ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటి. మనదేశంలో ఆన్‌లైన్ లావాదేవీలతో పాటు డిజిటల్ లావాదేవీలు జరుగుతుంటాయి. నగదు రహిత లావాదేవీల్లో కార్డు చెల్లింపుల ట్రెండ్ ఇటీవలి కాలంలో మరింతగా పెరిగింది. నగదు రహిత విధానంలో కార్డుల సాయంతో పలు రకాల లావాదేవీలు చేయవచ్చు.
కార్డుతో లావాదేవీలు జరిపే చాలామందికి రూపే కార్డ్- వీసా కార్డ్ మధ్య తేడాలు ఏమిటో సరిగా తెలియకపోవచ్చు. దీంతో కొత్త కార్డును ఎంపిక చేసుకునే విషయంలో అయోమయానికి గురవుతుంటారు. అందుకే ఈ రెండు కార్డుల మధ్యగల వ్యత్యాసాన్ని గుర్తిస్తూ, ఏ కార్డు ఉత్తమనేది ఇప్పుడు తెలుసుకుందాం.
రూపే కార్డ్ భారతదేశంలో విస్తృతంగా ఆమోదం పొందిన కార్డు. దీనిని ఉపయోగించి అంతర్జాతీయ వెబ్‌సైట్‌లలో చెల్లింపులు చేయలేం. అయితే వీసా కార్డ్ అనేది దేశీయంగా, అంతర్జాతీయంగా విస్తృతంగా ఆమోదం పొందింది. ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలోనూ వీసా కార్డ్ సాయంతో చెల్లింపులు చేయవచ్చు.
వీసా కార్డ్ నెట్‌వర్క్‌లతో పోలిస్తే రూపే కార్డ్‌తో చేసే చెల్లింపులకు తక్కువ లావాదేవీ ఛార్జీలు కలిగివుంటాయి. ఈ కార్డ్ ద్వారా జరిగే ప్రతి లావాదేవీ భారతదేశంలోనే ప్రాసెస్ అవుతుంది. ఇక వీసా కార్డ్ అనేది అంతర్జాతీయ చెల్లింపు నెట్‌వర్క్ అయినందున, లావాదేవీ ప్రక్రియ దేశం వెలుపల జరుగుతుంది. అందుకే రూపేతో పోలిస్తే దీనికి అధికంగా ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.
రూపే కార్డ్ లావాదేవీలు వీసాతో పాటు ఇతర చెల్లింపు నెట్‌వర్క్‌ల కంటే వేగంగా జరగుతాయి. వీసా కార్డ్‌లో లావాదేవీల వేగం రూపేతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. రూపే కార్డ్ ప్రాథమిక లక్ష్యం ముఖ్యంగా దేశంలోని గ్రామీణులకు ఉపయుక్తం కావడం. భారతదేశంలో వీసా కార్డులు టైర్ వన్, టైర్ టూ నగరాల్లో ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి.
రూపే కార్డ్ - వీసా కార్డ్‌లలో ఏ కార్డ్ ఉత్తమం అనే విషయానికొస్తే అది వినియోగదారుని అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఎవరైనా దేశంలోనే లావాదేవీలు జరుపుతున్నట్లయితే వారికి రూపే కార్డ్ ఉత్తమ ఎంపిక. అంతర్జాతీయంగా లావాదేవీలు చేస్తూ లేదా తరచూ విదేశాలకు వెళుతున్నవారికి వీసా కార్డ్ ఉత్తమం. ఈ కార్డును ప్రపంచంలోని ఏ దేశంలోనైనా వినియోగించేందుకు అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment