
న్యూఢిల్లీ: కీలక ఇంధనాలైన పెట్రోల్, డీజిల్ వినియోగం ఏప్రిల్‌లో పెరిగింది. వరుసగా కొన్ని నెలల పాటు క్షీణత అనంతరం 4 శాతం మేర అమ్మకాలు పెరిగాయి. ఏప్రిల్‌లో డీజిల్ వినియోగం 8.23 మిలియన్ టన్నులకు చేరుకుంది. క్రితం ఏడాది ఏప్రిల్ నెల అమ్మకాలతో పోల్చి చూస్తే 4 శాతం పెరిగినట్టు పెట్రోలియం ప్రణాళిక, విశ్లేషణ విభాగం (కేంద్ర పెట్రోలియం శాఖ పరిధిలోని) డేటా తెలియజేస్తోంది.
2023 ఏప్రిల్ నెల విక్రయాలతో పోల్చి చూసినా 5.3 శాతం మేర వినియోగం పెరిగింది. కరోనా ముందు నాటి సంవత్సరం 2019 ఏప్రిల్ నెల గణాంకాలతో పోల్చి చూస్తే 10.45 శాతం అధికం కావడం గమనించొచ్చు. కస్టమర్లు క్రమంగా ఎలక్ట్రిక్, పెట్రోల్ వేరియంట్ల వైపు మొగ్గు చూపిస్తుండడంతో డీజిల్ వినియోగంపై కొంత కాలంగా నెలకొన్న సందేహాలకు తాజా గణంకాలు తెరదించినట్టయింది. మొత్తం పెట్రోలియం ఇంధనాల్లో డీజిల్ వాటా 38 శాతంగా ఉంటుంది.
ఇక ఏప్రిల్ నెలలో పెట్రోల్ అమ్మకాలు సైతం క్రితం ఏడాది ఇదే నెల గణాంకాలతో పోల్చి చూస్తే 4.6 శాతం పెరిగి 3.43 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. గతేడాది ఏప్రిల్‌లో ఎన్నికల కారణంగా పెట్రోల్ అమ్మకాలు 19 శాతం వృద్ధిని నమోదు చేయగా, నాటి గరిష్ట పరిమితి మీద మెరుగైన వృద్ధి నమోదైంది. ఎల్‌పీజీ విక్రయాలు 6.7 శాతం పెరిగి 2.62 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు 3.25 శాతం తగ్గి 7,66,000 టన్నులుగా ఉన్నాయి.