GST
-
ఇసుకపై ఇంకో అబద్ధం
సాక్షి, అమరావతి: ఇసుకపై కేబినెట్ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం పచ్చి అబద్ధాలను వల్లె వేసింది. ఇసుకపై జీఎస్టీని రద్దు చేస్తూ బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు గనుల, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. నిజానికి జీఎస్టీని రద్దు చేసే అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ లేదు. అయినా సరే ఇసుకపై జీఎస్టీని రద్దు చేస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని, ఇక నుంచి పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటుందని మంత్రి రవీంద్ర ప్రకటించడంపై అధికార యంత్రాంగం సైతం విస్తుపోతోంది.ఇసుక తవ్వకం, లోడింగ్ వ్యయంపై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తం వినియోగదారులపైనే పడుతుంది. ప్రైవేట్ ఏజెన్సీలు ఇసుక సేల్ పాయింట్ల దగ్గర విక్రయిస్తే ఐదు శాతం జీఎస్టీ చెల్లించాలి. ఇది కూడా వినియోగదారులపైనే పడుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తనకు లేని అధికారంతో జీఎస్టీని రద్దు చేస్తూ ఎలా నిర్ణయం తీసుకుంటుందని ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.జీఎస్టీ కౌన్సిల్‌దే నిర్ణయంఇసుక సహా ఏదైనా సరే జీఎస్టీ నుంచి మినహాయింపు పొందాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర జీఎస్టీ కౌన్సిల్‌కు ప్రతిపాదించాల్సి ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై జీఎస్టీ నుంచి మినహాయింపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటే నోటిఫికేషన్ జారీ చేస్తారని, అది దేశమంతా వర్తిస్తుందని చెప్పారు. రాష్ట్రానికో మాదిరిగా జీఎస్టీ ఉండదని, మీడియా సమావేశంలో మంత్రి చేసిన ప్రకటన ఆశ్చర్యం కలిగించిందని వ్యాఖ్యానించారు. ఇసుకపై సీనరేజ్ రద్దు చేసే అధికారం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, అయితే జీఎస్టీ కూడా రద్దు చేశామని ప్రకటించడమంటే ప్రజల కళ్లకు గంతలు కట్టడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చట్టం గురించి తెలియదా?ఇసుక కార్యకలాపాలపై ఎస్జీఎస్టీని మాత్రమే రీయింబర్స్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని, అంతకు మించి జీఎస్టీని రద్దు చేసే అధికారం లేదని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు వెల్లడించారు. అందరి కన్నా ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పని చేశానని, తనకు ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు జీఎస్టీని రద్దు చేసే అధికారం రాష్ట్రాలకు లేదని తెలియదా? అనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జోరుగా సాగుతోంది. నిర్మాణ రంగానికి ప్రైవేట్ ఏజెన్సీల నుంచి కొనుగోలు చేసే ఇసుకపై 2017 సీజీఎస్టీ చట్టం సెక్షన్ 9 ప్రకారం ఐదు శాతం జీఎస్టీ చెల్లించాలి. ఇసుక తవ్వకం, లోడింగ్ వ్యయంలో సీజీఎస్టీ చట్టం సెక్షన్ 7 (1) ప్రకారం 18 శాతం జీఎస్టీ చెల్లించాలి. ఈ చట్టం జమ్మూ–కశ్మీర్ మినహా దేశమంతా వర్తిస్తుంది.మాఫియాను అరికట్టలేక చేతులెత్తేశారు..!తనకు ఏమాత్రం అధికారం లేని జీఎస్టీని రద్దు చేసినట్లు అబద్ధాలు చెబుతూ సీఎం చంద్రబాబు ఇసుక వినియోగదారులతో చెలగాటం ఆడుతున్నారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాష్ట్రంలో ఇసుక దొరకపోవడానికి, అత్యధిక ధరలకు విక్రయించడానికి మూల కారణం పచ్చ ముఠాలేనని తెలిసినా వారిని నిరోధించకుండా గత ప్రభుత్వంపై నిందలు మోపటాన్ని బట్టి ఇసుక మాఫియాను అరికట్టలేక చంద్రబాబు చేతులెత్తేశారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఇసుక బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతోందని, అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ అధికారులు ఇచ్చిన నివేదికలను పట్టించుకోకుండా గత ప్రభుత్వంపై బురద చల్లితే ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రిగా తానే ఉన్నాననే విషయాన్ని విస్మరిస్తున్న చంద్రబాబు టీడీపీ నేతల ఇసుక దోపిడీని అరికట్టకుండా ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా ప్రజలు విశ్వసించరని చెప్పారు. ఇసుక విధానంలో ఇప్పటి వరకు నాలుగు సార్లు మార్పులు చేసినా ప్రయోజనం శూన్యమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సరఫరా కేంద్రాల వద్ద గంటల తరబడి వాహనాలు నిరీక్షించాల్సి రావడం వల్ల ఎక్కువ రవాణా చార్జీలను చెల్లించాల్సి వస్తోంది. బ్లాక్ మార్కెటింగ్, అస్తవ్యస్థంగా రీచ్‌ల నిర్వహణ గురించి తెలిసినా పట్టించుకోకపోవటాన్ని బట్టి ప్రభుత్వం ఈ దోపిడీని ప్రోత్సహిస్తున్నట్లు భావించాల్సి వస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
వీటిపై జీఎస్టీ తగ్గింపు.. భారీగా తగ్గనున్న ధరలు
జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం (GoM) కొన్ని వస్తువుల ధరల మీద జీఎస్టీ తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో 20-లీటర్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్, సైకిళ్స్, ఎక్సర్సైజ్ నోట్బుక్లు ఉన్నాయి. ఇదే సమయంలో రిస్ట్ వాచీలు, బూట్లపైన జీఎస్టీ పెంచినట్లు అధికారి తెలిపారు.బీహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఆధ్వర్యంలో జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం తీసుకున్న రేట్ రీజిగ్ నిర్ణయం రూ. 22,000 కోట్ల ఆదాయానికి దారి తీస్తుందని అధికారులు తెలిపారు.20 లీటర్లు అంతకంటే ఎక్కువ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌పై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని మంత్రుల బృందం ప్రతిపాదించింది. మంత్రుల బృందం సిఫార్సును జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించినట్లయితే.. రూ.10,000 కంటే తక్కువ ధర ఉన్న సైకిళ్లపై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గుతుంది.ఎక్సర్సైజ్ నోట్‌బుక్‌లపై కూడా జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించనున్నట్లు మంత్రుల బృందం ప్రతిపాదించింది. రూ.15,000 కంటే ఎక్కువ ధర కలిగిన బూట్లు మీద, రూ. 25,000 ఎక్కువ ధర కలిగిన రిస్ట్ వాచీలపై జీఎస్టీ 18 శాతం నుంచి 28 శాతానికి పెంచనున్నారు.ఇదీ చదవండి: ఇలా అయితే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీసమావేశంలో రేట్ల హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం తీసుకున్న నిర్ణయాలు.. సామాన్యులకు ఉపశమనం కలిగించనున్నాయి. ఈ సమావేశంలో 100 కంటే ఎక్కువ వస్తువులకు సంబంధించి జీఎస్టీ రేట్లను చర్చించారు. అయితే 18 శాతం శ్లాబులో ఉన్న హెయిర్ డ్రైయర్లు, హెయిర్ కర్లర్లపై ఉన్న జీఎస్టీని మళ్ళీ 28 శాతం శ్లాబులోకి చేర్చనున్నట్లు బృందం వెల్లడించింది.జీఎస్టీ అనేది ప్రస్తుతం 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం అనే నాలుగు శ్లాబుల్లో ఉంది. ఇందులో కొన్ని వస్తువులు తక్కువ శ్లాబులో.. మరికొన్ని ఎక్కువ శ్లాబులో ఉన్నాయి. మరికొన్ని వస్తువులకు జీఎస్టీ మాత్రమే కాకుండా.. అదనంగా సెస్‌ను కూడా విధిస్తున్నారు. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, సీనియర్ సిటిజన్ భీమా కవరేజీకి జీఎస్టీలో మినహాయింపు ఉండవచ్చు. -
Group of ministers: జీఎస్టీ రేట్లలో సెస్సు విలీనం!
న్యూఢిల్లీ: జీఎస్టీ కాంపెన్సేషన్ (పరిహారం) సెస్సును జీఎస్టీ రేట్లలో విలీనం చేసే ప్రతిపాదనపై మంత్రుల బృందం (జీవోఎం) చర్చించింది. జీఎస్టీ ఆరంభంలో రాష్ట్రాలు కోల్పోయే పన్నును భర్తీ చేసేందుకు వీలుగా సెస్సును ప్రవేశపెట్టడం తెలిసిందే. ఒక్కసారి విలీనంపై నిర్ణయం తీసుకున్న తర్వాత, ఈ సెస్సు నుంచి మళ్లే క్రమంలో మరే వస్తువును లగ్జరీ లేదా సిన్ విభాగం కిందకు చేర్చకూడదని రాష్ట్రాలు సూచించాయి. 2026 మార్చిలో కాంపెన్సేషన్ సెస్సు ముగిసిన అనంతరం దాన్ని జీఎస్టీ రేట్లలో కలిపేయాలని.. అప్పటి వరకు ఏ వస్తువులకు సెస్సు అమలు చేశారో వాటికి సంబంధించి ప్రత్యేక రేటును జీఎస్టీలో ప్రవేశపెట్టాలన్నది రాష్ట్రాల అభిప్రాయంగా ఉంది. ‘‘జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్సు ముగింపునకు వస్తోంది. దీని భవిష్యత్ ఏంటన్న దానిపై చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రతి రాష్ట్రం తమ అభిప్రాయాలను తెలియజేసింది. ఇందుకు సంబంధించి ఇది తొలి సమావేశం’’అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రకటించారు. మంత్రుల బృందానికి ఆయనే నేతృత్వం వహిస్తున్నారు. సెస్సును కొనసాగించాలా లేదంటే దాన్ని పన్ను కిందకు మార్చాలా? లగ్జరీ విభాగంలో మార్పులు చేయాలా? అన్న దానిపై చర్చలు కొనసాగుతున్నట్టు చెప్పారు. జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్సుపై నవంబర్ రెండో వారంలో జీవోఎం మరోసారి సమావేశమై చర్చించనుంది. అసోం, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్ రాష్ట్రాల మంత్రులు జీవోఎంలో సభ్యులుగా ఉన్నారు. -
జీఎస్టీలో లోయెస్ట్
సాక్షి, అమరావతి: మూడు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం రెబ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తోంది. ప్రజా సంక్షేమం, పాలనపై దృష్టి పెట్టకుండా కేవలం స్వార్థపూరిత, కక్షపూరిత రాజకీయాలతో కాలం గడిపేస్తోంది. దీంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమవుతోంది. బాబు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వరుసగా మూడో నెలలో కూడా జీఎస్టీ ఆదాయం పడిపోవడమే ఇందుకు నిదర్శనం. ఒకపక్క దేశంలోని ప్రధాన రాష్ట్రాల జీఎస్టీఆదాయం భారీగా పెరుగుతుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తగ్గిపోతోంది. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి వృద్ధి రేటులో పెద్ద రాష్ట్రాలతో పోటీ పడిన ఆంధ్రప్రదేశ్ తొలిసారిగా తిరోగమనంలో ఉంది. మిజోరం, మేఘాలయా, నాగాలాండ్ వంటి చిన్న రాష్ట్రాలతో పోటీపడుతోంది. తాజాగా కేంద్రం విడుదల చేసిన జీఎస్టీ గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర జీఎస్టీ ఆదాయం గతేడాది సెప్టెంబర్ నెలలో రూ.3,658 కోట్లు కాగా, ఈ ఏడాది సెప్టెంబరులో (గత నెల) రూ.3,506 కోట్లకు పడిపోయింది. అంటే 4 శాతం తగ్గిపోయింది. ఇదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలైన కర్నాటక 8 శాతం, కేరళ 7 శాతం, తమిళనాడు 5 శాతం వృద్ధిని సాధించాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రతి నెలా జీఎస్టీ ఆదాయం పెరుగుతున్నా మన రాష్ట్రంలో మాత్రం జూలై నెలలో ఏడు శాతం, ఆగస్టులో 5 శాతం, సెప్టెంబర్‌లో 4 శాతం మేర తగ్గిపోయింది. -
సెప్టెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు ఎంతంటే..
అక్టోబర్ 1న విడుదలైన ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. భారతదేశ వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు సెప్టెంబర్‌లో రూ. 1.73 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో (2023 సెప్టెంబర్) జీఎస్టీ వసూళ్లు మొత్తం 1.62 లక్షల కోట్లు.2023 సెప్టెంబర్ కంటే కూడా 2024 సెప్టెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు 6.5 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. 2024 ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు 1.75 లక్షల కోట్లు. గత నెలలో వ్యాపార కార్యకపాల ద్వారా ఆదాయం 5.9 శాతం (రూ.1.27 లక్షల కోట్లు) పెరిగింది. వస్తువుల దిగుమతుల ద్వారా కూడా ఆదాయం 8 శాతం (రూ.45,390 కోట్లు) పెరిగింది. మొత్తం మీద గత ఏడాది సెప్టెంబర్ కంటే కూడా ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
వాటర్ బాటిల్ ధర తగ్గనుందా..?
ఆల్కహాల్‌లేని పానీయాలపై జీఎస్టీని సరళీకరించాలని ఇండియన్ బేవరేజ్ అసోసియేషన్ సూచించింది. డ్రింక్స్‌లో ఉండే చక్కెర పరిమాణం ఆధారంగా జీఎస్టీ రేటు విధించాలని తెలిపింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అన్ని విధాలా ప్రోత్సహిస్తే ఆల్కహాల్‌లేని పానీయాల మార్కెట్ దేశీయంగా 2030 వరకు రూ.1.5 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని స్పష్టం చేసింది.కార్బొనేటెడ్ పానీయాలపై పన్ను విధానాల మీద ఐసీఆర్ఐఈఆర్ నివేదిక విడుదల చేసింది. ఈ సందర్భంగా ఇండియన్ బేవరేజ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జె.పి.మీనా మాట్లాడుతూ..‘ప్రస్తుతం ఈ విభాగ పరిమాణం రూ.60,000 కోట్లుగా ఉంది. భారత ఆహార ప్రాసెసింగ్ రంగంలో ఆల్కహాలేతర పానీయాలు(సీసాల్లోని నీరు, సాఫ్ట్ డ్రింక్స్) కీలకం. భవిష్యత్తులో భారత్ ఈ విభాగంలో అంతర్జాతీయ తయారీ కేంద్రంగా అవతరించనుంది. ప్రస్తుతం 20 లీటర్లు లేదా అంతకుమించి నీళ్ల సీసాలకు 12 శాతం జీఎస్టీ, 20 లీటర్ల లోపైతే 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. అలా కాకుండా ఒకే రేటు వర్తించేలా చూడాలి. నీళ్ల సీసాలన్నింటికీ 5 శాతం జీఎస్టీ విధించాలి’ అని సూచించారు.ఇదీ చదవండి: పెట్రోల్‌పై రూ.15, డీజిల్‌పై రూ.12 లాభం..!దేశీయంగా, అంతర్జాతీయంగా నీళ్ల సీసాల సరఫరాను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని మీనా తెలిపారు. ఈ విభాగంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా ఈ ప్రతిపాదన తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఆల్కహాలేతర పానీయాల్లో చక్కెర స్థాయులు ఎక్కువ ఉంటే అధిక జీఎస్టీ, తక్కువ ఉంటే తక్కువ జీఎస్టీ విధించాలన్నారు. దేశంలో వస్తు సేవల పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన సమయంలో ఆల్కహాలేతర పానీయాలను హానికారక ఉత్పత్తుల కేటగిరీలో చేర్చారని చెప్పారు. దీనిపై ప్రభుత్వ వర్గాలు పునరాలోచించాలన్నారు. సాఫ్ట్డ్రింక్స్పై చక్కెర పరిమాణం ఆధారంగా జీఎస్టీ రేటు నిర్ణయించాలని సూచించారు. -
జీఎస్టీ శ్లాబుల క్రమబద్ధీకరణపై 25న చర్చ
జీఎస్టీలో ప్రస్తుతమున్న వివిధ రకాల శ్లాబుల క్రమబద్ధీకరణ, రేట్ల తగ్గింపుపై మంత్రుల బృందం ఈ నెల 25న భేటీ కానుంది. గోవాలో మంత్రుల బృందం సమావేశం అవుతున్నట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల మంత్రుల బృందం (జీవోఎం) చివరిసారి ఆగస్టు 22న సమావేశం కాగా, ఈ నెల 9న జీఎస్టీ కౌన్సిల్‌కు ఈ అంశంపై స్థాయీ నివేదిక సమర్పించింది.కొన్ని రకాల వస్తు, సేవల పన్ను రేట్లలో మార్పులు చేస్తే ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయాలపై పన్ను అధికారులతో కూడిన ఫిట్మెంట్ కమిటీ నుంచి మంత్రుల బృందం నివేదిక కోరడం గమనార్హం. ప్రస్తుతం జీఎస్టీలో 5, 12, 18, 28 రేట్లు అమల్లో ఉన్నాయి. నిత్యావసర వస్తువులను తక్కువ శ్లాబులో, విలాస వస్తువులను అధిక శ్లాబులో ఉంచారు. 12 శాతం, 18 శాతం స్థానంలో ఒక్కటే పన్ను ఉండాలన్న ప్రతిపాదన ఉంది. పశ్చిమబెంగాల్, కర్ణాటక రాష్ట్రాలు శ్లాబులను కుదించడం పట్ల సానుకూలంగా లేవు. జీఎస్టీ శ్లాబుల్లో ఎలాంటి మార్పులు ఉండొద్దన్నది ఈ రాష్ట్రాల వాదనగా ఉంది. ఇదీ చదవండి: పెరుగుతున్న ఈఎంఐ కల్చర్! -
బీమా ప్రీమియంపై జీఎస్టీ.. మంత్రుల సంఘం ఏర్పాటు
బీమా పాలసీల ప్రీమియంపై జీఎస్టీను సరళీకరించేందుకు మంత్రుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీ రేటుకు సంబంధించి 13 మందితో కూడిన ఈ మంత్రుల సంఘం సూచనలిస్తుంది. అక్టోబర్ 30న ఈ కమిటీ తన నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.జీఎస్టీ మండలి ఏర్పాటు చేసిన ఈ కమిటీకి బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ ఛౌధ్రి నేతృత్వం వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, గోవా, మేఘాలయ, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల మంత్రుల సంఘం సిఫారసులు అందించనుంది. గతంలో జరిగిన పార్లమెంట్ సమావేశంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌కు కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని తెలిపారు. ఈమేరకు ఆర్థికమంత్రికి లేఖ సైతం పంపించారు. అంతకుముందే బీమా ప్రీమియంపై జీఎస్టీ సరళీకరించాలనే ప్రతిపాదన కేంద్రం వద్ద ఉంది. దాంతో త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఇటీవల జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. అందులో భాగంగానే తాజాగా మంత్రుల సంఘాన్ని ఏర్పాటు చేసి నివేదిక కోరుతున్నారు.ఇదీ చదవండి: సెబీ చీఫ్‌పై మరోసారి కాంగ్రెస్ ఆరోపణలునవంబర్లో జరిగే జీఎస్టీ మండలి సమావేశంలో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం బీమా ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో దీన్ని 5 శాతానికి తగ్గించాలనే డిమాండ్ ఉంది. మరి కొన్నింటిలో ప్రీమియంపై పూర్తిగా జీఎస్టీను ఎత్తివేయాలని కోరుతున్నారు. -
నిర్మలాసీతారామన్‌పై స్టాలిన్ మండిపాటు
చెన్నై: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌పై తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. ఆమెది అహంకారమని,ఆమె తీరు సరిగా లేదని విమర్శించారు. ఇటీవల కోయంబత్తూరులో జీఎస్టీపై జరిగిన సమావేశంలో ఓ రెస్టారెంట్ చైన్ యజమాని శ్రీనివాసన్ నిర్మలాసీతారామన్‌ను ప్రశ్నించారు.జీఎస్టీలోని లోపాలను ఎత్తి చూపేందుకు బన్, క్రీమ్, క్రీమ్ బన్‌లపై విధిస్తున్న జీఎస్టీ పన్నును సోదాహరణంగా వివరించారు.ఇది అక్కడ సమావేశంలో ఉన్నవారికి నవ్వు తెప్పించింది. దీంతో అక్కడున్నవారంతా విరగబడి నవ్వారు. ఏమైందో తెలియదు కానీ ఆ తర్వాత జరిగిన ప్రైవేట్ భేటీలో శ్రీనివాసన్ నిర్మలకు క్షమాపణ చెబుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. దీనిపై ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీతో సహా దేశవ్యాప్తంగా పలువురు విపక్ష నేతలు నిర్మలపై విమర్శలు గుప్పించారు.ఇదీ చదవండి.. ఆకాశవీధిలో రోజు 4.3లక్షల మంది -
తగ్గిన జీఎస్టీ ఆదాయం
‘ఎన్నికల ముందు నా అనుభవంతో సంపద సృష్టిస్తా’ అన్న చంద్రబాబు.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొత్తగా ఒక రూపాయి ఆదాయం కూడా సృష్టించలేకపోయారు. రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలైతే పూర్తిగా క్షీణించాయి. గత రెండు నెలలుగా నమోదవుతున్న జీఎస్టీ వసూళ్ల గణాంకాలే ఇందుకు నిదర్శనం. చంద్రబాబు సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత వరుసగా రెండో నెలలో కూడా జీఎస్టీ ఆదాయం నేలచూపులు చూసింది. గతేడాది ఆగస్టుతో పోల్చితే.. ఈ ఏడాది ఆగస్టులో జీఎస్టీ ఆదాయం 5 శాతం క్షీణించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 2023 ఆగస్టులో రూ.3,479 కోట్లుగా ఉన్న రాష్ట్ర జీఎస్టీ ఆదాయం 2024 ఆగస్టులో 5 శాతం తగ్గి రూ.3,298 కోట్లకు పడిపోయింది. మహారాష్ట్రలో 13 శాతం, కర్ణాటక 11 శాతం, ఒడిశా 11 శాతం, కేరళ 9 శాతం, తమిళనాడు 7 శాతం, తెలంగాణ రాష్ట్రాల్లో 4 శాతం చొప్పున వృద్ధి నమోదైతే.. ఒక్క ఏపీలో మాత్రమే జీఎస్టీ ఆదాయం తగ్గింది. జూలైలో కూడా ఏపీలో 7 శాతం క్షీణత నమోదైంది. – సాక్షి, అమరావతినాడు కోవిడ్ సంక్షోభంలోనూ రెండంకెల వృద్ధికోవిడ్ సంక్షోభం తర్వాత కూడా రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం పరుగులు తీసింది. జాతీయ సగటు వృద్ధి రేటు కంటే అధికంగా.. రెండంకెల వృద్ధిని నమోదు చేస్తూ వచ్చింది. 2019–20లో రూ.28,241.33 కోట్లుగా ఉన్న జీఎస్టీ ఆదాయం.. కోవిడ్ సంక్షోభం ఉన్నా కూడా ఐదేళ్ల కాలంలో 2023–24 నాటికి 59.35 శాతం వృద్ధితో రూ.45,002.73 కోట్లకు చేరింది. అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో సగటున జీఎస్టీ ఆదాయం ఏడాదికి 11.87 శాతం చొప్పున వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం ఏకంగా 15.86 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.45,002.73 కోట్లుగా నమోదయ్యింది. ఈ ఏడాది మార్చి నెలలో 16 శాతం, ఏప్రిల్ 12 శాతం, మే నెలలో 15 శాతం వృద్ధిని నమోదు చేసిన ఏపీ.. కోవిడ్ తర్వాత తొలిసారిగా బాబు పాలనలో తిరోగమనం వైపు పరుగులు తీస్తోంది. బాబు నిర్వాకంతో కొనుగోలు శక్తి తగ్గుదల చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనను గాలికి వదిలేసి ప్రతిపక్షం మీద వేధింపులకే ప్రాధాన్యత ఇవ్వడంతో.. వాణిజ్య కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని యార్డుల్లో భారీగా ఇసుక నిల్వలు ఉంచగా.. కూటమి పార్టీలు అధికారంలోకి రాగానే వాటిని దోచుకొని పక్క రాష్ట్రాలకు తరలించేశాయి. దీంతో ఇసుక కొరత ఏర్పడి రాష్ట్రంలో భవన నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోయాయి.ఇది జీఎస్టీ ఆదాయంపై గణనీయంగా ప్రభావం చూపిస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అలాగే గత ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ఎప్పటికç³్పుడు ప్రజల జేబుల్లో నగదు నింపడం ద్వారా కొనుగోలు శక్తిని పెంచేదని వారు గుర్తు చేస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడంతో ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిందని పేర్కొన్నారు.ఇది కూడా జీఎస్టీ ఆదాయం తగ్గడానికి ముఖ్య కారణమని వెల్లడించారు. ప్రభుత్వ తీరుతో ఆదాయ వనరులు నేలచూపులు చూస్తున్నాయని.. ఇది రాష్ట్ర వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు..?
ఆరోగ్యబీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు అంశానికి సంబంధించి త్వరలో కీలక ప్రకటన వెలువడనుంది. ఈ నెల 9వ తేదీన జరగబోయే జీఎస్టీ కౌన్సిల్లో ఈమేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ అనుకున్న విధంగానే ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయిస్తే రూ.650 కోట్ల నుంచి రూ.3,500 కోట్లు వరకు కేంద్ర ఖజానాపై భారం పడనుంది.దేశంలో చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల ఖర్చు ఏటా పెరుగుతోంది. కొన్ని సర్వేల ప్రకారం వైద్య ఖర్చులు ఏటా 30-40 శాతం మేర అధికమవుతున్నాయి. దాంతో చాలామంది ఆరోగ్య బీమా తీసుకుంటున్నారు. అయితే ప్రతివ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు ఈ సదుపాయాన్ని ఉపయోగిస్తున్నాడు. కాబట్టి పాలసీదారులకు అండగా నిలిచేలా ప్రభుత్వం తాము చెల్లిస్తున్న బీమా ప్రీమియంపై జీఎస్టీని మినహాయించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత బలమైన బ్రాండ్గతంలో జరిగిన పార్లమెంట్ సమావేశంలోనూ ప్రతిపక్ష నేతలు, నితిన్ గడ్కరీ వంటి పాలకపక్ష నేతలు ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీను తొలగించాలని ఆర్థికశాఖకు సిఫార్సు చేశారు. దాంతో త్వరలో జరగబోయే సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంటారనే ఊహాగానాలు వస్తున్నాయి. ప్రీమియంపై జీఎస్టీ మినహాయిస్తే బీమా కంపెనీలు మరింత ఎక్కువగా పాలసీలు జారీ చేసే అవకాశం ఉంది. దాంతో ఆయా కంపెనీల రెవెన్యూ పెరుగుతుందని మార్కెట్ భావిస్తోంది. ప్రస్తుతం ఆరోగ్య బీమా ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఇదిలాఉండగా, జీఎస్టీని పూర్తిగా మినహాయించకుండా కొన్ని షరతులతో పన్ను తగ్గించే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. -
భారత ఆర్థిక వ్యవస్థకు ఇదే కీలకం: నితిన్ గడ్కరీ
పెట్రోల్, డీజిల్ కార్ల వినియోగాన్ని తగ్గించాలని, ప్రత్యామ్నాయ వాహనాలను ఉపయోగించాలని కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' చెబుతూనే ఉన్నారు. ఈ విషయాన్ని ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావిస్తూ.. ఫ్లెక్స్-ఫ్యూయెల్ వాహనాల వినియోగానికి సంబంధించి కూడా మాట్లాడారు.ఫ్లెక్స్-ఫ్యూయెల్ వాహనాలపై జీఎస్టీ తగ్గించాలని (12 శాతానికి), దీని గురించి రాష్ట్ర ఆర్థికమంత్రులు యోచించాలని గడ్కరీ అన్నారు. శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించి, జీవ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు. దీనికోసం వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల మద్దతు అవసరమని అన్నారు.ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాలు ఒకటి కంటే ఎక్కువ రకాల ఇంధనంతో లేదా మిశ్రమంతో నడుస్తుంది. అంటే పెట్రోల్ & ఇథనాల్ లేదా మిథనాల్ మిశ్రమం అన్నమాట. ఇది పెట్రోల్ దిగుమతులను తగ్గిస్తుంది. తద్వారా దేశ ఆర్తిగా పరిస్థితి మరింత మెరుగుపడుతుంది.ప్రతి సంవత్సరం భారతదేశం సుమారు రూ. 22 లక్షల కోట్ల విలువైన ఇంధనాలను దిగుమతి చేసుకుంటోంది. శిలాజ ఇంధనాల వల్ల వాయుకాలుష్యం పెరగడమే కాకుండా.. ఆర్ధిక పరిస్థిని కూడా కొంత దిగజార్చుతుంది. కాబట్టి వీలైనంత వరకు మనం దిగుమతులను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. దీనివైపే అడుగులు వేయాలని గడ్కరీ సూచించారు. దేశంలో జీవ ఇంధనం పుష్కలంగా ఉంది. దీనిని ప్రోత్సహిస్తే.. ఇది వ్యవసాయ రంగానికి కూడా లబ్ధి చేకూర్చుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఆర్థిక వ్యవస్థకు ఆటోమొబైల్ రంగం కీలకంభారత ఆర్థిక వ్యవస్థకు ఆటోమొబైల్ పరిశ్రమ ఒక ముఖ్యమైన విభాగం. దీని వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ జీఎస్టీ లభిస్తుంది. అంతే కాకుండా ఈ రంగంలో ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఆటోమొబైల్ రంగంలో 4.5 కోట్ల కంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఈ నెంబర్ ప్లేట్స్ కావాలా.. ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?హీరో, బజాజ్ వంటి ద్విచక్ర వాహన తయారీ సంస్థలు భారత్‌లో తయారు చేసే బైక్‌లలో 50 శాతం ఎగుమతి చేస్తున్నాయని గడ్కరీ చెప్పారు. జీవ ఇంధనం కోసం మనం మంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంటే.. ఎగుమతులు 10 నుండి 20 శాతం వరకు పెరుగుతాయి. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఇప్పుడు కాలుష్యం కారకాలను విడనాడటానికి సిద్ధంగా ఉన్నయని ఆయన అన్నారు. -
హైదరాబాద్‌లో ఇద్దరు జీఎస్టీ అధికారులపై సీబీఐ కేసు..
సా క్షి, హైదరాబాద్: హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్‌లోని పన్ను ఎగవేత నిరోధక విభాగంలో అవినీతికి పాల్పడ్డ ఇద్దరు అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. లంచం ఆరోపణలపై జీఎస్టీ సూపరింటెండెంట్ ఆనంద్ కుమార్‌తోపాటు ఇన్స్పెక్టర్ మనీష్ శర్మపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఐరన్ స్క్రాప్ గోదాంలో అక్రమాలపై జీఎస్టీ అధికారులు జరిమానా విధించారు. స్క్రాప్ గోదామును సీజ్ చేశారు. అనంతరం బాధితుడు నుంచి అయిదు లక్షల రూపాయలు లంచం తీసుకున్నారు. అయితే సీజ్ చేసిన గోదాంను ఓపెన్ చేసేందుకు మరో 3 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు సీబీఐని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీబీఐ.. రెండు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. -
రూ.341 కోట్ల జీఎస్టీ ఎగవేత!.. బజాజ్ ఫైనాన్స్‌కు నోటీసు
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటెలిజెన్స్ (DGGI) బజాజ్ ఫైనాన్స్‌కి షోకాజ్ నోటీసు జారీ చేసింది. సుమారు రూ.341 కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించిన ఆగస్టు 3 డీజీజీఐ ఈ నోటీసు పంపింది.కేంద్ర పన్ను నిబంధనల ప్రకారం.. మినహాయింపు ప్రయోజనాలను పొందేందుకు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ సర్వీస్/ప్రాసెసింగ్ ఛార్జీలను వడ్డీగా పరిగణించడం ద్వారా జీఎస్టీని ఎగవేస్తోందని ఇంటెలిజెన్స్ వెల్లడించింది. అయితే ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ మొత్తం రూ. 850 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంది.రూ. 341 కోట్ల పన్ను ఎగవేత, రూ. 150 కోట్ల వడ్డీ మాత్రమే కాకుండా.. జూన్ 2022 నుంచి మార్చి 2024 వరకు రోజుకు రూ. 16 లక్షల జరిమానా విధించింది. మొత్తం మీద బజాజ్ ఫైనాన్స్ రూ.850 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉందని సమాచారం. దీంతో కంపెనీకి మొత్తం 160 పేజీల నోటీసు పంపింది.వస్తువులను కొనుగోలు చేయడానికి లోన్ పొందిన వారి నుంచి బజాజ్ ఫైనాన్స్ ముందస్తు వడ్డీ వసూలు చేస్తోంది. డీజీజీఐ దీనికి కూడా టాక్స్ చెల్లించాలని పేర్కొంది. కానీ బజాజ్ ఫైనాన్స్ దీనిని నాన్-టాక్సబుల్ 'వడ్డీ ఛార్జీ'గా వర్గీకరించింది. దీంతో అధికార యంత్రాంగం సమస్యను లేవనెత్తింది. -
ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ తొలగింపు!.. క్లారిటీ ఇచ్చిన నిర్మలా సీతారామన్
లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్ మీద 18 శాతం జీఎస్టీ తొలగించాలనే ఇండియా కూటమి లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. జీఎస్టీ రాకముందు నుంచే మెడికల్ ఇన్సూరెన్స్ మీద టాక్స్ ఉండేది. ఇది కొత్తగా ప్రవేశపెట్టింది కాదు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఇది ఉందని వెల్లడించారు.ఇక్కడ నిరసన తెలుపుతున్నవారు తమ రాష్ట్రాల్లో ఈ పన్ను తొలగింపు గురించి చర్చించారా? వారు తమ తమ రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు దాని గురించి లేఖలు వ్రాసి, రాష్ట్రాలకు 2/3 వంతు ఉన్న GST కౌన్సిల్లో దానిని పెంచాలని కోరారా? లేదు. కానీ ఇక్కడ మాత్రం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది వారి డ్రామా అని నిర్మలా సీతారామన్ అన్నారు.జీవిత, వైద్య బీమాలకు చెల్లించే ప్రీమియంలపై జీఎస్టీను ఉపసంహరించుకోవాలని ఆర్థిక మంత్రిని కోరుతూ నితిన్ గడ్కరీ మొదట లేఖ రాసారు. ఈ చర్య బీమా సంస్థలపై పన్ను భారాన్ని తగ్గించడమే కాకూండా.. ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశంలో కీలకమైన బీమా ఉత్పత్తుల డిమాండ్‌ను పెంచుతుందని ఆయన అన్నారు.నాగ్‌పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్.. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల గురించి నాకు మెమోరాండం సమర్పించింది. యూనియన్ లేవనెత్తిన ప్రధాన సమస్య లైఫ్ అండ్ మెడికల్‌పై GST ఉపసంహరణకు సంబంధించినదని గడ్కరీ అన్నారు.Tax has been there on medical insurance even before GST was introduced. There was already a Service Tax on medical insurance, before the GST was introduced. This is not a new tax, it was already there in all the states. Those protesting here, did they discuss regarding the… pic.twitter.com/iPfSp8goRr— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) August 7, 2024 -
సోమేశ్‌కుమార్‌కు నోటీసులు?
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్‌తోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరికి నోటీసు లు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు సిద్ధమవుతున్నా రు. వారికి త్వరలోనే నోటీసులు పంపనున్నట్టు తెలిసింది. తొలుత ఈ కేసు దర్యాప్తు హైదరాబాద్ సీసీ ఎస్ పోలీసులు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించిన విషయం తెలిసిందే. సీసీఎస్ నుంచి వచి్చన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు దర్యాప్తు చేశారు.మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ సహా నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్విస్ ట్యాక్స్ అదనపు కమిషనర్ ఎస్వీ కాశీవిశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరామప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు, మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్, ప్లియాంటో టెక్నాలజీస్ కంపెనీ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కుంభకోణంలో సోమేశ్‌కుమార్ కీలకంగా వ్యవహరించినట్లుగా అధికారులు భావిస్తున్నారు.‘స్పెషల్ ఇన్సియేటివ్స్’వాట్సాప్ గ్రూప్ ద్వారా సోమేశ్‌కుమార్ సర్విస్ ట్యాక్స్ అధికారులు విశ్వేశ్వరరావు, శివరామప్రసాద్, శోభన్‌బాబులకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆధారాలు సేకరించారు. అయి తే, కమర్షియల్ ట్యాక్స్ సెంట్రల్ కంప్యూటర్ వింగ్ జాయింట్ డైరెక్టర్ రవి కనూరి అందించిన ఆడిట్ రిపోర్ట్స్ ఆధారంగా దర్యాప్తు చేçపట్టారు. ఇన్‌పు ట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ సహా 75 కంపెనీలకు లబ్ధి చేసినట్టు ఆధారాలు లభించాయి. ఈ కుంభకోణంతో ప్రభుత్వ ఖజానా కు రూ.1,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. సీఐడీ దర్యాప్తు ముమ్మరం అయితే కీలకాంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
తొలి నెలల్లోనే వాణిజ్య కార్యకలాపాలు ఢమాల్
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: ప్రజల కొనుగోలు శక్తి, రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలకు కొలమానంగా నిలిచే జీఎస్టీ ఆదాయం తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తొలినెలల్లోనే పాతాళం బాట పట్టింది. కొన్నేళ్లుగా జీఎస్టీ ఆదాయంలో పొరుగు రాష్ట్రాల కంటే మెరుగైన వృద్ధిరేటును సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ జూలై నెలలో నెగిటివ్ వృద్ధిరేటును నమోదు చేసింది. గతేడాది జూలై నెల జీఎస్టీ వసూళ్లతో పోలిస్తే దేశంలోని అన్ని పెద్ద రాష్ట్రాల్లో పెరుగుదల నమోదుకాగా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తగ్గుదల నమోదైంది. తాజాగా కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ లెక్కల ప్రకారం జూలై నెలలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం రూ.3,346 కోట్లు. గతేడాది ఇదే నెలలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం రూ.3,593 కోట్లు. గత ఏడాది జూలైతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో జీఎస్టీ ఆదాయం ఏడుశాతం క్షీణించింది. రూ.247 కోట్ల ఆదాయం తగ్గింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ ఆదాయం తొమ్మిదిశాతం వృద్ధితో రూ.1.34 లక్షల కోట్ల (దిగుమతి వస్తువులు లేకుండా)కు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్జీఎస్టీలోను కోత నమోదైంది. గతేడాది జూలైతో పోలిస్తే ఈ జూలైలో ప్రీ సెటిల్మెంట్ ఎస్జీఎస్టీ వసూళ్లు 10 శాతం, పోస్ట్ సెటిల్మెంట్ వసూళ్లు ఐదుశాతం తగ్గాయి. అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి రెండు నెలలుగా ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించేలా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండా కేవలం పెన్షన్లు పెంచడం తప్ప పరిపాలనను గాలికొదిలేయడంతో రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు ఆగిపోయాయని, ఈ ప్రభావం జీఎస్టీ ఆదాయంపై పడిందని అధికారులు వెల్లడించారు. ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టి ఇసుకను అందుబాటులో ఉంచకపోవడంతో భవననిర్మాణ కార్యకలాపాలు ఆగిపోవడం జీఎస్టీ ఆదాయం తగ్గడానికి ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. భవననిర్మాణ పనులు జరిగితే సిమెంట్, ఇనుము, రంగులు, ఎలక్ట్రికల్, కలప.. ఇలా అనేక వస్తువుల కొనుగోళ్లు జరుగుతాయి. కానీ ఇసుక కొరత కారణంగా వ్యాపారాలు జరగడంలేదని పలువురు వ్యాపారులు లబోదిబోమంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజల చేతుల్లోకి నగదు రావడంతో కొనుగోళ్లు సాగి వ్యాపారాలు కళకళలాడేవి. ఇప్పుడు ఆషాఢమాసం అని ఆఫర్లు పెట్టినా.. కొనుగోళ్లు లేవని రిటైల్ దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది రికార్డు గతేడాది రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ 10 శాతానికిపైగా వృద్ధిరేటు నమోదు చేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఆ శాఖ ఆదాయం రూ.50 వేలకోట్ల మార్కు దాటింది. 2023–24లో రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ ఆదాయం రూ.50,422.60 కోట్లకు చేరితే అందులో నికర జీఎస్టీ ఆదాయం 14 శాతం వృద్ధితో రూ.32,029.62 కోట్లు (ఐజీఎస్టీ చెల్లింపులు పోగా). గత ప్రభుత్వం వాణిజ్యపన్నుల శాఖలో రిటర్నులు దగ్గర నుంచి పన్ను చెల్లింపుల వరకు అధికారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా పూర్తిగా ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తేవడంతో పాటు సంస్కరణలు ప్రవేశపెట్టింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అధికారుల ప్రమేయం లేకుండా వాహనాల తనిఖీకి ఆటోమేటెడ్ చెక్ ఆఫ్ వెహికల్ ట్రాఫిక్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. స్రూ్కట్నీలో అధికారుల ప్రమేయం లేకుండా ర్యాండమ్ విధానంలో ఎంపిక చేసేలా రిటర్న్ స్రూ్కట్నీ ఆటోమేటెడ్ టూల్ వంటి ఎన్నో వ్యాపార అనుకూల చర్యలను చేపట్టడంతో ఆదాయంలో గణనీయమైన వృద్ధి నమోదయింది. -
ఇన్ఫోసిస్‌కు షోకాజ్ నోటీసు.. ఎందుకంటే?
ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ రూ. 32403 కోట్ల జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) ఎగవేతపై ప్రీ-షోకాజ్ నోటీసు అందుకుంది. బీఎస్ఈ ఫైలింగ్‌లో సంస్థ ఈ విషయం వెల్లడించింది.ఇన్ఫోసిస్ లిమిటెడ్.. విదేశీ బ్రాంచ్ ఆఫీస్‌ల కోసం చేసే ఖర్చుల వివరాలను వెల్లడించకలేదని, వాటికి జీఎస్టీ చెల్లించలేదని కర్ణాటక జీఎస్టీ అధికారులు ప్రీ-షోకాజ్ నోటీసు జారీ చేశారు. 2017 జులై నుంచి 2022 మార్చి వరకు 32403 కోట్ల రూపాయలకు జీఎస్టీ చెల్లింపు చేయలేదనేది ఈ ప్రీ-షోకాజ్ నోటీసు సారాంశం.దీనిపైన ఇన్ఫోసిస్ స్పందిస్తూ.. అటువంటి ఖర్చులపైన జీఎస్టీ వర్తించదని తాము విశ్వసిస్తున్నట్లు వెల్లడించింది. అంతే కాకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్, కస్టమ్స్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, భారతీయ సంస్థకు విదేశీ శాఖలు అందించే సేవలు జీఎస్టీ పరిధిలోకి రావని సంస్థ పేర్కొంది.ఇన్ఫోసిస్ ఎప్పటికప్పుడు జీఎస్టీ చెల్లిస్తూనే ఉందని, ఈ విషయంలో తాము కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధలనకు లోబడి పాటించాల్సిన అన్ని నిబంధవులను పాటిస్తున్నట్లు తెలిపింది.ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (ఐజీఎస్టీ) చట్టం ప్రకారం భారతదేశం వెలుపల ఉన్న ఇన్ఫోసిస్ కార్యాలయాలు కంపెనీ నుంచి విభిన్న సంస్థలుగా పరిగణించబడతాయని అధికారులు పేర్కొన్నారు. కాబట్టి బ్రాంచ్ కార్యాలయాలు అందించే అన్ని సేవలను దిగుమతిగా పరిగణిస్తామని, తద్వారా జీఎస్టీ విధించడం జరుగుతుందని వెల్లడించారు. -
జీఎస్టీ స్కామ్ సీఐడీకి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో వెలుగులోకి వచ్చిన రూ.1,000 కోట్ల జీఎస్టీ స్కామ్ కేసును సీఐడీకి బదలాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఐజీఎస్టీ, సెస్ తదితరాలకు సంబంధించి చోటు చేసుకున్న ఈ గోల్‌మాల్‌లో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు నిందితులుగా ఉన్న విషయమూ విదితమే.వాణిజ్య పన్నుల శాఖ కోసం రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను ఐఐటీ–హైదరాబాద్ నిర్వహిస్తోంది. ఈ సంస్థ స్రూ్కట్నీ మాడ్యూల్లో పని చేస్తూ వాణిజ్య పన్నుల శాఖకు ఆయా సంస్థలు దాఖలు చేసే రిటర్న్స్‌ను పరిశీలించి లోటుపాట్లను గుర్తిస్తుంది. ఇందులో మార్పు చేయడం ద్వారా దాదాపు 75 సంస్థలకు అక్రమ లబ్ధి కూరేలా చేశారు.ఈ వ్యవహారం మొత్తం మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్ కనుసన్నల్లోనే జరిగినట్లు ఇప్పటికే గుర్తించారు. అయితే ఈ 75 సంస్థలు ఎవరివి? వాటికి, సోమేశ్‌కుమార్‌కు ఉన్న సంబంధం ఏమిటి? అనేది ప్రస్తుతం కీలకంగా మారిందని అంటున్నారు. ఈ స్కామ్ ద్వారా లబి్ధపొందిన వాటిలో తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ కూడా ఉండటంపై సీసీఎస్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వాణిజ్య అవసరాల నిమిత్తం సేవలు అందించే ప్రతి వ్యక్తి, సంస్థ జీఎస్టీ పరిధిలోకి వస్తారు. వీరు విధిగా ఆ విభాగంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాణిజ్య సేవలు అందించే సంస్థలు తమ బిల్లులో వినియోగించిన, ఖరీదు చేసిన వస్తువు విలువకు అదనంగా ట్యాక్స్‌ను చేర్చి ఆ మొత్తాన్ని వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాయి. ఏటా రిటర్న్స్ దాఖలు సమయంలో ఆయా సంస్థలు ఈ ట్యాక్స్‌ను సంబంధిత విభాగానికి చెల్లించాలి. ఈ పన్నుతో పాటు సెస్సు కూడా ఉంటుంది.మద్యం దుకాణాలకు మద్యం సరఫరా చేయడం ద్వారా బేవరేజెస్ కార్పొరేషన్ వాణిజ్య సర్వీసు చేస్తున్నట్లు లెక్క. దీంతో ఈ విభాగం సైతం కచి్చతంగా జీఎస్టీ చెల్లించాల్సిందే. అయితే గోల్‌మాల్‌కు పాల్పడినట్లు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం వెనుక మరో స్కామ్ ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీయనున్నారు. వాణిజ్య పన్నుల శాఖ సాఫ్ట్‌వేర్‌ను పర్యవేక్షించడానికి ప్రత్యేక స్క్రూట్నీ మాడ్యూల్‌ను రూపొందించిన ఐఐటీ–హైదరాబాద్..దీని నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఎలాంటి సిబ్బందిని నియమించుకోలేదు.పిలాంటో టెక్నాలజీస్ సిబ్బందినే దీనికోసం వినియోగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ–హైదరాబాద్ ప్రాంగణం చిరునామాతో పని చేస్తున్న ఐఐటీ–హైదరాబాద్ పిలాంటో టెక్నాలజీస్ సంస్థ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తుంటుంది. దీన్ని 2010 జనవరిలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శోభన్‌బాబు ఏర్పాటు చేశారని సీసీఎస్ పోలీసులు ఇప్పటికే గుర్తించారు. బిగ్ లీప్ నిర్వాకంతోనే వెలుగులోకి స్కామ్దేశ వ్యాప్తంగా ఐదు మెట్రో నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న బిగ్ లీప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హైదరాబాద్‌కు సంబంధించి సికింద్రాబాద్ కేంద్రంగా పని చేస్తోంది. ఇది ప్రస్తుతం మానవవనరుల సరఫరా రంగంలో ఉందని తేలింది. ఇది ఎగ్గొట్టిన రూ.25.51 కోట్ల వ్యవహారంతోనే ఈ స్కామ్ మొత్తం వెలుగులోకి వచి్చంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌తో పాటు ఐజీఎస్టీ, సెస్‌లను చెల్లించని కొన్ని సంస్థలు అక్రమ లబ్ధి పొందాయి.ఆయా సంస్థలకు లబ్ధి చేకూర్చడం కోసం వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, ఎ.శివరామ ప్రసాద్ వాటి పరిధులను మార్చి చూపించినట్లు గుర్తించారు. తమ పరిధిలోకి రానప్పటికీ... బోగస్ చిరునామాలతో తమ పరిధుల్లో రిజిస్ట్రేషన్లు చేయించారని తేల్చారు. ఈ కేసుకు సంబంధించి త్వరలో సోమేశ్‌కుమార్ సహా మరికొందరికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. -
‘ఒకే పన్ను’కు పెద్ద రంగాలే దన్ను
జీఎస్టీని మరింత సమర్థంగా అమలు చేసేందుకు ఇంకా ఎంతో అవకాశం ఉంది. పన్ను రేట్ల హేతుబద్ధీకరణ, విధానాన్ని సులభతరం చేయడం వీటిల్లో కొన్ని చర్యలు మాత్రమే. అదే సమయంలో ఒకే పన్ను రేటు అన్న అసలు లక్ష్యాన్ని అందుకోవాలంటే ఆర్థిక వ్యవస్థలోని అతి పెద్ద రంగాలైన పెట్రోలియం వంటి వాటిని జీఎస్టీ పరిధిలోకి చేర్చడం తప్పనిసరి. ఒకే పన్ను అన్నది ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినా ఇప్పుడున్న పన్ను స్లాబ్‌లను తగ్గించి, దీర్ఘకాలంలో పన్ను వసూళ్ల ప్రక్రియను మరింత సులభతరం చేయవచ్చు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాలు కూడా హేతుబద్ధమైన దృష్టితో ఆలోచించి దేశ ఆర్థిక వృద్ధి కోసం జీఎస్టీ లక్ష్యానికి దన్నుగా నిలవాలి.దేశంలో ఏడేళ్ల క్రితం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని తొలిసారి ప్రవేశపెట్టినప్పుడు దాని అమలుపై చాలా సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ సందేహాల నివృత్తి జరక్కుండానే జీఎస్టీ అమలుకు నిర్ణయం తీసుకోవడం దుందుడుకు చర్యగా కొందరు అభివర్ణించారు కూడా!అంతకు ఏడాది క్రితమే పెద్దనోట్ల రద్దు జరిగిందని, ఆ నష్టం నుంచి తేరుకోకముందే అరకొరగా జీఎస్టీని అమలు చేయడం సరికాదని వాదించారు. ఆర్థికవేత్తలు, పన్ను నిపుణులు చాలామంది జీఎస్టీ అమలు విఫలం కాక తప్పదన్న హెచ్చరికలూ జారీ చేశారు. అయితే అన్ని అభ్యంతరాలను తోసిరాజని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ముందడుగు వేయడం తెలివైన పనే అని ఇప్పుడు అనిపిస్తోంది. ఎందుకంటే అనుమానాలు తీర్చడంలో, జీఎస్టీలో భాగస్వాములైన వారందరి అభ్యంతరాలకు సమాధానాలు ఇవ్వడంలో ఏళ్లు పూళ్లు అవడం ఖాయం. కానీ ఒక్క విషయమైతే ఇక్కడ చెప్పుకోవాలి. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్ను ఉండాలన్న జీఎస్టీ లక్ష్యం పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలనూ దీని పరిధిలోకి తీసుకు రాగలిగితేనే నెరవేరుతుంది.జీఎస్టీపై సాధికార కమిటీదేశవ్యాప్తంగా ఒకే పన్ను అన్న అంశంపై సుమారు 18 ఏళ్లు చర్చలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వ పరోక్ష పన్నులు, రాష్టాల పన్నుల స్థానంలో ఒకటే పన్ను ఉండాలన్నది 1999 నాటి వాజ్‌పేయి ప్రభుత్వ ఆలోచన. విజయ్ కేల్కర్ నివేదిక ఈ కొత్త పన్ను విధానాన్ని ప్రతిపాదించింది. తద్వారా పన్ను వసూళ్లు మెరుగవుతాయని, ఆర్థిక వ్యవస్థల ఏకీకరణ సాధ్యమవుతుందని అంచనా వేశారు. జీఎస్టీ అమల్లో ఉన్న దేశాల్లో ఆర్థిక వృద్ధి రేటు బాగున్నట్లు అప్పటికే జరిగిన పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి కూడా. జీఎస్టీపై 2000లో ఆర్థిక మంత్రులతో కూడిన ఒక సాధికార కమిటీ ఏర్పాటైంది. పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ మంత్రి అసిమ్‌దాస్ గుప్తా ఆ కమిటీకి నేతృత్వం వహించారు. ఇప్పటి జీఎస్టీ కౌన్సిల్ తొలి రూపం ఆ కమిటీనే. దాని సిఫారసులను అనుసరించి అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం, ఆదాయ వ్యవహారాల్లో ఏకాభిప్రాయ సాధన సూత్రాలుగా జీఎస్టీ కౌన్సిల్ పని చేస్తుంది. చర్చోపచర్చల తరువాత ఈ కమిటీ జీఎస్టీ బిల్లు తొలి ముసాయిదాను సిద్ధం చేసింది. ఇందుకు సుమారు ఇరవై ఏళ్లు పట్టింది. అప్పటికీ కొన్ని అభ్యంతరాలు ఉండగా... 2016 నాటికి గానీ స్థూలమైన ఏకాభిప్రాయం కుదరలేదు.మెరుగుపడిన పన్ను వసూళ్లు!