Steel production
-
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ. 1,923 కోట్ల లాభం
విశాఖ స్టీల్‌ప్లాంట్ 2021–22 ఆర్ధిక సంవత్సరంలో రూ. 1,923 కోట్ల లాభం అర్జించింది. బుధవారం స్టీల్‌ప్లాంట్ 40వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో, స్టీల్‌ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ వాటాదారులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ ఏడాది ప్లాంట్ అత్యధికంగా రూ. 28,215 కోట్లు టర్నోవర్ సాధించిందని, గత ఏడాదితో పోలిస్తే 57 శాతం వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. అలాగే కంపెనీ ఆరేళ్ల తర్వాత పన్నుకు ముందు లాభాలను (పీబీటీ) అర్జించిందన్నారు. గత ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ అంతకు ముందు ఏడాది కంటే 148 శాతం వృధ్దితో రూ.3,469 కోట్ల ఎబిటా సాధించిందన్నారు. కోకింగ్ కోల్ సంక్షోభం కారణంగా క్యూ4లో కార్యకలాపాలు తగ్గినప్పటికి, అన్ని ప్రధాన ఉత్పత్తి రంగాల్లో అత్యుత్తమ పనితీరు నమోదు చేసిందన్నారు. స్టీల్‌ప్లాంట్ డైరెక్టర్లు కె.కె. ఘోష్, ఎ.కె. సక్సేనా, స్వతంత్ర డైరక్టర్లు సీతా సిన్హా, ఘన శ్యాం సింగ్, సునీల్ కుమార్ హిరానీ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉక్కు మంత్రిత్వశాఖ అండర్ సెక్రటరీ ఎస్. నారాయణస్వామి న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏజీఎంకు హాజరయ్యారు. చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్! -
స్టీల్ తయారీలో నంబర్ 1 కావాలి
న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో భారత్ స్టీల్ తయారీలో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానానికి చేరుకుంటుందన్న ఆశాభావాన్ని కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వ్యక్తం చేశారు. దేశీయంగా ఉత్పత్తి చేయబడిన ఉక్కు లేదా 'మేడ్ ఇన్ ఇండియా' ఉక్కును ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు, ప్రస్తుతం చైనా తర్వాత ముడి స్టీల్ తయారీలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఎన్ఎండీసీ, ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. భారత్ స్టీల్ విషయంలో నికర దిగుమతిదారు నుంచి నికర ఎగుమతిదారుగా అవతరించినట్టు చెప్పారు. తలసరి స్టీల్ వినియోగం 2013-14లో 57.8 కిలోలు ఉంటే, అది ఇప్పుడు 78 కిలోలకు పెరిగిందన్నారు. ఉక్కు రంగంలో అధిక కర్బన ఉద్గారాల విడుదలపై ఆందోళన వ్యక్తం చేసిన సింధియా, 2030 నాటికి ఈ స్థాయిలను 30 శాతం నుంచి 40 శాతానికి తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే 2030 నాటికి 300 మిలియన్ టన్నుల స్టీల్ తయారీని సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్ టర్నోవర్ రూ. 28,008 కోట్లు
ఉక్కునగరం (గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్ 2021–22లో ఉత్పత్తి, అమ్మకాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రికార్డులతో హోరెత్తిచ్చిందని కంపెనీ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ జీఎం బీఎస్ సత్యేంద్ర తెలిపారు. కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో 5.773 మిలియన్ టన్నుల హాట్‌మెటల్, 5.272 మిలియన్ టన్నుల క్రూడ్ స్టీల్, 5.138 మిలియన్ టన్నుల సేలబుల్ స్టీల్ ఉత్పత్తిని చేయడం ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యుత్తమైన ప్రగతి సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా కోకింగ్ బొగ్గు కొరత తీవ్రంగా ఉన్నప్పటికి స్టీల్‌ప్లాంట్ రూ. 28,008 కోట్లు టర్నోవర్ సాధించి ప్రారంభం నుంచి ఎన్నడూ లేని విధంగా అత్యుత్తమ విక్రయ పనితీరును నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే కాలం సాధించిన విక్రయాలు రూ. 17,956 కోట్లు కంటే 56 శాతం ఎక్కువ కావడం విశేషం. ఇక ఉత్పత్తిలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే .. బ్లాస్ట్‌ఫర్నేస్‌లో మొదటసారిగా పల్వరైజ్డ్ కోల్ ఇంజక్షన్ సరాసరి టన్ను హాట్మెటల్కు 100 కేజీలు సాధించింది. గత ఆర్ధిక సంవత్సరంలో ఆరు రోలింగ్ మిల్లులో 22 కొత్త హై ఎండ్ నవీన ఉత్పత్తులు అభివృద్ధి చేశారు. సంస్థ ఉత్పత్తులు, ఎగుమతుల విక్రయాలు రూ. 5,607 కోట్లు చేయడం ద్వారా గత ఏడాది కంటే 37 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు సత్యేంద్ర పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో రూ. 3501 కోట్లు అమ్మకాలు చేయడం ద్వార గత ఏడాది ఇదే వ్యవధి కంటే 6 శాతం వృద్ధిని నమోదు చేసిందన్నారు. గత ఏడాదిలో స్టీల్‌ప్లాంట్‌కు సీఐఐ గోద్రేజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు అందజేసింది. ఉత్తమ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ ఎల్డీ గ్యాస్ హోల్డర్ ఇంటర్ కనెక్షన్ కోసం ప్రతిష్టాత్మక అవార్డును అందుకుంది. ఈ సందర్భంగా స్టీల్‌ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల నిబద్ధత, పనితీరును అభినందించారు. -
120 ఎంటీకి స్టీల్ ఉత్పత్తి!
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2021–22)లో దేశీ స్టీల్ ఉత్పత్తి 120 మిలియన్ టన్నులకు చేరే వీలున్నట్లు ఉక్కు మంత్రిత్వ శాఖ సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తీ తాజాగా అంచనా వేశారు. ఇది 18 శాతం వృద్ధికాగా.. డిమాండ్ సైతం 100 ఎంటీని తాకవచ్చని పేర్కొన్నారు. అధికారిక లెక్కల ప్రకారం గతేడాది(2020–21)లో 6 శాతం తక్కువగా 102 ఎంటీ స్టీల్ తయారయ్యింది. కోవిడ్–19 కట్టడికి లాక్డౌన్ల అమలు ప్రభావం చూపింది. కాగా.. 2021 ఏప్రిల్–జూన్‌లో దేశీయంగా స్టీల్ ఉత్పత్తి 45 శాతం జంప్‌చేసింది. 37.52 ఎంటీని తాకింది. దీంతో ఈ ఏడాది 115–120 ఎంటీని స్టీల్‌ను తయారు చేయగలమన్న ధీమాతో ఉన్నట్లు సింగ్ తెలియజేశారు. జాతీయ స్టీల్ పాలసీ 2017లో భాగంగా ప్రభుత్వం 2030–31కల్లా 300 ఎంటీ స్టీల్ ఉత్పత్తిని అందుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కరోనా నేపథ్యంలో గతేడాది దేశీ స్టీల్ వినియోగం దాదాపు 7 శాతం క్షీణించి 93.43 ఎంటీకి పరిమితమైనట్లు వెల్లడించారు. ప్రభుత్వం రూ. 100 లక్షల కోట్ల జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్‌ను ప్రకటించిందని, ఈ పథకం ప్రకారం వివిధ ప్రాజెక్టులకు భారీ స్థాయిలో స్టీల్ వినియోగం ఉంటుందని వివరించారు. -
వాహన తయారీకి తాత్కాలిక బ్రేక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన పరిశ్రమకూ కోవిడ్–19 దెబ్బ పడింది. తయారీ ప్లాంట్లలో పనిచేస్తున్న ఉద్యోగులు వైరస్ బారిన పడడం, లాక్డౌన్లతో షోరూంలు మూతపడడం ఈ రంగాన్ని అతలాకుతలం చేస్తోంది. మరోవైపు ఆక్సిజన్ కొరతతో స్టీల్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. ఇది కాస్తా స్టీల్‌ను ముడి పదార్థంగా వాడే ఆటో విడిభాగాల తయారీ కంపెనీలకు సమస్యగా పరిణమించింది. ఏప్రిల్‌లో స్టీల్ వినియోగం 26 శాతం తగ్గిందంటే పరిస్థితికి అద్దంపడుతోంది. ఇంకేముంది వాహన తయారీ సంస్థలు తాత్కాలికంగా తయారీ ప్లాంట్లను మూసివేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు తయారీని తగ్గించివేస్తున్నాయి. మహారాష్ట్రలో గత నెల తొలి వారంలో లాక్డౌన్ ప్రకటించగానే వాహన పరిశ్రమపై ఒత్తిడి పెరిగింది. క్రమంగా ఇతర రాష్ట్రాలూ లాక్డౌన్లు విధించడంతో ఆటోమొబైల్ ఇండస్ట్రీకి కష్టాలు చుట్టుముట్టాయి. ఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తాజా నిర్ణయం తీసుకున్నట్టు తయారీ సంస్థలు తెలిపాయి. అయితే షట్‌డౌన్ కాలంలో వార్షిక నిర్వహణ చేపట్టనున్నట్టు కంపెనీలు వెల్లడించాయి. ఒకదాని వెంట ఒకటి.. వాహన తయారీ సంస్థలు ఒకదాని వెంట ఒకటి తాత్కాలికంగా ఉత్పత్తికి విరామం ప్రకటిస్తున్నాయి. మే 1 నుంచి 9 రోజులపాటు హరియాణాలో రెండు, గుజరాత్లో ఒక ప్లాంటును మూసివేస్తున్నట్టు భారత్‌లో ప్యాసింజర్ వెహికల్స్ రంగంలో అగ్రశ్రేణి సంస్థ మారుతి సుజుకీ గత నెల ప్రకటించింది. అయితే వైరస్ ఉధృతి నేపథ్యంలో మే 16 వరకు షట్‌డౌన్ పొడిగిస్తున్నట్టు సోమవారం వెల్లడించింది. వార్షిక నిర్వహణలో భాగంగా జూన్‌లో నాలుగు రోజులపాటు చేపట్టాల్సిన తాత్కాలిక షట్‌డౌన్‌ను మే నెలకు మార్చినట్టు మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. తెలంగాణలోని జహీరాబాద్‌తోపాటు చకన్, నాసిక్, కండివాలీ, హరిద్వార్‌లో సంస్థకు తయారీ కేంద్రాలున్నాయి. ఎంజీ మోటార్స్ ఏప్రిల్ 29 నుంచి వారంపాటు గుజరాత్‌లోని హలోల్ ప్లాంటును తాత్కాలికంగా మూసివేసింది. మే 10 నుంచి ఆరు రోజులపాటు చెన్నై ప్లాంటులో తయారీని నిలిపివేస్తున్నట్టు హ్యుందాయ్ మోటార్ ఇండియా తెలిపింది. ఏటా ఈ కేంద్రంలో 7.5 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయగల సామర్థ్యం కంపెనీకి ఉంది. ఈ ఫ్యాక్టరీ నుంచి 88 దేశాలకు కార్లను ఎగుమతి చేస్తోంది. హోండా కార్స్ ఇండియా రాజస్తాన్ తయారీ కేంద్రాన్ని మే 7 నుంచి 18 వరకు తాత్కాలికంగా మూసివేసింది. ఏడాదికి ఈ ఫ్యాక్టరీలో 1.8 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. కర్ణాటకలోని రెండు ప్లాంట్లలో ఏప్రిల్ 26 నుంచి మే 14 వరకు మెయింటెనెన్స్ షట్‌డౌన్ చేపట్టనున్నట్టు టయోటా కిర్లోస్కర్ మోటార్ వెల్లడించింది. ఉత్పత్తిని తగ్గించడంతోపాటు మే నెల కార్యకలాపాలను 7–15 రోజులకే పరిమితం చేయనున్నట్టు అశోక్ లేలాండ్ తెలిపింది. టూ వీలర్స్ రంగంలోనూ.. సెకండ్ వేవ్ ముంచుకొచ్చిన కారణంగా టూ వీలర్ షోరూంల వద్ద నిల్వలు పేరుకుపోయినట్టు సమాచారం. కంపెనీని బట్టి 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ద్విచక్ర వాహన తయారీ రంగంలో భారత్‌లో అగ్రశేణి సంస్థ హీరో మోటోకార్ప్ మే 16 వరకు తాత్కాలికంగా తయారీని నిలిపివేసింది. గత నెల చివరి నుంచి కంపెనీ తన ప్లాంట్లలో షట్‌డౌన్‌ను పొడిగిస్తూ వస్తోంది. వీటిలో చిత్తూరు ప్లాంటుతోపాటు హరియాణా, ఉత్తరాఖండ్, రాజస్తాన్, గుజరాత్‌లోని ఆరు కేంద్రాలు ఉన్నాయి. నీమ్రానాలోని గ్లోబల్ పార్ట్స్ సెంటర్‌తోపాటు ఆర్అండ్డీ ఫెసిలిటీ తలుపులు మూసుకున్నాయి. కంపెనీకి 90 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉంది. రెండవ అతిపెద్ద సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ సైతం ఉత్పత్తిని తాత్కాలికంగా ఆపేసింది. హరియాణా, రాజస్తాన్, కర్ణాటక, గుజరాత్ ప్లాంట్లలో మే 1 నుంచి మొదలైన షట్‌డౌన్ 15 వరకు కొనసాగనుంది. మే 15 నుంచి రెండు వారాలు తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ ప్లాంట్లలో తయారీకి తాత్కాలిక బ్రేక్ ఇవ్వనున్నట్టు యమహా ప్రకటించింది. రాయల్ ఎన్ఫీల్డ్ మే 13–16 మధ్య చెన్నైలోని రెండు ప్లాంట్లలో కార్యకలాపాలు ఆపివేస్తున్నట్టు వెల్లడించింది. -
ఉక్కు ఉత్పత్తిలో సత్తా చాటిన భారత్
సాక్షి, న్యూఢిల్లీ : ఉక్కు ఉత్పాదనలో భారత్ అరుదైన ఘనత సాధించింది. ముడి స్టీల్ తయారీలో జపాన్ను పక్కకునెట్టిన భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిని చేపట్టే దేశంగా అవతరించిందని వరల్డ్ స్టీల్ అసోసియేషన్ తాజా నివేదిక వెల్లడించింది. 2018లో భారత్‌లో ముడి ఉక్కు ఉత్పత్తి 4.9 శాతం పెరిగి 106.5 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. ఇది అంతకుముందు ఏడాది 101.5 మెట్రిక్ టన్నులుగా నమోదైంది. ఇదే సమయంలో 2018లో జపాన్ ముడి ఉక్కు ఉత్పత్తి అంతకుముందు ఏడాదితో పోలిస్తే 0.3 శాతం పతనమై 104.3 మెట్రిక్ టన్నులకు తగ్గింది. స్టీల్ ఉత్పత్తిలో చైనా టాప్ పొజిషన్లో కొనసాగుతోంది. 2018లో చైనాలో స్టీల్ ఉత్పత్తి అంతకుముందు ఏడాదితో పోలిస్తే 6.6 శాతం పెరిగి 928.3 మెట్రిక్ టన్నులకు ఎగబాకింది. ప్రపంచ ముడి ఉక్కు ఉత్పత్తిలో చైనా వాటా 2017లో 50.3 నుంచి 51.3 శాతానికి పెరిగిందని వరల్డ్ స్టీల్ అసోసియేషన్ నివేదిక తెలిపింది. 2018లో 86.7 మెట్రిక్ టన్నుల ముడి ఉక్కును తయారుచేసిన అమెరికా ఈ జాబితాలో 4వ స్ధానంలో నిలిచింది. ఇక టాప్ టెన్ జాబితాలో వరుసగా దక్షిణ కొరియా, రష్యా, జర్మనీ, టర్కీ, బ్రెజిల్, ఇరాన్‌లకు చోటుదక్కింది. -
2030 నాటికి 300 మిలియన్ టన్నులు
ఉక్కు ఉత్పత్తిపై ఎన్ఎండీసీ టెక్నికల్ డైరెక్టర్ నందా వ్యాఖ్య విశాఖ సిటీ: దేశంలోని అన్ని స్టీల్ ప్లాంట్ల నుంచి 2030 నాటికి ఏడాదికి 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్లు ఎన్ఎండీసీ టెక్నికల్ డైరెక్టర్ ఎన్‌కె నందా చెప్పారు. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన నేషనల్ స్టీల్ పాలసీ నిర్దేశించిన లక్ష్యాలను నెరవేర్చేందుకు ప్లాంట్ కృషి చెయ్యాలని కోరారు. విశాఖ ఉక్కు కర్మాగారం, కోల్‌కతాకు చెందిన స్టీల్ మెటలర్జీ సంస్థ ఆధ్వర్యంలో విశాఖలో మేకిన్ ఇండియా– మేకిన్ స్టీల్ సదస్సు జరిగింది. దీన్లో సెయిల్, ఎన్ఎండీసీ సహా.. పలు సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నందా మాట్లాడుతూ ప్రస్తుతం ఏడాదికి 90 మిలియన్ టన్నలు స్టీల్ ఉత్పత్తి అవుతోందని.. దీన్ని 2030 నాటికి 3 రెట్లు పెంచడమే లక్ష్యమని చెప్పారు. ఉత్పత్తిలో నాణ్యతతో పాటు ఎలక్ట్రో స్టీల్ వంటి వాటిని దేశంలో ఉత్పత్తి చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం నాలుగు స్టీల్ ప్లాంట్లను కొత్తగా ప్రారంభించేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోందని వెల్లడించారు. ఒడిషా, కర్ణాటక, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో 5 నుంచి 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసే ఈ ప్లాంట్లు రానున్నట్లు తెలిపారు. స్టీల్ ప్లాంట్ డైరెక్టరు డీఎన్‌రావు, మెటీరియల్స్ మేనేజ్మెంట్ ఈడీ డా.ఎస్‌ఎన్‌రావు, ఐఎన్ఎస్ డీఎజీ డైరెక్టర్ జనరల్ సుషిమ్ బెనర్జీ, సీఎస్ఐఆర్ డైరెక్టర్ మురళీధరన్, స్టీల్ అండ్ మెటలర్జీ ఎడిటర్ నిర్మల్య ముఖర్జీ, విశాఖ పోర్టు ట్రస్టు డిప్యూటీ ఛైర్మన్ పీఎల్ హరనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉక్కు ఉత్పత్తిలో త్వరలో 2వ స్థానానికి భారత్
కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ న్యూఢిల్లీ: ప్రపంచంలో స్టీల్ ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ త్వరలో రెండవ స్థానాన్ని ఆక్రమిస్తుందని కేంద్ర ఉక్కు వ్యవహారాల శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ మంగళవారంనాడు ఇక్కడ తెలిపారు. తాను మంత్రిగా మూడేళ్లలో ఉక్కు శాఖ సాధించిన విషయాలను ఆయన వివరిస్తూ, ‘‘ప్రస్తుతం స్టీల్ రంగం గతంకన్నా ఎంతో పురోగతి సాధించింది. అప్పట్లో ఈ రంగంపై ఎంతో ఒత్తిడి ఉండేది. బ్యాంకింగ్, ఆర్బీఐకి తీవ్ర ఆందోళనకరమైనదిగా ఈ రంగం పనితీరు ఉండేది. అయితే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి మేము ఎన్నో చర్యలు తీసుకున్నాం’’ అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. 300 ఎంటీల లక్ష్యం...: 2030–31 సంవత్సరానికి 300 ఎంటీల ఉత్పత్తి లక్ష్యంగా కొత్త స్టీల్ విధానాన్ని రూపొందించినట్లు కేంద్ర మంత్రి వివరించారు. 2015లో అమెరికాను నాల్గవ స్థానానికి నెట్టి, భారత్ స్టీల్ ఉత్పత్తిలో మూడవ స్థానాన్ని ఆక్రమించుకుంది. ప్రస్తుతం స్టీల్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో చైనా ఉండగా, రెండవ స్థానంలో జపాన్ ఉంది. గత ఏడాది భారత్ స్టీల్ ఉత్పత్తి 100 ఎంటీ (మిలియన్ మెట్రిక్ టన్నులు). జపాన్ విషయంలో ఈ పరిమాణం 104 ఎంటీలుగా ఉంది. చైనా ఉత్పత్తి దాదాపు 808 ఎంటీలయితే, అమెరికా విషయంలో దాదాపు 78 ఎంటీలుగా ఉంది. -
అక్కడ తగ్గింది.. ఇక్కడ పెరిగింది..
♦ అంతర్జాతీయంగా 2.8 శాతం తగ్గిన ఉక్కు ఉత్పత్తి ♦ 2009 నుంచి ఇదే తొలి క్షీణత ♦ భారత్‌లో భిన్నమైన పరిస్థితి; 2.6 శాతం పెరుగుదల ♦ డబ్ల్యూఎస్‌ఏ నివేదిక లండన్: అంతర్జాతీయంగా ఉక్కు ఉత్పత్తి తగ్గితే.. భారత్‌లో మాత్రం పెరిగింది. అంతర్జాతీయంగా ఉక్కు ఉత్పత్తి గతేడాది 2.8 శాతం క్షీణతతో 1,622 మిలియన్ టన్నులకు తగ్గింది. 2009 నుంచి చూస్తే ఇదే తొలి క్షీణత. కాగా భారత్‌లో 2014లో 87.3 మిలియన్ టన్నులుగా ఉన్న ఉక్కు ఉత్పత్తి 2015కు వచ్చేసరికి 2.6 శాతం వృద్ధితో 89.6 మిలియన్ టన్నులకు పెరిగింది. పరిశ్రమ సమాఖ్య వరల్డ్ స్టీల్ అసోసియేషన్ (డబ్ల్యూఎస్‌ఏ) ప్రకారం.. 2008లో 1,343 మిలియన్ టన్నులుగా ఉన్న ఉక్కు ఉత్పత్తి 2009కి వచ్చేసరికి 8 శాతం తగ్గుదలతో 1,238 మిలియన్ టన్నులకు క్షీణించింది. అటుపై 2009 తర్వాతి నుంచి ఉక్కు ఉత్పత్తి 2014 వరకు క్రమంగా పెరుగుతూ వచ్చింది. అంతర్జాతీయ ఉక్కు ఉత్పత్తి 2010లో 1,433 మిలియన్ టన్నులుగా, 2011లో 1,538 మిలియన్ టన్నులుగా, 2012లో 1,560 మిలియన్ టన్నులుగా, 2013లో 1,650 మిలియన్ టన్నులుగా, 2014లో 1,670 మిలియన్ టన్నులుగా నమోదయ్యింది. గతేడాదిలో ముడి ఉక్కు ఉత్పత్తి 1,622 మిలియన్ టన్నులుగా ఉంది. ఇది 2014తో పోలిస్తే 2.8 శాతం తక్కువ. డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండటం, ధరల తగ్గుదల వంటి అంశాల కారణంగా ప్రస్తుతం ఉక్కు పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అందులో భాగంగానే ఉక్కు కంపెనీలు వాటి ఉత్పత్తిని తగ్గించుకోవడం ద్వారా ధరలను స్థిరీకరించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. అందుకే ఉత్పత్తి