
టెక్ మహీంద్రా లాభం జూమ్
ముంబై: సాఫ్ట్‌వేర్ సేవల దేశీ దిగ్గజం టెక్ మహీంద్రా గతేడాది (2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 77 శాతం జంప్‌చేసి రూ. 1,167 కోట్లను తాకింది. మార్జిన్లు 3.5 శాతం మెరుగుపడటం ఇందుకు సహకరించింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 661 కోట్లు ఆర్జించింది. ఈ కాలంలో 79.8 కోట్ల డాలర్ల(రూ. 6,800 కోట్లు) విలువైన ఆర్డర్లు కొత్తగా పొందింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి 42 శాతం అధికంగా 2.7 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 27,000 కోట్లు) విలువైన డాలర్లు సాధించినట్లు కంపెనీ సీఈవో, ఎండీ మోహిత్ జోషీ తెలియజేశారు. చివరి త్రైమాసిక ఆర్డర్లలో 60 శాతం వృద్ధిని అందుకున్నట్లు వెల్లడించారు. వాటాదారులకు షేరుకి రూ. 30 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. కాగా.. మొత్తం ఆదాయం రూ. 12,871 కోట్ల నుంచి రూ. 13,384 కోట్లకు బలపడింది. పూర్తి ఏడాదికి నికర లాభం 80 శాతం ఎగసి రూ. 4,251 కోట్లను అధిగమించింది. 2023–24లో రూ. 2,358 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 2 శాతం మెరుగై రూ. 52,988 కోట్లను తాకింది. కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య 3,276 తగ్గి 1,48,731కు చేరింది. 2025 మార్చి31కల్లా చేతిలో నగదు, తత్సమాన నిల్వలు 89.6 కోట్ల డాలర్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది.
సైయెంట్ డివిడెండ్ రూ. 14
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజినీరింగ్, టెక్నాలజీ సొల్యూషన్స్ సంస్థ సైయెంట్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 186 కోట్ల లాభం ప్రకటించింది. క్రితం క్యూ4లో ఇది రూ. 197 కోట్లు. ఆదాయం రూ. 1,861 కోట్ల నుంచి రూ. 1,909 కోట్లకు చేరింది. 2024–25కి గాను రూ. 5 ముఖ విలువ చేసే ఒక్కో షేరుపై కంపెనీ రూ.14 తుది డివిడెండ్ ప్రకటించింది. డీఈటీ వ్యాపార విభాగంలో సుమారు 371 కోట్ల డాలర్ల విలువ చేసే 24 భారీ కాంట్రాక్టులు దక్కించుకున్నట్లు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కృష్ణ బోదనపు తెలిపారు. కొత్తగా సెమీకండక్టర్ అనుబంధ సంస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇది ప్రధానంగా ఏఐ ఆధారిత టెక్నాలజీ డెవలప్‌మెంట్‌పై దృష్టి పెడుతుందని తెలిపారు. ఇక డీఈటీ (డిజిటల్, ఇంజినీరింగ్, టెక్నాలజీ) విభాగం టెక్నాలజీ సరీ్వసులు, ఇంజినీరింగ్ కార్యకలాపాలపై, డీఎల్‌ఎం వ్యాపార విభాగం ఇంజినీరింగ్ ఆధారిత ప్రోడక్ట్ తయారీపై ఫోకస్ పెడుతుందని వివరించారు. డిమాండ్‌పరంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ తాము మెరుగైన పనితీరు కనపర్చినట్లు చెప్పారు. సమీప భవిష్యత్తులో కొంత అనిశ్చితి నెలకొన్నా సవాళ్లను అధిగమించేందుకు కస్టమర్లతో కలిసి పని చేస్తున్నట్లు కృష్ణ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం వరకు ఈ పరిస్థితి కొనసాగవచ్చన్నారు.
పెర్సిస్టెంట్ సిస్టమ్స్ లాభం అప్
క్యూ4లో రూ.396 కోట్లు
ముంబై: సాఫ్ట్‌వేర్ సేవల దేశీ దిగ్గజం పెర్సిస్టెంట్ సిస్టమ్స్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 25 శాతం జంప్‌చేసి రూ. 396 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 315 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 25 శాతం ఎగసి రూ. 3,242 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 2,591 కోట్ల టర్నోవర్ అందుకుంది. నిర్వహణ లాభ మార్జిన్లు 14.5 శాతం నుంచి 15.6 శాతానికి బలపడ్డాయి. అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో 2 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించగలమని భావిస్తున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో వినీత్ టి. పేర్కొన్నారు. ఈ కాలంలో 51.75 కోట్ల డాలర్ల విలువైన కొత్త డీల్స్ కుదుర్చుకుంది. కంపెనీ 700 మంది ఉద్యోగులను జత కలుపుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 24,594కు చేరింది.