభక్తి శ్రద్ధలతోగానీ చూసినట్లయితే ఆ చూపు ప్రకారం దాని కనుగుణంగానూ సంతానం కలుగుతుందనేది యథార్థమని తెలిసిపోయింది కదా!శ్రీమద్రామాయణంలో తృణబిందుడనే రాజర్షి ఉన్నాడు. ఆయన ఆశ్రమంలోనికి స్త్రీలెవరూ ప్రవేశించరాదనే ఓ నియమాన్ని పెట్టాడు. లోకంలో ఏదైనా ఓ నియమమంటూ ఉంటే దాన్ని ఎలాగైనా విరోధించాలనే వాళ్లు కొందరో ఏ ఒక్కరో ఉండకుండా ఉండరు. దాంతో ఒకరొకరు చొప్పున రాజర్షికి తెలియకుండా ఆశ్రమంలోనికి పూలు కోసుకుందామనీ, ఆశ్రమంలో తిరుగాడే లేళ్లని చూద్దామనీ, ఉద్యానవనవిహారాన్ని చూద్దామనీ ఇలా రావడం ప్రారంభించారు. దాంతో ఆయన ఓ నియమాన్ని కఠినం చేస్తూ.. యా మే దృష్టిపథ మాగచ్ఛేత్ సా గర్భాన్ని ధరిస్తుంది జాగ్రత్త! అనే కట్టడిని చేశాడు. దాంతో ఎవరూ రానేలేదు. ఆ తర్వాత ఆయన కళ్లలో పడితే చాలు గర్భం వస్తుందని అనడానిక్కారణం కళ్లలో గర్భధారణ సమర్థత కల శక్తి, పైన అనుకున్న తీరుగా ఉండటమే.‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అనే ఓ మాటని వింటుంటాం. శరీరంలో ఉండే జ్ఞానేంద్రియ (శరీరం, కళ్లు, చెవి, నాలుక, ముక్కు) అలాగే ఉండే కర్మేంద్రియ (మాట, చేయి, కాలు, విసర్జకావయవాలు రెండు) విభాగాల్లో కళ్లు అతి ప్రధానమైనవని దానర్థం. ఒకే కన్ను శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంతమనే తొమ్మిది రసాలని చూపించగల శక్తి ఉన్న ఇంద్రియం.ఈ కారణంగానూ 12 సంవత్సరాల పాటు బహిరంగంగా కాకుండా నేలమాళిగలో ఉంటూ తీవ్రతప స్సుని ఏ బాధ్యతలు బరువులు లేని చిన్న వయసులో (4) సాయి చేసిన కారణంగానూ సాయికి కన్నుల్లో ఉన్న శక్తి –అందరినీ వశులుగా చేసేదే. ఆ వశం చేసే శక్తుల్లో గర్భాన్ని కలిగించే తనం ఒకటన్నమాట. కాబట్టి సాయికనుల ద్వారా గర్భం, సంతానం కలిగిందంటే కచ్చితంగా నమ్మితీరవలసిన అంశమే! ఇక సాయి ఓ కపటగురువుకి శిష్యుడైన విధానాన్ని చూద్దాం! ∙డా. మైలవరపు శ్రీనివాసరావు -
బౌద్ధంపై చక్కటి కథాసంకలనం
సత్గ్రంథం బుద్ధుడు చెప్పినట్లుగా మహాయానంలో ప్రచారంలో ఉన్న కథలకే జాతక కథలని పేరు. ఈ కథలు 430 అని కొందరూ, 547 అని మరికొందరూ చెబుతారు. హిందూమతం బుద్ధిః కర్మానుసారిణి అంటే, కర్మ బుద్ధ్యానుసారిణి అంటుంది బౌద్ధం. బౌద్థంపై అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడి,్డ బొర్రా గోవర్ధన్ వంటివారు ఎన్నో మంచి రచనలు చేశారు. తాజాగా కవి, పరిశోధకుడు, తాళపత్ర గ్రంథ సేకర్త డా. కావూరి శ్రీనివాస్ ‘జాతక కథలు’ పేరిట పుస్తకాన్ని ప్రచురించారు. 41 కథలు ఉన్న ఈ పుస్తకంలో కథలతోపాటు, సంబంధిత నిజచిత్రాలూ ఉండటం విశేషం. చిన్న కథలైనా, చక్కటి నీతిని చెబుతాయి. వీటిని వాడుకభాషలో రాసి ఉంటే బాగుండేది. జాతక కథలు; సేకరణ, రచన: డా. కావూరి శ్రీనివాస్; పుటలు: 92; వెల రూ. 100 ప్రతులకు: తెలంగాణ రాష్ర్ట పర్యాటకాభివృద్ధి సంస్థ, టూరిజం హౌస్, 3-5-891, హిమాయత్ నగర్, హైదరాబాద్- 500 029; ఫోన్: 9849776157 - డి.వి.ఆర్. -
మనవి చేసే విఠల కీర్తనలు!
