
2024-25 ఆర్ధిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో అందరూ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. అయితే ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌కు చెందిన ఒక జ్యూస్ వ్యాపారి.. తనకు వచ్చిన ట్యాక్స్ నోటీస్ చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌కు చెందిన మొహమ్మద్ రహీస్ జ్యూస్ అమ్ముకుంటూ జీవినం సాగిస్తున్నారు. మార్చి 18న అతనికి ఆదాయపు పన్ను శాఖ ట్యాక్స్ నోటీస్ పంపించింది. అందులో రూ. 7.79 కోట్లు ట్యాక్స్ చెల్లించాలని ఉంది. ఇది చూడగానే అతడు షాక్‌కు గురయ్యాడు. దీనిపై మార్చి 28 లోపల స్పందించాలని ఉండడంతో అతనికి ఏమి చేయాలో పాలుపోలేదు.
భారీ మొత్తంలో చెల్లించాలని వచ్చిన ట్యాక్స్ నోటీసు గురించి కనుక్కోవడానికి.. స్నేహితులను సంప్రదించారు. వారు సంబంధిత అధికారులను కలుసుకోమని సలహా ఇచ్చారు. అధికారులు సైతం అతనికి వచ్చిన ట్యాక్స్ చూసి ఆశ్చర్యపోయారు. తాను రోజుకు కేవలం రూ. 500 నుంచి రూ. 600 మాత్రమే సంపాదిస్తానని, పెద్ద లావాదేవీలు ఎప్పుడూ చేయాలని.. అధికారులతో చెప్పాడు.
ఇదీ చదవండి: మార్చి 31 డెడ్‌లైన్.. ఇవన్నీ పూర్తి చేశారా?
బాధితుని పాన్ కార్డు వివరాలు ఎవరో వినియోగించి ఉండవచ్చని ఆదాయపన్ను శాఖ అధికారులు వెల్లడించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చారు. తన వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దోషులను శిక్షించి జైలుకు పంపాలని రహీస్ కోరుకున్నాడు.