అదానీ ఎనర్జీ లాభం దూకుడు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ విద్యుత్ ప్రసార దిగ్గజం అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 80 శాతం దూసుకెళ్లి రూ. 625 కోట్లను అధిగమించింది. ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 348 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 4,824 కోట్ల నుంచి రూ. 6,000 కోట్లకు ఎగసింది. విద్యుత్ ప్రసార విభాగంలో రూ. 54,761 కోట్ల భారీ ఆర్డర్‌బుక్‌ను కలిగి ఉన్నట్లు కంపెనీ సీఈవో కందర్ప్ పటేల్ పేర్కొన్నారు. స్మార్ట్ మీటరింగ్‌లో రూ. 13,600 కోట్ల విలువైన ఆర్డర్లు పొందినట్లు వెల్లడించారు.
అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేరు ఎన్‌ఎస్‌ఈలో స్వల్ప లాభంతో రూ. 805 వద్ద ముగిసింది.
జీల్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: మీడియా రంగ కంపెనీ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్(జీల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం మూడు రెట్లుపైగా దూసుకెళ్లి దాదాపు రూ. 164 కోట్లకు చేరింది. ప్రధానంగా నిర్వహణ వ్యయాలు తగ్గడం ఇందుకు సహకరించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 59 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,027 కోట్ల నుంచి రూ. 941 కోట్లకు క్షీణించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 1,931 కోట్ల నుంచి రూ. 1,735 కోట్లకు తగ్గాయి. వీటిలో నిర్వహణ వ్యయాలు రూ. 1,188 కోట్ల నుంచి రూ. 997 కోట్లకు వెనకడుగు వేశాయి.
సైయంట్ లాభం రూ.122 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజినీరింగ్, టెక్నాలజీ సేవల సంస్థ సైయంట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 122 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) ప్రకటించింది. గత క్యూ3లో ఇది రూ. 147 కోట్లుగా నమోదైంది. మరోవైపు, ఆదాయం రూ. 1,821 కోట్ల నుంచి రూ. 1,926 కోట్లకు చేరింది. కీలకమైన డీఈటీ (డిజిటల్, ఇంజినీరింగ్, టెక్నాలజీ) విభాగం ఆదాయం స్వల్పంగా 0.8 శాతం క్షీణించి రూ. 1,480 కోట్లకు పరిమితమైనట్లు కంపెనీ తెలిపింది. ఈడీ, సీఈవోగా కార్తికేయన్ నటరాజన్ తప్పుకున్నట్లు పేర్కొంది. పవర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఉత్పత్తులు, ఎలక్ట్రిక్ వాహనాల్లో ముఖ్యమైన విడిభాగాల అభివృద్ధిలో తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కీలక పాత్ర పోషిస్తుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కృష్ణ బోదనపు తెలిపారు.
ఇదీ చదవండి: రియల్టీలో మహిళలకు ఉపాధి ఎక్కడ?
హెచ్‌పీసీఎల్ లాభం 3 రెట్లు ప్లస్
న్యూఢిల్లీ: చమురు రంగ పీఎస్‌యూ దిగ్గజం హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం మూడు రెట్లు ఎగసి రూ. 2,544 కోట్లకు చేరింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 713 కోట్లు ఆర్జించింది. ఈ ఏడాది క్యూ2(జులై–సెప్టెంబర్)లో సాధించిన రూ. 143 కోట్లతో పోల్చినా లాభాలు భారీగా బలపడ్డాయి. ఇంధన రిటైలింగ్ బిజినెస్ పన్నుకుముందు లాభం రూ. 981 కోట్ల నుంచి రూ. 4,566 కోట్లకు జంప్‌చేసింది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను యథాతథంగా కొనసాగించడం ఇందుకు తోడ్పాటునిచ్చింది. మరోవైపు దేశీ వంటగ్యాస్(ఎల్‌పీజీ) విక్రయాలలో రూ. 3,100 కోట్లమేర అండర్ రికవరీ(ఉత్పత్తికంటే తక్కువధరకు అమ్మడం)లను నమోదు చేసింది. తాజా సమీక్షా కాలంలో హెచ్‌పీసీఎల్ 6.47 మిలియన్ టన్నుల చమురును ప్రాసెస్ చేసింది. గతేడాది క్యూ3లో 5.34 ఎంటీ చమురును శుద్ధి చేసింది. అమ్మకాలు 11.36 ఎంటీ నుంచి 12.32 ఎంటీకి పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment