ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో రూ.9.5 కోట్ల విలువైన ట్యాక్స్ నోటీసులు అందుకుంది. కర్ణాటక కమర్షియల్ టాక్స్ అథారిటీ అధికారుల నుంచి ఈ మేరకు నోటీసులు అందినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
2020 ఆర్థిక సంవత్సరానికిగాను ఫైల్ చేసిన ట్యాక్స్ మినహాయింపులో భాగంగా కంపెనీ అధికంగా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందినట్లు అధికారులు నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసులకు వ్యతిరేకంగా అప్పీల్‌ను దాఖలు చేస్తామని కంపెనీ ఫైలింగ్‌లో చెప్పింది. గతంలోనూ కంపెనీ చాలాసార్లు ట్యాక్స్ నోటీసులు అందుకుంది. ఇతర దేశాల్లోని కంపెనీ అనుబంధ సంస్థలకు అందించిన ఎగుమతి సేవలకు సంబంధించి 2024 ఏప్రిల్ 20న చివరిగా రూ.11.82 కోట్ల ట్యాక్స్ నోటీసులు అందాయి. అంతకుముందు ఏప్రిల్ 1న కర్ణాటక వాణిజ్య పన్నుల అథారిటీ నుంచి రూ.23 కోట్ల అదనపు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందడంపై పన్ను నోటీసులు వచ్చాయి. మార్చి 15న గుజరాత్ రాష్ట్ర డిప్యూటీ కమిషనర్ నుంచి రూ.8.6 కోట్ల విలువైన నోటీసులు పొందినట్లు కంపెనీ తెలిపింది.
ఇదీ చదవండి: కోక-కోలా అనుబంధ సంస్థ మూసివేత
డిసెంబర్ 30, 31, 2023 తేదీల్లో వచ్చిన ట్యాక్స్ నోటీసుల ప్రకారం..కంపెనీ 2018లో రూ.4.2 కోట్లు తక్కువ జీఎస్‌టీ చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో దిల్లీ, కర్ణాటక అధికారుల నుంచి మూడు డిమాండ్ ఆర్డర్‌లను అందుకుంది. డిసెంబర్ 28న వినియోగదారుల నుంచి వసూలు చేసిన డెలివరీ ఛార్జీలపై పన్నును చెల్లించనందుకు జీఎస్టీ అధికారుల నుంచి రూ.402 కోట్ల విలువైన షోకాజ్ నోటీసులు అందాయని కంపెనీ తెలిపింది. ఆ సమయంలో కంపెనీ వివరణ ఇస్తూ.. సంస్థ తన డెలివరీ భాగస్వాముల తరఫున మాత్రమే ఫీజులను సేకరిస్తుంది కాబట్టి ఈ పన్నులను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment