మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లతో అనారోగ్యాలు పెరుగుతున్నాయి. దాంతో వైద్య ఖర్చులు అధికమవుతున్నాయి. అందుకు అనుగుణంగా ఆరోగ్య బీమా తీసుకోవాలి. అయితే కొన్ని సందర్భాల్లో వైద్య ఖర్చులకు బీమా మొత్తం సరిపోకపోవచ్చు. కాబట్టి కొంత ‘ఆరోగ్య నిధి’ని సైతం ప్రత్యేకంగా సమకూర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఏదైనా అనారోగ్య పరిస్థితుల్లో ఆరోగ్య బీమా సరిపోనట్లయితే అత్యవసర నిధిని ఉపయోగించాల్సి రావొచ్చు. దాంతోపాటు అప్పు కూడా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. అలాంటి సందర్భాల్లో ఆర్థికంగా ఆదుకునేందుకు ఆరోగ్య నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అప్పటివరకు చేసిన పొదుపు, పెట్టుబడులు కరిగిపోకుండా ఇది రక్షిస్తుంది. క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ప్రత్యేక అనారోగ్య పరిస్థితులున్నవారు ఈ నిధిని తప్పకుండా సిద్ధం చేసుకోవాలి.
ఈ నిధి ఎందుకంటే..
ఆరోగ్య బీమా పాలసీలో కేవలం వైద్యానికి అవసరమయ్యే ఖర్చులు మాత్రమే అందిస్తారు. కానీ వైద్యేతర ఖర్చులు పాలసీదారులే భరించాలి. ఒకేవేళ పాలసీ తీసుకునే సందర్భంలో కో-పే(కొంత పాలసీ కంపెనీ, ఇంకొంత పాలసీదారు చెల్లించే విధానం) ఎంచుకుంటే మాత్రం వైద్య ఖర్చుల్లో కొంత పాలసీదారు చెల్లించాల్సి ఉంటుంది. వైద్యం పూర్తవ్వకముందు, వైద్య పూర్తయిన తర్వాత అయ్యే ఖర్చులను పాలసీదారులే భరించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నిధిని ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
చిన్నపాటి ఖర్చుల కోసం..
అత్యవసర పరిస్థితులకు ఆరోగ్య బీమా సరిపోతుంది. అయినప్పటికీ కొద్ది మొత్తంలో వైద్య నిధిని ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. ఉదాహరణకు రూ.15వేల లోపు వైద్య బిల్లులు అయితే దానికోసం ఆరోగ్య బీమాను వినియోగించకపోవడమే మేలు. ఒకవేళ క్లెయిమ్ చేస్తే పాలసీ రిన్యువల్ సమయంలో వచ్చే అదనపు బోనస్ ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉంది. అలాగని అప్పుచేసి ఆ ఖర్చులు భరించాలని కాదు. అందుకే ఇలాంటి ఖర్చుల కోసం సొంతంగా ఆరోగ్య నిధిని ఏర్పాటు చేసుకోవాలి.
ఇదీ చదవండి: ఒళ్లో వేసుకుంటే ఫోన్ ఛార్జింగ్!
ఎంత ఉండాలంటే..
ఈ నిధి ఎంత మొత్తం అవసరం అనేదానికి కచ్చితమైన అంచనాలేం లేవు. మీ జీవినశైలి, మీరున్న ప్రాంతంలో ఖర్చులు, నెలవారీ మిగులుపై ఇది ఆధారపడి ఉంటుంది. ఆసుపత్రిలో చేరితే అయ్యే ఖర్చులు సొంతంగా భరించాలి. కాబట్టి అందుకు అనుగుణంగా ఈ నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితి వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి, ఈ నిధిని సొంతంగా నిర్ణయించుకోవాలి. ఆరోగ్య బీమా పాలసీలో కో-పే లేకపోతే రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు అత్యవసర ఆరోగ్య నిధి ఉంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment