pilots blamed
-
రాహుల్ విమాన ఘటన పైలట్ల తప్పిదమే
ముంబై: కర్ణాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా హుబ్లీలో రాహుల్ గాంధీ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పిన ఘటనకు పైలట్ల తప్పిదమే కారణమని డీజీసీఏ పేర్కొంది. ఇందులో కుట్రకోణమేదీ లేదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 26న పదిసీట్ల సామర్థ్యమున్న విమానం ల్యాండింగ్‌కు ముందు ఒక్కసారిగా ఎడమవైపుకు వంగడంతో రాహుల్ సహా లోపలున్న వారు భయభ్రాంతులకు లోనయ్యారు. ‘చార్టెడ్ విమానం వీటీ–ఏవీహెచ్ ఆటోపైలట్ మోడ్‌లో ఉన్న సమయంలో విమానం ఎత్తు హఠాత్తుగా 125 అడుగుల.. తర్వాతి 9 సెకన్లలోనే మరో 610 అడుగులు కిందకొచ్చింది. దీంతో విమానం 65 డిగ్రీలు పక్కకు ఒరిగింది’ అని డీజీసీఏ పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో రాహుల్‌తోపాటు ఆయన మిత్రుడు కౌశల్ విద్యార్థి్థ, ఇద్దరు పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, ఇంజనీర్ ఉన్నారు. ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉందని అప్పుడు కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. మరోవైపు, రాహుల్ శుక్రవారం ఢిల్లీ నుంచి కైలాస్ మానససరోవర్ తీర్థ యాత్రకు బయలుదేరారు. ఈ సుదీర్ఘయాత్ర 12 నుంచి 15 రోజుల పాటు సాగనుంది. కైలాస పర్వతంపై ఉన్న శివుణ్ణి దర్శిస్తారు. -
పొగమంచు కాదు.. పైలట్లదే తప్పు!
గత కొన్ని రోజులుగా పొగమంచు దట్టంగా ఉందని, అందువల్ల పలు విమానాలు ఆలస్యం అవుతున్నాయని వింటున్నాం. కానీ, విమానాలు ఆలస్యం కావడానికి అసలు కారణం అది కాదట.. విమానయాన సంస్థలు, వాటిలో పనిచేసే పైలట్లే అందుకు కారణమని డీజీసీఏ చెబుతోంది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు పొగమంచు కారణంగా దాదాపు 900 విమానాలు ఆలస్యమయ్యాయి. కొన్నయితే ఢిల్లీకి బదులు సమీపంలో ఉన్న వేరే విమానాశ్రయాల్లో దిగాల్సి వచ్చింది. అయితే.. వాటిలో 811 విమానాలు విజబులిటీ తక్కువగా ఉన్నప్పుడు ల్యాండ్ అవ్వడానికి సిద్ధంగా లేకపోవడం వల్లే అలా అయ్యిందని ఎయిర్‌పోర్టు ఆపరేటర్ డీజీసీఏకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. మరో 97 విమానాలను మాత్రం 50 మీటర్ల స్థాయిలో కూడా విజిబులిటీ లేకపోవడంతో వేరేచోట్ల దించాల్సి వచ్చిందన్నారు. సాధారణంగా పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు విమానాశ్రయాలతో పాటు విమానాలు కూడా అత్యాధునిక ల్యాండింగ్ వ్యవస్థలను ఉపయోగిస్తాయి. తక్కువ విజిబులిటీ ఉన్నప్పుడు కూడా విమానాలను దించడానికి పైలట్లకు కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. బాగా తక్కువ విజిబులిటీ ఉన్నప్పుడు కూడా విమానాలు దిగేందుకు పొడవైన రన్‌వేతో పాటు అదనపు పరికరాలు కూడా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్నాయి. కానీ విమానయాన సంస్థలు మాత్రం అలా దిగేందుకు వీలున్న విమానాలను, పైలట్లను ఢిల్లీకి ఉపయోగించడం లేదని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు. ప్రధానంగా ఎయరిండియాను డీజీసీఏ ఎక్కువగా తప్పుబట్టింది. 125 మీటర్ల కంటే పైన కూడా విజిబులిటీ ఉంటేనే ఆ విమానాలు దించుతున్నారని లేకపోతే వేరేచోటుకు మళ్లిస్తున్నారని చెప్పింది.