పాలసీబజార్(Policybazaar) మాతృసంస్థ పీబీ ఫిన్‌టెక్ గురుగ్రామ్ కార్యాలయంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) సోదాలు నిర్వహించింది. పాలసీబజార్ ఆఫ్‌లైన్ ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ విభాగమైన పీబీ పార్టనర్స్‌తో కలిసి కొందరు విక్రేతల ద్వారా పన్ను ఎగవేతకు పూనుకుందని ఆరోపణలొచ్చాయి. దాంతో జీఎస్టీ అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించినట్లు తెలిసింది.
ఈ సోదాల్లో భాగంగా అధికారులు కంపెనీ ఆవరణలోని డాక్యుమెంట్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. జీఎస్టీ ఫైలింగ్‌లో వ్యత్యాసాలు, ఎగవేతలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ సోదాలపై పీబీ ఫిన్‌టెక్ స్పందించింది. జీఎస్టీ అధికారులకు అవసరమైన మొత్తం సమాచారాన్ని అందించినట్లు, తదుపరి ఏవైనా సమాచారం కావాల్సి వచ్చినా పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది. ఈ సోదాల వల్ల కంపెనీపై ఎలాంటి ఆర్థిక ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఈ కంపెనీ పైసాబజార్‌ను కూడా నిర్వహిస్తోంది. ఈ సోదాలకు సంబంధించి జీఎస్టీ అధికారిక వివరణ ఇవ్వలేదు.
ఇదీ చదవండి: హిండెన్‌బర్గ్ మూసివేత! బెదిరింపులు ఉన్నాయా..?
తనిఖీలు ఎందుకు..?
పన్ను చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూడటానికి, ఏదైనా పన్ను ఎగవేతను కనుగొనడానికి జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తూంటారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఫ్రేమ్వర్క్ కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యల్లో భాగంగా ఈ సోదాలు చేస్తారు. అయితే ఇలా నిర్వహించే సోదాలకు చాలా కారణాలున్నాయి. జీఎస్టీ ఫైలింగ్‌లో వ్యత్యాసాలను గుర్తించడానికి, పన్ను ఎగవేతను వెలికితీయడానికి ఇవి సహాయపడతాయి. తనిఖీల సమయంలో మోసపూరిత కార్యకలాపాలను సూచించే పత్రాలు, రికార్డులు, ఇతర సాక్ష్యాలను అధికారులు స్వాధీనం చేసుకోవచ్చు. పన్నులు ఎగవేయాలని భావించే వ్యాపారాలు, వ్యక్తులకు ఈ తనిఖీలు అడ్డంకిగా మారుతాయి.
Comments
Please login to add a commentAdd a comment