
వీధి వ్యాపారులు ముఖ్యంగా పానీపూరి విక్రేతలు ఏ స్థాయిలో సంపాదిస్తున్నారో తెలిపే ఉదంతం ఇది. కొంత మంది వ్యాపారులు రూ.లక్షల్లో సంపాదిస్తున్నా ప్రభుత్వానికి ఎటువంటి పన్నులు కట్టడం లేదు. ఇలాగే ట్యాక్స్ (Tax) కట్టకుండా రూ.లక్షల్లో వ్యాపారం చేస్తున్న పానీపూరి విక్రేతకు (PANIPURI WALA) జీఎస్టీ డిపార్ట్‌మెంట్ షాక్ ఇచ్చింది.
తమిళనాడులో సంవత్సరానికి రూ.40 లక్షలు సంపాదిస్తున్న పానీపూరీ విక్రేతకు జీఎస్టీ డిపార్ట్‌మెంట్ పన్ను నోటీసు ఇచ్చింది. ఫోన్‌పే (Phonepe), రేజర్‌పే (Razor Pay) రికార్డ్‌ల ఆధారంగా పానీపూరి వాలాకు నోటీసు పంపింది. ఇది కేవలం ఆన్‌లైన్ చెల్లింపు మాత్రమే. ఇక నగదు రూపంలో ఎంత సంపాదించి ఉంటాడో ఊహించండి.
“రేజర్‌పే, ఫోన్‌పేల నుండి అందిన నివేదికల ఆధారంగా మీరు వస్తువులు/సేవల సరఫరా కోసం పరిమితికి మించి యూపీఐ (UPI) చెల్లింపులను స్వీకరించారు. 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాలకు మీరు అందుకున్న మొత్తం చెల్లింపులు రూ.40,11,019” అని నోటీసులో జీఎస్టీ అధికారులు పేర్కొన్నారు. జీఎస్టీ చట్టం నిబంధనల ప్రకారం సదరు వ్యాపారి నమోదు చేసుకోలేదని తెలిపారు.
జీఎస్టీ చట్టం 2017 సెక్షన్ 22లోని సబ్‌సెక్షన్ (1) ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల మొత్తం టర్నోవర్ కలిగిన ప్రతి వ్యాపారి తప్పనిసరిగా జీఎస్టీ నమోదు చేసుకోవాలి. పరిమితిని దాటిన తర్వాత కూడా జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేకుండా వ్యాపారం చేయడం నేరం. ఇందుకుగానూ రూ.10,000 లేదా టర్నోవర్‌లో 10% వరకు జరిమానా విధిస్తారు.
Pani puri wala makes 40L per year and gets an income tax notice 🤑🤑 pic.twitter.com/yotdWohZG6
— Jagdish Chaturvedi (@DrJagdishChatur) January 2, 2025