దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)పై అమెరికన్ ఉద్యోగులు తీవ్ర ఆరోపణలు చేశారు. జాతి, వయసు ఆధారంగా టీసీఎస్ తమపై చట్టవిరుద్ధంగా వివక్ష చూపుతుందని, షార్ట్ నోటీసుతో తమను తొలగించి హెచ్1బీ వీసాలపై భారత్ నుంచి ఉద్యోగులను రిక్రూట్ చేస్తోందని అమెరికన్ ఉద్యోగుల బృందం ఆరోపించింది,
వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. డజన్ల కొద్దీ అతిపెద్ద అమెరికన్ క్లయింట్లు ఉన్న టీసీఎస్‌కు వ్యతిరేకంగా సుమారు 22 మంది అమెరికన్ ఉద్యోగులు యూఎస్ ఈక్వల్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తొలగింపునకు గురైన టీసీఎస్ మాజీ ఉద్యోగుల్లో యూఎస్‌లోని వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న కాకేసియన్లు, ఆసియన్-అమెరికన్లు, హిస్పానిక్ అమెరికన్లు, 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. వీరిలో ఎంబీఏ, ఇతర ఉన్నత డిగ్రీలున్నవారూ ఉండటం గమనార్హం.
అయితే ఈ ఆరోపణలను టీసీఎస్ ప్రతినిధి కొట్టిపారేశారు. 'చట్టవిరుద్ధమైన వివక్ష'కు సంబంధించిన ఆరోపణలు' అర్హత లేనివి, తప్పుదారి పట్టించేవి' అని తెలిపారు. "యూఎస్‌లో సమాన అవకాశాలు కల్పించే సంస్థగా టీసీఎస్ బలమైన రికార్డును కలిగి ఉంది. దాని కార్యకలాపాలలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది" అని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment