న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్యం బలంగా ఉండడం వల్లనే కరోనా సమయంలో కీలక సంస్కరణలు, ప్రోత్సాహకాలు తీసుకురాగలిగామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కరోనా సంక్షోభ సమయంలో అన్నింటికీ ఒకే మంత్రం అనకుండా, ఒక్కో ప్రాంతానికి, ఒక్కో అవసరానికి తగినట్లు ఆర్థిక విధానాలను రూపొందించడం జరిగిందని వివరించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లింక్డిన్‌పై ‘‘రిఫామ్స్ బై కన్విక్షన్ అండ్ ఇన్సెంటివ్స్’’ పేరిట ఆయన సంస్కరణల గురించి వివరిస్తూ పోస్టు చేశారు. ప్రపంచమంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో భారత రాష్ట్రాలు గతంలో కన్నా ఎక్కువగా రుణాలు తీసుకోగలిగాయన్నారు. ‘‘2020–21లో రాష్ట్రాలు అదనంగా రూ. 1.06 లక్షల కోట్లను సమీకరించడం ముదావహం. ఇది కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకారం వల్లనే సాధ్యమైంది’’అని ప్రధాని చెప్పారు.
ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలకు విధాన నిర్ణయాల పరంగా కరోనా కొత్త సవాళ్లు విసిరిందని ప్రధాని గుర్తు చేశారు. భారత్ ఇందుకు మినహాయింపు కాదని, ఒకవైపు ప్రజాసంక్షేమం కుంటుపడకుండా మరోవైపు ఆర్థిక స్థిరత్వం కోల్పోకుండా నిధులు సమీకరించడం మనం ఎదుర్కొన్న అతిపెద్ద సవాలని చెప్పారు. సమాఖ్య వ్యవస్థలో అన్నింటికీ ఒకే సూత్రం వర్తించలేమన్నది గుర్తించి ఆయా రాష్ట్రాల సంస్కరణలను ప్రోత్సహించేలా జాతీయస్థాయిలో విధాన నిర్ణయాలు తీసుకోవడం కూడా సవాలేనన్నారు.
అయితే మన సమాఖ్య వ్యవస్థపై ఉన్న నమ్మకంతో, కేంద్రరాష్ట్రాల మధ్య సహకారంతో ముందుకు సాగామని చెప్పారు. రాష్ట్రాలు వాటి స్థూలోత్పత్తి(జీఎస్‌డీపీ)లో 2 శాతం వరకు రుణాలు సేకరించే అనుమతినిచ్చామని, అయితే కొన్ని సంస్కరణలు అమలు చేస్తేనే ఇందులో ఒక్క శాతానికి అనుమతి లభిస్తుందని వివరించారు. ఈ కారణంగా పలు రాష్ట్రాలు పలు సంస్కరణలు అమలు చేసాయని తెలిపారు. దీనివల్ల వచ్చిన ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని, అలాగే కొందరే ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తారన్న అపవాదుకు భిన్నంగా ఫలితాలున్నాయని చెప్పారు.
చదవండి: ఎంపీ నవనీత్ కౌర్‌కు సుప్రీంకోర్టులో ఊరట
Comments
Please login to add a commentAdd a comment