అదానీ గ్రూప్, నికోలా వంటి కంపెనీలపై తీవ్ర ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కంపెనీ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ కంపెనీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన నోట్‌లో ఈమేరకు నిర్ణయాన్ని వెల్లడించారు. సంస్థ మూసివేతకు సంబంధించి ఏదైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా.. అనే దానిపై అండర్సన్ నోట్‌లో వివరాలు తెలియజేశారు.
‘సంస్థ మూసివేత గురించి కొంతకాలంగా నా ఆత్మీయులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో చర్చించాను. చాలా చర్చలు జరిగిన తర్వాతే సంస్థను మూసివేయాలని నిర్ణయించుకున్నాను. మేము తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఎలాంటి బెదిరింపులు, భయాలు, వ్యక్తిగత అంశాలు లేవు. హిండెన్‌బర్గ్ నా జీవితంలో ఒక మధురమైన అధ్యాయంగా మిగిలిపోతుంది. ఈ సంస్థ వల్ల ఎంతో సాహసం చేశాను. ఎన్నో ఇబ్బందులు, ఒత్తిళ్లు ఎదురైనా ఏ మాత్రం తొనకకుండా సంస్థను నిర్వహించాను. ఈ వ్యవహారం అంతా నాకో ప్రేమకథలా తోస్తుంది. కంపెనీ స్థాపించడానికి ముందు నన్ను నేను నిరూపించుకోవాలని ఎంతో కష్టపడేవాడిని. ప్రస్తుతం కంఫర్ట్ జోన్‌లో ఉన్నానని అనిపిస్తోంది. ఇకపై భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెడతాను. నా బృందం మంచి స్థాయికి చేరుకునేందుకు సాయపడతాను’ అని తెలిపారు.
ఇదీ చదవండి: రష్యాపై యూఎస్ ఆంక్షలు.. చమురుపై ప్రభావం
హిండెన్‌బర్గ్ గురించి..
నాథన్ అండర్సన్ 2017లో దీన్ని స్థాపించారు. యూఎస్‌కు చెందిన ఈ కంపెనీ షార్ట్ సెల్లింగ్ సంస్థగా, ఇన్వెస్టిగేటివ్ రీసెర్చ్‌గా ప్రసిద్ధి చెందింది. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. 2023లో అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంట్స్‌లో మోసం చేసిందని హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపించింది. ఈ నివేదికతో కంపెనీ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్ల(సుమారు రూ.8.3 లక్షల కోట్లు)కు పైగా తుడిచిపెట్టుకుపోయింది. 2020లో నికోలా తన సాంకేతికతను ఉపయోగించి పెట్టుబడిదారులను మోసం చేసిందని ఆరోపించింది. హిండెన్‌బర్గ్ రద్దు చేయడానికి ముందు పోంజీ పథకాల నివేదికలతో సహా తన తుది దర్యాప్తులను పూర్తి చేసినట్లు తెలిపింది. అండర్సన్ తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment