పొగమంచు కాదు.. పైలట్లదే తప్పు!
పొగమంచు కాదు.. పైలట్లదే తప్పు!
Published Wed, Dec 14 2016 9:46 AM | Last Updated on Tue, Oct 2 2018 8:04 PM
గత కొన్ని రోజులుగా పొగమంచు దట్టంగా ఉందని, అందువల్ల పలు విమానాలు ఆలస్యం అవుతున్నాయని వింటున్నాం. కానీ, విమానాలు ఆలస్యం కావడానికి అసలు కారణం అది కాదట.. విమానయాన సంస్థలు, వాటిలో పనిచేసే పైలట్లే అందుకు కారణమని డీజీసీఏ చెబుతోంది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు పొగమంచు కారణంగా దాదాపు 900 విమానాలు ఆలస్యమయ్యాయి. కొన్నయితే ఢిల్లీకి బదులు సమీపంలో ఉన్న వేరే విమానాశ్రయాల్లో దిగాల్సి వచ్చింది. అయితే.. వాటిలో 811 విమానాలు విజబులిటీ తక్కువగా ఉన్నప్పుడు ల్యాండ్ అవ్వడానికి సిద్ధంగా లేకపోవడం వల్లే అలా అయ్యిందని ఎయిర్‌పోర్టు ఆపరేటర్ డీజీసీఏకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. మరో 97 విమానాలను మాత్రం 50 మీటర్ల స్థాయిలో కూడా విజిబులిటీ లేకపోవడంతో వేరేచోట్ల దించాల్సి వచ్చిందన్నారు.
సాధారణంగా పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు విమానాశ్రయాలతో పాటు విమానాలు కూడా అత్యాధునిక ల్యాండింగ్ వ్యవస్థలను ఉపయోగిస్తాయి. తక్కువ విజిబులిటీ ఉన్నప్పుడు కూడా విమానాలను దించడానికి పైలట్లకు కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. బాగా తక్కువ విజిబులిటీ ఉన్నప్పుడు కూడా విమానాలు దిగేందుకు పొడవైన రన్‌వేతో పాటు అదనపు పరికరాలు కూడా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్నాయి. కానీ విమానయాన సంస్థలు మాత్రం అలా దిగేందుకు వీలున్న విమానాలను, పైలట్లను ఢిల్లీకి ఉపయోగించడం లేదని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు. ప్రధానంగా ఎయరిండియాను డీజీసీఏ ఎక్కువగా తప్పుబట్టింది. 125 మీటర్ల కంటే పైన కూడా విజిబులిటీ ఉంటేనే ఆ విమానాలు దించుతున్నారని లేకపోతే వేరేచోటుకు మళ్లిస్తున్నారని చెప్పింది.
Advertisement
Advertisement