సత్గ్రంథం సాహిత్యమన్నా, కృష్ణదేవరాయలన్నా ప్రాణం పెట్టే మోదుగుల రవికృష్ణ తెలుగు సాహితీ చరిత్రపై లోతైన పరిశోధన చేసి, కొన్ని చక్కటి వ్యాసాలు రాశారు. వాటికే అందమైన పుస్తకరూపమిచ్చారు. పద్నాలుగు వ్యాసాలున్న ఈ చిన్నిపొత్తంలో సంగీత సద్గురు త్యాగరాజస్వామివారిపైన, నిఘంటు రచయిత బహుజనపల్లి సీతారామాచార్యులుపైన, సూర్యరాయాంధ్ర నిఘంటువుపైన, జానపద వాఞ్మయంపైనా చక్కటి పరిశోధన కనిపిస్తుంది. ‘బొబ్బిలియుద్ధం’ వ్యాసం చదువుతుంటే ఆ చారిత్రాత్మక ఘటన కళ్లముందు బొమ్మకడుతుంది. అన్నింటికీ మించి ‘విఠ్ఠలకీర్తనలు అన్నమయ్యవా?’ అంటూ పెట్టిన టైటిల్ని చూసి ముచ్చటేస్తుంది. రచయిత ప్రచురణకర్తగా మారి, తాను కొన్ని పుస్తకాలకు రాసిన ముందుమాటలను కూడా ‘మనవి మాటలు’ పేరుతో పుస్తకంగా మలిచారు. నేటితరానికి అందుబాటులో లేని కొన్ని మంచి గ్రంథాలను పునర్ముద్రించాలన్న తన లక్ష్యసాధనను త్వరలోనే చేరుకుంటారని ఆశిద్దాం. విఠ్ఠల కీర్తనలు అన్నమయ్యవా? పుటలు:128; వెల రూ. 80; మనవి మాటలు, పుటలు:149; వెల రూ. 80; రచయిత ఫోన్: 9440320580 - డి.వి.ఆర్. -
ఈ ఉత్సవం ప్రయోజనకరం... ప్రామాణికం
సత్ గ్రంథం కాలాన్ని అనుసరించి కర్మలను చేయాలంది శాస్త్రం. ఏకాలంలో ఏ పనులు చేయడం శ్రేయస్కరమో ధర్మసింధు, నిర్ణయ సింధు వంటి సద్గ్రంథాలలో పెద్దలు ఏనాడో చెప్పారు. అయితే ఈ రోజుల్లో అంతటి ఉద్గ్రంథాలను చదివే ఓపిక, తీరిక ఉన్నవారు అరుదు. ఒకవేళ తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నా, గ్రాంథిక భాషలో ఉండే ఆయా విషయాలను అర్థం చేసుకోవడం కష్టం. ఈ లోటును పూరించేందుకుగానూ పాత్రికేయుడు, అధ్యాపకుడు డా. కప్పగంతు రామకృష్ణ అనేకమైన ప్రామాణిక గ్రంథాలను పరిశీలించి, ఏ మాసంలో ఏయే పనులు చేయాలో వివరిస్తూ, ‘నిత్యోత్సవము’ అనే పుస్తకాన్ని అందించారు. ఈ పుస్తకంలో చైత్రం మొదలుకొని, ఫాల్గుణం వరకు ప్రతి మాసం విశిష్టతతోబాటు ఏ మాసంలో... ఏ తిథిలో ఏ పనిని చేయాలో వివరంగా తెలియజేశారు. ఇక జనమందరూ శూన్యమాసాలుగా చిన్నచూపు చూసే ఆషాఢ, భాద్రపద, పుష్యమాసాలను అనంత ఫలాల మాసమనీ, పితృప్రీతికరమాసమనీ, పుణ్యఫలాల మాసమనీ సంభావిస్తూ, ఆ మాసాల వైశిష్ట్యాన్ని వివరించడం అభినందనీయం. ప్రతి మాసాన్నీ శుక్లపక్షం- కృష్ణపక్షంగా విభజిస్తూ, ఏ తిథిన ఏ పర్వదినమో, ఆనాడు ఏ విధిని నిర్వర్తించాలో వాడుక భాషలో చెప్పడం వల్ల పెద్దబాలశిక్షతోనో, ప్రాథమిక విద్యతోనో సరిపెట్టేసిన వారు సైతం సులువుగా అర్థం చేసుకోగ లరు. నిత్యోత్సవము (మహిమాన్విత మాసాలు; రచన: డాక్టర్.కె.రామకృష్ణ) పుటలు: 104; వెల: రూ.75 (తపాలా ఖర్చులు అదనం); ప్రతులకు: శ్రీ రాఘవేంద్ర పబ్లిషర్స్; 11-25-119, మెయిన్ రోడ్, విజయవాడ-520 001; కె.లక్ష్మీనారాయణ, ఇం.నం. 9-22, కొత్తూరు తాడేపల్లి పోస్ట్, వయా మిల్క్ ప్రాజెక్ట్, విజయవాడ-12. సెల్:9032044115 - డి.వి.ఆర్. -
ఉపనిషద్దర్శనం
ఉపనిషత్తులన్నీ ఆవులయితే వాటి పాలు పితికేవాడు శ్రీకృష్ణుడు. ఆవు దూడ అర్జునుడు. పాలు గీతామృతం. ఉపనిషత్తులు గోమాత వంటివి. వాటివల్ల కలిగే జ్ఞానం ఆవుపాల వలె ఆరోగ్యప్రదం. భారతీయ వైదిక సాహిత్యం నాలుగు వేదాల నుండి మొదలవుతోంది. మూల వేదాన్ని సంహిత అంటారు. దాని తరువాత బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులుగా వేదవాఙ్మయం విస్తరించింది. అన్నీ వేదం చెప్పిన ధర్మాన్ని ఎలా తెలుసుకోవాలో, ఎలా ఆచరించాలో వివిధ మార్గాల్లో వివరిస్తాయి. వేదాల్లో చెప్పిన కర్మలు ఎలా చెయ్యాలో బ్రాహ్మణాలు, ఉపాసన ఎలా చెయ్యాలో ఆరణ్యకాలు, ఎలా తెలుసుకోవాలో ఉపనిషత్తులు వివరిస్తాయి. ‘జ్ఞానదేవతా కైవల్యమ్’ (జ్ఞానమే మోక్షానికి మార్గం) అన్నారు కనుక అన్వేషణలో ముగింపు ఉపనిషత్తులతోనే అవుతోంది కనుక వాటిని ‘వేదాంతం’ అంటారు.యజ్ఞయాగాది కర్మలు, జపతపాలు ఎన్ని చేసినా ఉపనిషత్తులే జ్ఞానాన్ని ఇస్తాయి. అందుకే ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు మూడింటినీ వరుసగా అధ్యయనం చెయ్యాలి. భారతీయ సంస్కృతి, తత్త్వం, ధర్మం, సంప్రదాయం, మానవజన్మ పరమార్థం, బుద్ధి వికాసం, అధ్యయన విధానం అన్నీ ఒకేచోట దొరికే చోటు ఉపనిషత్తులే. ‘ఉప’ ‘ని’ ‘షద్’ అంటే గురువు సమీపంలో కూర్చుని నేర్చుకునేది అని శబ్దార్థం. విజ్ఞానవంతుడై, అధ్యయనపరుడై, బోధింపగలిగినవాడైన గురువు దగ్గర కూర్చొని వింటేనే ఉపనిషత్తుల వలన జ్ఞానం లభిస్తుంది. అజ్ఞానం నశిస్తుంది. సగం జ్ఞానం కాకుండా సంపూర్ణ జ్ఞానాన్ని ఇచ్చేది అని కూడా ఉపనిషత్ పదానికి అర్థం. ఈ జ్ఞానం లౌకికంగా, పార లౌకికంగా బుద్ధివికాసాన్ని కలిగిస్తుంది. అది ఇద్దరు చర్చించినప్పుడే నిస్సందేహంగా తెలుస్తుంది. అందుకే దగ్గర కూర్చొని వినేవి’ అని పేరుపెట్టారు. ఉపనిషత్తులను వేదాలలో భాగాలుగా, వాటికి అనుబంధాలుగా చెప్పినప్పటికీ విడిగా కూడా కొన్ని ఉపనిషత్తులు ఏర్పడ్డాయి. వేదాధ్యయనంతో సంబంధం లేకుండా ఉపనిషత్తులు చదువుకోవచ్చు. జ్ఞానాన్ని సంపాదించవచ్చు. మొత్తం ఉపనిషత్తులు పదకొండు వందల ఎనభై వరకు ఉన్నాయి. ఋగ్వేదంలో ఇరవై ఒకటి, యజుర్వేదంలో నూట తొమ్మిది, సామవేదంలో వెయ్యి, అధర్వణ వేదంలో ఏభై ఉన్నట్టు ఇప్పటి లెక్క. వీటన్నిటిలో నుంచి ముఖ్యమైన నూట ఎనిమిది ఉపనిషత్తులను ఎంపిక చేసి త్రేతాయుగంలో శ్రీరాముడు తన భక్తుడైన ఆంజనేయునికి వివరించాడట. అప్పటినుంచి నూటెనిమిది ముఖ్యమైన ఉపనిషత్తులు లోకంలో ప్రసిద్ధమైనాయి. నూట ఎనిమిది ఉపనిషత్తులలో ప్రాచీనమైనవి పది ఉపనిషత్తులు. జగద్గురువు ఆదిశంకరాచార్యులు ఈ పదింటికి భాష్యాన్ని రాశారు. వీటిని దశోపనిషత్తులు అంటారు. నూట ఎనిమిది ఉపనిషత్తులలో ఋగ్వేదానికి చెందినవి పది. శుక్ల యజుర్వేదంలోనివి పందొమ్మిది. కృష్ణ యజుర్వేదంలోనివి ముప్ఫయి ఒకటి ఉన్నాయి. ప్రధానమైన పది ఉపనిషత్తులు - ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తిరీయ, ఐతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యకోపనిషత్తులుదశోపనిషత్తులతో పాటు కౌషీతకి, శ్వేతాశ్వతర, మైత్రాయణి ఉపనిషత్తులకు కూడా అంతటి ప్రాధాన్యం ఉంది. నూట ఎనిమిది ఉపనిషత్తులలో కొన్ని నిరాకార పరబ్రహ్మ తత్వాన్ని చెబుతాయి. కొన్ని శివ, శక్తి, విష్ణువులను గూర్చి చెబుతాయి. కొన్ని సాంఖ్యయోగ పద్ధతిలో ఉంటాయి. ఈ వరుసలో అవి ప్రాచీన , మధ్య, అర్వాచీన కాలాలకు చెందినవిగా బాలగంగాధర్ తిలక్ వంటి పెద్దలు అభిప్రాయపడ్డారు. పది ఉపనిషత్తులలో ఈశావాస్య, బృహదారణ్యకాలు, శుక్ల యజుర్వేదానికి, కఠ, తైత్తిరీయోపనిషత్తులు కృష్ణయజుర్వేదానికీ, కేన, ఛాందోగ్యోపనిషత్తులు సామవేదానికీ, ప్రశ్న, ముండక, మాండూక్యోపనిషత్తులు అధర్వవేదానికీ చెంది ఉన్నాయి. ఒక్క ఐతరేయోపనిషత్తు మాత్రం ఋగ్వేదానికి చెందింది. ఈ పది ఉపనిషత్తులలో కఠోపనిషత్తు ఒక్కటే సాకార విష్ణు ప్రస్తావన చేస్తుంది. ఈశావాస్యంలో జ్ఞానప్రబోధం, కేనోపనిషత్తులో పరబ్రహ్మతత్త్వం, ప్రశ్నోపనిషత్తులో అక్షర పరబ్రహ్మ తత్త్వం, ముండకోపనిషత్తులో సన్యాసాశ్రమ విషయాలు, మాండూక్యంలో ఓంకార ప్రాముఖ్యం, అద్వైత తత్త్వం, తైత్తిరీయంలో ధర్మాలు, ఆచారాలు ఐతరేయంలో బ్రహ్మవిద్య ఛాందోగ్యంలో ధార్మికాంశాలు, బృహదారణ్యం చాలా పెద్ద ఉపనిషత్తు. దీనిలో సృష్టి, పరబ్రహ్మ తత్త్వం మొదలైన ఎన్నో విషయాలు సంవాద రూపంలో చర్చించబడ్డాయి. శ్వేతాశ్వతరోపనిషత్తు శైవధర్మాన్ని, భక్తి తత్త్వాన్ని ప్రతిపాదిస్తోంది. మైత్రాయిద్యుపనిషత్తు భౌతిక దేహం అశాశ్వతతాన్ని, సూర్య భగవానుని ఆరాధన గురించి చెబుతోంది. కౌషీతకి బ్రహ్మవిద్య, జీవచైతన్యం గురించి వివరిస్తోంది. నూటెనిమిది ఉపనిషత్తులలో సన్న్యాస ధర్మాన్ని పదిహేడు, వైష్ణవతత్వాన్ని పద్నాలుగు, శివ తత్వాన్ని పదిహేను శక్తితత్వాన్ని ఎనిమిది, యోగవిద్యను ఇరవై ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. ఉపనిషత్తుల అధ్యయనం మానసిక పరిపక్వతను, కుశాగ్ర బుద్ధిని తెలియజేస్తుంది. స్నాతకోత్తర విద్యలా ఉన్నత స్థాయిలో పరిశోధనాత్మకంగా విశ్లేషణ, అన్వేషణ పూర్వకంగా సత్యదర్శనం చేయిస్తుంది. గుడ్డిగా నమ్మటం కాకుండా గట్టిగా చర్చించి సత్యాన్ని అంగీకరించే పరిణతి కలిగిస్తుంది. సంప్రదాయ పద్ధతిలో కాక చారిత్రక దృష్టితో చూసినా క్రీస్తుపూర్వం మూడు వేల సంవత్సరాల నాటికే ఉపనిషత్తులు ఉన్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. భారతదేశ సంస్కృతి, మానవజాతి మనోవికాసంలో ఎంత ముందున్నదో మన ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి. ప్రపంచంలో ఏ మానవుడైనా ఉపనిషత్తుల అధ్యయనం వల్ల జాగృతుడు అవుతాడు. జాతి జ్ఞాన సస్యశ్యామలం అవుతుంది. ‘ఉప’ ‘ని’ ‘షద్’ అంటే గురువు సమీపంలో కూర్చుని నేర్చుకునేది అని శబ్దార్థం. విజ్ఞానవంతుడై, అధ్యయనపరుడై, బోధింపగలిగినవాడైన గురువు దగ్గర కూర్చొని వింటేనే ఉపనిషత్తుల వలన జ్ఞానం లభిస్తుంది. అజ్ఞానం నశిస్తుంది. సగం జ్ఞానం కాకుండా సంపూర్ణ జ్ఞానాన్ని ఇచ్చేది అని కూడా ఉపనిషత్ పదానికి అర్థం. - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ -
అలనాటి ఆటపాటలు
ఆదికవి నన్నయ ఆంధ్ర మహాభారతం ఆదిపర్వంలో మేనమరదలితో పెళ్లి ప్రస్తావించాడు. మేనరికాలు తెలుగువారిలో అనాది నుండి వస్తున్న ఆచారం. అదే గ్రంథంలో తిక్కన నాలుగు రోజుల పెళ్లిసంబరాల గురించి చెప్పాడు. ఈ రెండూ సంస్కృత మూలంలో లేవు. తెలుగువారి ఆచారాలే. ఇక తెలుగువాళ్ల పెళ్లిపండగ వర్ణన మొట్టమొదటిసారిగా కుమార సంభవంలో కనిపిస్తుంది. నన్నెచోడుడి కుమారసంభవంలో పార్వతీశివుల కల్యాణం వర్ణన ఇప్పటికి వెయ్యేళ్ల క్రితమే నాగవల్లి కుండలు, పాలకొమ్మతో రాటువేయడం, పసుపులు దంచడం, తలపై పేలాలు పెట్టడం, తెరపట్టడం, జీలకర్ర కలిపిన బియ్యం జల్లుకోవడం, ఊరేగింపు, వసంతాలు, బంతులాట మొదలైన మన పెళ్లి సంబరాలకి అద్దం పడుతుంది. అప్పటి పెళ్లిమంటపం డెకరేషన్ గురించి ఎన్నో విశేషాలు తెలుస్తాయి. మచ్చుకి కరెంట్ లేని రోజుల్లో బయట ఎండలో అద్దాలు పెట్టి ఆ వెలుతురు పందిరి లోపల మంటపంలో పడేలా చేశారట! తొలి చాళుక్యుల కాలంనాటి సాంఘిక పరిస్థితుల గురించి మహాభారతం, కుమార సంభవం, చాళుక్యసోమేశ్వరునిఅభిలాషితార్థచింతామణి, పండితారాధ్యుని బసవపురాణం మనకి ఎన్నో విషయాలు తెలుపుతాయి. నాచనసోముని ఉత్తరహరివంశంలో సత్యభామాకృష్ణుల నెత్తపుటాల(పాచికలు), ఆ ఆటకి సంబంధించిన పందేలూ, పంతాలు వర్ణిస్తుంది. పాచికలాట ఈనాటిది కాదు. అక్షక్రీడ ప్రస్తావన ఋగ్వేదంలో ఉంది. భారతయుద్ధానికి ముఖ్యకారణం పాచికలే. రాజసూయయాగం పాచికలాటతోగానీ పరిసమాప్తమవదు. ఆడవాళ్లు జోగిణి దేవతకి మొక్కి ఆట మొదలెట్టేవారని నాచన సోముడు చెప్పాడు. పూర్వం జైన విద్యాలయాల్లో ఎక్కాలు, లెక్కలు నేర్పేందుకు ఈ ఆటని ఉపయోగించారు. ప్రహేళికలు, అంత్యాక్షరివంటివి వయసొచ్చిన ఆడపిల్లలు ఆడేవారని కుమార సంభవం చెబుతుంది. వాళ్ల ఆటల్లో పెద్ద సంబరంగా జరుపుకునేవి బొమ్మలపెళ్లి, గుజ్జనగూళ్లు, స్నేహితురాళ్లని ఒకచోట పోగేసి అట్టహాసంగా బొమ్మలకి పెళ్లి చేయటం, పిడతల్లో తాహత్తుకు తగినట్లు వంట చేసి పంచుకోవటం. ఇక బొమ్మల్లో ఎన్నో రకాలు ఆనాటి సాహిత్యంలో కనిపిస్తాయి. కుమార సంభవంలో దంతపుబొమ్మలు, మేలిగాజు బన్నరుల గురించి చెబితే నాచన సోముడు పుత్తడి లత్తుక బొమ్మలని గురించి చెప్పాడు. అచ్చనగుండ్లు, పికిలిపిట్లు, గీరనగింజలు, తన్నుబిళ్ల, కుచ్చెళ్లు, దాగిలిమూతలు, స్తంభాలాట, కుందుళ్లు లాంటివి ఇంట్లో ఆడితే, వీధిలో బొంగరాలు, బిళ్లంగోడు, చిడుగుడూ, కోలకోతులు ఆడేవాళ్లు. అన్నింటిలో ముఖ్యమైనది మన తెలుగువారి క్రికెట్ ఆట. బిళ్లంగోడు, గిల్లీదండా, దండుగనీ, చిల్లగోడె, చిర్రాగోనె, ఇలా చాలా పేర్లున్నాయి. ఇప్పటికీ పల్నాడులో ఈ ఆట ఆడే పిల్లలు, ఏక్కా దుగా, తిక్కా అని ఒంట్లు లెక్కపెడతారు. అంటే బౌద్ధుల కాలానికే ఈ ఆట కోస్తాంధ్రలో ఆడేవారు. ఇక్కడ నుండే ఈ గిల్లీదండా ఇతర రాష్ట్రాలకి ఎగుమతి అయింది. మహారాష్ట్రలో ఈ ఆటని విటిదండు అంటారు. అక్కడ ఒంట్లు ఒకటీ, రెండూ, మూడు అని తెలుగుతో లెక్కబెడతారు. అందుకేనేమో మనవాళ్లకి క్రికెట్ ఆట అంత సులభంగా అలవడింది. ఇండియాకి మొట్టమొదటి క్రికెట్ కెప్టెన్ మన తెలుగువాడే.. సి.కె.నాయుడు అనే కఠారి కనకయ్య నాయుడు. వేదవ్యాసుడి సంస్కృత భారతంలో కౌరవపాండవులతో ఆడించిన ఆట బంతాట కాదు. దానిని వీటాఖేలనం అన్నాడు. ‘వీటయాయవా తారేణ ప్రాదేశ మాత్రకాష్ఠేనయత్, హస్తమాత్ర దండేన ఉపర్యుపరి కుమారా ప్రాక్షిపంతి’ అంటే, మూరెడు కర్రతో జానెడు బిళ్లని కొట్టే ఆట అని చెప్పాడు. కానీ ఎందుకో మన నన్నయ తెలుగు భారతంలో ఆ సన్నివేశాన్ని బంతాటగా మార్చాడు. పాపం, రాజమండ్రి వీధుల్లో కుర్రాళ్లు చేసే గోలకి గిల్లీదండా అంటే కోపమొచ్చిందేమో?