tax notice
-
హెచ్‌యూఎల్‌కు రూ.963 కోట్ల పన్ను నోటీసు
న్యూఢిల్లీ: ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) ఆదాయపన్ను శాఖ నుంచి రూ.963 కోట్లకు పన్ను నోటీసు అందుకుంది. అయితే దీనిపై చట్టప్రకారం అప్పీల్‌కు వెళ్లనున్నట్టు కంపెనీ ప్రకటించింది.హెచ్‌యూఎల్ లోగడ గ్లాక్సో స్మిత్‌క్లైన్ కన్జ్యూమర్ నుంచి హార్లిక్స్, బూస్ట్, మాల్టోవా, వివా బ్రాండ్లను, వాటికి సంబంధించి మేధో సంపత్తి హక్కులను కొనుగోలు చేసింది. ఇందుకు రూ.3,045 కోట్లు చెల్లించింది. దీనిపై టీడీఎస్ వసూలు చేయలేదు. దీంతో రూ.329 కోట్ల వడ్డీ సహా మొత్తం రూ.962.75 కోట్లు చెల్లించాలంటూ ఆదాయపన్ను శాఖ నోటీసు జారీ చేసింది.నాటి చెల్లింపులపై టీడీఎస్ వసూలు చేయకపోవడం వెనుక చట్టబద్ధమైన సహేతుకత ఉన్నట్టు హెచ్‌యూఎల్ పేర్కొంది. కనిపించని ఆస్తుల (ఇంటాంజిబుల్) విక్రయం ద్వారా వచ్చే ఆదాయం భారతీయ పన్ను చట్టాల పరిధిలోకి రాదని తెలిపింది. -
ప్రముఖ సంస్థకు రూ.9.5 కోట్ల ట్యాక్స్ నోటీసులు!
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో రూ.9.5 కోట్ల విలువైన ట్యాక్స్ నోటీసులు అందుకుంది. కర్ణాటక కమర్షియల్ టాక్స్ అథారిటీ అధికారుల నుంచి ఈ మేరకు నోటీసులు అందినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.2020 ఆర్థిక సంవత్సరానికిగాను ఫైల్ చేసిన ట్యాక్స్ మినహాయింపులో భాగంగా కంపెనీ అధికంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందినట్లు అధికారులు నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసులకు వ్యతిరేకంగా అప్పీల్‌ను దాఖలు చేస్తామని కంపెనీ ఫైలింగ్‌లో చెప్పింది. గతంలోనూ కంపెనీ చాలాసార్లు ట్యాక్స్ నోటీసులు అందుకుంది. ఇతర దేశాల్లోని కంపెనీ అనుబంధ సంస్థలకు అందించిన ఎగుమతి సేవలకు సంబంధించి 2024 ఏప్రిల్ 20న చివరిగా రూ.11.82 కోట్ల ట్యాక్స్ నోటీసులు అందాయి. అంతకుముందు ఏప్రిల్ 1న కర్ణాటక వాణిజ్య పన్నుల అథారిటీ నుంచి రూ.23 కోట్ల అదనపు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందడంపై పన్ను నోటీసులు వచ్చాయి. మార్చి 15న గుజరాత్ రాష్ట్ర డిప్యూటీ కమిషనర్ నుంచి రూ.8.6 కోట్ల విలువైన నోటీసులు పొందినట్లు కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: కోక-కోలా అనుబంధ సంస్థ మూసివేతడిసెంబర్ 30, 31, 2023 తేదీల్లో వచ్చిన ట్యాక్స్ నోటీసుల ప్రకారం..కంపెనీ 2018లో రూ.4.2 కోట్లు తక్కువ జీఎస్టీ చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో దిల్లీ, కర్ణాటక అధికారుల నుంచి మూడు డిమాండ్ ఆర్డర్లను అందుకుంది. డిసెంబర్ 28న వినియోగదారుల నుంచి వసూలు చేసిన డెలివరీ ఛార్జీలపై పన్నును చెల్లించనందుకు జీఎస్టీ అధికారుల నుంచి రూ.402 కోట్ల విలువైన షోకాజ్ నోటీసులు అందాయని కంపెనీ తెలిపింది. ఆ సమయంలో కంపెనీ వివరణ ఇస్తూ.. సంస్థ తన డెలివరీ భాగస్వాముల తరఫున మాత్రమే ఫీజులను సేకరిస్తుంది కాబట్టి ఈ పన్నులను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. -
పాన్‌కార్డ్ జాగ్రత్త.. ఈ విద్యార్థికి జరిగిందే మీకూ జరగొచ్చు!
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ఓ కాలేజీ విద్యార్థికి ఆదాయపన్ను శాఖ నుంచి రూ.46 కోట్లకు ట్యాక్స్ నోటీసు వచ్చింది. మామూలు విద్యార్థికి అన్ని కోట్ల పన్ను నోటీసు రావడమేంటి అనుకుంటున్నారా? అతని పాన్ కార్డ్‌ను కొందరు దుర్వినియోగం చేశారు. దీంతో ఆ విద్యార్థికి ఐటీ నోటీసు వచ్చింది. తనకు తెలియకుండా తన బ్యాంకు ఖాతా నుండి రూ.46 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గ్వాలియర్‌కు చెందిన ప్రమోద్ కుమార్ దండోటియా అనే కాలేజీ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో 2021లో తన పాన్‌కార్డ్ నెంబర్‌తో ఓ కంపెనీ ప్రారంభించి లావాదేవీలు నిర్వహించారని ఆదాయపు పన్ను శాఖ, జీఎస్టీ విభాగాల నుంచి నోటీసు వచ్చినట్లు పేర్కొన్నాడు. ఇది ఎలా జరిగిందో తనకు తెలియదని, తన పాన్ కార్డ్ దుర్వినియోగం అయినట్లు వాపోయాడు. ఆదాయపు పన్ను శాఖ నుంచి సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు ప్రమోద్ కుమార్ తెలిపారు. ఆ తర్వాత పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. శుక్రవారం మరోసారి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. బాధితుడి నుంచి ఫిర్యాదు అందిందని, మొత్తం వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు ఏసీపీ తెలిపారు. -
పాన్ కార్డ్ స్కాం: టీచర్ చనిపోయిన పదేళ్లకు రూ.7 కోట్ల ట్యాక్స్ నోటీసు..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఓ కుటుంబానికి విచిత్రమైన సంఘటన ఎదురైంది. ఆ కుటుంబానికి చెందిన స్కూల్ టీచర్ పేరిట రూ.7 కోట్ల ట్యాక్సీ నోటీసు వచ్చింది. అయితే.. ఆ టీచర్ చనిపోయిన పదేళ్ల తర్వాత ఈ నోటీసులు రావడం గమనార్హం. 2013లో ఆ టీచర్ చనిపోగా.. 2017-18 ఏడాదికి గాను ఆమె పేరిట ఇంత మొత్తంలో పన్ను వసూలు నోటీసులు వచ్చాయి. ఉషా సోని మధ్యప్రదేశ్‌లోని పట్కేటా గ్రామంలో టీచర్‌గా పనిచేస్తున్నారు. జులై 26న ఆమె పేరిట రూ.7.55 కోట్ల ట్యాక్సీ వసూలుకు చెందిన ఆదేశాలు ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాయి. ఈ ఘటనపై స్పందించిన ఆమె కుమారుడు పవన్ సోనీ.. మాట్లాడుతూ..' 2013 నవంబర్ 16న మా తల్లి చనిపోయింది. న్యాచురల్ కాస్టింగ్ సంస్థ పేరుపై ముడి సరుకులు కొనుగోలుకు సంబంధించి ఈ ట్యాక్స్ చెల్లించాలని నోటీసులో ఉంది. కేసు నమోదు చేశాము. మా అమ్మ పాన్ కార్డులను ఎవరో దుర్వినియోగం చేస్తున్నారు. ఎవరో మాకు తెలియదు.' అని అన్నారు. మధ్యప్రదేశ్‌లో ఈ ఒక్క కుటుంబమే కాదు. అనేక కుటుంబాలకు ఇలాంటి ఘటనలే ఎదురవుతున్నాయి. గిరిజన ప్రాంతాలైన బేతూల్ జిల్లాలో దాదాపుగా 44 మందికి ఇలాంటి నోటీసులు వచ్చాయి. దాదాపు రూ.1 కోటి నుంచి రూ.10 కోట్ల వరకు నోటీసులు వచ్చాయి. నితిన్ జైన్ అనే మరోవ్యక్తికి కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. నెలకు రూ.5 నుంచి 7 వేల వరకు సంపాదించే సామర్థ్యం గల ఇతనిపై రూ.1.26కోట్ల పన్ను వసూలుకు సంబంధించిన నోటీసులు వచ్చాయి. తమిళనాడులోని కోర్టల్లమ్‌లో తన పేరుపై ఓ అకౌంట్ ఉంది. ఈ పేరును ఇదే మొదటిసారి వినడమని నితిన్ తెలిపారు. 2014-15 మధ్య తన పేరుపై అకౌంట్ ఓపెన్ అయినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఈ ఘటనలపై బేతూల్ ఎస్పీ సిద్ధార్ద చౌదరి స్పందించారు. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: జైపూర్ కాల్పుల ఘటన.. ఆ రోజు రాత్రి రైలులో ఏం జరిగింది..? -
స్టార్టప్ లకు పన్ను దెబ్బ తగలనుందా...?
ముంబై : మార్కెట్ వాల్యుయేషన్ తక్కువున్న స్టార్టప్ లకు పన్ను దెబ్బ తగలనుంది. ఫండింగ్ లు ఎక్కువగా వస్తూ.. మార్కెట్ వాల్యుయేషన్ పెంచుకోలేని స్టార్టప్ లకు పన్నులు వేయాలని ఆదాయపు పన్ను విభాగం యోచిస్తోంది. మార్కెట్ వాల్యుయేషన్ పడిపోతున్న స్టార్టప్ లతో ఆదాయపు పన్ను విభాగం చర్చిస్తోందని తెలుస్తోంది. ఇటీవల కాలంలో చాలా స్టార్టప్ కంపెనీలు వాల్యుయేషన్ పెంచుకోలేకపోతున్నాయి.. లాభాలు, వృద్ధితో పాటు పోటీని తట్టుకోలేక స్టార్టప్ లకి ఈ దెబ్బ తగులుతోంది. మార్కెట్లో ఇష్యూ చేసిన షేర్ల కంటే ఫేర్ వాల్యు ఎక్కువ కలిగిఉంటే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 56 ప్రకారం పన్నులు విధించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు స్టార్టప్ కంపెనీల వాల్యుయేషన్ పై ఆదాయపు పన్ను అధికారులు రిపోర్టులు నివేదించమని ఆదేశిస్తున్నారు. సెక్యురిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా, ఏంజెల్ ఇన్వెస్టర్లు దగ్గర నమోదుకాని స్టార్టప్ లకు ఈ పన్ను ప్రభావం ఎక్కువగా ఉండనుందని తెలుస్తోంది. ఆదాయపు పన్ను విభాగం ప్రతిపాదిస్తున్న ఈ పన్ను విధానంపై స్టార్టప్ కమ్యూనిటీ ఇప్పటికే పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే ఈ ప్రతిపాదనపై ఆదాయపు పన్ను విభాగం నుంచి ఎలాంటి నోటీసులు అధికారికంగా జారీ కాలేదు. గతంలో చాలా స్టార్టప్ కంపెనీలు నల్లధనాన్ని ప్రీమియంకు ఆఫర్ చేస్తూ వైట్ మనీగా మార్చుకునే దుర్వినియోగాలకు పాల్పడినట్టు పన్ను అధికారులు చెప్పారు. ఈ దుర్వినియోగాలను దృష్టిలో ఉంచుకుని, మార్కెట్ వాల్యుయేషన్ పై దృష్టిసారించామని అధికారులు చెబుతున్నారు. రాండమ్ గా అడ్ జస్ట్ మెంట్లను తాము చూడటం లేదని, కానీ వాల్యుయేషన్‌లో పారదర్శకత కోల్పోతుండటం సీరియస్ గా తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే చాలా స్టార్టప్ కంపెనీలు పన్ను నోటీసులు అందుతాయేమోననే ఆందోళనతో, వారి కన్సల్టెన్సుతో, లాయర్లతో సంప్రదింపులు ప్రారంభించారు. -
ఉప్పల్ స్టేడియానికి నోటీస్
ఉప్పల్ : ఉప్పల్ క్రికెట్ స్టేడియంకు జీహెచ్ఎంసీ అధికారులు పన్ను నోటీసు జారీచేశారు. రూ.14.5 కోట్ల రూపాయల మేర ఆస్తి పన్ను ఆస్తి పన్ను బకాయి ఉండడంతో ఈ మేరకు డిమాండ్ నోటీస్‌ను ఉప్పల్ సర్కిల్ అధికారులు క్రికెట్ స్టేడియం అధికారులకు శుక్రవారం అందజేశారు.పన్ను చెల్లింపుపై గతంలోనే నోటీసులు జారీ చేసినా సరైన స్పందన లేదని అధికారులు తెలిపారు. వివరణ ఇచ్చేందుకు స్టేడియం అధికారులు ఒకరోజు గడువు కోరడంతో అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు.