మోసపూరిత కాల్స్‌ను అరికట్టడానికి భారత టెలికమ్యూనికేషన్ శాఖ(DoT) చర్యలు తీసుకుంటోంది. కాలర్ ఐడీ ఫీచర్‌ను అన్ని టెలికాం అపరేటర్లు వెంటనే అమలు చేయాలని ఆదేశించింది. మొబైల్ ఫోన్లలో కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ (CNAP) సేవలను అందుబాటులోకి తీసుకురావాలని తెలిపింది. ఇన్ కమింగ్ కాల్స్‌కు సంబంధించి ఎవరు కాల్ చేశారో పేరు డిస్ ప్లే అయ్యేలా ఈ చర్యలు ఉపయోగపడనున్నాయి. దాంతో స్పామ్, స్కామ్ కాల్స్‌ను కట్టడి చేయవచ్చని డాట్ అంచనా వేస్తుంది.
ఇటీవల టెలికాం ఆపరేటర్లతో జరిగిన సమావేశంలో సీఎన్‌ఏపీ సర్వీసులో ఆలస్యం జరగకుండా వెంటనే అమలు చేయాల్సిన అవసరాన్ని టెలికాం శాఖ నొక్కి చెప్పింది. టెలికాం కంపెనీలు ఈ టెక్నాలజీ కోసం ఇప్పటికే ట్రయల్స్ ప్రారంభించాయి. కానీ సాంకేతిక పరిమితుల కారణంగా 2జీ వినియోగదారులకు దీన్ని అమలు చేయడం సవాలుగా మరినట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటికే ఈ సేవలందిస్తున్న ప్రైవేట్ కంపెనీలు
కాల్ చేసింది ఎవరనే వివరాలు డిస్‌ప్లేపై కనిపించడంతో కాల్ రిసీవ్ చేసుకునేవారికి సీఎన్‌ఏపీ సర్వీసు ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా స్పామ్, స్కామ్ కాల్స్‌కు గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. అయితే ఇప్పటికే ట్రూకాలర్ వంటి కొన్ని కంపెనీలు.. తమకు కాల్స్ చేసే వారి పేరును రిసీవర్ ఫోన్(mobile phones) డిస్‌ప్లేపై వచ్చేలా సేవలందిస్తున్నాయి. ప్రభుత్వం ఈ కొత్త సర్వీసు తీసుకురావడంతో ఈ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.
అంతర్జాతీయ కాల్స్‌కు ఇలా..
సీఎన్‌ఏపీ సర్వీస్‌తో పాటు, వినియోగదారులు అంతర్జాతీయ కాల్స్ ద్వారా మోసపోకుండా నిరోధించడానికి +91 కాల్స్‌ను అంతర్జాతీయ కాల్స్‌గా మార్క్ చేయాలని టెలికాం శాఖ టెల్కోలకు సూచించింది. ఇటీవల అంతర్జాతీయ స్కామ్ కాల్స్ పెరగడం ఎక్కువవుతుందని, ఈ చర్యల వల్ల ప్రమాదాన్ని కట్టడి చేసే అవకాశం ఉంటుందని తెలిపింది.
సవాళ్లున్నా అమలుకు సిద్ధం
సీఎన్‌ఏపీ సర్వీసు కోసం ట్రయల్స్ ఇంకా కొనసాగుతున్నాయి. అయితే కాల్స్ ఒక టెలికాం సర్కిల్‌లో ప్రారంభమమై మరొక సర్కిల్‌లో ముగుస్తాయి. గ్రౌండ్ రియాలిటీలను పరిగణనలోకి తీసుకోకుండా ఈ సర్వీసును తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదని మొబైల్ పరిశ్రమ నిపుణులు వాదిస్తున్నారు. ఏదేమైనా టెక్నికల్ సవాళ్లు ముగిసి, వ్యవస్థ స్థిరపడిన తర్వాత ఈ సేవను అమలు చేస్తామని టెల్కోలు తెలిపాయి.
ఇదీ చదవండి: పాలసీబజార్ కార్యాలయంలో జీఎస్టీ సోదాలు
Comments
Please login to add a commentAdd a comment