రూ.28 లక్షల కోట్లకు చేరిన మస్క్ సంపద
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో టెస్లా అధినేత ఇలాన్ మస్క్‌కు సిరుల పంట పండుతోంది. ట్రంప్ విజయం తర్వాత టెస్లా స్టాక్ ఏకంగా 40 శాతం పెరిగింది. దాంతో మస్క్ సంపద ఏకంగా 70 బిలియన్ డాలర్లు(రూ.5.8 లక్షల కోట్లు) పెరిగి నికరంగా సుమారు 340 బిలియన్ అమెరికన్ డాలర్ల(రూ.28 లక్షల కోట్లు) మార్కును దాటినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది.
యూఎస్ ఎన్నికల నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్‌నకు మస్క్ మద్దతిచ్చారు. దాంతోపాటు ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ పార్టీకి మస్క్ భారీగానే విరాళాలు అందించారని కొన్ని సంస్థలు వెల్లడించాయి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇలాన్ మస్క్‌కు సముచిత స్థానాన్ని కల్పిస్తానని చెప్పారు. ఇటీవల ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించాక అనుకున్న విధంగానే ట్రంప్ కార్యవర్గంలో మస్క్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) సంయుక్త సారథులుగా మస్క్, వివేక్ రామస్వామిలను నియమించారు.
ఇదీ చదవండి: ‘ఆరోగ్య నిధి’ ప్రాధాన్యం తెలుసా?
డొనాల్డ్ ట్రంప్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండబట్టే మస్క్ సంపద అధికమవుతున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ట్రంప్ భవిష్యత్తులో తీసుకోబోయే కార్పొరేట్ నిర్ణయాల వల్ల మాస్క్‌కు లాభం చేకూరుతుందని, దాంతో కంపెనీకి మేలు కలుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా మస్క్ కంపెనీల్లో భారీగా పెట్టుబడి పెడుతున్నారు. దాంతో ఆయన సంపద పెరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment