
ఎయిరిండియా విమాన ప్రమాద నివేదిక లీకేజీపై సుప్రీం వ్యాఖ్య
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద నివేదికలోని కొన్ని అంశాలు ముందుగానే లీకవడం ‘దురదృష్టకరం, బాధ్యతారాహిత్యం’అంటూ సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఫలితంగా ఘోర ప్రమాదానికి పైలట్ల తప్పిదాలే కారణమంటూ జూన్ 12వ తేదీన మీడియా చిలువలుపలువలుగా కథనాలు వచ్చాయని తెలిపింది.
ప్రమాదంపై స్వతంత్ర, నిష్పాక్షిక సత్వర విచారణ చేపట్టాలని, బాధితుల వ్యక్తిగత గోప్యత, మర్యాదలకు భంగం కల్గించరాదని పేర్కొంటూ సోమవారం జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వంతోపాటు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)కు నోటీసులు జారీ చేసింది. జూలై 12వ తేదీన ఎయిర్‌క్రాఫ్ట్ యాసిడెంట్ ఇన్వెసి ్టగేషన్ బ్యూరో(ఏఏఐబీ) ప్రాథమిక నివేదికలోని కొన్ని ఎంపిక చేసిన అంశాలను బహిర్గతం చేయడం దురదృష్టకరం, బాధ్యతారాహిత్యంగా అభివర్ణించింది. దీనిని ప్రత్యర్థి వైమానిక సంస్థలు స్వార్థానికి వాడుకునే ప్రమాదముందని తెలిపింది.
సేఫ్టీ మ్యాటర్స్ ఫౌండేషన్ అనే సంస్థ తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలను వినిపించారు. ప్రాథమిక నివేదికలోని పైలట్ల తప్పిదముందని ఆరోపించే కేవలం ఒకే ఒక వాక్యం వల్లనే ప్రపంచవ్యాప్తంగా మీడియాలో కథనాలు వచ్చాయన్నారు. మిగతా అంశాలన్నీ మరుగున పడిపోయాయన్నారు. విషాదం చోటుచేసుకుని 100 రోజులు దాటినా ఇప్పటికీ అసలు కారణాలు వెల్లడి కాలేదని చెప్పారు. పైపెచ్చు, విచారణ కమిటీలోని ఐదుగురిలో ముగ్గురు డీజీసీఏకు చెందిన వారే ఉండటంతో నివేదికపై అనుమానాలకు తావిచ్చే అవకాశముందని తెలిపారు.
విమానం ఫ్లైట్ డేటా రికార్డర్‌ను వెల్లడిస్తే ఘటనకు దారితీసిన కారణాలపై స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. స్పందించిన ధర్మాసనం... స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తునకు డిమాండ్ చేయడం సబబుగానే ఉన్నా, ఫ్లైట్ డేటా రికార్డర్ సమాచారాన్ని డిమాండ్ చేయడం మాత్రం ప్రశ్నార్థకమని వ్యాఖ్యానించింది. ఫ్లైట్ డేటా రికార్డర్ వెల్లడైతే పరస్పర విరుద్ధ కథనాలు వచ్చే ప్రమాదముందని పేర్కొంది. ‘ఇటువంటి సందర్భాల్లో దర్యాప్తు పూర్తి అయ్యే వరకు నివేదికలోని అన్ని అంశాలను పూర్తి స్థాయిలో గోప్యంగా ఉంచాల్సిన అవసరముంది. అప్పటి వరకు మేం ఎదురుచూస్తాం’అని ధర్మాసనం తెలిపింది.

ప్రమాదంపై కేంద్రం ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీ నివేదికలోని కొన్ని అంశాలను లీకవడంతో పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందంటూ వైమానిక రంగ నిపుణుడు కెప్టెన్ అమిత్ సింగ్ సారథ్యంలోని సేఫ్టీ మ్యాటర్స్ ఫౌండేషన్ సంస్థ ఈ పిటిషన్ వేసింది. ఫ్యూయల్ కటాఫ్ స్విఛ్‌లను ‘రన్’నుంచి ‘కటాఫ్’కు మార్చడం వల్లే ప్రమాదం జరిగిందని, ఇది పైలట్ తప్పిదమేనంటూ ఏఏఐబీ ప్రాథమిక నివేదికలోని కొన్ని అంశాలు జూలై 12వ తేదీన బయటకు రావడం తెల్సిందే.