
అమెరికా అధ్యక్షుడై ఎనిమిది నెలలు దాటుతున్నా అధ్యక్ష ఎన్నికల మనఃస్థితి నుంచి డోనాల్డ్ ట్రంప్ ఇంకా బయటపడినట్టు లేరు. అడ్డగోలు హామీలూ, ఆర్భాటపు ప్రకటనలూ, స్వోత్కర్షలూ, శాపనార్థాలూ ఏ దేశ ఎన్నికల ప్రచార సభల్లోనైనా రివాజు. కానీ న్యూయార్క్‌లో మంగళవారం జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశ సందర్భంలో అవన్నీ ట్రంప్ నోట వినబడ్డాయి. 150 దేశాల అధినేతలూ, వారి ప్రతినిధులూ ఇందులో పాల్గొంటున్నారు. తనకిచ్చిన 15 నిమిషాల వ్యవధిని అతిక్రమించి ట్రంప్ దాదాపు గంటసేపు వారినుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగం ఆద్యంతం గమనిస్తే ఆయన అమెరికా అధ్యక్షుడిగా కాక వ్యక్తిగత హోదాలో మాట్లాడారని, సభాసదులు ఓటర్లనే భావనలోనే ఆయనున్నారనిపిస్తుంది.
మాజీ అధ్యక్షుడు జో బైడెన్ వైఫల్యాలను ప్రస్తావించటం మొదలుకొని, తాను సాధించాననుకుంటున్న విజయాలను ఏకరువు పెట్టడం వరకూ ఆయన దేన్నీ వదల్లేదు. పర్యావరణం, పునర్వినియోగ ఇంధన వన రులు వగైరాలన్నీ మోసగాళ్ల పన్నాగమని ట్రంప్ నిశ్చితాభిప్రాయం. వాటిని అమలుచేసే వాళ్లంతా బుద్ధిహీనులని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్రిక్తతలను తగ్గించటంలో, యుద్ధా లను నివారించటంలో సమితిసహా అన్ని సంస్థలూ విఫలమైతే, తాను ఒంటిచేత్తో ఏడు యుద్ధాలను ఆపానని ప్రకటించుకున్నారు. యధావిధిగా భారత్–పాక్ యుద్ధం కూడా ఈ జాబితాలో వుంది. దీంతో సహా ఆయన ప్రస్తావించిన ఏ అంశానికీ ఆధారాల్లేవు.
ఏటా సెప్టెంబర్‌లో సమితి సర్వసభ్య సమావేశాలు జరగటం, ధరిత్రి ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించటం ఆనవాయితీ. ఈసారి సంస్థ 80వ సంస్థాపక దినోత్సవం సమీపిస్తున్నందున ‘కలిసుంటేనే మెరుగ్గావుంటాం’ అనే అంశం ప్రాతిపదికగా ‘శాంతి, అభివృద్ధి, మానవహక్కులు’ తదితర విషయాలపై అధినేతలంతా ప్రసంగించాలి. ప్రాతి పదిక అంశం మొదలుకొని దేనిపైనా ట్రంప్‌కు ఏకీభావం లేదు. అసలు ఆయన వ్యవహరిస్తున్న తీరుకూ, అక్కడ చర్చిస్తున్న అంశాలకూ చుక్కెదురు.
మానవ నాగరికతా ప్రస్థానానికి మూలకారణమైన వలసలంటేనే ఆయనకు ఏహ్యభావం. సరిహద్దుల్ని మూసివేసి, బయటివారు రాకుండా కట్టడి చేయాలని యూరప్ దేశాలకు ఆయన హితబోధ చేశారు. స్వాభిమానంగల దేశాలన్నీ తమ సంస్కృతి, సంప్రదాయాలతో, మతంతో సంబంధంలేనివారి నుంచి ప్రజలనూ, సమాజాలనూ రక్షించుకునే హక్కుండాలని ఆయన చెప్పిన మాట ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ఆయన పూర్వీకులు జర్మన్ సంతతివారు. అసలు అమెరికాయే వలసదారుల దేశం. ఆ వలసదారులు పొట్టపోసుకోవడానికి వచ్చిన వారు కాదు. మూలవాసులైన అనేక జాతుల వారిని సమూలంగా తుడిచిపెట్టినవారు.
మొన్నీమధ్యే బ్రిటన్ వెళ్లి ఘనమైన రాజవంశ ఆతిథ్యం స్వీకరించి, ఆ దేశాన్ని పొగడ్తలతో ముంచెత్తిన ట్రంప్ సమితి ప్రసంగంలో మాత్రం దాన్ని దుయ్యబట్టారు. వలసలను అడ్డుకోలేక పోతున్నదని ఆ దేశంపై ట్రంప్ అభియోగం. చట్టబద్ధ వలసలను సైతం నేరంగా పరిగణించటం, వేరే దేశాల వారెవరూ వుండటానికి వీల్లేదన్న రీతిలో మాట్లాడటం ఆశ్చర్యకరం. ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ తాను హెచ్1బి వీసాతోనే వచ్చానని స్వయంగా ప్రకటించుకున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్ చీఫ్ సుందర్ పిచాయ్‌లు సైతం ఆ వీసాతో ప్రవేశించినవారే. ఈ ముగ్గురూ లక్ష కోట్ల డాలర్ల టర్నోవర్‌గల వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. అమెరికా అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నారు. అయినా ట్రంప్‌కు వలసలు ససేమిరా ఇష్టం ఉండవు.
గతకాలపు అమెరికా అధ్యక్షుల ఆచరణ ఎలావున్నా ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో వారి ప్రసంగాలు గంభీరంగా ఉండేవి. ఈ ప్రపంచానికి చోదకశక్తి తామేనన్న అభి ప్రాయం కలిగించటానికీ, తమతోనే భవిష్యత్తుందని చెప్పటానికీ ప్రయత్నించేవారు. ట్రంప్ అందుకు భిన్నం. ప్రపంచదేశాలపై నిందలేయటం, అమెరికా కష్టాలకు వారంతా కారణమన్నట్టు మాట్లాడటం ఆయనకు రివాజు. ఆయన తాజా ప్రసంగం కూడా ఆ కోవ లోనే సాగింది. తమ మాట చెల్లుబాటు కావటంలేదన్న ఉక్రోషంతో ఆయన సమితిని డొల్లసంస్థగా అభివర్ణించారుగానీ...నిజానికి దాని ఉన్నత లక్ష్యాలకు గండికొట్టి, ఆ సంస్థను నామమాత్రావశిష్టం చేసింది అమెరికాయే.