
గూగుల్ భారత్‌లో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోందని వార్తలొస్తున్నాయి. వాటిలోని వివరాల ప్రకారం ప్రధానంగా బెంగళూరు, హైదరాబాద్ కార్యాలయాల్లో పని చేస్తున్న వారిపై ఈ ప్రభావం పడనుంది. ప్రకటనలు, సేల్స్ అండ్ మార్కెటింగ్ బృందాల్లోని వారికి లేఆఫ్స్ ప్రకటించే అవకాశం ఉంది. దేశంలో ఉద్యోగుల తొలగింపును గూగుల్ అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ లేఆఫ్స్ ప్రక్రియ వచ్చే వారం ప్రారంభం కానుందని బిజినెస్ స్టాండర్డ్ అంచనా వేసింది.
గూగుల్ ప్లాట్‌ఫామ్స్ అండ్ డివైజెస్ విభాగంలో ఇటీవల జరిగిన పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది ఉద్యోగులను ఇప్పటికే తొలగించారు. తాజాగా మళ్లీ ఇలా లేఆఫ్స్ వార్తలు వస్తుండడం ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమవుతుంది. ఈ విభాగం ఆండ్రాయిడ్, పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లు, క్రోమ్ బ్రౌజర్ వంటి కీలక ఉత్పత్తులను పర్యవేక్షిస్తుంది. అభివృద్ధి చెందుతున్న వ్యాపార ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉండటానికి సంస్థ ప్రయత్నిస్తున్నందున నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టబోతున్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి: కోత కోసి.. పూత పూసి..
అయితే భారత్‌లో మాత్రం ఇంజినీరింగ్ ఉద్యోగాలకు సంబంధించి గూగుల్ కాస్త మెరుగ్గా వ్యవహరిస్తుందని కూడా నివేదిక వెల్లడించింది. హైదరాబాద్, బెంగళూరు క్యాంపస్‌ల్లో టెక్నికల్ పొజిషన్లలో ఉన్న ఉద్యోగులను నేరుగా తొలగించడానికి బదులుగా ఆదాయం సమకూరే ఇతర ప్రాజెక్టుల్లో కేటాయించే అవకాశం ఉందని తెలిపింది. కంపెనీ ఇటీవల అంతర్గత నిర్మాణంలో విస్తృత మార్పులు చేసింది. గత సంవత్సరం తన ప్లాట్‌ఫామ్స్, డివైజెస్ బృందాలను విలీనం చేసింది. దాంతో భవిష్యత్తులో శ్రామిక శక్తి తగ్గింపు కోసం ఉద్యోగులకు స్వచ్ఛంద విరమణ పథకాలను ప్రవేశపెట్టింది. విలీనం తర్వాత ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా కొన్ని తొలగింపులు జరిగాయని ఈ ఏడాది ప్రారంభంలో గూగుల్ ప్రతినిధి ఒకరు అంగీకరించారు. కంపెనీ నుంచి స్వచ్ఛందంగా నిష్క్రమించడానికి జనవరిలో తమ ఉద్యోగులకు కొన్ని ఆఫర్లు ఇచ్చినట్లు గూగుల్ ధ్రువీకరించింది.