ఒకే ఒక్క పన్ను అన్న లక్ష్యంతో మొదలైన జీఎస్టీలో సంక్లిష్టతలు వచ్చేందుకు ఒక కారణం... తమ ఆదాయం పడిపోతుందన్న రాష్ట్రాల బెంగ. ఫలితంగా... ఒకే పన్ను స్థానంలో పలు రకాల పన్ను రేట్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రాల జీఎస్టీ, కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ, అంతర్రాష్ట్ర రవాణాపై సమీకృత జీఎస్టీ ఇలా పలు రకాల పన్నులు ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా... ఐదు నుంచి 28 శాతం వరకూ నాలుగు విభాగాల పన్ను రేట్లను నిర్ధారించారు. అంతేకాదు... తమకు అత్యధిక ఆదాయాన్నిచ్చే పెట్రోలు, మద్యం జీఎస్టీ పరిధిలోకి రాకుండా ఉండాలని రాష్ట్రాలు పట్టుబట్టాయి. జీఎస్టీ అమలు సమయంలో ఈ పన్ను ద్వారా తగినంత ఆదాయం వస్తుందా? అన్న అనుమానాలు రాష్ట్రాలకు ఉండేది. అయితే ఈ అనుమానాలు వట్టివేనని తేలిపోయింది. వాస్తవానికి పన్ను వసూళ్లు మునుపటి కంటే బాగా మెరుగయ్యాయి. జీఎస్టీ తాజా గణాంకాలను పరిశీలిస్తే గత జూన్ నెలలో వసూళ్లు 1.74 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. జీఎస్టీని ప్రవేశపెట్టిన తొలి ఏడాది ఈ మొత్తం నెలకు 90 వేల కోట్ల రూపాయలు మాత్రమే. రాష్ట్రాల సొంత ఆదాయం కూడా జీఎస్టీ అమలు తరువాత పెరిగినట్లు ఆర్బీఐ జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడయింది. అంటే... రాష్ట్రాలు జీఎస్టీ విషయంలో ఏర్పాటు చేసిన కాంపెన్సేషన్ లేకుండా సొంత ఆదాయాలతోనే వ్యవహారాలు చక్కబెట్టుకునే అవకాశం ఉందన్నమాట. ఈ కాంపెన్సేషన్ అనేది ముందు ఐదేళ్లు ఉంటుందని అనుకున్నారు కానీ... కోవిడ్ కారణంగా 2026 వరకూ పొడిగించారు. ఆదాయం ఇప్పటి మాదిరే పెరుగుతూ ఉంటే ఈ ఏర్పాటును రద్దు చేయవచ్చు.చిన్న వ్యాపారులకు మేలే జరిగింది!మొత్తమ్మీద జీఎస్టీ అమలులో కొన్ని ఆటుపోట్లు ఉన్నాయన్నది వాస్తవం. పద్ధతులను సులువు చేసే విషయంలో, మరీ ముఖ్యంగా రెడ్టేప్ను తగ్గించడంలో! అయితే ఇతర సమస్యలేవైనా వచ్చినా వాటి పరిష్కారం కోసం రాష్ట్రాలు తరచూ జీఎస్టీ కౌన్సిల్ రూపంలో సమావేశమవుతూండటం గమనార్హం. చిన్న చిన్న వ్యాపారాలను జీఎస్టీ పరిధిలోకి తేవడం ఎలా అనే సవాలును కంప్యూటర్ల సాయంతో అధిగమించారు. జీఎస్టీ అమలుతో చిన్న వ్యాపారులకు నష్టం జరుగుతుందని కొంతమంది భయపడ్డారు కానీ.. వాస్తవానికి జరిగింది మేలే. లక్షలాది చిన్న వ్యాపారులు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమైపోయారు.జీఎస్టీ పరిధిలోకి పెట్రోలుజీఎస్టీ అమలుతో సామాన్యులపై పన్ను భారం ఎక్కువ అవుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు కానీ దీనికి కూడా సరైన హేతువు ఏదీ లేదని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. వినియోగమవుతున్న వస్తువుల్లో 60 శాతం వాటికి అతి తక్కువ పన్ను రేట్లు (సున్నా లేదంటే ఐదు శాతం) ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మరోవైపు కేవలం మూడు శాతం వస్తువులపై మాత్రమే 28 శాతం అత్యధిక పన్ను పడుతోంది. అయినా ఒక్క విషయాన్ని మాత్రం మనం అంగీకరించాల్సి ఉంటుంది. జీఎస్టీ పన్ను రేట్లను మరింతగా హేతుబద్ధీకరించాలి. ఒకే పన్ను రేటు అన్నది ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినా ఇప్పుడున్న పన్ను స్లాబ్‌లను తగ్గించి దీర్ఘకాలంలో పన్ను వసూళ్ల ప్రక్రియను మరింత సులభతరం చేయవచ్చు.ఇక రెండో అంశం. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాల్సిన అవసరం ఉంది. విద్యుత్తు, భూమి వంటి వాటిని కూడా చేర్చాలన్న వాదన ఉంది. తొలి దశలో భాగంగా వైమానిక ఇంధనం, సహజవాయువులను జీఎస్టీ పరిధిలోకి తేవాలి. పెట్రోలు, డీజిళ్లను కూడా చేర్చడం ఇప్పటికే ఆలస్యమైందని చెప్పాలి. రాష్ట్రాలకు సంబంధించి అతి పెద్ద ఆదాయ వనరుగా ఉండటం వల్ల మద్యం అమ్మకాలపై జీఎస్టీ అనేది కొంచెం సున్నితమైన అంశం అవుతుంది. అయితే నేడు కాకపోతే రేపు అయినా సరే... ఈ మార్పు అనివార్యం.అప్పిలేట్ ట్రిబ్యునల్ అవసరంజీఎస్టీ కౌన్సిల్ ఇటీవలి సమావేశాల్లో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు మేలు చేసేలా కొన్ని నిర్ణయాలు జరిగాయి. జీఎస్టీకి ముందు కాలం నాటి వివాదాల విషయంలో కొంత వెసులుబాటు కల్పించారు. అదే సమయంలో జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు అవసరాన్ని కూడా కౌన్సిల్ గుర్తించింది. జీఎస్టీ అమలును మరింత సమర్ధంగా మార్చేందుకు ఇంకా ఎంతో అవకాశం ఉంది. పన్ను రేట్ల హేతుబద్ధీకరణ, విధానాన్ని సులభతరం చేయడం వీటిల్లో కొన్ని చర్యలు మాత్రమే. అదే సమయంలో ఒకే పన్ను అన్న అసలు లక్ష్యాన్ని అందుకోవాలంటే ఆర్థిక వ్యవస్థలోని అతిపెద్ద రంగాలైన పెట్రోలియం వంటి వాటిని జీఎస్టీ పరిధిలోకి చేర్చడం తప్పనిసరి అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాలు కూడా హేతుబద్ధమైన, దీర్ఘకాలిక దృష్టితో ఆలోచించి దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడేలా జీఎస్టీ లక్ష్యానికి దన్నుగా నిలవాలి.సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త ఆర్థిక వ్యవహారాల సీనియర్ జర్నలిస్ట్ -
జీఎస్టీతో భారీగా తగ్గిన ఉత్పత్తుల ధరలు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానంతో గృహావసర ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. దీనితో ‘పన్నులపరంగా ఉపశమనం లభించి, ఇంటింటా ఆనందం వచి్చందని‘ పేర్కొంది. జీఎస్టీ అమల్లోకి వచ్చి ఏడేళ్లయిన సందర్భంగా మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో ఆర్థిక శాఖ ఈ మేరకు పోస్ట్ చేసింది. జీఎస్టీకి పూర్వం అన్ప్యాక్డ్ గోధుమలు, బియ్యం, పెరుగు, లస్సీ మొదలైన వాటిపై 2.5–4 శాతం పన్ను ఉండేదని, కొత్త విధానం అమల్లోకి వచ్చాక వాటిపై పన్నులు లేవని పేర్కొంది. అలాగే కాస్మెటిక్స్, రిస్ట్ వాచీలు, శానిటరీ ప్లాస్టిక్ వేర్, ఫరి్నచర్ మొదలైన వాటిపై రేటు 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఇక, 32 అంగుళాల వరకు టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లు, గీజర్లు మొదలైన వాటిపై 31.3 శాతం పన్నుల భారం ఉండేదని .. కొత్త విధానం అమల్లోకి వచ్చాక ఇవి 18 శాతం శ్లాబ్‌లోకి వచ్చాయని పేర్కొంది. 2023–24లో రూ. 2 కోట్ల వరకు వార్షిక టర్నోవరు ఉన్న ట్యాక్స్‌పేయర్లకు రిటర్నులు దాఖలు చేయడం నుంచి మినహాయింపునివ్వడంతో చిన్న స్థాయి ట్యాక్స్‌పేయర్లకు నిబంధనల భారం తగ్గిందని వివరించింది. 17 రకాల స్థానిక పన్నులు, సెస్సుల స్థానంలో జీఎస్టీ 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచి్చంది. ఆ తర్వాత నుంచి నిబంధనలను పాటించడంతో పాటు ట్యాక్స్‌పేయర్ల బేస్ కూడా గణనీయంగా పెరిగినట్లు కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ (సీబీఐసీ) బోర్డు చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ తెలిపారు. 2018లో 1.05 కోట్లుగా ఉన్న జీఎస్టీ ట్యాక్స్‌పేయర్ల సంఖ్య 2024 ఏప్రిల్ నాటికి 1.46 కోట్లకు చేరినట్లు వివరించారు. -
Budget 2024: వ్యవసాయ పరిశోధనకు ఊతం ఇవ్వాలి
న్యూఢిల్లీ: సాగు రంగం బలోపేతానికి తీసుకోవాల్సిన పలు చర్యలను నిపుణులు, వ్యవసాయ రంగ మండళ్లు కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లాయి. 2024–25 పూర్తి స్థాయి బడ్జెట్‌కు ముందు ఆరి్థక మంత్రి వివిధ రంగాల ప్రతినిధులతో సంప్రదింపులు చేపట్టారు. వ్యవసాయ పరిశోధనపై పెట్టుబడులు మరింతగా పెంచాలని, ఎరువుల సబ్సిడీలను హేతుబదీ్ధకరికంచాలని ఈ సందర్భంగా ఆయా రంగాల ప్రతినిధులు సూచించారు. ఆరి్థక వ్యవస్థలో వినియోగం పుంజుకోవడానికి వీలుగా వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లను తగ్గించాలని, తక్కువ రేటుకు వర్తకులకు రుణాలు అందించాలని రిటైల్ వర్తకుల సమాఖ్య ఆరి్థక మంత్రిని కోరింది. వర్తకులకు జీఎస్టీ విషయంలో పలు వెసులుబాట్లు కలి్పంచాలని జీటీఆర్ఐ సూచించింది.జీఎస్టీ భారం దించాలి..1.46 కోట్ల రిజి్రస్టేషన్లతో ప్రపంచంలోనే అతి పెద్ద పరోక్ష పన్నుల వ్యవస్థ అయిన జీఎస్టీకి సంబంధించి చేపట్టాల్సిన కీలక సంస్కరణలను గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) ఆరి్థక మంత్రి దృష్టికి తీసుకొచి్చంది. జీఎస్టీ మినహాయింపు పరిమితిని రూ.1.5 కోట్ల వార్షిక టర్నోవర్‌కు పెంచాలని కోరింది. ప్రస్తుతం వార్షిక టర్నోవర్ రూ.40 లక్షల వరకు ఉన్న సంస్థలకే జీఎస్టీ రిజిస్ట్రేషన్ మినహాయింపు అమల్లో ఉంది. జీఎస్టీలో ప్రస్తుతమున్న శ్లాబులను తగ్గించాలని, రాష్ట్రం వారీగా జీఎస్టీ రిజి్రస్టేషన్‌ను పరిహరించాలని.. దీనివల్ల జీఎస్టీ మరింత సమర్థవంతంగా, వ్యాపార అనుకూలంగా మారుతుందని పేర్కొంది. రూ.1.5 కోట్లలోపు టర్నోవర్ ఉన్న సంస్థలు మొత్తం రిజి్రస్టేషన్లలో 80 శాతంగా ఉంటాయని, మొత్తం పన్ను వసూళ్లలో వీటి ద్వారా వస్తున్నది 7 శాతమేనని గుర్తు చేసింది. ‘‘ఏటా రూ.1.5 కోట్లు అంటే నెలవారీ టర్నోవర్ రూ.12–13 లక్షలు. 10 శాతం మార్జిన్ ఆధారంగా వచ్చే లాభం రూ.1.2 లక్షలే. వీరికి మినహాయింపు కల్పిస్తే మొత్తం పన్ను చెల్లింపుదారుల సంఖ్య 23 లక్షలకు దిగొస్తుంది. జీఎస్టీ వ్యవస్థపై ఇది భారం తగ్గిస్తుంది’’అని వివరించింది. పన్ను వసూళ్లను పెంచడం ద్వారా 7 శాతం పన్ను నష్టాన్ని అధిగమించొచ్చని సూచించింది. ఈ ఒక్క చర్యతో ఎంఎస్ఎంఈలో వృద్ధి, ఉపాధి అవకాశాలను ప్రోత్సహించినట్టు అవుతుందని పేర్కొంది. రాష్ట్రాల మధ్య వాణిజ్యం ప్రోత్సాహానికి వీలుగా జీఎస్టీ నిబంధనలను సులభతరం చేయాలని కూడా కోరింది. వాతావరణ మార్పులు, టెక్నాలజీ, వాణిజ్యంపై పరిశోధనకు జీటీఆర్ఐ కృషి చేస్తుంటుంది.పన్ను తగ్గిస్తే వినియోగానికి ఊతం..అఖిల భారత రిటైల్ వర్తకుల సమాఖ్య ప్రతినిధులు ఆర్థిక మంత్రికి ఇచి్చన వినతిపత్రంలో పలు కీలక సూచనలు చేశారు. రిటైల్ రంగం వృద్ధి చెందేందుకు వీలుగా డిమాండ్ ను పెంచడం, వినియోగానికి ఊతమివ్వడం కోసం 2024–25 బడ్జెట్లో తక్కువ పన్ను రేట్ల రూపంలో ప్రయోజనాలు లేదా రాయితీలు కలి్పంచాలని కోరింది. ‘‘పన్ను రేట్లు తగ్గిస్తే, నెలవారీ ఖర్చు చేసే ఆదాయంపెరుగుతుంది. అది అంతిమంగా వినియోగానికి ప్రేరణనిస్తుంది. రిటైల్ రంగానికీ మేలు చేస్తుంది’’ అని పేర్కొంది. రిటైలర్లకు తక్కువ వడ్డీపై రుణాలు అందించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. బడ్జెట్లో ఈ మేరకు ప్రకటన చేయాలని కోరింది. ఫుడ్ అండ్ బెవరేజెస్‌ను అత్యవసర సేవగా గుర్తించాలని, భూముల రేట్లు, విద్యుత్‌పై సబ్సిడీలు, ఇతర ప్రయోజనాల కల్పించాలని కోరింది. వ్యాపార సులభతర నిర్వహణకు వీలుగా జాతీయ రిటైల్ విధానాన్ని వేగంగా రూపొందించి, అమలు చేయాలని కోరింది. ఎంఎస్ఎంఈల ప్రయోజనాలకు రిటైలర్లను అర్హులుగా ప్రకటించాలని కూడా విజ్ఞప్తి చేసింది. వ్యవసాయ రంగం తర్వాత దేశంలో అత్యధిక మందికి ఉపాధి కలి్పస్తూ, జీడీపీలో 10 శాతం వాటాను రిటైల్ రంగం సమకూరుస్తుండడం గమనార్హం. వ్యవసాయ రంగం పటిష్టత కోసం.. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకుని నిలబడేందుకు వీలుగా సాగు రంగంలో మౌలిక వసతులను బలోపేతం చేయాలని నిపుణులు సూచించారు. వ్యవసాయ రంగంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ)కి పెద్ద పీట వేయాల్సిన అవసరాన్ని ఇండియన్ చాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఐసీఎఫ్ఏ) చైర్మన్ ఎంజే ఖాన్ ప్రస్తావించారు. దీనివల్ల సాగు రంగం మరింత వృద్ధి పథాన సాగుతుందని, రైతుల ఆదాయం మెరుగుపడుతుందని చెప్పారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్)కు బడ్జెట్లో నిధుల కేటాయింపులు రూ.9,500 కోట్ల నుంచి రూ.20,000 కోట్లకు పెంచాలని సూచించారు. ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో (డీబీటీ) ఇచ్చే అన్ని రకాల వ్యవసాయ సంబంధిత సబ్సిడీలను హేతుబదీ్ధకరించాలని, 2018 నుంచి ఎలాంటి మార్పుల్లేని యూరియా రిటైల్ ధరలను పెంచాలని, సబ్సిడీల ద్వారా బయో ఫరి్టలైజర్స్, ఫోలియర్ ఫరి్టలైజర్స్ను ప్రోత్సాహించాలన్న సూచనలు ఆరి్థక మంత్రి దృష్టికి వచ్చాయి. ఇతర పెట్టుబడులతో పోల్చి చూస్తే వ్యవసాయ పరిశోధన పెట్టుబడులపై వచ్చే ఆరి్థక ప్రయోజనాలు పది రెట్లు అధికంగా ఉన్నప్పటికీ.. గడిచిన రెండు దశాబ్దాల కాలంలో బడ్జెట్ కేటాయింపులు ద్రవ్యోల్బణం కంటే తక్కువ ఉండడాన్ని భారత్ కిసాన్ సమాజ్ చైర్మన్ అజయ్ వీర్ జఖార్ గుర్తు చేశారు. ఎంఎస్పీ కమిటీని వేరు చేయాలని, నూతన వ్యయసాయ రంగ విధానాన్ని తీసుకురావాలన్న సూచనలు కూడా వచ్చాయి. వ్యవసాయ ఎగుమతులకు ఊతమిచ్చేందుకు వీలుగా అపెడాకు కేటాయింపులను రూ.80 కోట్ల నుంచి రూ.800 కోట్లకు పెంచాలని జిల్లా స్థాయిలో ఎగుమతుల కేంద్రాలు తెరవాలని పలువురు సూచించారు. -
ఇడ్లీ పిండిపైనా 18 శాతం జీఎస్టీ: అప్పిలేట్ అథారిటీ
సంకలనాలు కలిగిన పిండి మిశ్రమాలు 18 శాతం జీఎస్టీ పరిధిలోకి వస్తాయని గుజరాత్ అప్పిలేట్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ స్పష్టం చేసింది. అవి తక్కువ పన్ను రేటు చట్టంలో పేర్కొనని ఆహార పదార్థాల తరగతి కిందకు వస్తాయని పేర్కొంది.ఇడ్లీ, ధోక్లా, దహీ వడ వంటి వంటకాలకు పిండి మిశ్రమాలను విక్రయించే గాంధీనగర్‌కు చెందిన ఓ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ తీర్పు వెలువడింది. ఈ పిండి మిశ్రమాలను 5 శాతం పన్ను రేటు ఉన్న కేటగిరీ కింద వర్గీకరించాలని కంపెనీ వాదించింది.చట్టంలో పేర్కొనని నిష్పత్తిలో మసాలా దినుసులు, ఇతర పదార్ధాలతో పిండి మిశ్రమాలు తక్కువ పన్ను రేటును క్లెయిమ్ చేయలేవని అథారిటీ మే 29న ఒక ఉత్తర్వులో తెలిపింది. గుజరాత్ అడ్వాన్స్ రూలింగ్ అథారిటీ గతంలో ఇచ్చిన ముందస్తు తీర్పును ఈ నిర్ణయం సమర్థించింది. -
ప్రభుత్వానికి కాసుల వర్షం.. భారీగా జీఎస్టీ వసూళ్లు
కేంద్ర ప్రభుత్వానికి కాసుల వర్షం కురిసింది. మే నెలలో జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. దేశీయ లావాదేవీల్లో బలమైన పెరుగుదల, దిగుమతులు మందగించడంతో మే నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 10 శాతం వృద్ధితో రూ.1.73 లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్రం తెలిపింది.2024-25 ఆర్థిక సంవత్సరంలో మే వరకు స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.3.83 లక్షల కోట్లుగా ఉన్నాయని, ఇది వార్షిక వృద్ధికి 11.3 శాతం ప్రాతినిధ్యం వహిస్తుందని ఆర్థిక శాఖ తెలిపింది. రిఫండ్ల లెక్కింపు తర్వాత, 2024-25 ఆర్థిక సంవత్సరంలో నికర జీఎస్టీ ఆదాయం 2024 మే వరకు రూ .3.36 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 11.6 శాతం పెరిగింది.రిఫండ్ల లెక్కింపు తర్వాత మే నెలలో నికర జీఎస్టీ ఆదాయం రూ.1.44 లక్షల కోట్లుగా నమోదైంది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 6.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. కేంద్ర వస్తు, సేవల పన్ను (సీజీఎస్టీ) రూ.32,409 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ.40,265 కోట్లు, ఇంటిగ్రేటెడ్ ఐజీఎస్టీ రూ.87,781 కోట్లుగా ఉన్నాయని, ఇందులో దిగుమతి చేసుకున్న వస్తువులపై వసూలు చేసిన రూ.39,879 కోట్లు ఉన్నాయని ఆర్థిక శాఖ తెలిపింది. -
‘28 శాతం జీఎస్టీ’, సుప్రీం వైపు.. గేమింగ్ కంపెనీల చూపు
ఆన్లైన్ గేమింగ్‌పై 28 శాతం జీఎస్టీ విధించాలనే జీఎస్టీ కౌన్సిల్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోదని తెలుస్తోంది.జీఎస్టీ కౌన్సిల్ గతేడాది ఆన్లైన్ గేమింగ్, కాసినో, హార్స్ రేసింగ్‌లపై 28 శాతం చొప్పున జీఎస్టీ అమలు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు 2022 నుంచి గతేడాది అక్టోబర్ నాటికి రూ. 1,12,332 కోట్ల జీఎస్టీ చెల్లించాలంటూ గేమింగ్ కంపెనీలకు మొత్తం 71 షోకాజ్ నోటీసులందించింది. అయితే దీనిపై గేమింగ్ పరిశ్రమ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ తరుణంలో గేమింగ్ కంపెనీల సమస్యపై రివ్వ్యూ జరగనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. జీఎస్టీ కౌన్సిల్ 28శాతం జీఎస్టీని ఉపసంహరించుకునే అవకాశం లేదు. గతంలో జారీ చేసిన నోటీసులపై కౌన్సిల్ పరిశీలించవచ్చు. ఎందుకంటే అనేక గేమింగ్ కంపెనీలు ఈ నోటీసులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమస్యపై చాలా రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సుప్రీం కోర్టు విచారించనుంది. ఈ తీర్పు కోసం గేమింగ్ కంపెనీలు ఎదురుచూస్తున్నాయని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.