జీఎస్‌టీ పొదుపు ఉత్సవం మొదలైంది  | Gst Bachat Utsav: Pm Modi Writes Open Letter To Citizens | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీ పొదుపు ఉత్సవం మొదలైంది 

Sep 22 2025 8:21 PM | Updated on Sep 23 2025 5:41 AM

Gst Bachat Utsav: Pm Modi Writes Open Letter To Citizens

ఇది మార్కెట్ల నుంచి ముంగిళ్లదాకా పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది 

తగ్గిన జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన సందర్భంగా ప్రధాని వ్యాఖ్య 

దేశ ప్రజలకు మోదీ బహిరంగ లేఖ

న్యూఢిల్లీ: తగ్గిన జీఎస్‌టీ పన్నుల కారణంగా దేశవ్యాప్తంగా మార్కెట్లు మొదలు ఇంటి ముంగిళ్ల దాకా ప్రజలకు ఖర్చులు తగ్గి పొదుపు ఉత్సవం మొదలైందని ప్రధాని మోదీ ఆనందం వ్యక్తంచేశారు. నగదు ఆదా ఉత్సవం ప్రతి ఒక్కరి ఇంట్లో పండుగ శోభను మోసుకొచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. శరన్నవరాత్రి ఉత్సవాల తొలి రోజునే జీఎస్‌టీ తగ్గుముఖం పట్టిందని, ఇది శుభసూచకమంటూ దేశ ప్రజలకు మోదీ సోమవారం బహిరంగ లేఖ రాశారు. 

‘‘షాపింగ్‌ చేసే వాళ్లకు ఇది నిజంగా పండుగే. అన్ని మార్కెట్లలో, అందరి ఇళ్లలో నగదు ఆదా ఉత్సవం ఆరంభమైంది. నవ శకం జీఎస్‌టీ సంస్కరణలు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. సెపె్టంబర్‌ 22 నుంచి జీఎస్‌టీ సంస్కరణలు పొదుపు పెంచడంతోపాటు రైతులు, మహిళలు, యువత, పేదలు, మధ్య తరగతి, వ్యాపారులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల దాకా సమాజంలోని ప్రతి ఒక్క వర్గానికి ప్రయోజనం చేకూరుస్తున్నాయి.

 ఈ శుభతరుణంలో అందరం ఆత్మ నిర్భరత పథంలో కలిసి నడుద్దాం. 2047 ఏడాదికల్లా వికసిత్‌ భారత్‌ ఉమ్మడి లక్ష్యాన్ని సాధిద్దాం. ఈ సంవత్సరం పండుగల సీజన్‌ కొత్త సంతోషాలను మోసుకొచ్చింది. తగ్గిన జీఎస్‌టీతో ప్రజలు డబుల్‌ బొనాంజాను ఒడిసిపట్టారు. జీఎస్‌టీ సంస్కరణలు అద్భుతమైన ప్రగతికి, పెట్టుబడులకు బాటలు వేయనున్నాయి. దీంతో దేశంలోని ప్రతి రాష్ట్రం, ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోనుంది’’ అని మోదీ ఆ లేఖలో అభిలషించారు. 

పన్ను రహితం లేదా 5 శాతం 
‘‘ఆహారం, ఔషధాలు, సబ్బులు, టూత్‌పేస్ట్, బీమా ఇలా మరెన్నో వస్తూత్పత్తులు ఇప్పుడు పన్నురహితంగా లేదా కేవలం 5 శాతం జీఎస్‌టీ శ్లాబులో అందుబాటులోకి వచ్చాయి. గతంలో 12 శాతం శ్లాబులో ఉన్న ఎన్నో ఉత్పత్తులు ఇప్పుడు 5 శాతం శ్లాబులోకి దిగొచ్చాయి. ఇవి ‘శ్లాబులు మారడానికి ముందు, ఆ తర్వాత రేట్లు’ అంటూ వ్యాపారులు తమ దుకాణాల ముందు బోర్డ్‌లు తగిలించడం చూస్తుంటే మనసుకు ఎంతో సంతోషంగా ఉంది. రూ.12 లక్షల వార్షికాదాయంపై సున్నా పన్నును అమలుచేసి మధ్యతరగతి ప్రజల చేతుల్లో నగదు నిలిచేలా చేశాం. ఇప్పుడు తగ్గిన జీఎస్‌టీ రేట్లు, అమలవుతున్న జీరో ఐటీ ట్యాక్స్‌తో ప్రజలకు రూ.2.5 లక్షల కోట్ల సొమ్ము ఆదా అయింది. దీంతో చిన్న ఇల్లు కట్టుకోవడం, కొత్త వాహనం కొనుక్కోవడం, గృహోపకరణాలు కొనుగోలుచేయడం, కుటుంబంతో కలిసి సరదాగా బయట భోజనం చేయడం వంటి ఆనందాలెన్నో సాకారమవుతున్నాయి’’ అని మోదీ ఆనందం వ్యక్తంచేశారు. 
 

‘చిరు’వ్యాపారుల పెద్ద పండుగ 
‘‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు జీఎస్‌టీ తగ్గింపుతో పండుగ కాంతుల్లో వెలిగిపోతున్నాయి. సులభతర వ్యాపారానికి అనువైన వాతావరణం నెలకొంది. తక్కువ ట్యాక్స్‌లు, తక్కువ ధరలు, అనువైన నిబంధనల కారణంగా వ్యాపారం ఊపందుకోనుంది. వ్యాపారాభివృద్ధి అవకాశాలు మెరుగయ్యాయి. స్థానిక ఉత్పత్తుల విస్తృతి పెరగనుంది. ఇది ఆత్మనిర్భర్‌ భారత్‌ దిశగా పెద్ద అడుగు’’ అని అన్నారు. 

కవరేజీ కమాల్‌ 
తగ్గిన జీఎస్‌టీతో ప్రజల కొనుగోళ్లు పెరగనున్నాయని, పౌరుల్లో హర్షాతిరేకాలు మిన్నంటాయంటూ సోమవారం పలు ప్రధాన హిందీ, ఇంగ్లిష్‌ దినపత్రికల్లో వచ్చిన కథనాలు, ప్రధాన వార్తలను ప్రధాని ప్రస్తావించారు. ‘తక్కువ ధరలు, ఎక్కువ ఆనందాలు’ అనే క్యాప్షన్‌ పెట్టి మోదీ పలు న్యూస్‌పేపర్ల ఫ్రంట్‌ పేజీలను తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేశారు. తగ్గిన జీఎస్‌టీతో వినియోగదారులకు భారీ ప్రయోజనం చేకూరనుందంటూ దైనిక్‌ భాస్కర్, దైనిక్‌ జాగరణ్, ఎన్‌బీటీ, హిందుస్తాన్, హరిభూమి, రాష్ట్రీయ సహారా సహా పలు ప్రధాన ఆంగ్ల పత్రికల తొలి పేజీ క్లిప్పింగ్‌లను మోదీ షేర్‌ చేశారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement