కొత్త ఏడాదిలోకి ప్రవేశించాం. ఆర్థికంగా మరింత డబ్బు పోగు చేసుకోవాలని అందరూ అనుకుంటారు. కొత్త సంవత్సరంలో కొన్ని మార్గాలు పాటిస్తే సులువుగా ఆర్థిక లక్ష్యాలు(Financial Targets) చేరుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులు తాము చేస్తున్న కొలువు(Job)లో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల రూపంలో అదనంగా సంపాదన అందుకుంటారు. దాన్ని వైవిధ్యంగా ఇన్వెస్ట్ చేస్తే సంపాదనను పెంచుకోవచ్చని సూచిస్తున్నారు. పదోన్నతులు, ఇంక్రిమెంట్ల వల్ల సమకూరే డబ్బును దీర్ఘకాలికంగా పొదుపు చేస్తే మదుపు ఖాతాలో ఇంకొంత సొమ్ము పోగవుతుందని చెబుతున్నారు.
ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల సమయంలో కంపెనీలు అదనంగా అందించే సుమారు ఐదు శాతం(సంస్థను బట్టి ఇది మారుతుంది) డబ్బు భవిష్యత్తులో భారీ ప్రభావాన్ని చూపుతుంది. ఉదాహరణకు మీకు నెలకు లక్ష రూపాయల జీతం అనుకుందాం. ఏటా ఐదు శాతం ఇంక్రిమెంటును పరిగణిలోకి తీసుకుందాం. మీరు ఇప్పటికే చేసిన పెట్టుబడులు ఏటా పది శాతంమేర రాబడిని ఇస్తున్నట్లు భావిద్దాం. ఇప్పటి దాకా చేస్తున్న ఇన్వెస్ట్‌మెంట్‌ను 15 శాతం నుంచి అదనంగా ఐదు శాతం కలిపి 20 శాతానికి పెంచడం వల్ల జీవనశైలిలో పెద్దగా మార్పు ఉండదు. కానీ దీర్ఘకాలంలో మీరు చేస్తున్న పెట్టుబడి భారీగా పెరిగి ముప్పై ఏళ్ల తర్వాత కనీసం రూ.5.3 కోట్ల స్థానంలో అక్షరాలా రూ.7.1 కోట్లకు పెరుగుతుంది. అంటే కేవలం ఐదు శాతం అదనంగా ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు దాదాపు రూ.1.8 కోట్లు పెరుగుతుంది.
ఇదీ చదవండి: మీకూ అందుతాయి ఐటీ నోటీసులు.. ఎప్పుడంటే..
ముందు పొదుపు తర్వాతే ఖర్చు
ఖర్చు చేసిన తర్వాత మిగిలిన డబ్బును పొదుపు చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ ముందు పొదుపు తర్వాతే ఖర్చు అనే సూత్రాన్ని పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులు తప్పకుండా ఆరోగ్య బీమా(Health Insurance)తోపాటు జీవిత బీమాను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థతుల్లో ఉద్యోగం పోయినా ఇంటి ఖర్చులు భరించేలా కనీసం ఆరు నెలలకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఈ నిధిని వెంటనే నగదుగా మార్చుకునే ఫండ్స్‌ల్లో పెట్టుబడి పెట్టాలని, ఈక్వీటీల జోలికి వెళ్లకూడదని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment