Wealth Creation
-
‘ఐదు శాతం’తో రూ.1.8 కోట్లు సంపాదన
కొత్త ఏడాదిలోకి ప్రవేశించాం. ఆర్థికంగా మరింత డబ్బు పోగు చేసుకోవాలని అందరూ అనుకుంటారు. కొత్త సంవత్సరంలో కొన్ని మార్గాలు పాటిస్తే సులువుగా ఆర్థిక లక్ష్యాలు(Financial Targets) చేరుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులు తాము చేస్తున్న కొలువు(Job)లో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల రూపంలో అదనంగా సంపాదన అందుకుంటారు. దాన్ని వైవిధ్యంగా ఇన్వెస్ట్ చేస్తే సంపాదనను పెంచుకోవచ్చని సూచిస్తున్నారు. పదోన్నతులు, ఇంక్రిమెంట్ల వల్ల సమకూరే డబ్బును దీర్ఘకాలికంగా పొదుపు చేస్తే మదుపు ఖాతాలో ఇంకొంత సొమ్ము పోగవుతుందని చెబుతున్నారు.ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల సమయంలో కంపెనీలు అదనంగా అందించే సుమారు ఐదు శాతం(సంస్థను బట్టి ఇది మారుతుంది) డబ్బు భవిష్యత్తులో భారీ ప్రభావాన్ని చూపుతుంది. ఉదాహరణకు మీకు నెలకు లక్ష రూపాయల జీతం అనుకుందాం. ఏటా ఐదు శాతం ఇంక్రిమెంటును పరిగణిలోకి తీసుకుందాం. మీరు ఇప్పటికే చేసిన పెట్టుబడులు ఏటా పది శాతంమేర రాబడిని ఇస్తున్నట్లు భావిద్దాం. ఇప్పటి దాకా చేస్తున్న ఇన్వెస్ట్‌మెంట్‌ను 15 శాతం నుంచి అదనంగా ఐదు శాతం కలిపి 20 శాతానికి పెంచడం వల్ల జీవనశైలిలో పెద్దగా మార్పు ఉండదు. కానీ దీర్ఘకాలంలో మీరు చేస్తున్న పెట్టుబడి భారీగా పెరిగి ముప్పై ఏళ్ల తర్వాత కనీసం రూ.5.3 కోట్ల స్థానంలో అక్షరాలా రూ.7.1 కోట్లకు పెరుగుతుంది. అంటే కేవలం ఐదు శాతం అదనంగా ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు దాదాపు రూ.1.8 కోట్లు పెరుగుతుంది.ఇదీ చదవండి: మీకూ అందుతాయి ఐటీ నోటీసులు.. ఎప్పుడంటే..ముందు పొదుపు తర్వాతే ఖర్చుఖర్చు చేసిన తర్వాత మిగిలిన డబ్బును పొదుపు చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ ముందు పొదుపు తర్వాతే ఖర్చు అనే సూత్రాన్ని పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులు తప్పకుండా ఆరోగ్య బీమా(Health Insurance)తోపాటు జీవిత బీమాను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థతుల్లో ఉద్యోగం పోయినా ఇంటి ఖర్చులు భరించేలా కనీసం ఆరు నెలలకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఈ నిధిని వెంటనే నగదుగా మార్చుకునే ఫండ్స్‌ల్లో పెట్టుబడి పెట్టాలని, ఈక్వీటీల జోలికి వెళ్లకూడదని సూచిస్తున్నారు. -
ట్రంప్ గెలుపుతో మస్క్ పంట పండింది!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో టెస్లా అధినేత ఇలాన్ మస్క్‌కు సిరుల పంట పండుతోంది. ట్రంప్ విజయం తర్వాత టెస్లా స్టాక్ ఏకంగా 40 శాతం పెరిగింది. దాంతో మస్క్ సంపద ఏకంగా 70 బిలియన్ డాలర్లు(రూ.5.8 లక్షల కోట్లు) పెరిగి నికరంగా సుమారు 340 బిలియన్ అమెరికన్ డాలర్ల(రూ.28 లక్షల కోట్లు) మార్కును దాటినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది.యూఎస్ ఎన్నికల నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్‌నకు మస్క్ మద్దతిచ్చారు. దాంతోపాటు ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ పార్టీకి మస్క్ భారీగానే విరాళాలు అందించారని కొన్ని సంస్థలు వెల్లడించాయి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇలాన్ మస్క్‌కు సముచిత స్థానాన్ని కల్పిస్తానని చెప్పారు. ఇటీవల ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించాక అనుకున్న విధంగానే ట్రంప్ కార్యవర్గంలో మస్క్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) సంయుక్త సారథులుగా మస్క్, వివేక్ రామస్వామిలను నియమించారు.ఇదీ చదవండి: ‘ఆరోగ్య నిధి’ ప్రాధాన్యం తెలుసా?డొనాల్డ్ ట్రంప్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండబట్టే మస్క్ సంపద అధికమవుతున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ట్రంప్ భవిష్యత్తులో తీసుకోబోయే కార్పొరేట్ నిర్ణయాల వల్ల మాస్క్‌కు లాభం చేకూరుతుందని, దాంతో కంపెనీకి మేలు కలుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా మస్క్ కంపెనీల్లో భారీగా పెట్టుబడి పెడుతున్నారు. దాంతో ఆయన సంపద పెరుగుతోంది. -
‘సంపద సృష్టించడానికి అల్లావుద్దీన్ అద్భుతదీపమేం లేదు’
న్యూఢిల్లీ, సాక్షి: నారా చంద్రబాబు నాయుడు గతంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పాలన చేశారు. ఆయన హయాంలో ఏ ఒక్కసారి కూడా రెవెన్యూ మిగులు లేదు. ప్రతి ఏడాదీ రెవెన్యూ లోటుతోనే పాలన సాగడం విశేషం. అలాంటిది మరోసారి సంపద సృష్టించి పేదలకు పంచుతానని చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అయితే ఆయన మంత్రివర్గంలోని ఒకరు చంద్రబాబు సంపద సృష్టిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారిప్పుడు. సంపద సృష్టించడానికి మా వద్ద అల్లావుద్దీన్ అద్భుతదీపం లేదు.. ఏపీ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పిన మాట ఇది. ఢిల్లీకి వెళ్లిన ఆయన ఏపీ రాజకీయ పరిస్థితులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంపద సృష్టి అనేది దీర్ఘకాలిక ప్రణాళిక అని, అందుకు సమయం పడుతుందని చెప్పారు. పైగా ఖజానా ఖాళీగా ఉందని, జీతాలు, భత్యాల కోసం అప్పులు తప్పట్లేదంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు తోడు.. కేవలం సంపద సృష్టి కోసమే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, మౌలిక వసతులు నిర్మిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించడం కొసమెరుపు. చంద్రబాబు ఎన్నికల హామీలపై ప్రచార సమయంలోనే.. వైఎస్ జగన్ జనాలను అప్రమత్తం చేసే యత్నం చేశారు. అవి మోసపూరిత ప్రకటనలన్నారు. సంపద సృష్టి అనేది చంద్రబాబు మోసాల్లో ఓ భాగమని చెప్పారు. అలాగే కూటమి హామీలు అమలు చేయాలంటే ఏడాదికి రూ.1,50,718 కోట్లు కావాలని లెక్కలతో సహా వివరించారు. అయితే.. అధికారంలోకి వచ్చాక ‘వీటన్నింటికీ డబ్బులెక్కడినుంచి తెస్తారు’? అని ప్రశ్నిస్తే మాత్రం అరిగిపోయిన రికార్డులాగా.. సంపద సృష్టిస్తామంటున్నారు చంద్రబాబు. ఆర్థిక క్రమశిక్షణ లేని సీఎంగా పేరున్న చంద్రబాబు గత మూడు టర్మ్‌లు ఎంత సంపద సృష్టించారు? ఎంతమందికి పంచిపెట్టారు..? అనే విశ్లేషణలు తరచూ జరుగుతుంటాయి. ఇక ఇప్పుడు స్వయానా ఆయన కేబినెట్లోని మంత్రి తాజా ప్రకటనతో.. ఆ సంపద సృష్టి కూడా మోసం అనేది తేటతెల్లమయ్యింది. -
సరైన ఆచరణతోనే సంపద సృష్టి!
సంపద సృష్టికర్తల్లో ఎవరి జీవితాన్ని పరిశీలించి చూసినా.. సమయానికి ఎంతో ప్రాధాన్యత కనిపిస్తుంది. ప్రణాళిక, ఆచరణ, క్రమశిక్షణ కనిపిస్తాయి. సంపద సృష్టించాలంటే కాలం విలువ తెలిసి ఉండాలి. ఇవాళ కాకపోతే రేపు, ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది ఇలాంటి ధోరణి అస్సలు పనికిరాదు. దీనివల్ల కేలండర్లో సంవత్సరాలు మారుతుంటాయే కానీ, ఆశించిన ఫలితాలు కానరావు. కొత్త సంవత్సరం తనకు అనుకూలంగా ఉండాలని, అనుకున్నవి సాధించాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ, ఆచరణ లోపంతో దానికి దూరంగా ఉండిపోతుంటారు. అన్నీ ఒకేసారి సాధించేద్దామని అనుకుంటే, ఫలితాలు ఆలస్యం అవుతాయి. అందుకుని ప్రణాళిక మేరకు అడుగులు వేయాలి. నూతన సంవత్సరంలో ఏం సాధించాలనుకుంటారో, అవి వాస్తవికంగా ఉండాలి. అప్పుడే చక్కని ఫలితాలు కనిపిస్తాయి. ఏడాది కాలానికి కార్యాచరణ ప్రణాళిక అంటే, అందుకు తగినంత సమయం కేటాయించాలి. సంపద సృష్టించాలనే ఆకాంక్ష కలిగిన వారు కొత్త సంవత్సరంలో ఆ దిశగా అమల్లో పెట్టాల్సిన ఆచరణ ఎలా ఉండాలో నిపుణులు తెలియజేస్తున్నారు. మనీ ఒక్కటేనా..? అందరికీ ధనం కావాల్సిందే. అందులో సందేహం లేదు. కానీ, మనిషి ఎప్పుడూ డబ్బు చుట్టూ పరుగెత్తడం సరైనది అనిపించుకోదు. తండ్రి లేదా తల్లి కావచ్చు. కుమారుడు లేదా కుమార్తె కావచ్చు. జీవిత భాగస్వామి, స్నేహితులు, సహోద్యోగులు, శ్రేయోభిలాషులు.. ఇలా మన చుట్టూ పెద్ద ప్రపంచమే ఉంది. దాన్ని కూడా పట్టించుకోవాలి. సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపూ అవసరమే. మనీ లైఫ్‌తోపాటు ఇతరత్రా అన్నీ మేళవించినప్పుడే నిజమైన ఆనందం లభిస్తుంది. అస్తమానం డబ్బు గురించే ఆలోచిస్తూ, వేదన చెందుతుంటే అదొక వైరల్ వ్యాధిగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే జీవితంలో అన్నింటికీ సమతుల్యత అవసరం. దీర్ఘ ప్రయాణం సంపద సృష్టించడం అన్నది ఇన్స్టంట్ నూడుల్స్ చేసుకున్నంత ఈజీ కాదు. అదొక దీర్ఘకాలిక పరుగు. దశాబ్దాల పాటు స్థిరమైన పెట్టుబడులతో సాగిపోయేది. ప్రణాళిక మేరకు అడుగులు వేసేది. కొత్త సంవత్సరంలో సంపద సృష్టికి బీజం వేసుకోవాలే కానీ, సంపద సృష్టిని ఏడాదిలోనే సాధించేయాలంటే అది ఆచరణసాధ్యం కాదు. క్రమం తప్పకుండా ఆదాయం నుంచి పొదుపు చేస్తూ, ఆ పొదుపును ఏటా పెంచుకుంటూ, మెరుగైన రాబడినిచ్చే సాధనాల్లోకి పెట్టుబడిగా మళ్లిస్తూ సాగిపోవాల్సిన సుదీర్ఘ ప్రయాణం. కనుక షార్ట్ కట్స్, ఇన్స్టంట్స్ అంటూ ఇందులో దారులు వెతుక్కోవడం వల్ల ఫలితం ఉండదు. ఎంత వీలైతే అంత మొత్తంతో మొదట పెట్టుబడిని ఆరంభించాలి. దాన్ని కొనసాగించాలి. సంపద అంటే..? సంపద అంటే డబ్బు, బంగారం, పెట్టుబడులు, ప్రాపరీ్టలే కాదు. మంచి ఆరోగ్యం కూడా గొప్ప సంపదే అవుతుంది. సంపద కోసం ఆరోగ్యం పాడు చేసుకుంటే, ఆ తర్వాత అదే సంపదతో ఆరోగ్యం కొనుక్కుందామంటే సాధ్యపడకపోవచ్చు. ఆరోగ్యంగా ఉంటేనే సంపద సృష్టి కోసం సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించగలరు. తద్వారా మరింత సంపదను సమకూర్చుకోగలరు. అనారోగ్యకర అలవాట్లను విడిచి పెట్టాలి. ఆరోగ్యకరమైన, పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. యోగ, మెడిటేషన్, వ్యాయామాలు వంటి వాటికి రోజూ కొంత సమయం కేటాయించాలి. ఆదాయం.. వ్యయం.. ఆదాయం కంటే వ్యయానికి ఆర్థిక శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. చాలా మంది ఎలాంటి ప్రణాళిక లేకుండా ఖర్చు చేస్తుంటారు. మంచి డిస్కౌంట్ ఆఫర్లు కనిపించిన వెంటనే కొనుగోలు చేస్తుంటారు. క్రెడిట్ కార్డ్‌పై చాలా తక్కువకే వస్తుందని కొనుగోలు చేస్తుంటారు. ఇవన్నీ విక్రయాలు పెంచుకోవడానికి కంపెనీలు చేసే మార్కెటింగ్ వ్యూహాలు. వాటి ఆకర్షణలో పడకుండా చూసుకోవాలి. సంపద సృష్టించాలనే పట్టుదల ఉన్న వారు మొదట వ్యయాలపై అదుపు సాధించాలి. వస్తున్న ఆదాయంలో వ్యయాలను 60–80 శాతానికి మించకుండా అదుపు చేసుకోవాలి. ఎంత సంపాదించామన్నది కాకుండా, ఎంత పొదుపు చేశామనే తత్వంతో ముందుకు సాగాలి. అవసరాలకే కొనుగోళ్లు పరిమితం కావాలి. అంటే ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజు, కిరాణా, పాలు, కూరగాయలు, యుటిలిటీ బిల్లులు ఇవన్నీ అవసరాలు. రెస్టారెంట్లో తినడం, సినిమాలు, టూర్లు ఇవన్నీ కోరికలు. వెసులుబాటు ఉంటేనే కోరికలకు బడ్జెట్లో కేటాయింపులు చేయాలి. అవసరాలు, కోరికలకు కేటాయింపుల తర్వాత కూడా ఆదాయంలో 40 శాతాన్ని పెట్టుబడిగా మళ్లించారంటే సంపద సృష్టి అనుకున్నదానికంటే ముందే సాధ్యపడుతుంది. సరైన సాధనాలు సంపాదనలో పొదుపుతోనే ఆగిపోకూడదు. ఆ పొదుపు మదుపుగా మారినప్పుడే సంపద సాధ్యపడుతుంది. ఈ మార్గంలో ఎంపిక చేసుకునే పెట్టుబడి సాధనాలు కీలక పాత్ర పోషిస్తాయి. జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లను పెట్టుబడి సాధనాలుగా చూడకూడదు. ద్రవ్యోల్బణం తరుగు తీసిన తర్వాత ఈ సాధనాల్లో మిగిలేదీ ఏమీ ఉండదు. రాబడితోపాటు, అవసరమైనప్పుడు నగదుగా మార్చుకునే లిక్విడిటీ కూడా మెరుగ్గా ఉండాలి. ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ మేలైనవి. వీటితోపాటు వెసులుబాటును బట్టి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లలోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీలతోపాటు, రియల్ఎస్టేట్, బంగారం దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని తెచ్చి పెట్టినట్టు గణాంకాలు చెబుతున్నాయి. పెట్టుబడుల్లో స్థిరత్వం కోసం కొంత డెట్ సాధనాలకూ చోటు ఇవ్వొచ్చు. గ్యారంటీడ్ రాబడి అనే ఉత్పత్తుల ఆకర్షణలో పడొద్దు. పన్ను ఆదా కోరుకునే వారు సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల కోసం ఈఎల్ఎస్ఎస్, ఎన్పీఎస్ వంటి పథకాలను పరిశీలించొచ్చు. పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజులు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, రుణంపై ఇల్లు కొనుగోలు చేస్తే, అసలు, వడ్డీపైనా పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందొచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో వేలాది పథకాలున్నాయి. నిపుణుల సాయంతో నాలుగైదు పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ఫండ్స్‌లో ఎన్‌ఎఫ్‌వోల కంటే ట్రాక్ రికార్డు ఉన్న పథకాలను ఆశ్రయించడమే మెరుగైనది అవుతుంది. లిస్టింగ్ రోజున లాభాల కాంక్షతో ఐపీవోను ఎంపిక చేసుకోవద్దు. మంచి కంపెనీ, ఆకర్షణీయమైన వ్యాల్యూషన్లలో వస్తే దీర్ఘకాలానికి ఐపీవో మార్గంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అప్పుడు లిస్టింగ్‌లో లాభం వస్తే విక్రయించుకోవచ్చు. రాకపోతే పెట్టుబడిని కొనసాగించుకోవచ్చు. ఇతరులను అనుసరించడం ట్రేడింగ్‌తో రోజులో రూ.10వేలు, రూ.లక్ష సంపాదించుకోవచ్చనే ప్రకటనలు చూసి మోసపోవద్దు. తాము నేరి్పంచే స్ట్రాటజీతో ట్రేడింగ్‌లో రూ.లక్షలు సంపాదించొచ్చనే సోషల్ మీడియా ప్రకటనలకు ఆకర్షితులు కావొద్దు. స్వీయ అధ్యయనంతో పెట్టుబడి సాధనాలను అర్థం చేసుకోవాలి. లేదంటే ఫైనాన్షియల్ ప్లానర్లు లేదా అడ్వైజర్ల సాయం తీసుకోవాలి. సంపన్న ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోని అనుకరించడం సరికాదు.తోటి ఇన్వెస్టర్ల సలహా, సూచనలను గుడ్డిగా అనుసరించొద్దు. ప్రతి ఇన్వెస్టర్ రిస్క్, ఆకాంక్షలు వేర్వేరుగా ఉంటాయి. ఆర్థిక రక్షణ మెరుగైన కవరేజీతో కుటుంబం అంతటికీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మొదట చేయాల్సిన పని. దీనివల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, పొదుపు, పెట్టుబడులకు విఘాతం కలగకుండా, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీతో గట్టెక్కొచ్చు. నలుగురు సభ్యుల కుటుంబానికి కనీసం రూ.10 లక్షల కవరేజీ, అపరిమిత రీస్టోరేషన్ సదుపాయంతో తీసుకోవాలి. ఇక అనుకోనిది జరిగితే కుటుంబం ఆర్థిక కష్టాల పాలు కాకుండా ఉండేందుకు, మెరుగైన కవరేజీతో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కూడా తీసుకోవాలి. కనీసం 20 ఏళ్ల కుటుంబ అవసరాలను తీర్చే స్థాయిలో కవరేజీ ఉండాలి. ప్రమాదం కారణంగా ఏర్పడే నష్టాన్ని భర్తీ చేసే కవరేజీ కూడా ఉండాలి. ఇంటికి, ఇంట్లోని విలువైన వాటికి బీమా ప్లాన్ తీసుకోవాలి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా కనీసం ఆరు నెలల అవసరాలను తీర్చే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. రాబడి ఒక్కటే కాదు.. పెట్టుబడి కోసం ఎంపిక చేసుకునే సాధనం విషయంలో రాబడి ఒక్కటే ప్రామాణికం కాకూడదు. సంబంధిత ఉత్పత్తిలో ఉండే రిస్‌్కను కూడా మదింపు వేయాలి. తమ రిస్క్ సామర్థ్యానికి తగినట్టుగానే ఉందా? అని విశ్లేషించుకోవాలి. ఉదాహరణకు 2020 మార్చి కరోనా విపత్తు సమయంలో ఈక్విటీ మార్కెట్ 40 శాతానికి పైగా పతనమైంది. విడిగా కొన్ని స్టాక్స్ 80–90 శాతం వరకు పడిపోయాయి. అలాంటి సమయాల్లో పెట్టుబడుల విలువ గణనీయంగా పడిపోతుంది. ఆ నష్టాన్ని చూసి భయపడిపోకూడదు. ఈక్విటీలకు ఆటుపోట్లు సహజం. కాలవ్యవధి అనేది సాధనాలను ఎంపిక చేసుకోవడానికి కీలకం. ఆటుపోట్లు ఎదురైనా, ధైర్యంగా కొనసాగించే వారే వీటిని ఎంపిక చేసుకోవాలి. ఈక్విటీల్లో అస్థిరతలు ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో మెరుగైన రాబడి వస్తుంది. రిస్క్ వద్దనుకుంటే, రాబడిలో రాజీపడి డెట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. తప్పులకు దూరంగా.. పెట్టుబడుల్లో వీలైనంత వరకు తప్పులకు చోటు లేకుండా చూసుకోవాలి. అయినా కానీ తప్పులు జరగవన్న గ్యారంటీ ఏమీ ఉండదు. ఫండ్ మేనేజర్లు సైతం తమ ప్రయాణంలో తప్పులు చేస్తుంటారు. కాకపోతే చేసిన తప్పును వేగంగా గుర్తించి, దాన్ని సరిదిద్దుకోవడం తెలియాలి. ఫండ్స్‌లో మానవ తప్పిదాలకు చోటు లేకుండా ఉండాలంటే ఇండెక్స్ ఫండ్స్ ఉత్తమమైనవి. నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు ఎంతో ఆచితూచి వ్యవహరించాలి. మెరుగైన స్ట్రాటజీ, చక్కని అవగాహన, స్థూల ఆర్థిక అంశాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రభుత్వ, ఆర్బీఐ పాలసీలు, కరెన్సీ మారకం తదితర ఎన్నో అంశాలను వేగంగా అర్థం చేసుకునే నైపుణ్యాలు అవసరం. అంత సమయం లేకపోతే ఆ భారం ఫండ్ మేనేజర్లపై వేయాలి. లక్ష్యం.. ప్రణాళిక ప్రతి లక్ష్యానికీ విడిగా ప్రణాళిక అవసరం. సొంతిల్లు, కారు, రిటైర్మెంట్, పిల్లల విద్య, వివా హం ఇవన్నీ అందరికీ ఉండే ముఖ్యమైన భవిష్యత్ లక్ష్యాలు. తమ ఆదాయం నుంచి విడిగా ఒక్కో దానికి ఎంత చొప్పున కేటాయిస్తే, వాటిని చేరుకోవచ్చన్న దానికి స్పష్టత ఉండాలి. అవసరమైతే ఈ విషయంలో నిపుణుల సాయం తీసుకోవాలి. రుణాలు–చెల్లింపులు తప్పనిసరి అయితేనే రుణం తీసుకోవాలి. తీసుకుంటే దాన్ని తీర్చివేయడానికే మొదట ప్రాధాన్యం ఇవ్వాలి. రుణ చెల్లింపుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైఫల్యం లేకుండా చూసుకోవాలి. నామినేషన్ చివరిగా అన్ని ఆర్థిక సాధనాలకూ నామినేషన్ ఇవ్వడం తప్పనిసరి. బ్యాంక్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్, బీమా పథకాలు, డీమ్యాట్ ఖాతాలు, ఈపీఎఫ్ ఇలా ప్రతి సాధనానికీ నామినేషన్ లేకపోతే వెంటనే నమోదు చేయాలి. మార్గమిది... లక్ష్యాల్లో వాస్తవికత: జనవరి 1 నుంచే రోజూ 5 కిలోమీటర్ల నడక లేదా పరుగు ఆచరణలో పెట్టాలని కోరుకోవచ్చు. మొదటి రోజే 5 కిలోమీటర్లు సాధ్యం కానప్పుడు ఒక కిలోమీటర్‌తో ఆరంభిస్తే, క్రమంగా కొన్ని రోజుల్లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. సామర్థ్యాలకు తగినట్టుగా కార్యాచరణ అవసరం. ఎంత వీలైతే, అంత మొత్తంతో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించాలి. స్థిరత్వం: పెట్టుబడుల ప్ర పంచంలో ప్రేరణ కంటే స్థిర త్వానికే ప్రాముఖ్యం ఇస్తారు. ప్రేరణ అనేది కొన్ని రోజులు, నెలల పాటే ఉండొచ్చు. కానీ, స్థిరత్వం అన్నది విజయానికి కీలకం . ఇన్స్టంట్ సక్సెస్: స్వల్ప కాలంలో సంపద పోగేయాలన్నట్టుగా కొందరు ఇన్వెస్టర్ల ధోరణి ఉంటుంది. కానీ, జీవితం అందరికీ ఒకే విధంగా నడవదు. ఫలితాలకు తగినంత వ్యవధి ఇచి్చనప్పుడే సాధన సులభమవుతుంది. ఇక్కడ ఓపిక, క్రమశిక్షణ, అంకితభావం కీలకం అవుతాయి. కృషి: ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులు అవుతారు’అని ఓ సినీ కవి చెప్పినట్టు.. చేసుకున్న తీర్మానాలను విజయవంతంగా చేరుకోవడం కంటే కూడా, దాన్ని సాధించడానికి మీరు చేసిన ప్రయత్నాలు, కృషి ఇక్కడ కీలకం అవుతాయి. ప్రతి నెలా ఆదాయంలో 50 శాతాన్ని ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ, అది సాధ్యం కావ డం లేదని దాన్ని పక్కన పెట్టేయడం విజయానికి చేరువ చేయదు. కనీసం 20–30–40 శాతం మేర అయినా ఆదాతో మొదలుపెట్టి, ఆ తర్వాత దాన్ని మరింత పెంచుకోవచ్చు. ఆర్థిక అంశాలపై పట్టు: ఆర్థికంగా విజయం సాధించాలని కోరుకునే వారికి అందుకు సంబంధించి ప్రాథమిక అంశాలు తప్పకుండా తెలిసి ఉండాలి. ఆర్థిక అంశాలను అర్థం చేసుకోవడం, వాటిని అమలు చేయడం, వ్యక్తిగత ఆర్థిక అంశాల నిర్వహణ, బడ్జెట్, పొదుపు, పెట్టుబడులు, రుణాలు వీటన్నింటి గురించి తెలియాలి. ఆర్థిక, పెట్టుబడి సూత్రాలపై అవగాహన ఉండాలి. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, ఈల్డ్స్ తెలిసి ఉండాలి. -
ఐదేళ్లలో రూ.9.63 లక్షలకోట్ల సంపద సృష్టి
ఇన్వెస్టర్ల సంపద సృష్టికి గత ఐదేళ్ల కాలం(2018–23)లో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ చెయిర్‌ను అలంకరించింది. ఈ బాటలో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ రెండో ర్యాంకులో నిలవగా.. లాయిడ్స్ మెటల్స్, అదానీ గ్రూప్ సైతం ఇదే బాటలో నడవడం గమనార్హం! వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల సంపదగా పేర్కొనే మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్)లో పలు దిగ్గజాలు గత ఐదేళ్లలో జోరు చూపాయి. పారిశ్రామిక దిగ్గజం ముకేష్ అంబానీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అత్యధికంగా రూ. 9,63,800 కోట్ల మార్కెట్ క్యాప్‌ను జమ చేసుకుంది. నంబర్‌వన్ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్(టీసీఎస్) రూ. 6,77,400 కోట్ల విలువను జత చేసుకోవడం ద్వారా తదుపరి ర్యాంకును సాధించింది. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ నివేదిక ప్రకారం సంపద సృష్టిలో అదానీ ఎంటర్ప్రైజెస్ ఆల్‌రౌండ్ ప్రతిభను కనబరిచింది. స్టాక్ మార్కెట్లో వివిధ కంపెనీల పనితీరును పరిశీలించిన మోతీలాల్ ఓస్వాల్ ఆర్ఐఎల్ వరుసగా ఐదో ఏడాదిలోనూ టాప్‌లో నిలిచినట్లు పేర్కొంది. ఐసీఐసీఐ, ఎయిర్టెల్ 2018–23 కాలంలో ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ మార్కెట్ క్యాప్ రూ. 4,15,500 కోట్లమేర బలపడగా.. ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ విలువ రూ. 3,61,800 కోట్లు పుంజుకుంది. మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ రూ. 2,80,800 కోట్లను జత చేసుకుంది. అయితే లాయిడ్స్ మెటల్స్ అత్యంత వేగంగా 79 శాతం సంపదను పెంచుకున్న కంపెనీగా ఆవిర్భవించింది. ఈ బాటలో అదానీ ఎంటర్ప్రైజెస్ 78 శాతం వార్షిక వృద్ధితో ద్వితీయ ర్యాంకును సాధించింది. ఈ కాలంలో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్‌ను మించుతూ అత్యంత నిలకడగా పురోగమించిన కంపెనీగా క్యాప్రి గ్లోబల్ నిలిచింది. ఏడాదికి 50 శాతం చొప్పున లాభపడింది. రూ. 10 లక్షలు.. ఐదేళ్లలో రూ.కోటి గత ఐదేళ్లుగా అత్యున్నత ర్యాలీ చేసిన టాప్–10 కంపెనీలలో 2018లో రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఉంటే.. 2023కల్లా ఈ పెట్టుబడి రూ. కోటికి చేరి ఉండేదని నివేదిక పేర్కొంది. -
సంపద సృష్టికి సక్సెస్ మార్గం!
పొదుపు మొత్తాన్ని పెట్టుబడిగా మలిచి, మంచి రాబడి తెచ్చుకోవాలని అందరూ కోరుకుంటారు. కానీ, ఈ విషయంలో సక్సెస్ చూసే వారు కొద్ది మందే ఉంటారు. పెట్టుబడి అనేది వాస్తవిక దృక్పథం, విస్తృతమైన అధ్యయనం, సమాచార విశ్లేషణ ఆధారంగానే ఉండాలి. లేదంటే.. చిన్న తప్పులకే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎంతగా అధ్యయనం చేసినప్పటికీ, ఒక్క తప్పు దొర్లినా ఆశించిన ఫలితం రాకుండా పోతుంది. అందుకే మంచి రాబడి కోసం పెట్టుబడి ఉంటే చాలదు. అనుసరించే మార్గం తెలియాలి. ఇన్వెస్టర్‌గా ఎలాంటి తప్పులు చేయకూడదనే అవగాహన కలిగి ఉండాలి. నువమా వెల్త్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ ప్రెసిడెంట్ రాహుల్ జైన్ పెట్టుబడుల విషయంలో ఎలాంటి తప్పులకు దూరంగా ఉండాలనే విషయాల గురించి వెల్లడించారు. తగినంత వ్యవధి పెట్టుబడులకు తగినంత వ్యవధి ఇవ్వాలి. పెట్టుబడుల విజయానికి ఇది కీలకం అవుతుంది. నిర్ణీత కాలానికోసారి పెట్టుబడుల సమీక్షకు కొంత సమయం కేటాయించుకోవాలి. చాలా మంది ఇన్వెస్టర్లు కీలకమైన ఈ సమీక్షకు దూరంగా ఉంటుంటారు. ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను కలసి పెట్టుబడుల విషయంలో వారి నుంచి కీలక సూచనలు తీసుకోవాలి. దీనివల్ల మీరు అనుసరిస్తున్న పెట్టుబడులు మీ లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగానే ఉన్నాయా? అన్నది తెలుసుకునే వీలు చిక్కుతుంది. పెట్టుబడులను సమీక్షించడం వల్ల మెరుగుపరుచుకునే అవకాశాలు, మార్పులు చేర్పులకు అవకాశం లభిస్తుంది. మారుతున్న మార్కెట్, ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనే విధంగా పెట్టుబడుల నిర్వహణ సాధ్యపడుతుంది. అవకాశాలను అందిపుచ్చుకుని, రిస్క్‌ను అధిగమించొచ్చు. లోపాలను ఆరంభంలోనే తొలగించుకోవచ్చు. కనుక ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను కలిసి సమీక్షించుకోవాలి. పొదుపు చేయలేకపోవడం తగినంత పొదుపు చేయడం పెట్టుబడులకు కీలకం. లేదంటే లక్ష్యాలకు కావాల్సినంత పెట్టుబడులు సమకూర్చుకోలేరు. పొదుపులో 50–30–20 బడ్జెట్ సూత్రాన్ని అనుసరించాలి. నెలవారీ నికర ఆదాయం నుంచి 50 శాతమే ఖర్చు చేయాలి. అది కూడా గ్రోసరీ, యుటిలిటీ, పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె కోసం. ఇక 30 శాతాన్ని అత్యవసరం కాని రెస్టారెంట్ ఫుడ్, పర్యటనలు, గ్యాడ్జెట్ల కొనుగోలు, మూవీ తదితర వాటికి కేటాయించుకోవాలి. మరో 20 శాతాన్ని పొదుపు చేసి, దాన్ని పెట్టుబడిగా మార్చుకోవాలి. అస్సెట్ అలోకేషన్ గుడ్లు అన్నింటినీ ఒక్కటే బుట్టలో పెట్టేయకూడదన్న సూత్రం తెలిసే ఉంటుంది. అలాగే పెట్టుబడులు అన్నింటికీ తీసుకెళ్లి ఒకే సాధనంలో ఉంచేయకూడదు. ఎందుకంటే ఆయా విభాగం నిర్ణీత కాలం పాటు ప్రతికూల పనితీరు చూపించినట్టయితే పోర్ట్‌ఫోలియో విలువపై (పెట్టుబడులు) ప్రభావం పడుతుంది. నష్టాలు కనిపిస్తాయి. అందుకే పెట్టుబడులను వివిధ సాధనాల (అస్సెట్ క్లాసెస్) మధ్య వర్గీకరించుకోవాలి. దీనివల్ల ప్రత్యేకంగా ఒక్కో విభాగంలో ఉండే రిస్క్‌ను అధిగమించే అవకాశం ఉంటుంది. వైవిధ్యం చేసుకోవడం వల్ల వివిధ విభాగాల్లో ఏదైనా ఒకటి రెండు ప్రతికూల ఫలితాలు చూపించినా, అదే కాలంలో మిగిలిన విభాగాల్లో మెరుగైన పనితీరు నుంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. తగినంత వైవిధ్యం కోసం పెట్టుబడులను ఈక్విటీ, ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్), కమోడిటీ, రియల్ ఎస్టేట్ బంగారం మధ్య విస్తరించుకోవాలి. ఇలా చేయడం వల్ల వీటిల్లో ఏదైనా ఒకటి రెండు విభాగాలు ప్రతికూలతలు ఎదురు చూసినా, మిగిలినవి ఆదుకుంటాయి. సరైన పెట్టుబడి సాధనం ఆర్థిక మార్కెట్లు ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక, భౌగోళిక అంశాలు వివిధ పెట్టుబడి సాధనాల పనితీరును ప్రభావితం చేస్తుంటాయి. కనుక సరైన లేదా కచ్చితమైన పెట్టుబడి సాధనం కోసం అన్వే షించడం అనేది అవకాశాలను కోల్పోయేందుకు దారితీయవచ్చు. పరిమితికి మించి సమాచారాన్ని మెదడులోకి చేర్చుకోవడం వల్ల నిర్ణయాల్లో జాప్యానికి దారితీస్తుంది. దీంతో అనుకూలమైన పెట్టుబడి అవకాశాలను కోల్పోవాల్సి రావచ్చు. అందుకే ఇన్వెస్టర్లు తమ లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాలకు అనుకూలమైన పెట్టుబడి సాధనాన్ని ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేయాలి. టిప్స్ ఫాలో అవ్వడం నేడు సోషల్ మీడియాలో సలహాలిచ్చే వారు కోకొల్లలు కనిపిస్తుంటారు. ఫేస్బుక్, ట్విట్టర్, టెలీగ్రామ్, యూట్యూబ్‌లో భారీ సంఖ్యలోనే అకౌంట్లు ఉన్నాయి. వేగంగా లాభాలు సంపాదించాలనే ఆశే ఇన్వెస్టర్లను నష్టపోయేలా చేస్తుంటుంది. టిప్స్ సాయంతో త్వరగా పెట్టుబడిని రెట్టింపు చేసుకోవాలనే ధోరణి ఇక్కడ పనికిరాదు. పెట్టుబడి ప్రపంచం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయాలు, టెక్నాలజీలో పురోగతి తదితర ఎన్నో అంశాలు మార్కెట్లను ప్రభావితం చేస్తుంటాయి. వీటిని ఎవరూ కచ్చితంగా అంచనా వేయలేరు. కనుక పెట్టుబడుల విషయంలో స్వీయ అప్రమత్తత, అవగాహన అవసరం. అవసరమైతే నిపుణుల సాయం తీసుకోవాలే కానీ, ఉచిత టిప్స్‌ను అనుసరించడం సురక్షితం కాదు. కంపౌండింగ్ పెట్టుబడులకు కాలం కూడా కీలకమే. ఎంత ఎక్కువ వ్యవధి ఉంటే అంత అధికంగా అది కాంపౌండింగ్ (వృద్ధి) అవుతుంది. కాంపౌండింగ్ అంటే పెట్టుబడిపై వృద్ధి కాకుండా, రాబడి కూడా వృద్ధి చెందడం. దీన్ని రాబడిపై రాబడిగా చెబుతారు. ముందుగానే పెట్టుబడిని ఆరంభించడం వల్ల ఈ కాంపౌండింగ్ ప్రయోజనంతో దీర్ఘకాలంలో మంచి సంపదను సృష్టించుకోవచ్చు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో మ్యూచువల్ ఫండ్ పథకంలో పెట్టుబడులు మొదలు పెట్టినా, కనీసం 5–10 ఏళ్లపాటు వాటిని కొనసాగించినప్పుడే కాంపౌండింగ్ ప్రయోజనం కనిపిస్తుంది. మధ్యలో నిలిపివేస్తే పూర్తి స్థాయిలో ఆ ఫలితం కనిపించదు. కాంపౌండింగ్ ప్రయోజనాన్ని పూర్తి స్థాయిలో పొందేందుకు ఎంతో ఓపిక, క్రమశిక్షణ అవసరం. రిస్క్ అంతర్భాగం పెట్టుబడుల్లో రిస్క్ అంతర్భాగంగా ఉంటుంది. ప్రతీ పెట్టుబడితోనూ వచ్చే రిస్క్‌ను అర్థం చేసుకున్నప్పుడే దాన్ని అధిగమించడం సాధ్యపడుతుంది. మార్కెట్ అనుసంధానిత సాధనం అయిన స్టాక్, ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు వాస్తవ అంశాలను తెలుసుకోవాలి. కంపెనీల ఆర్థిక మూలాలు, క్రెడిట్ నాణ్యత ఇవన్నీ చూడాలి. మీ రిస్క్ సామర్థ్యం (అస్థిరతలను ఏ మేరకు భరించగలరు) గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. అధిక రిస్క్ తీసుకునేట్టు అయితే ఈక్విటీ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇతరులను అనుసరించడం మెజారిటీ ఇన్వెస్టర్లు సాధారణంగా ఇతరుల పెట్టుబడులను, నిర్ణయాలను అనుసరిస్తుంటారు. సరైన సమయంలో కొనుగోళ్లు, విక్రయాలు చేయడం కాకుండా, దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు. ఒకే సమయంలో ఎక్కువ మంది ఏదైనా సాధనాన్ని అనుసరించినప్పుడు అక్కడ ధరలు కృత్రిమంగా పెరిగిపోతాయి. దీన్నే స్పెక్యులేషన్ బబుల్‌గా చెబుతారు. దీంతో ఆయా సాధనాల విలువలు ఖరీదుగా మారతాయి. దీంతో తదుపరి మార్కెట్ కరెక్షన్లో అవి ఎక్కువ నష్టాన్ని చూసే అవకాశాలు ఉంటాయి. ప్రతి ఇన్వెస్టర్ తనకుంటూ ఓ విధానాన్ని రూపొందించుకోవాలి. మార్కెట్ ధోరణులను అధ్యయనం చేయడం అలవాటు చేసుకోవాలి. తమ రిస్క్ సామర్థ్యం పరిధిలోనే పెట్టుబడుల నిర్ణయాలు ఉండాలి. తప్పిదాల నుంచి నేర్చుకున్న పాఠాలను ఆచరణలో పెట్టాలి. నిపుణుల సాయం చాలా మంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను తామే నిర్వహించుకోగలమని భావిస్తుంటారు. ఈ విషయంలో నిపుణుల సాయం తీసుకుంటే మెరుగైన ఫలితాలకు అవకాశం ఉంటుందని మర్చిపోవద్దు. ఫైనాన్షియల్ అడ్వైజర్లు, ప్లానర్లు, వెల్త్ మేనేజర్లు అందరూ ఫైనాన్షియల్ మార్కెట్ల పట్ల లోతైన విషయ పరిజ్ఞానంతో ఉంటారు. ఆధునిక ధోరణులు, ఆర్థిక, మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుంటారు. దీనికి అనుగుణంగా పెట్టుబడుల విధానాల్లో మార్పులు చేస్తుంటారు. కనుక నిపుణుల సాయంతో రాబడిని మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మార్కెట్ పతనాల్లో నిపుణుల సాయం ఎంతో ఆదుకుంటుంది. మనో ధైర్యాన్ని, మెరుగైన మార్గాన్ని చూపుతుంది. వారి విలువైన సలహాలతో రిస్క్‌ను సులభంగా అధిగమించగలరు. లక్ష్యం లేకుండా పెట్టుబడికి లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేకపోతే అది చుక్కాని లేని నావ మాదిరే అవుతుంది. మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారనేది మీకు తెలిసి ఉండాలి. లక్ష్యం తెలిసినప్పుడే చేసే పెట్టుబడి ఆశించిన రాబడులు ఇస్తుంది. వివిధ లక్ష్యాలకు భిన్నమైన పెట్టుబడి వ్యూహాలు అవసరం పడొచ్చు. మీ పెట్టుబడుల విధానానికి మీ లక్ష్యం బ్లూప్రింట్ మాదిరిగా పనిచేస్తుంది. మీ లక్ష్యాలను స్వల్పకాలం, మధ్యకాలం, దీర్ఘకాలం అని మూడు భాగాలుగా వర్గీకరించుకోవాలి. నెలల నుంచి గరిష్టంగా రెండు సంవత్సరాల కాలానికి సంబంధించినవి స్వల్పకాల లక్ష్యాల కిందకు వస్తాయి. అత్యవసర నిధి, సెలవుల్లో పర్యటనలకు కావాల్సినది సమకూర్చుకోవడం ఇలాంటివి స్వల్పకాల లక్ష్యాలు అవుతాయి. 2–5 ఏళ్ల కాల అవసరాలు మధ్యకాలిక లక్ష్యాల కిందకు వస్తాయి. ఇల్లు లేదా కారు కొనుగోలుకు కావాల్సిన డౌన్ పేమెంట్ సమకూర్చుకోవడం వంటివి మధ్యకాల లక్ష్యాలు అవుతాయి. ఇక 10–20 ఏళ్లు అంతకుమించిన కాలానికి ఉద్దేశించినవి దీర్ఘకాల లక్ష్యాల కిందకు వస్తాయి. పిల్లల ఉన్నత విద్య, రిటైర్మెంట్ లక్ష్యాలు దీర్ఘకాలానికి సంబంధించినవి అవుతాయి. ఈ లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడి సాధనాలను ఎంపిక చేసుకోవాలి. స్వల్పకాలం, మధ్యకాలానికి సంబంధించి పెట్టుబడులను ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలు అయిన బ్యాంక్ ఎఫ్డీలు, కార్పొరేట్ బాండ్లు, ఎన్‌సీడీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీర్ఘకాల లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడులను మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల మధ్య వర్గీకరించుకోవచ్చు. మీ ఆదాయం, రుణ బాధ్యతలు, రిస్క్ సామర్థ్యం ఆధారంగా అనుకూలమైన సాధనాలను ఎంపిక చేసుకోవాలి. ఇందుకోసం ఫైనాన్షియల్ అడ్వైజర్ సాయం తీసుకోవాలి. -
వృద్ధాప్యంలో ఆదాయానికి ప్రణాళిక..
ప్రభుత్వరంగ ఉద్యోగులను మినహాయిస్తే మిగిలిన వారికి పదవీ విరమణ ప్రణాళిక తప్పనిసరి. ఉద్యోగం లేదా వృత్తి జీవితం ప్రారంభించినప్పుడే, దాన్ని విరమించే రోజు కోసం ప్రణాళిక రూపొందించుకోవాలి. విశ్రాంత జీవనాన్ని హాయిగా గడిపేందుకు తగినంత నిధిని సమకూర్చుకోవడమే కాదు, ఆ నిధిపై రాబడికీ అనుకూలమైన వ్యూహం ఉండాలి. మనలో చాలా మంది రిటైర్మెంట్ లక్ష్యానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. కానీ, ఆలస్యంగా దీని అవసరం తెలిసి వస్తుంది. అప్పుడు మేల్కొన్నా, సంపాదనకు ఎక్కువ కాలం మిగిలి ఉండకపోవచ్చు. కనుక ఆరంభంలోనే దృష్టి పెట్టాల్సిన దీన్ని.. అవగాహన లేమి, నిర్లక్ష్యంతో వాయిదా వేసుకోవద్దు. తగిన ప్రణాళికతోనే రిటైర్మెంట్ లక్ష్యాన్ని అధిగమించగలమని ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు. ఈక్విటీ పెట్టుబడులూ అవసరమే రిటైర్మెంట్ తర్వాత కూడా ఈక్విటీల్లో పెట్టుబడులు కలిగి ఉండాలి. ఎందుకంటే నేటి కంటే, రేపటి రోజు మరింత మొత్తం జీవనానికి ఖర్చు అవుతుంది. కనుక మన నిధి మరింత ఆదాయన్నిచ్చే విధంగా వృద్ధి చెందుతూ ఉండాలి. మీ వద్దనున్న నిధి నుంచి ఏటా 5% చొప్పున వెనక్కి తీసుకుంటున్నారనుకోండి. వచ్చే ఏడాది కూడా అదే 5% సరిపోవచ్చు. కానీ ఐదు, పదేళ్ల తర్వాత అంతే మొత్తం సరిపోకపోవచ్చు. ఎందుకంటే పదేళ్ల కాలంలో పెట్టుబడి దాని విలువను కోల్పోతుంది. కనుక ఇక్కడ నుంచి మరో ఐదు పదేళ్ల తర్వాత అవసరాలకు మరింత మొత్తం కావాలి. మీరు మీ ఫండ్ మొత్తాన్ని స్థిరాదాయ సాధనంలో ఇన్వెస్ట్ చేశారనుకోండి.. అది పెరిగే అవసరాలకు, కరిగిపోయే కరెన్సీ విలువకు తగినంత మద్దతుగా నిలవదు. ఎక్కువ మంది రిటైర్మెంట్ తర్వాత రిస్క్ వద్దని అనుకుంటుంటారు. కానీ, భవిష్యత్తులో వచ్చే భారీ ఖర్చులను భరించేంత ఆదాయానికి తగ్గ ప్రణాళిక ఉండాలి. కనుక మెరుగైన రాబడుల కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం మినహా మరో మార్గం లేదు. రిటైర్మెంట్ తర్వాత ఈక్విటీ రిస్క్ తీసుకోవడం ఎందుకని కొందరు అనుకోవచ్చు. అస్థిరతలు/ఆటుపోట్లు అన్నవి రిస్క్ కాదు. ఈక్వి టీల్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అది రిస్క్ అనుకుంటే.. మరి ఎలక్ట్రిసిటీ గురించి ఏమ ని అనుకోవాలి. ప్రమాదకరమైన విద్యుత్‌ను వాడుకుంటూ మనం జీవించడం లేదా..? అలాగే, ఈక్విటీలను మనకు అనుకూలంగా వినియోగించుకోవాలి. ఈక్విటీ పోర్ట్‌ఫోలియో ఏర్పాటులో జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలు. ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా, నిర్ణీతకాలం లోపు ఆ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాలి. పెట్టుబడులను వైవి ధ్యం చేసుకోవాలి. నిర్ణీత కాలానికి ఒకసారి చొప్పున రీబ్యాలన్స్ (మార్పులు చేర్పులు) చేసుకుంటూ వెళ్లాలి. ఎంత నిధి కావాలి? రిటైర్మెంట్కు కావాల్సినంత నిధి నా దగ్గర ఉందా..? ఎవరికివారు ఈ ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే అందరికీ ఒక్కటే నిధి ఇక్కడ పనిచేయకపోవచ్చు. మీ అవసరాలు, వ్యయాలపైనే ఇది ఆధారపడి ఉంటుంది. రిటైర్మెంట్ ఫండ్ కోసం మెరుగైన పెట్టుబడుల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఇందుకు వాస్తవిక అంచనాలు వేసుకోవాలి. మీ నెలవారీ వ్యయాలు ఎంత? 12 నెలలకు ఎంత మొత్తం కావాలో లెక్కించాలి. అంత మేర ఏటా ఆదాయం తెచ్చి పెట్టేంత నిధి మీకు రిటైర్మెంట్ తర్వాత అవసరం అవుతుంది. ఇతరత్రా వేరే ఆదాయ వనరులు ఉంటే వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. రిటైర్మెంట్ కోసం సన్నద్ధం అయ్యేందుకు ఏఏ అంశాలపై దృష్టి పెట్టాలో తెలుసుకోవడం కీలకం అవుతుంది. తాము ఎంత కాలం పాటు జీవిస్తామనే విషయం ఎవరికీ తెలియదు. కనుక చిరాయువుగా జీవించేందుకు సన్నద్ధం కావాలి. ముఖ్యంగా రాబడులకు మించి జీవించకూడదు. అందుకే ప్రణాళిక అవసరం. మీ అవసరాలకు మించి పెట్టుబడి నిధి కరిగిపోకుండా ఇది మార్గం చూపుతుంది. ప్రస్తుత విలువల ప్రకారం వార్షిక ఖర్చులకు 20 నుంచి 25 రెట్ల సరిపడా నిధిని సమకూర్చుకుంటే అది మీ అవసరాలను తీరుస్తుంది. ఇది అంత సౌకర్యవంతమైన నిధి కాకపోయినా, మీ అవసరాలను తీరుస్తుంది. మీ అవసరాలకు సరిపడా ఆదాయాన్ని ఇవ్వడంతోపాటు, భవిష్యత్తులో పెరిగే ఖర్చులకు తగ్గట్టు ఆదాయాన్ని వృద్ధి చేసే ప్రణాళిక వేరు. మీ ఆదాయం, వెసులుబాటు ఆధారంగా చాలా శ్రద్ధగా ప్రణాళిక వేసుకోవాలి. మధ్యలో అత్యవసరం ఏర్పడినా గట్టెక్కే నిధి వేరుగా ఉండాలి. అస్సెట్ అలోకేషన్ అస్సెట్ అలోకేషన్ అనేది మీ సౌకర్యం కోసం అనుసరించే విధానం. మార్కెట్లు పడిపోయినప్పుడు దీనివల్ల సౌకర్యంగా ఉండొచ్చు. స్వభావ రీత్యా ఈక్విటీల పట్ల రక్షణాత్మకంగా లేదా దూకుడుగా ఉన్నా కానీ.. ఆరంభంలో రక్షణాత్మకంగానే కేటాయింపులు చేసుకోవాలి. ఎంత ధైర్యవంతులైనా సరే మార్కెట్లు పడిపోయినప్పుడు ఆందోళన చెందడం సహజం. కనుక మొదటిసారి ఇన్వెస్టర్ అయినా, రక్షణ ధోరణితో కూడిన ఇన్వెస్టర్ అయినా ఈక్విటీలకు కేటాయింపులు 25 శాతం లేదా 33 శాతంగానే ఉండాలి. దీన్ని పేపర్‌పై రాసుకోవాలి. మొదటి కొన్నేళ్లపాటు ఇదే విధానాన్ని అనుసరించాలి. ఏడాదికోసారి ఈ కేటాయింపులను సమీక్షించుకోవాలి. దీన్నే అస్సెట్ అలోకేషన్ అంటారు. ఉదాహరణకు ఈక్విటీలకు 33 శాతం కేటాయింపులు చేయాలన్నది మీ ప్రణాళిక. ఏడాది కాలంలో మార్కెట్ ర్యాలీతో మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా 50 శాతానికి చేరిందని అనుకుందాం. అప్పుడు 33 శాతానికి దిగొచ్చే విధంగా ఈక్విటీ పెట్టుబడులను విక్రయించాలి. మిగిలిన మొత్తాన్ని డెట్‌కు మళ్లించుకోవాలి. ఇలా కొంత కాలం చేసిన తర్వాత ఈక్విటీల పట్ల అవగాహన, నమ్మకం పెరుగుతుంది. అప్పుడు అవసరానికి అనుగుణంగా అస్సెట్ అలోకేషన్‌ను సవరించుకోవచ్చు. రిటైర్మెంట్ ఫండ్‌పై 3.5–4 శాతం రాబడి వచ్చినా సరిపోతుందని అనుకుంటే అప్పుడు మీ దగ్గర మెరుగైన ఫండ్ ఉన్నట్టుగా భావించాలి. ఇలాంటి వెసులుబాటు ఉన్న వారు రిటైర్మెంట్ ఫండ్‌ను ఈక్విటీ, డెట్‌కు సమానంగా కేటాయించుకోవచ్చు. లేదా ఈక్విటీకి 40 శాతం, డెట్‌కు 60 శాతం కేటాయించుకోవచ్చు. 5–20 శాతాన్ని షార్ట్ టర్మ్ డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. పీపీఎఫ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్నకు కేటాయింపులు చేసుకోవాలి. ఇక తమపై ఆధారపడిన వారు లేకపోతే.. అప్పుడు 25 లేదా 33 శాతాన్ని డెట్‌కు కేటాయించి, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీన్ని ర్యీబ్యాలన్స్ చేసుకుంటూ ఉండాలి. కార్యాచరణ ప్రణాళిక.. రిటైర్మెంట్ నాటికి రుణ భారం నుంచి పూర్తిగా బయటకు రావాలి. అన్ని పెట్టుబడులకూ ఒక్కటే బ్యాంక్ ఖాతా వినియోగించాలి. పెట్టుబడుల కేటాయింపులు (అస్సెట్ అలోకేషన్) ఏ విభాగానికి ఎంత మేర ఉండాలో నిర్ణయించుకోవాలి. ఈక్విటీలకు 50 శాతమా లేక 40 లేదా 25 శాతమా.. అలాగే డెట్‌కు ఎంతన్నది తేల్చుకోవాలి. వీటి నుంచి అవసరాలకు సరిపడా ప్రతి నెలా రాబడి వచ్చేలా చూసుకోవాలి. ఇతర వనరుల ద్వారా ఆదాయం వస్తుందేమో చూసుకోవాలి. పింఛను సదుపాయం ఉందా? ఉంటే వచ్చే మొత్తం సరిపోతుందా? అద్దె రూపంలో ఆదాయం వచ్చే మార్గం ఉందా? డివిడెండ్ల రూపంలో ఆదాయం వస్తుందా? విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి రెమిటెన్స్ వస్తుందా? ఇలా అన్ని రూపాల్లోని ఆదాయ వనరులను లెక్కించుకోవాలి. అప్పుడు మీ నెలవారీ ఖర్చులకు సరిపడా ఆదాయం వస్తే నిశ్చింతగా ఉండొచ్చు. తరుగు ఉంటే ఆ మేరకు పెట్టుబడుల నుంచి ఆదాయం వచ్చే ఏర్పాటు చేసుకోవాలి. మీ ఖర్చులకు మించి ఆదాయం వస్తుంటే సంతోషంగా విశ్రాంతి జీవనాన్ని గడిపేయొచ్చు. మిగులు ఉంటే ఆ మొత్తాన్ని తిరిగి ఇన్వెస్ట్ చేసుకోవడమే సరైనది. మీ పెట్టుబడి నుంచి తీసుకునే మొత్తం రాబడి కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే, మీ పెట్టుబడి నుంచి తీసుకునే మొత్తం రాబడికి సమాన స్థాయిలోనూ ఉండకూడదు. ఎందుకంటే ఏటా ద్రవ్యోల్బణ ప్రభావంతో 5–6 శాతం మేర పెట్టుబడి విలువ క్షీణిస్తుంది. కనుక పెట్టుబడి నుంచి తీసుకునే మొత్తం రాబడి కంటే తక్కువే ఉండాలి. అప్పుడే మీ పెట్టుబడి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వృద్ధి చెందుతుంది. ఒకవేళ మీ పెట్టుబడిపై వచ్చే ఆదాయానికి సమాన స్థాయిలో ప్రతి నెలా ఉపసంహరించుకుంటున్నారని అనుకుందాం. అలాంటి సందర్భాల్లో భవిష్యత్తులో పెరిగే ఖర్చులకు సరిపడా ఆదాయం పెంచుకునేందుకు కొంత మొత్తాన్ని ప్రతి నెలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలి. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పీపీఎఫ్‌లో పెట్టుబడులు కొనసాగించండి. ఎందుకంటే ఇవి సురక్షితమైన, మెరుగైన రాబడులు కలిగిన డెట్ సాధనాలు. ఏటా ఏప్రిల్‌లో సమీక్ష నిర్వహించుకోవాలి. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీలపై రాబడులు ఏ మేరకు ఉన్నాయి? డెట్‌లో ఏ మేరకు రాబడి వచ్చింది? అన్ని పరిశీలించుకోవాలి. ఉదాహరణకు 2013లో రూ.50 లక్షలను ఈక్విటీ, డెట్‌లో సమానంగా ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. ఏటా మీ అవసరాలకు 6 శాతం ఉపసంహరించుకోవాలన్నది ప్రణాళిక. అప్పుడు ఒక ఏడాదికి రూ.3 లక్షలు అవసరం అవుతుంది. అదే 2014లో రూ.3,18,000 అవసరం అవుతుంది. ఇలా ఏటా ఉపసంహరించుకోవాల్సిన మొత్తం పెరుగుతూ వెళుతుంది. ఈ ప్రకారం 2023లో రూ.4,32,000 అవసరం అవుతుంది. 6 శాతం ఉపసంహరించుకోవాలన్నది ప్రణాళిక. కనుక ఇప్పుడు మీ వద్ద రూ.72,00,000 పెట్టుబడి ఉండాలి. అప్పుడే 6 శాతం చొప్పున రూ.4,32,000 తీసుకోగలరు. అందుకే మీ పెట్టుబడి నిధి కూడా వృద్ధి చెందాలి. -
డబ్బు లెక్క... ఓ కొలిక్కి వస్తోంది
ఇటీవల ఒక సర్వేలో వెల్లడైన నిజాలు ఆశ్చర్యం కలిగించాయి. ఈ డిజిటల్ యుగంలో కూడా మహిళ బ్యాంకు పోపుల డబ్బానే! ఆర్థిక వ్యవహారాలకు మహిళలు దూరంగానే ఉంటున్నారు. ఉద్యోగం చేసే మహిళల ఏటీఎమ్ కార్డుల నిర్వహణ భర్తదే! అందుకే... ఫైనాన్షియల్ లిటరసీ అవసరం అంటారు శుభ్రా మహేశ్వరి. ‘‘చాలామంది మహిళలకు ఆర్థిక వ్యవహారాల పట్ల ఏ మాత్రం అవగాహన ఉండడం లేదు. ఇది గ్రామీణ మహిళలు, నిరక్షరాస్యులైన మహిళల విషయం కాదు. బాగా చదువుకున్న వాళ్లు కూడా కనీస అవగాహన లేకుండా జీవితాన్ని గడిపేస్తున్నారు. నగరంలో ఇంటిని నిర్వహించే గృహిణి నెల ఖర్చులకు ముప్పై – నలభై వేల వరకు ఆమె చేతుల మీదుగా ఖర్చు చేస్తుంటుంది. కానీ ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఇన్వెస్ట్ చేయమంటే చేయలేదు. మన దగ్గర ఉన్న డబ్బును బ్యాంకులో దాస్తే డబ్బే డబ్బును రెట్టింపు చేస్తుందనే చిన్న లాజిక్‌ని మిస్ అవుతున్నారు. ఇది వెల్త్ క్రియేషన్‌లో వెనుకబాటుతనమేనంటారు శుభ్ర. అక్షరాలు వచ్చు! లెక్క తేలదు!! ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే... పెద్ద చదువులు చదువుకున్న మహిళలు కూడా బంగారాన్ని ఆభరణం రూపంలో కొని బీరువాలోనో, బ్యాంకు లాకర్లోనో దాచుకుంటున్నారే తప్ప గోల్డ్‌బాండ్ కొనుగోలు చేయాలనే ఆలోచన చేయడం లేదు. బాండ్ రూపంలో ఉన్న బంగారం విలువను అర్థం చేసుకోవడంలో నిరక్షరాస్యతలో ఉన్నారనే చెప్పాలి. బ్యాంకులు గ్రామాల్లోకి కూడా విస్తరించాయి. కానీ చిన్న మొత్తమైనా సరే బ్యాంకులో దాచుకుని బ్యాంకు ద్వారా కానీ యాప్ ద్వారా కానీ లావాదేవీ నిర్వహించడం నేర్చుకోవడంలో బాగా వెనుకబడి ఉన్నారు. కాలేజీల్లో కూడా విద్యార్థులకు డబ్బు సంపాదించడం గురించి మాత్రమే నేర్పిస్తారు. డబ్బును ఎలా నిర్వహించాలో నేర్పించడం మీద దృష్టి వెళ్లడం లేదు. ‘‘పరిశ్రమలు స్థాపించిన మహిళలు, చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టిన మహిళలు శ్రమించడంలో ఏ మాత్రం అలసత్వం ఉండదు. నూటికి నూరు శాతం ఎఫర్ట్ పెడుతున్నారు. కానీ మనీ మేనేజ్మెంట్ తెలియకపోవడం వల్లనే లాభాల బాట పట్టాల్సిన పరిశ్రమలు పట్టాలు తప్పుతున్నాయి. ఒక చార్టెడ్ అకౌంటెంట్‌గా నేను గమనించింది ఒక్కటే. పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభించిన మహిళలు అంకితభావంతో పని చేస్తున్నప్పటికీ వారికి సరైన మార్గదర్శనం చేసే వారు లేకపోవడంతో ఆ మహిళల శ్రమ వృథా అవుతోంది. వర్క్‌లో డెడికేషన్ ఎంత ముఖ్యమో, రైట్ డైరెక్షన్లో చేయడం కూడా అంతే ముఖ్యం. అందుకే నా వంతు సామాజిక బాధ్యతగా మహిళల్లో ఆర్థిక చైతన్యం తీసుకురావడానికి ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నాను. ఇటీవల మనదేశంలో మహిళా పారిశ్రామికవేత్తలు గణనీయంగా పెరిగారు. ఈ దశలో ఈ చైతన్యం చాలా అవసరం. ఇందుకోసం గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వర్క్ షాపులు చేపడుతున్నాం. భారీ సమావేశాలకు బదులు చిన్న చిన్న క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఇంత పెద్ద విషయాన్ని సరళంగా వివరించడానికి స్థానిక బ్యాంకులతో కలిసి పని చేస్తున్నాం. సమావేశంలోనే బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయించడం కూడా జరుగుతుంది’’ అన్నారు శుభ్రా మహేశ్వరి. కలను దర్శించాలి! ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్‌గా ఆమె మహిళను మానసికంగా శక్తిమంతం చేయడానికి ‘స్ట్రాంగర్ షీ’ అనే కార్యక్రమం రూపొందించారు. అందులో భాగంగా ఈ ఏడాది చేపట్టిన అంశం ‘ఫైనాన్షియల్ లిటరసీ’. దేశంలోని గ్రామీణ, పేద మహిళ నుంచి మధ్య తరగతి మహిళలు, వైట్ కాలర్ జాబ్‌లో ఉన్న మహిళలను కూడా కలుసుకుంటారు. డబ్బు సంపాదించడం మాత్రమే తెలిస్తే సరిపోదు, డబ్బును ఎలా ఇన్వెస్ట్ చేయాలో కూడా నేర్పించడం, డబ్బుతో డబ్బును ఎలా పెంపొందించుకోవాలో తెలియచేయడం ఇందులో ప్రధాన ఉద్దేశం. ‘‘భూమ్మీద నీకంటూ ఒక స్థానం ఉంది. ఆకాశంలోనూ నీ కంటూ కొంత భాగం ఉంది. ఈ రెండింటినీ కలుపుతూ ఎదగడానికి నీకంటూ ఒక కల ఉండాలి. నీ జ్ఞానంతో ఆ కలను దర్శించగలగాలి. ఆ కలను నిజం చేసుకోవడానికి నీ శ్రమను అనుసంధానం చేసుకోవాలి. నీ కలను నిజం చేసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా నీదే. కుటుంబ సభ్యులు, స్నేహితులు సహాయంగా ఉండే వారే, ఫలితం పూర్తిగా నీదే. అది విజయం అయినా అపజయం అయినా పూర్తి బాధ్యత నీదేననే విషయాన్ని మర్చిపోకూడదు’’ మహిళలకు నా సందేశం ఇదేనన్నారు శుభ్రా మహేశ్వరి. రోజూ తెల్లకాగితమే! శుభ్రా మహేశ్వరి పుట్టింది, పెరిగింది ఢిల్లీలోనే. తండ్రి పారిశ్రామికవేత్త. ఆమె మాత్రం చార్టెడ్ అకౌంటింగ్ వైపు ఆసక్తి చూపించింది. పెళ్లి తర్వాత ఇరవై ఏళ్ల కిందట భర్తతో హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. బ్లూ స్టోన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీల డైరెక్టర్‌గా విధులు నిర్వహణతోపాటు చార్టెడ్ అకౌంటెంట్‌గా తిరుమల తిరుపతి దేవస్థానమ్, ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, నేషనల్ హైవేస్తోపాటు దాదాపుగా మూడు వందల కార్పొరేట్ కంపెనీలకు ఆడిటర్‌గా సేవలందించిన, అందిస్తున్న అనుభవం ఆమెది. ‘‘మన జీవితంలో ప్రతి రోజూ ఒక కొత్త రోజే. డైరీలో కొత్త పేజీనే. ఏమీ రాయని తెల్లకాగితమే. జీవితంలో విజయం సాధించాలంటే ప్రతి కాగితాన్నీ మంచి విషయంతో నింపాలి. అదే అందమైన కథ అవుతుంది. అంటే ఏ ఒక్క రోజునూ నిరుపయోగంగా గడపవద్దు. ప్రయోజనకరంగా గడపాలి’’ అంటారు శుభ్రా మహేశ్వరి. – వాకా మంజులారెడ్డి -
‘సంపద’కు కేరాఫ్.. రిలయన్స్
న్యూఢిల్లీ: గడిచిన ఐదు సంవత్సరాల్లో... అంటే 2014–19 మధ్య వాటాదారులకు అత్యంత సంపదను సమకూర్చిన కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) నిలిచింది. ఈ కాలంలో ఈ కంపెనీ రూ.5.6 లక్షల కోట్ల మేర విలువను పెంచుకున్నట్టు ‘మోతీలాల్ ఓస్వాల్ వార్షిక సంపద సృష్టి అధ్యయనం 2019’ తేల్చింది. అధికంగా సంపద తెచ్చిపెట్టిన కంపెనీల్లో.. మొదటి 100 కంపెనీలు కలసి 2014–19 కాలంలో సమకూర్చిన సంపద రూ.49 లక్షల కోట్లుగా ఉంది. ‘‘ఏడేళ్ల విరామం తర్వాత మరోసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ 2014–19 కాలంలో రూ.5.6 లక్షల కోట్ల విలువను సమకూర్చి అత్యధిక సంపద సృష్టికర్తగా అవతరించింది. చరిత్రలో ఇప్పటి దాకా ఇదే అత్యధిక రికార్డు’’ అని బుధవారం విడుదలైన ఈ నివేదిక పేర్కొంది. గత ఐదేళ్ల కాలంలో అత్యధికంగా, అత్యంత వేగంగా, నిలకడగా సంపద సమకూర్చిన టాప్ 3 కంపెనీలుగా ఆర్ఐఎల్, ఇండియా బుల్స్ వెంచర్స్, ఇండస్ఇండ్ బ్యాంకు నిలవగా... వేగంగా సంపద తెచ్చిపెట్టిన వాటిల్లో ఇండియాబుల్స్ వెంచర్స్ వరుసగా రెండోసారి మొదటి స్థానం సంపాదించడం గమనార్హం. ఈ షేరు గత ఐదేళ్లలో వార్షికంగా 78 శాతం కాంపౌండెడ్ రాబడులను తెచ్చిపెట్టింది. టాప్–10 సంపద సృష్టికర్తల్లో బజాజ్ ఫైనాన్స్ స్థానం ప్రత్యేకమని ఈ నివేదిక తెలిపింది. ఇండస్ ఇండ్ బ్యాంకు 2009–19 కాలంలో కాంపౌండెడ్‌గా 49 శాతం చొప్పున స్థిరంగా సంపదను సృష్టించింది. ఇక 2014–19 కాలంలో సెన్సెక్స్ కాంపౌండెడ్ వార్షిక రాబడి 12 శాతంగా ఉంది. అన్ని రకాల మార్కెట్ పరిస్థితుల్లోనూ ఈ కంపెనీలు సంపదను తెచ్చిపెట్టినట్టు నివేదిక తెలియజేసింది. ఫైనాన్షియల్ రంగం ముందంజ... ఫైనాన్షియల్ రంగం 2014–19 మధ్య కాలంలో అత్యంత సంపదను తెచ్చిపెట్టిన రంగంగా వరుసగా మూడో ఏడాది అగ్ర పథాన నిలిచింది. ప్రైవేటు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలే ఈ రంగాన్ని నడిపించాయి. కాకపోతే, ఇదే విభాగంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం వాటాదారుల సంపదకు నష్టం చేకూర్చాయి. టాప్ 100 సంపద సృష్టికర్తల్లో ప్రభుత్వరంగ సంస్థలు కేవలం తొమ్మిదే చోటు సంపాదించాయి. అవి ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఇంద్రప్రస్థ గ్యాస్, ఎల్ఐసీ హౌసింగ్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎన్బీసీసీ. 2014–19 మధ్య కాలంలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువలో మార్పుల ఆధారంగా ఈ గణాంకాలను మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ రూపొందించింది. శ్రీమంతుల సగటు సంపద రూ.3.6 కోట్లే విశ్రాంత జీవనానికి నెలకు రూ.93,000 స్టాండర్డ్ చార్టర్డ్ నివేదిక న్యూఢిల్లీ: దేశంలో సంపన్నుల సగటు ఐశ్వర్యం రూ.3.6 కోట్లేనని, విశ్రాంత జీవన కాలంలో ప్రతి నెలా వెచ్చించేందుకు వారికి రూ.93,000 మాత్రమే ఉంటున్నదని స్టాండర్డ్ చార్టర్డ్ ‘సంపద అంచనా నివేదిక 2019’ తెలియజేసింది. ఇందులో వర్ధమాన సంపన్నుల వద్ద సగటున రూ.1.3 కోట్లు, సంపన్నుల వద్ద రూ.2.6 కోట్లు, అధిక సంపన్నుల(హెచ్ఎన్డబ్ల్యూఐ) వద్ద రూ.6.9 కోట్ల మేర వారి రిటైర్మెంట్ నాటికి ఉంటుందని అంచనా వేసింది. ఈ లెక్కన ఒక్కో సంపన్నుని వద్ద రిటైర్మెంట్ సమయంలో ప్రతీ నెలా వ్యయం చేసేందుకు రూ.93,000 ఉంటుందని పేర్కొంది. ఈ నిధిని వారి కోరిక మేరకు సగటున నెలవారీగా వ్యయం చేస్తూ వెళితే మాత్రం వర్ధమాన సంపన్నులకు ఆరేళ్ల పాటు, సంపన్నులకు తొమ్మిదేళ్లు, హెచ్ఎన్డబ్ల్యూఐలకు ఐదేళ్ల పాటే సరిపోతుందని నివేదిక తెలిపింది. జీడీపీ వృద్ధి, వడ్డీ రేట్లు తదితర అంశాలతో ఎంత సంపదను సమకూర్చుకోగలరు? రిటైర్మెంట్ సమయంలో ప్రతినెలా ఎంత మొత్తంతో వారు జీవించగలరు? అనే గణాంకాలను ఈ సంస్థ రూపొందించింది. -
రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్
రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ ‘వెల్త్ క్రియేషన్’ పేరుతో రిటైర్మెంట్ ఫండ్‌ను ప్రవేశపెట్టిం ది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు కలిగిన రిటైర్మెంట్ ఫండ్ ఇది. ఈ ఫండ్ ద్వారా సేకరించిన మొత్తంలో అత్యధిక శాతం డెట్ పథకాలతో పాటు మరికొంత ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తారు. జూన్ 22న ప్రారంభమయ్యే ఈ పథకం న్యూ ఫండ్ ఆఫర్ ఫిబ్రవరి 22తో ముగుస్తుంది. కనీస ఇన్వెస్ట్మెంట్ మొత్తం రూ. 5,000. 60 ఏళ్ల లోపు ఈ పథకం నుంచి వైదొలిగితే 1% ఎగ్జిట్ లోడ్ ఉంటుంది.