
తక్కువ పనితీరు కనబరుస్తున్న ఉద్యోగులకు రెండు ఆప్షన్లు ఇచ్చేలా మైక్రోసాఫ్ట్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఒకటి.. పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్(పనితీరు మెరుగుదల కార్యక్రమం-పీఐపీ). ఇందులో భాగంగా కఠినమైన లక్ష్యాలను అంగీకరించి, అందుకు తగ్గట్టుగా నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ఉద్యోగులు వృత్తిపరంగా తమనుతాము నిరూపించుకోవాల్సి ఉంటుంది. రెండోది.. కంపెనీ ఆఫర్ చేసిన ప్యాకేజీని తీసుకొని కంపెనీ నుంచి నిష్క్రమించడం. స్వచ్ఛందంగా వైదొలగాలనుకునే ఉద్యోగులకు కంపెనీ 16 వారాల వేతనాన్ని అందిస్తోంది. అయితే ఈ రెండు ఆప్షన్స్‌లో దేన్ని ఎంచుకుంటారనే దానిపై ఉద్యోగులు ఐదు రోజుల్లో స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది.
బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం మైక్రోసాఫ్ట్ కొత్త చీఫ్ పీపుల్ ఆఫీసర్ అమీ కోల్మన్ ఒక ఈమెయిల్‌లో ఈమేరకు వివరాలు వెల్లడించారు. ‘అధిక పనితీరును వేగవంతం చేయడానికి, తక్కువ పనితీరు సమస్యను అంతే వేగంగా పరిష్కరించడానికి ఈ విధానం మెరుగైన సాధనంగా తోడ్పడుతుంది’ అని ప్రకటించారు. మైక్రోసాఫ్ట్‌లో పీఐపీలు ఎంచుకున్న ఉద్యోగులు వారి పనితీరును బెంచ్‌మార్క్‌తో రుజువు చేసుకోవాల్సి ఉంటుంది లేదా కంపెనీ కొత్తగా ప్రవేశపెట్టిన ‘గ్లోబల్ వాలంటరీ సెపరేషన్ అగ్రిమెంట్ (జీవీఎస్‌ఏ) కింద సెవెరెన్స్ ప్యాకేజీని ఎంచుకోవాలని ఈమెయిల్‌లో సూచించారు. పీఐపీ మార్గాన్ని ఎంచుకున్న వారు సెవెరెన్స్ ప్రయోజనాలను కోల్పోతారని కంపెనీ తెలిపింది. అందుకు సంబంధించి ఉద్యోగులు ఐదు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఈమెయిల్‌లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ‘మీరూ జాగ్రత్తగా ఉండాలి’
పీఐపీ సమయంలో పేలవమైన పనితీరు ప్రదర్శించిన ఉద్యోగులపై రెండేళ్లపాటు తిరిగి సంస్థలో చేరకుండా నిషేధం విధిస్తూ ఈ విధానం నిర్ణయం తీసుకుంది. పనితీరు తక్కువగా ఉన్న సిబ్బందిని మైక్రోసాఫ్ట్‌లోని ఇతర ప్రాజెక్ట్‌ల్లో బదిలీ చేయకుండా కూడా ఈ విధానం పరిమితులు విధించింది. మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది ప్రారంభంలో తక్కువ పనితీరు కనబరిచిన సుమారు 2,000 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన, పారదర్శకమైన సర్వీసులు అందించడానికి, జవాబుదారీతనం, పనితీరును బలోపేతం చేయడానికి ఈ కొత్త చర్యలు రూపొందించినట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ కోల్మన్ తెలిపారు.