సియట్‌, నెట్‌వర్క్‌18 లాభాలు డౌన్‌ | quarterly results of companies ceat and network 18 | Sakshi
Sakshi News home page

సియట్‌, నెట్‌వర్క్‌18 లాభాలు డౌన్‌

Published Thu, Jan 16 2025 12:02 PM | Last Updated on Thu, Jan 16 2025 12:55 PM

quarterly results of companies ceat and network 18

టైర్ల తయారీ దిగ్గజం సియట్‌(Ceat) లిమిటెడ్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 46 శాతంపైగా క్షీణించి రూ. 97 కోట్లకు పరిమితమైంది. పెరిగిన ముడిసరుకుల వ్యయాలు లాభాలను దెబ్బతీశాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 181 కోట్లుపైగా ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 2,963 కోట్ల నుంచి రూ. 3,300 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 2,739 కోట్ల నుంచి రూ. 3,176 కోట్లకు పెరిగాయి. ముడిసరుకుల వినియోగ వ్యయాలు రూ. 1,695 కోట్ల నుంచి రూ. 2,117 కోట్లకు ఎగశాయి. అన్ని విభాగాలలోనూ  పటిష్ట ఆర్డర్‌ బుక్‌ను కలిగి ఉన్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో అర్నాబ్‌ బెనర్జీ పేర్కొన్నారు. స్థిరమైన డిమాండ్‌ కారణంగా ఆదాయంలో వృద్ధి కొనసాగే వీలున్నట్లు అంచనా వేశారు.

ఇదీ చదవండి: కాలర్‌ ఐడీ ఫీచర్‌ను వెంటనే అమలు చేయాలని ఆదేశాలు

నెట్‌వర్క్‌18..

ప్రయివేట్‌ రంగ సంస్థ నెట్‌వర్క్‌18(Network18) మీడియా అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో భారీ నష్టాలు చవిచూసింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో రూ. 1,400 కోట్ల నష్టం ప్రకటించింది. అయితే అనుకోని పద్దులకు ముందు దాదాపు రూ. 26 కోట్ల నికర లాభం ఆర్జించినట్లు కంపెనీ పేర్కొంది. అనుబంధ సంస్థల గుర్తింపురద్దుతో రూ. 1,426 కోట్ల నష్టం నమోదైనట్లు వెల్లడించింది. వీటిని ప్రొవిజనల్‌గా మదింపు చేసినట్లు తెలియజేసింది. స్టార్‌ ఇండియాతో అనుబంధ కంపెనీ వయాకామ్‌18 విలీనం కారణంగా గతేడాది(2023–24) ఫలితాలను పోల్చతగదని పేర్కొంది. కాగా.. మొత్తం ఆదాయం రూ. 1,361 కోట్లకు చేరింది. స్టాండెలోన్‌ ఆదాయం రూ. 476 కోట్లను అధిగమించగా.. అనుకోని ఆర్జనతో రూ.3,432 కోట్ల లాభం ఆర్జించింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement