భారత విదేశీ మారక నిల్వలు(ఫారెక్స్ రిజర్వ్‌లు) భారీగా క్షీణిస్తున్నాయి. నవంబరు 15తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 17.76 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.44 లక్షల కోట్లు) తగ్గి 657.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.55.31 లక్షల కోట్ల)కు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పేర్కొంది. అంతకుముందు ఇవి 6.477 బిలియన్ డాలర్లు క్షీణించి 675.6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అందుకు అంతర్జాతీయంగా కొన్ని కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.
యూఎస్ డాలర్ పెరుగుదల: అమెరికా ఎన్నికల ప్రచార సమయం వరకు స్థిరంగా కదలాడిన డాలర్, ఫలితాల తర్వాత ఊపందుకుంది. దాంతో రూపాయి విలువ పడిపోయింది. ఫలితంగా దేశీయ పారెక్స్ నిల్వలు తగ్గిపోతున్నాయి.
పెరుగుతున్న దిగుమతులు: దేశీయ దిగుమతులు అధికమవుతున్నాయి. విదేశీ వస్తువులను దిగుమతి చేసుకునేందుకు ఆయా ఉత్పత్తులకు డాలర్లలోనే చెల్లించాలి.
ఆర్‌బీఐ: మార్కెట్ ఒత్తిళ్ల మధ్య రూపాయికి మద్దతుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వద్ద ఉన్న ఫారెక్స్ నిల్వలను విక్రయిస్తోంది. రూపాయి మరింత పడిపోకుండా చర్యలు తీసుకుంటోంది. డాలర్-రూపీ మార్కెట్ అస్థిరతను తగ్గించడానికి ఇది దోహదపడుతోంది.
ఇదీ చదవండి: అదానీ కంపెనీల రేటింగ్ తగ్గింపు
విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) అమ్మకాలు: విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్స్, బాండ్లను విక్రయించడంతో స్థానిక ఈక్విటీ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. నవంబర్‌లో ఇప్పటి వరకు దాదాపు 4 బిలియన్ డాలర్ల(రూ.33 వేలకోట్లు)కు పైగా అమ్మకాలు చేపట్టారు.
ఫెడరల్ రిజర్వ్ విధానాలు: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ఇటీవల కాలంలో కీలక వడ్డీరేట్లను 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దాంతో భారత ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన విదేశీ పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలను ఉపసంహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment