reform
-
ఏపీ విద్యాసంస్కరణలు అద్భుతం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంస్కరణలు అద్భుతంగా ఉన్నాయని నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ మైకెల్ రాబర్ట్ క్రేమెర్ ప్రశంసించారు. ఆయన గురువారం చికాగో యూనివర్సిటీలోని డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎమిలీ క్యుపిటో బృందంతో కలిసి రాష్ట్రానికి వచ్చారు. సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్సనలైజ్డ్ అండ్ అడాప్టివ్ లెర్ణింగ్ (పాల్) ప్రాజెక్టు అమలు చేస్తున్న పాఠశాలలను ఈ బృందం పరిశీలించనుంది. సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఈ బృందం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్‌కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావుతో విద్యాసంబంధ అంశాలపై చర్చించింది. విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను అధికారులు ఆ బృందానికి వివరించారు. ఈ బృందం మూడురోజుల పాటు ఏలూరు జిల్లాలో వివిధ పాఠశాలలను సందర్శించనుంది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్‌కుమార్ మాట్లాడుతూ.. ఏపీ విద్యావ్యవస్థపై చికాగో యూనివర్సిటీ బృందం పరిశోధించడం అభినందనీయమన్నారు. ఇలాంటి పరిశోధనలు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి మరింత దోహదపడతాయని చెప్పారు. రాష్ట్రంలో విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరిచేందుకు పర్సనలైజ్డ్ అండ్ అడాప్టివ్ లెర్ణింగ్ (పాల్) బాగుందని సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏఎస్పీడీ డాక్టర్ కె.వి.శ్రీనివాసులురెడ్డి, శామో జాయింట్ డైరెక్టర్ బి.విజయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
Telangana: తప్పటడుగుల ఇంటర్ బోర్డుకు చికిత్స!
సాక్షి, హైదరాబాద్: పరీక్షల నిర్వహణలో ఏటా అబాసుపాలవుతున్న ఇంటర్మీడియెట్ బోర్డును చక్కబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ దిశగా ఇటీవల ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. లోపాలను సరిచేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. త్వరలో నిపుణులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని నిర్ణయించింది. ఇంటర్ బోర్డు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న నవీన్ మిత్తల్‌కు కార్యాచరణ అప్పగించే అవకాశముందని అధికారవర్గాల ద్వారా తెలిసింది. బోర్డులో అంతర్గతంగా ఉన్న సమస్యలు, నియంత్రణ వ్యవస్థ లోపించడం, సంబంధం లేని వ్యక్తుల ప్రమేయం కారణంగా కొన్నేళ్లుగా ఇంటర్ పరీక్షల్లో అనేక లోటుపాట్లు చోటుచేసుకుంటున్నాయి. వీటన్నింటికీ కారణాలను అన్వేషించి, తప్పులు జరగకుండా పకడ్బందీగా మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడేళ్లుగా తప్పిదాలే... 2019 మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్షల ఫలితాల్లో తప్పులొచ్చినట్టు గుర్తించారు. వీటిని సరిచేయడంలో ఆలస్యం జరిగింది. దీంతో 27 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. 2020 మార్చిలో జరిగిన పరీక్షల్లో ప్రశ్నపత్రంలో భారీగా తప్పులు రావడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఫెయిలైన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే, కరోనా రావడం, సప్లిమెంటరీ పెట్టలేకపోవడంతో ఫెయిలైన వారందరినీ పాస్ చేశారు. 2021లో కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. మొదటి సంవత్సరం మార్కుల ఆధారంగానే రెండో ఏడాది మార్కులను నిర్ధారించారు. ఫస్టియర్ విద్యార్థులకు రెండో సంవత్సరానికి అనుమతించారు. కానీ 2021 అక్టోబర్‌లో రెండో సంవత్సరం చదువుతున్న వారికి ఫస్టియర్ పరీక్షలు పెట్టారు. ఇందులో 49% ఉత్తీర్ణత రావడం, ఆందోళనతో ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం, ఇదంతా రాజకీయ రంగు పులుముకోవడంతో కనీస మార్కులతో అందరినీ పాస్ చేశారు. ఇటీవల జరిగిన ఇంటర్ పరీక్షల్లోనూ అనేక తప్పులు దొర్లాయి. ఒకచోట సంస్కృతం సబ్జెక్టులో మూడు ప్రశ్నలు రిపీట్ అయ్యాయి. జనగామలో సంస్కృతం పేపర్‌కు బదులు హిందీ పేపర్ ఇచ్చారు. ఇంగ్లిష్ ప్రశ్నపత్రంలో పొరపాట్లు దొర్లాయి. పొలిటికల్ సైన్స్ హిందీ మీడియం ప్రశ్నపత్రం ముద్రించకుండా, చేతిరాతతో అప్పటికప్పుడు ఇవ్వడం విద్యార్థులను కలవరపెట్టింది. ఇలా ప్రతీ ఏటా పరీక్షల నిర్వహణ తలనొప్పిగా మారుతోంది. సమూల మార్పులే శరణ్యమా? పరీక్ష నిర్వహణలో కీలక భూమిక పోషిస్తున్న తాత్కాలిక, కాంట్రాక్టు ఉద్యోగులను మార్చాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. బోర్డుపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని పరిశీలన కమిటీకి అప్పగించే వీలుంది. దీంతోపాటే పరీక్ష కేంద్రాలను, ఇన్విజిలేటర్లను పెంచడం, జిల్లాస్థాయి నుంచే బాధ్యతాయుతంగా పనిచేసే యంత్రాంగాన్ని నియమించడం వంటి చర్యలూ తీసుకోవాలని భావిస్తున్నారు. (క్లిక్: వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ) -
ఇక ఈబీ - 5 వీసాల వంతు..?
వాషింగ్టన్ : ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అమెరికా కలలు కనే జనాలకు ఒకటే ఆందోళన. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఇన్నాళ్లు హెచ్ - 1బీ వీసా మార్పుల గురించి మాట్లాడిన ట్రంప్ తాజాగా మరో బాంబ్ పేల్చారు. అమెరికాలో వ్యాపారం ప్రారంభించాలనే విదేశీ పెట్టుబడిదారులకు జారీ చేసే ఈబీ-5 వీసాలపై ట్రంప్ దృష్టి సారించనున్నట్లు సమాచారం. ఈ వీసా ద్వారా విదేశీయులు అమెరికాలో కనీసం ఒక మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలి. అంతేకాక ఓ పదిమందికి తప్పకుండా పర్మినెంట్ జాబ్ కల్పించాలి. ఇలా పెట్టుబడి పెట్టిన విదేశీయులకు గ్రీన్ కార్డు లభిస్తుంది. అయితే ఈ వీసాల దుర్వనియోగం జరుగుతోందని, వీటి వల్ల అక్రమాలు, మోసాలు పెరిగిపోతున్నాయని ట్రంప్ యంత్రాంగానికి అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో యూఎస్ కాంగ్రెస్ ఈ వీసా విధానంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈబీ-5 వీసా విధానాన్ని రద్దు చేయడం లేదా సంస్కరణలు చేపట్టడం చేయాలని ట్రంప్ యంత్రాంగం యూఎస్ కాంగ్రెస్‌ను కోరింది. ఈ సందర్భంగా అమెరికా పెట్టుబడిదారులకు ఉత్తమమైన రక్షణ కల్పించాలని, మోసాలకు గురికాకుండా కావాడాల్సిన అవసరం ఉందని అమెరికా పౌరసత్వ, వలసదారుల సేవల విభాగం డైరెక్టర్ ఎల్ ఫ్రాన్సిస్ సిస్సానా పేర్కొన్నారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈబీ-5 వీసాల్లో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరముందన్నారు ఫ్రాన్సిస్. విదేశీయులు మనీలాండరింగ్‌కు పాల్పడడానికి, గూఢచర్యం చేయడానికి దేశంలో పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ ఏడాది, సెప్టెంబర్ 30 నాటికి ఈబీ - 5 వీసా కార్యక్రమం ముగియనుంది. ఈబీ - 5 వీసా విధానం ద్వారా ఏటా పది వేల మంది విదేశీ పెట్టుబడిదారులకు ఈ వీసాలు మంజూరు చేస్తారు. ఇది కూడా దేశాల వారీ కోటా ఆధారంగా ఉంటుంది. కాగా అమెరికాలో ఈబీ-5 వీసా కోసం దరఖాస్తులు చేసుకునే దేశాల్లో చైనా మొదటి స్థానంలో, వియత్నాం రెండో స్థానంలో, భారత్ మూడో స్థానంలో ఉన్నాయి. గత ఏడాది భారత్ నుంచి ఈబీ-5 వీసా కోసం 500 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ ఏడాది 700 మంది దాకా దరఖాస్తు చేసే అవకాశం ఉందని అంచనా. ఈబీ - 5 వీసా కోసం మన దేశం నుంచి ఎక్కువగా చండిఘర్, పంజాబ్, ఢిల్లీ, ముంబై, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఎక్కువ పోటి ఉంటుందని తెలిపారు. అయితే దుర్వినియోగం, మోసాలకు పాల్పడుతున్నట్లు వస్తోన్న ఫిర్యాదులు ఎక్కువగా చైనాకు సంబంధించినవని తెలుస్తోంది. -
వ్యవస్థలో మార్పులకు పునాదిగా బడ్జెట్
- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు - భవిష్యత్తులో తెలంగాణలోనూ అధికారం బీజేపీదేనని ధీమా సాక్షి, హైదరాబాద్: రాబోయే రోజుల్లో వ్యవస్థలో మార్పునకు పునాదులు వేసే అంశాలు కేంద్ర బడ్జెట్లో ఉన్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అభిప్రాయపడ్డారు. శనివారం ఇక్కడి బీజేపీ కార్యాలయంలో కేంద్ర బడ్జెట్ తీరుతెన్నులపై పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల్లోకి వచ్చిన రూ. 14 లక్షల కోట్ల పైచిలుకు డబ్బంతా వైట్‌మనీ కాదని, ఇందులోంచి పన్ను కట్టని వారిని గుర్తించే ఏర్పాట్ల వల్ల ప్రభుత్వానికి డబ్బు వచ్చి తీరుతుందన్నారు. దేశంలో రాజకీయాల ప్రక్షాళ న దిశగా బీజేపీ ముందుకు వెళుతోందని, ఇది తమ పార్టీ మాత్రమే చేయగలుగుతుందన్నారు. తెలంగాణలోనూ రాబోయే రోజుల్లో బీజేపీ దే అధికారమని, అవినీతి లేని ప్రభుత్వాన్ని బీజేపీ ఇవ్వగలదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకె ళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లోగా దేశంలో భారీగా మౌలిక సదుపా యాలు కల్పించిన ఘనతను మోదీ ప్రభుత్వం సాధిస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కె.లక్ష్మ ణ్ మాట్లాడుతూ ఇది అక్షరాలా పేదల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ అని అభివర్ణించారు. సమావేశంలో పార్టీ నాయకులు చింతా సాంబ మూర్తి, డా. జి. మనోహర్‌రెడ్డి, గుజ్జుల ప్రేమేం దర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి రాష్ట్రంలో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్‌లకు వివిధ జిల్లాల పసుపు రైతులు విజ్ఞíప్తి చేశారు. మద్దతు ధర పెంచేలా కేంద్ర ప్రభుత్వం దృíష్టికి తీసుకెళ్లాలని కోరారు. శనివారం బీజేపీ కార్యాల యంలో పార్టీ నాయకులు జి. ప్రేమేందర్‌రెడ్డి, కిసాన్‌మోర్చా అధ్యక్షుడు గోలి మధుసూదన రెడ్డి సమక్షంలో నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల పసుపు రైతులు ఈ మేరకు బీజేపీ నాయ కులకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సంద ర్భంగా మురళీధర్‌రావు మాట్లాడుతూ పసుపు సహా ఇతరత్రా పంటల విషయం లో ఆదుకోవాలని కోరేవారు తమ ప్రాం తాల నుంచి బీజేపీని గెలిపించాలన్నారు. -
‘మీ సేవ’లో సంస్కరణలు
∙వినియోగదారులకు సేవలు వేగవంతం ∙పారదర్శకత పెంపునకు చర్యలు కాజీపేట : మీ సేవ కేంద్రాల్లో సంస్కరణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. విని యోగదారులకు ఇకపై సేవలు వేగవంతం చేసేలా ప్రక్షాళన ప్రారంభించింది. రాష్ట్ర ఆవి ర్బావ వేడుకల నుంచే సంస్కరణ చర్యలు అమల్లోకి వచ్చినట్లు ఆయా కేంద్రాలకు, సం బంధిత అధికారులకు ఉత్తర్వులు అందాయి. జిల్లాలో టీఎస్ ఆన్లైన్ కేంద్రాలు, సీఎస్సీ, ఈసేవ కేంద్రాలు అన్ని కలిపి సుమారు 600 సెంటర్లు.. 36 విభాగాలకు చెందిన 322 సేవలను వినియోగదారులకు అందిస్తున్నాయి. ఈసేవ కేంద్రాలు ప్రతి లావాదేవీకి రూ.5 నుం చి 10 వరకు ప్రభుత్వం నుంచి కమీషన్ పొం దుతున్నాయి. కమీషన్లు సకాలంలోనే అందుతున్నా కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి వేతనాలు సక్రమంగా చెల్లించడం లేదు. దీంతో కేంద్రాల్లో లావాదేవీలు తగ్గుముఖం పడుతున్నాయి. దీనికి తోడు కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కై ప్రజల నుంచి అధికంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీన్ని గుర్తించిన ప్రభుత్వం కేంద్రాలను రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈఎస్డీ (ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ) పర్యవేక్షణ కిందకు తీసుకొచ్చింది. దీంతో ఈఎస్డీ నిరంతర పర్యవేక్షణ సాగించి ఈసేవ కేంద్రాల పనితీరును గాడిన పెట్టనుంది. టీఎస్టీఎస్కు బాధ్యతలు... జిల్లాలో మీసేవ కేంద్రాల సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. దీంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇకపై ఇలాంటి పరిస్థితి రాకుండా కేంద్రాల్లో బయోమెట్రిక్ హాజరును ప్రభుత్వం అమలు చేయనుంది. అన్ని కేంద్రాల్లో నిఘా కెమెరాలను సైతం ఏర్పాటు చేయనుంది. ఇలా హైదరాబాద్ నుం చే అనుక్షణం పర్యవేక్షణ కొనసాగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా అందుబాటులోకి తెస్తున్న సాంకేతిక వ్యవస్థతో కేంద్రాల పనితీరు మెరుగుపర్చి వినియోగదారులకు సకాలంలో సేవలందించేలా కృషిచేస్తున్నారు. మీసేవలో మధ్యవర్తులుగా కొనసాగుతున్న ఏజెన్సీల స్థానంలో తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్(టీఎస్టీఎస్)కు బాధ్యతలు కట్టబెట్టింది. నిర్వాహకుల వేతనాల పెంపు... మీసేవా కేంద్రాల్లో మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఏజెన్సీల నిర్వహణ నిబంధనలను కఠినతరం చేసింది. మీసేవ కేంద్రాల్లో పనిచేసే ఆపరేటర్ల జీతాలను ప్రభుత్వం 50 శాతం పెంచింది. ప్రస్తుతం రూ.4500 నుంచి రూ.6 వేల వరకు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వీరి వేతనాలు రూ.10 వేలకు పెరగవచ్చు. ఇవి కూడా ఏజెన్సీలకు కాకుండా నేరుగా ఆపరేటర్ల ఖాతాల్లో జమ అవుతాయి. ఇకపై మీసేవా కేంద్రాల్లో టోకెన్ పద్ధతి పెట్టి 15 నిమిషాల్లో లావాదేవీలను ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వినియోగదారులు గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు. -
ఫిరాయింపు చట్ట సవరణ అనివార్యం
చట్టసభ సభ్యుల పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు ప్రస్తుతం ఉన్న ఫిరాయింపు వ్యతిరేక చట్టాన్ని పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ముదావహం. ఈ మేరకు తాజాగా కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ స్పష్టం చేయడం స్వాగత పరిణామంగా పేర్కొన వచ్చు. లా కమిషన్ ఈ దిశగా కొన్ని సిఫార్సులు చేసిందని, వీటిని అధ్యయనం చేసేందుకు ఓ కమి టీని ఏర్పాటు చేసినట్టు విశదీకరించారు. అయితే మంత్రి ఈ మాటకు కట్టుబడి ఉండి చిత్తశుద్ధితో అమలుచేస్తే వలువలూడిన ప్రజాస్వామ్య వ్యవస్థ బట్టకట్టేందుకు అవకాశం కలుగుతుంది. ప్రలోభాలకు లొంగి, పలువురు చట్టసభ సభ్యులు విపక్షాల నుంచి అధికార పక్షంలోకి వెళ్తున్న వైనం అత్యంత దారుణంగా ఉంది. ఎన్నికల ముందు అధికార పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా వ్యవహరించిన వారు కొందరు అధికార పార్టీలోకి నిస్సిగ్గుగా ప్రవేశిస్తున్నారు. 2019 నాటికి నియోజక వర్గాల సంఖ్య పెరుగుతుందని, టికెట్ల కేటాయిం పునకు ఎలాంటి సమస్యా ఉండదని అధికార పార్టీ పెద్దలు ఊరిస్తున్నారు. అయితే 2026 వరకు నియోజక వర్గాల పెంపు సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. అయినప్పటికీ విపక్షాలకు చెందిన సభ్యులు నియోజకవర్గ ప్రజల ఆశయాలకు, ఆకాంక్షలకు విరుద్ధంగా అధికార పార్టీ కండువాలను కప్పుకొం టున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో విప క్షాలకు చెందిన పలువురు తెలుగుదేశం, టీఆర్ ఎస్‌ల్లో చేరిన సంగతి తెలిసిందే. ఈ చేరికల నేప థ్యంలో అధికార పార్టీల్లో సంబంధిత నియోజక వర్గాల్లో పాత, కొత్తవారి మధ్య లుకలుకలు బయలు దేరాయి. పరస్పరం తిట్టుకోవడం, కొట్టుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో మరీ ఎక్కువగా ఉంది. పార్టీ మార్పిడిదారులను ప్రజలు అసహ్యించుకుంటున్న పరిస్థితి కొనసాగుతోంది. సంబంధిత పార్టీని విడనాడిన వెంటనే పదవిని కోల్పోయే విధంగా చట్టాన్ని పటిష్టం చేయాలి. ఆయా పార్టీలు విప్ జారీ చేసేటప్పుడు, ఉల్లం ఘించిన సభ్యులపై అనర్హత వేటు వేయాల్సి ఉన్నా అలా జరగడం లేదు. స్పీకర్ల నిర్వాకమే దీనికి కారణ మని పేర్కొనవచ్చు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలను గమనించిన వారికెవరి కయినా ఈ విషయం అర్థమవుతుంది. స్పీకర్ల పాత్ర వివాదాస్పదమైన నేపథ్యంలో అనర్హత వేటుకు సంబంధించి రాష్ట్ర గవర్నరుకు ఈ అధికారం కల్పిస్తే సమంజసంగా ఉంటుందని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ సూచించారు. పార్టీ ఫిరాయింపు చట్ట నిబంధనలను అమలు పరచడంలో సభాపతి పాత్రను పునఃసమీక్షించాల్సి ఉందని, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ఇటీవల వ్యాఖ్యానిం చారు. ఒక పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతి నిధులు మరో పార్టీలో చేరాలనుకుంటే ముందుగా ఆ పదవికి రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరాలని స్పష్టం చేశారు. అలాగే ఓ ప్రజా ప్రతినిధి వేరే పార్టీకి విధేయత వ్యక్తం చేసినా సరే వేటు వేయాల్సిందేనని పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా ఇటీవల ఉత్తరా ఖండ్‌లో 9మంది కాంగ్రెస్ తిరుగుబాటు శాసన సభ్యులను అక్కడి స్పీకర్ అనర్హులుగా ప్రకటించిన సంగతిని కూడా ఈ సందర్భంగా గమనంలోకి తీసు కోవాలి. ఈ అనర్హత వేటుపై విచారణ జరిపిన హైకోర్టు కూడా వీరికి ముఖ్యమంత్రి రావత్ విశ్వాస పరీక్షలో ఓటుహక్కు ఉండదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులోనూ వారికి ఉపశమనం లభించలేదు. స్పీకర్ల వ్యవస్థ వివాదాస్పదమైన నేపథ్యంలో జాతీయస్థాయిలో చర్చ జరగడం ఎంతయినా అవ సరమని వర్తమాన పరిస్థితులు నొక్కి చెబుతు న్నాయి. ఈ వ్యవస్థపై నమ్మకం కలిగే విధంగా ఫిరా యింపుల వ్యతిరేక చట్టాన్ని పటిష్టం చేయాలి. ఈ విషయమై చట్టాన్ని పటిష్టం చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని కేంద్ర న్యాయశాఖ ప్రక టించడం ఓ ఆశాకిరణంగా కన్పిస్తోంది. ఈ చట్టాన్ని పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రజా స్వామ్యానికి మంచి మేలు జరగవచ్చు. లేనప్పుడు ఈ వ్యవస్థ భ్రష్టు పడుతుందని వేరేగా చెప్పనక్కర లేదు. ‘ఆయారాం, గయారాం’ సంస్కృతికి అడ్డుకట్ట వేసేందుకు మౌలికమైన చర్యలు తీసుకోవాలి. ఇలా చేస్తే తప్ప ప్రజాస్వామ్యంలో మన దేశ ప్రతిష్ట పెరగదు. అధః పాతాళంలోకి దిగజారుతుందనే విష యాన్ని పాలకులు గుర్తించాలి. - వాండ్రంగి కొండలరావు, సీనియర్ జర్నలిస్ట్, పొందూరు, శ్రీకాకుళం జిల్లా మొబైల్ : 94905 28730 -
'దేశాన్ని మారిస్తే నా వారసుడిని కాల్చిపారేయండి'
ఉత్తరకొరియా: దేశంలో తిరిగి సంస్కరణలు చేపట్టాలని ప్రయత్నిస్తే తన కుమారుడిని కాల్చిపారేయండని ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ తన అనుంగులకు, తనకు నమ్మకస్తులైన అధికారులకు ఆదేశాలు ఇచ్చాడు. అందుకోసం వారందరికీ వెండితో తయారుచేసిన ప్రత్యేక తుపాకీలు ఇచ్చారు. ఉత్తర కొరియాలో కొత్తగా విడుదలైన పుస్తకాల్లో ఈ అంశాలు వెలుగుచూశాయి. ఉత్తర కొరియా పాలన మొత్తం కిమ్ ఇల్ సంగ్ కుటుంబం కిందే నడుస్తున్న విషయం తెలిసిందే. జాంగ్ ఇల్ సంగ్ మరణాంతరం ఆ బాధ్యతలను కిమ్ జాంగ్ ఇల్ ప్రస్తుతం కిమ్ జాంగ్ ఉన్ దేశ పాలన చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న విధానంలోనే దేశం ముందుకు వెళ్లాలని, కాదని తన మరణాంతరం సంస్కరణలు తీసుకొచ్చి దేశ పాలన విషయాల్లో మార్పులు చేసేందుకు తన వారసులు ప్రయత్నిస్తే కాల్చి పారేయండని చాలా గట్టిగా చెప్పినట్లు ఆ పుస్తకం తెలిపింది. రా జాంగ్ యిల్ అనే దక్షిణ కొరియా మాజీ నిఘా చీఫ్ ఆర్మీ అధికారి ఈ పుస్తకాన్ని రాశారు. దీనిపైనే ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్పులుచేర్పులకు ప్రయత్నించి సోవియట్ యూనియన్ ఎంత పతనమైందో కిమ్ ఇల్ సంగ్ స్వయంగా చూశారని, ఈ నేపథ్యంలోనే తన అనంతరం వచ్చే వారసుడు దేశంలో స్టాలినేతర విధానాలు తీసుకురావాలని ప్రయత్నిస్తే దేశం విచ్ఛిన్నమయిపోతుందని భావించి అలా తన వారుసుడు ప్రయత్నిస్తే కాల్చి పారేయండి తన నమ్మకస్తులకు స్వయంగా తుపాకులు ఇచ్చినట్లు చెప్పారు. -
జైళ్లకు తెల్ల సున్నం..!
* ప్రభుత్వానికి జైళ్లశాఖ ప్రతిపాదన * ఖైదీల మానసిక ప్రశాంత కోసమే... సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర జైళ్లశాఖ సంస్కరణల్లో భాగంగా కొత్త మార్పునకు శ్రీకారం చుట్టింది. ఖైదీలకు మానసిక ప్రశాంతత కోసం ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు చేపడుతున్న జైళ్లశాఖ తాజాగా పరిసరాలపై దృష్టిపెట్టింది. నిండుగా తెలుపు రంగు కనిపిస్తే ఖైదీల్లో మానసిక ప్రశాంతత ఏర్పడుతుందనే భావనతో రాష్ట్రంలోని అన్ని జైళ్లకు తెల్ల సున్నం వేయించాలని నిర్ణయించింది. ఇప్పటివరకూ ఖైదీలు ఉండే బ్యారక్‌లలో గోడలకు సిమెంట్ పూతతోనే వదిలేస్తుండటంతో ఏళ్లు గడిచే కొద్ది అవి నల్లగా మారిపోయాయి. దీనివల్ల ఖైదీలు మానసిక ప్రశాంతత కోల్పోవడంతోపాటు వారికి కంటి సమస్యలు వస్తున్నట్లు గుర్తించి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. మరోవైపు ఖైదీలకు ఇప్పటికే యోగా, మానసిక వైద్య నిపుణులతో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న తాజాగా వారికి శారీరక ఉల్లాసం కల్పించేందుకు క్రీడలపై దృష్టిసారించింది. ఆరోగ్యం కోసం క్రీడలను తప్పనిసరి చేస్తూ అందుకు కావాల్సిన క్రీడా సామాగ్రి కొనుగోలుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. జైలు సామర్థ్యాన్ని బట్టి గరిష్టంగా రూ. 10 వేల వరకు ప్రత్యేక క్రీడల బడ్జెట్ కేటాయించేలా ప్రతిపాదనలు రూపొందించింది. అలాగే సిబ్బంది క్రీడల కోసం కూడా ప్రతి క్వార్టర్‌కు రూ. 3 వేలు కేటాయించాలని నిర్ణయించింది. పోలీసుశాఖలో మాదిరిగా జైళ్లశాఖలోనూ ఇకపై 40 ఏళ్లు పైబడ్డ సిబ్బంది, వారి కుటుంబానికి పూర్తి స్థాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని జైళ్లశాఖ నిర్ణయం తీసుకుంది. వీటిని కూడా ప్రభుత్వానికి అందజేసిన ప్రతిపాదనల్లో పేర్కొంది. -
‘ఐరాస భద్రతామండలిని సంస్కరించాలి’
యూఎన్: ఐక్యరాజ్య సమితి భద్రతామండలిని బలోపేతం చేయాల్సిన అవసరముందని భారత్‌తో సహా జీ4 దేశాలు పేర్కొన్నాయి. 21వ శతాబ్దానికి తగినట్లుగా, మరింత ప్రాతినిధ్యం పెరిగేటట్లుగా భద్రతామండలిని సంస్కరించాలని భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్‌లు అభిప్రాయపడ్డాయి. ఈ మేరకు శనివారం ఆ దేశాలు బెర్లిన్‌లో సమావేశమై భద్రతామండలి బలోపేతానికి సంబంధించి తమ అభిప్రాయాలను వెల్లడించాయి. ఐక్యరాజ్యసమితి ఏర్పడి 70 సంవత్సరాలు పూర్తి అయినా ఇంకా సంస్కరణలు రూపుదాల్చలేదన్నాయి. భద్రతామండలి సంస్కరణలను సాధారణ సభ అధ్యక్షుడు సామ్ కుతెసా ఆహ్వానించారు. ఈ విషయమై పరస్పరం సహకరించుకోవాలని జీ4 దేశాలు తీర్మానించాయి. భద్రతామండలి సభ్యత్వాన్ని విస్తరించాలని చైనా ప్రతినిధి లీ జీయీ అన్నారు. -
యాజమాన్యాలు చట్టాల్ని ఉల్లంఘిస్తే చర్యలేవి?
లోక్‌సభలో కార్మిక చట్టం సవరణ బిల్లుపై ఎంపీ వరప్రసాద్‌రావు ప్రశ్న సాక్షి, న్యూఢిల్లీ: కార్మిక చట్టంలో సంస్కరణలు తెచ్చేందుకు కేంద్రం చేస్తున్న సవరణల్లో ఉల్లంఘనలకు తగిన చర్యలేవీ లేవని వైఎస్సార్ సీపీ ఎంపీ వరప్రసాద్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం లోక్‌సభలో కార్మిక చట్టం(రిటర్నుల దాఖలు మినహాయింపు, రిజిస్టర్ల నిర్వహణ మినహాయింపు) సవరణ బిల్లు-2014పై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ‘‘ఈ బిల్లుపై రాజకీయ కోణంలో మాట్లాడదలుచుకోలేదు. నేను గతంలో తమిళనాడు రాష్ట్రంలో లేబర్ కమిషనర్‌గా పనిచేశాను. అందువల్ల కొన్ని అంశాలు ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నా. నేను ఈ బిల్లుకు వ్యతిరేకంగానూ లేను. మద్దతుగానూ లేను. కార్మిక చ ట్టాలకు సంబంధించి శాసన ప్రక్రియను సరీళకరించడానికి ప్రోత్సాహాన్నిచ్చే రీతిలో ఇది కనిపిస్తోంది. కానీ మీరు లోతుగా చూస్తే సంక్లిష్టత కనిపిస్తుంది. రిజిస్టర్లు, రిటర్నులు ఎలక్ట్రానిక్ రూపంలో పంపించవచ్చన్న ప్రక్రియ ఒక్కటే సరళతరంగా కనిపిస్తుంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘2005లో ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు స్టాండింగ్ కమిటీ దాదాపు 10 సార్లు సమావేశమైంది. తిరిగి 2011లో వచ్చినప్పుడు.. కొన్ని సవరణ ప్రతిపాదనలను తొలగించాలని స్టాండింగ్ కమిటీ చెప్పింది. కానీ ఈ బిల్లులో ఒక్క లైను కూడా మారలేదు. సంస్థలు రిటర్నులు, రిజిస్టర్లను నిర్వహిస్తే తప్ప కనీస వేతన చట్టం, బోనస్ చట్టం, వంటి కార్మిక సంక్షేమ చర్యలు అమలు కావు.. అందువల్ల సంఖ్య విషయంలో, జరిమానాల విషయంలో మార్పులు చేయాలి..’ అని వరప్రసాద్ డిమాండ్ చేశారు. తొలి సంతకం నిర్వచనం తెలుసా నీకు? -
తొలి సాంఘిక తెలుగు కావ్యం బసవ పురాణం
పూర్వ సాహిత్యం తెలుగువారి సాంస్కృతిక చరిత్రలో పాల్కురికి సోమనాథుడు సాధించ ప్రయత్నించిన సంస్కరణ చాలా ప్రభావపూరితమైనది. శక్తిమంతమైనది. బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించిన ప్రథమాంధ్ర వీరశైవ కవిగా మాత్రమే కాక సామాజిక స్పృహతో సాహిత్యాన్ని సృష్టించిన భక్తి ఉద్యమకవిగా తెలంగాణ కవిగా కూడా అతడి స్థానం విశిష్టమైనది. పాల్కురికి (1160-1240) ‘శివకవి త్రయం’ అనబడే ముగ్గురు కవుల్లో మల్లికార్జున పండితారాధ్యుడు, నన్నెచోడుడుల కంటే కూడా ప్రధానమైనవాడు. వీరశైవాన్ని ప్రచారం చేసిన కవుల్లో ప్రథముడు. పాల్కురికి కాలానికి సాంస్కృతికంగా బౌద్ధం, జైనం బలహీన స్థితిలో ఉన్నాయి. జైనులు, బౌద్ధులు రంగం నుంచి తప్పుకున్న తర్వాత బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఎదిరించే కర్తవ్యాన్ని అందుకొని వీరశైవం ముందుకు వచ్చింది. ఇందుకు కర్నాటకలో కూడలి సంగమ క్షేత్రాన్ని స్థావరంగా చేసుకొని వీరశైవాన్ని ప్రచారం చేసిన బసవేశ్వరుడు (1134-1196) మూలపురుషుడిగా నిలిచాడు. బ్రాహ్మణుల ఇంట జన్మించిన బసవేశ్వరుడు బాల్యంలోనే వైదిక క్రతువులను, పుట్టుక ఆధారంగా మనుషులకు సిద్ధం చేసి పెట్టిన వివక్షను ఏవగించుకున్నాడు. ‘మనుషులంతా ఒక్కటే. కులాలు ఉపకులాలు లేవు’ అని ఆయన చేసిన తిరుగుబాటు ప్రజల గుండెలను తాకి ప్రతిధ్వనించడమే కాక తెలుగు నేలకి కూడా చేరి వరంగల్లు ప్రాంతంలో ఉన్న పాల్కురికి సోమనాథుడిని ప్రభావితం చేసింది. ఆయన బసవేశ్వరుడ్ని రెండవ శంకరుడన్నాడు. ఆ ఆరాధనతో బసవన్న కథను బసవపురాణం పేరుతో తెలుగులో మొట్టమొదటి దేశిపురాణంగా లిఖించాడు. బసవపురాణం- పురాణం మాత్రమేకాక ఏడు అశ్వాసాల స్వతంత్ర చారిత్రక కావ్యం కూడా. భక్తిరసం, వీరరసం ఇందులో ప్రధానమైనవి. బసవని అవతరణం, సంస్కారోత్సవాలు, ప్రబోధాలు, లింగైక్యం అనే ముఖ్య అశ్వాసాల్లో మనం తెలుసుకోవాల్సిన చరిత్ర కనిపిస్తుంది. నడుమ భక్తజన కథలు ఉంటాయి. పాల్కురికి వర్ణించిన భక్తుల్లో శిశుభక్తులు, స్త్రీ భక్తులు, ముగ్ధభక్తులు, మొండి భక్తులు, ప్రౌఢభక్తులు ఉన్నారు. వీరిలో వివిధ వర్ణాలకు చెందిన వారు ఉన్నారు. బసవనికి సమకాలికులైన అల్లమ ప్రభు, మడివాలు మాచయ్య, సిద్ధరామయ్య వంటి అనేకులున్నారు. రుద్ర పశుపతి, గొడగూచి, బెజ్జ మహాదేవి వంటి ముగ్ధభక్తులు ఉన్నారు. వీరశైవం ప్రబోధించి ఆచరించిన స్త్రీ పురుష సమానత్వాన్ని, కులరాహిత్యాన్ని పాల్కురికి తన రచనలో తీక్షణంగా చిత్రిక పట్టి ఆ దిశలో సంస్కరణ కోసం గట్టిగా కృషి చేశాడు. పాల్కురికి సామాజిక దృక్పథంలో ద్యోతకమయ్యే సంఘ సంస్కరణాభిలాష బసవేశ్వరుడు చెప్పిందే. బసవేశ్వరుడు ప్రతిపాదించిన విధుల్లో ముఖ్యమైనవి- వర్ణాశ్రమ ధర్మాల మీద తిరుగుబాటు; జంగమాపూజకు ప్రాధాన్యం; స్త్రీలకి పురుషులతో సమానంగా మోక్షసాధన మార్గాన్ని ఎన్నుకొనే స్వేచ్ఛ; స్థావర మూర్తుల పూజపట్ల వైముఖ్యం... జంగమ పూజకు ప్రాధాన్యం; పుట్టుక కారణంగా సంక్రమించిన అస్పృశ్యతని ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించడం; సమానత్వాన్ని పాటించడం; పంచవిధ సూతకాలలో నాలుగింటిని కూడా తిరస్కరించడం (ఇవి పురుడు, ఉచ్చిష్టం, బహిష్టూ, చావు సందర్భాలలో పాటించే అశౌచాలు); ఉపనయన సంస్కారాన్ని తిరస్కరించడం; మరణించినవారికి చేసే శ్రాద్ధ కర్మల నిరసన; మద్యమాంసాల విసర్జన.... పాల్కురికి తన కావ్యంలో ఈ విధివిధానాలకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చాడు. ఉదాహరణకి సిరియాళుడి కథలో శివుడు హలాయుధునితో సంవాదం చేస్తూ సుతుని చంపి ఆ మాంసంతో విందు చేశానని అంటే హలాయుధుడు వెటకారంగా- ‘శివ! శివ! యిది యేమి చెప్పెదవయ్య శివుడేమి నరుల భక్షింప రక్కసుడె? శిశువు సద్భక్తుని సిరియాళునంబి పశువరింపగ జంపభక్తి హీనుండె?!’ ఇది మాంసాహార విసర్జన అనే నిబంధనని గాఢంగా ప్రజల్లో నాటడానికి చెప్పిన విషయమని అర్థమవుతూనే ఉంది. బసవేశ్వరుడి ప్రబోధాలకు అనుగుణంగా ‘ఎట్టి దుర్గతిని బుట్టిననేమి యెట్లును శివభక్తుడిల పవిత్రుండు’ అన్నాడు. మత ప్రచారానికి సంస్కృత భాష వాడాలనే ఆచారాన్ని సోమనాథుడు బద్దలు కొట్టాడు. నన్నయ భారతాంధ్రీకరణలో అధిక శాతం సంస్కృత పదాలు కనిపిస్తే అందుకు పూర్తి విరుద్ధంగా పాల్కురికి బసవపురాణంలో దేశీ ఛందస్సు, నానుడులు, జాతీయాలు, పలుకుబళ్లు ప్రాధాన్యం వహిస్తాయి. ద్విపద, రగడలే కాకుండా సోమనాథుడు ఇంకా సీసం, త్రిభంగి, తరువోజ, క్రౌంచ పదం, మయూరం, చతుర్విధ కందం, తిపాస కందం వంటి స్థానిక ఛందోరీతుల ప్రయోగం చేశాడు. ‘రగడ’ అనే ఛందోరీతిని సోమనాథుడే ప్రారంభించాడు. సీస పద్యాల్లో సోమన ప్రయోగం చేశాడు. శ్రీనాథుడికి సీస పద్య రచనలో మార్గదర్శనం చేసింది సోమన సీస పద్యాలే. అలాగే బద్దెన సుమతీ శతకం కంద పద్యాలకు మార్గం చూపింది సోమనాథుడి కంద పద్యాలే. భాషలో, పద ప్రయోగాల్లో సోమనాథుడు స్వేచ్ఛగా ప్రయోగాలు చేశాడు. వైరి సమాసాలు విరివిగా వాడాడు. వస్తువు మారినప్పుడు శైలి విధానాలు కూడా మారుతాయని చెప్పడానికి బసవపురాణం మంచి ఉదాహరణ. అయితే సోమనాథుడి బసవపురాణానికి ముందు ఛందశ్శాస్త్రం ఏదీ లేదని, అతని రచన తర్వాత వచ్చిన ఛందశ్శాస్త్రాలతో దాన్ని బేరీజు వేయడం తగదని అంటారు. పాల్కురికి వాడిన మాటలు గమనించదగ్గవి. గ్రూపులు కట్టడాన్ని గుంపిడటం, తక్కువగా గౌరవించటాన్ని సోల, చాలాకొద్ది సమయాన్ని గోరంతపొద్దు అన్నాడు. ఇక అసాధ్యం అనడానికి ‘కుంచాలతో మంచు కొలవటం’ అనే చక్కని జాతీయాన్ని ప్రయోగిస్తాడు. పుష్పవిల్లు, భూమితీరు, వేడి పయోధార వంటి ప్రయోగాలు అలవోకగా చేసినట్టుగా కనిపిస్తాయి. ప్రజలకు సూటిగా తన భావాలను ప్రసరింపజేయడానికి అనువైన శైలి, అభివ్యక్తి తీరుతెన్నులను సోమనాథుడు ఎంచుకున్నాడు. అదే సమయంలో సృజనాత్మకతకు పట్టం కట్టాడు. ఆ రకంగా పాల్కురికి సోమనాథుడు కావ్యగౌరవం కలిగిన బసవపురాణాన్ని ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా రచించి ప్రజాకవిగా నిలిచాడు. తెలంగాణలోని ఎక్కువ శూద్రకులాలు శైవ మతాన్ని ఆలింగనం చేసుకున్నారని చెప్పడానికి అనువైన పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. ఆ రకంగా సామాజిక విప్లవకారుడిగా సోమనాథుడు కనిపిస్తాడు. బసవపురాణం తెలుగు సమాజంలో సంఘసంస్కరణోద్యమ గ్రంథంగా నిలిచిపోతుంది. - కాసుల ప్రతాపరెడ్డి (ఇటీవల మెదక్ జిల్లా జోగిపేట డిగ్రీ కళాశాలలో పాల్కురికి సోమనాథుడిపై జరిగిన సదస్సులో సమర్పించిన పత్రంలో కొంత భాగం)