quarterly results
-
టాటా స్టీల్, గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్‌కు లాభాలు
టాటా స్టీల్ సెప్టెంబర్ త్రైమాసికంలో తిరిగి లాభాల్లోకి అడుగు పెట్టింది. రూ.759 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.6,511 కోట్ల నష్టం ఎదురుకావడం గమనార్హం. మొత్తం ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.55,910 కోట్ల నుంచి రూ.54,503 కోట్లకు తగ్గింది. కంపెనీ వ్యయాలను గణనీయంగా తగ్గించుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో వ్యయాలు రూ.55,853 కోట్లుగా ఉంటే, సమీక్షా త్రైమాసికంలో రూ.52,331 కోట్లకు పరిమితమయ్యాయి.సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.4,806 కోట్ల మూలధన వ్యయాలను వెచ్చించింది. కంపెనీ నికర రుణభారం రూ.88,817 కోట్లుగా ఉంది. కంపెనీ వద్ద రూ.26,028 కోట్ల లిక్విడిటీ ఉంది. టాటా స్టీల్ యూకే ఆదాయం 600 మిలియన్ పౌండ్లుగా ఉంటే, 147 మిలియన్ పౌండ్ల ఎబిట్డా నష్టం నమోదైంది. నెదర్లాండ్ కార్యకలాపాల నుంచి 1,300 మిలియన్ పౌండ్ల ఆదాయం రాగా, 22 మిలియన్ పౌండ్ల ఎబిట్డా నమోదైంది. దేశంలోనే అతిపెద్ద బ్లాస్ట్ ఫర్నేస్ కళింగనగర్ ప్లాంట్ ప్రారంభమైనట్టు సంస్థ ప్రకటించింది. అంతర్జాతీయంగా నిర్వహణ వాతావరణం ఎంతో సంక్లిష్టంగా ఉన్నట్టు టాటా స్టీల్ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. కొన్ని కీలక ప్రాంతాల్లో వృద్ధి స్దబ్దుగా ఉన్నట్టు అంగీకరించారు. యూకే ప్రభుత్వంతో నిధులపై ఒప్పందాన్ని చేసుకున్నామని, గ్రీన్ స్టీల్‌కు మళ్లే దిశగా పురోగతిలో ఉన్నట్టు చెప్పారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టాటా స్టీల్ షేరు ధర ఒక శాతం లాభపడి రూ.154 వద్ద స్థిరపడింది.ఇదీ చదవండి: ట్రంప్ మానియా..ఐటీపై ప్రభావం ఎంత?గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్.. ఫర్వాలేదుగల్ప్ ఆయిల్ లూబ్రికెంట్స్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్ త్రైమాసికంలో సానుకూల వృద్ధిని నమోదు చేసింది. నికర లాభం 15 శాతం వృద్ధితో రూ.84 కోట్లకు, ఆదాయం 6 శాతం పెరిగి రూ.849 కోట్లకు చేరాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.74 కోట్లు, ఆదాయం రూ.802 కోట్లుగా ఉండడం గమనార్హం. అనిశి్చత మార్కెట్ పరిస్థితుల్లో మంచి పనితీరు చూపించినట్టు కంపెనీ ప్రకటించింది. మార్జిన్లను కాపాడుకోవడంపై దృష్టి పెట్టామని, దీంతో స్థూల మార్జిన్లలో మెరుగుదల నమోదైనట్టు కంపెనీ సీఎఫ్‌వో మనీష్ గంగ్వాల్ తెలిపారు. లాభదాయకత పెంచుకోవడం ద్వారా వాటాదారులకు మరింత విలువ సమకూర్చుతామని ప్రకటించారు. డిమాండ్‌పై సానుకూల అంచనాలతో ఉన్నామని, మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి భారత లూబ్రికెంట్ల రంగంపై విశ్వాసంతో ఉన్నట్టు చెప్పారు. పటిష్ట ఫలితాలతో బీఎస్ఈలో కంపెనీ షేరు ధర 6 శాతం ఎగసి రూ.1,263 వద్ద ముగిసింది. -
ఎక్సైడ్ ఇండస్ట్రీస్, జెన్ టెక్, తాజ్ జీవీకే, రేమండ్ ఫలితాలు
ఆటో, టెలికం రంగ బ్యాటరీల తయారీ దిగ్గజం ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 14 శాతం క్షీణించి రూ. 233 కోట్లకు పరిమితమైంది. అధిక వ్యయాలు, నిల్వలు ప్రభావం చూపాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 270 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 4,372 కోట్ల నుంచి రూ. 4,450 కోట్లకు స్వల్పంగా బలపడింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 4,044 కోట్ల నుంచి రూ. 4,158 కోట్లకు పెరిగాయి. తయారీ వ్యయాలు, నిల్వల పద్దు రూ. 107 కోట్ల నుంచి రూ. 229 కోట్లకు పెరిగింది. కాగా.. ద్విచక్ర, కార్ల విభాగాలలో రీప్లేస్మెంట్ మార్కెట్ నుంచి భారీ డిమాండ్ కనిపిస్తున్నట్లు ఎక్సైడ్ పేర్కొంది. ఇండస్ట్రియల్– యూపీఎస్, సోలార్ విభాగంలోనూ డిమాండ్ నెలకొన్నప్పటకీ హోమ్ యూపీఎస్ విభాగం మందగించినట్లు వెల్లడించింది.జెన్ టెక్నాలజీస్ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జెన్ టెక్నాలజీస్ ఆదాయం రూ. 64 కోట్ల నుంచి రూ. 242 కోట్లకు పెరిగింది. లాభం రూ. 17 కోట్ల నుంచి రూ.65 కోట్లకు ఎగిసింది. ప్రథమార్ధానికి సంబంధించి ఆదాయం రూ. 196 కోట్ల నుంచి రూ. 496 కోట్లకు, లాభం రూ. 64 కోట్ల నుంచి రూ. 139 కోట్లకు పెరిగింది. సెప్టెంబర్ 30 నాటికి తమ ఆర్డర్ బుక్ రూ. 957 కోట్ల స్థాయిలో పటిష్టంగా ఉందని సంస్థ సీఎండీ అశోక్ అట్లూరి తెలిపారు. తాజ్ జీవీకేప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఆదాయం రూ. 107 కోట్లుగా, లాభం సుమారు రూ. 20 కోట్లుగా (స్టాండెలోన్ ప్రాతిపదికన) నమోదైంది. క్రితం క్యూ2లో ఆదాయం రూ. 90 కోట్లు కాగా, లాభం రూ. 11 కోట్లు. తాజ్ డెక్కన్ హోటల్ పునరుద్ధరణ పనులు పూర్తవడంతో రాబోయే త్రైమాసికాల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించగలమని సంస్థ చైర్మన్ జీవీకే రెడ్డి తెలిపారు. బెంగలూరులోని యెలహంకలో నిర్మిస్తున్న 253 గదుల తాజ్ హోటల్‌ను 2026 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: రూ.1 కోటి కంటే ఖరీదైన వాచ్ ధరించిన మార్క్రేమండ్రేమండ్ లిమిటెడ్ సెపె్టంబర్ త్రైమాసికానికి రూ.59 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.161 కోట్లతో పోల్చి చూస్తే 63 శాతం తగ్గిపోయింది. మొత్తం ఆదా యం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.512 కోట్ల నుంచి రెట్టింపునకు పైగా పెరిగి రూ.1,101 కోట్లకు చేరింది. రియల్ ఎస్టేట్, ఇంజనీరింగ్ వ్యాపారాల్లో మంచి వృద్ధిని చూసినట్టు సంస్థ చైర్మన్, ఎండీ గౌతమ్ హరి సింఘానియా ప్రకటించారు. థానేలో రిటైల్ స్పేస్ ప్రాజెక్ట్ పార్క్ అవెన్యూని ప్రారంభించినట్టు చెప్పారు. -
ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ లాభం డౌన్
న్యూఢిల్లీ: మురుగప్ప గ్రూప్ కంపెనీ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 14 శాతం క్షీణించి రూ. 299 కోట్లకు పరిమితమైంది. అధిక వ్యయాలు ప్రభావం చూపాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 346 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 4,169 కోట్ల నుంచి రూ. 4,783 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు సైతం రూ. 3,868 కోట్ల నుంచి రూ. 4,569 కోట్లకు పెరిగాయి. కాగా.. ఆదాయంలో ఇంజినీరింగ్ విభాగం నుంచి రూ. 1,323 కోట్లు లభించగా.. మెటల్ ఆధారిత ప్రొడక్టుల నుంచి రూ. 404 కోట్లు, మొబిలిటీ బిజినెస్ నుంచి రూ. 168 కోట్లు చొప్పున అందుకుంది. ఫలితాల నేపథ్యంలో టీఐఇండియా షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 4 శాతం పతనమై రూ. 4,312 వద్ద ముగిసింది. -
ఒడిదుడుకులు కొనసాగవచ్చు
ముంబై: అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, కీలక వడ్డీరేట్ల పెంపు భయాల నేపథ్యంలో స్టాక్ సూచీలు ఈ వారంలోనూ తడబడవచ్చని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. స్థూల ఆర్థిక గణాంకాలు, కార్పోరేట్ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చంటున్నారు. దేశీయ ఈక్విటీల్లోకి ఎఫ్ఐఐల పెట్టుబడుల తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికల అంశాలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు భయాలతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాల ఆందోళనలతో గతవారంలో మొత్తంగా సెన్సెక్స్ 492 పాయింట్లు, నిఫ్టీ 142 పాయింట్లు నష్టపోయాయి ‘‘గత నాలుగు నెలలుగా మార్కెట్లో స్థిరీకరణ కొనసాగుతోంది. ఇప్పటికీ నిర్ణయాత్మక దిశను ఎంచుకోలేకపోయింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణ ఆందోళనలు, రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతలు సెంటిమెంట్‌పై ఒత్తిడిని పెంచుతున్నాయి. నిఫ్టీకి సాంకేతికంగా దిగువస్థాయిలో 17050 వద్ద బలమైన మద్దతు స్థాయి ఉంది. ఎగువస్థాయిలో 17,550–17,650 వద్ద శ్రేణిలో నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెచ్ వినోద్ నాయర్ తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాలపై దృష్టి టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు నేడు(సోమవారం) వెల్లడికానున్నాయి. చైనా జనవరి ద్రవ్యోల్బణ డేటా, యూరోజోన్ డిసెంబర్ పారిశ్రామికోత్పత్తి, అమెరికా జనవరి రిటైల్ అమ్మకాలు ఈనెల 16న (బుధవారం) వెల్లడికానున్నాయి. యూఎస్ ఫెడ్ మినిట్స్ గురువారం విడుదల అవుతాయి. జపాన్ జనవరి ద్రవ్యోల్బణ గణాంకాలు ఈనెల 18న (శుక్రవారం) వెల్లడికానున్నాయి. వ్యవస్థ పనితీరును ప్రతిబింబింప చేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపగలవు. కార్పొరేట్ ఫలితాలు దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఫలితాల ప్రకటన అంకం చివరి దశకు చేరుకుంది. కోల్ ఇండి యా, ఐషర్ మోటార్స్, గ్రాసీం ఇండస్ట్రీస్, స్పైస్ జెట్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ విల్మార్, అం బుజా సిమెంట్స్, నెస్లేలతో సహా బీఎస్ఈలో నమోదైన 1,000కు పైగా కంపెలు ఈ వారంలో తమ డిసెంబర్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇన్వెస్టర్లు ఈ గణాంకాలపై దృష్టి సారించవచ్చు. ద్రవ్యోల్బణ ఆందోళనలు అంతర్జాతీయంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణం మార్కెట్ల వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికా ద్రవ్యోల్బణ 40 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడంతో యూఎస్ ఫెడ్ రిజర్వ్ ఈ మార్చి కంటే ముందుగానే వడ్డీరేట్లను పెంచవచ్చనే భయాలు నెలకొన్నాయి. ధరల కట్టడికి పలు దేశాల కేంద్ర బ్యాంకులు తమ ద్రవ్యపాలసీని కట్టడి చేసేందుకు సిద్ధమయ్యాయి. గురువారం ఫెడ్ మినిట్స్ వెల్లడి అమెరికా ఫెడ్ రిజర్వ్ పాలసీ మినిట్స్ గురువారం వెల్లడికానున్నాయి. ద్రవ్యపాలసీ, ద్రవ్యోల్బణంతో సహా అర్థిక వ్యవస్థ పనితీరుపై ఫెడరల్ ఓపెన్ మా ర్కెట్ కమిటీ వైఖరిని తెలియజేసే ఈ మినిట్స్ ఈక్విటీ మార్కెట్లకు దిశానిర్ధేశం చేయనున్నాయి. తారాస్థాయికి రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతలు రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య భౌగోళిక సరిహద్దు వివాద ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. రష్యా ఈనెల 16న ఉక్రెయిన్‌పై దాడి చేయవచ్చని అమెరికా నిఘా వర్గాలు ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌కు సమాచారం ఇచ్చాయి. యూఎస్‌తో సహా పలు దేశాలు ఉక్రెయిన్‌లోని తమ పౌరులను వెనక్కి వచ్చేయాలని కోరుతున్నాయి. ఆగని విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఈ ఫిబ్రవరి తొలి భాగంలో విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి రూ.14,935 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఇందులో ఈక్విటీల నుంచి రూ.10,080 కోట్లను, డెట్ విభాగం నుంచి రూ.4,830 కోట్లను, హైబ్రిడ్ సిగ్మెంట్ నుంచి రూ.24 కోట్లను వెనక్కి తీసుకున్నట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ అనిశ్చితులు, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, బాండ్ ఈల్డ్స్ పెరుగుదల భయాలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ లాంటి వర్థమాన దేశాల్లో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారని మార్నింగ్‌స్టార్ ఇండియా ఎండీ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. -
ఆర్‌బీఐవైపు మార్కెట్ చూపు
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలోనూ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఆర్బీఐ ద్రవ్యపాలసీ కమిటీ నిర్ణయాలు, కార్పోరేట్ కంపెనీల తాజా త్రైమాసిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు మార్కెట్ పనితీరును ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయి. దేశీయ ఈక్విటీల్లోకి ఎఫ్ఐఐల పెట్టుబడుల తీరుతెన్నులను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. అలాగే రూపాయి కదలిక, క్రూడాయిల్ ట్రేడింగ్, మూడో దశ కరోనా కేసుల నమోదు తదితర అంశాలు మార్కెట్ గమనాన్ని నిర్ధేశించే అంశాలుగా ఉన్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వృద్ధి ఆధారిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో గతవారంలో సెన్సెక్స్ 1445 పాయింట్లు, నిఫ్టీ 414 పాయింట్లు లాభపడ్డాయి. ‘‘సాంకేతికంగా నిఫ్టీకి దిగువ స్థాయిలో 17,450 వద్ద మద్దతు స్థాయి, ఎగువ స్థాయిలో 17,800 వద్ద నిరోధాన్ని కలిగి ఉంది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ నాగరాజ్ శెట్టి తెలిపారు. రేపటి నుంచి ‘పాలసీ’ సమావేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–2021) చివరి, ఆరవ ద్వైమాసిక ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం మంగళవారం ప్రారంభమై గురువారం ముగిస్తుంది. ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచేందుకు మొగ్గుచూపుతున్న వేళ ఆర్బీఐ ద్రవ్యవిధాన వైఖరిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల ప్రపంచ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 90 డాలర్లపైకి చేరడం ఆర్బీఐకి మరో సమస్యగా మారింది. కీలక దశలో కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఫలితాల ప్రకటన అంకం కీలక దశకు చేరుకుంది. భారతీ ఎయిర్టెల్, ఏసీసీ, భాష్, పవర్ గ్రిడ్, హీరో మోటోకార్ప్, హిందాల్కో, మహీంద్రా అండ్ మహీంద్రా, దివీస్ ల్యాబ్స్, ఓఎన్జీసీతో సహా బీఎస్ఈలో నమోదైన 1600కు పైగా కంపెలు ఇదే వారంలో తమ డిసెంబర్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇన్వెస్టర్లు ఈ గణాంకాలపై దృష్టి సారించవచ్చు. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. భయపెడుతున్న బాండ్ ఈల్డ్స్ రాబడులు భారత ప్రభుత్వ పదేళ్ల బాండ్ల రాబడి గతవారం రెండేళ్ల గరిష్టం 6.9 స్థాయికి చేరింది. యూఎస్ పదేళ్ల ట్రెజరీ బాండ్ల రాబడి 1.9 శాతంపైన ముగిసింది. క్రూడాయిల్ ధరల మంటలు రష్యా– ఉక్రెయిన్ దేశాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతలు, యూఎస్ మంచు తుఫాన్లతో సప్లై అంతరాయాలు నెలకొని ముడిచమురు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. గడిచిన ఏడు వారాల్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 26 శాతం పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతున్న వేళ క్రూడ్ ధరలు పెరగడం మంచిది కాదని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు ఈ ఫిబ్రవరి తొలి నాలుగు ట్రేడింగ్ సెషన్లలో విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి రూ.6,834 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఇందులో ఈక్విటీల నుంచి రూ.3,173 కోట్లను, డెట్ విభాగం నుంచి రూ.3,173 కోట్లను, హైబ్రిడ్ సెగ్మెంట్ నుంచి రూ.34 కోట్లను వెనక్కి తీసుకున్నట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. రేపు అదానీ విల్మర్ లిస్టింగ్ ఇటీవల ఐపీఓ పూర్తి చేసుకున్న అదానీ విల్మర్ షేర్లు మంగళవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్‌కానున్నాయి. ఈ కంపెనీ షేర్లు గ్రే మార్కెట్లో ఇష్యూ ధర (రూ.230) కంటే అధికంగా రూ.25–30 పలుకుతున్నాయి. ఇక ఫిబ్రవరి 4న ప్రారంభమైన మాన్యవర్ మేకర్ ‘వేదాంత ఫ్యాషన్స్’ ఐపీఓ మంగళవారం ముగియనుంది. పాలసీ సమావేశం వాయిదా ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేసినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘భారత రత్న లతా మంగేష్కర్ మృతికి నివాళిగా మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు దినంగా ప్రకటించింది. దీంతో సోమవారం నుంచి మూడు రోజుల జరగాల్సిన కమిటీ సమావేశం మంగళవారం ప్రారంభమవుతుంది. పాలసీ కమిటీ నిర్ణయాలను గురువారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడిస్తారు’’ అని ఆర్బీఐ ప్రకటన ఒకటి పేర్కొంది. -
తడబాటు తప్పదేమో..!
ముంబై: ఈ వారంలోనూ స్టాక్ మార్కెట్‌కు తడబాటు తప్పకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కార్పోరేట్ కంపెనీల తాజా త్రైమాసిక ఫలితాలు, ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్ తీరును ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయని వారంటున్నారు. అలాగే వచ్చే బడ్జెట్లో ప్రయోజనాలపై అంచనాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చంటున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా బుధవారం (26న) మార్కెట్‌కు సెలవు దినం కావడంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. జనవరి ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ గడువు గురువారం ముగియనుంది. ఈ పరిణామాల దృష్ట్యా మార్కెట్లో ఒడిదుడుకుల ట్రేడింగ్ తప్పకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటితో పాటు ప్రపంచ పరిణామాలు, దేశీయ ఈక్విటీల్లోకి ఎఫ్ఐఐల పెట్టుబడుల తీరుతెన్నులను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. అలాగే రూపాయి కదలిక, క్రూడాయిల్ ట్రేడింగ్, కరోనా కేసుల నమోదు తదితర అంశాలు మార్కెట్ గమనాన్ని నిర్ధేశించే అంశాలుగా ఉన్నాయి. భౌగోళిక ఉద్రిక్తతలతో పాటు విదేశీ ఇన్వెస్టర్లు మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడటంతో గతవారంలో సూచీలు మూడున్నర శాతం నష్టపోయిన సంగతి తెలిసిందే. వారం మొత్తంగా సెన్సెక్స్ 2,186 పాయింట్లు, నిఫ్టీ 639 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశాలు మంగవారం(జనవరి 25న) మొదలై.., 26వ తేదిన(బుధవారం)ముగియనున్నాయి. ద్రవ్యోల్బణ కట్టడికి కీలక వడ్డీరేట్లను పెంచేందుకు సిద్ధమైన వేళ యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ రెండేళ్ల గరిష్టానికి, క్రూడాయిల్ ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరడంతో ఫెడ్ తీసుకొనే నిర్ణయాలు భారత్‌తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల గమనానికి అత్యంత కీలకం కానున్నాయి. ఇక ఈ వారంలో సుమారు 360 కంపెనీలు త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఇందులో అధిక భాగం బ్యాంకింగ్ రంగానికి చెందిన కంపెనీలు. -
ఓరియంట్ ఎలక్ట్రిక్ లాభం రూ. 35 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఓరియంట్ ఎలక్ట్రిక్ సంస్థ లాభం 7 శాతం పెరిగి రూ. 35 కోట్లకు చేరింది. గత క్యూ2లో ఇది రూ. 32 కోట్లు. తాజాగా ఆదాయం రూ. 434 కోట్ల నుంచి రూ. 594 కోట్లకు పెరిగింది. సమీక్షా కాలంలో వివిధ విభాగాల పనితీరు మెరుగ్గా ఉందని, ఆదాయం 37 శాతం వృద్ధి నమోదు చేసిందని సంస్థ వెల్లడించింది. ఎంట్రీ స్థాయి ఉత్పత్తులు, ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయని పేర్కొంది. ఇక ఎగుమతి మార్కెట్లు కూడా తెరుచుకుంటూ ఉండటంతో కొత్త ఆర్డర్లు కూడా లభించాయని ఓరియంట్ ఎలక్ట్రిక్ తెలిపింది. కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండటం, మూడో క్వార్టర్లో పండుగ సీజన్, వర్షపాతం మెరుగ్గా ఉండటం తదితర అంశాలు డిమాండ్‌కు దోహదపడగలవని ఆశిస్తున్నట్లు పేర్కొంది. వేసవి సీజన్లో దీని సానుకూల ప్రభావం ఉండవచ్చని భావిస్తున్నట్లు వివరించింది. -
ఫలితాలు, ప్రపంచ సంకేతాలే దిక్సూచి
న్యూఢిల్లీ: ఈ వారం(18–22) దేశీ స్టాక్ మార్కెట్లు ప్రధానంగా కార్పొరేట్ల త్రైమాసిక ఫలితాలు, ప్రపంచ సంకేతాలపై ఆధారపడి కదలనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే జులై–సెప్టెంబర్(క్యూ2) ఫలితాల విడుదల ప్రారంభమైన నేపథ్యంలో ఇకపై మరిన్ని కంపెనీలు ఆర్థిక పనితీరును వెల్లడించనున్నట్లు తెలియజేశారు. క్యూ2లో ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ తదితర ఐటీ బ్లూచిప్ కంపెనీలతోపాటు ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సైతం ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఈ బాటలో ఫలితాల సీజన్ మరింత వేడెక్కనున్నట్లు నిపుణులు తెలియజేశారు. క్యూ2 జాబితా ఇలా ఈ వారం రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనున్న దిగ్గజాల జాబితాలో అల్ట్రాటెక్ సిమెంట్, ఏసీసీతోపాటు ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్, నెస్లే, ఏషియన్ పెయింట్స్, డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితరాలున్నాయి. ఇవేకాకుండా జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హిందుస్తాన్ జింక్, ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ సైతం క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. ఇక మరోవైపు చైనా క్యూ3(జులై–సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు, సెపె్టంబర్ నెలకు యూఎస్పారిశ్రామికోత్పత్తి వివరాలు వెల్లడికానున్నాయి. సెంటిమెంటుపై ఎఫెక్ట్ ఈ వారం దలాల్ స్ట్రీట్‌లో త్రైమాసిక ఫలితాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు పలువురు స్టాక్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. తదుపరి కాలానికి కంపెనీలు ప్రకటించే ఆదాయ అంచనాలు(గైడెన్స్) తదితరాలను ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నట్లు తెలియజేశారు. దీంతో ఆయా కంపెనీలు విడుదల చేసే ప్రోత్సాహకర లేదా నిరుత్సాహకర ఫలితాల ఆధారంగా మార్కెట్లలో ఆటుపోట్లు కనిపించవచ్చని శామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యెషా షా పేర్కొన్నారు. వారాంతాన ఫలితాలు వెలువడిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ కౌంటర్లలో నేడు(సోమవారం) అధిక యాక్టివిటీ నమోదుకావచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. వీటితోపాటు ఈ వారం ఎఫ్ఎంసీజీ, సిమెంట్ దిగ్గజాలుసహా ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ తదితర ఫలితాలు మార్కెట్లను నడిపించే వీలున్నట్లు అంచనా వేశారు. కరెక్షన్ తదుపరి కొద్ది రోజుల దిద్దుబాటు తదుపరి ఈ వారం గ్లోబల్ మార్కెట్లు జోరందుకునే వీలున్నట్లు సంతోష్ అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ ఫలితాలకు ఇవి జత కలిసే అవకాశమున్నట్లు తెలియజేశారు. రానున్న రోజుల్లో బ్యాంకింగ్ రంగం కీలకంగా నిలవనున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. ఫైనాన్షియల్ రంగంలోని సంస్థలు క్యూ2 పనితీరు వెల్లడించవలసి ఉన్నట్లు తెలియజేశారు. కార్పొరేట్ ఆర్జనల్లో పటిష్ట రికవరీపట్ల పెరుగుతున్న అంచనాలు మార్కెట్లలో బుల్ రన్ కొనసాగేందుకు దోహదపడవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే మార్కెట్ అంచనాలు విఫలమైతే ఆయా రంగాలలో స్వల్పకాలానికి దిద్దుబాటు జరగవచ్చని అంచనా వేశారు. మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, ఇటీవల జోరు చూపుతున్న ముడిచమురు ధరలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడుల తీరు తదితర అంశాలు సైతం సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు వివరించారు. కాగా.. గత గురువారం ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 1,247 పాయింట్లు(2 శాతం) పుంజుకోవడం ద్వారా మార్కెట్ చరిత్రలోనే తొలిసారి 61,000 పాయింట్ల మైలురాయిని అధిగమించిన సంగతి తెలిసిందే. ఈ బాటలో నిఫ్టీ 18,000 పాయింట్ల మార్క్ ఎగువన నిలిచింది. విజయదశమి పర్వదినం సందర్భంగా గత శుక్రవారం మార్కెట్లకు సెలవుకావడంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. రుణ మార్కెట్లో ఎఫ్‌పీఐల అమ్మకాలు అక్టోబర్‌లో నికరంగా వెనకడుగు అక్టోబర్‌లో ఇప్పటివరకూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ క్యాపిటల్ మార్కెట్లలో నికర అమ్మకందారులుగా నిలిచారు. గత రెండు నెలల్లో కనిపించిన పెట్టుబడుల ట్రెండ్‌కు విరుద్ధంగా ఎఫ్‌పీఐలు అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకు రూపాయి మారకపు విలువ పతనం, ప్రపంచ పరిణామాలు కారణమైనట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం నికరంగా అక్టోబర్ నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు రూ. 1,472 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ప్రధానంగా రుణ(డెట్) మార్కెట్లో అమ్మకాల ట్రెండ్ నమోదైంది. ఫలితంగా రూ. 1,698 కోట్లు విలువైన సెక్యూరిటీలను విక్రయించారు. ఇదేసమయంలో మరోపక్క రూ. 226 కోట్ల విలువైన ఈక్విటీలను నికరంగా కొనుగోలు చేశారు. -
వ్యాక్సిన్, క్యూ3 ఫలితాలే కీలకం
ముంబై: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ సన్నాహక చర్యలు, కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక(ఆక్టోబర్–డిసెంబర్) ఫలితాల ప్రకటన, స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి వంటి కీలక అంశాలు ఈ వారంలో మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనున్నా యని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు కలిసిరావడంతో గతవారంలో సెన్సెక్స్ 895 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 296 పాయింట్లను ఆర్జించడమే కాకుండా సాంకేతికంగా కీలకమైన 14,000 స్థాయిపైన ముగిసింది. ఈ సూచీలకిది వరుసగా పదోవారమూ లాభాల ముగింపు. మార్కెట్లో బుల్ రన్‌కు అనువైన పరిస్థితులు నెలకొనడంతో కొంతకాలం పాటు సూచీల అప్‌ట్రెండ్ కొనసాగవచ్చని జియోజిత్ ఫైనాన్స్ సర్వీస్ హెడ్ రీసెర్చ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. అనుకున్నట్లే అప్‌ట్రెండ్ కొనసాగితే నిఫ్టీ 14,300 స్థాయిని, తదుపరి 14,400 స్థాయిని అధిగమించే అవకాశం ఉందన్నారు. డౌన్‌సైడ్‌లో 13,800 స్థాయి వద్ద, 13,700 స్థాయిల వద్ద మద్దతున్నట్లు నాయర్ వివరించారు. ఆర్థిక ఫలితాల ప్రభావం... ఐటీ సేవల సంస్థ టీసీఎస్ జనవరి 8 న క్యూ3 ఆర్థిక గణాంకాలను ప్రకటించి ‘‘కార్పొరేట్ ఆర్థిక ఫలితాల సీజన్’’కు తెరతీయనుంది. టీసీఎస్‌తో పాటు కొన్ని చిన్న ఐటీ, బ్యాంకింగ్ కంపెనీలు తమ మూడో క్వార్టర్ ఫలితాలను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో సంబంధిత రంగాల షేర్లు ఈ వారంలో అధిక వ్యాల్యూమ్స్‌తో ట్రేడయ్యే అవకాశం ఉంది. ఆర్ధిక గణాంకాలు మెప్పించగలిగితే మార్కెట్లో కొనుగోళ్లు కొనసాగవచ్చు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై దృష్టి... భారత్‌లో కరోనా కట్టడికి కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ల వినియోగానికి గతవారంలో డీసీజీఐ నుంచి అనుమతులు వచ్చేశాయి. వ్యాక్సినేషన్ సన్నద్ధతపై పరిశీలనకు కేంద్రం దేశవ్యాప్తంగా డ్రైరన్ విజయవంతంగా నిర్వహించింది. కొన్ని మీడియా కథనాల ప్రకారం జనవరి 6 నుంచి దేశంలో వ్యాక్సి నేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. ఆర్థిక గణాంకాలు కీలకమే... గతేడాది డిసెంబర్ ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండియా (పీఎంఐ) గణాంకాలు జనవరి 4న, అలాగే జనవరి 6న ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా సర్వీసెస్ గణాంకాలు విడుదలకానున్నాయి. బుల్లిష్ ట్రెండే.. జీఎస్టీ అమలు నాటి నుంచి ఈ డిసెంబర్లో అత్యధికంగా రూ.1.15 లక్షల కోట్ల వసూళ్లు జరగడం ఇదే తొలిసారని ఆర్థిక శాఖ తెలిపింది. డిసెంబర్లో వాహన విక్రయాలు పెరిగినట్లు ఆటో కంపెనీలు వెల్లడించాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ నుంచి మార్కెట్‌కు సానుకూల సంకేతాలు అందినట్లైంది. అమెరికా మార్కెట్లు కూడా గతవారం చివరి రోజున గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. ఈ పరిణామాల దృష్ట్యా ఈ వారమూ మార్కెట్లో పాజిటివ్ వాతావరణం నెలకొనే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
సెన్సెక్స్ 36,980పైన... ర్యాలీ వేగవంతం
పలు దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నా, ప్రతీ చిన్న క్షీణతలోనూ సైతం పెట్టుబడులు వెల్లువెత్తుతున్నందున, భారత్‌తో సహా అంతర్జాతీయ మార్కెట్లన్నీ కొద్దిపాటి ఒడిదుడుకులకు లోనైనా, గతవారం పటిష్టంగానే ట్రేడయ్యాయి. కొన్ని కార్పొరేట్లు వెల్లడించిన త్రైమాసికపు ఫలితాలు, ఆ సందర్భంగా ఆయా కంపెనీలు చేసిన ప్రకటనలే గతవారపు స్వల్ప హెచ్చుతగ్గులకు కారణం. ఇక భారత్ విషయానికొస్తే బ్యాంకింగ్ షేర్ల నుంచి ఇతర రంగాలకు పెట్టుబడుల మళ్లింపు కొనసాగుతోంది. గతవారంరోజుల్లోనే బ్యాంక్ నిఫ్టీ ఇటీవలి గరిష్టస్థాయి నుంచి 8 శాతం వరకూ నష్టపోవడం ఇందుకు నిదర్శనం. నిఫ్టీ మాత్రం లాభంతో ముగిసింది. అయితే తిరిగి బ్యాంకింగ్ షేర్ల తోడ్పాటుతోనే భారత్ సూచీలు...గత శుక్రవారం కీలక అవరోధస్థాయిల్ని ఛేదించాయి. ఇక స్టాక్ సూచీల సాంకేతిక అంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... జూలై 17తో ముగిసినవారం ప్రథమార్ధంలో గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన కీలక 200 రోజుల చలన సగటు రేఖ (200 డీఎంఏ) సమీపంలో గట్టి నిరోధాన్ని చవిచూసి 35,877 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయినప్పటికీ, ద్వితీయార్ధంలో వేగంగా కోలుకుని 200 డీఎంఏను ఛేదించింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 426 పాయింట్ల లాభంతో 37,020 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రస్తుతం 36,980 సమీపంలో వున్న 200 రోజుల చలన సగటు (200 డీఎంఏ) రేఖను సెన్సెక్స్ అధిగమించినందున, ఈ స్థాయిపైన స్థిరపడితే రానున్న రోజుల్లో ర్యాలీ మరింత వేగవంతం కావొచ్చు. ఈ స్థాయిపైన సెన్సెక్స్ నిలదొక్కుకుంటే, కోవిడ్ కారణంగా పతనానికి దారితీసిన మార్చి తొలివారంనాటి బ్రేక్‌డౌన్ స్థాయి అయిన 37,740 పాయింట్ల స్థాయిని త్వరలో అందుకోవొచ్చు. ఈ స్థాయిని సైతం ఛేదించగలిగితే, వచ్చే కొద్దిరోజుల్లో క్రమేపీ 38,380 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగే ఛాన్సు వుంటుంది. పైన ప్రస్తావించిన 36,980 పాయింట్లస్థాయిపైన సెన్సెక్స్ నిలదొక్కుకోలేకపోతే 36,525 సమీపంలో తొలి మద్దతు లభిస్తోంది. ఈ స్థాయి దిగువన ముగిస్తే 36,030 వరకూ తగ్గవచ్చు. ఈ లోపున 35,870 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు. నిఫ్టీ కీలక స్థాయి 10,872... గత మంగళవారం నిఫ్టీ కీలకమైన 200 డీఎంఏ రేఖ సమీపస్థాయి 10,890 పాయింట్ల వరకూ పెరిగి, వెనువెంటనే 10,562 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమయ్యింది. అటుతర్వాత అంతేవేగంతో రిక వరీ అయ్యి, కీలక అవరోధస్థాయిని దాటి, 10,933 పాయింట్ల గరిష్టస్థాయిని అందుకుంది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 134 పాయింట్ల లాభంతో 10,902 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రస్తుతం 200 డీఎంఏ రేఖ కదులుతున్న 10,872 పాయింట్ల స్థాయి నిఫ్టీకి ఈ వారం కీలకం. ఈ స్థాయిపైన 11,035 పాయింట్ల వరకూ వేగంగా పెరిగే అవకాశం వుంటుంది. ఈ స్థాయిపైన ముగిస్తే, స్వల్ప ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, క్రమేపీ కొద్దిరోజుల్లో 11,245 వరకూ ర్యాలీ జరిపే ఛాన్స్ వుంటుంది. ఈ వారం నిఫ్టీ 10,872 పాయింట్ల స్థాయిని పరిరక్షించుకోలేకపోతే 10,750 సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన ముగిస్తే 10,595 వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున 10,560 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. – పి. సత్యప్రసాద్ -
అంతర్జాతీయ అంశాలు, ఫలితాలే దిక్సూచి
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్ గతవారంలో 2 శాతం లాభాలను నమోదుచేసింది. మూడు వారాల్లో 6 శాతం ఎగసింది. మార్చి 23 నాటి కనిష్టస్థాయి నుంచి ఏకంగా 42 శాతం లాభపడింది. నిఫ్టీ 7,511 పాయింట్ల నుంచి మళ్లీ 10,600 స్థాయిని అధిగమించింది. ఇక్కడ నుంచి ఎటువైపు ప్రయాణం చేస్తుందనే అనే ఉత్కంఠభరిత వాతావరణంలో కంపెనీలు ప్రకటించనున్న 2020–21 మొదటి త్రైమాసిక ఫలితాలు, ఆర్థికాంశాలు మార్కెట్ దిశను నిర్దేశించనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గురువారం క్యూ1 ఫలితాలను ప్రకటించడం ద్వారా ఐటీ రంగ త్రైమాసిక ఫలితాల బోణీ కొట్టనుంది. ప్రధాన సూచీల ట్రెండ్‌కు ఇది కీలకంకానుందని విశ్లేషణ. ఈ అంశాలకు తోడు రాష్ట్రాల లాక్డౌన్ ప్రకటనలు, ట్రేడ్‌వార్ వంటి ప్రతికూల అంశాలు మార్కెట్‌ను ప్రభావితం చేయనున్నాయి. ఇక ఇదేవారంలో అవెన్యూ సూపర్‌మార్ట్స్ (డీమార్ట్), కర్ణాటక బ్యాంక్, సౌత్ ఇండియా బ్యాంక్ ఫలితాలను ప్రకటించనున్నాయి. ఆయా అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయి. ఐఐపీ డేటా: మేనెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు శుక్రవారం వెల్లడికానున్నాయి. చైనా జూన్ నెల ద్రవ్యోల్బణ డేటా, జపాన్ మేనెల మెషినరీ ఆర్డర్ల గణాంకాలు గురువారం విడుదలకానున్నాయి. మార్కిట్ సర్వీసెస్, కాంపోజిట్ పీఎంఐ డేటాను అమెరికా సోమవారం ప్రకటించనుంది. -
గెయిల్ చరిత్రాత్మక లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ గెయిల్ మార్చి త్రైమాసికంలో రూ.1,122 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న లాభంతో పోలిస్తే ఇది 10 శాతం అధికం. ఆదాయం సైతం రూ.15,430 కోట్ల నుంచి రూ.18,764 కోట్లకు వృద్ధి చెందింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి రూ.74,808 కోట్ల ఆదాయం (39 శాతం అధికం)పై రూ.6,026 కోట్ల లాభాన్ని (30 శాతం వృద్ధి) నమోదు చేసింది. వాటాదారుల వద్దనున్న ప్రతీ షేరుకు మరొక షేరును బోనస్‌గా ఇవ్వాలని, అలాగే, ప్రతీ షేరుకు రూ.1.77చొప్పున తుది డివిడెండ్ ఇచ్చేందుకు బోర్డు సిఫారసు చేసింది. 2018–19లో రికార్డు స్థాయిలో ఇంతకుముందు ఎన్నడూ లేని స్థాయిలో రూ.8,344 కోట్లను విస్తరణపై ఖర్చు చేశామని, వచ్చే 2–3 ఏళ్లలో మరో రూ.54,000 కోట్లను గ్యాస్ పైపులైన్ల ఏర్పాటుపై ఖర్చు చేయనున్నట్టు గెయిల్ చైర్మన్, ఎండీ బీసీ త్రిపాఠి తెలిపారు. గెయిల్‌కు దేశవ్యాప్తంగా 14,000 కిలోమీటర్ల పొడవు పైపులైన్ మార్గాలు ఉన్నాయి. కొత్తగా రూ.32,000 కోట్లతో 6,000 కిలోమీటర్ల మేర పైపులైన్లు నిర్మిస్తోంది. దీంతో తూర్పు, దక్షిణ భారత్‌లో అనుసంధానం లేని ప్రాంతాలకు చేరుకోగలదు. అలాగే, వారణాసి, పాట్నా పట్టణాలకు పైపు ఆధారిత సహజవాయువు సరఫరా చేసేందుకు గాను రూ.12,000 కోట్లతో పంపిణీ నెట్‌వర్క్‌ను కూడా నిర్మిస్తోంది. మరో రూ.10,000 కోట్లను పెట్రోకెమికల్స్ వ్యాపార విస్తరణపై వెచ్చించనుంది. -
యస్ బ్యాంక్ క్యూ1 లాభం 33% జంప్
ముంబై : ప్రైవేటు రంగ యస్ బ్యాంకు జూన్ త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. కంపెనీ నికర లాభం 33 శాతం వృద్ధితో రూ.732 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో స్థూల నిరర్థక ఆస్తులు సైతం 0.46% నుంచి 0.79%కి పెరిగాయి. నికర వడ్డీ ఆదాయం 24.2% వృద్ధితో రూ.1,316 కోట్లుగా నమోదైంది. రుణాల్లో 33% వృద్ధి, కరెంట్, సేవింగ్స్ ఖాతాల డిపాజిట్లలో 29 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. వడ్డీయేతర ఆదాయం సైతం 65.2 శాతం వృద్ధితో రూ.900.5 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ మార్జిన్లు స్వల్ప పెరుగుదలతో 3.4 శాతంగా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలోకి... అసెట్స్ మేనేజ్మెంట్ కంపెనీ ఏర్పాటుకు సెబీ నుంచి అనుమతి లభించినట్టు యస్ బ్యాంకు ప్రకటించింది. రానున్న కొన్ని నెలల్లో దీనికి తుదిరూపు తీసుకొచ్చి వచ్చే ఏడాది ప్రారంభంలో మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలోకి అడుగుపెడతామని తెలిపింది. కాగా, బ్యాంకు వ్యాపారాన్ని సహజసిద్ధంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని, అదే సమయంలో కొనుగోళ్లకు సైతం సిద్ధంగా ఉన్నామని యస్ బ్యాంకు సీఈవో, ఎండీ రాణాకపూర్ ప్రకటించారు. వచ్చే వారం ఏడు రకాల క్రెడిట్ కార్డులను ఆవిష్కరిస్తామని చెప్పారు. ఎన్పీఏల పెరుగుదల ఆందోళనలపై మాట్లాడుతూ... నికర ఎన్పీఏలు 0.29 శాతంగానే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. బిలియన్ డాలర్ల నిధుల సమీకరణను క్యూఐపీ విధానంలో 2017 మార్చి లోపు పూర్తి చేయనున్నట్టు చెప్పారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం 21% వృద్ధి
ముంబై: ప్రైవేటురంగ బ్యాంకింగ్ అగ్రగామి యాక్సిస్ బ్యాంక్.. ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్(2013-14, క్యూ2)లో రూ.1,362 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.1,124 కోట్లతో పోలిస్తే 21.2 శాతం వృద్ధిని నమోదుచేసింది. మెరుగైన నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎం), రూ.280 కోట్ల వన్‌టైమ్ ఆదాయం(వడ్డీయేతర) ఇందుకు దోహదం చేశాయని బ్యాంక్ పేర్కొంది. బ్యాంక్ మొత్తం ఆదాయం కూడా రూ.8,280 కోట్ల నుంచి రూ.9,375 కోట్లకు పెరిగింది. 13.2 శాతం వృద్ధి చెందింది. కాగా, ఇతర ఆదాయం క్రితం క్యూ2లో రూ.1,593 కోట్ల నుంచి ఇప్పుడు రూ.1,766 కోట్లకు పెరిగింది. బ్యాంక్ బ్యాలెన్స్‌షీట్ సెప్టెంబర్ చివరినాటికి 16 శాతం పెరిగి రూ.3,51,363 కోట్లకు చేరినట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సోమనాథ్ సేన్‌గుప్తా చెప్పారు. ఇక మొత్తం రుణాలు క్యూ2లో 17 శాతం ఎగబాకి రూ.2,01,303 కోట్లకు ఎగిశాయి. బ్యాంక్ నిరర్ధక ఆస్తులు(ఎన్పీఏ-మొండిబకాయిలు) క్యూ2లో స్వల్పంగా పెరిగాయి. స్థూల ఎన్పీఏలు 1.10 శాతం నుంచి 1.19 శాతానికి; నికర ఎన్పీఏలు 0.33 శాతం నుంచి 0.37 శాతానికి చేరాయి. కాగా, క్యూ2లో తాజా మొండిబకాయిలు కార్పొరేట్ రంగం నుంచే నమోదయ్యాయని సేన్‌గుప్తా వివరించారు. ఎన్ఐఎం 3.46 శాతం నుంచి 3.79 శాతానికి పెరిగింది. ఇక నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 26 శాతం వృద్ధితో రూ.2,327 కోట్ల నుంచి రూ.2,937 కోట్లకు ఎగసింది. కాగా, క్యూ2లో రూ.1,030 కోట్ల విలువైన రుణాలను పునర్వ్యవస్థీకరించినట్లు సేన్‌గుప్తా వెల్లడించారు. ప్రస్తుత 2013-14 ఆర్థిక సంవత్సరం మిగతా క్వార్టర్లలో కూడా ఎన్ఐఎం 3.5% పైనే కొనసాగగలదని ఆయన అంచనా వేశారు. తొలి ఆరు నెలల్లో...: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో యాక్సిస్ బ్యాంక్ నికర లాభం 18% వృద్ధి చెందింది. రూ.2,277 కోట్ల నుంచి రూ.2,771 కోట్లకు ఎగబాకింది. ఇక మొత్తం ఆదాయం కూడా రూ.18,434 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.16,098 కోట్లతో పోలిస్తే... 14.5 శాతం వృద్ధి నమోదైంది. కాగా, గురువారం బీఎస్ఈలో యాక్సిస్ బ్యాంక్ షేరు ధర 1.26 శాతం పెరిగి రూ. 1,095 వద్ద స్థిరపడింది. -
టీసీఎస్ జూమ్
న్యూఢిల్లీ: దేశంలో నంబర్ వన్ సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్.. బంపర్ ఫలితాలతో అదరగొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2013-14; క్యూ2)లో రూ.4,633 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.3,512 కోట్లతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన లాభం 34 శాతం దూసుకెళ్లింది. ఇక మొత్తం ఆదాయం కూడా రూ.15,621 కోట్ల నుంచి రూ.20,977 కోట్లకు ఎగబాకింది. 34.3 శాతం వృద్ధి నమోదైంది. అన్ని రంగాలు, వివిధ దేశాల మార్కెట్ల నుంచి ఐటీకి డిమాండ్ జోరందుకోవడం, డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పడిపోవడం వంటివి కంపెనీకి కలిసొచ్చాయి. ప్రధానంగా బ్యాంకింగ్-ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా(బీఎఫ్ఎస్ఈ), తయారీ రంగాలు ఈ పటిష్టమైన వృద్ధికి దోహదం చేశాయి. ఉత్తర అమెరికా, యూరప్ సహా అన్ని కీలక ప్రాంతాల నుంచి డిమాండ్ పుంజుకుంది. ఇక డాలరు రూపంలో నికరలాభం కూడా 16.4 శాతం ఎగసి 74.8 కోట్ల డాలర్లకు చేరింది. ఆదాయం 17 శాతం వృద్ధితో 334 కోట్ల డాలర్లుగా నమోదైంది. త్రైమాసికంగానూ జోష్... ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(క్యూ1, సీక్వెన్షియల్‌గా)తో పోల్చినా టీసీఎస్ లాభాలు దూసుకెళ్లాయి. క్యూ1లో రూ.3,830 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా లాభం క్యూ2లో 22.76 శాతం ఎగసింది. ఇక ఆదాయం క్యూ1లో రూ.17,987 కోట్లుగా ఉంది. దీంతో చూస్తే.. క్యూ2లో 16.6 శాతం వృద్ధి చెందింది. ఇతర ముఖ్యాంశాలివీ... సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీకి 10 కోట్ల డాలర్లకు పైగా విలువగల కాంట్రాక్టులు ఇచ్చిన ముగ్గురు క్లయింట్లు జతయ్యారు. బీపీఓ విభాగంతో సహా నికరంగా 7,664 మంది ఉద్యోగులు కంపెనీలో చేరారు(స్థూలంగా 17,362 మంది జతయ్యారు). దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,85,250కి చేరింది. పటిష్టమైన వ్యాపార పరివూణంతో పాటు, కరెన్సీ క్షీణత(డాలరుతో పోలిస్తే క్యూ2లో రూపాయి మారకం విలువ 11% పడిపోయింది), కాంట్రాక్టులను కచ్చితత్వంతో అమలు చేయడం తమకు మేలు చేశాయని టీసీఎస్ సీఎఫ్ఓ రాజేష్ గోపీనాథన్ వ్యాఖ్యానించారు. దీంతో దేశీ ఐటీ పరిశ్రమను మించిన నిర్వహణ మార్జిన్లను క్యూ2లో నమోదుచేయగలిగామని చెప్పారు. కరెన్సీ క్షీణతతో మార్జిన్లు 300 బేసిస్ పాయింట్లు మెరుగైనట్లు తెలిపారు. వాటాదారులకు రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ. 4 చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలో రెండో విడత మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. క్యూ1లో కూడా రూ. 4 చొప్పున మధ్యంతర డివిడెండ్ ఇచ్చింది. తాజా మధ్యంతర డివిడెండ్ చెల్లింపునకు రికార్డు తేదీ ఈ నెల 28. పటిష్టమైన ఫలితాలు ఉంటాయన్న అంచనాలతో టీసీఎస్ షేరు ధర మంగళవారం బీఎస్ఈలో ఒకానొకదశలో 2%(రూ.44) ఎగబాకి రూ.2,258ని తాకింది. చివరకు స్వల్ప లాభంతో రూ.2,218 వద్ద ముగిసింది. ఇది కొత్త గరిష్టస్థాయి. నియామకాలను పెంచే అవకాశం... ఈ ఏడాది కొత్త ఉద్యోగుల నియామకాల సంఖ్యను పెంచే అవకాశం కూడా ఉందని టీసీఎస్ సీఈఓ, ఎండీ ఎన్.చంద్రశేఖరన్ చెప్పారు. ‘ఐటీకి మంచి డిమాండ్ ఉంది. దీంతో కంపెనీ నియామకాల లక్ష్యాన్ని కూడా కాస్త పెంచొచ్చు’ అని తెలిపారు. అయితే, అదనంగా ఎంతమందిని తీసుకుంటారనేది ఆయన వెల్లడించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 45,000-50,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని గతంలో లక్ష్యంగా నిర్దేశించుకుంది. ట్రైనీలను మినహాయిస్తే.. ‘ఉద్యోగుల వినియోగం క్యూ2లో 0.75 శాతం పెరిగి 83.4 శాతానికి చేరింది. క్యూ3లో కూడా ఇది మరింత పెరగనుంది. దీంతో నియామకాలపై దృష్టిపెడుతున్నాం. ఈ దిశగా చర్యలు జరుగుతున్నాయి. మరోపక్క, ఐటీ విభాగంలో సిబ్బంది వలసల రేటు (అట్రిషన్) 9.8 శాతంగా ఉంది. మొత్తం మీద చూస్తే 10.9 శాతంగా నిలిచింది’ అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఐటీకి అన్ని మార్కెట్లు, పరిశ్రమల నుంచి అత్యంత పటిష్టమైన డిమాండ్ కొనసాగుతోంది. దీంతోపాటు క్లయింట్లతో వ్యూహాత్మక భాగస్వామ్యాల ఆసరాతో క్యూ2లో మెరుగైన ఫలితాలను సాధించగలిగాం. భవిష్యత్తులోనూ ఇదే ధోరణి ఉంటుందని బలంగా విశ్వసిస్తున్నాం. - ఎన్. చంద్రశేఖరన్,టీసీఎస్ ఎండీ, సీఈఓ