
భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన ముగిసిన తర్వాత టెస్లా ఇండియాలో ప్రవేశించేందుకు లైన్ క్లియర్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే భారత్‌లో తన కార్యకలాపాలు సాగించేందుకు టెస్లా చర్యలకు పూనుకుంది. ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) నిర్ణయం ‘చాలా అన్యాయం’ అని తెలిపారు. మస్క్ సమక్షంలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
భారీగా టారిఫ్‌లు
ప్రతి దేశం అమెరికా వస్తువులపై భారీగా దిగుమతి సుంకాలను విధిస్తూ యూఎస్‌ను బాగా ఉపయోగించుకుంటోందని తెలిపారు. భారత్ అందుకు మంచి ఉదాహరణ అని అన్నారు. ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకం 100 శాతంగా ఉందని, దేశంలో కార్లను విక్రయించడం టెస్లాకు దాదాపు అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. మస్క్ భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. కానీ, అమెరికా పరంగా అది చాలా అన్యాయమన్నారు. భారత్‌లోని సుంకాలను ఉద్దేశించి సమన్యాయం, న్యాయమైన వాణిజ్య పద్ధతుల ఆవశ్యకతను ట్రంప్ నొక్కిచెప్పారు.
ఇదీ చదవండి: యాక్టివ్‌గా ఉన్న కంపెనీలు 65 శాతమే
సుంకాలు తగ్గింపు
మోదీ అమెరికా పర్యటన సందర్భంగా మస్క్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన సమావేశం అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సుంకాలపై విమర్శలు ఉన్నప్పటికీ భారతదేశం ఇటీవల హైఎండ్ కార్లపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 110 శాతం నుంచి 70 శాతానికి తగ్గించింది. ఇది భారత మార్కెట్లోకి టెస్లా ప్రవేశానికి మార్గం సుగమం చేస్తుంది. టెస్లా ఇప్పటికే న్యూఢిల్లీ, ముంబైల్లో షోరూమ్‌ల కోసం స్థలాలను గుర్తించినట్లు ప్రకటించింది. భారతదేశంలో పని చేసేందుకు మిడ్ లెవల్ పొజిషన్‌లను భర్తీ చేసేందుకు ప్రకటన జారీ చేసింది. అధిక టారిఫ్‌లు ఉన్నప్పటికీ భారత మార్కెట్‌లో టెస్లా తన ఉనికిని చాటేందుకు చర్యలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment