
భారతదేశంలో లో-కార్బన్ అల్యూమినియం ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి సాధ్యాసాధ్యాలను అన్వేషించేందుకు రియో టింటో, ఏఎంజీ మెటల్స్ అండ్ మెటీరియల్స్ (ఏఎమ్‌జీ ఎం అండ్ ఎం) అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఏడాదికి ఒక మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) ప్రైమరీ అల్యూమినియం, రెండు ఎంటీపీఏ అల్యూమినాను పంప్డ్ హైడ్రో స్టోరేజీ ద్వారా ఉత్పత్తి చేయాలని పవన, సౌరశక్తితో నడిచే ఈ ప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రాజెక్ట్ ప్రారంభ దశలో భారతదేశంలోని వ్యూహాత్మక ప్రదేశంలో సంవత్సరానికి 5,00,000 టన్నుల అల్యూమినియం స్మెల్టర్ సాధ్యాసాధ్యాలను అంచనా వేస్తారు. ఏఎంజీ ఎం అండ్ ఎం స్థిరమైన పునరుత్పాదక ఇంధన పరిష్కారాన్ని అభివృద్ధి చేయడానికి గ్రీన్‌కోతో కలిసి పనిచేస్తుంది. అదే సమయంలో రియో టింటో వాణిజ్య అల్యూమినా సరఫరా గొలుసును అన్వేషిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా అల్యూమినియం డిమాండ్ సరాసరి 70 మిలియన్ టన్నులకు చేరుకుంది. భారతదేశం రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా, మూడో అతిపెద్ద వినియోగదారుగా ఉంది. ఆటోమోటివ్, నిర్మాణం, కన్జూమర్ ప్యాకేజింగ్ వంటి పరిశ్రమలకు లో-కార్బన్ అల్యూమినియంను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రాజెక్ట్ ప్రపంచ సుస్థిరత ప్రయత్నాలకు అనుగుణంగా ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: భారత్‌లో పత్తి పండుతున్నా దిగుమతులెందుకు?
రియో టింటో అల్యూమినియం చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెరోమ్ పెక్రెస్ మాట్లాడుతూ.. భారతదేశం వేగవంతమైన ఆర్థిక వృద్ధి ఈ ప్రాజెక్ట్‌కు ఎంతో తోడ్పడుతుందని చెప్పారు. ఏఎంజీ ఎం అండ్ ఎం అండ్ గ్రీన్‌కో గ్రూప్ ప్రెసిడెంట్ మహేష్ కొల్లి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు వివిధ పరిశ్రమల్లో డీకార్బనైజేషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.