పూర్వ సాహిత్యం
తెలుగువారి సాంస్కృతిక చరిత్రలో పాల్కురికి సోమనాథుడు సాధించ ప్రయత్నించిన సంస్కరణ చాలా ప్రభావపూరితమైనది. శక్తిమంతమైనది. బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించిన ప్రథమాంధ్ర వీరశైవ కవిగా మాత్రమే కాక సామాజిక స్పృహతో సాహిత్యాన్ని సృష్టించిన భక్తి ఉద్యమకవిగా తెలంగాణ కవిగా కూడా అతడి స్థానం విశిష్టమైనది. పాల్కురికి (1160-1240) ‘శివకవి త్రయం’ అనబడే ముగ్గురు కవుల్లో మల్లికార్జున పండితారాధ్యుడు, నన్నెచోడుడుల కంటే కూడా ప్రధానమైనవాడు. వీరశైవాన్ని ప్రచారం చేసిన కవుల్లో ప్రథముడు.
పాల్కురికి కాలానికి సాంస్కృతికంగా బౌద్ధం, జైనం బలహీన స్థితిలో ఉన్నాయి. జైనులు, బౌద్ధులు రంగం నుంచి తప్పుకున్న తర్వాత బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఎదిరించే కర్తవ్యాన్ని అందుకొని వీరశైవం ముందుకు వచ్చింది. ఇందుకు కర్నాటకలో కూడలి సంగమ క్షేత్రాన్ని స్థావరంగా చేసుకొని వీరశైవాన్ని ప్రచారం చేసిన బసవేశ్వరుడు (1134-1196) మూలపురుషుడిగా నిలిచాడు. బ్రాహ్మణుల ఇంట జన్మించిన బసవేశ్వరుడు బాల్యంలోనే వైదిక క్రతువులను, పుట్టుక ఆధారంగా మనుషులకు సిద్ధం చేసి పెట్టిన వివక్షను ఏవగించుకున్నాడు. ‘మనుషులంతా ఒక్కటే. కులాలు ఉపకులాలు లేవు’ అని ఆయన చేసిన తిరుగుబాటు ప్రజల గుండెలను తాకి ప్రతిధ్వనించడమే కాక తెలుగు నేలకి కూడా చేరి వరంగల్లు ప్రాంతంలో ఉన్న పాల్కురికి సోమనాథుడిని ప్రభావితం చేసింది. ఆయన బసవేశ్వరుడ్ని రెండవ శంకరుడన్నాడు. ఆ ఆరాధనతో బసవన్న కథను బసవపురాణం పేరుతో తెలుగులో మొట్టమొదటి దేశిపురాణంగా లిఖించాడు.
బసవపురాణం- పురాణం మాత్రమేకాక ఏడు అశ్వాసాల స్వతంత్ర చారిత్రక కావ్యం కూడా. భక్తిరసం, వీరరసం ఇందులో ప్రధానమైనవి. బసవని అవతరణం, సంస్కారోత్సవాలు, ప్రబోధాలు, లింగైక్యం అనే ముఖ్య అశ్వాసాల్లో మనం తెలుసుకోవాల్సిన చరిత్ర కనిపిస్తుంది. నడుమ భక్తజన కథలు ఉంటాయి. పాల్కురికి వర్ణించిన భక్తుల్లో శిశుభక్తులు, స్త్రీ భక్తులు, ముగ్ధభక్తులు, మొండి భక్తులు, ప్రౌఢభక్తులు ఉన్నారు. వీరిలో వివిధ వర్ణాలకు చెందిన వారు ఉన్నారు. బసవనికి సమకాలికులైన అల్లమ ప్రభు, మడివాలు మాచయ్య, సిద్ధరామయ్య వంటి అనేకులున్నారు. రుద్ర పశుపతి, గొడగూచి, బెజ్జ మహాదేవి వంటి ముగ్ధభక్తులు ఉన్నారు. వీరశైవం ప్రబోధించి ఆచరించిన స్త్రీ పురుష సమానత్వాన్ని, కులరాహిత్యాన్ని పాల్కురికి తన రచనలో తీక్షణంగా చిత్రిక పట్టి ఆ దిశలో సంస్కరణ కోసం గట్టిగా కృషి చేశాడు.
పాల్కురికి సామాజిక దృక్పథంలో ద్యోతకమయ్యే సంఘ సంస్కరణాభిలాష బసవేశ్వరుడు చెప్పిందే. బసవేశ్వరుడు ప్రతిపాదించిన విధుల్లో ముఖ్యమైనవి- వర్ణాశ్రమ ధర్మాల మీద తిరుగుబాటు; జంగమాపూజకు ప్రాధాన్యం; స్త్రీలకి పురుషులతో సమానంగా మోక్షసాధన మార్గాన్ని ఎన్నుకొనే స్వేచ్ఛ; స్థావర మూర్తుల పూజపట్ల వైముఖ్యం... జంగమ పూజకు ప్రాధాన్యం; పుట్టుక కారణంగా సంక్రమించిన అస్పృశ్యతని ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించడం; సమానత్వాన్ని పాటించడం; పంచవిధ సూతకాలలో నాలుగింటిని కూడా తిరస్కరించడం (ఇవి పురుడు, ఉచ్చిష్టం, బహిష్టూ, చావు సందర్భాలలో పాటించే అశౌచాలు); ఉపనయన సంస్కారాన్ని తిరస్కరించడం; మరణించినవారికి చేసే శ్రాద్ధ కర్మల నిరసన; మద్యమాంసాల విసర్జన....
పాల్కురికి తన కావ్యంలో ఈ విధివిధానాలకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చాడు. ఉదాహరణకి సిరియాళుడి కథలో శివుడు హలాయుధునితో సంవాదం చేస్తూ సుతుని చంపి ఆ మాంసంతో విందు చేశానని అంటే హలాయుధుడు వెటకారంగా-
‘శివ! శివ! యిది యేమి చెప్పెదవయ్య
శివుడేమి నరుల భక్షింప రక్కసుడె?
శిశువు సద్భక్తుని సిరియాళునంబి
పశువరింపగ జంపభక్తి హీనుండె?!’ ఇది మాంసాహార విసర్జన అనే నిబంధనని గాఢంగా ప్రజల్లో నాటడానికి చెప్పిన విషయమని అర్థమవుతూనే ఉంది.
బసవేశ్వరుడి ప్రబోధాలకు అనుగుణంగా
‘ఎట్టి దుర్గతిని బుట్టిననేమి
యెట్లును శివభక్తుడిల పవిత్రుండు’ అన్నాడు.
మత ప్రచారానికి సంస్కృత భాష వాడాలనే ఆచారాన్ని సోమనాథుడు బద్దలు కొట్టాడు. నన్నయ భారతాంధ్రీకరణలో అధిక శాతం సంస్కృత పదాలు కనిపిస్తే అందుకు పూర్తి విరుద్ధంగా పాల్కురికి బసవపురాణంలో దేశీ ఛందస్సు, నానుడులు, జాతీయాలు, పలుకుబళ్లు ప్రాధాన్యం వహిస్తాయి. ద్విపద, రగడలే కాకుండా సోమనాథుడు ఇంకా సీసం, త్రిభంగి, తరువోజ, క్రౌంచ పదం, మయూరం, చతుర్విధ కందం, తిపాస కందం వంటి స్థానిక ఛందోరీతుల ప్రయోగం చేశాడు. ‘రగడ’ అనే ఛందోరీతిని సోమనాథుడే ప్రారంభించాడు. సీస పద్యాల్లో సోమన ప్రయోగం చేశాడు. శ్రీనాథుడికి సీస పద్య రచనలో మార్గదర్శనం చేసింది సోమన సీస పద్యాలే. అలాగే బద్దెన సుమతీ శతకం కంద పద్యాలకు మార్గం చూపింది సోమనాథుడి కంద పద్యాలే.
భాషలో, పద ప్రయోగాల్లో సోమనాథుడు స్వేచ్ఛగా ప్రయోగాలు చేశాడు. వైరి సమాసాలు విరివిగా వాడాడు. వస్తువు మారినప్పుడు శైలి విధానాలు కూడా మారుతాయని చెప్పడానికి బసవపురాణం మంచి ఉదాహరణ. అయితే సోమనాథుడి బసవపురాణానికి ముందు ఛందశ్శాస్త్రం ఏదీ లేదని, అతని రచన తర్వాత వచ్చిన ఛందశ్శాస్త్రాలతో దాన్ని బేరీజు వేయడం తగదని అంటారు. పాల్కురికి వాడిన మాటలు గమనించదగ్గవి. గ్రూపులు కట్టడాన్ని గుంపిడటం, తక్కువగా గౌరవించటాన్ని సోల, చాలాకొద్ది సమయాన్ని గోరంతపొద్దు అన్నాడు. ఇక అసాధ్యం అనడానికి ‘కుంచాలతో మంచు కొలవటం’ అనే చక్కని జాతీయాన్ని ప్రయోగిస్తాడు. పుష్పవిల్లు, భూమితీరు, వేడి పయోధార వంటి ప్రయోగాలు అలవోకగా చేసినట్టుగా కనిపిస్తాయి.
ప్రజలకు సూటిగా తన భావాలను ప్రసరింపజేయడానికి అనువైన శైలి, అభివ్యక్తి తీరుతెన్నులను సోమనాథుడు ఎంచుకున్నాడు. అదే సమయంలో సృజనాత్మకతకు పట్టం కట్టాడు. ఆ రకంగా పాల్కురికి సోమనాథుడు కావ్యగౌరవం కలిగిన బసవపురాణాన్ని ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా రచించి ప్రజాకవిగా నిలిచాడు. తెలంగాణలోని ఎక్కువ శూద్రకులాలు శైవ మతాన్ని ఆలింగనం చేసుకున్నారని చెప్పడానికి అనువైన పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. ఆ రకంగా సామాజిక విప్లవకారుడిగా సోమనాథుడు కనిపిస్తాడు. బసవపురాణం తెలుగు సమాజంలో సంఘసంస్కరణోద్యమ గ్రంథంగా నిలిచిపోతుంది.
- కాసుల ప్రతాపరెడ్డి
(ఇటీవల మెదక్ జిల్లా జోగిపేట డిగ్రీ కళాశాలలో పాల్కురికి సోమనాథుడిపై జరిగిన సదస్సులో సమర్పించిన పత్రంలో కొంత భాగం)
తొలి సాంఘిక తెలుగు కావ్యం బసవ పురాణం
Published Sat, Oct 18 2014 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 PM
Advertisement