
410 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
నిఫ్టీ లాభం 135 పాయింట్లు
మెరిసిన మెటల్ షేర్లు
ముంబై: కొత్త జీఎస్‌టీ సంస్కరణలపై ఆశలతో పాటు మెటల్ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు బుధవారం అరశాతం లాభపడ్డాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో జరుగుతున్న 56వ జీఎస్‌టీ కౌన్సిల్ భేటిలో 500 ఉత్పత్తుల ధరలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుత విధానంలో నాలుగు పన్ను శ్లాబ్‌లు (5%, 12%, 18%, 28%) ఉండగా.. ఇకపై రెండు శ్లాబ్‌లు (5%, 18%) మాత్రమే ఉంటాయని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది.
జీఎస్‌టీ 2.0తో ధరలు తగ్గి వినియోగం పెరగొచ్చనే ఆశావహ అంచనాలతో సెన్సెక్స్ 410 పాయింట్లు లాభపడి 80,568 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 135 పాయింట్లు లాభపడి 24,715 వద్ద నిలిచింది. ఉదయం ఫ్లాటుగా మొదలైన సూచీలు రోజంతా తీవ్ర ఒడిదుడులకు లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 80,005 – 80,671 శ్రేణిలో మొత్తంగా 667 పాయింట్లు పరిధిలో కదలాడింది. నిఫ్టీ 157 పాయింట్లు బలపడి 24,737 వద్ద గరిష్టాన్ని తాకింది. ఆసియాలో దక్షిణ కొరియా మినహా అన్ని రంగాల షేర్లూ నష్టాలు చవిచూశా యి. యూరప్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
→ ట్రేడింగ్‌లో మెటల్ షేర్లు మెరిశాయి. చైనా 2025, 2026లో స్టీల్ ఉత్పత్తిని తగ్గించాలనే నిర్ణయం, అంతర్జాతీయంగా డాలర్ బలహీనత కారణంగా మెటల్ షేర్లకు డిమాండ్ లభించింది. టాటా స్టీల్ 6%, జిందాల్ స్టీల్, సెయిల్ 5.50% ర్యాలీ చేశాయి. నాల్కో, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 3%, ఎన్‌ఎండీసీ, లాయిడ్స్ మెటల్స్, వేదాంత 2% రాణించాయి.
→ రంగాల వారీగా బీఎస్‌ఈ ఇండెక్సుల్లో మెటల్ 3%, కమోడిటీ 1.50% లాభపడ్డాయి, ఫార్మా, కన్జూమర్ డి్రస్కేషనరీ, ఫైనాన్సియల్ సరీ్వసెస్, బ్యాంకెక్స్, ఆటో సూచీలు 1% పెరిగాయి. మరోవైపు ఐటీ, టెక్, వినిమయ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
→ విక్రాన్ ఇంజనీరింగ్ లిస్టింగ్ నిరాశపరిచింది. ఇష్యూ ధర(రూ.97)తో పోలిస్తే బీఎస్‌ఈలో 3% ప్రీమియంతో రూ.98 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో రూ.102 వద్ద గరిష్టాన్ని, రూ.93 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి ఒకటిన్నర శాతం నష్టంతో రూ.95.64 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.2,467 కోట్లుగా నమోదైంది.