ఆఫర్ల షి‘కారు’ | Car sales surge: Telangana | Sakshi
Sakshi News home page

ఆఫర్ల షి‘కారు’

Sep 20 2025 12:38 AM | Updated on Sep 20 2025 5:08 AM

Car sales surge: Telangana

జీఎస్టీ తగ్గింపుతో కార్ల కోసం క్యూ

పండుగ ఆఫర్‌లతో ఆకట్టుకుంటున్న ఆటోమొబైల్స్‌ సంస్థలు

చిన్న కార్లపై రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు తగ్గింపు

సెప్టెంబర్‌ 22 కోసం కొనుగోలుదారుల ఎదురుచూపులు

రోజుకు 1,000కి పైగా బుకింగ్‌లు

సాక్షి, హైదరాబాద్‌: వాహన అమ్మకాలు టాప్‌గేర్‌లో పరుగులు తీయనున్నాయి. ఈ నెల 22 నుంచి జీఎస్టీ తగ్గనున్న నేపథ్యంలో మధ్యతరగతి వేతనజీవులు తమ చిరకాల వాహనయోగ కోరికను తీర్చుకొనేందుకు ఆటోమొబైల్‌ షోరూమ్‌లకు బారులు తీరుతున్నారు. ఒకవైపు జీఎస్టీ తగ్గింపుతోపాటు మరోవైపు దసరా, దీపావళి పర్వదినాలను దృష్టిలో ఉంచుకొని ఆటోమొబైల్‌ షోరూమ్‌లో వాహనాల అమ్మకాలపైన ఆఫర్లు, రాయితీలు ప్రకటించాయి. దీంతో కొనుగోలుదా రులకు ఈ దసరా ఉత్సవం డబుల్‌ ధమాకా అయ్యింది. వివిధ రకాల వస్తు సేవలపై జీఎస్టీని తగ్గించనున్నట్టు ప్రధాని ప్రకటించినప్పటి నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌లో వాహన విక్రయాలు ఉన్నపళంగా తగ్గుముఖం పట్టాయి. అప్పటికప్పుడు కొత్త బండి కొనుగోలు చేయాలని భావించిన వారు తమ ప్రణాళికలను సెప్టెంబర్‌ 22వ తేదీకి వాయిదా వేశారు. జీఎస్టీ తగ్గింపుపై స్పష్టత రావడంతో ప్రస్తుతం షోరూమ్‌లకు పరుగులు తీస్తున్నారు. ఆన్‌లైన్‌ బుకింగ్‌లకు సైతం పెద్దఎత్తున డిమాండ్‌ ఉన్నట్టు ఆటోమొబైల్‌ డీలర్లు పేర్కొంటున్నారు.

ఆర్టీఏలో సందడే..సందడి
సాధారణంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ప్రతి రోజు సుమారు 1,500 నుంచి 2,000 వరకు కొత్త వాహనాలు నమోదవుతాయి. వాటిలో 400 నుంచి 500 వరకు కార్లు ఉంటే మిగతావి ఎక్కువ శాతం ద్విచక్ర వాహనాలే. రవాణా వాహనాల సంఖ్య తక్కువగానే ఉంటుంది. కానీ ఇప్పుడు కార్ల బుకింగ్‌లు అమాంతంగా పెరిగాయి. ఈ నెల 22 నుంచి కొనుగోలు చేసేందుకు ముందస్తు బుకింగ్‌ల కోసం బారులు తీరుతున్నారు. నగరంలో ప్రతి రోజు 1,000కి పైగా బుకింగ్‌లు అవుతున్నట్టు పలువురు డీలర్లు చెప్పారు.

హైదరాబాద్‌తోపాటు తెలంగాణ అంతటా వాహనాల అమ్మకాలు ఊపందుకున్నాయని బంజారాహిల్స్‌లోని ప్రముఖ కార్ల షోరూమ్‌కు చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు. సుమారు 6 నెలలకు పైగా అమ్మకాల్లో స్తబ్దత నెలకొందని, ప్రస్తుతం జీఎస్టీ తగ్గింపుతో అనూహ్యంగా అమ్మకాలు పెరిగాయని సికింద్రాబాద్‌ తిరుమలగిరి ప్రాంతానికి చెందిన కొండల్‌రెడ్డి తెలిపారు. కార్లతోపాటు ద్విచక్ర వాహనాలకు సైతం గిరాకీ పెరిగింది. సెప్టెంబర్‌ 22 నుంచే కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. సాధారణ ఉద్యోగ వర్గాల నుంచి మధ్యతరగతి, ఉన్నత ఆదాయ వర్గాల వరకు తమ తాహత్తు మేరకు వాహనాలను కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నారు.

చిన్న కార్లకు పెద్ద డిమాండ్‌...
జీఎస్టీ తగ్గింపు ప్రభావం హైఎండ్‌ వాహనాల కంటే చిన్న కార్లపైన ఎక్కువగా ఉంది. రూ.20 లక్షల కంటే తక్కువ ఖరీదైన వాహనాల ధరలు తగ్గనున్నాయి. వివిధ రకాల బ్రాండ్‌లకు చెందిన వాహనాలపైన వాటి ధరలపైన సుమారు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు తగ్గనున్నాయి. ఈ మేరకు క్రెటా, నెక్సాన్, బ్రిజా, పంచ్‌ వంటి వాహనాల అమ్మకాలు భారీగా పెరగనున్నాయి. కొనుగోలుదార్లు సైతం తమ బడ్జెట్‌కు అనుకూలమైన కేటగిరీకి చెందిన వాహనాలనే ఎక్కువగా బుక్‌ చేసుకుంటున్నారు. జీఎస్టీ తగ్గింపుతోపాటు ఆటోమొబైల్‌ డీలర్లు సుమారు రూ.50,000 నుంచి రూ.80,000 వరకు తగ్గింపు ఆఫర్‌లను అందజేస్తున్నాయి.

దసరాకు కొత్త బండి కష్టమే....
ముందస్తు బుకింగ్‌లు భారీగా పెరిగిన దృష్ట్యా అక్టోబర్‌ 2వ తేదీ దసరా నాటికి కొనుగోలుదారులందరికీ కొత్తబండి యోగం కష్టమే. ఇప్పటికిప్పుడు బుక్‌ చేసుకుంటే వాహనం డెలివరీ కావడానికి కనీసం 30 రోజుల నుంచి 45 రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ‘ఆటోమొబైల్‌ సంస్థలు ప్రతి రోజు సగటున దేశవ్యాప్తంగా 25,000 నుంచి 30,000 కార్లను డెలివరీ చేస్తాయి. ప్రస్తుత బుకింగ్‌ల నేపథ్యంలో రోజుకు 45,000 కంటే ఎక్కువగా డెలివరీ చేయాల్సిన అవసరం ఉంది.

హైదరాబాద్‌తోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బుకింగ్‌లు భారీగా ఉన్న దృష్ట్యా వినియోగదారులకు వాహనం చేరడానికి కొంత సమయం పట్టొచ్చు’అని తెలంగాణ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాంకోటేశ్వర్‌రావు తెలిపారు. ప్రస్తుత డిమాండ్‌ మేరకు నగరంలోని కొందరు ఆటోమొబైల్‌ డీలర్లు అడ్వాన్స్‌గా ఎక్కువ సంఖ్యలో వాహనాల దిగుమతికి ఆర్డర్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అమ్మకాలపైన ఈ ఒత్తిడి ఈ ఏడాది చివరకు ఉండే అవకాశం ఉన్నట్టు డీలర్లు అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement