
ఉత్పత్తిని మరింతగా పెంచుదాం
పరిశ్రమకు ప్రధాని మోదీ పిలుపు
ముంబై: సవాళ్లను దీటుగా అధిగమించే, విప్లవాత్మకమైన, ఉక్కులాంటి దృఢమైన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడంలో పరిశ్రమ కూడా కలిసి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నిరాటంకంగా ముడి వస్తువుల సరఫరా ఉండేలా చూసుకునేందుకు అంతర్జాతీయంగా పటిష్టమైన భాగస్వామ్యాలను ఏర్పర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
దేశీయంగా ఉక్కు ఉత్పత్తిని పెంచేందుకు వినియోగంలో లేని గనుల నుంచి ఇనుప ఖనిజాన్ని వెలికితీయడంపై మరింతగా దృష్టి పెట్టాలని పరిశ్రమకు ఆయన సూచించారు. ఇండియా స్టీల్ 2025 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. ఉక్కు పరిశ్రమ ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్న రంగంగా ఆయన అభివర్ణించారు.
అభివృద్ధికి వెన్నెముక ఈ కమోడిటీ ఉత్పత్తిని మరింతగా పెంచాలని, కొత్త ప్రక్రియలను వినియోగంలోకి తేవాలని పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలు చేయడం, ఉత్తమ విధానాలను అమలు చేయడం, బొగ్గు దిగుమతులకు ప్రత్యామ్నాయాలను అన్వేíÙంచడంలాంటి అంశాలపై దృష్టి పెట్టాలని మోదీ సూచించారు. ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థలు తయారీ, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌కి సంబంధించి కొత్త ఆవిష్కరణలు చేయాలని, వాటిని పరస్పరం ఇచి్చపుచ్చుకోవాలని సూచించారు.
ముడి వస్తువులు సవాలే..
ఉక్కు రంగానికి నిరాటంకంగా ముడి వస్తువుల సరఫరా పెద్ద సవాలుగానే ఉంటోందని ప్రధాని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా భాగస్వామ్యాలను బలోపేతం చేసుకుని సరఫరా వ్యవస్థలను పటిష్టపర్చుకోవాలని చెప్పారు.
‘ఆందోళనకరమైన అంశాల్లో ముడి వస్తువుల సరఫరా కూడా ఒకటి. మనం ఇప్పటికీ నికెల్, కోకింగ్ కోల్, మ్యాంగనీస్ కోసం దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. కాబట్టి గ్లోబల్ భాగస్వామ్యాలను పటిష్టం చేసుకుంటూ, టెక్నాలజీలను అప్‌గ్రేడ్ చేసుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాలి‘ అని ప్రధాని చెప్పారు. భవిష్యత్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు పరిశ్రమ సన్నద్ధంగా ఉండాలని, కొత్త ప్రక్రియలను వినియోగంలోకి తేవాలని సూచించారు.
2024 ఆర్థిక సంవత్సరంలో 179 మిలియన్ టన్నులుగా ఉన్న ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 2030 నాటికి 300 మిలియన్ టన్నులకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. అలాగే తలసరి ఉక్కు వినియోగం కూడా 98 కేజీల నుంచి 160 కేజీలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
‘రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్టులు, పైప్‌లైన్లు ఇలా ఎన్నో పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఉక్కు రంగానికి కొత్త అవకాశాలే‘ అని మోదీ తెలిపారు. మెగా ప్రాజెక్టులు పెరుగుతుండటం వల్ల హై–గ్రేడ్ స్టీల్‌కి డిమాండ్ పెరుగుతుందన్నారు. యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కూడా కలి్పంచే రంగం కావడంతో ఉక్కు పరిశ్రమ చాలా కీలకమైనదని మోదీ చెప్పారు.