తగ్గిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. కొన్ని ఉక్కు ఉత్పత్తుల ధర గతేడాది పదేళ్ల కనిష్ట స్థాయికి పడిన సంగతి తెలిసిందే. ఆసియా ప్రాంతంలో ముడి ఉక్కు ఉత్పత్తి 2014తో పోలిస్తే 2015లో 2.3 శాతం తగ్గి 1,113 మిలియన్ టన్నులకు క్షీణించింది. ఇదే సమయంలో ప్రపంచ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారు చైనాలో కూడా ముడి ఉక్కు ఉత్పత్తి 2.3 శాతం క్షీణించి 803 మిలియన్ టన్నులకు తగ్గింది. కానీ ప్రపంచ ముడి ఉక్కు ఉత్పత్తిలో దీని వాటా మాత్రం 49.3% నుంచి 49.5 శాతానికి పెరిగింది. ఇక జపాన్‌లో ముడి ఉక్కు ఉత్పత్తి 5 శాతం తగ్గుదలతో 105 మిలియన్ టన్నులకు పడింది. అమెరికాలో ముడి ఉక్కు ఉత్పత్తి 10 శాతం క్షీణతతో 78.9 మిలియన్ టన్నులకు తగ్గింది. -
300మి.ట. ఉక్కు ఉత్పత్తి సాధ్యమే
సాక్షి,విశాఖపట్నం: 2025 నాటికి దేశంలో ఉక్కు ఉత్పత్తి 300 మిలియన్ టన్నులకు చేరుకోవడం అసాధ్యమేం కాదని వైజాగ్‌స్టీల్‌ప్లాంట్ సీఎండీ మధుసూదన్ చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి అనేక సానుకూల అంశాలున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకుని ముందుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖపట్నంలో గురువారం ‘ఇండియన్ స్టీల్ ఇండస్ట్రీ విజన్- 2025’ అనే అంశంపై రెండురోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. దీనికి మధుసూదన్ ముఖ్య ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. దేశంలో తలసరి ఉక్కు వినియోగం 60కేజీలు ఉండగా, చైనాలో 500 కేజీలు, అంతర్జాతీయ సరాసరి 225 కేజీలు ఉందన్నారు. ఈనేపథ్యంలో దేశీయంగా ఉక్కు ఉత్పత్తికి భారీగా అవకాశం ఉందని విశ్లేషించారు. ఉక్కు ఉత్పత్తి,వినియోగంలో చైనాతో భారత్ పోటీపడాల్సి ఉందన్నారు. ఏ దేశానికి లేనవిధంగా దేశంలో ఇనుప గనులు భారీగా ఉన్నాయని,ఇది దేశీయ ఉక్కు రంగానికి వరంగా పరిగణించాలన్నారు. ప్రస్తుతం ఒక టన్ను ఉక్కు ఉత్పత్తికి 1.5టన్నుల ఇనుప ఖనిజం అవసరం ఉందని, భవిష్యత్తులో సాధించాల్సి ఉన్న 300 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తికి 450 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం కావాలని చెప్పారు. అనంతరం సర్డా మెటల్స్ అండ్ అల్లాయిస్ డెరైక్టర్ మనిష్సర్డా,స్టాల్బర్గ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బిమల్ కే సర్కార్, స్టీల్‌ప్లాంట్ మాజీ సీఎండీ శివసాగరరావు, ఆర్ఐఎన్ఎల్ ప్రస్తుత డెరైక్టర్ డి.ఎన్.రావు, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ ఎండీ వి.కె.నొవాల్ తదితరులు ప్రసంగించారు. భారత్ జీడీపీ వృ ద్ధి రేటు 9శాతానికి చేరుకోవాలంటే ఉక్కు రంగానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యత కల్పించాలని వీరంతా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.