
లేఆఫ్‌లలో అమెరికన్ ఉద్యోగుల పట్ల వివిక్ష చూపుతోందంటూ వచ్చిన ఆరోపణలను భారత్‌కు చెందిన ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఖండించింది. ఈ ఆరోపణలు సంస్థ "నిరాధారమైనవి, తప్పుడు అభిప్రాయాలు" అని పేర్కొంది. తమది అందరికీ సమాన అవకాశాలు కల్పించే సంస్థ అని, సమగ్రతలో గొప్ప రికార్డ్‌ను కలిగి ఉందని టీసీఎస్ వివరించింది.
40 ఏళ్లకు పైబడిన, దక్షిణ ఆసియన్‌లు కాని తమను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాల నుంచి టీసీఎస్ తొలగించిందని, కానీ H-1B వీసాలపై ఉన్న భారతీయ ఉద్యోగులను మాత్రం కొనసాగించిందని కొందరు మాజీ ఉద్యోగులు ఆరోపించారు. 2023 చివర నుండి ఇలాంటి ఆరోపణలు వస్తుండటంతో యూఎస్ ఈక్వల్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ కమిషన్ (EEOC) దీనిపై విచారణ చేపట్టింది. యుకేలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పటికీ, టీసీఎస్ దానిని కూడా ఖండించింది.
టీసీఎస్‌పై వచ్చిన ఆరోపణలు ఇతర ఐటీ సంస్థల ఉద్యోగ విధానాలపైనా ప్రభావం చూపవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టీసీఎస్‌పై వచ్చిన ఆరోపణలు ఎలా ఉన్నా నేటి కార్పొరేట్ వాతావరణంలో నలభైలలో ఉన్న ఉద్యోగులే తొలగింపులకు తొలి లక్ష్యంగా మారుతున్నారని బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ శంతను దేశ్ పాండే కూడా ఇటీవల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
పిల్లల చదువులు, వృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యతలు, ఇంటి కోసం చేసిన అప్పుల ఈఎంఐలు ఇలా సవా లక్ష ఆర్థిక భారాలను నలభైలలోకి అడుగుపెట్టిన ఉద్యోగులు మోస్తున్నారని దేశ్‌పాండే ఇటీవలి సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇంతటి సమస్యలతో నెట్టుకొస్తున్న వీరినే కంపెనీలు టార్గెట్ చేస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. పునర్‌వ్యవస్థీకరణ, సిబ్బంది కుదింపు సందర్భాల్లో మొదట నలభైలలోని ఉద్యోగులనే తొలగించి ఇంటికి పంపిస్తున్నాయని అప్రమత్తం చేశారు.
ఈ వయస్సులో ఉద్యోగం కోల్పోవడం ఆర్థికంగా, మానసికంగా తీవ్ర అస్థిరతకు గురిచేస్తుందని దేశ్ పాండే హెచ్చరించారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని నిలబడేందుకు మూడు కీలకమైన మనుగడ వ్యూహాలను ఆయన అందించారు. కృత్రిమ మేధపై నైపుణ్యాన్ని పెంచుకోవాలని, పొదుపు ఎక్కువగా చేయాలని, వ్యవస్థాపక మనస్తత్వాన్ని అలవరచుకోవాలని సూచించారు.