
ఒక పెను విషాదంపై జరిగే దర్యాప్తు ఎంతో బాధ్యతాయుతంగా వుండాలి. ఆ ఉదంతంలో అసలు జరిగిందేమిటో చెప్పే ప్రయత్నం చేసినప్పుడు అస్పష్టతకు తావీయకూడదు. ప్రాథమిక దర్యాప్తుకైనా, పూర్తిస్థాయి దర్యాప్తుకైనా ఇదే వర్తిస్తుంది. కానీ గత నెల 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం విషయమై శుక్రవారం అర్ధరాత్రి వెలువరించిన ప్రాథమిక దర్యాప్తు ఆ నియమాలను ఉల్లంఘించింది. బాధిత కుటుంబాల్లో అయోమయాన్ని మరింత పెంచింది.
ఆ ప్రమాదం వైమానిక ప్రమాదాల చరిత్రలో పెద్దది. ఆ విషాద ఘటన సమ యంలో విమానంలో 242 మంది ప్రయాణికులుండగా, ఒకరు క్షేమంగా బయటపడ్డారు. భవంతిపై కూలినందువల్ల అక్కడున్న 19 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో ఇంధనాన్ని నియంత్రించే స్విచ్‌లు రెండూ ఆపివేసి వుండటం వల్లనే ప్రమాదం జరిగివుండొచ్చని దర్యాప్తు చేస్తున్న విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) ప్రాథమిక నివేదిక భావించింది.
ఇది కేవలం ప్రాథమిక నివేదికే గనుక వెంటనే నిర్ణయానికి రావటం తగదని కేంద్ర వైమానిక మంత్రిత్వ శాఖ అంటున్నది. మంచిదే. అటువంటప్పుడు ఏఏఐబీ నివేదిక స్విచ్‌ల విషయంలో మరింత సమాచారం అందాకే వాటిని ప్రస్తావించి వుండాల్సింది. పైలెట్ల సంఘం కూడా నివేదికను తప్పుబడు తోంది.
పైలెట్ల తప్పిదమే కారణమని అర్థం వచ్చేలా నివేదిక వుండటం సరికాదని విమర్శిస్తున్నారు. దర్యాప్తులో తమ ప్రతినిధికి ఇప్పటికైనా చోటీయాలని వారు అంటున్నారు. ఈ అయోమయం ఇప్పటికే పుట్టెడు దుఃఖంలో వున్న బాధిత కుటుంబాలను మరింత నొప్పించదా?
అంతర్జాతీయ వైమానిక నిబంధనల ప్రకారం ప్రమాదం జరిగిన ఏడాదిలోగా తుది నివేదిక రావాలి. ఈలోగా విడుదల చేసే ప్రాథమిక నివేదిక పైలెట్లను తప్పుబట్టే విధంగా వుండటం, ఆ తర్వాత దాన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదనటం న్యాయమేనా? ఘటనా స్థలంలో దొరికిన స్విచ్‌లున్న పరికరంలో అవి రెండూ ‘ఆన్’ చేసివున్నాయి.
కానీ కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లో ఒక పైలెట్ మరొకరితో ‘ఇంధనం ఎందుకు నిలిపివేశావ్’ అని అడగటం, అందుకు రెండో పైలెట్ ‘నేనలా చేయలేదే...’ అంటూ జవాబివ్వటం వినబడటాన్నిబట్టి స్విచ్‌లు ఆపివేసి వున్నట్టు దర్యాప్తు బృందం నిర్ధారణకొచ్చింది. కానీ రెండో పైలెట్ ఆ వెంటనే వాటిని సరిచేసి వుండొచ్చని, అందుకే అవి సక్రమంగా వున్న స్థితిలో లభించాయని నివేదిక అంటున్నది. ఈ సంభాషణల్లో అడిగిన వారెవరో, జవాబిచ్చిన వారెవరో దర్యాప్తు చేసినవారు గుర్తించారా?
గుర్తించి వుంటే ఆ సంగతి వెల్లడించటానికి వారికున్న అభ్యంతరమేమిటి? ఒకవేళ అలాంటి అభ్యంతరం వున్నప్పుడు అసలు ఆ సంభాషణను బయటపెట్టడం దేనికి? విమానంలోని యాంత్రిక వ్యవస్థలు సంక్లిష్టమైనవి. విమాన గమనంలో మనుషుల జోక్యం దాదాపు అవసరం లేని ‘ఫ్లై బై వైర్’ వ్యవస్థ అందుబాటులోకొచ్చి దశాబ్దాలవుతోంది. ముఖ్యంగా విమానం టేకాఫ్ సమయంలోనూ, దిగే సమయంలోనూ ఆ వ్యవస్థ పూర్తిగా తనకు తానే అన్నిటినీ సరిచేసుకుంటుంది.
పైకెగిరినప్పుడూ, కిందకు దిగినప్పుడూ అవసరమైన ఇంధనం సరఫరా అయ్యేలా చూసుకుంటుంది. ఇవి విఫలమైన పక్షంలో పైలెట్ అవసరమైన మార్పులు చేసుకోవ డానికే స్విచ్‌లుంటాయి. రెండు స్విచ్‌లకూ రెండువైపులా రింగ్‌లుంటాయి. వాటికి ప్రత్యేక లాకింగ్ వ్యవస్థ వుంటుంది. మనిషి ప్రత్యేకించి వాటిని స్విచాన్ చేయటానికైనా, స్విచాఫ్ చేయటానికైనా ముందు ఆ లాకింగ్‌ను తెరవక తప్పదు. రెండు స్విచ్‌లూ ఆగిపోవటానికి మధ్య సెకను వ్యవధి వుందని తేల్చారు.
పైగా పైకెగురుతున్న సమయంలో ఎక్కువ ఇంధనం సరఫరా కావాల్సి వుండగా దాన్ని కావాలని ఏ పైలెట్ కూడా స్విచాఫ్ చేయడు. దానిపై దర్యాప్తు బృందం ఏ నిర్ధారణకూ రాలేదు. పైలెట్లుగా వ్యవహరించినవారి చరిత్ర చూసినా ఉద్దేశపూర్వకంగా ఆపివుంటారని ఊహించటం అసాధ్యం.
ప్రధాన పైలెట్ సుమీత్ సభర్వాల్‌కు బోయింగ్ 787ను 8,600 గంటలు నడిపిన సర్వీస్ (మొత్తంగా 15,638 గంటల సర్వీస్) వుండగా, కో పైలెట్ క్లైవ్ కుందేర్‌కు బోయింగ్‌పై 1,100 గంటల అనుభవం, మొత్తంగా 3,403 గంటల అనుభవం వుంది. ఇద్దరూ ఈ విమానం నడపటానికి ముందు తగినంత విశ్రాంతి తీసుకున్నవారే. ప్రధాన పైలెట్ పర్యవేక్షణలో కో పైలెట్ ఇష్టానుసారం చేయటం సాధ్యపడదు. ఒకవేళ ఆ ప్రయత్నం జరిగివుంటే వాగ్వాదం చోటుచేసు కునేది. అది రికార్డయ్యేది.
పూర్తి స్థాయి పారదర్శకతకు దర్యాప్తు సంస్థ ఎందుకు వెనకాడుతోంది? ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను కేవలం ఒక ప్రశ్న, జవాబు స్థాయికి కుదించటంలోని మర్మమేమిటి? అటు తర్వాత లేదా అంతకుముందు వారేం మాట్లాడుకున్నారు? ఇది చెప్పకపోతే పైలెట్లలో ఒకరు ఆత్మాహుతికి పాల్పడ్డారా అనే సంశయం బయల్దేరుతుంది.
ఎయిర్‌లైన్స్ రేటింగ్స్ వెబ్‌సైట్ ప్రధాన సంపాదకుడు జెఫ్రీ థామస్ అడుగుతున్నది ఇదే. దర్యాప్తు ఫలితాల గురించి అంతర్జాతీయంగా అనేకులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ రకం విమానాలను బ్రిటిష్ ఎయిర్‌వేస్ సంస్థ, వర్జిన్ అట్లాంటిక్ సంస్థ ప్రధానంగా వినియోగిస్తున్నాయి.
ప్రాథమిక నివేదిక విడుదల చేయటం స్వాగతించదగిందే. కానీ ఇప్పటికే వున్న సంశయాలను మరింత పెంచేలా, అస్పష్టత అలుముకునేలా అది వుండటం సరికాదు. పైలెట్ల మధ్య జరిగిన సంభాషణ పూర్తి పాఠం విడుదల చేస్తే అటు పైలెట్‌ల సంఘం అభ్యంతరాలతోపాటు, ఇటు బాధిత కుటుంబాల సంశయాలు కూడా సమసిపోతాయి.