
ఆసియాలోనే అపర కుబేరుడైన ముఖేష్ అంబానీ అల్లుడికి భారీ ట్యాక్స్ నోటీసు వచ్చింది. ఇషా అంబానీకి భర్త అయిన ఆనంద్ పిరమల్ ప్రమోటర్‌గా ఉన్న రూ.19,675 కోట్ల పిరమల్ గ్రూప్ లో ప్రముఖ సంస్థ అయిన పిరమల్ ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.1,502 కోట్ల పన్ను డిమాండ్ నోటీసు అందింది.
2021 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తన ఫార్మా వ్యాపారాన్ని పిరమల్ ఫార్మా లిమిటెడ్‌కు విక్రయించడానికి సంబంధించి మహారాష్ట్ర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ ఈ నోటీసు జారీ చేశారు. రూ.4,487 కోట్ల విలువైన ఈ లావాదేవీలో అనుబంధ సంస్థల బదలాయింపు కూడా ఉంది. రూ.1,502 కోట్ల పన్ను డిమాండ్‌లో పన్ను మొత్తం రూ.837.17 కోట్లు కాగా వడ్డీ కింద రూ.581.53 కోట్లు, జరిమానాగా రూ.83.71 కోట్లు చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.
వివాదం ఇదే..
లావాదేవీ వర్గీకరణలోనే పన్ను వివాదం సారాంశం ఉంది. పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ అమ్మకాన్ని "స్లంప్ సేల్" గా వర్గీకరించింది. వ్యక్తిగత విలువలను కేటాయించకుండా ఆస్తులు, అప్పులతో సహా మొత్తం వ్యాపార సంస్థను బదిలీ చేస్తే దాన్ని స్లంప్ సేల్‌గా పేర్కొంటారు. ఇటువంటి అమ్మకాలు సాధారణంగా జీఎస్టీ పరిధిలోకి రావు. అయితే ఈ వర్గీకరణ తప్పని, ఈ లావాదేవీ "ఐటమైజ్డ్ సేల్" అని పన్ను అధికారులు వాదిస్తున్నారు. ఇక్కడ ఆస్తులు, అప్పులకు ప్రత్యేక విలువలు కేటాయించి మొత్తం అమ్మకాలపై 18 శాతం జీఎస్టీ విధించారు.
పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ స్పందన
పన్ను ఉత్తర్వులను పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ తీవ్రంగా ఖండించింది. ఈ డిమాండ్ సమంజసం కాదని భావించిన కంపెనీ ఈ తీర్పును సవాలు చేయడానికి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. "కంపెనీ తన ఉత్తమ ప్రయోజనాల కోసం తగిన చర్యలు తీసుకుంటుంది. ఆర్డర్ ను పక్కన పెట్టడం వల్ల సానుకూల ఫలితం ఉంటుందని సహేతుకంగా ఆశిస్తున్నాము. ఈ ఆర్డర్ కంపెనీ లాభనష్టాల ప్రకటనపై ఎలాంటి ప్రభావం చూపదు" అని రెగ్యులేటరీ ఫైలింగ్ లో పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ పేర్కొంది.
ఇది చదివారా? అంబానీ వారసులలో ఎవరు ఎక్కువ రిచ్?
ఆర్థిక ప్రభావం
పన్ను వివాదం కొనసాగుతున్నప్పటికీ, పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ 2024 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో రూ .38.6 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.2,476 కోట్లతో పోలిస్తే 1.1 శాతం క్షీణతతో రూ.2,449 కోట్లకు పరిమితమైంది. వడ్డీ, పన్ను, తరుగుదల, ఎమోర్టైజేషన్ (ఇబిటా) ముందు ఆదాయం 10.8 శాతం క్షీణించి రూ.1,075 కోట్లకు పరిమితమైంది.
Comments
Please login to add a commentAdd a comment