న్యూఢిల్లీ: పెట్రోల్ విక్రయాలు జూలైలో గతేడాది ఇదే నెలతో పోల్చినప్పుడు 4 శాతం వరకు పెరిగాయి. 2.76 మిలియన్ టన్నుల అమ్మకాలు నమోదయ్యాయి. ముఖ్యంగా జూలై మాసంలో మొదటి 15 రోజుల్లో పెట్రోల్ వినియోగం తగ్గగా, తదుపరి 15 రోజుల్లో గణనీయంగా పుంజుకుంది. అయితే నెలవారీగా (జూన్‌తో పోలి్చనప్పుడు) చూస్తే పెట్రోల్ అమ్మకాలు 4.6 శాతం తగ్గాయి. మరోవైపు డీజిల్ అమ్మకాల్లో విరుద్ధమైన పరిస్థితి కనిపించింది.
ప్రధానంగా డీజిల్‌ను రవాణా రంగంలో వినియోగిస్తారు. కనుక, వర్షాల ప్రభావం వినియోగంపై పడినట్టు తెలుస్తోంది. డీజిల్ అమ్మకాలు 4.3 శాతం తగ్గి 6.15 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే పెట్రోలియం ఉత్పత్తి ఇదే కావడం గమనార్హం. వర్షాల సమయంలో ఏటా డీజిల్ అమ్మకాలు తగ్గుతుండడం సాధారణంగానే కనిపిస్తుంటుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 6.7 శాతం, మే నెలలో 9.3 శాతం చొప్పున డీజిల్ అమ్మకాలు పెరగడం గమనించొచ్చు.
ఇక ఈ ఏడాది జూన్ నెలలోని అమ్మకాలతో పోల్చి చూసినా, జూలైలో డీజిల్ విక్రయాలు (7.13 మిలియన్ టన్నులు) 13.7 శాతం తగ్గాయి. భారత్‌లో ఆయిల్ డిమాండ్ రోజువారీగా 0.2 మిలియన్ బ్యారెళ్ల చొప్పున 2023లో ఉంటుందని చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య ఓపెక్ అంచనాగా ఉంది. ఇక విమాన సేవలకు డిమాండ్ గణనీయంగా పెరగడంతో ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) డిమాండ్ సైతం 10 శాతం పెరిగి జూలైలో 6,03,500 టన్నులుగా నమోదైంది.
2021 జూలైలో వినియోగంతో పోలిస్తే రెట్టింపు కాగా, కరోనా ముందు నాటి సంవత్సరం 2019 జూలైలో వినియోగంతో పోల్చి చూస్తే 2.9 శాతం తక్కువగా ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. జూలైలో వంటగ్యాస్ (ఎల్‌పీజీ) అమ్మకాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోలి్చచూసినప్పుడు 1.7 శాతం తగ్గి 2.46 మిలియన్ టన్నులుగా నమోదైంది. జూన్ నెలతో పోల్చి చూస్తే కనుక 8 శాతం ఎల్‌పీజీ అమ్మకాలు పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment