ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందంటే ఛార్జర్ కోసం వెతకాల్సిన పనిలేదు. అదేంటి ఛార్జర్ లేకుండా ఫోన్ ఎలా ఛార్జ్ అవుతుందనేగా మీ అనుమానం.. సింపుల్.. ఫోన్‌ను మీ ఒళ్లో పెట్టుకోండి. వెంటనే ఛార్జింగ్ అవుతుంది. అవునండి.. మీరు విన్నది నిజమే. ఇదో కొత్తరకం టెక్నాలజీ. థెర్మో ఎలక్ట్రిక్ టెక్స్‌టైల్స్ అనే టెక్నాలజీతో ఇది సాధ్యమేనని శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఈమేరకు స్వీడన్‌లోని ఛామర్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని నిరూపించారు.
థెర్మో ఎలక్ట్రిక్ టెక్స్‌టైల్స్ సాంకేతిక ద్వారా మనం ధరించే దుస్తుల్లోని సిల్క్ దారాలను ఉపయోగించి విద్యుత్తును తయారు చేస్తున్నారు. ఆ సిల్క్ దారాలకు కండక్టివ్ ప్లాస్టిక్ అనే లోహాన్ని పూయడం ద్వారా బ్యాటరీ లేకుండానే విద్యుత్తుని ఉత్పత్తి చేయొచ్చని నిరూపించారు. ఈ టెక్నాలజీ ద్వారా బయటి వాతావరణం, శరీర ఉష్ణోగ్రత వ్యత్యాసాల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ టెక్నాలజీను విభిన్న పరిస్థితుల్లో పరీక్షించి, మరింత మెరుగ్గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఉపయోగాలెన్నో..
సంప్రదాయ బ్యాటరీలు లేకుండా చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాటరీ అవసరంలేని సెన్సార్ల వంటి వాటికి ఈ సాంకేతికతతో విద్యుత్‌ను సరఫరా చేయవచ్చని చెబుతున్నారు. కొన్ని సంస్థలు వినియోగదారుల హృదయ స్పందనలను ట్రాక్ చేయడానికి, ఆరోగ్య కొలమానాలను పర్యవేక్షించడానికి టెక్స్‌టైల్ సెన్సార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. వాటికి ఈ థెర్మో ఎలక్ట్రిక్ టెక్స్‌టైల్స్ ద్వారా ఎనర్జీని అందించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఆర్మీ ఉద్యోగులకూ, విద్యుత్ సదుపాయం లేని ప్రాంతాల్లో ఉండేవారికీ ఉపయోగపడేలా ఈ దుస్తుల్ని రూపొందిస్తున్నారు.
ఇదీ చదవండి: క్షీణిస్తున్న ఫారెక్స్ నిల్వలు.. కారణాలు
ఏ ప్రమాదం లేదు..
అసలే కరెంటుతో వ్యవహారం.. అలాంటిది మనం ఎలక్ట్రిక్ టెక్స్‌టైల్స్ ధరించొచ్చా అనే సందేహం అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటితో మానవులకు ఎలాంటి హాని ఉండదంటున్నారు. ఈ ప్రక్రియతో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సైతం తగ్గించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment