
వ్యాపారం పెంచుకునే కొత్త మార్గం
యూపీఐకి లింక్ చేసుకుని చెల్లింపులు
ఈ ఫీచర్‌తో కస్టమర్లకు చేరువ
వినియోగంపై రివార్డు పాయింట్లు
మర్చంట్ భాగస్వాములతో టైఅప్
ఇప్పుడు దాదాపు అన్ని చెల్లింపులూ యూపీఐ ద్వారానే. లేదంటే పెద్ద లావాదేవీలకు క్రెడిట్ కార్డ్ వాడుతుంటారు. మరి క్యూఆర్ కోడ్ చెల్లింపులకు బ్యాంక్ ఖాతాలో కచ్చితంగా బ్యాలెన్స్ ఉండాలి. లేదంటే యూపీఐ లైట్ వ్యాలెట్‌లో అయినా బ్యాలెన్స్ లోడ్ చేసుకోవాలి. ఈ రెండూ లేకుండా రూపే క్రెడిట్ కార్డుతో క్యూఆర్ కోడ్ చెల్లింపులకు గతేడాదే ఆర్‌బీఐ వీలు కల్పించింది.
ఇప్పటి వరకు ఇదేమంత ప్రచారానికి నోచుకోలేదు. కానీ, ఇప్పుడు ఫిన్‌టెక్ కంపెనీలు రూపే క్రెడిట్ కార్డుల మార్కెటింగ్‌ను భుజానికెత్తుకున్నాయి. రియో, కివి, క్రెడిట్‌పే తదితర ఫిన్‌టెక్ సంస్థలు బ్యాంకులతో టైఅప్ అయి రూపే క్రెడిట్ కార్డులను కస్టమర్లకు అందిస్తూ, వాటిపై కమీషన్ పొందుతున్నాయి. ప్రముఖ రిటైల్ సంస్థలు, వర్తకులతోనూ చేతులు కలిపి రూపే కార్డు వినియోగంపై చక్కని ఆఫర్లు ఇస్తున్నాయి.
యూపీఐకి అనుసంధానించుకుని చెల్లింపులు చేసుకునే వెసులుబాటు ఉండడంతో రూపే క్రెడిట్‌కార్డుతో కొత్త యూజర్లకు ఫిన్‌టెక్‌లు సులభంగా చేరువ అవుతున్నాయి. చిన్న వర్తకుల వద్ద పీవోఎస్ యంత్రాలు లేకపోవడంతో క్రెడిట్ కార్డులతో చెల్లింపులకు అవకాశం ఉండేది కాదు. పీవోఎస్ లేకపోయినా రూపే కార్డ్‌తో చెల్లింపులు చేసుకోవడం కస్టమర్లను ఆకర్షిస్తోంది. ‘‘పీవోఎస్ మెషిన్ లేని వర్తకుల వద్ద చెల్లింపులకు వీలు కలి్పంచే ఏకైక కార్డ్ రూపే క్రెడిట్ కార్డ్’’అని సూపర్.మనీ వ్యవస్థాపకుడు, సీఈవో ప్రకాశ్ సికారియా తెలిపారు.
పీవోఎస్ లేని వర్తకుల సంఖ్య కోట్లలో ఉంటుంది. దీంతో రూపే కార్డుల రూపంలో ఫిన్‌టెక్‌లకు పెద్ద మార్కెట్టే అందుబాటులోకి వచి్చనట్టయింది. కివి సంస్థ వర్చువల్ రూపే క్రెడిట్ కార్డ్ ప్లాట్‌ఫామ్ నిర్వహిస్తోంది. నెలవారీ రూ.300 కోట్ల విలువైన వ్యాపారాన్ని నమోదు చేస్తోంది. ‘‘కస్టమర్లు యూపీఐ లావాదేవీలను క్రెడిట్ కార్డ్‌తో చేయడం మొదలు పెడితే, సేవింగ్స్ ఖాతా అనుసంధానిత యూపీఐ నుంచి మారిపోతారన్నది మా నమ్మకం. ఎందుకంటే ఇందులో సౌలభ్యంతోపాటు మెరుగైన అనుభవం లభిస్తుంది’’అని కివి సహ వ్యవస్థాపకుడు, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మోహిత్ బేడి అభిప్రాయపడ్డారు.
ఆఫర్లతో గాలం..
‘‘యూపీఐ చెల్లింపుల పరంగా సౌకర్యవంతమైన సాధనం. క్రెడిట్ కార్డులన్నవి రివార్డులు, ప్రయోజనాలకు పెట్టింది పేరు. ఈ రెండింటి కలయికతో కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలు, రివార్డులు అందించే ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం’’అని సికారియా వివరించారు. కివి జారీ చేసే వర్చువల్ రూపే క్రెడిట్ కార్డ్‌పై 40–50 రోజుల వడ్డీ రహిత (క్రెడిట్ ఫ్రీ) కాలం అమలవుతుంది. దీనికి అదనంగా వ్యయంపై రివార్డులను అందిస్తోంది. ఎయిర్‌పోర్టుల్లో యూపీఐ ఆధారిత లాంజ్ ప్రవేశాలకూ వీలు కలి్పస్తోంది. పెద్ద వర్తకులతో టైఅప్ పెట్టుకుని క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్‌లను సైతం ఫిన్‌టెక్‌లు ఆఫర్ చేస్తుండడంతో కస్టమర్లు సైతం రూపే క్రెడిట్ కార్డులను తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు.
మధ్యవర్తిత్వ పాత్రతో ఆదాయం..
చాలా వరకు ఫిన్‌టెక్‌లు కేవలం మధ్యవర్తిత్వ పాత్రకే పరిమితమవుతున్నాయి. ఇవి నేరుగా క్రెడిట్ కార్డులు జారీ చేయవు. బ్యాంక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుని పంపిణీ, ఇతర సేవలను అందించడానికి పరిమితమవుతున్నాయి. కార్డు యాక్టివేషన్‌పై కొంత మొత్తం చార్జీ కింద, కార్డు వినియోగంపైనా ప్రయోజనాలను అందుకుంటున్నాయి. సంప్రదాయ క్రెడిట్ కార్డులపై యూజర్లు నెలవారీ 8–9 లావాదేవీలు చేస్తుంటే.. యూపీఐ లింక్డ్ రూపే క్రెడిట్ కార్డుపై దీనికి రెట్టింపు స్థాయిలో ఉండడం గమనార్హం. కివి ప్లాట్‌ఫామ్ ద్వారా జారీ అవుతున్న రూపే క్రెడిట్ కార్డుపై నెలవారీగా ఒక్కో యూజర్ సగటున 22 నుంచి 24 లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. దీనివల్ల కస్టమర్లను నిలుపుకోవడంతోపాటు, అధిక లావాదేవీల రూపంలో ఫిన్‌టెక్‌లకు స్థిరమైన ఆదాయం లభిస్తోంది. తొలిసారి క్రెడిట్ యూజర్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సెక్యూర్డ్ రూపే క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. యూపీఐపై క్రెడిట్ లైన్ సేవలను
అందిస్తున్నాయి.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment